కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/15 పేజీలు 20-21
  • “మరి మీ చర్చి ఎక్కడుంది?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మరి మీ చర్చి ఎక్కడుంది?”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/15 పేజీలు 20-21

“మరి మీ చర్చి ఎక్కడుంది?”

మొజాంబిక్‌లోని యెహోవాసాక్షులు తరచూ ఈ ప్రశ్నను ఎదుర్కొంటారు. కచ్చితంగా, చెప్పాలంటే ఇటీవల వరకూ ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టంగా ఉండేది. ఎందుకంటే యెహోవాసాక్షులు ఈ దేశంలో 1991 వరకు చట్టబద్ధమైన గుర్తింపును పొందలేదు. అందువలన, ఆరాధన కొరకై స్పష్టంగా గుర్తించదగిన, స్థాపితమైన స్థలాలు కలిగివుండడం సాధ్యం కాలేదు.

అయితే, ఆ పరిస్థితి ఫిబ్రవరి 19, 1994లో మారింది. ఆ వెచ్చని దినాన మొజాంబిక్‌లో మొట్టమొదట నిర్మించబడిన రెండు రాజ్యమందిరాల సమర్పణ జరిగింది. మొజాంబిక్‌ తీరం వెంబడి దాదాపు సగం దూరంలో ఉన్న ఓడరేవు నగరమైన బేరాలో కూటాల కొరకైన ఈ చక్కని స్థలాల సమర్పణ కార్యక్రమానికి మొత్తం 602 మంది హాజరయ్యారు. అవి ఆ నగరంలో ఉన్న మూడు సంఘాల అవసరాలను తీరుస్తాయి.

పూర్తి ప్రాజెక్టుకు అంటే, పునాది వేయడం మొదలుకొని నిర్మాణాలు పూర్తి చేయడం వరకు సంవత్సరం రెండు నెలల కృషి జరిగింది. తరచు 30 లేక అంతకు ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు పొరుగున ఉన్న జింబాబ్వే నుండి వచ్చి, స్థానిక సాక్షులతో భుజాభుజాలు కలిపి పనిచేశారు. కార్యకలాపాలకు స్థావరంగా పనిచేసిన బేరాలోని మిషనరీ గృహంలో వారందరికీ వసతి ఏర్పాటు చేయలేకపోయినందువల్ల, కొంతమంది వారాంతాల్లోను కొన్ని సందర్భాల్లో ఏకబిగిన కొన్ని వారాలపాటు ఆ గృహం చుట్టూ మకాం వేసేవారు.

మాసాంబ, మూనావ సంఘాలకు రాజ్యమందిర స్థలం బేరా రహదారి ప్రక్కన ఉంది. “బిజీగా ఉన్న ఒక దినాన పని వేగంగా జరిగి, అభివృద్ధి చాలా గమనార్హంగా ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న డ్రైవర్లు రాజ్యమందిరాన్ని తేరిచూస్తూ, తమ స్టీరింగ్‌ వీల్‌లను దాదాపు మర్చిపోతుండగా దుర్ఘటనలు తృటిలో తప్పిపోవడం మేము చూశాము” అని ఒక మిషనరీ అంటున్నాడు. అనేకమంది పనిని చూసేందుకు ఆగారు, వేర్వేరు జాతుల ప్రజలు ఒక్కటిగా కలిసి పనిచేయడాన్నిబట్టి వారు విశేషంగా ప్రసన్నులయ్యారు.

పని చేయడానికి పెద్ద మొత్తంలో ప్రణాళిక, సంస్థీకరణ అవసరమైంది. వస్తు సామగ్రి, వనరులు అరకొరగా ఉండే ప్రపంచంలోని ఈ భాగంలోని ఇతర ప్రాజెక్టులవలె కాకుండా రాజ్యమందిరాలపై పని సరఫరాలు లేకపోవడంవల్ల ఎప్పుడూ నిలిచిపోలేదు. ఒక సందర్భంలో, 800 బస్తాల సిమెంటు అవసరమైంది, దాన్ని సరఫరా చేయగల ఒకే ఒక్క స్థలంలో సిమెంటును నింపడానికి అవసరమైన బస్తాలు లేవు. సహోదరులు రాజధానియైన మాపుటోలోని వాచ్‌టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించారు; ఖాళీ బస్తాలు విమానంలో వచ్చాయి, వాటిని సిమెంటు ఫ్యాక్టరీకి తీసుకెళ్లి నింపారు. పని నిరాటంకంగా సాగిపోయింది.

ఇంకొక సందర్భంలో, కప్పు ట్రస్సులు అమర్చేటప్పుడు, సిబ్బందికి స్టీలు చువ్వలు తక్కువయ్యాయి. తీవ్రమైన కొరత ఉండడం మూలాన ప్రాజెక్టుకు స్టీలు 600 కిలోమీటర్ల దూరం నుండి దిగుమతి చేసుకోబడింది! అక్కడ చూస్తూవున్న ఒక వ్యక్తిని సిబ్బందిలోని ఒకరు కలిసి, పనిని పూర్తి చేయడానికి స్టీలును వారెక్కడ కనుగొనగలరని అడిగాడు. ఆ వ్యక్తి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: “నేను ఇక్కడ గంటకు పైగా నిల్చుని ఉన్నాను, ఇది కాకతాళీయం కాకపోవచ్చు. మీరు చేస్తున్న పనిని, ఈ ప్రాజెక్టులో ఉన్న స్ఫూర్తిని నేను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. సరిగ్గా మీకు అవసరమైనటువంటి స్టీలే నా దగ్గరుంది, దాన్ని మీకు ఒక బహుమతిగా ఇవ్వడానికి నేను సంతోషిస్తాను.” అది సరైన సమయానికి అవసరమైన సహాయంగా రుజువైంది.

చూసేవారు అనేకమంది ప్రాజెక్టు వెనుక ఎంత పెద్ద నిర్మాణ సంస్థ ఉందోనని ఆశ్చర్యపోయారు. అయితే సిబ్బంది తాము యెహోవాసాక్షులమని, తమ సేవలను స్వచ్ఛందంగా అందజేస్తున్నామని చెప్పడంలో గొప్ప ఆనందాన్ని కనుగొన్నారు. చూసేవారిని ఏది ప్రాముఖ్యంగా ఆకట్టుకుంది? “మీరు ఐక్యతగల ప్రజలు” అని ఒకరన్నారు. “వేర్వేరు జాతుల వారైనప్పటికీ మీరు సహోదరులుగా పనిచేస్తారు.” దాని ఫలితమేమంటే అనేకమంది తమతో బైబిలు పఠించమని అడిగేందుకు వచ్చారు. అది కూటాలపైన కూడా ప్రభావం కలిగివుంది. ఉదాహరణకు, మాంగ సంఘంలోని కూటాల సగటు హాజరు సాక్షుల సంఖ్య కంటే రెండింతలు ఉంది.

క్రొత్త రాజ్యమందిరాలు నిజంగా స్థానిక సాక్షులకు ఒక ఆశీర్వాదంగా రుజువయ్యాయి. అనేకమంది ఇంతకుపూర్వము గడ్డి కప్పుతో లేక పైన కొన్ని తగరపు రేకులతో ఉన్న పాతకాలపు కట్టడాల్లోనో, ఇంటి పెరడులోనో, లేక ఎవరింట్లోనైనా చిన్న గదిలోనో కూడుకునేవారు. వర్షం వచ్చినప్పుడు వారు తరచూ తడిసిపోయేవారు; అయినప్పటికీ వారు కూటాలకు విశ్వసనీయంగా హాజరయ్యేవారు. దశాబ్దాలుగా మొజాంబిక్‌లోని సాక్షులకు తెలిసిన “రాజ్యమందిరాలు” ఇవే. మాసాంబ సంఘంలోని పెద్ద అయిన సహోదరుడు కైటానూ గాబ్రీయెల్‌ ఇలా ప్రకటించాడు: “ఈ ప్రాజెక్టు వాస్తవ రూపందాల్చడానికి దోహదపడిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా సహోదరులకు మేము కృతజ్ఞులము.” ఒక యౌవన సాక్షి ఇలా గుర్తు తెచ్చుకున్నాడు: “మేము కారీకూలో (యెహోవాసాక్షులు దాదాపు 12 సంవత్సరాలు స్థాననిర్బంధంలో ఉన్న “పునరభ్యాస క్యాంపులు”) ఉన్నప్పుడు, ‘మేము విశ్వసనీయంగా పట్టుదలతో కొనసాగుతాం, అప్పుడు యెహోవా మాకు ప్రతిఫలం ఇస్తాడు’ అని మేము అనేవారం. క్రొత్త రాజ్యమందిరం యెహోవా నుండి వచ్చిన ప్రతిఫలం.” వారి మాటలు వారి లోతైన కృతజ్ఞతాభావాన్ని, యెహోవాను స్తుతించడానికి వారికున్న నిశ్చయతను వ్యక్తం చేస్తున్నాయి.

నిర్మాణ పనిలో పాలుపంచుకున్న అనేకమంది యౌవనులు పయినీరు స్ఫూర్తితో నింపబడి, తరువాత క్రమ పయినీరు పరిచర్యను చేపట్టారు. మాంగ సంఘంలో ఒక క్రమ పయినీరుగా చేస్తున్న యౌవనురాలైన ఈజాబెల్‌, నిష్కళంకంగా శుభ్రంగా ఉన్న రాజ్యమందిరాన్ని దాని సమర్పణ దినానికి ముందు రోజు చూస్తూ ఇలా వ్యాఖ్యానించింది: “నాకైతే బేరా నగరంలో ఇది అత్యంత సుందరమైన స్థలం. నేనిక్కడ ఉన్నందుకు అత్యంత సంతోషంగా ఉన్నాను.” సాక్షుల నిజాయితీ స్థానిక అధికారులు ఎరుగుదురు గనుక ప్రత్యేక దిగుమతి ప్రక్రియలను అనుమతించడంలో వారు ఎంతో సహకరించారని మిషనరీ అయిన ఆడవూ కోస్ట వివరించాడు. తరువాత ఆయనిలా జతచేశాడు: “మేము చాలా అలసిపోయినప్పటికీ, యెహోవా ఘనత, మహిమ కొరకైన ఈ పనియంతటిలోని ప్రతిఫలాన్ని చూడడం ఆనందదాయకం.”

ఇప్పుడు, బేరా నగరంలో స్నేహపూర్వక నివాసి ఎవరైనా “మరి మీ చర్చి ఎక్కడుంది?” అని అడిగితే, రెండు క్రొత్త రాజ్యమందిరాలలో ఒకదాని గురించి చెబుతూ, “అది ఆవెనీడ ఆకోర్డూ డ లూసాక, అంతర్జాతీయ రోడ్డుపైన, నాలుగవ స్క్వాడ్రన్‌ పోలీస్‌ స్టేషన్‌కి సరీగ్గా ఎదురుగా ఉంది” వంటి మాటల్లో సాక్షి ఆయనకు దారి చూపుతాడు. తరువాత, ఒక తప్పుదిద్దుతూ ఇలా అంటాడు, “అయితే అది ఒక చర్చి కాదు. అది రాజ్యమందిరం!”

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఆఫ్రికా

మొజాంబిక్‌

బేరా

మాపుటో

[క్రెడిట్‌ లైను]

Map: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి