రాజ్య ప్రచారకుల నివేదిక
అన్ని విధాల వారికి సత్యాన్ని అందివ్వడం
అపొస్తలుడైన పౌలు దేవుని రాజ్యాన్ని ఆసక్తితో ప్రకటించాడు. “సువార్తను” ప్రకటించే తన నియామకానికి వ్యతిరేకత అడ్డు వచ్చేందుకు ఆయన అనుమతించలేదు. (1 కొరింథీయులు 9:16; అపొస్తలుల కార్యములు 13:50-52) తన మాదిరిని అనుసరించమని పౌలు ఇతరులను పురికొల్పాడు.—1 కొరింథీయులు 11:1.
యెహోవాసాక్షులు పట్టుదలతో చేసే తమ ప్రచార ప్రయత్నాలనుబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచారు. నిజానికి, తమకు దేవుడు నియమించిన పనియైన ‘శిష్యులను చేసే’ పనిని జరిగించడంలో, వారు “సమయమందును అసమయమందును” ఇతరులతో మాట్లాడతారు. (మత్తయి 28:19, 20; 2 తిమోతి 4:2) తాము వ్యతిరేకతను అనుభవించే దేశాల్లో కూడా, యథార్థ హృదయులైన వారికి దేవుని రాజ్యాన్ని గురించిన అత్యంత ప్రాముఖ్యమైన వర్తమానం అందించబడుతోంది, ఆ విషయాన్ని ఈ క్రింది అనుభవాలు చూపుతున్నాయి.
◻ యెహోవాసాక్షుల పని నిషేధించబడిన పశ్చిమ పసిఫిక్‌లోని ఒక ద్వీపంనందు, 12 సంవత్సరాల అబ్బాయి తన పాఠశాలలో చెడు సహవాసులు ఉన్నారని గమనించాడు. అతని తరగతి విద్యార్థుల్లో అనేకులు క్రమంగా సిగరెట్టు త్రాగేవారు, అశ్లీల సాహిత్యాలు చదివేవారు, ఉపాధ్యాయులను వేధించేవారు మరియు కొట్లాడుకునే వారు. ఆ పరిస్థితి ఎంతగా క్షీణించిందంటే ఆ అబ్బాయి తాను వేరే పాఠశాలకు మారగలనా అని తన తండ్రిని అడిగాడు. అయితే, అతని తండ్రి అలాంటి ఆలోచనకు వ్యతిరేకంగా తన కుమారునితో తర్కించాడు, ఎందుకంటే దగ్గర్లోని ఇతర పాఠశాలల్లోని విద్యార్థుల ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని అతడు భావించాడు. అయినప్పటికీ, అతడు తన కుమారునికి ఎలా సహాయం చేస్తాడు?
యౌవనస్థుల కొరకు ఒక పుస్తకం తన ఇంట్లో ఉన్నట్లు తండ్రికి జ్ఞాపకం ఉంది. తన బంధువైన ఒక యెహోవాసాక్షి దాన్ని బహూకరించాడు. కాబట్టి అతడు ఆ పుస్తకం కొరకు వెదికి, కనుగొన్న తర్వాత దాన్ని తన కుమారునికిచ్చాడు. దాని పేరు యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం).a “నేను నా స్నేహితుల ఒత్తిడిని ఎలా తట్టుకోగలను?” అనే అధ్యాయం తనకు విశేషంగా సహాయకరంగా ఉంటుందని ఆ అబ్బాయి కనుగొన్నాడు. స్వగౌరవాన్ని కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను నేర్పడమే కాకుండా, ఒక అవివేకపు పనిని చేయమని ఇతరులు తనపై ఒత్తిడి తెచ్చినప్పుడు వద్దు అని యుక్తిగా ఎలా చెప్పాలో కూడా అది అతనికి నేర్పింది. ఆ పుస్తకంలో ఉన్న లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా, స్నేహితుల ఒత్తిడిని ఎలా విజయవంతంగా తట్టుకోవాలో ఆ యౌవనస్థుడు నేర్చుకున్నాడు.
తన కుమారునిలో ఈ మార్పులను, ఇతర అనుకూలమైన మార్పులను గమనించి, తండ్రి ఆ పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పుస్తకంలో కనుగొనబడే ఆచరణాత్మక సలహాలనుబట్టి ప్రభావితుడై, తండ్రి గృహ బైబిలు పఠనం కావాలని యెహోవాసాక్షులను అడిగాడు. తర్వాత, అతని కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా పఠించడం ప్రారంభించారు. ఫలితం? ఆ అబ్బాయి, అతని తమ్ముడు, అతని తండ్రి, ఆ అబ్బాయి తాతయ్య మామ్మలు ఇప్పుడు యెహోవాసాక్షులు.
◻ అదే దేశంలో, బైబిలు సూత్రాలకు కచ్చితంగా విధేయత చూపినందుకు ఇద్దరు యెహోవాసాక్షులు చెరసాలలో వేయబడ్డారు. అయితే, దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా మాట్లాడడాన్ని తమ పరిస్థితి తమను ఆటంకపర్చేందుకు వారు అనుమతించలేదు. వారు జైలు అధికారిని సమీపించి, ప్రభువు రాత్రి భోజనాన్ని అక్కడ జరుపుకునేందుకు అనుమతిని పొందారు. అయితే 14 మంది ఖైదీలు బైబిలునందు ఆసక్తిని చూపి, ఈ ప్రాముఖ్యమైన సందర్భంలో సాక్షులతో కలిసి కూడుకున్నప్పుడు వారిద్దరూ ఎంతగా సంతోషించి ఉంటారో కదా! వారు విడుదల చేయబడిన తర్వాత, కొందరు యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తూ, వారితో సహవసించడాన్ని కొనసాగించారు.
యెహోవాసాక్షులు 25 కంటే ఎక్కువ దేశాల్లో, నిషేధం లేక ఇతర విధాలైన వ్యతిరేకత లేక హింస మూలంగా కష్టాలను అనుభవిస్తున్నారు. అయితే, అపొస్తలులవలె, వారు “ప్రతిదినము . . . మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించ”డంలో కొనసాగుతున్నారు.—అపొస్తలుల కార్యములు 5:42.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ వారు ప్రచురించినది.