కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 1/1 పేజీలు 3-5
  • మనమందరం దేవున్ని ఎందుకు స్తుతించాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనమందరం దేవున్ని ఎందుకు స్తుతించాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘యెహోవా మాత్రమే నాకు నిరీక్షణనివ్వగలడు’
  • ‘నేను అంధురాలినైనప్పటికీ, నేను చూడగలను’
  • అందరూ ‘యాను స్తుతించుదురు’ గాక
  • బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి
    అనుభవాలు
  • యెహోవాను స్తుతిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 1/1 పేజీలు 3-5

మనమందరం దేవున్ని ఎందుకు స్తుతించాలి?

హల్లెలూయా! క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలకెళ్లే అనేకులకు ఈ పదం సుపరిచితమే. కొంతమంది తమ ఆదివార ప్రార్థనా కార్యక్రమాల్లో దాన్ని బిగ్గరగా వల్లిస్తారు. అయితే నిజంగా ఆ పద భావమేమిటో ఎంతమందికి తెలుసు? వాస్తవానికి అది ‘యాను స్తుతించుము!’ అనేదాని హెబ్రీపదం. అది, యెహోవా అనే నామాన్ని కల్గివున్న సృష్టికర్తకు చెల్లించే ఆనందభరితమైన, నిశ్చయమైన స్తుతి.a

“హల్లెలూయా” అనే పదం బైబిలులో తరచుగా కనిపిస్తుంది. ఎందుకు? ఎందుకంటే దేవున్ని స్తుతించడానికి అనేక కారణాలు ఉన్నాయి. యా (యెహోవా) సువిశాల విశ్వం యొక్క సృష్టికర్త మరియు పోషకుడు. (కీర్తన 147:4, 5; 148:3-6) భూమిపై జీవం సాధ్యమయ్యేలా చేసే పర్యావరణాలను ఆయనే సృష్టించాడు. (కీర్తన 147:8, 9; 148:7-10) ఆయన మానవజాతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. మనం ఆయన చిత్తాన్ని చేస్తే, ఆయన మనల్ని ఈ జీవితంలో ఆశీర్వదించి మనకు మద్దతునిస్తాడు, అలాగే రానైయున్న మరింత శ్రేష్ఠమైన జీవితాన్ని గూర్చిన కచ్చితమైన నిరీక్షణను అనుగ్రహిస్తాడు. (కీర్తన 148:11-14) ఈ మాటలను ప్రేరేపించినది యా (యెహోవా)యే: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు. వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

అవును, ఈ పురికొల్పు అందరికీ ఇవ్వబడుతోంది: “హల్లెలూయా!” “యాను స్తుతించుడి!” (కీర్తన 104:35, NW, అధఃస్సూచి) అయితే అసంతోషకరంగా, ప్రతి ఒక్కరు ప్రతిస్పందించాలని కోరుకోరు. నేడు, ప్రజలు బాధపడుతున్నారు. అనేకులు ఆకలిగొంటున్నారు, రోగులౌతున్నారు, లేక కృంగిపోయివున్నారు. అనేకులు మత్తుపదార్థాలను లేక మద్యాన్ని దుర్వినియోగం చేయడం మూలంగా లేక తమ అవినీతి లేదా తిరుగుబాటు ఫలితాల మూలంగా ఎంతో వేదన అనుభవిస్తున్నారు. అలాంటి వారు దేవున్ని ఎందుకు స్తుతించాలనేదానికి ఏదైనా కారణం ఉందా?

‘యెహోవా మాత్రమే నాకు నిరీక్షణనివ్వగలడు’

అవును, కారణం ఉంది. తన గురించి తెలుసుకోమని, తన చిత్తాన్ని చేయడాన్ని నేర్చుకోమని, తనను స్తుతించడానికి ప్రజలు ఇష్టపడేలా చేసే ఆశీర్వాదాలను అనుభవించమని యెహోవా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాడు. అనేకులు ప్రతిస్పందిస్తున్నారు. ఉదాహరణకు గ్వాటిమాలాలోని ఆడ్రియానాను తీసుకోండి. ఆడ్రియానాకు ఏడు సంవత్సరాలున్నప్పుడు ఆమె తల్లి మరణించింది. ఆ తర్వాత కొంతకాలానికి తండ్రి ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. పది సంవత్సరాల వయస్సులో బ్రతుకుదెరువు కోసం ఆమె పని చేయడం ప్రారంభించింది. దేవునికి చర్చికి సేవచేయమని తన తల్లి చెప్పింది గనుక, ఆడ్రియానా వివిధ కాథోలిక్‌ గుంపులతో సహవసించింది, కాని తనకు 12 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఆమె వారి మూలంగా నిరాశ చెంది, అల్లరిమూకతో కలిసింది. ఆమె పొగత్రాగడం మత్తుపదార్థాలు తీసుకోవడం దొంగతనం చేయడం మొదలుపెట్టింది. అలాంటి ఒక యౌవనురాలు దేవున్ని స్తుతించాలని ఎందుకు కోరుకుంటుంది?

ఆడ్రియానా సహోదరి యెహోవాసాక్షులతో బైబిలు పఠించనారంభించింది, కాని ఆడ్రియానా ఆమెను అపహాస్యం చేసింది. పిమ్మట వాళ్ల ఆంటీ మరణించింది. వాళ్ల ఆంటీ అంత్యక్రియల సమయంలో, వేధిస్తున్న ప్రశ్నలతో ఆడ్రియానా విసిగి వేసారిపోయింది. వాళ్ల ఆంటీ ఎక్కడికి వెళ్లింది? ఆమె పరలోకంలో ఉందా? ఆమె అగ్నితో నిండిన నరకానికి వెళ్లిందా? అదెంతో గందరగోళంగా ఉంది, తన సహోదరి నేర్పించినట్లుగా దేవుని నామమైన యెహోవాను ఉపయోగిస్తూ సహాయం కొరకు ప్రార్థించడానికి ఆడ్రియానా సమాధి స్థలంలోని ప్రార్థనా మందిరానికి వెళ్లింది.

త్వరలోనే ఆమె యెహోవాసాక్షులతో బైబిలు పఠిస్తూ వారి క్రైస్తవ కూటాలకు హాజరుకాసాగింది. ఇది ఆమెకు జీవితం ఎడల ఒక పూర్తి క్రొత్త దృక్కోణాన్నిచ్చింది, ఆమె అల్లరి మూకతో తన సహవాసాన్ని ధైర్యంగా తెంచేసుకుంది. ఇప్పుడు ఇరవై ఏళ్లుపైగావున్న ఆడ్రియానా ఇలా చెబుతోంది: “యెహోవా ఎడలవున్న ప్రేమ వలననే నేను అలాంటి చెడు జీవితాన్ని విడిచిపెట్టగలిగాను. తన గొప్ప కనికరంతో యెహోవా మాత్రమే నాకు నిత్యజీవ నిరీక్షణనివ్వగల్గాడు.” ఆడ్రియానా జీవితం కష్టాలతో ఆరంభమైనప్పటికీ, దేవున్ని స్తుతించేందుకు ఆమె చక్కని కారణాలను కలిగివుంది.

యుక్రేయిన్‌ నుండి మరింత నిరాశాజనకమైన పరిస్థితి నివేదించబడుతోంది. ఒక వ్యక్తి శిక్ష అమలు కొరకు చెరసాలలో కూర్చొని ఉన్నాడు. అతడు తన మీద తానే జాలిపడుతూ ఉన్నాడా? కృంగిపోయాడా? లేదు, దానికి పూర్తి భిన్నంగా ఉన్నాడు. ఇటీవలనే యెహోవాసాక్షులను కలిసి, యెహోవా గురించిన కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆయన తన తల్లిని కలవమని వారిని కోరాడు. ఆయన విన్నపాన్ని వారు అంగీకరించారని తెలుసుకుని ఆయన ఇప్పుడు వారికి ఉత్తరం వ్రాశాడు. “నా తల్లిని సందర్శించినందుకు కృతజ్ఞతలు. గత సంవత్సరంలో నేను విన్న అత్యంత సంతోషకరమైన వార్త అదే” అని ఆయన అంటున్నాడు.

తన గురించి, తాను చెరసాల గదిలో సాక్ష్యమిచ్చినవారి గురించి చెబుతూ ఆయనిలా వ్రాశాడు: “ఇప్పుడు మాకు దేవునియందు విశ్వాసం ఉంది, మా విశ్వాసానికి అనుగుణ్యంగా ప్రవర్తించాలని ప్రయత్నిస్తున్నాము.” ఆయన తన లేఖను ఇలా ముగించాడు: “ప్రేమ అంటే ఏమిటో, విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. నేను సజీవంగా మిగిలివుంటే, నేను కూడా మీకు తోడ్పడతాను. మీరు ఉనికిలో ఉన్నందుకు, దేవున్ని ప్రేమించి ఆయనయందు విశ్వాసముంచడానికి ఇతరులకు మీరు సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు.” ఈ వ్యక్తి తన మరణశిక్షను తప్పించమని విన్నవించుకున్నాడు. కాని ఆయనకు శిక్ష విధించబడినా లేక ఆయన చెరసాలలో అనేక సంవత్సరాలు గడిపినా, దేవున్ని స్తుతించడానికి ఆయనకు సరియైన కారణం ఉంది.

‘నేను అంధురాలినైనప్పటికీ, నేను చూడగలను’

హఠాత్తుగా తన చూపును కోల్పోయిన ఒక ఆరోగ్యవంతురాలైన అమ్మాయిని ఇప్పుడు పరిశీలించండి. అర్జెంటీనాలో నివసించే గ్లోరియా అదే అనుభవించింది. గ్లోరియా 19 ఏండ్ల ప్రాయంలో హఠాత్తుగా అంధురాలయ్యింది, ఆమె మళ్లీ ఎన్నడూ తన కంటి చూపును తిరిగి పొందలేదు. 29 సంవత్సరాల వయస్సులో, ఆమె ఒక వ్యక్తికి ఉపపత్నిగా ఉంటూ అనతికాలంలోనే గర్భవతి అయ్యింది. ఇప్పుడు తన జీవితానికొక అర్థం ఉందని ఆమె భావించింది. కాని ఆమె తన బిడ్డను కోల్పోయినప్పుడు, ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. ఆమె ఇలా ఆలోచించింది, ‘నాకెందుకిలా జరుగుతోంది? నేనేం చేశాను? దేవుడు నిజంగా ఉన్నాడా?’

ఈ సమయంలో, ఇద్దరు యెహోవాసాక్షులు ఆమె ఇంటికి వచ్చారు. ఆమె బైబిలు పఠించనారంభించి, నూతన లోకంలో అంధులు తిరిగి చూపు పొందుతారనే దాని వాగ్దానం గురించి తెలుసుకుంది. (యెషయా 35:5) గ్లోరియాకు ఎంతటి అద్భుతమైన ఉత్తరాపేక్ష లభించింది! ప్రాముఖ్యంగా తన భర్త తమ వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి అంగీకరించినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది. అప్పుడు ఆమె భర్త దుర్ఘటనకు గురై వికలాంగుడై చక్రాల కుర్చీ పాలయ్యాడు. జీవనం కొనసాగించడానికి నేడు ఈ అంధ స్త్రీ కష్టపడి పనిచేయాలి. దానికి తోడు, ఆమె ఇంట్లో పనంతా చేసుకుని, తన భర్త ఎడల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటుంది. అయినప్పటికీ గ్లోరియా యెహోవాను స్తుతిస్తుంది! తన క్రైస్తవ సహోదర సహోదరీల సహాయంతో, ఆమె బ్రెయిలీ బైబిలును పఠిస్తుంది, రాజ్యమందిరంలో జరిగే క్రైస్తవ కూటాల ద్వారా ఆమె ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతుంది. ఆమె ఇలా చెబుతుంది: “దాన్ని వివరించడం కష్టం, కాని నేను అంధురాలినైనప్పటికీ, నేను చూడగలుగుతున్నట్లుగా ఉంది.”

కొన్నిసార్లు ప్రజలు దేవున్ని స్తుతిస్తున్నందుకు హింసింపబడతారు. దేవుని గురించి తెలుసుకున్నప్పుడు క్రోయేషియాలోని ఒక స్త్రీ సంతోషించింది, కాని ఆమె క్రొత్తగా కనుగొన్న సత్యాన్ని ఆమె భర్త వ్యతిరేకించి, ఒక సంవత్సరం వయస్సున్న తమ కుమార్తెను తనతోనే ఉంచుకుని ఆమెను మాత్రం విడిచిపెట్టాడు. నిలువనీడలేక, భర్త, కుటుంబం విడిచిపెట్టగా, ఇల్లు ఉద్యోగం చివరికి కుమార్తె కూడా లేనందున ఆమె మొదట్లో పతనమైపోయినట్లు భావించింది. కాని, తన కుమార్తె ఎదిగే వరకు ఆమెతో కేవలం కొంత సంబంధమే ఉన్నప్పటికీ, దేవుని ఎడల ఆమెకున్న ప్రేమ ఆమెను బలపర్చింది. ఈ స్త్రీ ‘అమూల్యమైన ముత్యాన్ని’ కనుగొని, దాన్ని జారవిడుచుకోలేదు. (మత్తయి 13:45, 46) ఈ కష్టసమయాల్లో ఆమె తన సంతోషాన్ని ఎలా కాపాడుకుంది? ఆమె ఇలా చెబుతుంది: “సంతోషం దేవుని ఆత్మఫలాలలో ఒకటి. బయటి వాతావరణం ఎలా ఉన్నా హరిత గృహంలో మొక్కలు ఎలా పెరగగల్గుతాయో అలాగే బాహ్య పరిస్థితులతో సంబంధం లేకుండా దాన్ని వృద్ధి చేసుకోవచ్చు.”

ఫిన్‌లాండ్‌లో, ఆరు సంవత్సరాల మార్కస్‌కు బాగుచేయలేని కండరాల వ్యాధి ఉన్నట్లు రోగనిర్ధారణ అయ్యింది. త్వరలోనే అతడు చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, ప్రజలను స్వస్థపరుస్తాడని బహుళ ప్రచారం పొందిన ఒక పెంతెకొస్తు వ్యక్తి దగ్గరికి వాళ్లమ్మ అతన్ని తీసుకువెళ్లింది. కాని అతనికి అద్భుతమైన స్వస్థత ఏమి జరగలేదు. కాబట్టి మార్కస్‌ దేవునియందు ఆసక్తిని కోల్పోయి, విజ్ఞానశాస్త్రం మరియు ఇతర లౌకిక రంగాల్లో విద్యనభ్యసించాడు. తర్వాత, దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, చక్రాల కుర్చీలోవున్న స్త్రీ ఒక యౌవనస్థునితో కలిసి మార్కస్‌ నివసిస్తున్న ఇంటికి వెళ్లింది. వాళ్లు యెహోవాసాక్షులు. అప్పటికి మార్కస్‌ నాస్తికుడు, కాని మతం గురించి మాట్లాడడానికి ఆయనకేమి అభ్యంతరం లేదు కాబట్టి వారిని లోనికి ఆహ్వానించాడు.

ఆ తర్వాత, ఒక వివాహిత జంట ఆయనను సందర్శించి, బైబిలు పఠనం ప్రారంభించారు. చివరికి, బైబిలు సత్యం యొక్క శక్తి మార్కస్‌ దృక్పథాన్ని మార్చింది, తాను వికలాంగుడైనా దేవున్ని స్తుతించడానికి నిజంగా తనకు కారణాలు ఉన్నాయని ఆయన గుర్తించాడు. ఆయనిలా చెప్పాడు: “నేను సత్యాన్ని, యెహోవా ఉపయోగించుకొంటున్న సంస్థను కనుగొన్నాను గనుక నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా జీవితానికిప్పుడు ఆశయం, అర్థం ఉన్నాయి. తప్పిపోయిన మరో గొర్రెను కనుగొన్నారు, యెహోవా మందను విడిచిపెట్టడం ఇష్టంలేదు!”—మత్తయి 10:6 పోల్చండి.

అందరూ ‘యాను స్తుతించుదురు’ గాక

తమ పరిస్థితులు ఏవైనప్పటికీ మానవులు నేడు దేవున్ని స్తుతించడానికి కారణం కలిగివుండగలరని చూపించడానికిగల అసంఖ్యాకమైన అనుభవాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. అపొస్తలుడైన పౌలు దాన్నిలా వివరించాడు: “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.” (1 తిమోతి 4:8) మనం దేవుని చిత్తాన్ని చేస్తే, ఆయన ‘ఇప్పటి జీవము విషయంలోని వాగ్దానాన్ని’ నెరవేరుస్తాడు. నిజమే, ఈ విధానంలో ఆయన పేదవారిని ధనికులుగా లేక రోగులను ఆరోగ్యవంతులుగా చేయడు. కాని తన సేవ చేసేవారు తమ భౌతిక పరిస్థితులు ఏవైనప్పటికీ సంతోషాన్ని సంతృప్తిని పొందగలిగేలా ఆయన వారికి తన ఆత్మనిస్తాడు. అవును, ‘ఇప్పటి జీవములోను’ అనారోగ్యులు, కృంగినవారు, పేదవారు దేవున్ని స్తుతించడానికి కారణాన్ని కలిగివుండవచ్చు.

కాని ‘రాబోవు జీవము’ విషయమేమిటి? ఆ తలంపే మనం దేవున్ని గొప్ప ఉత్సాహంతో స్తుతించేలా చేయాలి! పేదరికమే ఎరుగని సమయం గురించి, ‘నాకు దేహములో బాగులేదని అందులో నివసించువాడెవడును అనకుండా’ ఉండే సమయం గురించి, యెహోవా దేవుడు ‘వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసి, మరణము ఇక ఉండని, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండని, మొదటి సంగతులు గతించిపోయిన’ సమయం గురించి తలంచడానికి మనం పులకించిపోతాము. (యెషయా 33:24; ప్రకటన 21:3, 4; కీర్తన 72:16) దేవుడిచ్చే ఈ వాగ్దానాలను మీరెలా దృష్టిస్తారు?

ఈ విషయాల్లో కొన్నింటిని వివరించిన ఒక బైబిలు కరపత్రాన్ని ఎల్‌సాల్వడార్‌ నందలి ఒక యౌవనస్థుడు తీసుకున్నాడు. తనకు దాన్నిచ్చిన సాక్షితో ఆయనిలా చెప్పాడు, “ఏమండీ, ఈ కరపత్రం తెలియజేస్తున్నది నిజంగా సత్యమేనండి.” అనేకులు అలా ప్రతిస్పందిస్తారు. అయితే, విశ్వాన్ని సృష్టించి, భూమి యొక్క ప్రకృతి చక్రాలను ఏర్పరచి, చివరికి పేదవారు అనారోగ్యులు కూడా సంతోషాన్ని కనుగొనడానికి సహాయం చేసేవాడే ఈ వాగ్దానాలను చేశాడు. ఆయన చెప్పేదాన్ని మనం నమ్మవచ్చు. పైన చెప్పిన యౌవనస్థుడు యెహోవాసాక్షులతో బైబిలు పఠించి, ఇది నిజమని కనుగొన్నాడు. అలా మీరు ఇంకా చేయకపోతే, చేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అప్పుడు, ఈ ప్రస్తుత విధానం గతించిపోయి, సర్వసృష్టి “హల్లెలూయా!” “యాను స్తుతించుడి!” అని ముక్తకంఠంతో ఆలపించే సమయంలో మీరూ అక్కడ ఉందురుగాక!—కీర్తన 112:1; 135:1.

[అధస్సూచీలు]

a బైబిలునందు, కొన్నిసార్లు “యెహోవా” అనేది “యా” అనే సంక్షిప్తరూపంలో వాడబడింది.

[5వ పేజీలోని చిత్రం]

సర్వసృష్టి “హల్లెలూయా!” అని ముక్తకంఠంతో ఆలపించే సమయంలో మీరూ అక్కడ ఉందురుగాక!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి