కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/1 పేజీలు 24-28
  • ఆధునిక ఆరాధనలో సంగీతానికున్న స్థానం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆధునిక ఆరాధనలో సంగీతానికున్న స్థానం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆరాధనలో సంగీతానికున్న చారిత్రాత్మక స్థానం
  • మొదటి శతాబ్దపు క్రైస్తవులు పాడటం
  • అబద్ధ ఆరాధన ప్రభావం
  • ఆరాధనలో సంగీతానికున్న సరైన స్థానాన్ని దానికి తిరిగి కల్పించడం
  • ‘మన హృదయాల్లో యెహోవాకు పాడటం’
  • యెహోవాను కీర్తించండి
  • సంతోష స్వరంతో పాడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • యెహోవాకు స్తుతిగీతములు పాడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • కీర్తనయందు యెహోవాను స్తుతించుట
    మన రాజ్య పరిచర్య—1991
  • యెహోవాకు కీర్తనలు పాడదాం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/1 పేజీలు 24-28

ఆధునిక ఆరాధనలో సంగీతానికున్న స్థానం

పాడటం దేవుడిచ్చిన వరం. పాట పాడేందుకు మన స్వరమెత్తడం మనకు మన సృష్టికర్తకు ఆనందాన్ని కలిగించగలదు. దాని ద్వారా మనం మన భావావేశాలను, అంటే మన దుఃఖాలను ఆనందాలను వ్యక్తం చేయవచ్చు. అంతేకాకుండా, పాటకు మూలకర్తయైన యెహోవా ఎడల మనకుగల ప్రేమను, మెప్పును మరియు స్తుతిని మనం ఆలపించగలము.

సంగీతాన్ని గురించి బైబిలులో వున్న దాదాపు మూడు వందల ఉదాహరణల్లో చాలా ఉదాహరణలు యెహోవా ఆరాధనకు సంబంధించినవే. పాడటమనేది ఆనందంతో కూడా జోడించబడుతుంది, అది పాడే వారికే కాదు యెహోవాకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “ఆయననుగూర్చి గానము చేయుదురు గాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు.”—కీర్తన 149:3, 4.

అయితే ఆధునిక ఆరాధనలో పాడటం ఎంత ప్రాముఖ్యం? తమ స్వరమెత్తి పాడటం ద్వారా యెహోవా ప్రజలు నేడు ఆయనను ఎలా ప్రీతిపర్చగలరు? సత్యారాధనలో సంగీతం ఏ స్థానాన్ని కలిగి ఉండాలి? ఆరాధనలో సంగీతం కలిగివున్న చరిత్రను పరిశీలించడం ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పొందేందుకు సహాయం చేస్తుంది.

ఆరాధనలో సంగీతానికున్న చారిత్రాత్మక స్థానం

యెహోవా ఆరాధనకు సంబంధించి సంగీతాన్ని గురించిన మొదటి బైబిలు ఉదాహరణ ప్రత్యేకంగా పేర్కొనబడలేదు. ఆదికాండము 4:21 నందు, మొదటి సంగీత వాయిద్యాలను కనుగొన్న లేక బహుశా ఒక విధమైన సంగీత వృత్తిని స్థాపించిన కీర్తి యూబాలుకు ఆపాదించబడింది. అయితే, మానవులు సృష్టించబడక ముందే సంగీతమనేది యెహోవా ఆరాధనలో ఒక భాగంగా ఉంది. అనేక బైబిలు అనువాదాలు దేవదూతలు పాడుతున్నట్లు వర్ణిస్తున్నాయి. దేవదూతలు సంతోషగానాలు చేయడాన్ని గురించి మరియు “ఆనందించి జయధ్వనులు” చేయడాన్ని గురించి యోబు 38:7 చెబుతుంది. కాబట్టి, యెహోవాకు ఆరాధనలో పాడటమనేది మానవుడు ఉనికిలోకి రాకమునుపే ఆచరణలో ఉందని మనం నమ్మేందుకు లేఖనాధార కారణముంది.

ప్రాచీన హెబ్రీ సంగీతంలో శ్రావ్యతే ఉండేది గానీ మద్దతునిచ్చే సమస్వరం ఉండేది కాదని కొందరు చరిత్రకారులు వాదించారు. అయితే, బైబిలులో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడిన వాయిద్యమైన వీణపై ఒకేసారి ఒకటికంటే ఎక్కువ ధ్వనులను వాయించవచ్చు. ఆ వాయిద్యంపై స్వరాలను కలపడం వలన సమస్వరాన్ని ఉత్పన్నం చేయవచ్చని వీణను వాయించే వ్యక్తులు గమనించి ఉండవచ్చు. వారి సంగీతం పురాతనమైన దానిగా లేదు, బదులుగా నిస్సందేహంగా చాలా ఆధునికమైనదై ఉండినది. మరియు హెబ్రీ లేఖనాల పద్య, గద్య భాగాన్ని బట్టి చూస్తే, ఇశ్రాయేలీయుల సంగీతం చాలా ఉన్నత శ్రేణిదని మనం తీర్మానించవచ్చు. సంగీతాన్ని శృతి కలిపేందుకు వారు కలిగివున్న ప్రేరణ పొరుగు దేశాల వారు కలిగివున్న దానికంటే చాలా ఉన్నతమైనదనే విషయం కచ్చితం.

దేవాలయ ఆరాధనలో స్వరాల మరియు వాయిద్యాల సంకీర్ణమైన ఏర్పాట్లు ఉండటాన్ని ప్రాచీన దేవాలయ వ్యవస్థ సాధ్యపర్చింది. (2 దినవృత్తాంతములు 29:27, 28) ‘రాగమెత్తేవారు,’ ‘ప్రవీణులు,’ ‘శిష్యులు’ మరియు ‘ప్రధానులు’ ఉండేవారు. (1 దినవృత్తాంతములు 15:21; 25:7, 8; నెహెమ్యా 12:46) వారి ఆధునికమైన సంగీత నిపుణతలను గురించి వ్యాఖ్యానిస్తూ కర్ట్‌ సాక్స్‌ అనే చరిత్రకారుడు ఇలా వ్రాశాడు: “యెరూషలేములోని ఆలయానికి సంబంధించిన బృందగానాలు మరియు వాద్యబృందాలు సంగీత విద్య, నిపుణత మరియు జ్ఞానం విషయంలో ఉన్నత ప్రమాణాలను సూచిస్తున్నాయి. . . . ఆ ప్రాచీన సంగీతం ఎలా ఉండేదో మనకు తెలియకపోయినా దాని శక్తి, ఘనత మరియు నైపుణ్యానికి తగినంత రుజువులు మనకున్నాయి.” (ప్రాచీన ప్రపంచంలో సంగీతం యొక్క పురోగతి: తూర్పు పడమరలు, 1943, పేజీలు 48, 101-2) హెబ్రీ కూర్పుల సృజనాత్మకత మరియు నాణ్యతలకు పరమగీతము ఒక ఉదాహరణ. అది ఓ కథను పాట ద్వారా చెప్పడం, అంటే ఒక ఒపేరాలోని లిబ్రట్టో లేక టెక్స్‌ట్‌ వంటిది. ఈ గీతానికి హెబ్రీ వ్రాతల్లో “పరమగీతము” అంటే అత్యంత శ్రేష్ఠమైన గీతమని పిలువబడింది. ప్రాచీన హెబ్రీయులకు, పాడటమనేది వారి ఆరాధనలో అత్యంత ముఖ్యమైన భాగంగా ఉండేది. వారు యెహోవాను స్తుతించడంలో అనుకూలమైన భావోద్రేకాలను వ్యక్తం చేసేందుకు అది వీలు కలిగించింది.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు పాడటం

తొలి క్రైస్తవులకు కూడా సంగీతం తమ ఆరాధనలో క్రమమైన భాగంగా ఉంటూనే వచ్చింది. ప్రేరేపిత కీర్తనలను కలిగి ఉండటంతోపాటు, క్రైస్తవ గీతాల ఆధునిక దిన కూర్పు కొరకు ఒక మార్గాన్ని తెరుస్తూ వారు ఆరాధన కొరకు మొదటి సంగీతాన్ని మరియు శృతులను కూర్చారనిపిస్తుంది. (ఎఫెసీయులు 5:19) వాల్డో సెల్డెన్‌ ప్రాట్‌ రచించిన సంగీతం యొక్క చరిత్ర అనే పుస్తకం ఇలా వివరిస్తుంది: “తొలి క్రైస్తవులు, తమ బహిరంగ మరియు ఏకాంత ఆరాధనలో పాటలు పాడటం అనేది వారికి ఎంతో సాంప్రదాయికమైన విషయం. క్రైస్తవులుగా మారిన యూదులకు ఇది తమ సమాజమందిరపు అలవాటు కొనసాగడం వలె ఉండినది . . . హెబ్రీ కీర్తనలకు తోడు . . . , క్రొత్త విశ్వాసం క్రొత్త గేయాలను ఎల్లప్పుడూ కూర్చేందుకు సుముఖత చూపేది, మొదట్లో మహాకావ్యాల రూపంలో అయ్యుండవచ్చు.”a

ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు స్థాపించినప్పుడు, పాడటం యొక్క విలువను ఉన్నతపరుస్తూ, ఆయనా ఆయన అపొస్తలులు బహుశ హల్లేల్‌ గీతాలు పాడివుంటారు. (మత్తయి 26:26-30) ఇవి కీర్తనల్లో వ్రాసి ఉంచబడిన యెహోవా స్తుతి గీతాలు, వాటిని పస్కా వేడుక సందర్భంలో పాడతారు.—కీర్తనలు 113-118.

అబద్ధ ఆరాధన ప్రభావం

అంధకార యుగాలు అని పిలువబడేవి వచ్చేసరికి, మత సంబంధమైన సంగీతం శోకగ్రస్త గేయంగా మారింది. దాదాపు సా.శ. 200లో అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌ ఇలా అన్నాడు: “మనకు కావలసింది ఒక వాయిద్యము అంటే శాంతికరమైన ఆరాధనా వచనం: కానీ అది వీణలు, డప్పులు లేక నాళములు లేక బూరలు కాదు.” చర్చి సంగీతాన్ని స్వరగాత్రాలకే పరిమితం చేస్తూ నిర్భందాలు స్థాపించబడ్డాయి. ఈ పద్ధతి జపం లేక గాత్రసంగీతం అని పేరొందింది. “కాన్‌స్టెంటినోపుల్‌ స్థాపించబడిన నలభై కంటే తక్కువ సంవత్సరాల తర్వాత, ఆరాధనాక్రమంలో వాయిద్యాలు మరియు సంఘాలు పాల్గొనడాన్ని లవోడీషియా కౌన్‌సిల్‌ (367 క్రీ. శ.) నిషేధించింది. సంగీతంలో గానం మాత్రమే ఉండేది” అని మన సంగీత వారసత్వం అనే పుస్తకం అంటుంది. (ఇటాలిక్కులు మావి.) ఈ నిర్బంధాలు తొలి క్రైస్తవత్వంలో ఎలాంటి ఆధారాన్నీ కలిగిలేవు.

అంధకార యుగాలని పిలువబడే కాలాల్లో, బైబిలు సామాన్య ప్రజలకు మూసిన పుస్తకంలా ఉండేది. ఒక బైబిలును తమవద్ద ఉంచుకునే లేక దాన్ని చదివే ధైర్యం చేసిన క్రైస్తవులు హింసింపబడ్డారు, చివరికి చంపబడ్డారు కూడా. ఆ అంధకార సమయంలో, దేవునికి స్తుతి గీతాలు పాడటమనేది చాలామేరకు అంతరించి పోయిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎంతైనా, లేఖనాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకపోతే, మొత్తం బైబిలులోని పదవ వంతు పాటలేననే విషయాన్ని వారెలా తెలుసుకుంటారు? “యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి” అని దేవుడు తన ఆరాధికులకు ఆజ్ఞాపించాడని వారికెవరు తెలియజేస్తారు?—కీర్తన 149:1.

ఆరాధనలో సంగీతానికున్న సరైన స్థానాన్ని దానికి తిరిగి కల్పించడం

ఆరాధనలో సంగీతం మరియు పాటలు కలిగివున్న సరైన స్థానాన్ని తిరిగి వాటికి కల్పించేందుకు యెహోవా సంస్థ ఎంతో చేసింది. ఉదాహరణకు, జయన్స్‌ వాచ్‌టవర్‌ యొక్క ఫిబ్రవరి 1, 1896 సంచికలో కేవలం పాటలు మాత్రమే ఉన్నాయి. “సీయోను యొక్క ఆనందమయ ప్రారంభ గీతాలు” అని దానికి పేరు పెట్టబడింది.

మరి 1938లో సంఘ కూటాల్లో పాడటమనేది చాలా మేరకు నిలిపివేయబడింది. అయితే, అపొస్తలుల మాదిరిని నడిపింపును అనుసరించడం ఎంత జ్ఞానయుక్తమో త్వరలోనే గమనించడం జరిగింది. 1944 జిల్లా సమావేశంలో, ఎఫ్‌. డబ్ల్యూ. ఫ్రాంజ్‌ “రాజ్య పరిచర్య గీతం” అనే ప్రసంగాన్నిచ్చాడు. మానవుడు సృజింపబడడానికి చాలా ముందే దేవుని పరలోక సృష్టి ప్రాణులు యెహోవాకు స్తుతి గీతాలు పాడారని చూపించి, ఆయన ఇలా అన్నాడు: “దేవుని భూసంబంధ సేవకులు అక్షరార్థ పాట పాడేందుకు తమ స్వరమెత్తడం ఎంతో సరైన విషయం, అది ఆయనకు ప్రీతికరం కూడా.” ఆరాధనలో పాడాలనే విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత, వారపు సేవా కూటాల్లో ఉపయోగించేందుకు రాజ్య పరిచర్య పాటల పుస్తకం విడుదలను గురించి ఆయన ప్రకటించాడు.b అప్పుడు, ఇతర కూటాల్లో కూడా ప్రారంభ మరియు ముగింపు గీతాలు ఉంటాయని 1944 డిశంబరు ఇన్‌ఫార్‌మెంట్‌ (ఇప్పుడు మన రాజ్య పరిచర్య అని పిలువబడుతోంది) ప్రకటించింది. పాటలు పాడటమనేది మరోసారి యెహోవా ఆరాధనలో ఒక భాగమయ్యింది.

‘మన హృదయాల్లో యెహోవాకు పాడటం’

హృదయపూర్వకంగా పాడటం యొక్క విలువ, అనేక సంవత్సరాలపాటు కష్టాలను హింసను అనుభవించిన తూర్పు ఐరోపా మరియు ఆఫ్రికాలలోని మన సహోదరుల ద్వారా చక్కగా ఉదాహరించబడింది. లోటర్‌ వాగ్‌నర్‌ ఏకాంత కారాగార వాసంలో ఏడు సంవత్సరాలు గడిపాడు. ఆయన దాన్ని ఎలా సహించాడు? ఆయనిలా చెబుతున్నాడు: “నాకు తెలిసిన రాజ్య గీతాలన్నింటినీ నేను అనేక వారాలు జ్ఞాపకం చేసుకోవడంపై కేంద్రీకరించాను. నాకు ఆ పాట కచ్చితంగా జ్ఞాపకం లేనప్పుడు నేను ఒకటి లేక రెండు పద్యభాగాలను కూర్చేవాన్ని. . . . మన రాజ్య గీతాల్లో ఎంత ప్రోత్సాహకరమైన, నిర్మాణాత్మకమైన తలంపుల సంపద ఉందో కదా!”—యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం 1974, పేజీలు 226-8 (ఆంగ్లం).

తన నమ్మకమైన స్థానం విషయమై ఏకాంత కారాగార వాసంలో ఐదు సంవత్సరాలు గడిపిన హెరాల్డ్‌ కింగ్‌ యెహోవాకు స్తుతి గీతాలను కూర్చడంలో, వాటిని పాడటంలో ఆదరణను పొందాడు. ఆయన కూర్చిన అనేక గీతాలను నేడు యెహోవాసాక్షులు తమ ఆరాధనలో ఉపయోగిస్తున్నారు. పాడటానికి సంబంధించిన ఆనందం మనలను కాపాడుతుంది. అయితే దేవునికి స్తుతి గీతాలను పాడటంలోని విలువను అంగీకరించేలా ఒప్పించబడేందుకు, మనం హింసనే అనుభవించనవసరం లేదు.

యెహోవా ప్రజలందరూ పాటలో ఆనందాన్ని కనుగొనగలరు. మనం మన భావాలను మాటల్లో వ్యక్తం చేయడానికి కాస్త సంకోచించినప్పటికీ, యెహోవా ఎడల మనకుగల భావాలను మనం పాడినప్పుడు స్వేచ్ఛగా వ్యక్తపర్చగలుగుతాము. “ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు” ఉండుడి అని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు సలహా ఇచ్చినప్పుడు, మనం స్తుతి గీతాలు పాడటంలో ఎలా ఆనందాన్ని కనుగొనగలమో ఆయన సూచించాడు. (ఎఫెసీయులు 5:19) మన హృదయాలు ఆత్మీయ విషయాలతో నిండి ఉన్నప్పుడు, మన భావాలను వ్యక్తపర్చడానికి పాటలో శక్తివంతమైన వ్యక్తీకరణలను కనుగొంటాము. కాబట్టి మనం పాడే విధానాన్ని వృద్ధి చేసుకోవడానికి అవసరమైన కీలకం సరైన హృదయ దృక్పథమే.

యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగివుండటం మనం యెహోవాకు స్తుతులు పలికేందుకు, పాడేందుకు మరియు గొంతెత్తి ఆలపించేందుకు మనలను పురికొల్పుతూ, ఆనందభరిత స్ఫూర్తిని కలిగి ఉండేందుకు దోహదపడుతుంది. (కీర్తన 146:2, 5) మనకు ఇష్టమైన విషయాల గురించి మనం హృదయపూర్వకంగా పాడతాం. మనకు పాట నచ్చినా లేక పాటలోని భావాలు నచ్చినా, మనం దాన్ని తప్పకుండా నిజమైన భావాలతో పాడతాము.

భావాలతో పాడేందుకు ఒకరు గట్టిగా పాడనవసరం లేదు. చక్కగా పాడటమంటే గట్టిగా పాడటమని అర్థం కాదు; వినిపించనంత మెల్లిగా పాడటం కూడా చక్కగా పాడటం అనిపించుకోదు. సహజంగానే ప్రతిధ్వనించే కొన్ని స్వరాలు, నెమ్మదిగా పాడినప్పటికీ గట్టిగా వినిపించవచ్చు. ఒక గుంపుతోపాటూ పాడుతున్నప్పుడు, కలిసిపోయేలా పాడడాన్ని నేర్చుకోవడం సవాలులో భాగమే. మీరు సమస్వరంలో పాడుతున్నా లేక ఏకస్వరంలో పాడుతున్నా, మీ స్వరం మీ దగ్గర్లో ఉన్న వారికి తగినట్టుగా ఉంటే అలా పాడటం చక్కగా మరియు ఏకీభావంగా ఉందనిపించుకుంటుంది. క్రైస్తవ వినయం మరియు చక్కగా వినేందుకు ఆసక్తి కలిగివుండటం, చక్కని స్ఫూర్తితో పాడుతూ అదే సమయంలో తమ స్వరం బిగ్గరగా ఉండకుండా ఉంచేందుకు ఒకరికి సహాయం చేయగలదు. అయితే, నిపుణతతో పాడేవారు లేక అత్యంత చక్కని స్వరంగల వారు కంఠం విప్పి పాడకూడదని వారిని ఎన్నడూ నిరుత్సాహపర్చకూడదు. యెహోవాకు స్తుతి గీతాలు పాడే సంఘానికి ఒక అందమైన స్వరం, దృఢమైన మద్దతునివ్వగలదు.

మన కూటాల్లో పాడటం కూడా, మనం గాత్రాల్లో సమస్వర భాగాలను పాడేందుకు సరైన అవకాశాన్ని కలిగిస్తుంది. సమస్వరాన్ని ఇష్టపడే వారు లేక పాటల పుస్తకంలో సమస్వర వాక్యాలను చదివి, వాటిని పాడగలిగే వారు, ఇతరుల స్వరాలతో కలిసిపోయేలా పాడి సంగీతం యొక్క అందానికి వన్నె తీసుకురావాలని ప్రోత్సహించబడుతున్నారు.c

‘నేను చక్కగా రాగం తీయలేను’ లేక ‘నాది భయంకరమైన స్వరం; గట్టిగా పాడినప్పుడు అది కీచుమంటుంది’ అని కొందరనవచ్చు. అలా వారు పాడేటప్పుడు, మరి రాజ్యమందిరంలో పాడేటప్పుడు కూడా వారు సిగ్గుపడతారు. వాస్తవమేమంటే, యెహోవాను స్తుతించేందుకు ఎత్తబడిన ఏ స్వరం కూడా ఆయన దృష్టిలో “భయంకరమైనది” కాదు. అభ్యాసం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఇవ్వబడిన సహాయకరమైన సలహాలను అనుసరించడం ద్వారా ఒకరి మాట్లాడే విధానాన్ని ఎలా సరిచేయవచ్చో, అలాగే ఒకరి పాడే విధానాన్ని కూడా సరిచేయవచ్చు. కొందరు పనులు చేసుకునేటప్పుడు ఊరికే రాగం తీయడం ద్వారా తమ స్వరాలను మెరుగుపర్చుకున్నారు. రాగం తీయడం స్వరాన్ని మెత్తబర్చేందుకు సహాయం చేస్తుంది. మరి సరైన సమయాల్లో, మనం ఒంటరిగా ఉన్నా లేక ఇతరులకు ఇబ్బంది కలిగించని స్థలంలో పని చేస్తున్నా, మనం రాజ్య గీతాలను పాడటం స్వరానికి చక్కని వ్యాయామాన్ని అందిస్తుంది, అంతేకాకుండా ఒకరిని మంచి, ఆనందభరిత మానసిక స్థితిలో ఉంచేందుకు కూడా అది చక్కని అవకాశం.

సమకూడినప్పుడు కూడా రాజ్య గీతాలను కొన్నింటిని పాడటాన్ని మనం ప్రోత్సహించవచ్చు. గిటార్‌ లేక పియానో వంటి వాయిద్యంతోపాటు లేక సొసైటీ యొక్క పియానో రికార్డులతోపాటు అలా పాడటమనేది, మన పార్టీలకు ఆత్మీయ వాతావరణాన్ని అందిస్తుంది. పాటలను నేర్చుకునేందుకు మరియు సంఘ కూటాల్లో వాటిని చక్కగా పాడేందుకు అది మనకు సహాయాన్ని కూడా అందిస్తుంది.

సంఘాలు కూటాల్లో పాడే స్ఫూర్తిని కలిగి ఉండేందుకు సహాయం చేయడానికి, రికార్డు చేయబడిన క్యాసెట్‌లను సొసైటీ అందించింది. వాటిని మోగిస్తున్నప్పుడు సౌండు సిస్టమ్‌ను చూసుకుంటున్న వారు శబ్దం ఎంత బిగ్గరగా ఉందో తెలుసుకుని ఉండాలి. సంగీతం తగినంత బిగ్గరగా లేకపోతే, సంఘంలోని వారు బిగ్గరగా పాడేందుకు సిగ్గుపడవచ్చు. సౌండు సిస్టమ్‌ను చూసుకునే సహోదరుడు సంఘంతోపాటు పాడతాడు గనుక, సంగీతం మద్దతునిస్తూ నడిపిస్తుందా లేదా అనే విషయాన్ని నిశ్చయపర్చుకోగల్గుతాడు.

యెహోవాను కీర్తించండి

మన సృష్టికర్త ఎడల మనకున్న భావాలను వ్యక్తం చేసేందుకు పాటలు పాడటం మనకు వీలు కలిగిస్తుంది. (కీర్తన 149:1, 3) అది కేవలం భావోద్రేకాలను వ్యక్తపర్చడమే కాదు గాని, అది నియంత్రించబడిన, సహేతుకమైన మరియు ఆనందదాయకమైన మన స్తుతిని వ్యక్తీకరించడం కూడా. సంఘంతో పాటూ మనం హృదయపూర్వకంగా పాడటం, తర్వాతి కార్యక్రమాన్ని చక్కగా వినేందుకు అది మనలను సరైన మానసిక, హృదయ పరిస్థితిలో ఉంచగలదు మరియు యెహోవా ఆరాధనలో మరింత ఎక్కువగా పాల్గొనేందుకు మనలను పురికొల్పగలదు. పాడటానికి భావోద్రేక ప్రభావం ఉన్నప్పటికీ, భావాలు మనకు ఉపదేశాన్ని ఇచ్చేందుకు కూడా పని చేయగలవు. ఏకస్వరంలో మరియు సమస్వరంలో మనలను మనం వ్యక్తం చేసుకోవడం ద్వారా, మనం సంఘంగా కలిసి నేర్చుకునేందుకు మన హృదయాలను వినయంగా, దీనంగా సిద్ధం చేసుకుంటున్నాము.—కీర్తన 10:17 పోల్చండి.

పాడటమనేది యెహోవా ఆరాధనలో ఎల్లప్పుడూ ఒక భాగమై ఉంటుంది. కాబట్టి, కీర్తనల గ్రంథకర్త యొక్క ఈ భావోద్రేకాలను పంచుకునే అవకాశం మనకు నిరంతరం ఉంటుంది: “నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.”—కీర్తన 146:2.

[అధస్సూచీలు]

a మహాకావ్యం అనేది వేర్వేరు భాగాల్లో స్వేచ్ఛా విధానాన్ని ప్రేరేపించే సంగీత కావ్యం. మహాకావ్యాలు తరచూ వీరోచిత గాథలను లేక వ్యక్తులను పొగుడుతాయి.

b మొదటి శతాబ్దానికి చెందిన క్రైస్తవ ఆరాధనలో పాడటమనేది ఒక క్రమమైన అంశమై ఉందని 1 కొరింథీయులు 14:15 సూచిస్తున్నట్లు అనిపిస్తుంది.

c యెహోవాకు స్తుతి గీతములు పాడుడి అనే మన ఇటీవలి పాటల పుస్తకంలోని కొన్ని పాటల్లో, సమస్వర భాగాలను పాడేందుకు ఇష్టపడే వారి ప్రయోజనార్థం నాలుగు భాగాల సమస్వర పద్ధతి ఇంకా ఉంచబడింది. అయితే, అనేక పాటలు పియానోతోపాటు పాడేలా ఏర్పాటు చేయబడ్డాయి, రాగాల యొక్క అంతర్జాతీయ మూలాన్ని కాపాడాలని ప్రయత్నించే సంగీత సూచనలు ఇవ్వబడ్డాయి. నాలుగు భాగాల సమస్వరం కచ్చితంగా లేకుండా వ్రాయబడిన పాటల సమస్వర సూచనలను కనుగొనడం మనం కూటాల్లో పాడటాన్ని ప్రీతికరమైన రీతిలో వృద్ధి చేయవచ్చు.

[27వ పేజీలోని బాక్సు]

చక్కగా పాడేందుకు కొన్ని సలహాలు

1. పాడేటప్పుడు పాటల పుస్తకాన్ని పైకి పట్టుకోండి. మనం చాలా సహజంగా శ్వాస తీసుకునేందుకు ఇది వీలు కలిగిస్తుంది.

2. ప్రతి వాక్యం మొదట్లో గాఢంగా శ్వాస తీసుకోండి.

3. మొదట్లో మీకు సులభంగా అనిపించే దానికంటే కాస్త ఎక్కువగా నోరు తెరవడం స్వరం సహజంగానే బిగ్గరగా వచ్చేందుకు, ప్రతిధ్వనించేందుకు వీలు కలిగిస్తుంది.

4. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, పాడుతున్న పాట యొక్క భావాన్ని మనస్సులో ఉంచుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి