“దావీదు సంతతి”—వాస్తవమా లేక కల్పితమా?
సంగీతకారుడు, కవి, సైనికుడు, ప్రవక్త మరియు ఒక రాజుగా మారిన యౌవనస్థుడైన గొఱ్ఱెల కాపరియగు దావీదు బైబిలులో ఎంతో ఎక్కువ ప్రాముఖ్యతగల వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన పేరు 1,138 సార్లు ప్రస్తావించబడింది; “దావీదు సంతతి” అనే పదబంధం—తరచూ దావీదు రాజవంశాన్ని సూచిస్తూ—25 సార్లు ఉపయోగింపబడింది. (1 సమూయేలు 20:16) రాజైన దావీదు, ఆయన రాజవంశం కేవలం కల్పితాలేనా? పురావస్తుశాస్త్రం ఏమి రుజువు చేస్తుంది? ఉత్తర గలిలయలోని టెల్ దాను వద్ద పురావస్తుశాస్త్ర త్రవ్వకాల స్థలంలో ఇటీవల కనుగొనబడిన ప్రత్యేకమైన విషయం, దావీదు మరియు ఆయన రాజవంశం యొక్క చారిత్రాత్మకతకు మద్దతునిస్తుందని నివేదించబడింది.
ప్రొఫెసర్ అవ్‌రామ్ బీరాన్ నేపథ్యంలో ఒక పురావస్తుశాస్త్ర బృందం 1993 వేసవిలో, ప్రాచీన దాను యొక్క బయటి ద్వారం వెలుపల ఒక భాగాన్ని శుభ్రపరిచింది. వారు రాళ్లు పరిచిన బయలు స్థలాన్ని కనుగొన్నారు. నేలలోనుండి బయటకు పొడుచుకు వస్తున్న ఒక నల్లని అగ్ని రాయిని సులభంగా బయటకు తీయడం జరిగింది. ఆ రాయిని ఆ మధ్యాహ్న సూర్యుని వైపుకు మరల్చినప్పుడు, దానిపై వ్రాయబడిన అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. “ఓహ్, నా దేవా, ఇక్కడో శిలాశాసనం ఉంది!” అని ప్రొఫెసర్ బీరాన్ ఆశ్చర్యంతో బిగ్గరగా అన్నాడు.
ప్రొఫెసర్ బీరాన్ మరియు అతని సహవాసియైన, జెరూసలేమ్‌నందలి హెబ్రీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ యోసఫ్ నవెహ్ వెంటనే ఆ శిలాశాసనంపై వైజ్ఞానిక నివేదికను వ్రాశారు. ఈ నివేదికపై ఆధారపడి, బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ పత్రిక 1994 మార్చి/ఏప్రిల్ సంచికలో ప్రచురించబడిన ఒక శీర్షిక ఇలా చదువబడుతుంది: “పురావస్తుశాస్త్రం కనుగొన్న విషయాన్ని, న్యూయార్క్ టైమ్స్ (మరి టైమ్స్ పత్రిక గురించి ఇక ఏమీ చెప్పనక్కర్లేదు) యొక్క మొదటి పేజీలో వార్తా విశేషంగా ఎన్నడూ ముద్రించరు. అయితే, యొర్దాను నది ముఖ్య జలాలలో ఒక దానికి ప్రక్కగా ఉన్న హెర్మోను పర్వతం క్రింద, ఉత్తర గలిలయలోని ఒక అందమైన గుట్టయైన టెల్ దాను వద్ద జరిగిన అన్వేషణ గురించి గత వేసవిలో అలా ప్రచురించారు.
“అక్కడ అవ్‌రామ్ బీరాన్, ఆయనతోపాటు వెళ్లిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం, సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఒక శిలాశాసనాన్ని కనుగొన్నది. అది ‘దావీదు సంతతిని’ మరియు ‘ఇశ్రాయేలు రాజును’ సూచిస్తుంది. బైబిల్లో కాకుండా ఏదైనా ప్రాచీన శిలాశాసనంపై దావీదు అనే పేరు కనుగొనబడటం ఇదే మొదటిసారి. ఆ శిలాశాసనం ఎవరో ఒక ‘దావీదును’ కాక దావీదు సంతతిని, ఇశ్రాయేలీయుల గొప్ప రాజును సూచించడం ఇంకా ఎంతో గణనీయం.
“‘ఇశ్రాయేలు రాజు’ అనే పదం బైబిలులో తరచూ కనుగొనబడుతుంది, అది ప్రాముఖ్యంగా రాజుల పుస్తకంలో కనుగొనబడుతుంది. అయితే సెమిటిక్ వ్రాతలో ఇశ్రాయేలును గురించిన ప్రస్తావన ఉన్న పురాతన బైబిలేతర మూలం ఇదే. కొందరు పండితులైన బిబ్లికల్ మినిమైజర్లు అంటున్న దానికి విరుద్ధంగా, ఇశ్రాయేలు మరియు యూదా కూడా ఆ కాలంలో ఎంతో ప్రాముఖ్యమైన రాజ్యాలుగా ఉండేవనే వాస్తవాన్ని అన్నింటికన్నా మిన్నగా ఈ శిలాశాసనం రుజువు చేస్తుంది.”
అక్షరాల ఆకారం, రాతి నష్టావశేషం వద్ద కనుగొనబడిన కుండ పెంకులను పరిశీలించడం మరియు శిలాశాసనంపై ఉన్న విషయాలనుబట్టి దాని కాలాన్ని లెక్కించడం జరిగింది. ఆ మూడు పద్ధతులు కూడా ఒకే కాలాన్ని అంటే సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దాన్ని, రాజైన దావీదు జీవించిన కాలానికి ఇంచుమించు వందకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాతి కాలాన్ని సూచిస్తున్నాయి. ఆ శిలాశాసనం, “ఇశ్రాయేలు రాజు”కు మరియు “దావీదు సంతతికి [చెందిన రాజు]”కు కూడా శత్రువైన అరమీయుని చేత దానులో స్థాపించబడిన విజయ స్మారకంలో కొంత భాగమని పండితులు నమ్ముతున్నారు. ప్రఖ్యాతి గాంచిన తుపాను దేవుడైన హాదాద్‌ను ఆరాధించే వారైన అరమీయులు తూర్పు వైపున జీవించేవారు.
1994 వేసవి కాలంలో, ఈ శిల్పస్తంభం యొక్క ఇంకా రెండు నష్టావశేషాలు కనుగొనబడ్డాయి. ప్రొఫెసర్ బీరాన్ ఇలా నివేదిస్తున్నాడు: “ఈ రెండు నష్టావశేషాల్లోనూ అరమీయుల దేవుడైన హాదాద్ పేరు అలాగే ఇశ్రాయేలు మరియు అరమీయుల మధ్య యుద్ధాన్ని గురించిన ప్రస్తావన ఉన్నాయి.”
1993లో కనుగొనబడిన ప్రధాన నష్టావశేషంలో, ప్రాచీన హెబ్రీ లిపిలో వ్రాయబడి పాక్షికంగా కన్పిస్తున్న 13 వాక్యాలు ఉన్నాయి. ఆ కాలంలో, ఒక పాఠ్య భాగంలోని పదాలను విడదీసేందుకు అంటే పదాలను విభజించే వాటిగా చుక్కలను ఉపయోగించే వారు. అయితే, “దావీదు సంతతి” అనేది “byt” (సంతతి), ఒక చుక్క, తర్వాత “dwd” (దావీదు) అని వ్రాయబడేందుకు బదులుగా, “bytdwd” అనే అక్షరాలతో (రోమను అక్షరాల్లోకి ట్రాన్స్‌లిటరేట్ చేయబడ్డాయి) ఒక పదంగా వ్రాయబడింది. ఊహించినట్లే “bytdwd”ను అలా అనువదించడాన్ని గురించి ప్రశ్నలు లేవదీయబడ్డాయి.
భాషాశాస్త్ర నిపుణుడైన ప్రొఫెసర్ ఆన్‌సన్ రేనీ ఇలా వివరిస్తున్నాడు: “యోసఫ్ నవెహ్ మరియు అవ్‌రామ్ బీరాన్‌లు ఆ శిలాశాసనాన్ని విపులంగా వివరించలేదు, ఎందుకంటే ఆ పద సముదాయం ఒకవేళ అందరికీ తెలిసిన సంజ్ఞావాచకమై ఉంటే అలాంటి పదాల్లోని రెండు అంశాలను విభజించే చుక్క ఉండదనే విషయం పాఠకులకు తప్పక తెలిసి ఉంటుందని వారు బహుశ భావించి ఉండవచ్చు. ‘దావీదు సంతతి’ అనే పదం సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దం మధ్య భాగంలో రాజకీయ మరియు భూగోళశాస్త్ర సంజ్ఞావాచకమై ఉంది.”
మరో పురావస్తు శాస్త్ర రుజువు
దాన్ని కనుగొన్న తర్వాత, అది “దావీదు సంతతిని”a కూడా సూచిస్తుందని, మష శిల్పస్తంభం (మోయాబైట్ స్టోన్ అని కూడా పిలువబడుతుంది) విషయంలో నిపుణుడైన పండితుడు ఆండ్రే లమెర్ నివేదించాడు. 1868లో కనుగొనబడిన మష శిల్పస్తంభం టెల్ దాను శిల్పస్తంభంతో ఎంతో సారూప్యాన్ని కలిగి ఉంది. అవి రెండూ కూడా సా.శ.పూ. తొమ్మిదవ శతాబ్దానికి చెందినవి, ఒకే రకమైన రాయితో చేయబడినవి, ఒకే పరిమాణం గలవి, మరి దాదాపు ఒకే విధమైన సెమిటిక్ వ్రాతలో వ్రాయబడ్డాయి.
మష శిల్పస్తంభంపై చెరిగిపోయిన వాక్యాన్ని పునఃస్థాపించే విషయంలో, ప్రొఫెసర్ లమెర్ ఇలా వ్రాశాడు: “టెల్ దాను నష్టావశేషాన్ని కనుగొనేందుకు దాదాపు రెండు సంవత్సరాల పూర్వం, ‘దావీదు సంతతిని’ గురించిన ప్రస్తావన మష శిల్పస్తంభంపై ఉంటుందని నేను భావించాను. . . . ‘దావీదు సంతతిని’ గురించిన ప్రస్తావన ముందు ఎన్నడూ గమనించబడకపోవడానికిగల కారణం, మష శిల్పస్తంభానికి ఎడిటియో ప్రిన్‌కెప్జ్ [మొదటి సంపుటి] ఎన్నడూ లేదనే వాస్తవాన్నిబట్టి ఉండవచ్చు. మష శిల్పస్తంభం కనుగొనబడిన దాదాపు 125 సంవత్సరాల తర్వాత, నేను ఇప్పుడు దానిని సిద్ధం చేస్తున్నాను.”
ఒక దేవదూత, యేసు, ఆయన శిష్యులు మరియు సాధారణ ప్రజలు దావీదు యొక్క చారిత్రాత్మకతను రుజువు చేశారు గనుక అలాంటి పురావస్తు సంబంధ సమాచారం ఆసక్తికరమైనది. (మత్తయి 1:1; 12:3; 21:9; లూకా 1:32; అపొస్తలుల కార్యములు 2:29) ఆయన, ఆయన రాజవంశం మరియు “దావీదు సంతతి” వాస్తవాలే కానీ కల్పితాలు కాదని పురావస్తు శాస్త్రం కనుగొన్న విషయాలు అంగీకరిస్తున్నాయి.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ సంస్థ ప్రచురణలను చదివే పాఠకులకు మష శిల్పస్తంభం బాగా తెలుసు. (కావలికోట [ఆంగ్లం] ఏప్రిల్ 15, 1990 నందు 30-1 పేజీలను చూడండి.) పారిస్ నందలి లొవురి వస్తు ప్రదర్శన శాలలో అది ప్రదర్శించబడి ఉంది.
[31వ పేజీలోని చిత్రం]
ఉత్తర గలిలయ నందలి దాను అనే పట్టణమందు 1993లో కనుగొనబడిన టెల్ దాను నష్టావశేషం*
*ఈ చిత్రం, ఇజ్రాయెల్ ఎక్స్‌ప్లొరేషన్ జర్నల్‌లో ఉన్న ఛాయాచిత్రంపై ఆధారపడి ఉంది.