బయోఎథిక్స్ మరియు రక్తరహిత సర్జరీ
వైద్య రంగంలో ఇటీవలి సంవత్సరాల్లో అత్యంత పురోభివృద్ధి సాధించడం జరిగింది. అయితే, వైద్య సమస్యలను పరిష్కరించడంలో కొన్ని పురోభివృద్ధులు నైతిక సమస్యలను సృష్టించాయి.
ఇలాంటి సంధిగ్ధావస్థలను గురించి వైద్యులు ఆలోచించాల్సి ఉంటుంది: రోగి ఘనంగా మరణించేందుకు బలవంతంగా ఇవ్వబడే వైద్య చికిత్సను కొన్నిసార్లు నిరాకరించాలా? రోగి తీసుకున్న నిర్ణయం ఆ రోగికి మంచిది కాదని ఒక వైద్యుడు భావిస్తే, అతడు దాన్ని మీరవచ్చా? ఖరీదైన చికిత్స అందరికీ అందుబాటులో లేనప్పుడు, ఆరోగ్య సంరక్షణను ఎలా సరిగ్గా పంపిణీ చేయవచ్చు?
అలాంటి సంక్లిష్టమైన వివాదాలు, బయోఎథిక్స్ అని పిలువబడే వైద్య ప్రక్రియను ముందుకు తెచ్చింది. ఈ ప్రక్రియ, జీవశాస్త్ర పరిశోధన మరియు వైద్య పురోభివృద్ధి యొక్క నైతిక అన్వయింపులతో వ్యవహరించేందుకు వైద్యులకు మరియు వైజ్ఞానికులకు సహాయం చేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉంది. సంక్లిష్టమైన నిర్ణయాలెన్నో ఆసుపత్రిలో తలెత్తుతాయి గనుక, అనేక ఆసుపత్రులు బయోఎథికల్ కమిటీలను స్థాపించాయి. వైద్యులు మరియు న్యాయవాదులు కూడా ఉండే ఈ కమిటీల సభ్యులు, వైద్య రంగంలోని నైతిక సమస్యలను విశ్లేషించే సభలైన బయోఎథిక్స్‌పై జరిగే సెమినార్‌లకు సాధారణంగా హాజరౌతుంటారు.
అలాంటి సెమినార్‌లలో తరచూ రేకెత్తబడిన కొన్ని ప్రశ్నలేవంటే: ప్రాముఖ్యంగా మత కారణాల వలన రక్తాన్ని ఎక్కించుకునేందుకు నిరాకరించే యెహోవాసాక్షుల నమ్మకాలను వైద్యులు ఎంత మేరకు గౌరవించాలి? వైద్య పరంగా “ఆచరణయోగ్యం” అని అనిపిస్తే ఒక వైద్యుడు రోగి ఇష్టానికి విరుద్ధంగా రక్తాన్ని ఎక్కించవచ్చా? ‘ఆ విషయం రోగికి తెలియకపోతే అది అతనికి ఏ హాని కలిగించదులే’ అన్నట్లు, రోగికి తెలియకుండా అలా చేయడం నైతికంగా సరియైనదేనా?
అలాంటి వివాదాలతో సరైన రీతిలో వ్యవహరించేందుకు, సాక్షుల దృక్పథాన్ని గురించి వైద్యులు నిష్పక్షపాతమైన అవగాహనను కలిగివుండటం అవసరం. పరస్పర అవగాహన ఎదురుదాడులు చేసుకోకుండా నివారించేందుకు వీలు కలిగిస్తుందని గుర్తెరిగిన వారై యెహోవాసాక్షులు తమ వైపునుండి తమ స్థానాన్ని గూర్చి వైద్యులకు వివరించేందుకు ఎంతో ఆతృతను కలిగి ఉన్నారు.
అభిప్రాయాలను పరస్పరం తెలుసుకోవడం
బయోఎథిక్స్ అంశంలో పండితుడైన ఒక స్పానిష్ ప్రముఖుడైన ప్రొఫెసర్ డ్యేగో గ్రాస్యా, తన తరగతిలోని విద్యార్థులు అలాంటి చర్చలో పాల్గొనాలని ఇష్టపడ్డాడు. “రక్తాన్ని ఎక్కించుకునే విషయంలో మీరు [యెహోవాసాక్షులు] కలిగివున్న సమస్యల దృష్ట్యా . . . మీ చింతలను వ్యక్తపర్చేందుకు మీకో అవకాశాన్ని ఇవ్వాలన్నదే సమంజసమైన విషయం” అని ఆ ప్రొఫెసర్ చెప్పాడు.
అందుకని, 1996 జూన్ 5న, యెహోవాసాక్షుల ముగ్గురు ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వివరించేందుకు స్పెయిన్‌నందలి మాడ్రిడ్‌లోని కంప్లుటెన్సే విశ్వవిద్యాలయానికి ఆహ్వానించబడ్డారు. దాదాపు 40 మంది వైద్యులు మరియు ఇతర ప్రొఫెషనల్‌లు అక్కడ సమావేశమయ్యారు.
సాక్షులు క్లుప్తమైన వివరణ ఇచ్చిన తర్వాత, సభలోని వారు సాక్షులను ప్రశ్నలు అడిగేందుకు ఆహ్వానించబడ్డారు. వయోజనుడైన ఒక రోగి, ఫలానా చికిత్సను నిరాకరించే హక్కును కలిగివుండాలని సభలోని వారందరూ ఏకీభవించారు. రోగి యొక్క అభిజ్ఞాత సమ్మతి లేకుండా రోగికి రక్తాన్ని ఎన్నడూ ఎక్కించకూడదని కూడా ఆ తరగతి వారు విశ్వసించారు. అయినప్పటికీ సాక్షుల అభిప్రాయంలోని కొన్ని అంశాలు వారికి ఆందోళనను కలిగించాయి.
డబ్బును గురించినది ఒక ప్రశ్న. కొన్నిసార్లు రక్తరహిత సర్జరీలో, లేజర్ సర్జరీ వంటి ప్రత్యేకమైన పరికరాలు అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించేందుకు ఉపయోగించే ఎరిథ్రోపాయటిన్ వంటి ఖరీదైన మందులు అవసరం కావచ్చు. తక్కువ ఖర్చుగల (హోమోలోగస్ రక్తాన్ని ఉపయోగించి చేసే) వైద్యాన్ని నిరాకరించడం ద్వారా, ప్రజా ఆరోగ్య సేవల వారు తమకు ప్రత్యేక ఏర్పాట్లను అందించాలని సాక్షులు అపేక్షిస్తున్నారా అని ఒక వైద్యుడు అడిగాడు.
డబ్బు అనేది వైద్యులు తప్పని సరిగా పరిగణనలోనికి తీసుకోవలసిన ఒక అంశమేననే విషయాన్ని గుర్తిస్తూ, ఒక సాక్షి ప్రతినిధి హోమోలోగస్ రక్తాన్ని ఎక్కించుకోవడంలో ఇమిడివున్న గుప్త వ్యయాలను విశ్లేషించిన ప్రచురిత అధ్యయనాలను సూచించాడు. రక్తాన్ని ఎక్కించుకోవడానికి సంబంధించిన చిక్కులకు చికిత్స చేయడానికి అవసరమయ్యే ఖర్చులు అలాగే అలాంటి చిక్కుల మూలంగా కోల్పోయే ఆదాయం ఇందులో ఇమిడివుంది. రక్తం యొక్క సగటు యూనిట్ వెల మొదట్లో 250 డాలర్లు మాత్రమే అయినా, అసలు ధరకు దాదాపు ఐదంతల ఖర్చును కలిగిస్తూ 1,300 డాలర్ల వ్యయాన్ని చేసిన అమెరికాలోని ఒక విపులమైన అధ్యయనాన్ని ఆయన సూచించాడు. కాబట్టి, అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు, రక్తరహిత సర్జరీ తక్కువ ఖర్చుతో కూడినదని ఆయన సూచించాడు. అంతేకాకుండా, రక్తరహిత సర్జరీకి అయ్యే అదనపు ఖర్చు కూడా దానికి ఉపయోగించే పరికరాలే, వాటిని మళ్లీ ఉపయోగించవచ్చు.
అనేకమంది వైద్యుల మనస్సుల్లో ఉన్న మరో ప్రశ్న గుంపు ఒత్తిడికి సంబంధించినది. ఒక సాక్షి తొట్రుపాటు చెంది రక్తాన్ని ఎక్కించుకునేందుకు అంగీకరిస్తే, అప్పుడేమి సంభవిస్తుందని వారు ఆశ్చర్యంతో అడిగారు. అతను సాక్షి సమూహం చేత వెలివేయబడతాడా?
ప్రతిస్పందన వాస్తవమైన పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే దేవుని చట్టానికి అవిధేయత చూపడం నిజంగానే గంభీరమైన విషయం, అది సంఘ పెద్దలు పరిశీలించవలసిన విషయమైవుంది. జీవితానికి ముప్పు కలిగించే సర్జరీ అనే భీతి కలిగించే అనుభవానికి గురై అలా రక్తాన్ని ఎక్కించుకునేందుకు అంగీకరించిన ఏ వ్యక్తికైనా సహాయం చేయాలని సాక్షులు కోరుకుంటారు. అలాంటి సాక్షి ఎంతో దుఃఖపడుతుంటాడని మరియు దేవునితో తనకుగల సంబంధాన్ని గురించి చింతిస్తుంటాడనే విషయంలో ఎలాంటి సందేహంలేదు. అలాంటి వ్యక్తికి సహాయం మరియు అవగాహన అవసరం కావచ్చు. క్రైస్తవత్వానికి ఆధారం ప్రేమే గనుక, అన్ని న్యాయనిర్ణయ కేసుల్లో వలెనే ఈ విషయంలో కూడా పెద్దలు కట్టుదిట్టాన్ని మరియు దయను కలగలిపి తీర్పు ఇవ్వాలని కోరుకుంటారు.—మత్తయి 9:12, 13; యోహాను 7:24.
అమెరికా నుండి వచ్చిన, బయోఎథిక్స్‌లో ప్రొఫెసర్ అయిన ఒక వ్యక్తి ఇలా అడిగాడు, “నైతికతలను గురించిన మీ నిర్ణయాలను మీరు త్వరలోనే పునఃపరిశీలించుకోరా? ఇతర మతాలు ఇటీవలి సంవత్సరాల్లో అలా చేశాయి” అని అతను అన్నాడు.
రక్తం యొక్క పవిత్రతను గురించిన సాక్షుల అభిప్రాయం అప్పుడప్పుడూ పునఃపరిశీలించుకోబడే నైతిక దృక్కోణం కాదుకానీ అది ఒక సిద్ధాంతపరమైన నమ్మకమని అతనికి చెప్పబడింది. స్పష్టమైన బైబిలు ఆజ్ఞ రాజీపడేందుకు వీలు కలిగించదు. (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఒక సాక్షి విగ్రహారాధనను లేక వ్యభిచారాన్ని సమర్థించడం ఎంత అనంగీకారయోగ్యమో, అలాంటి దైవిక సూత్రాన్ని ఉల్లంఘించడం కూడా అంతే.
మాడ్రిడ్‌లోని బయోఎథిక్స్ సెమినార్‌కి హాజరైన వారు గౌరవించినట్లుగానే తమ బైబిలు ఆధారిత నమ్మకాలకు అనురూపమైన ప్రత్యామ్నాయ చికిత్సను కోరుకునే తమ నిర్ణయాన్ని గౌరవించేందుకు వైద్యులు సుముఖతను చూపించడాన్ని యెహోవాసాక్షులు ఎంతగానో మెచ్చుకుంటారు. వైద్యునికి మరియు రోగికి మధ్యగల సంబంధాన్ని మెరుగుపర్చేందుకు మరియు రోగి కోరికల ఎడల మరింత గౌరవాన్ని పెంపొందించేందుకు బయోఎథిక్స్ ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాము “అసంపూర్ణ పరికరాలతో మరియు తప్పులు చేయగల వస్తువులతో పని చేస్తున్నామని వైద్యులు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఒక ప్రఖ్యాత స్పానిష్ వైద్యుడు అన్నాడని చెప్పబడుతుంది. కాబట్టి “జ్ఞానం చేరుకోలేని చోటికి ప్రేమ ఎల్లప్పుడూ విస్తరించాలనే నమ్మకాన్ని” వారు కలిగి ఉండవలసిన అవసరం ఉంది.”