ప్రయాణ పైవిచారణకర్తలు నమ్మకమైన గృహనిర్వాహకులవలె సేవ చేసే విధానం
“దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, యొక్కొకడు కృపావరము పొందిన కొలది యొకనికొకడు ఉపచారము చేయుడి.”—1 పేతురు 4:10.
1, 2. (ఎ) ‘గృహనిర్వాహకుడు’ అనే పదాన్ని మీరెలా నిర్వచిస్తారు? (బి) దేవుడు ఉపయోగించుకొనే గృహనిర్వాహకులలో ఎవరెవరు చేరివున్నారు?
నమ్మకమైన క్రైస్తవులనందరినీ యెహోవా గృహనిర్వాహకులుగా ఉపయోగించుకుంటాడు. గృహనిర్వాహకుడంటే తరచూ ఒక గృహాన్ని చూసుకునే సేవకుడై ఉంటాడు. అతడు తన యజమాని వ్యాపార విషయాలను కూడా చూస్తుండవచ్చు. (లూకా 16:1-3; గలతీయులు 4:1, 2) భూమిపైనున్న తన నమ్మకమైన అభిషిక్తుల గుంపును యేసు ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అని పిలిచాడు. రాజ్యప్రకటన కార్యకలాపాలతో సహా “తనకు కలిగినదానియంతటి”ని ఆయన ఈ గృహనిర్వాహకునికి అప్పగించాడు.—లూకా 12:42-44; మత్తయి 24:14, 45.
2 క్రైస్తవులందరూ అనేక విధాలుగా వ్యక్తపర్చబడిన దేవుని కృపవిషయమైన గృహ నిర్వాహకులని అపొస్తలుడైన పేతురు చెప్పాడు. ఒక నమ్మకమైన గృహనిర్వాహకత్వాన్ని కొనసాగించగల స్థానం ప్రతి క్రైస్తవునికి ఉంది. (1 పేతురు 4:10) నియమిత క్రైస్తవ పెద్దలు గృహనిర్వాహకులై ఉన్నారు, వారిలో ప్రయాణ పైవిచారణకర్తలూ చేరివున్నారు. (తీతు 1:7, NW) ఈ ప్రయాణ పెద్దలను ఎలా దృష్టించాలి? వారు ఏ లక్షణాలను ఉద్దేశాలను కలిగి ఉండాలి? వారు ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని ఎలా చేకూర్చవచ్చు?
వారి సేవనుబట్టి కృతజ్ఞత కలిగివుండడం
3. ప్రయాణ పైవిచారణకర్తలు ‘మంచి గృహనిర్వాహకులని’ ఎందుకు పిలువబడవచ్చు?
3 ఒక ప్రయాణ పైవిచారణకర్తకు ఆయన భార్యకు ఉత్తరం వ్రాస్తూ ఒక క్రైస్తవ వివాహిత జంట ఇలా చెప్పారు: “మీరు మా కొరకు వెచ్చించిన సమయం మరియు మా ఎడల కనబర్చిన ప్రేమ అంతటినిబట్టి మేము మా కృతజ్ఞతను తెలియజేయగోరుతున్నాము. ఒక కుటుంబంగా మేము మీ ప్రోత్సాహం మరియు ఉపదేశమంతటి నుండి ఎంతో ప్రయోజనం పొందాము. మేము ఆత్మీయంగా ఎదగడంలో కొనసాగాలని మాకు తెలుసు, అయితే పెరుగుతున్న బాధలు యెహోవా సహాయంతోనూ మీవంటి సహోదర సహోదరీల సహాయంతోనూ సులభతరం చేయబడతాయి.” మంచి గృహనిర్వాహకుడు గృహ అవసరతల గురించి ఎలా చక్కగా శ్రద్ధ తీసుకుంటాడో అలాగే ప్రయాణ పైవిచారణకర్తలు తోటి విశ్వాసుల గురించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు గనుక ఇలాంటి భావాలు తరచూ వ్యక్తపర్చబడుతుంటాయి. కొందరు చక్కగా ప్రసంగించగలరు. అనేకులు ప్రకటన పనిలో మిన్నగా ఉంటారు, అయితే ఇతరులు తమ వాత్సల్యం, అనురాగాలనుబట్టి పేరుపొంది ఉంటారు. ఇతరులకు సేవ చేయడంలో అలాంటి ఈవులను వృద్ధిచేసుకుని, ఉపయోగించడం ద్వారా ప్రయాణ పైవిచారణకర్తలు తగినట్లుగానే ‘మంచి గృహ నిర్వాహకులని’ పిలువబడగలరు.
4. ఇప్పుడు ఏ ప్రశ్న పరిశీలించబడుతుంది?
4 “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (1 కొరింథీయులు 4:1, 2) వారం తర్వాత వారం వేర్వేరు సంఘాల్లో తోటి క్రైస్తవులకు సేవచేయడం ఒక విశేషమైన, ఆనందభరితమైన ఆధిక్యత. అయినప్పటికీ, అది ఒక బరువైన బాధ్యత కూడా. అయితే, ప్రయాణ పైవిచారణకర్తలు తమ గృహనిర్వాహకత్వాన్ని నమ్మకంగానూ విజయవంతంగానూ ఎలా నిర్వహించగలరు?
తమ గృహనిర్వాహకత్వాన్ని విజయవంతంగా నిర్వహించడం
5, 6. ఒక ప్రయాణ పైవిచారణకర్త జీవితంలో, యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం ఎందుకు ప్రాముఖ్యము?
5 ప్రయాణ అధ్యక్షులు విజయవంతమైన గృహనిర్వాహకులై ఉండాలంటే యెహోవాపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం ఆవశ్యకం. వారి కార్యక్రమ పట్టికనుబట్టి, అనేక బాధ్యతలనుబట్టి వారు కొన్నిసార్లు అధికభారంతో కృంగిపోయినట్లు భావించవచ్చు. (2 కొరింథీయులు 5:4 పోల్చండి.) కాబట్టి వారు కీర్తనల రచయితైన దావీదు యొక్క ఈ గీతానికి అనుగుణంగా చర్య తీసుకోవలసి ఉంటుంది: “నీ భారము యెహోవామీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) దావీదు వ్రాసిన ఈ మాటలు కూడా ఓదార్పునిస్తాయి: “ప్రభువు స్తుతినొందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు.”—కీర్తన 68:19.
6 తన ఆత్మీయ బాధ్యతల గురించి శ్రద్ధ తీసుకోవడానికి కావలసిన బలం పౌలుకు ఎక్కడి నుండి వచ్చింది? “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను” అని ఆయన వ్రాశాడు. (ఫిలిప్పీయులు 4:13) అవును, పౌలు బలానికి మూలం యెహోవా దేవుడే. అలాగే, పేతురిలా ఉపదేశించాడు: “ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారా మహిమపరచబడును.” (1 పేతురు 4:11) అనేక సంవత్సరాలపాటు ప్రయాణ పైవిచారణకర్తగా ఉండిన ఒక సహోదరుడు ఇలా చెబుతూ దేవునిపై ఆధారపడవలసిన అవసరతను నొక్కి తెలియజేశాడు: “సమస్యలతో వ్యవహరించేటప్పుడు ఎల్లప్పుడూ యెహోవా వైపు చూడండి, ఆయన సంస్థ సహాయాన్ని తీసుకోండి.”
7. ఒక ప్రయాణ పైవిచారణకర్త పనిలో సమతూకం ఒక పాత్రను ఎలా నిర్వహిస్తుంది?
7 సఫలుడైన ప్రయాణ అధ్యక్షునికి సమతూకం అవసరం. ఇతర క్రైస్తవులవలె, ఆయన “శ్రేష్ఠమైన కార్యములను వివేచింప”డానికి ప్రయాసపడతాడు. (ఫిలిప్పీయులు 1:9)a ఏదైనా విషయం గురించి స్థానిక పెద్దలకు ప్రశ్నలుంటే వారు సందర్శిస్తున్న ప్రాంతీయ పైవిచారణకర్తను సంప్రదించడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. (సామెతలు 11:14; 15:22) బహుశా, ఆయనిచ్చే సమతూకంగల సలహాలు మరియు లేఖనాధార ఉపదేశం ఆయన సంఘాన్ని విడిచి వెళ్లిన తర్వాత విషయాలతో వ్యవహరించడంలో కొనసాగడానికి పెద్దలకు ఎంతో సహాయకరమైనవిగా నిరూపించబడతాయి. కొంతమేరకు ఇలాంటి విషయాల గురించే పౌలు తిమోతికిలా చెప్పాడు: “నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.”—2 తిమోతి 2:2.
8. బైబిలు పఠనం, పరిశోధన మరియు ధ్యానించడం ఎందుకు ఆవశ్యకము?
8 యుక్తమైన ఉపదేశమివ్వడానికి లేఖనాధార పఠనం, పరిశోధన, ధ్యానం ఆవశ్యకం. (సామెతలు 15:28) ఒక జిల్లా పైవిచారణకర్త ఇలా చెప్పాడు: “పెద్దలతో సమావేశమయ్యేటప్పుడు, ఫలానా ప్రశ్నకు మనకు సమాధానం తెలియదని అంగీకరించడానికి మనం భయపడకూడదు.” ఒక విషయంపై “క్రీస్తు మనస్సు”ను పొందడానికి కృషి చేయడం, దేవుని చిత్తంతో పొందిక కలిగివుండడానికి ఇతరులకు సహాయం చేసే బైబిలు ఆధారిత ఉపదేశం ఇవ్వడాన్ని సాధ్యం చేస్తుంది. (1 కొరింథీయులు 2:16) కొన్నిసార్లు నడిపింపు కొరకు ఒక ప్రయాణ పైవిచారణకర్త వాచ్‌టవర్ సంస్థకు వ్రాయవలసి ఉంటుంది. ఏది ఏమైనా, పేరుప్రతిష్టలు లేదా వాక్చాతుర్యం కంటే యెహోవాయందు విశ్వాసం, సత్యం ఎడల ప్రేమ ఎంతో ఎక్కువ ప్రాముఖ్యం. పౌలు కొరింథులో తన పరిచర్యను “వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతోగాని” కాక “బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను” ప్రారంభించాడు. ఇది ఆయనను ప్రభావహీనున్ని చేసిందా? బదులుగా, ‘మనుష్యుల జ్ఞానమునందు గాక దేవుని శక్తియందు’ విశ్వాసముంచడానికి ఇది కొరింథీయులకు సహాయం చేసింది.—1 కొరింథీయులు 2:1-5.
ఇతర ప్రాముఖ్యమైన లక్షణాలు
9. ప్రయాణ పెద్దలు తదనుభూతి కలిగివుండడం ఎందుకవసరం?
9 మంచి ఫలితాలు సాధించడానికి తదనుభూతి ప్రయాణ అధ్యక్షులకు సహాయం చేస్తుంది. ‘ఒకరి సుఖదుఃఖములందు ఒకరు పాలుపంచుకొమ్మని’ లేక “సానుభూతి” కలిగివుండమని పేతురు క్రైస్తవులందరికీ ఉద్బోధించాడు. (1 పేతురు 3:8, NW, అధఃస్సూచి) ‘సంఘంలోని ప్రతి ఒక్కరి ఎడల ఆసక్తి కలిగివుండి నిజమైన శ్రద్ధ చూపించవలసిన’ అవసరత ఉందని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త భావిస్తున్నాడు. అదే స్ఫూర్తితో పౌలు ఇలా వ్రాశాడు: “సంతోషించు వారితో సంతోషించుడి; ఏడ్చువారితో ఏడువుడి.” (రోమీయులు 12:15, 16) తోటి విశ్వాసుల సమస్యలను, పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తీవ్రప్రయత్నాలు చేసేందుకు అలాంటి దృక్పథం ప్రయాణ పైవిచారణకర్తలను కదిలిస్తుంది. అప్పుడు వారు ప్రోత్సాహకరమైన లేఖనాధారిత ఉపదేశాన్ని ఇవ్వగలుగుతారు, దాన్ని అన్వయించుకున్నప్పుడు నిజమైన ప్రయోజనం చేకూరగలదు. ఎంతో చక్కగా తదునుభూతి చూపే ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇటలీలోని టురిన్ సమీపంలోగల ఒక సంఘం నుండి ఈ ఉత్తరాన్ని అందుకున్నాడు: “ఆసక్తిని చూరగొనాలని మీరు కోరుకుంటే ఇతరుల ఎడల ఆసక్తిని చూపండి; మీరు ప్రీతిపర్చబడగోరితే ప్రీతిపర్చేవారిగా ఉండండి; మీరు ప్రేమించబడగోరితే ప్రేమించేవారిగా ఉండండి; మీరు సహాయం పొందాలనుకుంటే, సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండండి. మీ నుండి మేము నేర్చుకున్నదదే!”
10. దీనత్వం కలిగివుండడం గురించి ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తలు ఏమి చెప్పారు, ఈ విషయంలో యేసు ఏ మాదిరినుంచాడు?
10 దీనత్వం కలిగివుండడం, సమీపించదగినవారిగా ఉండడం ఎంతో మేలు చేయడానికి ప్రయాణ అధ్యక్షులకు సహాయం చేస్తుంది. “దీనస్వభావం కలిగివుండడం ఎంతో ప్రాముఖ్యం” అని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త గమనించాడు. “అధిక సంపన్నులైన సహోదరులు మీ కొరకు చేసే దానినిబట్టి మీరు అనుచితంగా ప్రభావితం చెందకూడదని, మీ స్నేహాన్ని అలాంటివారికే పరిమితం చేయకూడదని, అయితే ఇతరులతో నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని” ఆయన క్రొత్త ప్రయాణ పైవిచారణకర్తలను హెచ్చరిస్తాడు. (2 దినవృత్తాంతములు 19:6, 7) నిజంగా దీనుడైన ప్రయాణ పైవిచారణకర్త సంస్థ ప్రతినిధిగా తన స్వంత ప్రాముఖ్యత గురించి అతిశయోక్తికరమైన దృక్పథం కలిగివుండడు. ఒక జిల్లా పైవిచారణకర్త తగిన విధంగానే ఇలా వ్యాఖ్యానించాడు: “దీనత్వం కలిగివుండి, సహోదరులు చెప్పేది వినడానికి సుముఖత కలిగివుండండి. ఎల్లప్పుడూ సమీపించదగినవారిగా ఉండండి.” జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషిగా యేసుక్రీస్తు ప్రజలు అసౌకర్యంగా భావించేలా చేయగలిగివుండేవాడే కాని ఆయన, పిల్లలు కూడా తన సమక్షంలో సౌకర్యవంతంగా భావించేంత దీనత్వం కల్గివుండి, సమీపించదగినవానిగా ఉన్నాడు. (మత్తయి 18:5; మార్కు 10:13-16) పిల్లలు, యౌవనులు, పెద్దలు—వాస్తవానికి సంఘంలోని ఎవరైనా మరియు ప్రతి ఒక్కరూ—తమను నిస్సంకోచంగా సమీపించాలని ప్రయాణ పైవిచారణకర్తలు కోరుకుంటారు.
11. అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడం యొక్క ప్రభావం ఏమైవుండగలదు?
11 నిజమే ‘మనమందరం అనేకసార్లు తప్పిపోతాము,’ ఏ ప్రయాణ పైవిచారణకర్తా పొరపాట్లకు అతీతుడు కాదు. (యాకోబు 3:2) వారు పొరపాట్లు చేసినప్పుడు, యథార్థంగా క్షమాపణ చెప్పడం దీనత్వం విషయంలో ఇతర పెద్దలకు ఒక మాదిరిగా ఉంటుంది. సామెతలు 22:4 ప్రకారం, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” దేవుని సేవకులందరూ ‘తమ దేవుని ఎదుట దీనమనస్సు కలిగి నడుచుకొనవలసిన’ అవసరం లేదా? (మీకా 6:8) ఒక క్రొత్త ప్రయాణ పెద్దకు ఏమి సలహా ఇస్తారని ఒక ప్రాంతీయ పైవిచారణకర్తను అడిగినప్పుడు ఆయనిలా వ్యాఖ్యానించాడు: “సహోదరులందరి ఎడల ఎంతో గౌరవ మర్యాదలు కలిగివుండి, వారిని మీకంటే శ్రేష్టులుగా పరిగణించండి. మీరు సహోదరుల నుండి ఎంతో నేర్చుకుంటారు. దీనంగా ఉండండి. సహజంగా ఉండండి. నటించకండి.”—ఫిలిప్పీయులు 2:3.
12. క్రైస్తవ పరిచర్య కొరకైన ఆసక్తి ఎందుకంత విశేషమైనది?
12 క్రైస్తవ పరిచర్య ఎడల ఆసక్తి ఒక ప్రయాణ అధ్యక్షుని మాటలకు విలువను చేకూరుస్తుంది. వాస్తవానికి, ఆయనా ఆయన భార్య సువార్త పనిలో ఆసక్తితో కూడిన మాదిరులుగా ఉన్నప్పుడు, పెద్దలూ వారి భార్యలూ మిగతా సంఘమంతా తమ పరిచర్యలో ఆసక్తి కనబర్చడానికి ప్రోత్సహింపబడతారు. “సేవ ఎడల ఆసక్తి కల్గివుండండి” అని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఉద్బోధించాడు. ఆయనింకా ఇలా చెప్పాడు: “సాధారణంగా, పరిచర్యలో ఎక్కువ ఆసక్తి కలిగివుండే సంఘం తక్కువ సమస్యలను కలిగివుంటుందని నేను తెలుసుకున్నాను.” మరో ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా వ్యాఖ్యానించాడు: “ఒకవేళ పెద్దలు సహోదర సహోదరీలతోపాటు ప్రాంతీయ సేవలో పాల్గొని, పరిచర్యను ఆనందించడానికి వారికి సహాయం చేస్తే, ఇది మనశ్శాంతిని, యెహోవా సేవ చేయడంలో అత్యంత గొప్ప సంతృప్తిని తెస్తుందని నేను విశ్వసిస్తున్నాను.” అపొస్తలుడైన పౌలు ‘యెంతో పోరాటముతో దేవుని సువార్తను థెస్సలొనీకయులకు బోధించడానికి ధైర్యము తెచ్చుకున్నాడు.’ వారికి ఆయన సందర్శనాన్ని గూర్చిన, ప్రకటన పనిని గూర్చిన ప్రీతికరమైన జ్ఞాపకాలు ఉన్నాయంటే, ఆయనను మళ్లీ చూడడానికి వారు ఎదురు చూశారంటే దానిలో ఆశ్చర్యం లేదు!—1 థెస్సలొనీకయులు 2:1, 2; 3:6.
13. ప్రాంతీయ సేవలో తోటి క్రైస్తవులతో పనిచేసేటప్పుడు ప్రయాణ పైవిచారణకర్త ఏమి పరిగణనలోకి తీసుకుంటాడు?
13 ఒక ప్రయాణ పైవిచారణకర్త తోటి క్రైస్తవులతోపాటు ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేటప్పుడు వారి పరిస్థితులను పరిమితులను పరిగణలోనికి తీసుకుంటాడు. ఆయన సలహాలు సహాయకరమైనవే అయినప్పటికీ, ఒక అనుభవం గల పెద్దతో కలిసి ప్రకటించేటప్పుడు కొందరు అధైర్యపడతారని ఆయనకు తెలుసు. అందుకే కొన్ని సందర్భాల్లో, సలహాకంటే ప్రోత్సాహం ఎక్కువ ఉపయోగకరంగా ఉండగలదు. ఆయన ప్రచారకులతోపాటు లేక పయినీర్లతోపాటు బైబిలు పఠనానికి వెళ్లినప్పుడు, ఆయన పఠనాన్ని నిర్వహించాలని వారు కోరుకోవచ్చు. ఇది బహుశా తమ బోధనా పద్ధతులను మెరుగుపరచుకునేందుకు వారికి కొన్ని విధానాలను పరిచయం చేసేందుకు తోడ్పడవచ్చు.
14. ఆసక్తిగల ప్రయాణ పైవిచారణకర్తలు ఇతరులలో ఆసక్తిని రేకెత్తించగలరని ఎందుకు చెప్పవచ్చు?
14 ఆసక్తిగల ప్రయాణ పైవిచారణకర్తలు ఇతరులలో ఆసక్తిని రేకెత్తిస్తారు. ఎక్కువ అభివృద్ధి సాధించకుండా ఉన్న బైబిలు పఠనానికి ఒక సహోదరునితోపాటు వెళ్లడానికి ఉగాండాలో ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఒక గంటపాటు దట్టమైన అడవిగుండా నడిచి వెళ్లాడు. వారు నడిచి వెళ్తుండగా వర్షం ఎక్కువగా కురవడంతో వారు అక్కడికి చేరేసరికి పూర్తిగా తడిసిపోయారు. ఆరుగురున్న ఆ కుటుంబం, సందర్శించడానికి వచ్చిన ఆ వ్యక్తి ప్రయాణ పైవిచారణకర్త అని తెలుసుకున్నప్పుడు ఎంతో ప్రభావితమయ్యింది. తమ చర్చి పరిచారకులు మంద ఎడల అలాంటి ఆసక్తి ఎన్నడూ చూపించరని వారికి తెలుసు. మరుసటి ఆదివారం, వారు తమ మొదటి కూటానికి హాజరై, తాము యెహోవాసాక్షులు కావాలనే కోరికను వ్యక్తం చేశారు.
15. మెక్సికోలోని ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఏ చక్కని అనుభవాన్ని పొందాడు?
15 మెక్సికో రాష్ట్రమైన ఓక్సాకాలో, ఒక ప్రాంతీయ పైవిచారణకర్త నిజంగా తననుండి అపేక్షించనంత కృషిని చేశాడు. రాజ్యప్రచారకులుగా మారిన ఏడుగురు ఖైదీలతో కూడిన గుంపును సందర్శించడానికి నాలుగు రాత్రులు చెరసాలలో గడపేందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఖైదీలు చెరసాలలో ప్రతీ గదికి సాక్ష్యమిస్తుండగా, బైబిలు పఠనాలు నిర్వహిస్తుండగా ఆయన అనేకదినాలు వారితోపాటు ఉన్నాడు. ఆసక్తి చూపినందున, ఈ పఠనాలలో కొన్ని రాత్రి వరకు కొనసాగాయి. “సందర్శనాంతానికి, పరస్పర ప్రోత్సాహం మూలంగా ఖైదీలూ నేను ఎంతో ఆనందాన్ని పొందామని” ఆసక్తిగల ఈ ప్రాంతీయ పైవిచారణకర్త వ్రాస్తున్నాడు.
16. ప్రయాణ పైవిచారణకర్తలు మరియు వారి భార్యలు ప్రోత్సాహాన్ని అందజేసినప్పుడు అది ఎందుకు అంతటి ప్రయోజనాన్ని తెస్తుంది?
16 ప్రయాణ అధ్యక్షులు ప్రోత్సహించేవారిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. పౌలు మాసిదోనియలోని సంఘాలను సందర్శించినప్పుడు, ఆయన ‘పెక్కుమాటలతో వారిని ప్రోత్సహించాడు.’ (అపొస్తలుల కార్యములు 20:1, 2) పిన్నలను పెద్దలను ఆత్మీయ లక్ష్యాలవైపు నడపడంలో ప్రోత్సాహకరమైన మాటలు ఎంతో సహాయకరంగా ఉండగలవు. పూర్తికాల సేవను చేపట్టేందుకు దాదాపు 20 శాతంమంది స్వచ్ఛంద సేవకులను ప్రాంతీయ పైవిచారణకర్తలు ప్రోత్సహించినట్లు వాచ్‌టవర్ సంస్థ యొక్క ఒక పెద్ద బ్రాంచి కార్యాలయం వద్ద జరిపిన ఒక అనియత సర్వే వెల్లడించింది. పూర్తికాల రాజ్య ప్రచారకురాలిగా తన చక్కని మాదిరి ద్వారా ప్రయాణ పైవిచారణకర్త భార్య కూడా ప్రోత్సాహానికి గొప్ప మూలమని నిరూపించుకుంటుంది.
17. ఇతరులకు సహాయం అందజేయడాన్ని గూర్చిన తన ఆధిక్యత గురించి ఒక వృద్ధ ప్రాంతీయ పైవిచారణకర్త ఎలా భావించాడు?
17 ప్రాముఖ్యంగా వృద్ధులకు, కృంగినవారికి ప్రోత్సాహం అవసరం. వృద్ధుడైన ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా వ్రాస్తున్నాడు: “నాపనిలో నాకు చెప్పశక్యంకాని అంతర్గత ఆనందాన్ని తీసుకువచ్చే ఒక అంకం ఏమిటంటే, దేవుని మందలోని నిష్క్రియులైన, దుర్బలమైన వారికి సహాయాన్ని అందజేసే ఆధిక్యత. ‘అలాంటివారిని స్థిరపర్చడానికి వారికి ఆత్మసంబంధమైన కృపావరమేదైనా’ ఇచ్చేటప్పుడు నేను ఎంతో ప్రోత్సాహాన్ని బలాన్ని పొందుతుండగా, రోమీయులు 1:11, 12 నందలి మాటలు నాకు ప్రత్యేక భావాన్ని కలిగివుంటాయి.”
వారి ఆనందభరితమైన పని యొక్క ప్రతిఫలాలు
18. ప్రయాణ పైవిచారణకర్తలకు ఏ లేఖనాధార ఆశయాలు ఉంటాయి?
18 తోటి విశ్వాసులకు సహాయం చేయాలని ప్రయాణ పైవిచారణకర్తలు యథార్థంగా ఆసక్తి కలిగివుంటారు. సంఘాలను బలపర్చి, వాటిని ఆత్మీయంగా ప్రోత్సహించాలని వారు కోరుకుంటారు. (అపొస్తలుల కార్యములు 15:41) ఒక ప్రయాణ పైవిచారణకర్త “ప్రోత్సాహాన్నివ్వడానికి, ఉత్తేజం కలిగించడానికి, పరిచర్యను నెరవేర్చాలనే కోరికను పెంపొందింపజేయడానికి, సత్యానికనుగుణంగా జీవించడంలో కొనసాగమని పురికొల్పడానికి” కష్టపడి పనిచేస్తాడు. (3 యోహాను 3) మరొకరు తోటి విశ్వాసులను విశ్వాసమందు స్థిరపర్చడానికి ప్రయత్నిస్తారు. (కొలొస్సయులు 2:6, 7) ప్రయాణ పైవిచారణకర్త ‘నిజమైన సహకారే’ గాని ఇతరుల విశ్వాసంపై యజమాని కాదని జ్ఞాపకముంచుకోండి. (ఫిలిప్పీయులు 4:3; 2 కొరింథీయులు 1:24) ఆయన సందర్శనం ప్రోత్సాహానికి మరియు అదనపు కార్యకలాపాలకు ఒక సమయమై ఉంటుంది, అలాగే జరిగిన అభివృద్ధిని పునఃసమీక్షించి భవిష్యత్ లక్ష్యాలను పరిశీలించడానికి పెద్దల సభకు అది ఒక అవకాశం. సంఘ ప్రచారకులు, పయినీర్లు, పరిచర్య సేవకులు, పెద్దలు ఆయన మాటల ద్వారానూ మాదిరి ద్వారానూ ప్రోత్సహింపబడి ముందున్న పని కొరకు ఉత్తేజాన్ని పొందడానికి నిరీక్షించవచ్చు. (1 థెస్సలొనీకయులు 5:11 పోల్చండి.) కాబట్టి మరి, ప్రాంతీయ పైవిచారణకర్త యొక్క సందర్శనాలకు పూర్ణ హృదయంతో మద్దతునిచ్చి, జిల్లా పైవిచారణకర్త అందజేసే సేవ నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి.
19, 20. తమ నమ్మకమైన సేవనుబట్టి ప్రయాణ పైవిచారణకర్తలు మరియు వారి భార్యలు ఎలా ప్రతిఫలాన్ని పొందారు?
19 ప్రయాణ పైవిచారణకర్తలు, వారి భార్యలు తమ నమ్మకమైన సేవనుబట్టి గొప్ప ప్రతిఫలాన్ని పొందారు, తాము చేసే మేలునుబట్టి యెహోవా తమను ఆశీర్వదిస్తాడనే నిశ్చయతను వారు కలిగివుండవచ్చు. (సామెతలు 19:17; ఎఫెసీయులు 6:8) జార్జ్ మరియు మగ్దలీనా అనేవారు అనేక సంవత్సరాలపాటు ప్రయాణ పనిలో సేవ చేసిన వృద్ధ జంట. లక్సెంబర్గ్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఒక స్త్రీ మాగ్దలీనాను కలిసింది, 20 కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం మాగ్దలీనా ఆ స్త్రీకి సాక్ష్యమిచ్చింది. మాగ్దలీనా ఈ యూదా స్త్రీకిచ్చిన బైబిలు సాహిత్యం మూలంగా ఆమెకు సత్యం ఎడల ఆసక్తి కలిగింది, కొంతకాలానికి ఆమె బాప్తిస్మం తీసుకుంది. జార్జ్‌ను ఒక ఆత్మీయ సహోదరి వచ్చి కలిసింది, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఆయన తమ గృహాన్ని సందర్శించాడని ఆమెకు జ్ఞాపకముంది. సువార్తను ఆయన అత్యుత్సాహంతో అందజేయడం చివరికి ఆమె, ఆమె భర్త సత్యాన్ని అంగీకరించేందుకు దారితీసింది. జార్జ్ మరియు మాగ్దలీనా ఎంతో ఆనందించారని చెప్పనవసరం లేదు.
20 పౌలు ఎఫెసులో చేసిన ఫలవంతమైన పరిచర్య ఆయనకు ఆనందాన్ని కలిగించింది, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అనే యేసు మాటలను ఉదాహరించేందుకు అది ఆయనను కదిలించి ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 20:35) ప్రయాణ పనిలో ఎల్లప్పుడూ ఇవ్వడం ఇమిడి ఉంటుంది గనుక దానిలో భాగం వహించేవారు సంతోషాన్ని పొందుతారు, ప్రాముఖ్యంగా తమ శ్రమకు లభించే మంచి ఫలితాలను వారు తెలుసుకున్నప్పుడు వారు సంతోషాన్ని పొందుతారు. నిరుత్సాహం చెందిన ఒక పెద్దకు సహాయం చేసిన ఒక ప్రాంతీయ పైవిచారణకర్తకు ఒక ఉత్తరంలో ఇలా తెలియజేయబడింది: “నా ఆత్మీయ జీవితంలో—మీకు తెలిసినంతకంటే ఎక్కువగా మీరు నాకు గొప్ప ‘ఆదరణగా’ ఉన్నారు. . . . ‘పాదములు జారడానికి కొంచెమే తప్పిన’ ఆధునికదిన ఆసాపుకు మీరు ఎంత సహాయకరంగా ఉన్నారో మీరు ఎన్నటికీ పూర్తిగా తెలుసుకోలేరు.”—కొలొస్సయులు 4:11; కీర్తన 73:2.
21. మొదటి కొరింథీయులు 15:58 ప్రయాణ పైవిచారణకర్తల కార్యకలాపాలకు అన్వయిస్తుందని మీరెందుకు చెబుతారు?
21 సంవత్సరాలుగా ప్రాంతీయ పనిలో ఉన్న ఒక వృద్ధ క్రైస్తవునికి 1 కొరింథీయులు 15:58 గురించి ఆలోచించడం ఇష్టం, అక్కడ పౌలు ఇలా ఉద్బోధించాడు: “మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.” ప్రయాణ పైవిచారణకర్తలకు ప్రభువు పనిలో కచ్చితంగా ఎంతో చేయవలసి ఉంది. యెహోవా కృప విషయమైన నమ్మకమైన గృహనిర్వాహకులుగా వారు సేవ చేయడాన్నిబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగివుంటామోకదా!
[అధస్సూచీలు]
a మే 15, 1991 కావలికోట (ఆంగ్లం) నందలి 28-31 పేజీలలో గల “ఎంతో చేయవలసి ఉన్నందున మీరు సంతోషంగా ఉండగలరా?” అనే శీర్షికను చూడండి.
మీరెలా ప్రతిస్పందిస్తారు?
◻ ప్రయాణ పైవిచారణకర్తలను ‘మంచి గృహనిర్వాహకులుగా’ ఎందుకు దృష్టించవచ్చు?
◻ ఎంతో మేలు చేసేందుకు ప్రాంతీయ మరియు జిల్లా పైవిచారణకర్తలకు సహాయంచేసే కొన్ని అంశాలు ఏవి?
◻ ప్రయాణ పనిలో ఇమిడి ఉండేవారికి దీనత్వం మరియు ఆసక్తి ఎందుకంత ప్రాముఖ్యం?
◻ ప్రయాణ పైవిచారణకర్తలకు ఏ చక్కని ఆశయాలుంటాయి?
[16వ పేజీలోని చిత్రం]
ప్రయాణ పైవిచారణకర్తలు తోటి విశ్వాసులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తారు
[17వ పేజీలోని చిత్రం]
ప్రయాణ పైవిచారణకర్తలు మరియు వారి భార్యల సహవాసం నుండి పిన్నలు పెద్దలు ఒకేలా ప్రయోజనం పొందవచ్చు
[18వ పేజీలోని చిత్రం]
ప్రయాణ పైవిచారణకర్త ఆసక్తిగల పరిచర్య ఇతరులలో ఆసక్తిని పెంపొందింపజేస్తుంది