కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 1/1 పేజీలు 6-11
  • అందరూ యెహోవాను ఘనపర్చుదురుగాక!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అందరూ యెహోవాను ఘనపర్చుదురుగాక!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సైన్యములకధిపతియగు యెహోవా” మాట్లాడుతున్నాడు
  • ఘనమైన ఆత్మీయ ఆలయం
  • “నేను మీకు తోడుగా ఉన్నాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • హగ్గయి, జెకర్యా పుస్తకాల్లోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “నేను అన్నిదేశాల్ని కంపింపజేస్తాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 1/1 పేజీలు 6-11

అందరూ యెహోవాను ఘనపర్చుదురుగాక!

“తూర్పుదిశనున్నవారలారా, యెహోవాను ఘనపరచుడి.”—యెషయా 24:15.

1. యెహోవా నామాన్ని ఆయన ప్రవక్తలు ఎలా దృష్టించారు, దానికి వ్యతిరేకంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో నేడు ఎలాంటి దృక్పథం ఉంది?

యెహోవా—అది దేవుని విశిష్టమైన నామము! ఆ నామమున మాట్లాడడానికి ప్రాచీన కాలంనాటి నమ్మకమైన ప్రవక్తలు ఎంతగా ఆనందించారోకదా! వారు తమ సర్వోన్నత ప్రభువైన యెహోవాను మహదానందంతో ఘనపర్చారు, గొప్ప సంకల్పం గలవానిగా ఆయన నామము ఆయనను గుర్తిస్తుంది. (యెషయా 40:5; యిర్మీయా 10:6, 10; యెహెజ్కేలు 36:23) చిన్న ప్రవక్తలు అని పిలువబడేవారు కూడా యెహోవాను ఎంతగానో ఘనపరిచారు. వారిలో ఒకరు హగ్గయి. కేవలం 38 వచనాలతో రూపొందించబడిన హగ్గయి పుస్తకంలో, దేవుని నామము 35 సార్లు ఉపయోగించబడింది. క్రైస్తవమత సామ్రాజ్యంలోని శ్రేష్ఠులైన అపొస్తలులు తమ బైబిలు అనువాదాలలో ఉపయోగిస్తున్నట్లుగా, యెహోవా అనే అమూల్యమైన నామానికి బదులుగా “ప్రభువు” అనే బిరుదును ఉపయోగించినప్పుడు అలాంటి ప్రవచనం నిర్జీవమైపోయినట్లు అనిపిస్తుంది.—2 కొరింథీయులు 11:5 పోల్చండి.

2, 3. (ఎ) ఇశ్రాయేలు పునరుద్ధరణను గూర్చిన ఒక విశేషమైన ప్రవచనం ఎలా నెరవేరింది? (బి) యూదా శేషము మరియు వారి సహవాసులు ఏ ఆనందంలో భాగం వహించారు?

2 యెషయా 12:2 నందు ఆ నామము యొక్క ద్విరూపం ఉపయోగించబడింది.a ప్రవక్త ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే [“యా యెహోవా,” NW] నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను.” (యెషయా 26:4 కూడా చూడండి.) అలా, ఇశ్రాయేలీయులు బబులోను చెరనుండి విడిపించబడడానికి దాదాపు 200 సంవత్సరాల పూర్వము నుండే, తన ప్రవక్తయైన యెషయా ద్వారా యా యెహోవా తాను వారి బలవంతుడైన రక్షకుడనని అభయమిస్తుండేవాడు. ఆ చెర సా.శ.పూ. 607 నుండి 537 వరకు కొనసాగవలసి ఉంది. యెషయా ఇలా కూడా వ్రాశాడు: “యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను . . . కోరెషుతో—నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే యెరూషలేముతో—నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను.” ఈ కోరెషు ఎవరు? సుస్పష్టంగా, ఆయన సా.శ.పూ. 539లో బబులోనును జయించిన పర్షియా రాజైన కోరెషు అని నిరూపించబడింది.—యెషయా 44:24, 28.

3 యెషయా వ్రాసిన యెహోవా మాటల నెరవేర్పుగా, చెరలోవున్న ఇశ్రాయేలీయులకు కోరెషు ఈ ఆజ్ఞనిచ్చాడు: “కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడైయుండునుగాక.” అత్యంత ఆనందభరితులైన యూదా శేషము ఇశ్రాయేలీయులుకాని నెతినీయులు మరియు సొలొమోను సేవకుల కుమారులతోపాటు యెరూషలేముకు తిరిగి వచ్చారు. సా.శ.పూ. 537లో పర్ణశాలల పండుగను ఆచరించడానికి, యెహోవా బలిపీఠం వద్ద ఆయనకు బలులు అర్పించడానికి తగిన సమయానికి వారు చేరుకున్నారు. ఆ మరుసటి సంవత్సరం రెండవ నెలలో ఆనందంతో కేకలు వేస్తూ యెహోవాను స్తుతిస్తూ వారు రెండవ ఆలయానికి పునాది వేశారు.—ఎజ్రా 1:1-4; 2:1, 2, 43, 55; 3:1-6, 8, 10-13.

4. యెషయా 35 మరియు 55 అధ్యాయాలు ఎలా నిజమయ్యాయి?

4 యెహోవా చేసిన పునరుద్ధరణా ప్రవచనం ఇశ్రాయేలులో మహోన్నతంగా నెరవేరవలసి ఉంది: “అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరిపుష్పమువలె పూయును. . . . అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” “మీరు సంతోషముగా బయలు వెళ్లుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ యెదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చేయును. . . . అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును.”—యెషయా 35:1, 2; 55:12, 13.

5. ఇశ్రాయేలీయుల ఆనందం ఎందుకు తాత్కాలికమయ్యింది?

5 అయితే, ఆ ఆనందం తాత్కాలికమైనదే. ఇరుగు పొరుగు ప్రజలు ఆలయాన్ని నిర్మించేందుకు మతాంతర ఒప్పందం కొరకు ప్రయత్నించారు. “మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు; మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని” చెప్పి యూదులు మొదట్లో స్థిరంగా నిలబడ్డారు. ఆ ఇరుగుపొరుగువారు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకులయ్యారు. వారు “యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.” కోరెషు తరువాతి పాలకుడైన అర్తహషస్తకు వారు పరిస్థితిని తప్పుగా వివరించారు, ఆయన ఆలయ నిర్మాణంపై నిషేధాన్ని విధించాడు. (ఎజ్రా 4:1-24) 17 సంవత్సరాల పాటు పని ఆగిపోయింది. ఆ మధ్యకాలంలో యూదులు వస్తుసంబంధ జీవన విధానంలో పడిపోవడం విచారకరం.

“సైన్యములకధిపతియగు యెహోవా” మాట్లాడుతున్నాడు

6. (ఎ) ఇశ్రాయేలులోని పరిస్థితికి యెహోవా ఎలా ప్రతిస్పందించాడు? (బి) హగ్గయి పేరు యొక్క స్పష్టమైన భావం ఎందుకు తగినది?

6 అయినప్పటికీ, యూదులను తమ బాధ్యత విషయంలో మేల్కొల్పడానికి ప్రాముఖ్యంగా హగ్గయి మరియు జెకర్యా వంటి ప్రవక్తలను పంపడం ద్వారా యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున ‘తన శక్తిని, బలాన్ని’ ప్రదర్శించాడు. హగ్గయి పేరు పండుగతో ముడిపడి ఉంది, ఎందుకంటే “పండుగ సమయంలో జన్మించాడు” అని దాని భావం. తగినట్లుగానే, ఆయన పర్ణశాలల పండుగ నెలలోని మొదటి దినముననే ప్రవచించడం ప్రారంభించాడు, ఆ సమయంలో యూదులు “నిశ్చయముగా సంతోషింప”వలసి ఉంది. (ద్వితీయోపదేశకాండము 16:15) యెహోవా హగ్గయి ద్వారా 112 దినాల కాలంలో నాలుగు సందేశాలను పంపించాడు.—హగ్గయి 1:1; 2:1, 10, 20.

7. హగ్గయి యొక్క ప్రారంభ మాటలు మనల్నెలా ప్రోత్సహించాలి?

7 హగ్గయి తన ప్రవచనాన్ని పరిచయం చేస్తూ “సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా” అని చెప్పాడు. (హగ్గయి 1:1) ఆ “సైన్యము”లెవరైవుండవచ్చు? వారు యెహోవా దూత గణములు, బైబిలునందు కొన్నిసార్లు సైనిక బలగంగా సూచించబడ్డారు. (యోబు 1:6; 2:1; కీర్తన 103:20, 21; మత్తయి 26:53) భూమిపై సత్యారాధనను పునఃస్థాపించే మన పనికి నడిపింపునిచ్చేందుకు అజేయులైన ఈ పరలోక శక్తులను సర్వోన్నత ప్రభువైన యెహోవా తానే ఉపయోగించుకుంటున్నాడన్నది నేడు మనల్ని ప్రోత్సహించదా?—2 రాజులు 6:15-17 పోల్చండి.

8. ఏ దృక్పథం ఇశ్రాయేలీయులను ప్రభావితం చేసింది, దాని ఫలితమేమిటి?

8 హగ్గయి యొక్క మొదటి వర్తమానంలోని సమాచారమేమిటి? “సమయమింకరాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని” ప్రజలు అన్నారు. దైవారాధన పునఃస్థాపనను సూచించే ఆలయ నిర్మాణం వారికిక ప్రథమ ధ్యేయంగా లేదు. వారు తమ కొరకు తాము రాజప్రాసాదుల వంటి భవనాలు నిర్మించుకోవడంలో నిమగ్నమయ్యారు. యెహోవా ఆరాధన ఎడల వారికున్న ఉత్సాహాన్ని వస్తుసంబంధ దృక్పథం తగ్గించివేసింది. ఫలితంగా, ఆయన ఆశీర్వాదం తీసివేయబడింది. వారి పంటపొలాలు ఇక ఫలవంతంగా లేవు, తీవ్రమైన చలికాలంలో వారికి దుస్తులు తక్కువయ్యాయి. వారి సంపాదన తగ్గిపోయింది, చినిగిపోయిన సంచిలో డబ్బు వేస్తున్నట్లయ్యింది.—హగ్గయి 1:2-6.

9. యెహోవా ఏ శక్తివంతమైన, ప్రోత్సాహకరమైన గద్దింపును ఇచ్చాడు?

9 రెండుసార్లు యెహోవా ఈ శక్తివంతమైన హెచ్చరికనిచ్చాడు: “మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.” స్పష్టంగా, యెరూషలేముపై అధికారియైన జెరుబ్బాబేలు, ప్రధాన యాజకుడైన యెహోషువb ప్రతిస్పందించి, “యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు” కలిగివుండమని ప్రజలందరినీ ధైర్యంగా ప్రోత్సహించారు. అంతేగాక, “యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా—నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.”—హగ్గయి 1:5, 7-14.

10. యెహోవా ఇశ్రాయేలీయుల తరఫున తన శక్తిని ఎలా ఉపయోగించాడు?

10 మునుపటి ఆలయంతో పోలిస్తే పునర్నిర్మింపబడిన ఆలయం యొక్క మహిమ “ఎందునను పోలినది కాదని” యెరూషలేములోని కొందరు వృద్ధులు అంచనా వేసివుండవచ్చు. అయితే, 51 దినాల తర్వాత, యెహోవా రెండవ వర్తమానాన్ని ప్రకటించడానికి హగ్గయిని పురికొల్పాడు. హగ్గయి ఇలా ప్రకటించాడు: “యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా—జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. . . . భయపడకుడి.” యెహోవా తగిన సమయంలో ‘ఆకాశమును, భూమిని కంపింపజేయడానికి’ తన సర్వోన్నత శక్తిని ఉపయోగించి, రాజరిక నిషేధంతో సహా వ్యతిరేకతనంతటినీ తొలగించివేశాడు. ఐదు సంవత్సరాల్లో ఆలయ నిర్మాణం ఘన విజయం సాధించింది.—హగ్గయి 2:3-6.

11. దేవుడు రెండవ ఆలయాన్ని ‘గొప్ప మహిమతో’ ఎలా నింపాడు?

11 “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” అనే విశేషమైన వాగ్దానం అప్పుడు నెరవేరింది. (హగ్గయి 2:7) ఆయన మహోన్నత సాన్నిధ్యపు మహిమను ఆ ఆలయం ప్రతిబింబిస్తుండగా, అక్కడ ఆరాధించడానికి వచ్చిన ఇశ్రాయేలీయులు కానివారే ఆ “ఇష్టవస్తువులు” అని నిరూపించబడ్డారు. సొలొమోను దినాల్లో నిర్మింపబడినదానితో పోలిస్తే పునర్నిర్మింపబడిన ఈ ఆలయం ఎలా ఉంది? దేవుని ప్రవక్త ఇలా ప్రకటించాడు: “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (హగ్గయి 2:9) ప్రవచనం యొక్క ప్రాథమిక నెరవేర్పులో, పునర్నిర్మింపబడిన ఆలయం మొదటి ఆలయంకంటే ఎక్కువకాలం ఉండింది. సా.శ. 29లో మెస్సీయ వచ్చేసరికి అది ఇంకా నిలిచేవుంది. ఆ తర్వాత, సా.శ. 33లో ఆయన మతభ్రష్ట శత్రువులు ఆయనను హత్య చేయకముందు మెస్సీయ తానే అక్కడ సత్యాన్ని ప్రకటించడం ద్వారా దానికి మహిమను తెచ్చాడు.

12. మొదటి రెండు ఆలయాలు ఏ సంకల్పాన్ని నెరవేర్చాయి?

12 మెస్సీయ యొక్క యాజక సేవలోని ప్రాముఖ్యమైన అంశాలకు ముంగుర్తుగా ఉండడంలోనూ మెస్సీయ వచ్చేంత వరకు భూమిపై యెహోవా స్వచ్ఛారాధనను సజీవంగా ఉంచడంలోనూ యెరూషలేములోని మొదటి మరియు రెండవ ఆలయాలు ఒక ప్రాముఖ్యమైన సంకల్పాన్ని నెరవేర్చాయి.—హెబ్రీయులు 10:1.

ఘనమైన ఆత్మీయ ఆలయం

13. (ఎ) ఆత్మీయ ఆలయం సంబంధంగా సా.శ. 29 నుండి 33 వరకు ఏ సంఘటనలు సంభవించాయి? (బి) ఈ కార్యాల్లో యేసు విమోచన క్రయధన బలి ఏ ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించింది?

13 పునర్నిర్మాణమును గూర్చిన హగ్గయి ప్రవచనం తర్వాతి కాలాల కొరకు ప్రత్యేక భావాన్ని కలిగివుందా? నిశ్చయంగా కలిగివుంది! యెరూషలేములోని పునర్నిర్మింపబడిన ఆలయం భూమిపై సత్యారాధనకంతటికీ కేంద్రమయ్యింది. కాని అది మరింత మహిమాయుతమైన ఆత్మీయ ఆలయానికి ముంగుర్తు అయ్యింది. సా.శ. 29లో యేసు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటుండగా, పరిశుద్ధాత్మ పావురంవలె ఆయన మీదికి దిగినప్పుడు, యెహోవా యేసును ప్రధానయాజకునిగా అభిషేకించగా ఇది ప్రారంభమయ్యింది. (మత్తయి 3:16) యేసు బలి మరణమునొంది తన భూ పరిచర్యను ముగించిన తర్వాత, ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలాన్ని సూచించే పరలోకానికి పునరుత్థానం చేయబడి అక్కడ తన బలి విలువను యెహోవాకు సమర్పించాడు. ఇది తన శిష్యుల పాపాలను పరిహరిస్తూ విమోచన క్రయధనంగా పనిచేసి, సా.శ. 33 పెంతెకొస్తు దినాన యెహోవా ఆత్మీయ ఆలయంలో సహయాజకులుగా వారిని అభిషేకించడానికి మార్గాన్ని తెరిచింది. వారు భూమిపైనున్న ఆలయ ఆవరణంలో మరణపర్యంతం చేసే నమ్మకమైన పరిచర్య, ఎడతెగక సాగే యాజక సేవ నిమిత్తం భవిష్యత్తులో పొందబోవు పరలోక పునరుత్థానానికి వారిని నడిపిస్తుంది.

14. (ఎ) తొలి క్రైస్తవ సంఘం యొక్క ఆసక్తికరమైన కార్యకలాపాల మూలంగా ఏ ఆనందం ఏర్పడింది? (బి) ఈ ఆనందం ఎందుకు తాత్కాలికమే అయ్యింది?

14 పశ్చాత్తాపం చెందిన వేలాదిమంది యూదులు—ఆ తర్వాత అన్యులు—ఆ క్రైస్తవ సంఘంలోకి తరలివచ్చి, భూమిని ఏలబోవు దేవుని రాజ్య పాలనను గూర్చిన సువార్తను ప్రకటించడంలో భాగం వహించారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత, సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి” ప్రకటింపబడిందని అపొస్తలుడైన పౌలు చెప్పగలిగాడు. (కొలొస్సయులు 1:23) అపొస్తలుల మరణానంతరం గొప్ప మతభ్రష్టత్వం ఏర్పడి, సత్య వెలుగు మినుకు మినుకు మననారంభించింది. అన్య బోధలు మరియు తత్త్వాలపై ఆధారపడిన క్రైస్తవమత మతశాఖల ద్వారా నిజమైన క్రైస్తవత్వం మరుగు చేయబడింది.—అపొస్తలుల కార్యములు 20:29, 30.

15, 16. (ఎ) ప్రవచనం 1914లో ఎలా నెరవేరింది? (బి) 19వ శతాబ్దాంతంలోనూ 20వ శతాబ్దారంభంలోనూ ఏ సమకూర్పు జరిగింది?

15 శతాబ్దాలు గడిచిపోయాయి. తుదకు 1870లలో యథార్థ క్రైస్తవుల ఒక గుంపు బైబిలును క్షుణ్ణంగా పఠించనారంభించింది. 1914వ సంవత్సరం “అన్యజనముల కాలముల” ముగింపును సూచిస్తుందని వారు లేఖనాల నుండి తెలియజేయగలిగారు. ఆ సమయంలోనే, భూమికి మెస్సీయ రాజుగా “స్వాస్థ్యకర్త”యైన క్రీస్తు యేసు పరలోకంలో పట్టాభిషిక్తుడవ్వడంతో ఏడు సూచనార్థక “కాలములు” (మృగంవంటి మానవ పరిపాలన యొక్క 2,520 సంవత్సరాలు) ముగిశాయి. (లూకా 21:24; దానియేలు 4:25; యెహెజ్కేలు 21:26, 27) ప్రాముఖ్యంగా 1919 నుండి, నేడు యెహోవాసాక్షులని పిలువబడుతున్న ఈ బైబిలు విద్యార్థులు రాబోయే రాజ్యాన్ని గూర్చిన సువార్తను భూమ్యంతటా వ్యాపింపజేయడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1919లో అమెరికా, ఒహాయోనందలి సీడార్‌ పాయింట్‌ వద్ద జరిగిన సమావేశంలో ఇవ్వబడిన పిలుపుకు వీరిలో కొన్ని వేలమంది ప్రతిస్పందించారు. 1935వ సంవత్సరం వరకు వారు సంఖ్యాపరంగా అభివృద్ధి చెందారు, ఆ సంవత్సరంలో 56,153 మంది ప్రాంతీయ సేవ రిపోర్టు ఇచ్చారు. ఆ సంవత్సరంలో, 52,465 మంది యేసు వార్షిక మరణ జ్ఞాపకార్థ ఆచరణలో రొట్టె ద్రాక్షారసం చిహ్నాలలో భాగం వహించి, యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయంలోని పరలోక భాగంలో క్రీస్తు యేసుతోపాటు యాజకులయ్యే తమ నిరీక్షణను సూచించారు. వారు ఆయన మెస్సీయ రాజ్యంలో సహరాజులుగా కూడా సేవచేస్తారు.—లూకా 22:29, 30; రోమీయులు 8:15-17.

16 అయితే, ఈ అభిషిక్త క్రైస్తవుల మొత్తం సంఖ్య 1,44,000 మందికే పరిమితమై ఉంటుందని ప్రకటన 7:4-8 మరియు 14:1-4 వచనాలు చూపిస్తున్నాయి, వీరిలో అనేకులు గొప్ప మతభ్రష్టత్వం ప్రారంభం కాకమునుపే మొదటి శతాబ్దంలో సమకూర్చబడ్డారు. 19వ శతాబ్దం చివరి భాగం నుండి 20వ శతాబ్దం వరకూ తన వాక్యమనే నీళ్ల ద్వారా శుభ్రపరచబడి యేసు విమోచనా బలియందు విశ్వాసముంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి 1,44,000 మంది యొక్క మొత్తం సంఖ్యను పూర్తి చేయడానికి అభిషిక్త క్రైస్తవులుగా ముద్రించబడగల ఈ గుంపును సమకూర్చడాన్ని యెహోవా ముగిస్తున్నాడు.

17. (ఎ) 1930ల నుండి ఏ సమకూర్పు జరుగుతూ వచ్చింది? (బి) ఇక్కడ యోహాను 3:30 ఎందుకు ఆసక్తిని చూరగొన్నది? (లూకా 7:28 కూడా చూడండి.)

17 అభిషిక్తులనందరినీ ఎంపిక చేయడం ముగిసిన తర్వాత ఏమి జరుగుతుంది? ఆ 1,44,000 మంది సమకూర్చబడిన “తర్వాత” ప్రకటన 7:9-17 నందలి “గొప్ప సమూహము” గుర్తింపబడుతుందని, వారి గమ్యం పరదైసు భూమిపై నిత్యజీవమని 1935లో, అమెరికా డి.సి. వాషింగ్టన్‌లో జరిగిన విశిష్టమైన సమావేశంలో తెలియజేయబడింది. “వేరే గొర్రెల”లో ఒకరిగా భూమిపై పునరుత్థానం చేయబడే బాప్తిస్మమిచ్చు యోహాను అభిషిక్తుడైన యేసును స్పష్టంగా గుర్తించిన తర్వాత, మెస్సీయ గురించి ఇలా చెప్పాడు: “ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసి యున్నది.” (యోహాను 1:29; 3:30; 10:16; మత్తయి 11:11) మెస్సీయ కొరకు శిష్యులను తయారు చేయడమనే బాప్తిస్మమిచ్చు యోహాను పని ముగింపుకొస్తుండగా, 1,44,000 మందిలో చేరివుండే అత్యధికుల ఎంపికను యేసు చేపట్టాడు. 1930లలో దానికి భిన్నమైనది జరిగింది. “వేరే గొర్రెల”కు చెందిన “గొప్ప సమూహము” యొక్క సంఖ్యలో అత్యధిక పెరుగుదల ఆరంభమౌతుండగా, 1,44,000 మందిలో భాగమై ఉండేందుకు ‘పిలువబడిన, ఏర్పరచబడిన’ వారి సంఖ్య తగ్గిపోసాగింది. అర్మగిద్దోనునందు ఈ ప్రపంచ దుష్ట విధానం దాని అంతానికి చేరుకుంటుండగా ఈ గొప్ప సమూహం వృద్ధియవుతుంది.—ప్రకటన 17:14బి.

18. (ఎ) “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు” అని ఎందుకు నమ్మకంగా ఎదురు చూడవచ్చు? (బి) హగ్గయి 2:4ను మనం ఎందుకు ఆసక్తిగా వినాలి?

18 “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది ఇంకెన్నడూ మరణించరు” అనే బహిరంగ ప్రసంగాన్ని యెహోవాసాక్షులు 1920ల తొలిభాగంలో ప్రచారం చేసి అందజేశారు. ఆ కాలంలో అది విపరీత ఆశాభావం అన్నట్లు అనిపించి ఉండవచ్చు. కాని నేడు పూర్తి నమ్మకంతో ఆ వ్యాఖ్యానాన్ని చేయవచ్చు. బైబిలు ప్రవచనంపై అధికమౌతున్న వెలుగు మరియు నశిస్తున్న ఈ ప్రపంచపు అరాచకత్వం రెండూ సాతాను విధానాంతం ఎంతో సమీపంలో ఉందని తేటతెల్లం చేస్తున్నాయి! 1996 కొరకైన జ్ఞాపకార్థ నివేదిక 1,29,21,933 మంది హాజరయ్యారని, వారిలో కేవలం 8.757 (.068 శాతం) మంది చిహ్నాలలో పాల్గొనడం ద్వారా తమ పరలోక నిరీక్షణను సూచించారని చూపిస్తుంది. సత్యారాధన యొక్క పునరుద్ధరణ ముగింపుకొస్తోంది. కాని ఆ పనిలో మనమెన్నడూ పట్టుసడలనివ్వకుండా చూసుకుందాము. అవును, హగ్గయి 2:4 ఇలా తెలియజేస్తుంది: “దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” వస్తుసంపద లేక లోకసంబంధమైన ఏ ఒత్తిడులు యెహోవా పని కొరకైన మన ఆసక్తిని తగ్గించకుండా ఉండేందుకు మనం నిశ్చయత కలిగివుందాము!—1 యోహాను 2:15-17.

19. హగ్గయి 2:6, 7 నెరవేర్పులో మనం ఎలా భాగం వహించవచ్చు?

19 హగ్గయి 2:6, 7 యొక్క ఈ ఆధునిక దిన నెరవేర్పులో భాగం వహించే మన ఆధిక్యత ఆనందభరితమైనది: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులనందరిని కదలింపగా అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” దురాశ, అవినీతి, ద్వేషం ఈ 20వ శతాబ్దపు లోకమంతటా విస్తృతంగా వ్యాపించాయి. నిజానికది అంత్యదినాల్లో ఉంది, యెహోవా తన సాక్షుల ద్వారా ‘తన ప్రతిదండన దినాన్ని ప్రకటింప’ చేయడం మూలంగా దాన్ని ఇప్పటికే ‘కదిలించడం’ ప్రారంభించాడు. (యెషయా 61:2) అర్మగిద్దోను నందు లోకనాశనంతో ఈ ప్రారంభ కదిలింపు ముగింపుకొస్తుంది, యెహోవా “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువుల”ను అంటే భూమి మీదవున్న దీనులైన గొర్రెలవంటి ప్రజలను తన సేవ కొరకు సమకూరుస్తున్నాడు. (యోహాను 6:44) ఈ “గొప్ప సమూహము” ఇప్పుడు ఆయన ఆరాధన మందిరంలోని భూఆవరణలో ‘పరిశుద్ధ సేవను అర్పిస్తున్నారు.’—ప్రకటన 7:9, 15.

20. అత్యంత విలువైన సంపదను ఎక్కడ కనుగొనవచ్చు?

20 యెహోవా ఆత్మీయ ఆలయంలో సేవచేయడం మరే వస్తుసంబంధమైన సంపదకంటే కూడా అమూల్యమైన లాభాన్ని చేకూరుస్తుంది. (సామెతలు 2:1-6; 3:13, 14; మత్తయి 6:19-21) అంతేగాక, హగ్గయి 2:9 ఇలా తెలియజేస్తుంది: “ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.” నేడు మనకు ఈ మాటలు ఏ భావాన్ని కలిగివున్నాయి? మా తరువాతి శీర్షిక తెలియజేస్తుంది.

[అధస్సూచీలు]

a “యా యెహోవా” అనే పదబంధం ప్రత్యేకంగా నొక్కిచెప్పడానికి ఉపయోగించబడింది. లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 1, పేజీ 1248 చూడండి.

b ఎజ్రా పుస్తకంలోనూ ఇతర బైబిలు పుస్తకాలలోనూ యేషూవ అని పేర్కొనబడింది.

పునఃసమీక్ష కొరకు ప్రశ్నలు

◻ యెహోవా నామం విషయంలో ప్రవక్తలు చూపిన ఏ మాదిరిని మనం అనుసరించాలి?

◻ పునరుద్ధరించబడిన ఇశ్రాయేలుకు యెహోవా ఇచ్చిన శక్తివంతమైన సందేశం నుండి మనం ఏ ప్రోత్సాహాన్ని పొందుతాము?

◻ నేడు ఏ మహిమాన్విత ఆత్మీయ ఆలయం పనిచేస్తోంది?

◻ 19 మరియు 20 శతాబ్దాలలో ఏ సమకూర్పులు జరిగాయి, ఏ గొప్ప ఉత్తరాపేక్షను దృష్టిలో ఉంచుకుని జరిగాయి?

[7వ పేజీలోని చిత్రం]

యెహోవా పరలోక సైన్యాలు భూమిపైనున్న ఆయన సాక్షులకు నడిపింపునిచ్చి, బలపరుస్తాయి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి