దైవిక శాంతి సందేశకులు సమావేశమయ్యారు
“మేము హాజరైన ప్రతి జిల్లా సమావేశం ద్వారా ప్రోత్సహింపబడ్డాము” అని అమెరికాలోని ఒక క్రైస్తవ పెద్ద అంటున్నాడు. “అయితే, ఈ సంవత్సరం అసలు వర్ణింపలేనంత గొప్పగా ఉంది. మేము ప్రతిరోజు సమావేశం తర్వాత మరుసటి దిన కార్యక్రమం మేమూహించిన దానికంటే ఎంత గొప్పగా ఉంటుందో అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లే వాళ్లం, మరి మేము నిరాశ చెందలేదు!”
“దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో ఒక దానికి మీరు హాజరైనట్లయితే, సమావేశానికి హాజరైన ఉత్సాహంగల ఈ వ్యక్తితో ఏకీభవిస్తారు. దేవుని సందేశకులుగా యెహోవాసాక్షులు చేస్తూ ఉండాల్సిన నియామకం యొక్క విభిన్న అంశాలను సమావేశంలోని ఒక్కొక్క దినం చూపుతూ వచ్చింది. మనం ఆ మూడు దినాల కార్యక్రమాన్ని వునఃపరిశీలిద్దాము.
‘శాంతిని ప్రచురించువాడు . . . ఎంత సుందరుడు’
సమావేశపు మొదటి దిన అంశం అది. అది యెషయా 52:7పై ఆధారపడి ఉంది. ఈ కష్ట సమయాల్లో, అనేకులు సవాలుతోకూడిన పరిస్థితుల్లో యెహోవాను సేవిస్తున్నారు. “ఆసక్తిగల శాంతి ప్రచారకులు చెప్పేది వినుట” అనే ప్రసంగంలో ఈ నమ్మకస్థుల్లో కొందరిని పరిచయం చేయడం కూడా ఇమిడివుంది. వారి వ్యక్తిగత భావాలను వినడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండినది, తాము సహించేందుకు తమకు ‘బలాధిక్యమును’ ఇచ్చి యెహోవా బలపర్చగలడని సమావేశానికి హాజరైనవారు నిశ్చయతను పొందారు.—2 కొరింథీయులు 4:7.
యెహోవా కోరేవి భారమైనవి కావు. (1 యోహాను 5:3) ఉదయకాల కార్యక్రమంలోని చివరి ప్రసంగంలో ఇది స్పష్టం చేయబడింది. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే పేరుగల 32 పేజీల బ్రొషూర్‌ను విడుదల చేయడంతో ఆవేళ కార్యక్రమం ముగిసింది. అందమైన బొమ్మలుగల ఈ క్రొత్త పఠన ఉపకరణం, దేవుని సంకల్పాన్ని గురించి అనేకులు నేర్చుకునేందుకు సహాయం చేయడంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ క్రొత్త ప్రచురణను ఉపయోగించుటను గూర్చిన వ్యాఖ్యానాలను ఈ పత్రికలోని చివరి పఠన శీర్షికలోను మరియు 16, 17 పేజీల్లోను చూడవచ్చు.
యెహోవాకు మన శ్రమలను గురించి బాగా తెలుసు అనే విషయాన్ని “మంచిపనిలో సహనం చూపుట” అనే ప్రసంగం నొక్కిచెప్పింది. సహించడం అంటే ఓర్చుకుని నిరీక్షణను వదులుకోకుండా ఉండటమని అర్థం. యెహోవా మనకు తోడ్పడేందుకు తన వాక్యాన్ని, తన ఆత్మను మరియు తన సంస్థను ఇచ్చాడు. ప్రకటించాలంటే ఎంతో సహనం కావాలి, అయిననూ మనం సహించేందుకు ప్రకటనాపని మనకు సహాయం చేస్తుంది, ఎందుకంటే అది మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతుంది. గమ్యానికి ఇంత దగ్గర్లో ఉన్న మనం, మన సమస్యలు మన ఆసక్తిని సన్నగిల్లేలా చేయనివ్వకూడదు, ఎందుకంటే అంతము వరకూ సహించేవారే రక్షింపబడతారు.—మత్తయి 24:13.
“దైవిక శాంతి సందేశకులుగా మనపాత్ర” అనే ముఖ్యాంశ ప్రసంగం చెరలోనున్న యూదులు బబులోను నుండి విడుదల చేయబడటం మరియు సా.శ.పూ. 537లో యెరూషలేము నందు పవిత్రారాధన పునఃస్థాపించబడటం వైపుకు అవధానాన్ని మళ్లించింది. దేవుని రాజ్యం ప్రపంచవ్యాప్తంగా త్వరలో ఏమి సాధిస్తుందో దానికి ఈ సంఘటన ఒక మచ్చుతునక మాత్రమేనని ప్రసంగీకుడు వివరించాడు. (కీర్తన 72:7; యెషయా 9:7) ఈ రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించి, ఆ వర్తమానానికి అనుగుణ్యంగా జీవించాలన్నదే మన ప్రస్తుత నియామకం. దేవుని ఎడల, మన పొరుగువారి ఎడలగల ప్రేమ మనం ఈ పనిని ఎడతెగక చేయడంలో కొనసాగేందుకు మనలను పురికొల్పాలి.—అపొస్తలుల కార్యములు 5:42.
“వినోదంలో దాగివున్న ఉరులను పసిగట్టండి” అనే గోష్ఠి శుక్రవారం కార్యక్రమంలోని ఒక ఉన్నతాంశం. నేటి సంగీతం, చలనచిత్రాలు, వీడియోలు, దూరదర్శిని ప్రదర్శనలు, వీడియో ఆటలు, పుస్తకాలు, పత్రికలు మరియు కామిక్‌లు తరచూ దయ్యాల ఆలోచనావిధానాన్ని ప్రతిబింబిస్తాయి. కాబట్టి, మనం “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని” ఉండవలసిన అవసరత ఉంది. (రోమీయులు 12:9) అవును, మనం నీచమైన వినోదాన్ని అసహ్యమైనదానిగా పరిగణించాలి మరియు దాన్ని త్యజించాలి, అదే సమయంలో మనం పవిత్రమైన, రమ్యమైన మరియు ఖ్యాతిగల వాటిని గురించి ధ్యానించాలి. (ఫిలిప్పీయులు 4:8) యెహోవా సంస్థ ద్వారా అందించబడిన ప్రచురణలు మరియు పరిశోధనా పరికరాలు పురికొల్పే తలంపులతో మన మనస్సులను ప్రేరేపిస్తాయి మరియు మంచి చెడ్డలను పరిశీలించి చూసేందుకు మనకు తర్ఫీదునిస్తాయి. (హెబ్రీయులు 5:14) అల్లకల్లోలంగా వున్న సముద్రంలో మనం ఒక తెప్పను ఎలా పట్టుకుంటామో అలా మనం ఈ ఏర్పాట్లకు హత్తుకుని ఉండాలి.
తర్వాత, “అపవాదిని ఎదిరించండి—ఎలాంటి పోటీనైనా సహించకండి” అనే ప్రసంగం ఇవ్వబడింది. వారు వాగ్దాన దేశంలోకి ప్రవేశించేందుకు కొంచెంముందు, వేలాదిమంది ఇశ్రాయేలీయులు జారత్వం ఉరిలో చిక్కుకుపోయారు. ఫీనెహాసు సత్యారాధనకు ఎలాంటి పోటీని సహించలేదు. అతను తప్పిదస్థుల ఎడల తీవ్రమైన చర్య తీసుకున్నాడు, అతని అనితరభక్తి యెహోవాను ప్రీతిపర్చింది. (సంఖ్యాకాండము 25:1-13) మనలో ప్రతి ఒక్కరినీ దేవుని నూతన లోకంలో ప్రవేశించేందుకు అయోగ్యులనుగా చేయాలన్నదే సాతాను లక్ష్యం. కాబట్టి మనలను భ్రష్టులను చేయాలన్న అపవాది ప్రయత్నాలను మనం ఫీనెహాసు ఎదిరించినట్లు ఎదురించాలి. మనం వివాహితులమైనా, ఒంటరివారమైనా, మనం “జారత్వమునకు దూరముగా పారిపో”వాలి.—1 కొరింథీయులు 6:18.
“దేవునివాక్య యథార్థతను నమ్మకంగా సమర్థించుట” అనేది సమావేశంలోని మొదటి దినపు ముగింపు ప్రసంగం. అనేక అనువాదకులు లేఖనాలను మార్చుతారు లేక కొన్ని భాగాలను తీసేస్తారు. ఉదాహరణకు, స్త్రీల హక్కుల ఉద్యమకారులను ప్రీతిపర్చేందుకు, ద న్యూ టెస్టమెంట్ అండ్ సామ్స్: ఎన్ ఇంక్లూసివ్ వర్షన్ యొక్క అనువాదకులు దేవున్ని తండ్రి అని కాకుండా తండ్రి-తల్లి అని మరియు యేసును “మనుష్య కుమారుడు” అని కాకుండా “మానవ జీవి” అని సంభోదిస్తున్నారు. దానికి బదులుగా, నూతన లోక అనువాదం ఆదిమ భాష మూలపాఠానికి ఎంత నమ్మకంగా హత్తుకుని ఉందంటే, అనేక లేఖనాధార విషయాల్లో మన ఆలోచనను సరిచేసేందుకు అది తోడ్పడింది. ఉదాహరణకు, ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “నూతన లోక అనువాదంలోని కచ్చితమైన అనువాదం, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో స్థాపించబడిన పద్ధతికి చాలా అనుగుణ్యంగా ఉండేలా పెద్దలసభలను స్థాపించడం ద్వారా సంఘాలను పునఃసంస్థీకరించుకునేందుకు మనకు ఆధారాన్ని అందించింది.” దేవుని వాక్యాన్ని అనుదినం చదవడం ద్వారా, దాని సలహాలను అన్వయించుకోవడం ద్వారా మనం దాని ఎడల మనకుగల యథార్థతను ప్రదర్శిస్తాము. ప్రసంగీకుడు ఇంకా ఇలా అన్నాడు: “ఆసక్తితో దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం ద్వారా మరియు అది చెప్పే విషయాలు మన తలంపులకు అనుగుణంగా ఉండేలా చేయడానికి వాటిని మలిచేందుకు లేక విడమర్చేందుకు ఎన్నడూ ప్రయత్నించకుండా ఉంటూ ఇతరులకు దాన్ని బోధించడం ద్వారా మనం దేవుని వాక్యం యొక్క యథార్థమైన మద్దతుదారులమని చూపుతాము.”
“సమస్త జ్ఞానమునకు మించిన దేవుని శాంతి”
ఫిలిప్పీయులు 4:7, NW పై ఆధారపడిన ఈ అంశం, సమావేశం యొక్క రెండవ దినానికి పునాది వేసింది. అక్కడ అందించబడిన సమాచారంలో అధికభాగం ఒకరి పరిచర్య, కుటుంబం, సమర్పణ మరియు అనుదిన జీవితం యొక్క ఇతర అంశాలను గురించిన సరైన దృక్పథాన్ని చూపించింది.
దిన వచన చర్చ తర్వాత, “శాంతి సువార్తను తెస్తున్న సందేశకులు” అనే అంశంగల గోష్ఠి అందించబడింది. మన వర్తమానం శాంతికరమైనది, అది శాంతియుతమైన పద్ధతిలో అందించబడాలి. (ఎఫెసీయులు 6:15) మన ఉద్దేశం హృదయాలను గెలవాలన్నదే కానీ వాదనలను గెలవాలన్నది కాదు. యెహోవా సంస్థనుండి మనకు లభించే తర్ఫీదు, ప్రచురణలూ మనం సరిగ్గా అదే చేసేందుకు మనకు సహాయపడతాయి. విముఖత లేక అనాసక్తత మనలను నిరుత్సాహపర్చేందుకు మనం అనుమతించకూడదు. బదులుగా, వ్యక్తిగత పఠనం, కూటాలకు హాజరవ్వడం మరియు ప్రకటనాపనిలో భాగంవహించడం వంటివాటితో కూడిన చక్కని పట్టికను కలిగుండి, ‘జాగ్రత్తగా ఉండటంలో [“మనకు సాధ్యమైనంత ఎక్కువ చేయడంలో,” NW]’ కొనసాగాలి. (2 తిమోతి 2:15) ఇతరులకు, ప్రాముఖ్యంగా మనకు విశ్వాస విషయంలో సంబంధీకులైన వారికి మంచి చేయడాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. (గలతీయులు 6:10) అయితే మనకు సాధ్యమైనంత ఎక్కువ చేయడమంటే మనం అలిసిపోయేంతగా చేయడమని అర్థం కాదు. ప్రతి ఒక్కరు తమ సామర్థ్యం మరియు పరిస్థితికి అనుగుణంగా ఎంత చేయగలరో అదే యెహోవాకు అంగీకారమైనది.
దేవుని ప్రజలు రాజ్యాసక్తులను వృద్ధి చేసేందుకు తమ సమయాన్ని, శక్తిని మరియు వనరులను వెచ్చిస్తారు. గొర్రెవంటి వారు అనేకులు రాజ్యవర్తమానానికి ప్రతిస్పందిస్తుండగా, అదనపు ఉపకరణాలు, కూటాల స్థలాలు మరియు బ్రాంచి సౌకర్యాల అవసరత మరింత ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని “యెహోవాసంస్థలోనే ఆనందంతో ఇచ్చుట” అనే ప్రసంగం స్పష్టంగా వివరించింది. ప్రపంచవ్యాప్త ప్రకటనాపనిని సాధించేందుకు ఏది అవసరమైనా దాన్ని కలిగి ఉండేందుకు మనమిచ్చే చందాలు సంస్థకు వీలు కలిగిస్తాయి. ఉదారంగా ఇవ్వడం యెహోవాను కూడా ఘనపర్చుతుంది, ఇచ్చు వారికి ఆనందాన్ని తెస్తుంది. కాబట్టి, మన ఆరాధన యొక్క ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని క్రైస్తవులముగా మనం నిర్లక్ష్యం చేయకూడదు.—2 కొరింథీయులు 8:1-7.
ఉదయకాల కార్యక్రమం బాప్తిస్మ ప్రసంగంతో ముగిసింది, అది యెహోవాసాక్షుల పెద్ద సమావేశాల్లో ఎల్లప్పుడూ ఒక ఉన్నతాంశమే. క్రొత్తగా సమర్పించుకున్న వారు నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసు అడుగుజాడల్లో నడవటాన్ని చూడటం ఎంత ఆనందదాయకమైన విషయమో కదా! (మత్తయి 3:13-17) ఈ చర్య గైకొనే వారందరూ కూడా అతి గొప్ప జ్ఞానానికి మూలమైన బైబిలునుండి విద్యనభ్యసించారు. అంతేకాకుండా, వారు జీవితంలో నిజమైన సంకల్పాన్ని కనుగొన్నారు. తాము సరైనది చేస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా వచ్చే మనశ్శాంతి చేత వారు దీవించబడ్డారు.—ప్రసంగి 12:13.
“వివేచన మిమ్మల్ని కాపాడనివ్వండి” అనే ప్రసంగంలో సూటైన సలహాలు ఇవ్వబడ్డాయి. వ్యాపార వ్యవహారాల విషయంలో వివేచన చాలా ప్రాముఖ్యం. మనం రాజ్యమందిరంలో వ్యక్తిగత వ్యాపారాలు చేయకూడదు, ఆర్థిక లాభం కొరకు మనం మన తోటి క్రైస్తవులను దోచుకోకూడదు. (యోహాను 2:15, 16 పోల్చండి.) వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు లేక డబ్బు అప్పు తీసుకునేటప్పుడు లేక ఇచ్చేటప్పుడు కూడా వివేచన అవసరం. “వ్యాపారంలో నష్టం రావడమనేది క్రైస్తవులు నిరుత్సాహం చెందేందుకు మరియు విపత్కరమైన రీతుల్లో డబ్బు సంపాదించే పథకాలలో అనాలోచనగా చేరిన కొందరికి ఆత్మీయతా లోపాన్ని కలిగించేందుకు” కూడా కారణమైందని ప్రసంగీకుడు పేర్కొన్నాడు. క్రైస్తవులు ఒకరితో ఒకరు వ్యాపారం చేయడం తప్పు కాకపోయినప్పటికీ, జాగ్రత్తవహించడం ఎంతో జ్ఞానయుక్తం. ఇరువర్గాల మధ్య వ్యాపార ఒప్పందం చేయబడినప్పుడు ఆ ఒప్పందానికి ఎల్లప్పుడూ కూడా లిఖితపూర్వక పత్రం ఉంచుకోవాలి.
“ఆయన వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించాడు” అనే ప్రసంగంలో స్త్రీపురుషుల కొరకైన దేవుని ప్రమాణాలు చర్చించబడ్డాయి. చరిత్ర గమనంలో స్త్రీపురుషుల పాత్రలు వక్రీకరించబడ్డాయి. “అనేకులు పురుషత్వాన్ని కఠినమైన ఆధిపత్యం, కఠోరత లేక పురుషాహంకారంతో సమానమని తప్పుగా భావిస్తారని” ప్రసంగీకుడు అన్నాడు. “కొన్ని సాంప్రదాయాల్లో పురుషులు బహిరంగంగా లేక చివరికి ఒంటరిగా ఏడ్వడమన్నది అరుదైన విషయం, అంతేకాకుండా సిగ్గుకరమైన విషయంగా కూడా భావించబడుతుంది. అయినప్పటికీ, లాజరు సమాధి వెలుపల సమూహంతోపాటు ఉన్నప్పుడు “యేసు కన్నీళ్లు విడిచెను” అని యోహాను 11:35 చెబుతుంది.” స్త్రీల విషయమేమిటి? స్త్రీత్వం తరచూ శారీరక ఆకర్షణీయతతో సమానమని భావించబడుతుంది. అయితే ప్రసంగీకుడు ఇలా అడిగాడు: “ఒక స్త్రీ సౌందర్యవతియై ఉండి, అవివేకంగా, వాదించేదిగా, కఠినంగా, లేక అహంభావంతో ఉంటే, ఆమె నిజమైన సౌందర్యవతిగా, నిజమైన స్త్రీత్వం గలదిగా ఉండగలదా?” (సామెతలు 11:22; 31:26 పోల్చండి.) తమ మాట, ప్రవర్తన మరియు కేశాలంకరణ విషయంలో క్రైస్తవ స్త్రీపురుషులు బైబిలు ప్రమాణాలను అనుకరించేందుకు ప్రయత్నిస్తారు. ప్రసంగీకుడు ఇలా అన్నాడు: “ఆత్మఫలాలను ప్రదర్శించే పురుషున్ని గౌరవించడం సులభం, అలా చేసే స్త్రీని ప్రేమించడమూ సులభమే.”—గలతీయులు 5:22, 23.
తర్వాత, “శాంతికరమైన దేవుడు మీ ఎడల శ్రద్ధవహిస్తాడు” అనే గోష్ఠి అందించబడింది. అనేకమంది క్రైస్తవులకు ఆర్థిక చింతలున్నాయి. అయినప్పటికీ, యెహోవా ఇలా ప్రవచించాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5) ఆర్థిక కష్టాలున్నప్పటికీ, సహాయ లేక క్రమ పయినీర్ సేవలో చేరడం ద్వారా కొందరు ఈ వాగ్దానంలో నమ్మకాన్ని చూపారు. ఇప్పుడు పయినీర్ చేయలేని ఇతరులు, సాక్ష్యమిచ్చేందుకు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రాజ్యాసక్తులను ముందుంచారు. (మత్తయి 6:33) అలాంటి ప్రయత్నాలన్నీ మెచ్చుకోబడవలసినవే! మన పరిచర్యలో తోడ్పడేందుకు మరియు మన సమస్యలతో వ్యవహరించేందుకు మనకు సహాయం చేయడానికి యెహోవా సంస్థ అనేక ప్రచురణలను అందించింది. యెహోవా యొక్క ఆత్మీయ ఏర్పాట్ల ఎడల మనం మెప్పును చూపితే, ఆర్థికంగా కష్టతరమైన ఈ కాలాల్లో ఆయన మనకు శాంతినిచ్చి దీవిస్తాడు.—కీర్తన 29:11.
ఆ దినం యొక్క ఆఖరి ప్రసంగమైన “కుటుంబ జీవితంలో దైవికశాంతిని వెంబడించండి” అనే దాని ముగింపులో, సమావేశానికి వచ్చిన వారు కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే క్రొత్త పుస్తకాన్ని అందుకుని అత్యంత ఆనందభరితులయ్యారు. “ఈ పుస్తకాన్ని వ్యక్తిగతంగా, కుటుంబాలుగా శ్రద్ధతో చదవండి” అని ప్రసంగీకుడు పురికొల్పాడు. “దాని బైబిలు ఆధారిత సలహాలను అన్వయించుకునేందుకు హృదయపూర్వకంగా కృషి చేయండి, మీరు మీ కుటుంబంలో శాంతిని, సంతోషాన్ని తప్పక పెంపొందించుకోగల్గుతారు.”
“శాంతి బంధంలో . . . సమైక్యతను కాపాడుకోండి”
ఎఫెసీయులు 4:3, NWపై ఆధారితమైన ఈ విషయం సమావేశం యొక్క చివరి దినానికి సరైన అంశంగా ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలనుండి వచ్చిన యెహోవాసాక్షులు దేవుని చేత బోధింపబడుతున్నారు. అందుకే, వారు శాంతిని ప్రేమిస్తారు. వారు యేసు మాదిరిని అనుకరిస్తారు, ‘శాంతి బంధంలోని స్ఫూర్తితో సమైక్యతను కాపాడుకునేందుకు’ కృషి చేస్తారు.
“నిజమైన సందేశకులను గుర్తించుట” అనే గోష్ఠిలో, దేవుని సంస్థలో వ్యాపించి ఉన్న శాంతిని గురించి స్పష్టంగా చర్చించబడింది. ప్రాచీన ఇశ్రాయేలులో అబద్ధ ప్రవక్తలు ఉండిరి. అయితే, దేవుని నిజమైన సందేశకులైన యెషయా, యెహెజ్కేలు మరియు యిర్మీయా వంటి ప్రవక్తలు, యెరూషలేము పతనాన్ని గురించి, చెరపట్టబడే కాలాన్ని గురించి, దేవుని ప్రజలు తుదకు విడుదల చేయబడే విషయాన్ని గురించి కచ్చితంగా ప్రవచించారు. నేడు కూడా అదే విధమైన పరిస్థితి ఉంది. రాజకీయ మరియు అబద్ధమత సామ్రాజ్యాల్లోను అబద్ధ సందేశకులు కోకొల్లలుగా ఉన్నారు. అయినప్పటికీ, ఈ విధానానికి సంబంధించి తాను కలిగున్న సంకల్పాన్ని ప్రకటించేందుకు యెహోవా తన సాక్షులను పంపాడు. విశేషంగా 1919 నుండి దేవుని సందేశాలను ప్రకటించేందుకు యెహోవా సేవకులు ఉపయోగింపబడ్డారు. క్రైస్తవ మత సామ్రాజ్యపు అబద్ధ సందేశకుల నుండి వారు ఎంత భిన్నంగా ఉన్నారో కదా! ఈ పని సమాప్తమైందని యెహోవా చెప్పేంత వరకూ ఇందులో మనం కలిగున్న పాత్రను చిత్తశుద్ధితో నెరవేర్చుదాము.
నడిపింపు, ఆదరణ మరియు నిరీక్షణకు లేఖనాలు అతి గొప్ప మూలమని “దేవుని వాక్యం విని, విధేయులుకండి” అనే ప్రసంగం నొక్కి చెప్పింది. (యెషయా 30:20, 21; రోమీయులు 15:4) నేటి ప్రపంచం ఎంతో విచ్ఛలవిడి ధోరణితో నిండిపోయి ఉంది. కాబట్టి, దేవుని వాక్యం మరియు సంస్థ నుండి వస్తున్న సలహాలను మనం మునుపెన్నటికంటే కూడా ఎక్కువగా వినవలసిన అవసరత ఇప్పుడుంది. యెహోవాకు మన బలహీనతలు తెలుసు, మనకు ఏది ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ విషయాన్ని ఆయన తన వాక్యంలో స్పష్టంగా సూచించాడు. యెహోవా మనకు మద్దతునిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవడం, ఆయన మననుండి అడిగే దేనినైనా చేయడంలో ముందుకు వెళ్లేందుకు మనకు నమ్మకాన్నిస్తుంది.
దాని తర్వాత రాబోయే పూర్తి కాస్ట్యూమ్‌ల నాటకానికి ఇది రంగాన్ని సిద్ధం చేసింది. దాని అంశం “దైవపరిపాలనా ఏర్పాట్లను ఎందుకు గౌరవించాలి?” ఈ నాటకం గిద్యోనును గురించిన బైబిలు వృత్తాంతాన్ని ఆధారంగా ఉపయోగించుకుంటూ, మనం దేవుని ఉపదేశాలను అనుసరించాలని, మన స్వంత ఆలోచనలను అందించకూడదని లేక దైవపరిపాలనా సలహాలను దాటేసేందుకు ప్రయత్నించకూడదనే ఒక శక్తివంతమైన పాఠాన్ని నొక్కి చెప్పింది.
బహిరంగ ప్రసంగం యొక్క అంశం “చివరకు నిజమైన శాంతి!—ఎక్కడ నుండి వస్తుంది?” దేవుడు వాగ్దానం చేస్తున్న శాంతి ఈ ప్రపంచం ఊహించగల దేనినైనా మించిపోతుంది. “నిజమైన శాంతి అంటే ప్రతి దినం శాంతి ఉండడమని అర్థం” అని ప్రసంగీకుడు అన్నాడు. “దేవుని శాంతి అంటే అనారోగ్యం, బాధ, దుఃఖం మరియు మరణం లేని ప్రపంచమని అర్థం.” యెహోవా “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు” అని బైబిలు మనకు చెబుతుంది. (కీర్తన 46:9) ఆయన దీన్నెలా చేస్తాడు? యుద్ధాన్ని రగిలింపజేసే అపవాదియగు సాతానును తీసివేయడం ద్వారా చేస్తాడు. (ప్రకటన 20:1-3) దీనులు ‘భూమిని స్వతంత్రించుకుని బహు క్షేమము కలిగి సుఖించేందుకు’ అది వారికి మార్గాన్ని సుగమం చేస్తుంది.—కీర్తన 37:11.
ఆ వారం కొరకైన కావలికోట పఠన శీర్షిక సారాంశం తర్వాత, సమావేశం కొరకైన చివరి ప్రసంగం యివ్వబడింది. “దైవికశాంతి సందేశకులుగా ముందుకు సాగుట” అనే ఈ ఉత్తేజకరమైన ప్రసంగం, మన ప్రకటనాపని వినూత్నమైనది మరియు ఆవశ్యకమైనది అనే విషయాన్ని నొక్కి చెప్పింది. ఇప్పుడు విశ్రాంతి తీసుకునే, కాలయాపన చేసే లేక తప్పుడు ఆలోచనల వైపుకు తిరిగిపోయే సమయం కాదు. మనకు అవసరమైన వాటితో మనం సర్వసన్నద్ధమయ్యాము అంటే దేవుని వర్తమానం, ఆయన పరిశుద్ధాత్మ మరియు ఆయన ప్రేమగల దైవపరిపాలనా సంస్థనుండి వచ్చే అనేక ఏర్పాట్లు మనకివ్వబడ్డాయి. యెహోవా సేవకులుగా, దైవిక శాంతి సందేశకులుగా మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉందుము గాక!
[9వ పేజీలోని బాక్సు/చిత్రం]
కుటుంబాలకు ఒక ప్రేమపూర్వక ఏర్పాటు
“దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశంలో రెండవదిన కార్యక్రమానికి హాజరైనవారు, కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పేరుగల క్రొత్త ప్రచురణను అందుకుని ఆనందించారు. దేవున్ని ప్రేమించే కుటుంబాలన్నీ ప్రయోజనం పొందేలా ఈ పుస్తకం లేఖనాధార సమాచారాన్ని కలిగి ఉంది.
అమెరికాలోని కనెటికట్‌కు చెందిన ఒక పెద్ద ఇలా వ్యాఖ్యానించాడు: “జూన్ 15న మేము మా కుటుంబ సంతోషం పుస్తకాన్ని అందుకున్నాము. జూన్ 16 కల్లా నేను దాన్ని సగం చదివేశాను. 17వ తేదీన మేము అందులోనుండి మా మొదటి కుటుంబ పఠనాన్ని జరుపుకున్నాము, మేమెంతగానో ప్రోత్సహింపబడ్డాము! అదే రోజు నేను ఆ పుస్తకాన్ని చదవడం ముగించాను. ఈ చక్కని ప్రచురణను ఉపయోగించే వారందరికీ అది ఎంతో ప్రశస్తమైనదిగా ఉంటుందనడంలో ఏ సందేహమూ లేదు. ఆ పుస్తకం యొక్క యథార్థత, సమయానుకూలమైన సమాచారం, ‘నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు తగిన వేళకు అన్నము’ పెడుతున్నాడు, ఈ కష్ట కాలాల్లో మన అవసరతలను బాగా ఎరిగియున్నాడు అనే విషయాలకు అదనపు రుజువునిస్తుంది.”—మత్తయి 24:45-47.
[7వ పేజీలోని చిత్రం]
యౌవనులూ వృద్ధులూ కూడా దేవుడు ఏమి కోరుతున్నాడో తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారు