అకుల మరియు ప్రిస్కిల్ల—ఆదర్శమైన దంపతులు
“క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. . . . నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులైయున్నారు.”—రోమీయులు 16:3, 4.
రోమ్‌లోని క్రైస్తవ సంఘానికి అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటలు, ఈ వివాహిత దంపతుల ఎడల ఆయనకున్న గొప్ప గౌరవం మరియు అనురాగంతో కూడిన మాన్యతను సూచిస్తున్నాయి. వారి సంఘానికి వ్రాస్తున్నప్పుడు వారిని ఉపేక్షించకుండా ఉండేలా ఆయన జాగ్రత్తవహించాడు. కానీ పౌలు యొక్క ఈ ఇద్దరు ‘జతపనివారు’ ఎవరు, మరియు వారు ఆయనకు, సంఘానికి ఎందుకంత ప్రియమైనవారయ్యారు?—2 తిమోతి 4:19.
అకుల డయస్పోరా (చెల్లాచెదురైన యూదుల)లోని ఒక యూదుడు, ఉత్తర ఆసియా మైనరులోని ఒక ప్రాంతంలోని పొంతుకు చెందినవాడు. ఆయన, ఆయన భార్య ప్రిస్కిల్ల (ప్రిస్క) రోమ్‌లో స్థిరపడ్డారు. సా.శ.పూ. 63లో కనీసం పోంపే యెరూషలేమును పట్టుకుని, రోమ్‌కు ఎంతోమంది బానిసలుగా నడిపించబడినప్పటినుండీ ఆ నగరంలో యూదుల సమాజం పెద్ద సంఖ్యలోనే ఉంది. వాస్తవానికి, రోమన్ అభిలేఖనాలు ఆ ప్రాచీన పట్టణంలో డజను లేక అంతకు ఎక్కువ సమాజ మందిరాలు ఉన్నట్లు వెల్లడిచేశాయి. రోమ్‌నుండి వచ్చిన అనేకమంది యూదులు సా.శ. 33లో పెంతెకొస్తు పండుగ దినమున యెరూషలేములో ఉన్నారు, వారు సువార్తను అప్పుడు విన్నారు. బహుశ వారి ద్వారానే క్రైస్తవ వర్తమానం రోమా సామ్రాజ్యపు రాజధానిని మొట్టమొదటిసారిగా చేరుకుని ఉండవచ్చు.—అపొస్తలుల కార్యములు 2:10.
అయితే, సా.శ. 49 లేక 50 తొలిభాగంలో చక్రవర్తి క్లౌదియ ఆజ్ఞ ప్రకారం యూదులు రోమ్‌నుండి బహిష్కరించబడ్డారు. అలా, అపొస్తలుడైన పౌలు అకుల, ప్రిస్కిల్లలను గ్రీకు నగరమైన కొరింథులో కలిశాడు. పౌలు కొరింథుకు చేరుకున్నప్పుడు అకుల, ప్రిస్కిల్లలు దయాపూర్వకంగా ఆతిథ్యాన్నిచ్చి, పనిని కూడా కల్పించారు, ఎందుకంటే వారిది ఒకే వృత్తి—డేరాలు కుట్టే వృత్తి.—అపొస్తలుల కార్యములు 18:1-3.
డేరాలు కుట్టేవారు
ఇది సుళువైన పని కాదు. డేరాలు కుట్టడంలో గట్టి, గరుకైన పదార్థాన్ని లేక తోలు ముక్కలను కోయడం, కలిపి కుట్టడం ఇమిడివుంటుంది. చరిత్రకారుడైన ఫేర్నాండో బేయా ప్రకారం, అది డేరాలు కుట్టేవారి విషయంలో “నిపుణత మరియు శ్రద్ధ ఆవసరమయ్యే” ఒక వృత్తి. వారు “ప్రయాణంలో విడిది చేసేటప్పుడు ఎండ నుండి, వర్షం నుండి రక్షణను అందించడానికి, లేక ఓడలో సామాన్ల గదిలోని సామాన్లను కట్టడానికి ఉపయోగించే ముతక బట్టలు, గట్టి బట్టలను ఉపయోగించి” పని చేసేవారు.
ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. పౌలు తాను రాబోయే సంవత్సరాలలో ఒక ప్రతిష్ఠాత్మకమైన జీవిత గమనాన్ని వెంబడించడానికి మార్గమేర్పరుస్తూ, ‘గమలీయేలు పాదములయొద్ద శిక్షితుడైనట్లు’ చెప్పలేదా? (అపొస్తలుల కార్యములు 22:3) ఇది నిజమైయుండగా, మొదటి శతాబ్దంలోని యూదులు ఒక కుర్రవాడు ఉన్నత విద్యను పొందబోతున్నప్పటికీ ఆయనకు ఒక వృత్తి నేర్పించడం ఘనమైన పనిగా పరిగణించేవారు. కాబట్టి అకుల, పౌలు ఇద్దరూ డేరాలు కుట్టడంలోని తమ నైపుణ్యాన్ని వారు యౌవనులుగా ఉన్నప్పుడే పొంది ఉంటారు. ఆ అనుభవం తరువాత చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు రుజువైంది. కానీ క్రైస్తవులుగా, వారు అటువంటి లౌకిక పనే తమ ముఖ్య లక్ష్యం అని పరిగణించలేదు. అకుల, ప్రిస్కిల్లలతోపాటు తాను కొరింథులో చేసిన పని ‘ఎవనికిని భారముగా ఉండకుండా,’ సువార్తను ప్రకటించాలనే తన ప్రధాన కార్యానికి మద్దతునిచ్చే మాధ్యమం మాత్రమేనని పౌలు వివరించాడు.—2 థెస్సలొనీకయులు 3:8; 1 కొరింథీయులు 9:18; 2 కొరింథీయులు 11:7.
స్పష్టంగా, అకుల, ప్రిస్కిల్లలు పౌలు యొక్క మిషనరీ సేవ సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి తాము చేయగల్గినంత చేయడంలో సంతోషించారు. వినియోగదారులకు లేక అటుగా వెళ్తున్న వారికి అనియత సాక్ష్యమివ్వడానికి ఈ ముగ్గురు స్నేహితులు తమ పనిని ఎన్నిసార్లు ఆపారో ఎవరికి తెలుసు! డేరాలు కుట్టే తమ పని అల్పమైనది మరియు అలసటను కలిగించేది అయినప్పటికీ, వారు ఆ పని చేయడానికి సంతోషించారు. దేవుని ఆసక్తులను పెంపొందించడానికి “రాత్రింబగళ్లు” కూడా పని చేశారు—స్వల్పకాలిక ఉద్యోగం లేక ఒక్కో కాలానికి సంబంధించిన పనులు చేసి తమను తాము పోషించుకుంటూ, మిగిలిన సమయంలో ఎక్కువ మొత్తాన్ని ప్రజలు సువార్తను వినేలా సహాయం చేయడానికి వినియోగిస్తున్న అనేకమంది ఆధునికదిన క్రైస్తవుల్లాగానే వారు చేశారు.—1 థెస్సలొనీకయులు 2:9; మత్తయి 24:14; 1 తిమోతి 6:6.
ఆతిథ్యానికి మాదిరులు
పౌలు తాను కొరింథులో ఉన్న 18 నెలలపాటు తన మిషనరీ కార్యకలాపాల కేంద్ర స్థావరంగా బహుశ అకుల ఇంటిని ఉపయోగించి ఉంటాడు. (అపొస్తలుల కార్యములు 18:3, 11) అలాగైతే, అకుల మరియు ప్రిస్కిల్లలు మాసిదోనియనుండి వచ్చిన సీల (సిల్వాను), తిమోతిలను కూడా అతిథులుగా ఆహ్వానించడంలో సంతోషించి ఉంటారన్నది సంభావ్యమే. (అపొస్తలుల కార్యములు 18:5) అటుతర్వాత ప్రామాణిక బైబిలు పుస్తకాలలో భాగమైన, థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన రెండు ఉత్తరాలు బహుశ అపొస్తలుడు అకుల మరియు ప్రిస్కిల్లల వద్ద ఉంటున్నప్పుడు వ్రాసివుండవచ్చు.
ఈ సమయంలో ప్రిస్కిల్ల, అకులల ఇల్లు దైవపరిపాలనా కార్యకలాపాలకు నిజమైన కేంద్రస్థావరంగా ఉందనేది ఊహించడం సులభమే. పౌలు చేతనే బాప్తిస్మం పొందిన, అకయ ప్రదేశంలోని మొట్టమొదటి క్రైస్తవులైన స్తెఫను మరియు అతని ఇంటివారు; ప్రసంగాలను ఇవ్వడానికి తన ఇంటిని ఉపయోగించుకోవడానికి అనుమతించిన తీతియు యూస్తు; తన కుటుంబమంతటితోపాటు సత్యాన్ని స్వీకరించిన, సమాజమందిరపు అధికారియైన క్రిస్పు వంటి అనేకమంది ప్రియమైన స్నేహితులు బహుశ ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండివుండవచ్చు. (అపొస్తలుల కార్యములు 18:7, 8; 1 కొరింథీయులు 1:16) అటువంటివారిలో వీరు కూడా ఉన్నారు: ఫొర్మూనాతు, అకాయికు; గాయి, ఈయన ఇంట్లో సంఘ కూటాలు జరిగివుండవచ్చు; ఎరస్తు, ఈయన పట్టణపు ఖజానాదారుడు; తెర్తి, పౌలు కార్యదర్శియైన ఈయనకు రోమీయులకైన తన పత్రికను చెప్పి వ్రాయించాడు; మరియు దగ్గరలోని కెంక్రేయ సంఘంలోని ఒక విశ్వసనీయురాలైన సహోదరి అయిన ఫీబే, ఈమె కొరింథు నుండి రోమ్‌కు ఉత్తరాన్ని బహుశ తీసుకుని వెళ్లివుండవచ్చు.—రోమీయులు 16:1, 22, 23; 1 కొరింథీయులు 16:17.
ప్రయాణ పరిచారకునికి ఆతిథ్యాన్ని చూపించే అవకాశం దొరికిన యెహోవా యొక్క ఆధునిక దిన సేవకులకు అది ఎంత ప్రోత్సాహకరంగాను, చిరస్మరణీయంగాను ఉంటుందో తెలుసు. అటువంటి సందర్భాలలో చెప్పబడే పురోభివృద్ధికరమైన అనుభవాలు అందరికీ ఆత్మీయ సేదదీర్పుకొరకైన నిజమైన మూలంగా ఉంటాయి. (రోమీయులు 1:11, 12) మరి, అకుల మరియు ప్రిస్కిల్లలు చేసినట్లుగానే కూటాలకు, బహుశ సంఘ పుస్తక పఠనానికి తమ ఇండ్లను తెరిచివుంచేవారు సత్యారాధన అభివృద్ధికి ఈ విధంగా దోహదపడగల్గడం నుండి వచ్చే ఆనందాన్ని, సంతృప్తిని కలిగివుంటారు.
పౌలుతో అకుల, ప్రిస్కిల్లల స్నేహం ఎంత సన్నిహితంగా ఉందంటే ఆయన సా.శ. 52 వసంతంలో కొరింథును విడిచివెళ్తున్నప్పుడు వారు ఆయనతోపాటుగా బయలుదేరి ఎఫెసు వరకు వచ్చారు. (అపొస్తలుల కార్యములు 18:18-21) వారు ఆ నగరంలో ఉండి, అపొస్తలుని తదుపరి సందర్శనం కొరకు పునాదిని వేశారు. సువార్తను నైపుణ్యంతో బోధించే వీరు, వాక్చాతుర్యంగల అపొల్లోను “చేర్చుకుని దేవునిమార్గము మరిపూర్తిగా” అర్థం చేసుకోవడంలో ఆయనకు సహాయపడి ఆనందించింది ఇక్కడే. (అపొస్తలుల కార్యములు 18:24-26) పౌలు తన మూడవ మిషనరీ ప్రయాణంలో సా.శ. 52/53 శీతాకాలం దరిదాపుల్లో ఎఫెసును పునఃసందర్శించినప్పుడు శక్తిమంతమైన ఈ జంటచే సాగుచేయబడిన క్షేత్రం అప్పటికే కోతకు సిద్ధమైంది. దాదాపు మూడు సంవత్సరాలు పౌలు అక్కడ “మార్గము”ను గురించి ప్రకటించి, బోధించాడు, ఇదిలా ఉండగా ఎఫెసు సంఘము అకుల ఇంట్లో కూటాలను జరుపుకుంది.—అపొస్తలుల కార్యములు 19:1-20, 26; 20:31; 1 కొరింథీయులు 16:8, 19.
తరువాత, వారు రోమ్‌కు తిరిగివచ్చినప్పుడు, పౌలు యొక్క ఈ ఇద్దరు స్నేహితులు తమ ఇంటిని క్రైస్తవ కూటాల కొరకు అందుబాటులో ఉంచుతూ ‘శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వడంలో’ కొనసాగారు.—రోమీయులు 12:13; 16:3-5.
వారు పౌలు కొరకు ‘తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి’
బహుశ పౌలు కూడా తాను ఎఫెసులో ఉన్నప్పుడు అకుల, ప్రిస్కిల్లలతో ఉండివుండవచ్చు. వెండి కంసాలుల గలిబిలి జరిగిన సమయంలో ఆయన వారి వద్ద ఉన్నాడా? అపొస్తలుల కార్యములు 19:23-31లోని వృత్తాంతం ప్రకారం వెండి గుళ్లు చేసిన కంసాలులు సువార్త ప్రకటనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, పౌలు ఆ మూక ముందుకు వెళ్లి ప్రమాదంలో పడకుండా సహోదరులు ఆయనను అడ్డగించారు. కొంతమంది బైబిలు వ్యాఖ్యాతలు సరిగ్గా అటువంటి అపాయకరమైన సందర్భంలోనే పౌలు ‘తాను బ్రతుకుతాడనే నమ్మకము లేనట్లు’ భావించి ఉండవచ్చని, అకుల మరియు ప్రిస్కిల్లలు ఏదో విధంగా కలుగజేసుకుని ‘తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి’ ఉండవచ్చని సిద్ధాంతీకరించారు.—2 కొరింథీయులు 1:8; రోమీయులు 16:3, 4.
‘అల్లరి అణగిన’ తర్వాత పౌలు జ్ఞానయుక్తంగా ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోయాడు. (అపొస్తలుల కార్యములు 20:1) అకుల, ప్రిస్కిల్లలు వ్యతిరేకతను, హేళనను ఎదుర్కొన్నారన్నది నిస్సందేహమే. అటువంటివి వారి హృదయాలను కృంగదీశాయా? అందుకు బదులుగా, అకుల మరియు ప్రిస్కిల్లలు తమ క్రైస్తవ ప్రయత్నాల్లో ధైర్యంగా కొనసాగారు.
ఒక సన్నిహిత జంట
క్లౌదియ పరిపాలన అంతమైన తర్వాత, అకుల మరియు ప్రిస్కిల్లలు రోమ్‌కు తిరిగి వెళ్లిపోయారు. (రోమీయులు 16:3-15) అయితే, వారు బైబిలులో ఆఖరుసారిగా పేర్కొనబడినప్పుడు మనం వారిని మరల ఎఫెసులో కనుగొంటాము. (2 తిమోతి 4:19) మరల, లేఖనాల్లోని ఇతర అన్ని వచనాల్లో వలెనే ఈ భార్యాభర్తలు కలిసి పేర్కొనబడ్డారు. ఎంతటి సన్నిహిత మరియు ఐక్యమైన జంటయో కదా! పౌలు ఆ ప్రియ సహోదరుడైన అకులను గురించి, ఆతని భార్య యొక్క విశ్వసనీయమైన సహకారాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆలోచించలేడు. మరి నేటి క్రైస్తవ భార్యాభర్తలకు ఎంతటి చక్కని ఉదాహరణ, ఎందుకంటే నిష్ఠగల భార్య లేక భర్త యొక్క యథార్థమైన సహాయం ఒక వ్యక్తిని “ప్రభువు కార్యభివృద్ధియందు” ఎంతో చేయడానికి, కొన్నిసార్లు అవివాహితగా ఉన్న వ్యక్తికి సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ చేయడానికి అనుమతిస్తుంది.—1 కొరింథీయులు 15:58.
అకుల, ప్రిస్కిల్లలు అనేక వేర్వేరు సంఘాలలో సేవచేశారు. వారివలె, అనేకమంది ఉత్సాహపూరిత ఆధునికదిన క్రైస్తవులు అవసరం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడికి వెళ్లడానికి తమను తాము అందుబాటులో ఉంచుకున్నారు. వారు కూడా రాజ్యాసక్తులు అభివృద్ధి చెందడాన్ని చూడడం నుండి మరియు అనురాగపూరితమైన, అమూల్యమైన క్రైస్తవ స్నేహాలను వికసించుకోగలగడం నుండి వచ్చే ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు.
క్రైస్తవ ప్రేమ విషయంలో వారి అద్భుతమైన ఉదాహరణ ద్వారా, అకుల మరియు ప్రిస్కిల్లలు పౌలు మరియు ఇతరుల ప్రశంసను గెలిచారు. కానీ మరింత ప్రాముఖ్యంగా, వారు యెహోవాతోటే ఒక చక్కని పేరును స్థాపించుకున్నారు. లేఖనాలిలా హామీనిస్తున్నాయి: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.
అకుల, ప్రిస్కిల్లలు చేసినటువంటి మార్గాలలో మనలను మనం వెచ్చించుకునే అవకాశం మనకు లేకపోవచ్చు, అయినప్పటికీ మనలో ప్రతి ఒక్కరు వారి అత్యుత్తమ ఉదాహరణను అనుకరించవచ్చు. ‘అట్టి యాగములు దేవునికిష్టమైనవి గనుక, ఉపకారమును ధర్మమును చేయ’ మరచిపోకుండా మన శక్తిని, జీవితాన్ని పవిత్ర సేవలో ఉపయోగిస్తుండగా ప్రగాఢమైన సంతృప్తి మనదౌతుంది.—హెబ్రీయులు 13:15, 16.