కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/15 పేజీలు 13-18
  • “మానవకోటికి ఇదియే విధి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మానవకోటికి ఇదియే విధి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జీవిత ప్రాథమిక చింతలను అధిగమించడం
  • కుటుంబం, కీర్తి, అధికారం
  • మన కేంద్రీకరణ, కర్తవ్యం
  • మీ జీవితం—దాని సంకల్పమేమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మీ జీవితాన్ని అమూల్యమైనదిగా చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ప్రసంగి 3:11—“ఆయన ప్రతీదాన్ని దాని సమయంలో అందంగా చేశాడు”
    బైబిలు వచనాల వివరణ
  • జీవితం ఎలా సార్థకమౌతుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/15 పేజీలు 13-18

“మానవకోటికి ఇదియే విధి”

“[సత్య] దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.

1, 2. దేవుని ఎడలగల మన కర్తవ్యాన్ని గూర్చి మనం పరిశీలించడం ఎందుకు సముచితం?

‘యెహోవా మిమ్మల్ని ఏమడుగుతున్నాడు?’ అని ఓ ప్రాచీనకాల ప్రవక్త ప్రశ్నించాడు. తర్వాత ఆయన యెహోవా కోరుతున్నవాటిని గురించి అంటే న్యాయముగా నడుచుకోవడాన్నీ, కనికరాన్నీ ప్రేమించడాన్నీ, దీనమనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడాన్నీ కోరుతున్నాడని విశదీకరించాడు.—మీకా 6:8.

2 వ్యక్తిత్వవాదమూ, స్వేచ్ఛావాదమూ ప్రబలివున్న ఈ రోజుల్లో దేవుడు తమనుండి దేనినో కోరుతున్నాడనే అభిప్రాయం అనేకులకు నచ్చదు. వాళ్లు కర్తవ్యబద్ధులై ఉండాలని కోరుకోరు. అయితే ప్రసంగి పుస్తకంలో సొలొమోను ఏ నిర్ధారణకు చేరుకున్నాడు? “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; [సత్య] దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.

3. ప్రసంగి పుస్తకం విషయంలో మనమెందుకు గంభీరంగా ఆలోచించాలి?

3 జీవితంలో మన పరిస్థితులు ఏవైనా, దాని గురించి మన దృక్పథం ఏదైనా మనమా నిర్ధారణను గూర్చిన వెనుక చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే మనమెంతగానో ప్రయోజనం పొందగలం. ఈ ప్రేరేపిత పుస్తక గ్రంథకర్తయైన సొలొమోను రాజు, మన అనుదిన జీవితంలో భాగమైన కొన్ని విషయాల్ని పరిశీలించాడు. ఆయన విశ్లేషణ పూర్తిగా ప్రతికూలమైనదనే నిర్ధారణకు కొందరు తొందరపాటుకొద్దీ రావొచ్చు. కాని అది దైవికంగా ప్రేరేపించబడింది, మన కార్యకలాపాల్ని ప్రాధాన్యతల్ని మూల్య నిర్ధారణ చేసుకొనేందుకు మనకు సహాయపడగలదు, తత్ఫలితంగా ఆనందం పెరుగుతుంది.

జీవిత ప్రాథమిక చింతలను అధిగమించడం

4. ప్రసంగి పుస్తకంలో సొలొమోను దేనిని గురించి పరిశీలించి చర్చించాడు?

4 సొలొమోను ‘మానవజాతి ప్రయాసాన్ని’ గూర్చి నిశితంగా పరిశీలించాడు. “ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని.” “ప్రయాసము” అని సొలొమోను తెలియజేసిన దాని భావం, ఒక ఉద్యోగమో లేక పనో అనే భావాన్నే ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు కాని అది తమ జీవితములయందంతటా స్త్రీ పురుషులు నిమగ్నమైపోయిన వాటిని గూర్చిన యావత్‌ పరిధియైవుంది. (ప్రసంగి 1:13) కొన్ని ప్రాథమిక చింతల్నీ లేక కార్యకలాపాల్నీ పరిశీలిద్దాం, తర్వాత వాటిని మన స్వంత క్రియాశీలక విషయాలతోనూ ప్రాధాన్యతలతోనూ పోల్చి చూద్దాం.

5. మానవుల ముఖ్యమైన ప్రయాసల్లో ఒకటి ఏమిటి?

5 అనేక మానవ వ్యవహారాలకూ కార్యకలాపాలకూ నిశ్చయంగా కేంద్రస్థానం ధనమే. కొంతమంది ఐశ్వర్యవంతులు ధనం విషయంలో కల్గివున్న ఉదాసీన దృక్పథాన్ని సొలొమోను కల్గివున్నాడని ఎవ్వరూ అనలేరు. ఆయన కొంత ధనం అవసరమని వెంటనే గుర్తించాడు; నిరాడంబరంగా జీవించడం కన్నా లేక దారిద్ర్యాన్ని అనుభవించడంకన్నా తగినంత ఆర్థిక స్తోమత్తును కల్గివుండడం శ్రేష్ఠమని ఆయన గుర్తించాడు. (ప్రసంగి 7:11, 12) కాని నిరుపేదలకు ఐశ్వర్యవంతులకు—ధనం, అది తెచ్చే ఆస్తులు—జీవితంలో ప్రధానమైన గమ్యం కాగలవని మీరు బహుశా గమనించే ఉంటారు.

6. యేసు ఉపమానాల్లో ఒకదానినుండీ, సొలొమోను స్వంత అనుభవాన్నుండీ ధనాన్ని గురించి మనం ఏమి నేర్చుకొనగలం?

6 ఎన్నడూ సంతృప్తిచెందక మరింత సంపాదించేందుకు కష్టపడిన ఐశ్వర్యవంతుని గూర్చిన యేసు ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహేతుకమైన వ్యక్తికాదని దేవుడు అతన్ని తీర్పుతీర్చాడు. ఎందుకు? ఎందుకంటే ‘మనం ఆర్జించినవి మన జీవానికి మూలంకావు.’ (లూకా 12:15-21) సొలొమోను అనుభవం—బహుశా మనకన్నా ఎంతో విస్తారమైనదైన ఆయన అనుభవం—యేసు మాటల్ని రూఢిపరుస్తోంది. ప్రసంగి 2:4-9 వచనాల్లోని వివరణను చదవండి. సొలొమోను ఐశ్వర్యార్జనకై కొంతకాలాన్ని వెచ్చించాడు. ఆయన అందమైన గృహాల్నీ, సుందరమైన వనాల్నీ నిర్మించాడు. ఆయన అందమైన స్త్రీలను సహచారిణులుగా కల్గివుండి పోషించగలిగాడు. ఐశ్వర్యం మరి ఆయన చేయగలిగేలా చేసిన ప్రతీదీ, మిక్కుటమైన సంతృప్తిని సాధించాననే నిజమైన భావాన్నీ తన జీవితంలో అర్థాన్నీ తీసుకొచ్చాయా? ఆయన నిర్మొహమాటంగా ఇలా జవాబిస్తున్నాడు: “అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యునిక్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.”—ప్రసంగి 2:11; 4:8.

7. (ఎ) ధనం విలువను గురించి అనుభవం ఏమని రుజువు చేస్తోంది? (బి) సొలొమోను చేసిన నిర్ధారణ రుజువు చేసే వేటిని మీరు వ్యక్తిగతంగా చూశారు?

7 అది వాస్తవం, అనేకమంది జీవితాల్లో వెల్లడైన సత్యం. ధనాన్ని అధికంగా కల్గివుండడం సమస్యలన్నింటికీ పరిష్కారంకాదని మనం అంగీకరించాలి. సులభంగా ఆహారాన్నీ వస్త్రాల్నీ పొందేలా సాధ్యంచేయడం వంటి కొన్ని సమస్యల్ని అది పరిష్కరించగలదు. కాని ఓ వ్యక్తి ఒకసారి ఒకజత బట్టల్ని మాత్రమే ధరించగలడు, తగినంత ఆహారాన్నీ పానీయాన్నీ మాత్రమే తీసుకోగలడు. విడాకులూ, మద్యపానం, లేక మాదకద్రవ్యాల దుర్వినియోగమూ, కుటుంబ అంతఃకలహాలూ వంటి వాటితో పీడించబడుతున్న ధనవంతులను గూర్చి మీరు చదివేవుంటారు. కోటీశ్వరుడైన జె. పి. జెట్టీ ఇలా తెలియజేశాడు: “ధనానికీ సంతోషానికీ సంబంధం ఏమీ ఉండాల్సిన అవసరంలేదు. సంబంధమంటూ ఉంటే దానికి అసంతోషంతోనే ఉంటుంది.” ద్రవ్యాన్ని అపేక్షించడం నిరర్థకమని సకారణంగానే సొలొమోను వర్గీకరించాడు. ఆ వాస్తవాన్ని సొలొమోను గమనించిన దానితో పోల్చిచూడండి: “కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృద్ధిచేత నిద్రపట్టదు.”—ప్రసంగి 5:10-12.

8. ధన ప్రాముఖ్యతను అతిగా అంచనా వేసుకోకుండా ఉండేందుకు ఏ కారణముంది?

8 భవిష్యత్తుకు సంబంధించినంతవరకు ధనం, ఆస్తులు కూడా సంతృప్తి పొందామనే భావనను తీసుకురావు. మీరు అధికంగా ధనాన్నీ, ఆస్తుల్నీ కల్గివుంటే, వాటిని కాపాడుకోవడాన్ని గూర్చిన అధిక చింతను బహుశా మీరు కల్గివుండేవారు, అప్పటికీ రేపు ఏమి జరుగుతుందో మీరెరుగరు. మీరు మీ ప్రాణంతోపాటు సమస్తాన్ని కోల్పోతారా? (ప్రసంగి 5:13-17; 9:11, 12) ఇవి నిజమైన సంతృప్తినితేవు గనుక ధనం, ఆస్తులు తీసుకువచ్చే దానికన్నా ఎంతో మిన్నయైన శాశ్వతమైన అర్థాన్ని మన జీవితం లేక ప్రయాస కల్గివుండాలని గ్రహించడం అంత కష్టమైన విషయమేమీ కాదు.

కుటుంబం, కీర్తి, అధికారం

9. సొలొమోను పరిశీలనలోనికి కుటుంబ జీవితం సరియైన రీతిగానే ఎందుకు చేర్చబడింది?

9 సొలొమోను చేసిన జీవిత విశ్లేషణలో, కుటుంబ వ్యవహారాల్లోనే మునిగిపోవడం కూడా చేరివుంది. కుటుంబ జీవితాన్ని బైబిలు ఉన్నతపరుస్తోంది, దీనితోపాటు పిల్లల్ని కని పెంచే ఆనందాన్ని కూడా ఉన్నతపరుస్తోంది. (ఆదికాండము 2:22-24; కీర్తన 127:3-5; సామెతలు 5:15, 18-20; 6:20; మార్కు 10:6-9; ఎఫెసీయులు 5:22-33) అయితే అదే జీవితపు చిట్టచివరి దృక్కోణమా? కొన్ని సంస్కృతుల్లో వివాహానికీ పిల్లలకూ కుటుంబ బాంధవ్యాలకూ ఇవ్వబడిన ప్రాముఖ్యతనుబట్టి అనేకమంది అదేవిధంగా భావిస్తున్నట్టు అన్పిస్తుంది. కాని వందమంది పిల్లల్ని కల్గివుండడం కూడా జీవితంలో సంతృప్తికి కీలకం కాదని ప్రసంగి 6:3 తెలియజేస్తోంది. తమ పిల్లలకు జీవితంలో ఓ మంచి ఆరంభాన్ని ఇవ్వడానికీ, వాళ్ల జీవితం సుఖంగా ఉండేలా చేయడానికీ, పిల్లలకోసం ఎంతమంది తల్లిదండ్రులు త్యాగాల్నిచేశారో ఊహించండి. తల్లిదండ్రులు చేసే త్యాగం ప్రశస్తమైనదే అయినా, తమ జాతి ఉనికిలో ఉండేందుకు జంతువులు పిల్లల్ని కన్నట్టు, పిల్లల్ని కనడమే జీవితంలో ప్రధానమైన ఉద్దేశ్యమని మన సృష్టికర్త భావం ఎంతమాత్రం కాదు.

10. కుటుంబ జీవితంపై అతిగా కేంద్రీకరించడం ఎందుకు నిరర్థకమైనదని రుజువుకాగలదు?

10 సొలొమోను కుటుంబ జీవితాన్ని గూర్చిన కొన్ని వాస్తవాల్ని వివేకయుక్తంగా చర్చించాడు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన పిల్లల కోసం, మనుమల కోసం సంపాదించడంలోనే మునిగిపోవచ్చు. కాని వాళ్లు జ్ఞానంగలవారని రుజువు చేసుకుంటారా? లేక వాళ్లకోసం అతడు కష్టపడి సంపాదించిన దాన్ని బుద్ధిహీనంగా వాళ్లు పోగొట్టుకుంటారా? ఈ చివరిదే గనుక జరిగితే, అదెంత ‘వ్యర్థమో మరెంత గొప్ప విపత్తో’ కదా!—ప్రసంగి 2:18-21; 1 రాజులు 12:8; 2 దినవృత్తాంతములు 12:1-4, 9.

11, 12. (ఎ) జీవితంలోని ఏ గమ్యాలపై కొందరు కేంద్రీకరించారు? (బి) ప్రాముఖ్యతకోసం పాకులాడడం, ‘గాలిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం’ అని ఎందుకు చెప్పబడింది?

11 మరో ప్రక్క, ఇతరుల కన్నా మిన్నగా కీర్తిని ఆర్జించాలనే లేక ఇతరులపై అధికారాన్ని సంపాదించాలనే తమ గమ్యాన్ని సాధించేందుకు అనేకులు తమ సాధారణ కుటుంబ జీవితాన్ని అంత ప్రాధాన్యంలేనిదిగా ఎంచారు. పురుషుల్లో ఇది అతి సామాన్యమైన లోపమైవుండవచ్చు. మీ తోటి విద్యార్థుల్లోనూ జతపనివారిలోనూ లేక పొరుగువారిలోనూ మీరు ఇలాంటి ప్రవృత్తినే చూశారా? గుర్తింపు పొందాలనీ, ప్రముఖునిగా ఉండాలనీ లేక ఇతరులపై అధికారాన్ని చెలాయించాలనీ అనేకులు విపరీతంగా పోరాడుతున్నారు. కాని ఇది నిజంగా ఎంత అర్థవంతమైనది?

12 కొద్ది పరిమాణంలోనైనా లేక పెద్ద పరిమాణంలోనైనా సరే కీర్తిని సంపాదించడానికి కొంతమంది ఎంతగా ప్రయాసపడతారో ఆలోచించండి. మనమీ ప్రవృత్తిని పాఠశాలల్లోనూ మన పొరుగువారిలోనూ సమాజంలోని వివిధ వర్గాల్లోనూ చూస్తాం. కళల్లోనూ వినోదంలోనూ రాజకీయాల్లోనూ ప్రఖ్యాతిగాంచాలని అనుకొనేవారిలో కూడా ఇది ఓ ప్రేరణాశక్తియైవుంది. అయినా, ఇలా ప్రయాసపడడం, వ్యర్థమైన ప్రయత్నం కాదా? “గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము” అని సొలొమోను దీనిని సరిగానే పిలిచాడు. (ప్రసంగి 4:4) ఓ యౌవనుడు క్లబ్‌లోగాని, ఓ క్రీడాజట్టులో గాని లేక మ్యూజికల్‌ గ్రూప్‌లోగాని ప్రముఖుడైనప్పటికీ—లేక ఓ పురుషుడుగాని స్త్రీగాని వ్యాపారంలోనో సమాజంలోనో పేరును సంపాదించినప్పటికీ—దానిని గురించి ఎంతమందికి నిజంగా తెలుసు? భూగోళానికి అవతలివైపునున్న (లేక కనీసం అదే దేశానికి చెందిన) ప్రజలలో అనేకమందికి ఆ వ్యక్తి ఉనికిలో ఉన్నాడని తెలుసా? లేక అతనికో ఆమెకో ఉన్న కొద్దిపాటి కీర్తిని గూర్చి బొత్తిగా పట్టించుకోకుండా వాళ్లు జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారా? ఉద్యోగంలోనో పట్టణంలోనో లేక ఓ వర్గంలోనో ఓ వ్యక్తి సాధించే ఏ అధికారం విషయంలోనైనా లేక ఆధిపత్యం విషయంలోనైనా పరిస్థితి ఇదేనని చెప్పవచ్చు.

13. (ఎ) ప్రముఖులవ్వడానికీ లేక అధికారం కొరకు ప్రయాసపడడం విషయంలోనూ సరియైన దృక్పథాన్ని కల్గివుండేందుకు ప్రసంగి 9:4, 5 వచనాలు మనకు ఏ విధంగా సహాయపడతాయి? (బి) ఈ జీవితానికి ఉన్నదంతా ఇదేయైతే మనం ఏ వాస్తవాల్ని ఎదుర్కోవాలి? (అధఃసూచిని చూడండి.)

13 చివరకు అలాంటి ప్రాముఖ్యత లేక అధికారం ఏమవుతుంది? ఓ తరం గతించి మరో తరం వస్తుండగా, ప్రముఖులూ లేక శక్తిమంతులైన ప్రజలు తెరమరుగైపోయి మరువబడతారు. అనేకమంది రాజకీయ నాయకుల విషయంలోనూ సైనిక నాయకుల విషయంలోనూ నిజమైనట్లుగానే, నిర్మాణ సారథులు, సంగీతవేత్తలు మరితర కళాకారులు, సామాజిక సంస్కర్తలు, మొదలైన వ్యక్తుల విషయంలోనూ అది వాస్తవమైంది. 1700 నుండి 1800 సంవత్సరాల మధ్యకాలంలో జీవించిన ఈ పై వృత్తులకు చెందిన ఎంతమంది వ్యక్తుల్ని గురించి మీకు తెలుసు? సొలొమోను ఈ క్రింది విధంగా చెబుతూ విషయాల్ని సరిగానే మూల్య నిర్ధారణ చేశాడు: “చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది.” (ప్రసంగి 9:4, 5) ఈ జీవితానికి ఉన్నదంతా ఇదేయైతే, ప్రముఖులవ్వడం కొరకూ లేక అధికారం కొరకూ ప్రయాసపడడం నిజంగా వ్యర్థమే.a

మన కేంద్రీకరణ, కర్తవ్యం

14. ప్రసంగి పుస్తకం మనకు వ్యక్తిగతంగా ఎందుకు సహాయపడాలి?

14 మానవులు తమ జీవితాల్ని కేంద్రీకరించే అనేక కార్యకలాపాల్ని గురించీ గమ్యాల్ని గురించీ వినోదాల్ని గురించీ సొలొమోను వ్యాఖ్యానించలేదు. అయినప్పటికీ, ఆయన వ్రాసింది సరిపోతుంది. మనం ఈ పుస్తకాన్ని పరిశీలించడం నిరాశను కల్గించేదిగానూ లేక ప్రతికూలమైనదిగానూ ఉండాల్సిన అవసరమేమీలేదు. ఎందుకంటే యెహోవా దేవుడు మన ప్రయోజనార్థమై ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించిన బైబిలులోని ఓ పుస్తకాన్ని మనం ఉన్నదున్నట్టుగా పునఃసమీక్షించాం. ఇది జీవితంపైనా, మనం కేంద్రీకరించే వాటిపైనా మన దృక్కోణాన్ని సరిచేసుకోవడానికి మనలో ప్రతి ఒక్కరికీ సహాయపడగలదు. (ప్రసంగి 7:2; 2 తిమోతి 3:16, 17) సొలొమోను చేరుకోవడానికి యెహోవా సహాయపడిన ముగింపును చూడడం, ఈ విషయంలో మనకెంతో సహాయకరంగా ఉంటుందని మనం గ్రహించవచ్చు.

15, 16. (ఎ)జీవితాన్ని ఆనందించే విషయంలో సొలొమోను దృక్పథం ఏమిటి? (బి) జీవితాన్ని ఆనందించడానికి సముచితంగా ఏవి అవసరమని సొలొమోను తెలియజేశాడు?

15 సొలొమోను పదేపదే చర్చించిన ఓ విషయమేంటంటే సత్య దేవుని సేవకులు ఆయన ఎదుట తమ కార్యకలాపాల్లో ఆనందాన్ని కనుగొనడమే. “సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.” (ప్రసంగి 2:24; 3:12, 13; 5:18; 8:15) సొలొమోను వేడుకల్ని ప్రోత్సహించడం లేదు; లేక ‘మనం రేపు చచ్చిపోతాం గనుక తిని త్రాగి సంతోషిద్దాం’ అనే దృక్పథాన్ని ఆయన బలపర్చడంలేదు అని గమనించండి. (1 కొరింథీయులు 15:14, 32-34) ‘మన జీవితకాలంలో చేస్తున్న శ్రేష్ఠమైన వాటి’ విషయంలో మనం ఆనందాన్ని కనుగొంటున్నట్లుగానే తినడం, త్రాగడంవంటి సామాన్యమైన సంతోషాల్లోనూ మనం ఆనందాన్ని కనుగొనాలన్నదే ఆయన భావమైవుంది. అది నిజంగా శ్రేష్ఠమైన దానిని నిర్ణయిస్తున్న సృష్టికర్త చిత్తంపై మన జీవితాన్ని నిస్సంశయంగా కేంద్రీకరిస్తోంది.—కీర్తన 25:8; ప్రసంగి 9:1; మార్కు 10:17, 18; రోమీయులు 12:2.

16 సొలొమోను ఇలా వ్రాశాడు: “నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము; ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను.” (ప్రసంగి 9:7-9) అవును, ఏ పురుషుడైనా స్త్రీయైనా యెహోవాకు ఆనందాన్ని తీసుకువచ్చే పనుల్లో చురుకుగా పాల్గొనడమే నిజంగా శ్రేష్టమైన సంతృప్తికరమైన జీవితమవుతుంది. ఆయన్ని ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోమని అది మనల్ని కోరుతోంది. మానవ తర్కాలపై ఆధారపడి జీవితాన్ని గడిపే అనేకమంది ప్రజల దృక్పథానికిది ఎంత వైవిధ్యంగా ఉందో కదా!

17, 18. (ఎ) జీవిత వాస్తవాలకు అనేకమంది ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారు? (బి) ఏ ఫలితాన్ని మనం ఎల్లవేళలా మనస్సులో ఉంచుకోవాలి?

17 కొన్ని మతాలు ఇహలోకానంతర జీవితాన్ని గూర్చి బోధించినా, అనేకమంది ఈ జీవితంపైనే నమ్మకాన్ని ఉంచుతున్నారు. సొలొమోను వర్ణించినట్లుగా వాళ్లు ఇలా ప్రతిస్పందించడాన్ని మీరు చూసే ఉండొచ్చు: “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుటచూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.” (ప్రసంగి 8:11) నీచమైన క్రియల్లో కూరుకుపోని వాళ్లు కూడా తాము ప్రస్తుత జీవితాన్ని గురించే ముఖ్యంగా శ్రద్ధకల్గివున్నామని చూపిస్తారు. ధనం, ఆస్తులు, గౌరవం, ఇతరులపైన కల్గివున్న అధికారం, కుటుంబం లేక అలాంటి ఇతర ఆసక్తులు వాళ్లకు అంత అతిప్రాముఖ్యం అవ్వడానికి అదొక కారణం. అయితే సొలొమోను ఆ అభిప్రాయాన్ని అక్కడితోనే ముగించలేదు. ఆయనింకా ఇలా తెలియజేశాడు: “పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను [సత్య] దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు [సత్య] దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు నీడవంటి దీర్ఘాయువును పొందక పోవుదురనియు నేనెరుగుదును.” (ప్రసంగి 8:12, 13) స్పష్టంగా, మనం ‘సత్యదేవునికి భయపడితే’ అది మనకు క్షేమం కలుగజేస్తుందని సొలొమోను ఒప్పించబడ్డాడు. ఎంత మేరకు? మనమా జవాబును ఆయన చూపించిన వ్యత్యాసంలోనే కనుగొనగలం. యెహోవా ‘మనల్ని దీర్ఘాయుష్మంతుల్ని’ చేయగలడు.

18 తాము దేవునికి భయపడితే అది తమకు క్షేమకరమైనదౌతుంది అనే నమ్మదగిన వాస్తవాన్ని ఇంకా వృద్ధులుకాని వ్యక్తులు విశేషంగా పర్యాలోచించాలి. మీరు వ్యక్తిగతంగా చూసినట్లుగానే అతి వేగంగా పరుగెత్తే రన్నర్‌ తొట్రుబడి పందెంలో ఓడిపోవచ్చు. శక్తివంతమైన సైన్యం ఓడిపోవచ్చు. తెలివైన వ్యాపారవేత్త దరిద్రుడు కావొచ్చు. అనేకమైన ఇతర అనిశ్చయ పరిస్థితులనుబట్టి, జీవితంలో ఏం జరుగుతుందో చెప్పడంకష్టం. కాని మీరు ఈ విషయంలో మరింత నిశ్చింతగా ఉండొచ్చు: దేవుని నైతిక చట్టాలకు లోబడి, ఆయన చిత్తానుసారంగా మీరు మంచిని చేస్తూ జీవితాన్ని ఆనందించడమే జ్ఞానయుక్తమైన, కచ్చితమైన పనియైవుంది. (ప్రసంగి 9:11) దీనిలో దేవుని చిత్తమేమైవుందో బైబిలు నుండి నేర్చుకోవడమూ, ఒకడు తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడమూ, బాప్తిస్మం పొందిన క్రైస్తవుడవ్వడమూ చేరివున్నాయి.—మత్తయి 28:19, 20.

19. యౌవనులు తమ జీవితాల్ని ఎలా ఉపయోగించుకొనగలరు, కాని ఏది జ్ఞానయుక్తమైన పని?

19 తన నడిపింపును అనుసరించమని సృష్టికర్త యౌవనుల్ని లేక ఇతరుల్ని ఒత్తిడి చేయడు. వాళ్లు విద్యను అభ్యసించడంలో మునిగిపోయి ఉండొచ్చు, బహుశా అసంఖ్యాకమైన మానవ పాండిత్యాన్ని గూర్చిన పుస్తకాల్ని జీవితాంతం పఠించేవారిగా కూడా తయారుకావొచ్చు. అది చివరకు దేహానికి ఆయాసకరమని రుజువౌతుంది. లేక వాళ్లు తమ అపరిపూర్ణ మానవ హృదయం నడిపించే మార్గాల్లో నడవడమో లేక తమ దృష్టికి ఇష్టమైన దానిని అనుసరించడమో చేయగలరు. అది నిశ్చయంగా వ్యాకులపరుస్తుంది మరి ఆ విధంగా గడిపిన జీవితం కాలక్రమేణ నిరర్థకమైనదని రుజువౌతుంది. (ప్రసంగి 11:9–12:12; 1 యోహాను 2:15-17) కాబట్టి సొలొమోను యౌవనులకు ఒక విన్నపాన్ని చేస్తున్నాడు, మన వయస్సు ఏదైనప్పటికీ, మనమంతా దాన్ని గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలి: “దుర్దినములు రాకముందే—ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసంగి 12:1, 2.

20. ప్రసంగి పుస్తకంలోగల సందేశం విషయంలో సమతూకమైన దృక్పథం ఏమిటి?

20 అయితే, మనమే నిర్ధారణకు రావాలి? సరే, సొలొమోను చేరుకున్న ముగింపు విషయమేంటి? ‘సూర్యునిక్రింద జరుగుతున్న క్రియలన్నీ వ్యర్థమని, అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉన్నాయని’ ఆయన గమనించాడు లేక పరిశీలించాడు. (ప్రసంగి 1:14) ప్రసంగి పుస్తకంలో నిర్లిప్తమైన పదజాలాన్నో లేక సంతృప్తిచెందని ఓ వ్యక్తి మాటల్నో మనం చూడము. అవి దేవుని ప్రేరేపిత వాక్యంలో ఓ భాగం, మన పరిశీలనకు యోగ్యమైనవి.

21, 22. (ఎ) జీవితపు ఏ దృక్కోణాల్ని సొలొమోను పరిగణనలోనికి తీసుకున్నాడు? (బి) ఏ జ్ఞానయుక్తమైన ముగింపుకు ఆయన చేరుకున్నాడు? (సి) ప్రసంగి పుస్తకంలోని విషయాల్ని పరిశీలించడం మీపై ఏ విధమైన ప్రభావాన్ని చూపించింది?

21 మానవ ప్రయాసల్నిగూర్చీ, కష్టాల్నిగూర్చీ, ఆకాంక్షల్నిగూర్చీ సొలొమోను సర్వే చేశాడు. సామాన్య వ్యవహారాల్లో పరిస్థితులు ఎలా మారతాయనే దాని గురించి అనేకమంది మానవులు అనుభవించే నిరాశాజనకమైన, అర్థరహితమైన ప్రతిఫలాన్ని గురించి ఆయన పరిశీలించాడు. ఆయన మానవ అపరిపూర్ణ వాస్తవిక స్థితిని గూర్చి, పర్యవసానంగా వచ్చే మరణాన్ని గూర్చీ పరిశీలించాడు. మృతుల స్థితిని గూర్చీ, భవిష్యత్‌ జీవితం కొరకైన ప్రతి ఉత్తరాపేక్షను గూర్చీ దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఆయన పరిగణనలోకి తీసుకొన్నాడు. దైవికంగా పెంపొందింప చేయబడిన జ్ఞానంకల్గివున్న ఓ వ్యక్తి దీనినంతటినీ మూల్య నిర్ధారణ చేశాడు, అవును జీవించిన వారిలోకెల్లా మహాజ్ఞానులైన మానవుల్లో ఒకనిచే ఇది చేయబడింది. ఆయన చేరుకున్న నిర్ధారణ, నిజంగా అర్థవంతమైన జీవితాన్ని గడపాలనుకొనే వారందరి ప్రయోజనార్థమై పరిశుద్ధ లేఖనాల్లో ఆ తర్వాత చేర్చబడింది. మనం ఏకీభవించవద్దా?

22 “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.”—ప్రసంగి 12:13, 14.

[అధస్సూచీలు]

a కావలికోట పత్రిక ఒకప్పుడు ఈ జ్ఞానయుక్తమైన వ్యాఖ్యానాన్ని చేసింది: “వ్యర్థమైన వాటిని గూర్చి ఈ జీవితాన్ని మనం వృథా చేసుకోకూడదు . . . ఈ జీవితమున ఉన్న యావత్తు ఇదేయైతే, ప్రాముఖ్యమైనదేదీ లేదు. ఈ జీవితం, త్వరలోనే భూమ్మీదికి మరలా పడిపోయేలా పైకి విసరబడిన బంతి వంటిది. అది, గతించిపోవు నీడగానూ, వాడిపోవు పుష్పంగానూ, కోయబడి త్వరగా ఎండిపోవు గడ్డిపూచగానూ ఉంది. . . . నిత్యత్వమనే త్రాసులో మన జీవితాయుస్సు ఉపేక్షించదగిన ఓ చుక్కలాంటిది. అది కాలప్రవాహంలో ఓ పెద్ద నీటిబొట్టులాంటిది కూడా కాదు. జీవితంలోని అనేక మానవ వ్యవహారాల్నీ కార్యకలాపాల్నీ పునఃసమీక్షిస్తూ, అవి వ్యర్థమని ప్రకటిస్తున్నప్పుడు [సొలొమోను] చెప్పిన విషయాలు సరియైనవే. మనం త్వరగా గతించిపోతాం, మరెన్నటికీ జన్మించం. కోట్లాదిమంది పుడతారు చనిపోతారు, మనం ఇక్కడ ఉన్నామని అతి తక్కువమందికి తెలుసు. ఇది ఓ నిర్లిప్తమైన లేక అకారణభయాన్ని కలుగజేసే లేక విచారాన్ని కలుగజేసే లేక హానికరమైన దృక్పథంకాదు. జీవితమున ఉన్న యావత్తు ఇదేయైతే, ఇది సత్యం, ఎదుర్కోవాల్సిన వాస్తవం, ఓ ఆచరణీయమైన దృక్పథం.”—ఆగస్టు 1, 1957, పేజీ 472 (ఆంగ్లం).

మీరు జ్ఞాపకానికి తెచ్చుకోగలరా?

◻ మీ జీవితంలో ఆస్తుల స్థానాన్ని గూర్చిన జ్ఞానయుక్తమైన మూల్య నిర్ధారణ ఏమైవుంది?

◻ కుటుంబం, కీర్తి లేక ఇతరులపై అధికారం విషయంలో మనమెందుకు అసాధారణమైన ప్రాముఖ్యతను ఇవ్వకూడదు?

◻ ఆనందం విషయంలో ఏ దైవిక దృక్పథాన్ని కల్గివుండాలని సొలొమోను ప్రోత్సహించాడు?

◻ ప్రసంగి పుస్తకాన్ని పరిశీలించడం నుండి మీరు ఏ విధంగా ప్రయోజనాన్ని పొందారు?

[15వ పేజీలోని చిత్రం]

ధనం, ఆస్తులు సంతృప్తికి హామీ ఇవ్వవు

[17వ పేజీలోని చిత్రం]

తాము దేవునికి భయపడితే అది వారికి క్షేమకరమైనది కాగలదనే నిశ్చయాన్ని యౌవనులు కల్గివుండొచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి