కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 12/1 పేజీలు 4-8
  • శిధిలాల మధ్య సహాయాన్ని అందించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • శిధిలాల మధ్య సహాయాన్ని అందించడం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అక్రా—“ఒక మినీ నోవహు దినం”
  • శాన్‌ ఆంజిలో—“దాని శబ్దం ప్రపంచం అంతమౌతుందన్నట్లుగా ఉంది”
  • కోబీ—“చెక్క, ప్లాస్టరు, మానవ శరీరాల శిధిలాలు”
  • శాశ్వత ఉపశమనం త్వరలోనే!
  • జపాన్‌లో అకస్మాత్తుగా సంభవించిన విపత్తును ప్రజలెలా ఎదుర్కున్నారు
    తేజరిల్లు!—1995
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఆండ్రూ తుఫాను నాశనం చేయలేనివి
    తేజరిల్లు!—1993
  • ప్రకృతి వైపరీత్యాలు దాడిచేసినప్పుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 12/1 పేజీలు 4-8

శిధిలాల మధ్య సహాయాన్ని అందించడం

వైపరీత్యం సంభవించిన వెంటనే సహాయాన్ని అందించడానికైన మానవుని ప్రయత్నం తప్పకుండా ప్రశంసనీయమైనది. అనేక సహాయక కార్యక్రమాలు ఇండ్లను పునర్నిర్మించడానికి, కుటుంబాలను పునరేకీకరణం చేయడానికి, అన్నింటికీ మించి జీవితాలను కాపాడడానికి సహాయం చేశాయి.

వైపరీత్యం దాడిచేసినప్పుడు లౌకిక సహాయక కార్యక్రమాల ద్వారా చేయబడే ఎటువంటి ఏర్పాట్లనైనా యెహోవాసాక్షులు ఉపయోగించుకుంటారు, దానికై వారు కృతజ్ఞులై ఉంటారు. అదే సమయంలో వారు ‘విశేషముగా విశ్వాసగృహమునకు చెందినవారి ఎడల మేలు చేసే’ లేఖనాధార బాధ్యతను కలిగివుంటారు. (గలతీయులు 6:10) అవును, సాక్షులు తాము ఒకరికొకరు సంబంధించిన వారిగా భావిస్తారు; వారు ఒకరినొకరు “కుటుంబము”గా దృష్టిస్తారు. అందువలననే వారు ఒకరినొకరు “సహోదరుడు” మరియు “సహోదరి” అని సంబోధించుకుంటారు.—మార్కు 3:31-35 పోల్చండి; ఫిలేమోను 1, 2.

కాబట్టి పొరుగు ప్రాంతంలో ఒక వైపరీత్యం సంభవించినప్పుడు, యెహోవాసాక్షులలోని పెద్దలు ప్రతి సంఘ సభ్యుడు ఎక్కడున్నాడో, అవసరాలేమిటో నిర్ధారించుకోవడానికి ప్రయాసపూర్వకమైన ప్రయత్నాలను చేసి, అవసరమైన సహాయం కొరకు ఏర్పాట్లను చేస్తారు. ఘానాలోని అక్రాలోను; అమెరికాలోని శాన్‌ ఆంజిలోలోను; జపాన్‌లోని కోబీలోను ఇది ఎలా నిజమైందో పరిశీలించండి.

అక్రా—“ఒక మినీ నోవహు దినం”

రాత్రి దాదాపు 11 గంటలకు వర్షం కురవనారంభించింది, అలా గంటల కొలది నిర్విరామంగా కురిసింది. “ఎంత కుండపోతగా కురిసిందంటే నా కుటుంబమంతా మేల్కొనే ఉంది” అని అక్రాలోని ఒక యెహోవాసాక్షి అయిన జాన్‌ ట్వూమాసీ అంటున్నాడు. డైలీ గ్రాఫిక్‌ దానిని “ఒక మినీ నోవహు దినం” అని పిలిచింది. “మేం కొన్ని విలువైనవాటిని పైనున్న ఇండ్లలోకి తీసుకెళ్లాలని ప్రయత్నించాము” అని జాన్‌ చెప్పాడు. ఆయనిలా కొనసాగించాడు, “కానీ మేం మెట్లవైపు తలుపును తెరిచేసరికి వరద నీరు వెల్లువలా లోపలికి వచ్చింది.”

అధికారులు ఖాళీ చేయమని హెచ్చరికలు చేశారు, అయినా చాలామంది సంకోచించారు, ఖాళీ ఇల్లు—నీటితో నిండినదైనా—దోపిడీదార్లను ఆహ్వానిస్తుందని భయపడ్డారు. విడిచిపెట్టాలనుకున్నా కొందరు విడిచిపెట్టలేకపోయారు. “మా అమ్మా, నేను తలుపును తెరవలేకపోయాము” అంటుంది పవులీనా అనే అమ్మాయి. “నీటిమట్టం పెరుగుతునే ఉంది, అందుకని మేం చెక్క పీపాల మీద నిల్చుని, పైకప్పుకి ఉన్న ఒక దూలాన్ని పట్టుకున్నాము. చివరికి, ఉదయాన దాదాపు ఐదు గంటలకి మా పొరుగువారు మమ్మల్ని కాపాడారు.”

సాధ్యమైనంత త్వరలో, యెహోవాసాక్షులు పని ప్రారంభించారు. బీయట్రస్‌ అనే క్రైస్తవ సహోదరి ఇలా వివరిస్తుంది: “సంఘంలోని పెద్దలు మా కొరకు వెదుకుతున్నారు, మేము ఆశ్రయం పొందుతున్న తోటి సాక్షి ఇంట్లో వారు మమ్మల్ని కనుగొన్నారు. వరద వచ్చిన కేవలం మూడు రోజుల తరువాత, సంఘంలోని పెద్దలు మరియు యౌవన సభ్యులు మావైపు వచ్చి, ఇంటా బయటా ఉన్న మట్టిని ఎత్తివేశారు. వాచ్‌ టవర్‌ సొసైటీ డిటర్జెంట్లను, రోగక్రిమి సంహారకాలను, పెయింటును, పరుపులను, దుప్పట్లను, గుడ్డలను, పిల్లలకు బట్టలను పంపిణీ చేసింది. సహోదరులు మాకొరకు అనేక దినాలు ఆహారాన్ని పంపించారు. నేను ఎంతో కదిలింపబడ్డాను!”

ఇంతకుముందు పేర్కొనబడిన జాన్‌ ట్వూమాసీ ఇలా నివేదిస్తున్నాడు: “మా సొసైటీ మాకు డిటర్జెంట్లను, రోగక్రిమి సంహారకాలను పంపించిందని, అవి పూర్తి అపార్ట్‌మెంట్‌ను శుభ్రం చేయడానికి సరిపోతాయని నేను ఇతర కిరాయిదార్లకు చెప్పాను. దాదాపు 40 మంది కిరాయిదార్లు శుభ్రం చేయడానికి సహాయం చేశారు. నేను డిటర్జెంట్లలో కొంత నా పొరుగువారికి ఇచ్చాను, వారిలో స్థానిక చర్చిలోని ప్రీస్టు కూడా ఉన్నాడు. నా తోటి ఉద్యోగస్థులు యెహోవాసాక్షులు తమ స్వంత ప్రజల ఎడల మాత్రమే ప్రేమను కనబరుస్తారని అపార్థం చేసుకున్నారు.”

క్రైస్తవ సహోదర సహోదరీలు వారికి అందించబడిన ప్రేమపూర్వకమైన సహాయం నిమిత్తం చాలా ప్రశంసను చూపించారు. సహోదరుడు ట్వూమాసీ ఇలా ముగిస్తున్నాడు: “నేను వరదలో పోగొట్టుకున్నవి సహాయక వస్తువులకన్నా చాలా ఎక్కువ ఆర్థిక విలువను కలిగివున్నప్పటికీ, సొసైటీ నుండి వచ్చిన హృదయాన్ని స్పృశించే ఈ ఏర్పాటు వలన మేము పోగొట్టుకున్న దానికంటే ఎంతో ఎక్కువ సంపాదించామని నేను, నా కుటుంబము భావిస్తున్నాము.”

శాన్‌ ఆంజిలో—“దాని శబ్దం ప్రపంచం అంతమౌతుందన్నట్లుగా ఉంది”

1995, మే 28న శాన్‌ ఆంజిలోను ధ్వంసం చేసిన తుపానులు చెట్లను పెళ్లగించాయి, విద్యుత్‌ స్తంభాలను పెరికివేశాయి, విద్యుత్‌ తీగలను రోడ్లకడ్డంగా పడవేశాయి. గాలులు ప్రజోపయోగ నిర్మాణాలను నష్టపరుస్తూ దాదాపు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వీచాయి. 20,000 కంటే ఎక్కువ ఇండ్లలో కరెంటు పోయింది. తరువాత వడగళ్ల వాన వచ్చింది. జాతీయ వాతావరణ సర్వీసు “నిమ్మకాయ పరిమాణంలోని వడగళ్లు,” తరువాత “నారింజకాయ పరిమాణంలోని వడగళ్లు,” చివరికి “కొబ్బరికాయ పరిమాణంలోని వడగళ్లు” పడినట్లు నివేదించింది. భీకరమైన దాడి చప్పుడు చెవులు చిల్లులు పడేలా ఉంది. ఒక వాస్తవ్యుడు ఇలా అన్నాడు: “దాని శబ్దం ప్రపంచం అంతమౌతుందన్నట్లుగా ఉంది.”

తుపాను తరువాత భయభ్రాంతులను చేసే నిశ్శబ్దం ఏర్పడింది. ప్రజలు నెమ్మదిగా ధ్వంసమైన తమ ఇండ్ల నుండి నష్టాన్ని నిర్ధారించడానికి వెలుపలికి వచ్చారు. ఇంకా అలాగే నిటారుగా ఉన్న చెట్లు తమ ఆకులను కోల్పోయి ఉన్నాయి. ఇంకా కూలిపోని ఇండ్లు చెక్కు తీసేసినట్లుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వడగళ్లు ఒక మీటరు లోతువరకు మేటవేసి భూమిని కప్పాయి. ఇండ్లు మరియు వాహనాల వేలాది కిటికీలు తుపానులో ముక్కలు ముక్కలయ్యాయి, అందువలన ఇప్పుడు భూమిని దుప్పటిలా కప్పిన వడగళ్ల ప్రక్కనే పగిలిన గాజుముక్కలు తళతళ మెరుస్తున్నాయి. “నేను ఇంటికి తిరిగి వచ్చి, ఇంటి బయట నా కారులో కూర్చుని ఏడ్చాను. ఎంత నష్టం జరిగిందంటే, అది నన్ను అశక్తురాలినిగా చేసింది” అని ఒక స్త్రీ అంటుంది.

సహాయక కార్యక్రమాలు మరియు ఆసుపత్రులు త్వరితంగా ఆర్థిక సహాయాన్ని, నిర్మాణ సామగ్రిని, వైద్య చికిత్సను, సలహాలను అందించాయి. తామే తుపాను బాధితులైనప్పటికీ అనేకమంది వ్యక్తులు ఇతరులకు చేయగలిగినంత సహాయం చేయడం శ్లాఘనీయం.

యెహోవాసాక్షుల సంఘాలు కూడా చర్యలు గైకొన్నాయి. శాన్‌ ఆంజిలోలోని ఒక పెద్ద అయిన ఆబ్రీ కానర్‌ ఇలా నివేదిస్తున్నాడు: “తుపాను నిమ్మళించిన వెంటనే మేము ఒకరి పరిస్థితిని ఇంకొకరు తెలుసుకోవడానికి ఫోన్లు చేశాము. కిటికీలను అమర్చడానికి, ఇంటికప్పులపై ప్లాస్టిక్కును వేయడానికి, ఇండ్లను వీలైనంత మట్టుకు వాతావరణ ప్రభావం ఉండని విధంగా చేయడానికి మేము ఒకరికొకరం సహాయం చేసుకుని, సాక్షులు కాని పొరుగువారికి సహాయం చేశాము. తరువాత సంఘంలో ఇల్లు పాడైన ప్రతి వ్యక్తి పేరు మీద మేము ఒక్కో ఫైలును తయారు చేశాము. దాదాపు ఒక వంద ఇండ్లకు మరమ్మతు అవసరం అయింది, సహాయ ఏజెన్సీలు సరఫరా చేసిన సామగ్రి సరిపోలేదు. అందుకని మేము అదనపు సామగ్రిని కొనుక్కుని పనికి సంఘటితమయ్యాము. మొత్తానికి, ప్రతి వారాంతానికి దాదాపు 250 మంది చొప్పున దాదాపు 1,000 మంది సాక్షులు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా వచ్చారు. వారు 740 కిలోమీటర్లంత దూరాల నుండి వచ్చారు. తరచూ 40 డిగ్రీల సెల్సియస్‌ వాతావరణంలోను అందరూ అవిశ్రామంగా పనిచేశారు. చివరికి 70 సంవత్సరాల ఒక సహోదరి మాతో అన్ని వారాంతాల్లోనూ పనిచేసింది, ఒక్కసారి మాత్రం తన స్వంత ఇల్లు మరమ్మతు చేయబడుతున్నప్పుడు ఆమె అందులో సహాయపడుతూ తన ఇంటి పైకప్పుమీద ఉంది!

“చూసేవారి నుండి మేము తరచూ ‘ఇతర మతాలు తమ సభ్యుల కొరకు ఇలా చేస్తే ఎంత బాగుంటుంది?’ అనే వ్యక్తీకరణలను విన్నాము. 10 నుండి 12 మంది స్వచ్ఛంద సేవకుల (సహోదరీలు కూడా) జట్టు శుక్రవారం ఉదయాన మరమ్మతు చేయడానికి లేక పూర్తి ఇంటి పైకప్పును ఉచితంగా పునర్నిర్మించడానికి ఒక తోటి సాక్షి ఇంటివద్దకు చేరుకోవడాన్ని చూసి మా పొరుగువారు ప్రసన్నులయ్యారు. అనేక సందర్భాలలో పని ఒక్క వారాంతంలోనే ముగిసేది. కొన్నిసార్లు, మన జట్టు ఆ ఇంటికి చేరుకునేప్పటికే ఒక బయటి కాంట్రాక్టరు ప్రక్కింటి పైకప్పు పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటాడు. వారు తమ కప్పును పునర్నిర్మించక ముందే మేము మా పాత కప్పును పీకివేసి, పునర్నిర్మించి, పెరడు శుభ్రం చేసేస్తాము. కొన్నిసార్లు వారు కేవలం మమ్మల్ని చూడడానికి తమ పని ఆపేసేవారు!”

కానర్‌ ఇలా అంటూ ముగిస్తున్నాడు: “మేము కలిసి ఆనందించిన అనుభవాలను మేమందరం మరలా అనుభవించలేము. క్రితమెన్నడూ లేనంతగా సహోదర ప్రేమ చూపించడం ద్వారాను, చూపించబడడం ద్వారాను ఒకరినొకరం వేర్వేరు దృష్టికోణాలలో తెలుసుకున్నాము. సహోదర సహోదరీలు ఒకరికొకరు నిజంగా సహాయం చేసుకోవాలని కోరుకోవడంబట్టే సహాయం చేసే దేవుని నూతన లోకంలో ఎలా ఉంటుందో అన్నదానికి ఇది కేవలం ఒక నమూనా మాత్రమేనని మేము భావిస్తున్నాము.”—2 పేతురు 3:13.

కోబీ—“చెక్క, ప్లాస్టరు, మానవ శరీరాల శిధిలాలు”

కోబ్‌ నివాసులు సిద్ధపడి ఉండవలసినవారు. నిజానికి, ప్రతి సెప్టెంబరు 1న వారు వైపరీత్యాల నివారణ దినాన్ని ఆచరిస్తారు. పాఠశాల విద్యార్థులు భూకంపం డ్రిల్లులను అభ్యసిస్తారు, సైనికులు హెలికాప్టర్‌ ద్వారా రక్షణ చర్యలను అభ్యసిస్తారు, అగ్నిమాపకదళం వారు భూకంపాన్ని సిమ్యులేట్‌ చేసే తమ యంత్రాలను బయటికి తీస్తారు, వాటిలో నిజమైన భూకంపంలానే కదిలి, కంపించే ఒక గది పరిమాణంలో ఉన్న డబ్బాలో స్వచ్ఛంద సేవకులు తప్పించుకునేందుకైన తమ నైపుణ్యాలను అభ్యాసం చేస్తారు. కానీ నిజమైనది 1995, జనవరి 17న సంభవించినప్పుడు సిద్ధపాటు అంతా నిరుపయోగమే అన్నట్లు అనిపించింది. సిమ్యులేటర్లలో ఎన్నడూ జరగని విధంగా వేలాది ఇంటి కప్పులు కూలిపోయాయి. రైళ్లు ప్రక్కకు ఒరిగిపోయాయి; ప్రధాన రహదారుల భాగాలు ముక్కలయ్యాయి; గ్యాసు మరియు నీటి ప్రధాన వాహికలు పగిలిపోయాయి; ఇళ్లు పేకముక్కల్లా కూలిపోయాయి. టైమ్‌ పత్రిక ఆ దృశ్యాన్ని “చెక్క, ప్లాస్టరు, మానవ శరీరాల శిధిలాలు” అని వర్ణించింది.

అప్పుడు వచ్చాయి మంటలు. కిలోమీటర్ల పొడవున ఉన్న వాహనాల రద్దీలో అగ్నిమాపకదళం వారు ఇరుక్కుపోగా ఇవతల భవనాలు భగ్గుమన్నాయి. పాడైన నీటి సరఫరా వ్యవస్థ నుండి నీటిని పొందలేమని మంటలను చేరినవారు తరచూ కనుగొన్నారు. “మొట్టమొదటి దినం పూర్తి అల్లకల్లోలంగా ఉంది” అన్నాడు ఒక అధికారి. “మండుతున్న ఆ ఇండ్ల క్రింద అంత మంది ప్రజలు ఉన్నారని, దాని గురించి నేను చేయగలిగినదేమీ లేదని తెలుసుకొని నా జీవితంలో అంత శక్తిహీనునిగా నేను ఎప్పుడూ భావించలేదు.”

మొత్తమ్మీద, దాదాపు 5,000 మంది ప్రజలు చనిపోయారు, రమారమి 50,000 భవనాలు శిధిలాలుగా పడివున్నాయి. అవసరమైన దానిలో మూడవ వంతు ఆహారం మాత్రమే కోబీ కలిగివుంది. నీటిని పొందడానికి కొంతమంది పగిలిపోయిన నీటి పంపుల క్రిందనున్న మట్టినీటిని ముంచుకున్నారు. నిరాశ్రయులైన అనేకమంది ఆశ్రయ స్థలాలవైపు పరిగెత్తారు, ప్రతి వ్యక్తికి రోజుకి చాలా తక్కువ మొత్తంలో అన్నాన్ని కేటాయిస్తూ, వాటిలో కొన్నింట్లో ఆహారాన్ని కొలత ప్రకారం ఇచ్చారు. అసంతృప్తి త్వరలోనే వ్యాపించింది. “అధికారులు ఏమీ చేయలేదు” అంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. “మనము వారిపై ఆధారపడడం కొనసాగిస్తే మనము ఆకలికి అలమటించి మరణిస్తాము.”

కోబ్‌లోని మరియు దాని దగ్గర ప్రాంతాలలోని యెహోవాసాక్షుల సంఘాలవారు తమను తాము వెంటనే సంఘటితం చేసుకున్నారు. వారి పనిని ప్రత్యక్షంగా చూసిన ఒక హెలికాప్టర్‌ పైలట్‌ ఇలా అన్నాడు: “భూకంపం సంభవించిన రోజున నేను విపత్తు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక వారం రోజులు గడిపాను. నేను ఒక ఆశ్రయ ప్రాంతానికి చేరుకున్నప్పుడు మొత్తమంతా గందరగోళంగా ఉంది. సహాయక చర్యలంటూ అక్కడేమీ జరగడం లేదు. ఆ స్థలానికి వెంటనే చేరుకుని, అవసరమైన పని చేస్తున్నవారిలో యెహోవాసాక్షులు మాత్రమే ఉన్నారు.”

నిజానికి, చేయవలసిన పని ఎంతో ఉంది. పది రాజ్యమందిరాలు పనికిరాకుండా పోయాయి. 430 కంటే ఎక్కువమంది సాక్షులు నిరాశ్రయులైనారు. అదనంగా మరమ్మతు అవసరమైన 1,206 ఇండ్లలో వారు నివసించారు. అంతేకాదు, ఈ విపత్తులో చనిపోయిన 15 మంది సాక్షుల కుటుంబాలకు ఎంతో ఆదరణ అవసరమైంది.

దేశవ్యాప్తంగా దాదాపు 1,000 మంది సాక్షులు మరమ్మతు పని చేయడానికై తమ సమయాన్ని వెచ్చించడానికి స్వచ్ఛందంగా వచ్చారు. “ఇంకా బాప్తిస్మం పొందని బైబిలు విద్యార్థుల ఇండ్లపై మేము పనిచేసినప్పుడు, మమ్మల్ని ప్రతీసారి ‘దీనికంతటికీ మేము ఎంత డబ్బు కట్టాలి?’ అని వారు అడిగారు. ఈ పనికి సంఘాలచే మద్దతు ఇవ్వబడుతుందని మేము చెప్పినప్పుడు వారు ‘మేము పఠించినది ఇప్పుడు ఒక వాస్తవం అయ్యింది!’ అంటూ మాకు కృతజ్ఞతలు తెలియజేశారు” అని ఒక సహోదరుడు అంటున్నాడు.

విపత్తు ఎడల సాక్షుల సత్వరమైన మరియు సంపూర్ణమైన ప్రతిస్పందన అనేకమందిని ప్రభావితం చేసింది. “నేను చాలా ప్రభావితం చెందాను” అంటున్నాడు ఇంతకుముందు పేర్కొనబడిన పైలట్‌. “మీరు ఒకరినొకరు ‘బ్రదర్‌’ మరియు ‘సిస్టర్‌’ అని పిలుచుకుంటారు. మీరు ఒకరికొకరు ఎలా సహాయం చేసుకుంటారో నేను చూశాను; మీరు నిజంగా ఒక కుటుంబమే.”

భూకంపం నుండి సాక్షులు కూడా విలువైన పాఠాలను నేర్చుకున్నారు. ఒక సహోదరి ఇలా ఒప్పుకుంది: “ఒక సంస్థ ఎంత పెద్దగా అవుతుందో, వ్యక్తిగత శ్రద్ధను కనపర్చడం అంత కష్టంగా ఉంటుందని నేనెప్పుడు భావించేదాన్ని.” కానీ ఆమె పొందిన వాత్సల్యంతో కూడిన శ్రద్ధ ఆమె దృష్టికోణాన్ని మార్చివేసింది. “యెహోవా మన కొరకు ఒక సంస్థగా మాత్రమే కాకుండా వ్యక్తులుగా కూడా మన ఎడల శ్రద్ధవహిస్తున్నాడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను.” అయితే, వైపరీత్యాల నుండి శాశ్వత ఉపశమనం ముందుంది.

శాశ్వత ఉపశమనం త్వరలోనే!

యెహోవాసాక్షులు మానవ జీవితం మరియు జీవనం ఇంకెప్పటికీ వైపరీత్యాలచే తగ్గించబడని కాలం కొరకు ఎదురుచూస్తారు. దేవుని నూతన లోకంలో, మనుష్యుడు భూమి యొక్క పర్యావరణంతో సహకరించేందుకు బోధించబడతాడు. మానవులు స్వార్థపరమైన అభ్యాసాలను విడిచిపెడ్తుండగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్కువ ప్రభావితం చేయబడేవారిగా వారు ఉంటారు.

అదనంగా, తన మానవ కుటుంబము మరియు భూ సృష్టి ప్రకృతి శక్తులచే మరెప్పుడూ హానిని అనుభవించకుండా ప్రకృతి శక్తుల సృష్టికర్త అయిన యెహోవా దేవుడు చూస్తాడు. అప్పుడు భూమి నిజంగా ఒక పరదైసుగా ఉంటుంది. (యెషయా 65:17, 21, 23; లూకా 23:43) ప్రకటన 21:4లోని ప్రవచనం మహిమాన్వితంగా నెరవేర్చబడుతుంది: “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయె[ను].”

[5వ పేజీలోని చిత్రం]

బీయట్రస్‌ జోన్స్‌ (ఎడమ) తాను మరియు ఇతరులు కలిసి వరద నీటి గుండా రావడానికి గొలుసులా ఎలా ఏర్పడ్డారో ప్రదర్శిస్తుంది

[6వ పేజీలోని చిత్రం]

తుపానుల తరువాత సహాయక చర్యలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి