‘దేవుడు మనల్నిలా ప్రేమించాడు’
“దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై యున్నాము.”—1 యోహాను 4:11.
1. మార్చి 23న సూర్యాస్తమయం తర్వాత, లక్షలాదిమంది ప్రజలు భూగోళ వ్యాప్తంగా రాజ్యమందిరాల్లోనూ ఇతర కూటాల స్థలాల్లోనూ ఎందుకు సమకూడుతారు?
ప్రపంచవ్యాప్తంగా 1997 మార్చి 23 ఆదివారంనాడు సూర్యాస్తమయం తర్వాత, యెహోవాసాక్షులు ఉపయోగించే రాజ్యమందిరాల్లోనూ ఇతర కూటాల స్థలాల్లోనూ నిస్సందేహంగా 1,30,00,000 కంటే ఎక్కువమంది సమకూడుతారు. ఎందుకు? మానవజాతి ఎడల దేవుడు వ్యక్తపర్చిన అత్యంత గొప్ప ప్రేమనుబట్టి వారి హృదయాలు కదిలింపబడ్డాయి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని చెబుతూ యేసుక్రీస్తు దేవుని ప్రేమ యొక్క ఆ మహిమాన్విత నిదర్శనంపై శ్రద్ధను కేంద్రీకరింపజేశాడు.—యోహాను 3:16.
2. దేవుడు చూపిన ప్రేమ ఎడల మన ప్రతిస్పందనకు సంబంధించి మనమందరం మనల్ని మనం ఏ ప్రశ్నలు వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది?
2 దేవుడు చూపించిన ప్రేమను మనం పరిశీలిస్తుండగా, మనల్ని మనమిలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘దేవుడు చేసినదానికి నేను నిజంగా మెప్పుదలను కనపరుస్తున్నానా? నేను నా జీవితాన్ని ఉపయోగిస్తున్న విధానం ఆ మెప్పుదలకు నిదర్శనంగా ఉందా?’
“దేవుడు ప్రేమాస్వరూపి”
3. (ఎ) ప్రేమ చూపించడం దేవునికి ఎందుకు అసాధారణమేమీ కాదు? (బి) ఆయన సృష్టి కార్యాలలో శక్తి మరియు జ్ఞానము ఎలా ప్రదర్శించబడ్డాయి?
3 దేవుడు ప్రేమ చూపించడం విశేషమైనదేమీ కాదు ఎందుకంటే “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:8) ప్రేమ ఆయన ప్రధానమైన గుణం. ఆయన భూమిని మానవ నివాసం కొరకు సిద్ధం చేస్తూ, పర్వతాలను స్థాపించి, నీటిని కొలనుల్లోకీ మహాసముద్రాల్లోకి సమకూర్చడంలో శక్తి అత్యద్భుతంగా ప్రదర్శించబడింది. (ఆదికాండము 1:9, 10) దేవుడు నీటి చక్రాన్ని మరియు ఆక్సిజన్ చక్రాన్ని ప్రారంభింపజేసినప్పుడు, భూమిలోని రసాయనిక పదార్థాలను మానవులు తాము జీవించివుండేందుకు తీసుకోవలసిన ఆహారంగా మార్చేలా ఆయన అసంఖ్యాకమైన సూక్ష్మజీవులను మరియు వివిధ రకాల మొక్కలను రూపొందించినప్పుడు, భూ గ్రహంపై దినాలు మరియు నెలల నిడివికి అనుగుణంగా ఉండేలా ఆయన మన జీవ గడియారాలను ఏర్పాటు చేసినప్పుడు, ఇదంతా గొప్ప జ్ఞానాన్ని చూపించింది. (కీర్తన 104:24; యిర్మీయా 10:12) అయితే భౌతిక సృష్టిలో మరింత విశేషమైనది దేవుని ప్రేమ యొక్క నిదర్శనమే.
4. భౌతిక సృష్టిలో, దేవుని ప్రేమను గూర్చిన ఏ నిదర్శనాన్ని మనమందరం చూసి దాన్ని మెచ్చుకోవాలి?
4 మనల్ని బలపర్చడానికే కాకుండా మనకు ఆనందాన్ని కూడా కలిగించడానికి తయారు చేయబడిందని స్పష్టమౌతున్న రసవంతమైన పండును కొరికినప్పుడు మన తాలువులు మనకు దేవుని ప్రేమ గురించి తెలియజేస్తాయి. అద్భుతమైన సూర్యాస్తమయాలు, నిర్మలమైన రాత్రి నక్షత్రాలతో నిండివున్న ఆకాశం, పువ్వుల వివిధ రూపాలు కాంతివంతమైన రంగులు, జంతు కూనల చిలిపి చేష్టలు, స్నేహితుల వాత్సల్యపూరితమైన చిరునవ్వులు వంటివాటిలో మన కళ్లు దానికి సంబంధించిన కచ్చితమైన నిదర్శనాన్ని చూస్తాయి. వసంత ఋతువులోని పువ్వుల గుబాళించే వాసనను మనం పీల్చుకున్నప్పుడు మన ముక్కులు మనకా విషయాన్ని తెలియజేస్తాయి. మనం జలపాతం యొక్క ధ్వనిని, పక్షుల ఆలాపనలను, ప్రియమైనవారి స్వరాలను విన్నప్పుడు మన చెవులు ఆ విషయాన్ని గ్రహిస్తాయి. ప్రియమైనవారి వాత్సల్యపూరితమైన ఆలింగనంలో మనం దాన్ని అనుభవిస్తాము. మానవులు చూడలేని, వినలేని, లేక ఆఘ్రాణించలేని వాటిని చూసే, వినే, లేక ఆఘ్రాణించే సామర్థ్యం కొన్ని జంతువులకు ఇవ్వబడింది. కాని దేవుని స్వరూపమందు చేయబడిన మానవజాతికి, ఏ జంతువు గ్రహించలేని విధంగా దేవుని ప్రేమను గ్రహించే సామర్థ్యం ఇవ్వబడింది.—ఆదికాండము 1:27.
5. ఆదాము హవ్వల ఎడల యెహోవా అపారమైన ప్రేమను ఎలా చూపించాడు?
5 యెహోవా దేవుడు మొదటి మానవులైన ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు, ఆయన వారి చుట్టూ తన ప్రేమకు నిదర్శనాన్నుంచాడు. ఆయన ఒక తోటను వేసి అంటే ఒక పరదైసును ఏర్పాటు చేసి, అన్ని రకాలైన చెట్లూ అందులో పెరిగేలా చేశాడు. దానికి నీటి కొరకు ఆయన ఒక నదిని ఏర్పాటు చేసి, దాన్ని అద్భుతమైన పశుపక్ష్యాదులతో నింపాడు. దీనినంతటినీ ఆయన ఆదాము హవ్వలకు వారి గృహంగా ఇచ్చాడు. (ఆదికాండము 2:8-10, 19) యెహోవా తన పిల్లలతో అంటే తన విశ్వ కుటుంబంలోని భాగంతో వ్యవహరించినట్లు వారితో వ్యవహరించాడు. (లూకా 3:38) ఈ మొదటి మానవ జత యొక్క పరలోకపు తండ్రి ఏదెనును ఒక నమూనాగా ఇచ్చి, భూగోళమంతటికీ పరదైసును వ్యాపింపజేసే సంతృప్తికరమైన పనిని వారిముందుంచాడు. భూమంతా వారి సంతానంతో నింపబడాలి.—ఆదికాండము 1:28.
6. (ఎ) ఆదాము హవ్వలు తీసుకున్న తిరుగుబాటు చర్య గురించి మీరెలా భావిస్తారు? (బి) ఏదెనులో జరిగిన దాని నుండి మనం నేర్చుకున్నామని, ఆ జ్ఞానం నుండి మనం ప్రయోజనం పొందామని ఏది సూచించగలదు?
6 అయితే, త్వరలోనే ఆదాము హవ్వలు విధేయతా పరీక్షను అంటే యథార్థతా పరీక్షను ఎదుర్కొన్నారు. తమ ఎడల చూపబడిన ప్రేమపట్ల మెప్పుదలను చూపించడంలో మొదట ఒకరు, ఆ తర్వాత మరొకరు విఫలమయ్యారు. వారు చేసింది దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అది క్షమించరానిది! ఫలితంగా, వారు దేవునితో తమకు గల సంబంధాన్ని కోల్పోయి, ఆయన కుటుంబంలో నుండి తొలగింపబడి ఏదెనులోనుండి వెళ్లగొట్టబడ్డారు. వారి పాప ప్రభావాలను మనం నేడు కూడా అనుభవిస్తున్నాము. (ఆదికాండము 2:16, 17; 3:1-6, 16-19, 24; రోమీయులు 5:12) కాని జరిగినదాని నుండి మనం నేర్చుకున్నామా? దేవుని ప్రేమకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము? మనం ప్రతి రోజూ తీసుకునే నిర్ణయాలు మనం ఆయన ప్రేమను మెచ్చుకుంటున్నామని చూపిస్తున్నాయా?—1 యోహాను 5:3.
7. ఆదాము హవ్వలు అలా చేసినప్పటికీ, వారి సంతానం ఎడల యెహోవా ఎలా ప్రేమ చూపించాడు?
7 దేవుడు తమ కొరకు చేసినదానంతటిని మన మొదటి మానవ తలిదండ్రులు ఎంత మాత్రం మెప్పుదలను కనపరచనప్పటికీ అది, దేవుని సొంత ప్రేమను అణిచివేయలేదు. అప్పటికింకా జన్మించని మానవుల ఎడల—వాళ్లలో చేరివున్న నేడు జీవిస్తున్న మన ఎడలగల అభిమానంతో దేవుడు ఆదాము హవ్వలు మరణించక ముందు ఒక కుటుంబాన్ని ఉత్పన్నం చేయడానికి వారిని అనుమతించాడు. (ఆదికాండము 5:1-5; మత్తయి 5:44, 45) ఆయనలా చేసివుండకపోతే, మనమెవరమూ జన్మించి ఉండేవాళ్లం కాదు. యెహోవా తన చిత్తాన్ని క్రమంగా బయల్పర్చడం ద్వారా, ఆదాము సంతానంలోని విశ్వసించే వారందరికీ నిరీక్షణకు ఒక ఆధారాన్ని ఆయన అనుగ్రహించాడు. (ఆదికాండము 3:15; 22:18; యెషయా 9:6, 7) ఆదాము పోగొట్టుకున్నదాన్ని, అంటే దేవుని విశ్వ కుటుంబంలోని అంగీకృత సభ్యులుగా పరిపూర్ణ జీవితాన్ని, అన్ని జనాంగాలకు చెందిన ప్రజలు తిరిగి పొందగలిగే మార్గం ఆయన ఏర్పాటులో ఇమిడి ఉంది. విమోచన క్రయధనాన్ని అనుగ్రహించడం ద్వారా ఆయనిది చేశాడు.
విమోచన క్రయధనం ఎందుకు?
8. ఆదాము హవ్వలు మరణించినప్పటికీ విధేయులైన, వారి సంతానంలోని వారెవరూ మరణించనవసరం లేదని దేవుడు ఆజ్ఞ ఎందుకు జారీ చేయలేదు?
8 మానవ జీవం రూపంలో విమోచన క్రయధనాన్ని చెల్లించడం నిజంగా అవసరమై ఉందా? ఆదాము హవ్వలు తమ తిరుగుబాటునుబట్టి మరణించవలసి ఉన్నప్పటికీ, వారి సంతానంలోని వారందరిలో దేవునికి విధేయత చూపించేవారు నిరంతరం జీవించవచ్చునని దేవుడు ఆజ్ఞ జారీ చేసి ఉండలేడా? ముందు చూపులేని మానవ దృక్కోణం నుండి అది సహేతుకమైనదిగానే అనిపించవచ్చు. అయితే, యెహోవా “నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు.” (కీర్తన 33:5) ఆదాము హవ్వలు పాపులైన తర్వాతనే వారికి పిల్లలు జన్మించారు; కాబట్టి ఆ పిల్లలెవరూ పరిపూర్ణులుగా జన్మించలేదు. (కీర్తన 51:5) వారందరూ పాపాన్ని సంతరించుకున్నారు, పాపానికి జరిమానా మరణము. యెహోవా దీన్ని అలక్ష్యం చేసివుంటే, అది ఆయన విశ్వ కుటుంబ సభ్యులకు ఎలాంటి మాదిరిని ఉంచివుండేది? ఆయన తన స్వంత నీతియుక్తమైన ప్రమాణాలను అలక్ష్యం చేయలేడు. ఆయన న్యాయం కోరేవాటిని గౌరవించాడు. సంబంధిత వివాదాంశాలతో దేవుడు వ్యవహరించిన విధానంలో ఎవరూ ఎన్నడూ న్యాయంగా తప్పు పట్టుకోలేరు.—రోమీయులు 3:21-23.
9. దైవిక న్యాయ ప్రమాణం ప్రకారం, ఏ విధమైన విమోచన క్రయధనం అవసరమైంది?
9 మరైతే, యెహోవా ఎడల ప్రేమపూర్వక విధేయత చూపే ఆదాము సంతానంలోని వారిని విడిపించడానికి తగిన ఆధారాన్ని ఎలా అందజేయవచ్చు? న్యాయం ప్రకారం, ఒక పరిపూర్ణ మానవుడు బలిగా మరణిస్తే, విమోచన క్రయధనమందు విశ్వాసముంచి దాన్ని అంగీకరించేవారి పాపాలకు ఆ పరిపూర్ణ జీవితం యొక్క విలువ సరిపోతుంది. ఆదాము అనే వ్యక్తి చేసిన పాపం మానవ కుటుంబమంతా పాపులు కావడానికి కారణమయ్యింది గనుక, మరో పరిపూర్ణ మానవుడు చిందించిన రక్తం, తగిన విలువలా, న్యాయాన్ని సమతూకం చేస్తుంది. (1 తిమోతి 2:5, 6) కాని అలాంటి వ్యక్తిని ఎక్కడ కనుగొనవచ్చు?
ఆ మూల్యం ఎంత గొప్పది?
10. అవసరమైన విమోచన క్రయధనాన్ని ఆదాము సంతానం ఎందుకు అందజేయలేకపోయింది?
10 ఆదాము పోగొట్టిన జీవిత ఉత్తరాపేక్షలను తిరిగి కొనడానికి అవసరమైనది ఇవ్వగలవారు పాపియైన ఆదాము సంతానంలో, ఎవరూ లేకుండిరి. “ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన 49:7-9) ఏదారీ లేకుండా మానవజాతిని విడిచిపెట్టే బదులు, యెహోవా దయతో తానే ఒక ఏర్పాటు చేశాడు.
11. తగిన విమోచన క్రయధనం కొరకు అవసరమైన పరిపూర్ణ మానవ జీవాన్ని యెహోవా దేని ద్వారా అందజేశాడు?
11 మానవజన్మ ఎత్తిన తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా మరణించినట్లు నటించి, ఒక ఆత్మగా ఇంకా జీవిస్తూనే ఉండేలా, యెహోవా ఒక దేవదూతను భూమిపైకి పంపించలేదు. బదులుగా, సృష్టికర్తయైన దేవుడు మాత్రమే సంకల్పించగల ఒక అద్భుతాన్ని చేయడం ద్వారా ఆయన ఒక పరలోక కుమారుని జీవశక్తినీ వ్యక్తిత్వ మాదిరిని యూదా గోత్రానికి చెందిన హేలీ కుమార్తెయైన మరియ అనే స్త్రీ గర్భంలోకి మార్చాడు. దేవుని చురుకైన శక్తియైన ఆయన పరిశుద్ధాత్మ తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుదలను కాపాడింది, ఆ బిడ్డ పరిపూర్ణ మానవునిగా జన్మించాడు. (లూకా 1:35; 1 పేతురు 2:22) దైవిక న్యాయం కోరేవాటన్నిటినీ పూర్తిగా సంతృప్తిపరిచే విమోచన క్రయధనాన్ని అందజేయడానికి కావలసిన మూల్యం ఆయన ఆధీనంలో ఉంది.—హెబ్రీయులు 10:5.
12. (ఎ) యేసు ఏ భావంలో దేవుని ‘అద్వితీయ కుమారుడు’? (బి) విమోచన క్రయధనాన్ని అందజేయడానికి దేవుడు ఈయనను పంపించడం, మన ఎడల ఆయనకున్న ప్రేమను ఎలా నొక్కి తెలియజేసింది?
12 యెహోవా తన కోటానుకోట్ల పరలోక కుమారుల్లో ఎవరికి ఈ పనిని అప్పగించాడు? లేఖనాల్లో తన ‘అద్వితీయ కుమారుడు’ అని వర్ణింపబడినవానికే అప్పగించాడు. (1 యోహాను 4:9) ఈ పదం, ఆయన మానవునిగా జన్మించినప్పుడు ఏమయ్యాడనేదాన్ని వివరించడానికి కాదుగాని దానికి ముందు ఆయన పరలోకంలో ఏమైవున్నాడనేది వివరించడానికి ఉపయోగించబడింది. యెహోవా ఆయనను మాత్రమే ఎవరి సహకారం లేకుండా, స్వయంగా సృష్టించాడు. ఆయన సర్వసృష్టికీ ఆదిసంభూతుడు. ఇతర జీవులన్నిటినీ ఉనికిలోకి తేవడానికి దేవుడు ఆయననే ఉపయోగించుకున్నాడు. ఆదాము దేవుని కుమారుడైనట్లే, దేవదూతలు దేవుని కుమారులు. కాని యేసు “తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ” కలిగివున్నట్లు వర్ణించబడ్డాడు. ఆయన “తండ్రి రొమ్మున” ఉన్నట్లు చెప్పబడ్డాడు. (యోహాను 1:14, 18) తండ్రితో ఆయనకున్న సంబంధం సన్నిహితమైనది, ఆంతరంగికమైనది, కోమలమైనది. మానవజాతి ఎడల తన తండ్రికున్నట్లుగానే ఆయనకూ ప్రేమ ఉంది. ఈ కుమారుని గురించి ఆయన తండ్రి ఎలా భావిస్తున్నాడనేది, మానవజాతి గురించి కుమారుడు ఎలా భావిస్తున్నాడో సామెతలు 8:30, 31 వచనాలు ఇలా వ్యక్తపరుస్తున్నాయి: “నేను ఆయన [యెహోవా] యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. . . . నరులను చూచి [యెహోవా యొక్క ప్రధానశిల్పి మరియు జ్ఞానము యొక్క మూర్తిమంతమునైన యేసు] ఆనందించుచునుంటిని.” విమోచన క్రయధనాన్ని అందజేయడానికి దేవుడు ఈ అత్యంత అమూల్యమైన కుమారున్నే భూమిపైకి పంపించాడు. కాబట్టి, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుని . . . అనుగ్రహించెను” అని యేసు చేసిన వ్యాఖ్యానం ఎంత అర్థవంతమైనదో కదా!—యోహాను 3:16.
13, 14. అబ్రాహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి ప్రయత్నించడాన్ని గూర్చిన బైబిలు వృత్తాంతము యెహోవా చేసిన దేనిని మెచ్చుకోవడానికి మనకు సహాయం చేయాలి? (1 యోహాను 4:10)
13 దాని భావమేమిటో కొంతమేరకు గ్రహించేందుకు మనకు సహాయం చేయడానికి, యేసు భూమి మీదికి రావడానికి చాలా కాలం ముందు, దాదాపు 3,890 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రాహాముకు, “నీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించుమని” ఉపదేశించాడు. (ఆదికాండము 22:1, 2) విశ్వాసంతో, అబ్రాహాము విధేయుడయ్యాడు. మిమ్మల్ని మీరు అబ్రాహాము స్థానంలో ఉంచుకోండి. అదే మీ కుమారుడైతే, మీకు ఎంతో ఇష్టమైన మీ ఏకైక కుమారుడైతే ఏమై ఉండేది? దహనబలి కొరకు కర్రలను విరుస్తుండగా, మోరీయా దేశానికి అనేక దినాలు ప్రయాణిస్తుండగా, మీ కుమారున్ని బలపీఠం మీద పడుకోబెడుతుండగా మీకు ఎలాంటి భావాలు కలుగుతాయి?
14 వాత్సల్యంగల తల్లికి/తండ్రికి అలాంటి భావాలు ఎందుకుంటాయి? దేవుడు మానవున్ని తన స్వరూపమందు సృష్టించాడని ఆదికాండము 1:27 తెలియజేస్తుంది. మన ప్రేమా వాత్సల్యపూరిత భావాలు యెహోవా స్వంత ప్రేమా వాత్సల్యాలను చాలా పరిమితమైన విధంగా ప్రతిబింబిస్తాయి. అబ్రాహాము విషయంలో, దేవుడు జోక్యం చేసుకున్నాడు, కాబట్టి ఇస్సాకు వాస్తవంగా బలి ఇవ్వబడలేదు. (ఆదికాండము 22:12, 13; హెబ్రీయులు 11:17-19) అయితే, ఆయన స్వంత విషయములో, అది తనకు తన కుమారునికి ఎంత కష్టమైనప్పటికీ, విమోచన క్రయధనాన్ని అందజేయడంలో యెహోవా వెనుకంజ వేయలేదు. దేవుడు చేసినది ఆయనకు బాధ్యత ఉన్నందువల్ల చేసింది కాదుగాని, బదులుగా, విశేషమైన కృప మూలంగా ఆయనలా చేశాడు. దానికి మనం పూర్తిగా మెప్పుదలను కనపరుస్తున్నామా?—హెబ్రీయులు 2:9.
అది దేన్ని సాధ్యపరుస్తుంది
15. విమోచన క్రయధనం ఈ ప్రస్తుత విధానంలో కూడా జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?
15 దేవుడు చేసిన ఆ ప్రేమపూర్వక ఏర్పాటునందు విశ్వాసముంచి, దాన్ని అంగీకరించేవారి జీవితాలపై అది ప్రగాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. పాపం మూలంగా మునుపు వారు దేవుని నుండి దూరం చేయబడ్డారు. ఆయన వాక్యం చెబుతున్నట్టుగా, వారు ‘తమ దుష్‌క్రియలవలన తమ మనస్సులో విరోధభావముగలవారైయుండిరి.’ (కొలొస్సయులు 1:21-23) కాని వారు ‘ఆయన కుమారుని మరణముద్వారా దేవునితో సమాధానపరచబడ్డారు.’ (రోమీయులు 5:8-10) తమ జీవన విధానాన్ని మార్చుకున్నందున, క్రీస్తు బలియందు విశ్వాసముంచే వారికి దేవుడు సాధ్యం చేసే క్షమాపణను అంగీకరించినందున, వారికి స్వచ్ఛమైన మనస్సాక్షి అనుగ్రహించబడింది.—హెబ్రీయులు 9:14; 1 పేతురు 3:21.
16. విమోచన క్రయధనమందు విశ్వాసముంచినందున చిన్న మందకు ఏ ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి?
16 యెహోవా భూమిఎడల తనకున్న ఆది సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో, పరలోక రాజ్యంలో తన కుమారునితో సహవసించే కృపా అనుగ్రహాన్ని వీరిలో పరిమితమైన సంఖ్యకు మాత్రమే అంటే చిన్న మందకు మాత్రమే అందజేశాడు. (లూకా 12:32) వీరు ‘తమ దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉండునట్లు ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలోనుండి, ప్రతి ప్రజలోనుండి, ప్రతి జనములోనుండి’ తీసుకోబడ్డారు, ‘వారు భూలోకమందు ఏలుదురు.’ (ప్రకటన 5:9, 10) అపొస్తలుడైన పౌలు వీరికిలా వ్రాశాడు: “మీరు . . . దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; . . . క్రీస్తుతోడి వారసులము.” (రోమీయులు 8:15-17) దేవుడు వారిని తన కుమారులుగా దత్తత తీసుకోవడంలో, ఆదాము పోగొట్టుకున్న సంబంధాన్ని ఆనందించే అవకాశం వారికి అనుగ్రహించబడింది; కాని ఈ కుమారులకు, ఆదాము ఎన్నడూ పొందని పరలోక సేవలనే అదనపు ఆధిక్యతలు అనుగ్రహించబడతాయి. అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు: “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి”! (1 యోహాను 3:1) అలాంటి వారి ఎడల దేవుడు కేవలం సూత్రబద్ధమైన ప్రేమనే (అగాపే) కాదుగాని కృపాబాహుళ్యాన్ని (ఫిలియా) కూడా చూపిస్తాడు, అది నిజమైన స్నేహితుల మధ్యనుండే బంధం యొక్క ప్రత్యేకత.—యోహాను 16:27.
17. (ఎ) విమోచన క్రయధనమందు విశ్వాసముంచే వారందరికీ, ఏ అవకాశం ఇవ్వబడింది? (బి) ‘దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం’ వారికి ఏ భావాన్ని కలిగివుంటుంది?
17 ఇతరులకూ అంటే యేసుక్రీస్తు ద్వారా జీవాన్ని పొందేలా దేవుడు చేసిన ఉదారమైన ఏర్పాటునందు విశ్వాసముంచే వారందరికీ, ఆదాము పోగొట్టుకున్న అమూల్యమైన సంబంధాన్ని పొందే అవకాశాన్ని యెహోవా అందజేస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు [అంటే, క్రీస్తుతోపాటు పరలోక రాజ్యానికి వారసులైన దేవుని కుమారులు మానవజాతి కొరకు అనుకూల చర్యగైకొంటున్నట్లు స్పష్టమయ్యే సమయం కొరకు వారు ఎదురుచూస్తారు] సృష్టి [ఆదాము నుండి వచ్చిన మానవ సృష్టి] మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో [వారు మరణమునొందే ఉత్తరాపేక్షతో పాపంలో జన్మించారు, వారు తమను తాము విడిపించుకోవడానికి ఏ మార్గము లేకుండినది] నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను [దేవుడిచ్చిన] నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను.” (రోమీయులు 8:19-21) ఆ స్వేచ్ఛ భావమేమై ఉంటుంది? వారు పాప మరణాల దాసత్వం నుండి విడుదలపొందడమై ఉంటుంది. వారు మానసికంగా మరియు శారీరకంగా పరిపూర్ణులై, పరదైసును తమ గృహంగా పొంది, తమ పరిపూర్ణతను ఆనందిస్తూ, అద్వితీయ సత్య దేవుడైన యెహోవా ఎడల తమ మెప్పును వ్యక్తపర్చడానికి నిత్యజీవాన్ని పొందుతారు. ఇదంతా ఎలా సాధ్యం చేయబడింది? దేవుని అద్వితీయ కుమారుని విమోచన క్రయధన బలి ద్వారా సాధ్యం చేయబడింది.
18. మార్చి 23న సూర్యాస్తమయం తర్వాత, మనం ఏమి చేస్తాము, ఎందుకు?
18 సా.శ. 33, నీసాను 14న, యెరూషలేములోని ఒక మేడగదిలో, యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించాడు. ఆయన మరణాన్ని గూర్చిన వార్షిక జ్ఞాపకార్థ ఆచరణ నిజ క్రైస్తవులందరి జీవితాల్లో ముఖ్య ఘటన అయ్యింది. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” యేసు తానే ఆజ్ఞాపించాడు. (లూకా 22:19) 1997లో మార్చి 23న సూర్యాస్తమయం తర్వాత (అంటే నీసాను 14 ప్రారంభమయ్యేటప్పుడు) జ్ఞాపకార్థ ఆచరణ జరుగుతుంది. ఆ రోజున, ఈ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరు కావడంకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది మరేది ఉండదు.
మీరెలా సమాధానమిస్తారు?
◻ దేవుడు మానవజాతి ఎడల అపారమైన ప్రేమను ఏ యే విధాలుగా చూపించాడు?
◻ ఆదాము సంతానాన్ని విమోచించడానికి పరిపూర్ణ మానవ జీవం ఎందుకు అవసరమైంది?
◻ యెహోవా ఏ గొప్ప మూల్యాన్ని చెల్లించి క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు?
◻ విమోచన క్రయధనం దేన్ని సాధ్యం చేసింది?
[10వ పేజీలోని చిత్రం]
దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను