కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 9/1 పేజీలు 8-13
  • క్రీస్తుకు పూర్వమున్న ధర్మశాస్త్రము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తుకు పూర్వమున్న ధర్మశాస్త్రము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మోషే ధర్మశాస్త్రము—దాని సంకల్పం
  • దయా కనికరాలను చూపిన ధర్మశాస్త్రము
  • ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేయడం
  • పరిసయ్యుల మతం యొక్క కాలుష్యం
  • పరిసయ్యుల పొరపాట్లనుండి నేర్చుకోవడం
  • “యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • క్రీస్తు ధర్మశాస్త్రము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మోషే ధర్మశాస్త్రము మీయెడల ఏ భావము కలిగివుంది
    అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట
  • మౌఖిక ధర్మశాస్త్రం—వ్రాతలో ఎందుకు పెట్టబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 9/1 పేజీలు 8-13

క్రీస్తుకు పూర్వమున్న ధర్మశాస్త్రము

“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”—కీర్తన 119:97.

1. ఆకాశమండలంలోని వాటి గమనాన్ని ఏది నియంత్రిస్తుంది?

చిన్నతనం నుండి, యోబు చుక్కల వైపు బహుశ ఆశ్చర్యంతో చూసే వుంటాడు. బహుశ, ఆ గొప్ప నక్షత్రరాసుల పేర్లు మరియు ఆకాశంలో ఆ నక్షత్రరాసుల గమనాన్ని నడిపే నియమాల గురించి తమకు తెలిసిన విషయాలను ఆయన తలిదండ్రులు ఆయనకు బోధించివుంటారు. ఎంతైనా, ప్రాచీన కాలాల్లోని ప్రజలు మారే కాలాలను సూచించేందుకు ఈ సువిశాల, మహత్తర నక్షత్రరాసుల సుస్థిర గమనాన్ని ఉపయోగించారు. యోబు ఆశ్చర్యంతో వాటినన్నిటిని ఎన్నోసార్లు చూసినప్పటికీ, ఈ నక్షత్రరూపాలన్నింటినీ ఏ బలమైన శక్తులు దగ్గరికి పట్టివుంచుతాయో ఆయనకు తెలియలేదు. అందుకే, “ఆకాశమండలపు కట్టడలను నీవెరుగుదువా?” అని యెహోవా ఆయనను అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. (యోబు 38:31-33) అవును, నక్షత్రాలు నియమాలచేత నడిపింపబడుతున్నాయి, ఆ నియమాలు ఎంత నిర్దిష్టమైనవి మరియు సంక్లిష్టమైనవంటే, నేటి వైజ్ఞానికులు వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు.

2. సర్వసృష్టి కూడా నియమం ద్వారా నియంత్రింపబడుతుందని ఎందుకు చెప్పవచ్చు?

2 యెహోవా ఈ విశ్వంలో అత్యున్నతమైన నియమాలను అనుగ్రహించేవాడు. ఆయన పనులన్నీ నియమాల చేత నడిపింపబడుతున్నాయి. “సర్వసృష్టికి ఆదిసంభూతుడై”న ఆయన ప్రియ కుమారుడు, భౌతిక విశ్వం ఉనికిలోకి రాకముందే తన తండ్రి నియమాలకు నమ్మకంగా విధేయత చూపిస్తూ ఉండేవాడు. (కొలొస్సయులు 1:15) దేవదూతలు సహితం నియమాలచేత నడిపింపబడుతున్నారు. (కీర్తన 103:20) జంతువులు తమ సృష్టికర్త తమలో ఉంచిన సహజజ్ఞానపు ఆజ్ఞలకు విధేయత చూపుతూ అవి కూడా నియమాలచేత నడిపింపబడుతున్నాయి.—సామెతలు 30:24-28; యిర్మీయా 8:7.

3. (ఎ) మానవజాతికి నియమాలు ఎందుకు అవసరం? (బి) ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా ఏ మూలం ద్వారా నడిపించాడు?

3 మానవజాతి సంగతేంటి? వివేకం, నైతికత మరియు ఆత్మీయత వంటి బహుమతులతో మనం దీవించబడినప్పటికీ, ఈ కౌశలాలను ఉపయోగించడంలో మనకు నడిపింపునిచ్చేందుకు కొన్ని దైవిక నియమాలు మనకవసరం. మన మొదటి తలిదండ్రులైన ఆదాము హవ్వలు పరిపూర్ణులైయుండిరి గనుక, వారికి నడిపింపునిచ్చేందుకు కేవలం కొన్ని నియమాలు మాత్రమే అవసరమయ్యాయి. తమ పరలోక తండ్రి ఎడలగల ప్రేమ, వారు విధేయత చూపేందుకు వారికి తగినన్ని కారణాలను ఇచ్చివుండాలి. కానీ వారు అవిధేయత చూపారు. (ఆదికాండము 1:26-28; 2:15-17; 3:6-19) దాని ఫలితంగా, వారి సంతానం నడిపింపు కొరకు ఎక్కువ నియమాలు అవసరమయ్యే పాపపంకిల జీవులయ్యారు. సమయం గడుస్తున్న కొలది, యెహోవా ప్రేమపూర్వకంగా ఈ అవసరాన్ని తీర్చాడు. నోవహు తన కుటుంబానికి అందించవలసిన ప్రత్యేక నియమాలను ఆయన అతనికిచ్చాడు. (ఆదికాండము 9:1-7) శతాబ్దాల తర్వాత, మోషే ద్వారా దేవుడు నూతన ఇశ్రాయేలు జనాంగానికి వివరమైన, వ్రాతపూర్వక ధర్మశాస్త్ర విధినిచ్చాడు. ఓ పూర్తి జనాంగాన్ని దైవిక నియమం ద్వారా యెహోవా నడిపించడం ఇదే మొదటిసారి. ఆ ధర్మశాస్త్రాన్ని పరిశీలించడం, నేడు క్రైస్తవుల జీవితాల్లో ఆ దైవిక ధర్మశాస్త్రం వహించే ప్రాముఖ్యమైన పాత్రను అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.

మోషే ధర్మశాస్త్రము—దాని సంకల్పం

4. వాగ్దానం చేయబడిన సంతానాన్ని ఉత్పత్తి చేయడం అబ్రాహాము యొక్క ఎంపిక చేయబడిన సంతతి వారికి ఎందుకు ఒక సవాలు వలె ఉంటుంది?

4 ధర్మశాస్త్రాన్ని క్షుణంగా అధ్యయనం చేసిన విద్యార్థియైన, అపొస్తలుడైన పౌలు ఇలా ప్రశ్నించాడు: “ఆలాగైతే ధర్మశాస్త్రమెందుకు?” (గలతీయులు 3:19) సమాధానం చెప్పాలంటే, తన స్నేహితుడైన అబ్రాహాము వంశం జనాంగాలన్నింటికీ గొప్ప ఆశీర్వాదాలను తెచ్చే సంతానాన్ని ఉత్పత్తి చేస్తుందని యెహోవా ఆయనకు వాగ్దానం చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరముంది. (ఆదికాండము 22:18) కానీ ఇక్కడో సవాలు ఉంది: అబ్రాహాము యొక్క ఎంపిక చేయబడిన సంతానమైన ఇశ్రాయేలీయులందరూ యెహోవాను ప్రేమించిన వ్యక్తులు కాదు. సమయం గడిచిన కొలదీ, అనేకులు లోబడనొల్లని వారని మరియు తిరుగుబాటు దారులని నిరూపించుకున్నారు, అసలు కొందరైతే అదుపు చేయబడలేని వారిగా ఉన్నారు! (నిర్గమకాండము 32:9; ద్వితీయోపదేశకాండము 9:7) అలాంటి వారు, దేవుని ప్రజల మధ్య ఉండటమనేది కేవలం వారు ఇశ్రాయేలు జనాంగంలో జన్మించడం మూలంగా మాత్రమే కానీ వారి ఎంపిక ఎంతమాత్రం కాదు.

5. (ఎ) మోషే ధర్మశాస్త్రం ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమి నేర్పాడు? (బి) ధర్మశాస్త్రం, దాన్ని పాటించే వారి ప్రవర్తనను ప్రభావితం చేసేలా ఎలా రూపొందించబడింది?

5 అలాంటి ప్రజలు వాగ్దాన సంతానాన్ని ఎలా ఉత్పత్తి చేయగలరు మరియు ఆ సంతానం ద్వారా ఎలా ప్రయోజనం పొందగలరు? యెహోవా వారిని రోబోట్లవలె అదుపు చేసే బదులు, వారికి ధర్మశాస్త్రం ద్వారా బోధించాడు. (కీర్తన 119:33-35; యెషయా 48:17) వాస్తవానికి, “ధర్మశాస్త్రం” అనే పదానికిగల హెబ్రీ పదమైన తో·రాహ్‌ʹ అంటే “ఉపదేశం” అని అర్థం. అది ఏమి బోధించింది? ప్రాథమికంగా, అది ఇశ్రాయేలీయులకు తమ పాపభరిత స్థితి నుండి తమను విడిపించే వాడైన మెస్సీయ యొక్క అవసరత తమకుందని నేర్పింది. (గలతీయులు 3:24) ధర్మశాస్త్రం దైవ భయాన్ని మరియు విధేయతను కూడా నేర్పింది. అబ్రాహాముకు చేయబడిన వాగ్దానానికి అనుగుణంగా, ఇశ్రాయేలీయులు ఇతర జనాంగాలన్నింటికీ యెహోవా యొక్క సాక్షులుగా పని చేయాల్సివుండిరి. కాబట్టి, యెహోవాపై అనుకూలంగా ప్రతిబింబించే ఉన్నతమైన, ఉదాత్తమైన ప్రవర్తనా విధిని ధర్మశాస్త్రం వారికి నేర్పాలి; తమ చుట్టూ ఉన్న జనాంగాల కలుషితపరిచే ఆచారాలనుండి వేరుగా ఉండేందుకు అది ఇశ్రాయేలీయులకు సహాయపడుతుంది.—లేవీయకాండము 18:24, 25; యెషయా 43:10-12.

6. (ఎ) మోషే ధర్మశాస్త్రం ఎన్ని కట్టడలను కలిగివుంది, అవి అత్యధికమని ఎందుకు పరిగణింపకూడదు? (అథఃసూచి చూడండి.) (బి) మోషే ధర్మశాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా మనం ఏ అంతర్దృష్టిని పొందవచ్చు?

6 మోషే ధర్మశాస్త్రం అనేక కట్టడలను అంటే దాదాపు 600లకు పైగా కట్టడలను కలిగివుందంటే ఆశ్చర్యంలేదు.a ఈ వ్రాతపూర్వక విధి ఆరాధన, ప్రభుత్వం, నైతికతలు, న్యాయం, ఆహారానికి మరియు పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను సహితం నియంత్రించింది. అంటే ధర్మశాస్త్రం కేవలం ఉదాసీన నియమాల మరియు క్లుప్త ఆజ్ఞల సముదాయం మాత్రమేనని దాని అర్థమా? ఎంత మాత్రం కాదు! ఈ ధర్మశాస్త్ర విధిని అధ్యయనం చేయడం, యెహోవా యొక్క ప్రేమపూర్వక వ్యక్తిత్వాన్ని గురించి మనకు అపార అంతర్దృష్టిని అందిస్తుంది. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

దయా కనికరాలను చూపిన ధర్మశాస్త్రము

7, 8. (ఎ) ధర్మశాస్త్రం దయను మరియు కనికరాన్ని ఎలా నొక్కిచెప్పింది? (బి) దావీదు విషయంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని దయాపూర్వకంగా ఎలా అన్వయించాడు?

7 ధర్మశాస్త్రము ప్రాముఖ్యంగా పేదలకు లేక నిస్సహాయులకు దయను మరియు కనికరాన్ని చూపించాలని నొక్కిచెప్పింది. విధవరాండ్రకు మరియు అనాథలకు ప్రత్యేకంగా కాపుదల ఇవ్వబడేది. (నిర్గమకాండము 22:22-24) పనికి ఉపయోగించుకొనబడే జంతువులు క్రూరత్వానికి గురికాకుండా కాపాడబడ్డాయి. ప్రాథమిక ఆస్తిహక్కులు గౌరవింపబడ్డాయి. (ద్వితీయోపదేశకాండము 24:10; 25:4) హంతకులకు మరణశిక్ష విధింపబడాలని ధర్మశాస్త్రం చెప్పినప్పటికీ, ప్రమాదవశాత్తు హత్య చేసిన హంతకునికి అది దయను అనుగ్రహించింది. (సంఖ్యాకాండము 35:11, 12) తప్పిదస్థుల దృక్పథం ఆధారంగా, కొన్ని తప్పిదాలకు ఏ శిక్షను విధించాలనే విషయాన్ని నిర్ణయించగల హక్కు ఇశ్రాయేలు న్యాయాధిపతులకు ఉండేదని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి.—నిర్గమకాండము 22:7 మరియు లేవీయకాండము 6:1-7 పోల్చండి.

8 అవసరమైన విషయాల్లో ధర్మశాస్త్రాన్ని పటుత్వంతో, అయితే వీలైన విషయాల్లో ధర్మశాస్త్రాన్ని దయతో అన్వయించడం ద్వారా, యెహోవా న్యాయాధిపతులకు ఒక మాదిరినుంచాడు. వ్యభిచారం మరియు హత్య చేసిన రాజైన దావీదుకు దయ చూపబడింది. ఆయనకు శిక్ష విధింపబడలేదని కాదు, ఎందుకంటే ఆయన చేసిన పాపం వలన వచ్చిన తీవ్ర పరిణామాలనుండి యెహోవా ఆయనను కాపాడలేదు. అయినప్పటికీ, రాజ్య నిబంధన మూలంగా మరియు స్వతఃసిద్ధంగా దావీదు కనికరం గలవాడు గనుక మరియు ఆయన ఎంతో పశ్చాత్తాప హృదయంగలవాడు గనుక ఆయన చంపబడలేదు.—1 సమూయేలు 24:4-7; 2 సమూయేలు 7:16; కీర్తన 51:1-4; యాకోబు 2:13.

9. మోషే ధర్మశాస్త్రంలో ప్రేమ ఏ పాత్ర పోషించింది?

9 దానికి తోడు, మోషే ధర్మశాస్త్రం ప్రేమను నొక్కి చెప్పింది. నేడున్న దేశాల్లో ఒకటి వాస్తవంగా ప్రేమను కోరే న్యాయ సూత్రాలను కలిగివుండటాన్ని ఊహించుకోండి! అలా, మోషే ధర్మశాస్త్రం హత్యను నిషేధించడం మాత్రమే కాక, “నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను” అని కూడా అది ఆజ్ఞాపించింది. (లేవీయకాండము 19:18) పరదేశులతో దయారహితంగా ప్రవర్తించడాన్ని అది నిషేధించడం మాత్రమే కాక, అది ఇలా ఆజ్ఞాపించింది: “నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి.” (లేవీయకాండము 19:34) అది వ్యభిచారాన్ని ఖండించడమే కాకుండా, తన భార్యను సంతోషపెట్టాలని కూడా అది భర్తకు ఆజ్ఞాపించింది! (ద్వితీయోపదేశకాండము 24:5) కేవలం ద్వితీయోపదేశకాండము పుస్తకంలోనే, ప్రేమ లక్షణాన్ని సూచించే హెబ్రీ పదాలు దాదాపు 20 సార్లు ఉపయోగింపబడ్డాయి. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో ఇశ్రాయేలీయుల ఎడల తన ప్రేమను గురించి యెహోవా వారికి నిశ్చయతనిచ్చాడు. (ద్వితీయోపదేశకాండము 4:37, 38; 7:12-14) వాస్తవానికి, మోషే ధర్మశాస్త్రం యొక్క అతి గొప్ప ఆజ్ఞ ఇదే: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను [“పూర్ణప్రాణము,” NW] నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:5) ధర్మశాస్త్రం మొత్తం ఆ ఆజ్ఞపై, అలాగే దానితోపాటు తన పొరుగువాన్ని ప్రేమించాలనే ఆజ్ఞపై కూడా ఆధారితమైవుందని యేసు చెప్పాడు. (లేవీయకాండము 19:18; మత్తయి 22:37-40) “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను” అని కీర్తనల గ్రంథకర్త వ్రాయడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు.—కీర్తన 119:97.

ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగం చేయడం

10. యూదులు అత్యధిక శాతం, మోషే ధర్మశాస్త్రాన్ని ఎలా పరిగణించారు?

10 ఇశ్రాయేలీయులు మొత్తంగా మోషే ధర్మశాస్త్రం ఎడల మెప్పును కలిగి లేకుండిరన్నది ఎంత విషాదకరం! ప్రజలు ధర్మశాస్త్రానికి అవిధేయత చూపారు, దాన్ని నిర్లక్ష్యం చేశారు, లేక దాని గురించి మర్చిపోయారు. వారు ఇతర జనాంగాల నీచమైన మత ఆచారాలతో స్వచ్ఛారాధనను కలుషితం చేశారు. (2 రాజులు 17:16, 17; కీర్తన 106:13, 35-38) మరి వారు ఇతర విధాలుగా కూడా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు.

11, 12. (ఎ) ఎజ్రా కాలం తర్వాత, మత నాయకుల గుంపులు ఎలా పాడు చేశాయి? (బాక్సు చూడండి.) (బి) ‘ధర్మశాస్త్రం చుట్టూ కంచె వేయడం’ అవసరమని ప్రాచీన రబ్బిలు ఎందుకు భావించారు?

11 ధర్మశాస్త్రానికి వాటిల్లిన విపరీతమైన నష్టంలో కొంత, దాన్ని బోధిస్తున్నామని మరియు దాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే వారి ద్వారానే వాటిల్లింది. సా.శ.పూ. ఐదవ శతాబ్దానికి చెందిన నమ్మకస్థుడైన శాస్త్రియగు ఎజ్రా కాలం తర్వాత అది సంభవించింది. ఇతర జనాంగాల అవినీతికరమైన ప్రభావాలకు విరుద్ధంగా ఎజ్రా తీవ్రంగా పోరాడాడు మరియు ధర్మశాస్త్రాన్ని చదవడాన్ని మరియు బోధించడాన్ని ఆయన నొక్కిచెప్పాడు. (ఎజ్రా 7:10; నెహెమ్యా 8:5-8) కొందరు ధర్మశాస్త్ర బోధకులు తాము ఎజ్రా అడుగుజాడలను అనుసరిస్తున్నామని చెప్పుకుని, “గొప్ప సమాజమందిరం” అని పిలువబడిన దాన్ని రూపొందించారు. అది చెప్పిన వాటిలో ఈ విషయం ఉంది: “ధర్మశాస్త్రానికి చుట్టూ కంచెను వేయండి.” ధర్మశాస్త్రం ఓ ప్రశస్తమైన తోటవలే ఉండిందని ఈ బోధకులు తర్కించారు. దాని నియమాలను ఉల్లంఘించడం ద్వారా ఎవరూ కూడా ఈ తోటలోకి చొరబడకుండా ఉండాలంటే, వ్రాతపూర్వక ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించే తప్పిదానికి దగ్గరకు కూడా రాకుండా ప్రజలను నివారించాలని వారు అదనపు నియమాలను అంటే “మౌఖిక ధర్మశాస్త్రాన్ని” సృష్టించారు.

12 ఈ విధంగా భావించడంలో యూదా మత నాయకులు న్యాయబద్ధంగా ఉన్నారని కొందరు వాదించవచ్చు. ఎజ్రా కాలం తర్వాత, యూదులపై విదేశీ శక్తులు, ప్రాముఖ్యంగా గ్రీకులు ఆధిపత్యం చేశారు. గ్రీకు తత్వం మరియు సంస్కృతి యొక్క ప్రభావాన్ని ఎదిరించడానికి, యూదుల్లో మత నాయకుల గుంపులు ఉత్పన్నమయ్యాయి. (బాక్సు, పేజీ 10 చూడండి.) కొంత కాలానికి ఈ గుంపుల్లో కొన్ని, ధర్మశాస్త్ర బోధకులుగా లేవీ యాజకులకున్న హక్కుతో పోటీ పడేందుకు, చివరకు వారిని దాటి పోయేందుకు కూడా బయల్దేరాయి. (మలాకీ 2:7 పోల్చండి.) సా.శ.పూ. 200కల్లా, మౌఖిక ధర్మశాస్త్రం యూదుల జీవితంలో ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. అవి వ్రాతపూర్వక ధర్మశాస్త్రానికి సమానమని ఎన్నడూ అనుకోకుండా ఉండేందుకు, మొదటిగా ఈ నియమాలు వ్రాయబడకూడదు. అయితే క్రమేపీ, మానవ ఆలోచనావిధానం దైవిక ఆలోచనావిధానాన్ని అధిగమించింది, అలా ఏ “తోటను” కాపాడాలనే ఉద్దేశంతో ఈ “కంచె” వేయబడిందో తుదకు అది దాన్ని వాస్తవంగా నాశనం చేసింది.

పరిసయ్యుల మతం యొక్క కాలుష్యం

13. అనేక సూత్రాలను చేయడాన్ని కొందరు యూదా మత నాయకులు ఎలా సమర్థించారు?

13 తోరాహ్‌ లేక మోషే ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది గనుక, తలెత్తగల ఏ ప్రశ్నకైనా అది సమాధానాన్ని కలిగివుండాలని రబ్బిలు తర్కించారు. ఈ తలంపు నిజంగా గౌరవనీయమైనది కాదు. వాస్తవానికి, అలా కొన్ని వ్యక్తిగతమైన విషయాల్లో మరియు ఇతర స్వల్ప విషయాల్లో, అంటే అన్ని విధాలైన విషయాల్లో సూత్రాలకు దేవుని వాక్యమే కారణమని అగుపించేలా చేస్తూ, చతురమైన మానవ తర్కాన్ని ఉపయోగించేందుకు అది రబ్బిలకు లైసెన్సును ఇచ్చింది.

14. (ఎ) జనాంగాలనుండి వేరుగా ఉండాలన్న లేఖన సూత్రాన్ని యూదా మత నాయకులు లేఖన విరుద్ధమైన విపరీతంగా ఎలా విశదీకరించారు? (బి) రబ్బిల సూత్రాలు యూదా ప్రజలను అన్యుల ప్రభావాలనుండి కాపాడటంలో విఫలమయ్యాయని ఏది చూపుతుంది?

14 మత నాయకులు లేఖనాధార నియమాలను పదే పదే విపరీతంగా విశదీకరించారు. ఉదాహరణకు, మోషే ధర్మశాస్త్రం జనాంగాలనుండి వేరుగా ఉండటాన్ని ప్రోత్సహించింది, కాని యూదేతరమైన ప్రతి దాని ఎడల నిర్హేతుకమైన అసహ్యతను రబ్బిలు ప్రబోధించారు. అన్యులు “మృగ సంపర్కం చేస్తారని అనుమానింపబడుతున్నారు గనుక” ఒక యూదుడు తన పశువులను అన్యుల పూటకూళ్ల ఇళ్ల దగ్గిర వదలకూడదని వారు బోధించారు. ప్రసవ వేదన పడుతున్న అన్యురాలికి ఒక యూదురాలు సహాయపడేందుకు అనుమతింపబడేది కాదు, ఎందుకంటే అలా చేస్తే ఆమె “విగ్రహారాధన చేసేందుకు ఒక పిల్లవాడు పుట్టడానికి సహాయం చేస్తుంది.” గ్రీకు జిమినాసియమ్‌లంటే రబ్బిలు సరిగ్గానే అనుమానించేవారు గనుక అన్ని విధాలైన అథిలెటిక్‌ వ్యాయామాలనూ వారు నిషేధించారు. యూదులను అన్య విశ్వాసాలనుండి కాపాడేందుకు ఇదంతా ఎంతో తక్కువే చేసిందని చరిత్ర నిరూపిస్తుంది. వాస్తవానికి, ప్రాణము అమర్త్యమైనదనే అన్య గ్రీకు సిద్ధాంతాన్ని పరిసయ్యులే బోధించడం ప్రారంభించారు!—యెహెజ్కేలు 18:4, NW.

15. పరిశుభ్రతను మరియు రక్తసంబంధుల మధ్య లైంగిక దురాచారాన్ని గురించిన నియమాలను యూదా మత నాయకులు ఎలా వక్రీకరించారు?

15 పరిశుభ్రతను గురించిన నియమాలను కూడా పరిసయ్యులు వక్రీకరించారు. పరిసయ్యులకు గనుక అవకాశం ఇవ్వబడితే వారు సూర్యున్ని కూడా పరిశుభ్రం చేస్తారని చెప్పబడేది. వారి నియమం ప్రకారం, “కాలకృత్యాలు తీర్చుకోవడంలో” కొంత ఆలస్యం మనిషిని కలుషితం చేస్తుంది! ఏ చెయ్యిని ముందు కడుగుకోవాలి ఎలా కడుగుకోవాలి అనే విషయాల్లో సూత్రాలతో, చేతులు కడుగుకోవడం ఒక సంక్లిష్ట ఆచారమయ్యింది. ప్రాముఖ్యంగా స్త్రీలు అశుద్ధమైన వారిగా ఎంచబడ్డారు. శారీరక సంబంధులను “సమీపింప” కూడదు (వాస్తవానికి రక్తసంబంధుల మధ్య లైంగిక దురాచారానికి విరుద్ధంగా ఇవ్వబడిన ఒక నియమం) అనే లేఖనాధార ఆజ్ఞ ఆధారంగా, ఒక భర్త తన భార్య వెనుక నడవకూడదనే సూత్రాన్ని రబ్బిలు స్థాపించారు; మరి సంత వీధిలో అతను ఆమెతో సంభాషించ కూడదు.—లేవీయకాండము 18:6.

16, 17. వారపు విశ్రాంతి దినాన్ని ఆచరించాలన్న ఆజ్ఞపై మౌఖిక ధర్మశాస్త్రం ఎలా విస్తృతంగా వివరించింది మరియు దాని ఫలితమేమిటి?

16 విశ్రాంతి దినానికి సంబంధించిన నియమాన్ని గురించి మౌఖిక ధర్మశాస్త్రం చేసిన ఆత్మీయ ఎగతాళి ప్రాముఖ్యంగా మరీ విపరీతమైనది. వారంలోని ఏడవ దినాన ఏ పనీ చేయవద్దు అనే ఒక క్లుప్త ఆజ్ఞను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. (నిర్గమకాండము 20:8-11) అయితే, నిషేధింపబడిన దాదాపు 39 విభిన్న విధాలైన పనులను మౌఖిక ధర్మశాస్త్రం వర్ణించింది, ముడి వేయడం లేక విప్పడం, రెండు కుట్లు వేయడం, రెండు హెబ్రీ అక్షరాలను వ్రాయడం ఇత్యాధి అందులోవున్నాయి. తర్వాత ఈ విధాలలో ప్రతి దానికి అంతులేని అదనపు సూత్రాలు అవసరమయ్యాయి. ఏ ముడులు నిషేధింపబడ్డాయి మరియు ఏవి అనుమతింపబడ్డాయి? మౌఖిక ధర్మశాస్త్రం నిరంకుశమైన కట్టడలతో సమాధానమిచ్చింది. స్వస్థపర్చడం ఒక నిషేధింపబడిన పనిగా భావింపబడింది. ఉదాహరణకు, విశ్రాంతి దినాన ఒక విరిగిన ఎముకను సరిచేయడం నిషేధింపబడింది. పంటి నొప్పి ఉన్న వ్యక్తి తన ఆహారంలో రుచి కొరకు వినిగర్‌ను వాడవచ్చు, అయితే అతను వినిగర్‌ను తన పళ్లల్లో నుండి పీల్చుకోకూడదు. అది అతని పళ్లను స్వస్థపర్చవచ్చు!

17 అలా మనుష్యులు కల్పించిన వందలాది సూత్రాల క్రింద మరుగై, విశ్రాంతి దినాన్ని గూర్చిన నియమం అనేకమంది యూదుల విషయంలో దాని ఆత్మీయ భావాన్ని కోల్పోయింది. ‘విశ్రాంతి దినమునకు ప్రభువైన’ యేసుక్రీస్తు విశ్రాంతి దినాన మహత్తరమైన, హృదయానందకరమైన అద్భుతాలను చేసినప్పుడు, శాస్త్రులు మరియు పరిసయ్యులు కదిలింపబడలేదు. ఆయన తమ కట్టడలను అలక్ష్యం చేస్తున్నట్లున్నాడని మాత్రమే వారు ఆలోచించారు.—మత్తయి 12:8, 10-14.

పరిసయ్యుల పొరపాట్లనుండి నేర్చుకోవడం

18. మోషే ధర్మశాస్త్రానికి మౌఖిక ధర్మశాస్త్రాన్ని మరియు పారంపర్యాలను జత చేయడం యొక్క ఫలితం ఏమిటి? ఉదాహరణనివ్వండి.

18 క్లుప్తంగా చెప్పాలంటే, జల జంతువులు నౌక అడుగుభాగానికి అతుక్కుపోయే విధంగా, ఈ అదనపు నియమాలు మరియు పారంపర్యాలు మోషే ధర్మశాస్త్రానికి అతుక్కుపోయాయి. అవి నౌక వేగాన్ని తగ్గించి, తుప్పు పట్టకుండా ఉంచే దాని పెయింట్‌ను నాశనం చేస్తాయి గనుక, నౌక యజమాని విసుగుపుట్టించే ఈ జీవులను గీకి తీసేయడానికి ఎంతో సమయాన్ని వెచ్చిస్తాడు మరియు కృషి చేస్తాడు. అదే విధంగా, మౌఖిక నియమాలు మరియు పారంపర్యాలు ధర్మశాస్త్రాన్ని భారం చేసి, దాన్ని దుర్వినియోగం చేసేందుకు విడిచిపెట్టాయి. అయితే, అలాంటి అదనపు నియమాలను గీకి అవతల పారేసే బదులు, రబ్బిలు ఇంకా ఎక్కువ జత చేస్తూపోయారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేందుకు మెస్సీయ వచ్చేసరికల్లా, “జలజంతువుల”తో “నౌక” ఎంత గట్టిపడిపోయి ఉందంటే అది తేలలేక పోతోంది! (సామెతలు 16:25 పోల్చండి.) ధర్మశాస్త్ర నిబంధనను కాపాడే బదులు, ఈ మత నాయకులు దాన్ని ఉల్లంఘించే పొరపాటును చేశారు. అయితే వారి కట్టడల “కంచె” ఎందుకు విఫలమైంది?

19. (ఎ) ‘ధర్మశాస్త్రం చుట్టూ ఉన్న కంచె’ ఎందుకు విఫలమైంది? (బి) యూదా మత నాయకులలో యథార్థమైన విశ్వాసం లోపించిందని ఏది చూపుతుంది?

19 అవినీతికి విరుద్ధంగా చేసే పోరాటాన్ని హృదయంలో పోరాడాలి కానీ ధర్మశాస్త్ర పుస్తకాల పుటల్లో కాదని అర్థం చేసుకోవడంలో యూదా మత నాయకులు విఫలమయ్యారు. (యిర్మీయా 4:14) విజయం యొక్క కీలకం ప్రేమ—యెహోవా ఎడల, ఆయన ధర్మశాస్త్రం మరియు ఆయన యథార్థ సూత్రాల ఎడల ప్రేమ. అలాంటి ప్రేమ, యెహోవా దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించేలా చేస్తుంది. (కీర్తన 97:10; 119:104) ప్రేమతో తమ హృదయాలు నిండి ఉన్నవారు, ఈ అవినీతికర లోకంలో యెహోవా నియమాలకు నమ్మకంగా ఉంటారు. అలాంటి ప్రేమను పురికొల్పి మరియు దాన్ని ప్రేరేపించేందుకు ప్రజలకు బోధించే గొప్ప ఆధిక్యత ఆ యూదా మత నాయకులకు ఉండేది. అలా చేసేందుకు వారు ఎందుకు విఫలమయ్యారు? వారిలో విశ్వాసం లోపించిందని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. (మత్తయి 23:23) నమ్మకస్థులైన మానవుల హృదయాల్లో యెహోవా ఆత్మ పని చేయగల శక్తి ఎడల వారికి విశ్వాసం ఉండివుంటే, ఇతరుల జీవితాలను తమ కఠినమైన అదుపాజ్ఞల్లోకి తీసుకోవలసిన అవసరముందని వారు భావించి ఉండేవారు కాదు. (యెషయా 59:1; యెహెజ్కేలు 34:4) విశ్వాసం లోపించడం మూలంగా, వారు విశ్వాసాన్ని ప్రబోధించలేదు; వారు మనుష్యాజ్ఞలతో ప్రజలకు భారాన్ని కలిగించారు.—మత్తయి 15:3, 9; 23:4.

20, 21. (ఎ) పారంపర్యమే ప్రధానమనే ఆలోచనావిధానం యూదా మతంపై ఏ విధమైన ప్రభావాన్ని మొత్తంమీద కలిగివుండినది? (బి) యూదా మతానికి సంభవించిన దాని నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటాము?

20 ఆ యూదా మత నాయకులు ప్రేమను పెంపొందింపజేయలేదు. వారి పారంపర్యాలు, బాహ్య విషయాలను చూడటంపై ఎక్కువ ఆసక్తిగల, బయటికి కనిపించేందుకు యాంత్రికంగా విధేయతను చూపే మతాన్ని ఉత్పత్తి చేశాయి, అది వేషధారణకు సారవంతమైన పోషణస్థలం. (మత్తయి 23:25-28) వారి కట్టడలు ఇతరులకు తీర్పు తీర్చేందుకు లెక్కలేనన్ని కారణాలను ఉత్పత్తి చేశాయి. అలా అహంకారంగల, పెత్తందారులైన పరిసయ్యులు యేసుక్రీస్తును విమర్శించడంలో కూడా తాము సరి అనుకున్నారు. ధర్మశాస్త్రం యొక్క ముఖ్య సంకల్పాన్ని వారు గ్రహించలేదు, మరి ఏకైక నిజమైన మెస్సీయను నిరాకరించారు. దాని ఫలితంగా, యూదా జనాంగానికి ఆయన ఇలా చెప్పవలసి వచ్చింది: “ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.”—మత్తయి 23:38; గలతీయులు 3:23, 24.

21 మనకు ఏ గుణపాఠం ఉంది? కఠినమైన, పారంపర్యంపై ఎక్కువ ఆసక్తిగల ఆలోచనావిధానం యెహోవా స్వచ్ఛారాధనను పెంపొందింపజేయదన్న విషయం స్పష్టమౌతుంది! అయితే యెహోవా ఆరాధికులకు నేడు ఆ సూత్రాలు పరిశుద్ధలేఖనాల్లో నిర్దిష్టంగా చెప్పబడకపోతే వారు ఎలాంటి సూత్రాలను కూడా కలిగివుండరని దీని అర్థమా? కాదు. ఒక సంపూర్ణ సమాధానం కొరకు, మోషే ధర్మశాస్త్రం స్థానంలో యేసుక్రీస్తు మరొక క్రొత్త మరియు శ్రేష్ఠమైన ధర్మశాస్త్రాన్ని ఎలా ఉంచాడో మనం తదుపరి పరిశీలిద్దాము.

[అధస్సూచీలు]

a ఆధునిక దేశాల న్యాయ వ్యవస్థతో పోల్చి చూస్తే, అది ఇప్పటికీ చాలా చిన్న సంఖ్య మాత్రమే అన్నది వాస్తవం. ఉదాహరణకు, 1990ల తొలి కాలానికల్లా, అమెరికా యొక్క కేంద్ర సూత్రాలు 1,25,000 కంటే ఎక్కువ పేజీలను నింపాయి, మరి ప్రతి సంవత్సరం వేలాది క్రొత్త నియమాలు జత చేయబడుతున్నాయి.

మీరు వివరించగలరా?

◻ దైవిక నియమం ద్వారా సర్వ సృష్టి కూడా ఎలా నియంత్రింపబడుతుంది?

◻ మోషే ధర్మశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి?

◻ మోషే ధర్మశాస్త్రం దయను మరియు కనికరాన్ని ఉన్నతపరిచిందని ఏది చూపుతుంది?

◻ మోషే ధర్మశాస్త్రానికి యూదా మత నాయకులు లెక్కలేనన్ని సూత్రాలను ఎందుకు జత చేశారు, దాని ఫలితమేమిటి?

[10వ పేజీలోని బాక్సు]

యూదా మత నాయకులు

శాస్త్రులు: తాము ఎజ్రా వారసులమని మరియు ధర్మశాస్త్రాన్ని వివరించే వారమని తమనుతాము పరిగణించుకున్నారు. యూదుల చరిత్ర (ఆంగ్లం) అనే పుస్తకం ప్రకారం, “శాస్త్రులందరూ సద్భావంగల మనుష్యులేమీ కాదు, ధర్మశాస్త్రం నుండి గుప్తార్థాలను వెలికి తీయాలన్న వారి ప్రయత్నాలు తరచూ అర్థరహిత సూత్రాలు మరియు అవివేక కట్టుబాట్లుగా మారిపోయాయి. వీటిని ఆచారం ధృవపరిచింది, అది త్వరలో కాఠిన్యంగల నియంతగా మారింది.”

హసీడిమ్‌: ఆ పేరుకు “పవిత్రమైన వారు” లేక “పరిశుద్ధులు” అనే భావముంది. సా.శ.పూ. 200 ఆ ప్రాంతంలో మొదట ఒక తరగతిగా పేర్కొనబడిన వీరు రాజకీయపరంగా శక్తిమంతులు, గ్రీకు ప్రభావం యొక్క నియంత విధానం నుండి ధర్మశాస్త్రం యొక్క శుద్ధతను కాపాడాలనే మూర్ఖ వాదులు. హసీడిమ్‌ మూడు గుంపులుగా విభజింపబడ్డారు: పరిసయ్యులు, సద్దూకయ్యులు మరియు ఎస్సెన్‌లు.

పరిసయ్యులు: “వేరుపరచబడిన వారు,” లేక “వేర్పడినవారు” అనే వాటికున్న పదాలనుండి ఈ పేరు తీసుకోబడిందని కొందరు పండితులు నమ్ముతారు. అన్యులనుండి వేరుగా ఉండాలనే వారి గట్టి ప్రయత్నంలో వారు వాస్తవంగా పిచ్చిగా ప్రవర్తించారు, అంతే కాకుండా, మౌఖిక ధర్మశాస్త్రం యొక్క సంక్లిష్టతలు తెలియని సామాన్య యూదుల కంటే తాము ఉన్నతులమని మరియు వేరుగా ఉన్నామని కూడా వారు భావించారు. పరిసయ్యుల గురించి ఒక చరిత్రకారుడు ఇలా చెప్పాడు: “మొత్తం మీద పరిశీలిస్తే, ఆచార నియమాల గురించిన అతి సూక్ష్మ విషయాలను కూడా రూపొందించి నిర్వచిస్తూ, వీరు మనుష్యులను పిల్లలవలె దృష్టించేవారు.” మరో పండితుడు ఇలా చెప్పాడు: “పరిసయ్యుల మతం అన్ని పరిస్థితులను పరిగణించే న్యాయ సూత్రాల సముదాయాన్ని ఉత్పన్నం చేసింది, దాని మూలంగా వారు అతి స్వల్ప విషయాలను పెద్దవిగా చేస్తూ అలా చేయడంలో ముఖ్య విషయాలను అతి స్వల్పమైన వాటిగా చేయడమనే తప్పించుకోలేని పర్యవసానాన్ని ఎదుర్కొన్నారు. (మత్త. 23:23).”

సద్దూకయ్యులు: రాజరికంతో మరియు యాజకత్వంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉన్న గుంపు ఇది. వ్రాతపూర్వక ధర్మశాస్త్రానికి ఉన్నంత విలువ మౌఖిక ధర్మశాస్త్రానికి లేదని చెబుతూ, వీరు శాస్త్రులను మరియు పరిసయ్యులను తీవ్రంగా వ్యతిరేకించారు. వారు ఈ పోరాటంలో ఓడిపోయారనే విషయం మిష్నా ద్వారానే చూపబడుతోంది: “[వ్రాతపూర్వక] ధర్మశాస్త్రం యొక్క మాటలను [అనుసరించడం] కంటే, శాస్త్రుల మాటలను [అనుసరించడానికే] ఎక్కువ కట్టుదిట్టం ఉంది.” మౌఖిక ధర్మశాస్త్రంపై ఎక్కువ వ్యాఖ్యానాన్ని కలిగి ఉన్న తాల్ముద్‌, తర్వాత “శాస్త్రుల మాటలు . . . తోరాహ్‌ మాటలకంటే ప్రశస్తమైనవి” అని కూడా చెప్పేంత వరకూ వెళ్లింది.

ఎస్సెన్‌లు: తమను ఏకాంత సమాజాల్లో వేరుపరుచుకున్న నాస్తిక గుంపే వీరు. ది ఇన్టర్‌ప్రీటర్స్‌ డిక్షనరీ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం ప్రకారం, ఎస్సెన్‌లు పరిసయ్యులకంటే ఎక్కువ విడిగా ఉండే వారు మరి “కొన్నిసార్లు పరిసయ్యులనే తలదన్నేలా ఉండేవారు.”

[8వ పేజీలోని చిత్రం]

నక్షత్రరాసులను నడిపించే సూత్రాలను గురించి యోబు తలిదండ్రులు ఆయనకు నేర్పించి ఉండవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి