అధ్యాయం 13
“యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది”
1, 2. చాలామంది చట్టాన్ని ఎందుకు పెద్దగా గౌరవించరు? కానీ దేవుని నియమాల గురించి మనకు ఏమనిపిస్తుంది?
“చట్టం అనేది అంతేలేని గొయ్యి లాంటిది, అది . . . అన్నిటినీ మింగేస్తుంది” అని 1712 లో రాసిన ఒక పుస్తకం చెప్పింది. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఇంకా ఏమని విమర్శిస్తున్నాడు అంటే, కొన్ని కేసులు కోర్టుల్లో సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉంటాయి, ఈలోగా కోర్టు చుట్టూ తిరిగితిరిగి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. చాలా దేశాల్లో చట్టాలు, న్యాయవ్యవస్థలు అర్థం చేసుకోవడానికి మహా కష్టంగా ఉంటాయి. వాటిలో ఎక్కడ చూసినా అన్యాయం, పక్షపాతం, అవకతవకలే ఉన్నాయి కాబట్టి ప్రజలకు వాటిమీద గౌరవం పోతుంది.
2 కానీ దాదాపు 2,700 సంవత్సరాల క్రితం ఒకాయన ఇలా అన్నాడు: “నీ ధర్మశాస్త్రాన్ని [లేదా నియమాల్ని] నేను ఎంతో ప్రేమిస్తున్నాను!” (కీర్తన 119:97) కీర్తనకర్త అంతలా ఎందుకు ప్రేమించాడు? ఎందుకంటే, ఆ ధర్మశాస్త్రం మనుషుల ప్రభుత్వం నుండి రాలేదు గానీ యెహోవా దేవుని నుండి వచ్చింది. కాబట్టి మీరు యెహోవా ధర్మశాస్త్రాన్ని లేదా నియమాల్ని అధ్యయనం చేసేకొద్దీ, మీకు కూడా కీర్తనకర్తలాగే అనిపిస్తుంది. అలా అధ్యయనం చేయడం వల్ల, ఈ విశ్వంలోనే గొప్ప న్యాయమూర్తి ఎలా ఆలోచిస్తాడో మీరు తెలుసుకుంటారు.
గొప్ప శాసనకర్త
3, 4. యెహోవా శాసనకర్తగా ఎలా నిరూపించుకున్నాడు?
3 “శాసనకర్త, తీర్పు తీర్చే వ్యక్తి ఒక్కడే” అని బైబిలు చెప్తుంది. (యాకోబు 4:12, అధస్సూచి) అవును, సృష్టిలో ఉన్న ప్రతీదానికి నియమాలు పెట్టే శాసనకర్త యెహోవా మాత్రమే. ఆఖరికి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఆయన పెట్టిన “ఆకాశ నియమాల” ప్రకారమే కదులుతాయి. (యోబు 38:33) అంతేకాదు, కోటానుకోట్ల పవిత్ర దూతలు కూడా యెహోవా పెట్టిన నియమాల ప్రకారమే పనిచేస్తారు. వాళ్లు వేర్వేరు స్థానాల్లో ఉండి, యెహోవా కింద పరిచారకులుగా సేవచేస్తారు.—కీర్తన 104:4; హెబ్రీయులు 1:7, 14.
4 యెహోవా మనుషులకు కూడా నియమాలు ఇచ్చాడు. మనలో ప్రతీ ఒక్కరికీ మనస్సాక్షి ఉంది. అది ఒకవిధంగా మన లోపల ధర్మశాస్త్రంలా పనిచేస్తూ, యెహోవా దృష్టిలో ఏది తప్పో, ఏది ఒప్పో గుర్తుపట్టడానికి సహాయం చేస్తుంది. (రోమీయులు 2:14) అయితే మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలకు పరిపూర్ణ మనస్సాక్షి ఉంది కాబట్టి, వాళ్లకు కొన్ని నియమాలు ఇచ్చినా సరిపోతుంది. (ఆదికాండం 2:15-17) కానీ అపరిపూర్ణులమైన మనకు, యెహోవా ఇష్టం చేయాలంటే చాలా నియమాలు అవసరం పడతాయి. ఉదాహరణకు నోవహు, అబ్రాహాము, యాకోబు లాంటి పూర్వీకులకు యెహోవా నియమాలు ఇచ్చాడు. వాళ్లు తర్వాతి తరాలకు వాటిని అందించారు. (ఆదికాండం 6:22; 9:3-6; 18:19; 26:4, 5) తర్వాతి కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అప్పుడు, ఆయన ఒక గొప్ప విధానంలో శాసనకర్త లేదా నియమాలు ఇచ్చే వ్యక్తి అయ్యాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తే, యెహోవా న్యాయం అంటే ఏంటో మనం బాగా అర్థం చేసుకోవచ్చు.
మోషే ధర్మశాస్త్రంలో ఏముంది?
5. మోషే ధర్మశాస్త్రంలో ఏవేవో అర్థంకాని నియమాలు ఉంటాయా? అలా ఎందుకు చెప్పవచ్చు?
5 మోషే ధర్మశాస్త్రంలో ఏవేవో అర్థంకాని నియమాలు ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ధర్మశాస్త్రం మొత్తంలో 600 కు పైగా నియమాలు ఉన్నాయి. ఆ సంఖ్య వినగానే కొంచెం ఎక్కువే అనిపించవచ్చు, కానీ దీనిగురించి ఒకసారి ఆలోచించండి: 20వ శతాబ్దం చివరికల్లా, యునైటెడ్ స్టేట్స్‌లో చట్టానికి సంబంధించిన పుస్తకాల్లో దాదాపు 1,50,000 పేజీలు వాళ్లు తయారుచేసిన చట్టాలతో నిండిపోయాయి. అదీగాక, వాళ్లు రెండు సంవత్సరాలకు ఒకసారి దగ్గరదగ్గర 600 కొత్త నియమాల్ని చేరుస్తూ ఉంటారు! కాబట్టి, రోజురోజుకీ కొండల్లా పేరుకుపోతున్న మనుషుల చట్టాల ముందు మోషే ధర్మశాస్త్రం ఎంత? చిన్న గులకరాయి అంత. అయితే, ఇప్పుడున్న చట్టాలు కనీసం ఊసు కూడా ఎత్తని చాలా విషయాల్ని దేవుని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఎప్పుడో చెప్పింది. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
6, 7. (ఎ) వేరే దేశ చట్టాలకు, మోషే ధర్మశాస్త్రానికి ఉన్న తేడా ఏంటి? అందులో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? (బి) ఇశ్రాయేలీయులు యెహోవా సర్వాధిపత్యానికి లోబడుతున్నామని ఎలా చూపించేవాళ్లు?
6 ధర్మశాస్త్రం యెహోవా సర్వాధిపత్యాన్ని నొక్కిచెప్పింది. అందుకే ఏ దేశ చట్టాలు కూడా, మోషే ధర్మశాస్త్రానికి సాటిరావు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే: “ఓ ఇశ్రాయేలూ, విను: మన దేవుడైన యెహోవా ఒకేఒక్క యెహోవా. నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” దేవుని ప్రజలు ఆయన మీద ఉన్న ప్రేమను ఎలా చూపించాలి? వాళ్లు ఆయన సర్వాధిపత్యానికి లోబడుతూ ఆయన్ని సేవించాలి.—ద్వితీయోపదేశకాండం 6:4, 5; 11:13.
7 యెహోవా ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్లందరికీ లోబడడం ద్వారా, ఇశ్రాయేలీయులు ఆయన సర్వాధిపత్యానికి లోబడుతున్నామని చూపించేవాళ్లు. అమ్మానాన్నలకు, ప్రధానులకు, న్యాయమూర్తులకు, యాజకులకు, అలాగే రాజుకు అధికారం ఇచ్చింది యెహోవాయే. వీళ్లలో ఏ ఒక్కరికి ఎదురుతిరిగినా తనకే ఎదురుతిరిగినట్టు యెహోవాకు అనిపిస్తుంది. ఇంకోపక్క, అధికారంలో ఉన్నవాళ్లు తన ప్రజలకు అన్యాయం చేసినా, వాళ్లతో దురుసుగా ప్రవర్తించినా ఆయనకు కోపం వచ్చేది. (నిర్గమకాండం 20:12; 22:28; ద్వితీయోపదేశకాండం 1:16, 17; 17:8-20; 19:16, 17) కాబట్టి అధికారంలో ఉన్న వాళ్లయినా, అధికారానికి లోబడాల్సిన వాళ్లయినా, ఇద్దరికీ యెహోవా సర్వాధిపత్యానికి లోబడాల్సిన బాధ్యత ఉంది.
8. పవిత్రంగా ఉండమని ధర్మశాస్త్రం ఎలా నొక్కిచెప్పింది?
8 ధర్మశాస్త్రం పవిత్రతను నొక్కిచెప్పింది. “పవిత్ర,” “పవిత్రత” అనే పదాలు ధర్మశాస్త్రంలో 280 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఒక ఇశ్రాయేలీయుడిని అపవిత్రం చేసే 70 వేర్వేరు పరిస్థితుల గురించి ధర్మశాస్త్రంలో నియమాలు ఉన్నాయి. ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది స్వచ్ఛమైనదో, ఏది కలుషితమైనదో అర్థం చేసుకోవడానికి ఆ నియమాలు దేవుని ప్రజలకు సహాయం చేశాయి. వాళ్లు ఎలా శుభ్రంగా ఉండాలో, మంచి ఆహారం ఎలా తీసుకోవాలో, ఆఖరికి చెత్తను ఎక్కడ పారేయాలో కూడా ఆ నియమాలు చెప్పాయి. ఈ నియమాలు వాళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేశాయి.a కానీ అంతకన్నా ముఖ్యంగా, చుట్టుపక్కల దేశాలు చేస్తున్న నీచమైన పనులకు దూరంగా ఉంటూ, యెహోవా ఆమోదాన్ని పొందడానికి అవి వాళ్లకు సహాయం చేశాయి. ఒక ఉదాహరణ చూడండి.
9, 10. లైంగిక సంబంధాలు, పిల్లల్ని కనడం గురించి ధర్మశాస్త్రంలో ఏ నియమాలు ఉన్నాయి? వాటివల్ల ఏయే ప్రయోజనాలు వచ్చాయి?
9 లైంగిక సంబంధాలు (అవి భార్యాభర్తల మధ్య అయినా సరే), పిల్లల్ని కనడం ఒక వ్యక్తిని కొన్ని రోజుల పాటు అపవిత్రులుగా చేస్తాయని ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండం 12:2-4; 15:16-18) అవి యెహోవా ఇచ్చిన పవిత్రమైన బహుమతులు. దేవుడు వాటి విలువను తగ్గించడానికి ఆ నియమాలు ఇవ్వలేదు. (ఆదికాండం 1:28; 2:18-25) కానీ, తనను ఆరాధించేవాళ్లు పవిత్రంగా ఉండడం కోసమే ఆ నియమాలు ఇచ్చాడు. ఎందుకంటే, ఇశ్రాయేలీయుల చుట్టూవున్న దేశాలు, ఆరాధనను లైంగిక విషయాలతో కలిపేవి. కనానీయుల మతంలోనైతే మగ వేశ్యలు, ఆడ వేశ్యలు ఉండేవాళ్లు. దానివల్ల, వాళ్లలో ఆ నీచమైన పనులు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమైతే, ఆరాధనను లైంగిక విషయాలతో కలపకుండా పూర్తిగా దూరం పెట్టింది.b దానివల్ల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
10 ఆ నియమాలు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధించాయి.c ఆదాము పాపం తర్వాతి తరాల వాళ్లకు ఎలా అంటుకుంది? లైంగిక సంబంధాలు, పిల్లలు పుట్టడం ద్వారానే కదా? (రోమీయులు 5:12) అవును, ప్రజలు పాపంలో ఉన్నారనే చేదు నిజాన్ని ధర్మశాస్త్రం వాళ్లకు పదేపదే గుర్తుచేసేది. నిజానికి, మనందరం పాపంలోనే కళ్లు తెరిచాం. (కీర్తన 51:5) కాబట్టి, పవిత్రుడైన దేవుడు మనల్ని క్షమించి, విడిపిస్తే తప్ప మనం ఆయనకు దగ్గరవ్వలేం.
11, 12. (ఎ) ధర్మశాస్త్రం ఏ ముఖ్యమైన సత్యాన్ని బోధించింది? (బి) న్యాయం తారుమారు అవ్వకుండా ధర్మశాస్త్రం ఎలా అడ్డుకట్ట వేసింది?
11 ధర్మశాస్త్రం యెహోవాకున్న పరిపూర్ణ న్యాయాన్ని నొక్కిచెప్పింది. మోషే ధర్మశాస్త్రం, నేరానికి తగ్గట్టే శిక్ష ఉండాలనే ముఖ్యమైన సత్యాన్ని బోధించింది. అది ఇలా చెప్పింది: “ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు చెల్లించాలి.” (ద్వితీయోపదేశకాండం 19:21) ఒక వ్యక్తి ఏదైనా నేరం చేస్తే, ఆ నేరానికి తగ్గట్టే శిక్ష కూడా సరిసమానంగా ఉండాలి. యెహోవా న్యాయంలో ఉన్న ఈ కోణం, ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని నియమాల్లో కనిపిస్తుంది. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. దీనిగురించి ఇంకా వివరంగా 14వ అధ్యాయంలో చూస్తాం.—1 తిమోతి 2:5, 6.
12 న్యాయం తారుమారు అవ్వకుండా కూడా ధర్మశాస్త్రం అడ్డుకట్ట వేసింది. ఉదాహరణకు, ఎవరి మీదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, కనీసం ఇద్దరు సాక్షులు ఉంటేనే న్యాయమూర్తులు దాన్ని పరిశీలించి అతనికి శిక్ష వేయవచ్చు. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పిన వ్యక్తికి ఘోరమైన శిక్ష ఉంటుంది. (ద్వితీయోపదేశకాండం 19:15, 18, 19) అంతేకాదు, అవినీతికి పాల్పడవద్దని, లంచం తీసుకోవద్దని ధర్మశాస్త్రం ఖరాఖండిగా చెప్పింది. (నిర్గమకాండం 23:8; ద్వితీయోపదేశకాండం 27:25) ఆఖరికి వ్యాపారంలో కూడా, దేవుని ప్రజలు యెహోవా పెట్టిన ఉన్నతమైన న్యాయ ప్రమాణాల్ని పాటించాలి. (లేవీయకాండం 19:35, 36; ద్వితీయోపదేశకాండం 23:19, 20) మంచిది, న్యాయమైనది అయిన ఇలాంటి ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప వరమే!
కరుణను, సమానత్వాన్ని నొక్కిచెప్పే నియమాలు
13, 14. ధర్మశాస్త్రం ఒక దొంగకు, బాధితునికి ఎలా సమానంగా న్యాయం చేసింది?
13 మోషే ధర్మశాస్త్రం కరుణ లేకుండా కఠినమైన రూల్స్ ఉన్న పుస్తకమా? కానేకాదు! దావీదు రాజు పవిత్రశక్తి ప్రేరణతో ఇలా రాశాడు: “యెహోవా ధర్మశాస్త్రం పరిపూర్ణమైనది.” (కీర్తన 19:7) ఆయన అలా ఎందుకు రాశాడంటే ధర్మశాస్త్రం కరుణ చూపించమని, అందర్నీ సమానంగా చూడమని చెప్పిందని ఆయనకు బాగా తెలుసు. అదెలా?
14 ఇప్పుడు కొన్ని దేశాల్లో చట్టాలు, బాధితుల కన్నా నేరస్తులకే ఎక్కువ అండగా నిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు, దొంగతనం చేసినవాళ్లేమో దర్జాగా జైల్లో ఉంటున్నారు. కానీ బాధితులకు మాత్రం వాళ్లు పోగొట్టుకున్నది దక్కట్లేదు, పైగా ఇలా జైల్లో ఉంటున్నవాళ్ల వసతి కోసం, ఆహారం కోసం పన్నులు కడుతున్నారు. నిజానికి, ప్రాచీన ఇశ్రాయేలులో ఇప్పుడు ఉన్నట్టు జైళ్లు లేవు. అంతేకాదు, శిక్షలు ఎంత కఠినంగా ఉండాలి అనే విషయంలో ఖచ్చితమైన హద్దులు ఉండేవి. (ద్వితీయోపదేశకాండం 25:1-3) దొంగ తను కొట్టేసింది తిరిగివ్వడమే కాకుండా, అదనంగా కొంచెం ఇవ్వాలి. అంటే ఎంత? అది పరిస్థితికి తగ్గట్టు మారేది. తప్పు చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడుతున్నాడా లేదా వంటి విషయాల గురించి ఆలోచించి, న్యాయమూర్తులు అతను ఎంత నష్టపరిహారం చెల్లించాలో నిర్ణయించవచ్చు. అందుకే, లేవీయకాండం 6:1-7 లో చెప్పిన దొంగ, నిర్గమకాండం 22:7 లో చెప్పిన దొంగ కంటే తక్కువ నష్టపరిహారం ఎందుకు చెల్లించాలో అర్థమౌతుంది.
15. అనుకోకుండా హత్య చేసిన వ్యక్తి మీద ధర్మశాస్త్రం అటు కరుణను, ఇటు న్యాయాన్ని ఎలా చూపించింది?
15 అందరూ కావాలనే తప్పులు చేయరు అనే విషయాన్ని ధర్మశాస్త్రం గుర్తించి, యెహోవా కరుణకు అద్దంపట్టింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి అనుకోకుండా ఎవరినైనా చంపితే, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇశ్రాయేలు అంతటా ఉన్న ఆశ్రయపురాల్లో ఒకదానికి పారిపోవాలి. అలా అతను ప్రాణానికి ప్రాణం చెల్లించాల్సిన అవసరం ఉండదు. న్యాయమూర్తులు అతని కేసును పరిశీలించిన తర్వాత, ప్రధానయాజకుడు చనిపోయేంత వరకూ ఆ వ్యక్తి ఆశ్రయపురంలోనే ఉండాలి. ఆ తర్వాత, అతను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఉండవచ్చు. అలా అతను యెహోవా చూపించే కరుణ నుండి ప్రయోజనం పొందేవాడు. అంతేకాదు, ఈ నియమం వల్ల యెహోవాకు ఒక ప్రాణం ఎంత విలువైనదో అర్థమౌతుంది.—సంఖ్యాకాండం 15:30, 31; 35:12-25.
16. ధర్మశాస్త్రం ప్రజల హక్కుల్ని ఎలా కాపాడింది?
16 ధర్మశాస్త్రం ప్రజల హక్కుల్ని కాపాడింది. ఉదాహరణకు, అప్పుపడిన వ్యక్తిని ధర్మశాస్త్రం ఎలా కాపాడిందో గమనించండి. అప్పు ఇచ్చిన వ్యక్తి, తాకట్టు వస్తువును తెచ్చుకోవడానికి అప్పు తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి వెళ్లకూడదని ధర్మశాస్త్రం చెప్పింది. బదులుగా, బయటే ఉండి అతనే స్వయంగా దాన్ని తెచ్చి ఇచ్చే వరకు ఆగాలి. అలా, ఒక వ్యక్తి ఇంట్లోకి ఎవరు పడితే వాళ్లు దౌర్జన్యంగా వెళ్లకుండా అది కాపాడింది. ఒకవేళ అప్పు ఇచ్చిన వ్యక్తి, తాకట్టుగా అతని పైవస్త్రాన్ని తీసుకుంటే, దాన్ని రాత్రికల్లా తిరిగిచ్చేయాలి. ఎందుకంటే, రాత్రికి కప్పుకోవడానికి అతని దగ్గర ఆ వస్త్రం ఒక్కటే ఉండి ఉండవచ్చు.—ద్వితీయోపదేశకాండం 24:10-14.
17, 18. యుద్ధం చేసే విషయంలో ఇశ్రాయేలీయులు వేరే దేశాల వాళ్లకు ఎలా వేరుగా ఉండేవాళ్లు? ఎందుకు?
17 ఆఖరికి, యుద్ధం చేసే విషయంలో కూడా ధర్మశాస్త్రం నియమాలు ఇచ్చింది. దేవుని ప్రజలు అత్యాశతోనో, అధికార దాహంతోనో యుద్ధాలకు వెళ్లకూడదు గానీ, “యెహోవా యుద్ధాలు” చేయడానికి ఆయన ప్రతినిధులుగా వెళ్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. (సంఖ్యాకాండం 21:14) చాలావరకు, ఇశ్రాయేలీయులు అవతలి వాళ్లను లొంగిపొమ్మని ముందుగా రాయబారం పంపాలి. ఒకవేళ ఆ నగరం దానికి ఒప్పుకోకపోతే అప్పుడు ముట్టడించవచ్చు. అదికూడా, దేవుడు ఇచ్చిన నియమాల ప్రకారమే వాళ్లు అలా చేయాలి. ఇశ్రాయేలు సైనికులు ఆడవాళ్లను చెరపడానికి గానీ, ఎవర్ని పడితే వాళ్లను చంపుకుంటూ పోవడానికి గానీ వీల్లేదు. కానీ చరిత్ర అంతటిలో చాలామంది సైనికులు అదే చేశారు. ఇశ్రాయేలు సైనికులు చివరికి ప్రకృతిని కూడా గౌరవిస్తూ, శత్రుదేశంలో ఉన్న పండ్ల చెట్లకు ఎలాంటి హాని చేయకూడదు.d ఇలాంటి నియమాలేవీ వేరే సైనికులకు లేవు.—ద్వితీయోపదేశకాండం 20:10-15, 19, 20; 21:10-13.
18 కొన్ని దేశాల్లో చిన్నచిన్న పిల్లల్ని కూడా సైన్యంలో చేరుస్తున్నారని విన్నప్పుడు మీకు జాలేసిందా? అయితే, ఇశ్రాయేలీయుల్లో 20 ఏళ్లు దాటితే గానీ సైన్యంలో చేర్చుకునేవాళ్లు కాదు. (సంఖ్యాకాండం 1:2, 3) అంతెందుకు, 20 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న ఒక వ్యక్తి భయపడుతుంటే, అతన్ని కూడా ఇంటికి పంపించేసేవాళ్లు. యుద్ధంలోకి వెళ్తే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి, కొత్తగా పెళ్లయిన వ్యక్తి ముందుగా ఒక సంవత్సరమంతా ఇంట్లో ఉండి, తనకు పుట్టే వారసుడిని చూసుకోవచ్చు. ఇలా అతను, ‘ఇంట్లోనే ఉండి తన భార్యను సంతోషపెట్టగలిగేవాడు.’—ద్వితీయోపదేశకాండం 20:5, 6, 8; 24:5.
19. ఆడవాళ్లను, పిల్లల్ని, కుటుంబాల్ని, విధవరాళ్లను, అనాథల్ని కాపాడడానికి ధర్మశాస్త్రం ఏ ఏర్పాట్లు చేసింది?
19 ధర్మశాస్త్రం ఆడవాళ్లను, పిల్లల్ని, కుటుంబాల్ని కాపాడడానికి, వాళ్లను పోషించడానికి ఏర్పాట్లు చేసింది. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, వాళ్లకు యెహోవా గురించి నేర్పించాలని చెప్పింది. (ద్వితీయోపదేశకాండం 6:6, 7) రక్తసంబంధులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని, అలా పెట్టుకుంటే ఇక మరణ శిక్షే అని హెచ్చరించింది. (లేవీయకాండం, 18వ అధ్యాయం) అంతేకాదు, వ్యభిచారం చేయవద్దని కూడా చెప్పింది. ఎందుకంటే దానివల్ల కాపురాలు కూలిపోతాయి, పరువు మర్యాదలు పోతాయి, మానసిక వేదన మిగులుతుంది. ధర్మశాస్త్రం విధవరాళ్లకు అలాగే అనాథలకు కావాల్సినవి ఇవ్వమని, ఎవరైనా వాళ్లను బాధపెడితే దేవుడు కఠినంగా శిక్షిస్తాడని ఖరాఖండిగా చెప్పింది.—నిర్గమకాండం 20:14; 22:22-24.
20, 21. (ఎ) ఒకరికంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని ధర్మశాస్త్రం ఎందుకు ఆపలేదు? (బి) విడాకుల విషయంలో ధర్మశాస్త్రం చెప్పినదానికి, యేసు తన అనుచరులకు చెప్పినదానికి తేడా ఎందుకు ఉంది?
20 మరి ఆడవాళ్లను, పిల్లల్ని, కుటుంబాల్ని అంతగా పట్టించుకునే ధర్మశాస్త్రం ఒకరికంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని ఎందుకు ఆపలేదు? (ద్వితీయోపదేశకాండం 21:15-17) దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ కాలంనాటి సంస్కృతిని మనసులో ఉంచుకోవాలి, లేదంటే మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. (సామెతలు 18:13) యెహోవా ఏదెను తోటలోనే, ఒక భర్తకు ఒకే భార్య ఉండాలని, వాళ్ల బంధం శాశ్వతకాలం ఉండాలని ఒక ప్రమాణం పెట్టాడు. (ఆదికాండం 2:18, 20-24) అయితే యెహోవా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చే సమయానికి, ఒకరికంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం అనేది వందల సంవత్సరాలుగా వాళ్లలో పాతుకుపోయింది. తన “తలబిరుసు ప్రజలు” విగ్రహారాధన చేయొద్దు లాంటి ముఖ్యమైన ఆజ్ఞల్ని పాటించడానికే కిందామీదా పడుతున్నారని యెహోవా గమనించాడు. (నిర్గమకాండం 32:9) అందుకే, తెలివిగా పెళ్లికి సంబంధించిన మార్పులన్నీ అప్పుడే చేయడం మంచిది కాదని యెహోవా అనుకున్నాడు. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకరికంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోమని యెహోవా ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఈ అలవాటు మరీ శృతిమించకుండా, దానివల్ల ఆడవాళ్లకు అన్యాయం జరగకుండా యెహోవా ధర్మశాస్త్రం ద్వారా అడ్డుకట్ట వేశాడు.
21 మోషే ధర్మశాస్త్రం, కొన్ని ముఖ్యమైన కారణాల్ని బట్టి ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చని చెప్పింది. (ద్వితీయోపదేశకాండం 24:1-4) యూదుల “హృదయాలు మొద్దుబారిపోవడం వల్లే” దేవుడు అలా అనుమతించాడని యేసు చెప్పాడు. కానీ కొంతకాలం వరకే అలా అనుమతించాడు. తన అనుచరులు మాత్రం, పెళ్లి విషయంలో యెహోవా మొదట్లో పెట్టిన ప్రమాణానికి లోబడి ఉండాలని యేసు చెప్పాడు.—మత్తయి 19:8.
ధర్మశాస్త్రం ప్రేమను నొక్కిచెప్పింది
22. మోషే ధర్మశాస్త్రం ప్రేమను ఎలా నొక్కిచెప్పింది? ధర్మశాస్త్రం ఎవర్ని ప్రేమించాలని చెప్పింది?
22 ఇప్పుడున్న ఏ దేశ చట్టమైనా ప్రేమను ప్రోత్సహించడం మీరు చూశారా? కానీ, మోషే ధర్మశాస్త్రం వేరే దేనికన్నా ప్రేమనే ఎక్కువ నొక్కిచెప్పింది. అంతెందుకు, ఒక్క ద్వితీయోపదేశకాండం పుస్తకంలోనే “ప్రేమకు” సంబంధించిన పదాలు 20 కంటే ఎక్కువ ఉన్నాయి. మొత్తం ధర్మశాస్త్రంలో రెండో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి.” (లేవీయకాండం 19:18; మత్తయి 22:37-40) దేవుని ప్రజలు వాళ్లలో వాళ్లే కాదు, తమ మధ్యవున్న పరదేశుల మీద కూడా ప్రేమ చూపించాలి. తాము కూడా ఒకప్పుడు పరదేశులే అని ఇశ్రాయేలీయులు గుర్తుంచుకోవాలి. పేదవాళ్ల మీద, దీనుల మీద ప్రేమ చూపిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయాలి గానీ, వాళ్ల పరిస్థితిని అలుసుగా తీసుకోకూడదు. ఆఖరికి, బరువులు మోసే జంతువుల్ని కూడా దయగా, శ్రద్ధగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెప్పింది.—నిర్గమకాండం 23:6; లేవీయకాండం 19:14, 33, 34; ద్వితీయోపదేశకాండం 22:4, 10; 24:17, 18.
23. 119వ కీర్తన రాసిన కీర్తనకర్త ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు? మనం కూడా ఏమని నిర్ణయించుకోవచ్చు?
23 ఇంత అద్భుతమైన ధర్మశాస్త్రం వేరే ఏ దేశానికైనా ఉందా? లేదు. అందుకే కీర్తనకర్త ఇలా అన్నాడు: “నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!” అయితే, ఆయన ప్రేమ మాటల వరకే ఆగిపోలేదు, ఆ ప్రేమను ఆయన చేతల్లో కూడా చూపించాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోబడడానికి, దాని ప్రకారం జీవించడానికి చాలా కృషి చేశాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను.” (కీర్తన 119:11, 97) అవును, ఆయన యెహోవా నియమాల్ని అధ్యయనం చేయడానికి రోజూ సమయం పెట్టాడు. వాటిని ధ్యానిస్తుండగా, వాటిమీద ఆయనకు ప్రేమ ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. అదే సమయంలో, ఆ నియమాలు ఇచ్చిన యెహోవా దేవుని మీద కూడా ఆయనకు ప్రేమ పెరిగి ఉంటుంది. మీరు దేవుని నియమాలు అధ్యయనం చేస్తుండగా గొప్ప శాసనకర్త, న్యాయవంతుడు అయిన యెహోవాకు ఇంకాఇంకా దగ్గరౌతారని ఆశిస్తున్నాం.
a ఉదాహరణకు, మలాన్ని కప్పేయడం, ఒంట్లో బాలేనివాళ్లను మిగతావాళ్లకు దూరంగా ఉంచడం, శవాన్ని ముట్టుకున్న తర్వాత శుభ్రం చేసుకోవడం గురించి వందల సంవత్సరాల క్రితమే ధర్మశాస్త్రం చెప్పింది.—లేవీయకాండం 13:4-8; సంఖ్యాకాండం 19:11-13, 17-19; ద్వితీయోపదేశకాండం 23:13, 14.
b కనానీయుల ఆలయాల్లో, ఆరాధించడానికి వచ్చినవాళ్లు లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని గదులు ఉండేవి. కానీ మోషే ధర్మశాస్త్రమేమో, లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆలయంలో అడుగు కూడా పెట్టకూడదని, ఆ వ్యక్తి కొద్ది రోజుల పాటు అపవిత్రంగా ఉంటాడని చెప్పింది. కాబట్టి, ఈ నియమం వల్ల ప్రజలు యెహోవా ఆరాధనను లైంగిక విషయాలతో కలిపే అవకాశమే లేదు.
c ధర్మశాస్త్రానికి ఉన్న ముఖ్యమైన ఉద్దేశం, బోధించడమే. నిజానికి, ఎన్‌సైక్లోపీడియా జుడైకా ఏం చెప్తుందంటే, “నియమం” అని అనువదించిన తోరా అనే హీబ్రూ పదానికి “ఉపదేశించడం” అని అర్థం.
d ధర్మశాస్త్రం సూటిగా ఇలా అడిగింది: “ఒక మనిషిని ముట్టడి వేసినట్టు పొలంలోని చెట్టును ముట్టడి వేస్తావా?” (ద్వితీయోపదేశకాండం 20:19) మొదటి శతాబ్దం నాటి ఫీలో అనే యూదా పండితుడు, ఈ నియమం గురించి దేవుడు ఎలా ఆలోచిస్తాడో వివరించాడు: “మనుషుల మీద ఉన్న కోపాన్ని, ఏ పాపం తెలియని వస్తువుల మీద చూపించడం అన్యాయం అని దేవునికి అనిపిస్తుంది.”