నిజమైన శాంతి సందేశకులు ఎవరు?
అది మే 31, 1996, వార్తా ప్రసార మాద్యమాలు శాంతివర్తమానం వలే ఓ సందేశాన్ని వెల్లడి చేశాయి. దానికి ముందురోజు, ఇజ్రాయేల్ ప్రధానమంత్రి కాబోతున్న బెన్యామీన్ నెటాన్యాహు “శాంతి ప్రతిపాదనలను కొనసాగించేందుకు మరియు ఇజ్రాయేల్ దేశానికి పాలస్తీనాతోసహా దాని పొరుగు దేశాలన్నిటికి మధ్య శాంతిభద్రతలను స్థాపించేందుకు అతడు అత్యంత ఆసక్తిని కలిగి ఉన్నాడనే” విషయాన్ని ఉద్ఘాటిస్తూ ఒక అధికారిక వార్త వెలువడింది.
ఎంతో ప్రాచుర్యం పొందిన నెటాన్యాహు ఎన్నిక, మధ్యప్రాచ్యంలో శాంతి అన్నది వాస్తవంగా నెలకొంటుందేమో అని అనేకులు తలంచేలా చేసింది. ఒకవేళ శాంతి నెలకొంటే, ఇతర దేశాలు తమ విభేదాలను మరిచిపోయి ఆ దేశాన్ని అనుకరించగలవా?
శాంతి నెలకొనేలా చేయడంకంటే దాని గురించి వాగ్దానం చేయడం ఎంతో సులభమన్నది వాస్తవం. ఈ విషయాన్ని గుర్తించిన అనేకులు శంకించారు. విలేఖరియైన హెమీ శాలెవ్ అన్న విధంగా, “ఇజ్రాయేల్‌లోని సగం మంది విడుదల త్వరలో లభిస్తుందనే తలంపుతో జీవిస్తున్నారు, మరి మిగతా సగం మంది ప్రజలు అది భూమ్మీద నరకంలో చిక్కుకుని ఉందని భావిస్తున్నారు.” టూకీగా అతనిలా పేర్కొన్నాడు: “కొందరు ఆనందిస్తారు; ఇతరులు విలపిస్తారు.”
శాంతి కొరకు మానవుడు చేసే ప్రయత్నాలు ఇలా ఉన్నాయి. ఒక నాయకుని మరియు అతని మద్దతుదారుల విజయం ప్రతిపక్ష గుంపుకు ఓటమి అని అర్థం. అసంతృప్తి ఆశాభంగానికి దారితీస్తుంది, ఆశాభంగం తరచూ తిరుగుబాటుకు దారితీస్తుంది. మధ్యప్రాచ్యంలో, లాటిన్ అమెరికాలో, తూర్పు యూరప్‌లో లేక మరెక్కడైనా సరే, శాంతి కొరకు మానవజాతి చేసే ప్రయత్నాలు ఆశాభంగముగానే మిగిలిపోయాయి.
త్వరలో నిజమైన శాంతి!
మధ్య ప్రాచ్యంలో శాంతి ఎంతో విశేషమైన వార్తా విషయం అయిన సమయంలో, మరొక శాంతి వర్తమానం వినబడింది. అది ఎంతో ప్రాచుర్యం పొందిన రాజకీయ ప్రసంగం కాదు; అది దేశాల మధ్య జరిగిన శాంతి ఒప్పందమూ కాదు. బదులుగా, కేవలం దేవుని రాజ్యం ద్వారానే వచ్చే శాంతిని ఆ వర్తమానం ప్రకటించింది. ఈ వర్తమానం ఎక్కడ వినబడింది? 1996/97 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు జరిపిన 1,900 కంటే ఎక్కువ “దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశాల్లో అది వినబడింది.
ఏ మానవ ప్రభుత్వం కూడా వాస్తవమైన శాంతిభద్రతలను తీసుకురాలేదని ఆ సమావేశాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు? ఎందుకంటే, అనుదినం మననుండి శాంతిని దోచుకునే అనేక సంగతులను అంతమొందించ వలసి ఉంటుంది. వాస్తవమైన శాంతి అంటే యుద్ధం లేక దౌర్జన్యం జరుగుతుందనే భయమేమి లేకుండా ప్రతి ఉదయం నిద్ర లేవడమని దాని భావం. ఇక నేరం ఎంతమాత్రం ఉండదని, మన తలుపులకు ఇక తాళాలు వేయవలసి ఉండదని, వీధుల్లో నడిచేటప్పుడు ఇక భయపడే అవసరం లేదని, కుటుంబాలు ఇక ఎంతమాత్రం విచ్ఛిన్నం కావని దాని భావం. వీటన్నింటినీ భూమిపైనున్న ఏ ప్రభుత్వం సాధించగలదు? నిజానికి, అలాంటి వాగ్దానం చేసే ధైర్యం భూమ్మీదనున్న ఏ ప్రభుత్వానికైనావుందా?
అయితే, దేవుని రాజ్యం ఈ సంగతులను అన్నింటినీ తీసుకురాగలదు మరియు తెస్తుంది కూడా. బైబిలు ఇలా వాగ్దానం చేస్తుంది: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:3, 4) బాధననుభవిస్తున్న మానవజాతికి అదెంతటి ఉపశమనాన్ని తెస్తుందో కదా!
యెహోవా దేవుని వాగ్దానం బూటకమైనది కాదు. బైబిలు మనకిలా అభయాన్నిస్తుంది: “దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?” (సంఖ్యాకాండము 23:19) అవును, దేవుడు వాగ్దానం చేసిన విషయాలు తప్పక నెరవేరుతాయి, అవి ఆయన పక్షానున్న వారందరికీ దీవెనలను కుమ్మరిస్తాయి.
దేవుని శాంతి సందేశకులు
దేవుని రాజ్యాన్ని గురించి ఆసక్తితో ప్రకటించుట విషయంలో యెహోవాసాక్షులు పేరు గాంచారు. ప్రతి సంవత్సరం, బైబిలు యిచ్చే ప్రోత్సాహకరమైన సందేశాన్ని ఇతరులతో పంచుకోవడంలో వారందరూ దాదాపు వంద కోట్లకంటే ఎక్కువ గంటలను వెచ్చిస్తారు. ఇది యేసు మాటల నెరవేర్పు ప్రకారం జరుగుతుంది: “ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) సాక్షులు తెచ్చే సందేశం వాస్తవంగా ‘సువార్తే,’ ఎందుకంటే మానవజాతికిగల ఏకైక నిరీక్షణ దేవుని పరలోక రాజ్యమేనని అది ప్రకటిస్తుంది. అది భవిష్యత్తు విషయమై ఎంత దృఢమైన నిరీక్షణయో గదా!
దేవుని రాజ్యం ఇప్పుడు కూడా తన పౌరుల్లో శాంతి, సహోదర ప్రేమ యొక్క యథార్థమైన బంధాన్ని ఉత్పన్నం చేస్తుంది. యేసు ఇలా అన్నాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహాను 13:35) నిజ క్రైస్తవత్వం యొక్క ఈ మౌళిక అర్హతను కలిగివుండేందుకు యెహోవాసాక్షులు కృషి చేస్తారు. దాని ఫలితంగా, యూదులను అరబ్బులను, క్రొయేషియా వారిని సెర్బులను, హుటు టుట్సీలను ఐక్యపరిచే అద్భుతమైన సహోదరత్వం వారికుంది. మానవజాతిలో అత్యధికులు కేవలం కలలుగనే ఇలాంటి శాంతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది యెహోవాసాక్షుల సొత్తు.
“దైవిక శాంతి సందేశకులు” జిల్లా సమావేశ కార్యక్రమంలో, బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవించడంలో కొనసాగమని, దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉండమని ప్రోత్సహించడం జరిగింది. లక్షలాది మంది ఆనందించిన మూడు దినాల సమావేశాన్ని గురించి క్రిందనున్న ఈ నివేదికను చదువవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.