రాజ్య ప్రచారకుల నివేదిక
పాఠశాలలో స్థిరమైన స్థానం వహించడం మంచి ప్రతిఫలమిచ్చింది
“నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును” అని బైబిలు ప్రవచిస్తుంది. (యెషయా 54:13) విస్తృత భావంలో “నీ పిల్లలందరు” అనేది భూమిపైన ఉన్న దేవుని సేవకుల సమూహానికంతటికీ అన్వయించవచ్చు, చిన్న పిల్లలు కూడా ఇందులో ఉన్నారు. ఈనాడు, క్రైస్తవ తలిదండ్రులు తమ పిల్లలు ఇంటివద్ద, క్రైస్తవ కూటాలలోను “యెహోవాచేత ఉపదేశము” పొందుతున్నారని నిశ్చయపర్చుకుంటారు.
అయితే, యౌవన క్రైస్తవులు పాఠశాలకు హాజరయ్యేటప్పుడు కష్టతరమైన సవాళ్లను ఎదుర్కొంటారు. తరచూ బైబిలు నుండి తాము నేర్చుకున్న దాని ఆధారంగా దృఢమైన స్థానం వహించడం అవసరమని వారు కనుగొంటారు. వారలా చేసినప్పుడు, దాని ఫలితాలు మైక్రోనేషియాలో జరిగిన ఈ క్రింది అనుభవం చూపిస్తున్నట్లుగా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకూ ప్రయోజనకరంగా ఉండగలవు.
చుక్ దీవులలోని టోల్ అనే చిన్న పశ్చిమ పసిఫిక్ దీవిలో, స్థానిక పాఠశాలలోని ఉపాధ్యాయులు పాఠశాల యొక్క హాలవీన్ ఉత్సవం కొరకు సిద్ధపడి అందులో పాల్గొనమని పిల్లలందరికీ చెప్పారు. ఆ ఉత్సవంలో భూతాలు, దయ్యాలు, మంత్రగత్తెలను చిత్రిస్తున్నట్లు అలంకరణలు చేసుకోవడం, దుస్తులు వేసుకోవడం వంటివి ఇమిడి ఉండగలవని సాక్షుల పిల్లలకు తెలుసు. ఇవన్నీ అభిచార ఆచారాలకు సంబంధించినవే. ఈ పిల్లలు మనస్సాక్షి పూర్వకంగా పాల్గొనలేరు.a
ఇంటివద్ద, క్రైస్తవ సంఘంలోను వారు పొందిన బైబిలు ఆధారిత శిక్షణ ద్వారా, అటువంటి ఆచరణలను కేవలం వినోదం కొరకు చేసినా అవి దేవునికి అప్రీతికరమైనవని వారికి తెలుసు. వారి స్థానాన్ని ఇంకా స్పష్టంగా వివరించడంలో సహాయపడేందుకు ఆ ద్వీపంలోని సాక్షులలో ఒకరైన బారక్ అనే మిషనరీని తమ ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు పిల్లలు ఆహ్వానించారు.
వివరణను విన్న తరువాత, పూర్తి పాఠశాల సిబ్బందితో బారక్ మాట్లాడగలిగేలా రెండవ సమావేశం కొరకు ఉపాధ్యాయులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో, హాలవీన్ నిజ స్వరూపాన్ని చూపించడానికి బారక్ వాస్తవాలను అందించాడు. ఆయన తన సమాచారాన్ని అనేక వాచ్‌టవర్ ప్రచురణల నుండి, మరితర మూలాల నుండి కూడా తీసుకున్నాడు. ఆ ఉత్సవానికి ఉన్న మూలం, చరిత్ర, మత సంబంధ స్వరూపాన్ని గురించి వారు తెలుసుకున్న దాని ఎడల ఉపాధ్యాయులు, వ్యవస్థాపకులు దిగ్భ్రాంతి చెందారు. ఈ పరిస్థితిని ఎలా సరిచేయాలన్నది నిర్ణయించడానికి సిబ్బందితో సమావేశం జరపడానికి వారు నిశ్చయించుకున్నారు.
కొద్ది రోజుల తరువాత, ఒక అనూహ్యమైన నిర్ణయాన్ని ప్రకటించారు. హాలవీన్ కొరకైన అన్ని ఏర్పాట్లు రద్దు చేయబడుతున్నాయి. పాఠశాల ఆ సంవత్సరం హాలవీన్ను జరుపుకోదు, అంతే. పాఠశాలలో సరైనది చేయాలన్న ఈ యౌవన సాక్షుల నిర్ధారణ మూలంగా ఎంతటి అనుకూల ఫలితం వచ్చింది! యౌవనులు బైబిలు సత్యం కొరకు స్పష్టమైన స్థానం వహించడానికి ఎన్నడూ భయపడనవసరం లేదు లేక సిగ్గుపడనక్కర లేదు.
ప్రపంచ వ్యాప్తంగా, పాఠశాలలో కష్టించి పని చేయాలని యెహోవాసాక్షులు వారి పిల్లలకు బోధిస్తారు. యౌవన సాక్షులకు బైబిలు నియమాలకు తగ్గట్టుగా జీవించడానికి, వారికి అవకాశం లభించే కొలదీ తమ నిరీక్షణను, నమ్మకాలను ఇతర విద్యార్థులతో పంచుకోవడానికి కూడా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ విషయంలో జరిగినట్లుగా ఫలితాలు అంత అనుకూలంగా లేక అంత త్వరగా రాకపోయినా, యౌవనులు సరైనది చేయడం మూలంగా వచ్చే నమ్మకాన్ని, సంతృప్తిని కలిగియుండగలరు. అంతేగాక మరింత ప్రాముఖ్యమైనది ఏమంటే, వారి పరలోక తండ్రి సంతసిస్తాడని, విశ్వసనీయమైన విధేయత విషయమై వారిని ఆశీర్వదిస్తాడని నమ్మకం కలిగి ఉండవచ్చు.
[అధస్సూచీలు]
a హాలవీన్ మరియు దాని అభిచార సంబంధ మూలాధారాలపై మరింత సమాచారం కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన 1993, నవంబరు 22, తేజరిల్లు! (ఆంగ్లం) సంచిక చూడండి.