“దేవపర్వత” దేశంలో ఓ “సాక్షి కుప్ప”
ఆ భూఖండం పటం పైన, పశ్చిమ ఆఫ్రికా సముద్ర తీరం వెంబడి వెళ్ళి, గినియా అఖాతానికి సమాంతరంగా తూర్పు వైపుకు కదిలితే, సముద్ర తీరం దక్షిణం వైపుకు మళ్ళే చోట మీరు కామెరూన్‌ను కనుగొంటారు. సముద్ర తీరం వెంబడి దక్షిణాన దిగువకు కొనసాగితే, మీరు నల్లని ఇసుకరేణువులున్న విస్తారమైన సముద్ర తీరాన్ని కనుగొంటారు. ఆ నల్లని ఇసుక అనేది కామెరూన్ పర్వత ప్రేలుడు ఫలితం.
ఈ శంకువాకారపు 4,070 మీటర్ల పర్వత శిఖరం ఆ ప్రాంతంలో ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది. సూర్యాస్తమయ వెలుతురు కామెరూన్ పర్వత ఏటవాళ్ళపై వ్యాపించినప్పుడు అది ధూమ్ర, నారింజ, స్వర్ణ, ముదురు ఎరుపు రంగులు గల వివిధ వర్ణాల్లో ఆకర్షణీయమైన ప్రదర్శననిస్తుంది. ఆకాశాన్ని భూమిని వేర్వేరుగా గుర్తించడం అసాధ్యం అయ్యేలా సముద్రం, దానికి సమీపాన నీళ్ళు నిలువ ఉన్న ప్రదేశాలు అద్దంలా కొంచెం తేడాలో ఈ ఛాయలన్నింటిని ప్రతిబింబిస్తాయి. సర్వాత్మవాదులైన జాతులు ఈ పర్వతాన్ని మాన్‌గో మా లోబా అని ఎందుకు పిలిచారో అర్థం చేసుకోవడం సులభం. అది “దేవుళ్ళ రథం” అని లేదా సాధారణంగా, “దేవపర్వతం” అని అనువదించబడుతుంది.
సుదూర దక్షిణాన కిలోమీటర్ల దూరం వరకూ కొబ్బరిచెట్లు వరుసగా ఉన్న తెల్లని ఇసుకతో కూడిన తీరాలు ఉన్నాయి. సుందరమైన సముద్ర తీరం తప్ప, దేశంలో అధికభాగం అంటే కాంగో మరియు మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ మరియు ఉత్తరాన నైజీరియా మరియు సబ్-సహారన్ చాద్‌ల సరిహద్దు వరకు భూమధ్యరేఖా ప్రాంతపు దట్టమైన అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆ దేశం యొక్క పశ్చిమ భాగం పర్వతాలతో ఉండి, ప్రయాణికులకు యూరప్ ప్రాంతాలను గుర్తు చేస్తుంది. అయినప్పటికీ వేడి వాతావరణం మీరు భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉన్నారనే విషయాన్ని మరవనీయదు. కామెరూన్ అనేది ఆఫ్రికా యొక్క చిన్న ప్రతిరూపం అని అనేక టూరిస్ట్ గైడ్‌లు చెప్పేందుకు ఆ గ్రామసీమల వైవిధ్యం కారణమవుతుంది. ఈ అనేక తెగల గుంపులు మరియు 220 అంగీకృత భాషల మరియు భాషాప్రభేదాలవారి చేత ఈ అభిప్రాయం మరింత ప్రబలమైంది.
మీరు కామెరూన్ సందర్శించనున్నట్లయితే, డౌలా ఓడరేవులోని లేదా రాజధాని నగరమైన యావుండేలోని ఒక పెద్ద హోటల్‌లో మీరు ఉండవచ్చు. కాని మీరు అక్కడి ప్రజల జీవితాలను గురించి, ముఖ్యంగా “దేవపర్వత” దేశంలో “సాక్షి కుప్ప”ను చేయడంలో నిమగ్నమైవున్న 24,000 కన్నా ఎక్కువ మంది యెహోవాసాక్షుల జీవితాలను గురించి తెలుసుకునే అవకాశాన్ని మీరు జారవిడుచుకోగలరు.a వారిలో కొందరిని కలిసేందుకు ఆ దేశానికి ఎందుకు ప్రయాణం చేయకూడదు? మీ ఈ పశ్చిమ ఆఫ్రికా దేశ అన్వేషణకు తప్పకుండా మంచి ప్రతిఫలం లభిస్తుంది.
తెడ్ల పడవ ద్వారానా, మినివ్యాన్‌ల ద్వారానా లేదా సైకిల్ ద్వారానా?
కామెరూన్‌లోకెల్లా పొడవైన నదియైన సానగ సముద్రాన్ని చేరుకున్నప్పుడు పెద్ద డెల్టా ఏర్పడుతుంది. ఈ పెద్ద భూభాగంలోని ప్రజలనందరినీ కలిసేందుకు యెహోవాసాక్షులు తరచూ తెడ్ల పడవలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఎంబీయాకోలోని చిన్నగుంపులోని తొమ్మిది మంది రాజ్య ప్రచారకులు చేస్తున్నదదే. వారిలో ఇద్దరు 25 కిలోమీటర్ల దూరంలోని యోయో అనే గ్రామంలో నివసిస్తున్నారు. వారు ఎంబీయాకో చేరుకునేందుకు తమ శక్తినంతా ఉపయోగించి పడవ నడపవలసి ఉంటుంది, అయినప్పటికీ వారు ఎల్లప్పుడూ క్రైస్తవ కూటాలకు హాజరౌతారు. ఈ గుంపును సందర్శించేటప్పుడు ఒక ప్రయాణ కాపరి యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకవున్న సంస్థ అనే వీడియోను చూపాలని సూచించారు. కాని చెప్పేంత సులభం కాదు చేయడం. అలాంటి మారుమూల గ్రామంలో, వీడియో క్యాసెట్ రికార్డర్‌ను, టెలివిజన్ సెట్టును, వీడియో చూపేందుకు విద్యుచ్ఛక్తిని ఆయన ఎక్కడ కనుగొనగలడు?
ఆ సందర్శన వారంలో కొందరు ప్రచారకులు స్థానిక చర్చి పాస్టర్‌ను సందర్శించారు. వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆ పాస్టర్ వారిని ఆప్యాయంగా ఆహ్వానించగా, వారు ఆయనతో ఉత్సాహభరితమైన బైబిలు చర్చను సాగించారు. పాస్టర్‌కు విసిఆర్ మాత్రమే కాక, ఎలక్ట్రిక్ జెనరేటర్ కూడా ఉందని గమనించిన సహోదరులు, తాము ఆయన పరికరాన్ని ఎరువు తీసుకోవచ్చా అని అడిగేందుకు వారు ధైర్యం చేసుకున్నారు. ముందు వారి బైబిలు చర్చను ఆస్వాదించిన పాస్టర్ వారికి సహాయం చేసేందుకు ఒప్పుకున్నాడు. శనివారం సాయంకాలం ఆ కార్యక్రమాన్ని చూసేందుకు పాస్టర్ మరియు ఆయన చర్చిలోని చాలా మంది సభ్యులతో సహా 102 మంది వ్యక్తులు వచ్చారు. యోయోలోని ఇద్దరు సాక్షులు రెండు పడవల్లో చాలా మంది ఆసక్తిగలవారిని తీసుకుని వచ్చారు. ఉప్పెనగా లేస్తున్న తరంగ ప్రవాహానికి ఎదురుగా తెడ్డువేయడం అంత కష్టమైనదిగా వాళ్ళు భావించలేదు. వీడియోను చూసిన తర్వాత, వాళ్ళు ఎంతో కదిలించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, తాము యెహోవాను మహిమపరచడమే లక్ష్యంగాగల సంస్థకు చెందినవారైనందుకు వాళ్ళు ఎంతో గర్వంగా భావించారు.
తెడ్ల పడవ వెళ్ళలేని చోటికి ఒకరు మినివ్యాన్ మీద వెళ్ళవచ్చు. యాత్రికుల కొరకు ఈ వ్యాన్‌లు నిలబడే స్థలాలు ఎల్లప్పుడు సందడిగా ఉంటాయి. చల్లని నీటిని అమ్మేవారు, అరటి పండ్లను అమ్మేవారు మరియు బరువులు మోసే కూలీలతో పూర్తిగా తికమక అవ్వడం సులభమే. తమ తమ సమయ పట్టిక ప్రకారం “వెళ్ళడానికి సిద్ధమై” వేచివున్న మినివ్యాన్‌లలోకి యాత్రికులను ఎక్కించడమే కూలీల పని. అయినప్పటికీ, “సిద్ధం” అనే పదాన్ని మరీ అంత కచ్చితంగా అర్థం చేసుకోకూడదు. యాత్రికులు గంటల కొలది, కొన్నిసార్లు రోజుల కొద్ది వేచి ఉండవలసి ఉంటుంది. ఒకసారి యాత్రికులందరూ లోపలికి చొరబడ్డాక, పైన సామానులను ఉంచేందుకు పెట్టిన స్టాండుపైకి సామానులను, ధాన్యపు సంచులను, కొన్నిసార్లు బ్రతికివున్న కోళ్ళను, మేకలను డ్రైవర్ ఎక్కించిన తర్వాత ఆ వ్యాన్ గతుకులు గల, దుమ్ము రోడ్డు మీదికి కదులుతుంది.
ఒక ప్రయాణ పరిచారకుడు ఈ విధమైన రవాణాతో విసుగుచెంది స్వేచ్ఛను ఎంచుకున్నాడు. ఆయన ఇప్పుడు అన్నిచోట్లకు సైకిలు మీదే ప్రయాణం చేస్తాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను ఒక సంఘం నుండి మరో సంఘానికి ప్రయాణం చేసేందుకు సైకిలును ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నప్పటి నుండి నేనెల్లప్పుడూ సందర్శనానికి సరైన సమయానికి చేరుకుంటున్నాను. నిజమే, ఆ ప్రయాణానికి అనేక గంటలు పడుతుంది, కాని ఏ కారణాన కూడా మినివ్యాన్‌ల కొరకు నేను ఒకటి రెండు రోజుల వరకు వేచి ఉండనవసరం లేదు. వర్షాకాలంలో, వరద వలన కొన్ని రోడ్లు దాదాపు పూర్తిగా అదృశ్యమౌతాయి. ఇంత లోతున ఉన్న బురద నీళ్ళను దాటేందుకు మీరు మీ బూట్లను విప్పవలసి ఉంటుంది. ఒక రోజు నా బూటొకటి నీటి ప్రవాహంలో పడిపోయింది, అనేక వారాల తర్వాత అది ఒక యెహోవాసాక్షి కూతురు చేపలు పడుతుండగా అకస్మాత్తుగా కనిపించేంత వరకూ నేను దానిని తిరిగి పొందలేకపోయాను మరి! ఒక బూటు కొంతకాలం నీటిలో ఉండిపోయాక, నేను ఈ బూట్ల జతను మళ్ళీ వేసుకోగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. యెహోవాసాక్షులు క్రితమెన్నడూ ప్రకటించని ప్రదేశాల గుండా కూడా కొన్నిసార్లు వెళ్తాను. నువ్వు ఏమి తీసుకు వచ్చావు అని గ్రామస్థులు నన్నెప్పుడూ అడుగుతారు. కనుక నేను పత్రికలను బ్రోషూరులను ఎల్లప్పుడూ తీసుకువెళ్తాను. నేను ఆగిన ప్రతిసారి, ఈ బైబిలాధారిత ప్రచురణలను ప్రతిపాదించి, క్లుప్తంగా సాక్ష్యమిస్తాను. యెహోవా ఈ సత్యపు విత్తనాలు మొలకెత్తి పెరిగేలా చేస్తాడని నేను నమ్ముతున్నాను.”
అంతర్భాగంలో
కామెరూన్ హృదయ అంతర్భాగంలోను, వనాంతరాల్లో దాగివున్న గ్రామాల్లోను ఇతరులతో రాజ్య సువార్తను పంచుకోవడానికి యెహోవాసాక్షులు కృషి చేస్తున్నారు. దీనికి ఎంతో గొప్ప ప్రయత్నం అవసరం, కాని ఫలితాలు హృదయానందకరమైనవి.
చిన్న అమ్మాయియైన ఆర్లెట్‌తో పూర్తికాల సేవకురాలైన మారీ బైబిలు పఠనాన్ని ఆరంభించింది. మొదటి పఠనానంతరం ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలో అలవాటు ప్రకారం తనతో పాటు ఇంటి ద్వారం వరకు వస్తుందేమోనని ఆర్లెట్‌ను మారీ అడిగింది. అయితే, తన పాదం నొప్పిగా ఉన్నందువల్ల తను నడవలేనని ఆ అమ్మాయి వివరించింది. మాంసంలో రంధ్రాలు చేసే జాతి ఆడ మిన్నల్లి ఆర్లెట్ పాదాలను బాధించింది, దాని వల్ల చీము పట్టి ఉంది. మారీ ధైర్యంగా ఆ మిన్నల్లులను ఒకదాని తరువాత ఒకటి తీసివేసింది. తరువాత, ఈ చిన్న అమ్మాయిని రాత్రి సమయంలో దయ్యాలు పీడిస్తున్నాయని కూడా ఆమె తెలుసుకుంది. ఒకరు యెహోవాయందు తమ నమ్మకాన్ని ఎలా ఉంచుకోవాలి అనే దానిని గురించి, ముఖ్యంగా ప్రార్థనలో ఆయన పేరును గట్టిగా పిలవడం ద్వారా ఎలా నమ్మకముంచవచ్చో మారీ ఓపికగా ఆమెకు వివరించింది.—సామెతలు 18:10.
ఆర్లెట్ సత్వర అభివృద్ధిని సాధించింది. ఆమె శారీరకంగాను బుద్ధి విషయంలోను చెప్పుకోదగినంత అభివృద్ధిని సాధిస్తుంది కనుక మొదట్లో ఆమె కుటుంబం ఆమె పఠించడంలో తప్పేమీ లేదని కనుగొనింది. కాని ఆమె యెహోవాసాక్షి అవ్వాలని కోరుకుంటుందని గ్రహించినప్పుడు వారు ఆమె పఠనం కొనసాగించడాన్ని నిషేధించారు. మూడు వారాల తరువాత, ఆర్లెట్ తల్లి తన కూతురు ఎంత నిరాశ చెందిందో గ్రహించి, మారీతో మాట్లాడి, పఠనాన్ని పునరారంభించమని కోరింది.
ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యే సమయం వచ్చేసరికి, ఆర్లెట్‌ను సమావేశానికి రెండురోజులూ తీసుకువెళ్ళేందుకు మారీ ఒక టాక్సీని తీసుకుంది. అయినప్పటికీ, ఆ డ్రైవర్ ఆర్లెట్ ఇంటి నుండి రోడ్డు వరకు ఉన్న దారిలో ప్రయాణం చేయలేమని నిర్ణయించుకుని ఆమె ఇంటికి వెళ్ళడానికి నిరాకరించాడు. కనుక మారీయే ఆ అమ్మాయిని ఎలాగోలా రోడ్డు వరకు తీసుకు వచ్చింది. యెహోవా తప్పకుండా ఆ ప్రయత్నాలను ఆశీర్వదించాడు. నేడు ఆర్లెట్ సంఘ కూటాలన్నింటికి హాజరౌతుంది. ఇలా చేయడానికి ఆమెకు సహాయపడేందుకు మారీ అలుపెరుగక ఆమెను తీసుకు వెళ్ళేందుకు వచ్చేది. వాళ్ళు ప్రతిసారి వెళ్ళడానికి 75 నిమిషాలు, తిరిగి రావడానికి 75 నిమిషాలు నడుస్తారు. ఆదివారం కూటం ఉదయం 8:30కి ఆరంభమౌతుంది కనుక, మారీ 6:30కి ఇంటి దగ్గర నుండి బయలుదేరవలసి ఉంటుంది; అయినప్పటికీ వారు సమయానికి రాగలుగుతున్నారు. త్వరలోనే నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను తెలియజేయాలని ఆర్లెట్ ఆశిస్తుంది. “ఆమె పఠనాన్ని ఆరంభించినప్పుడు ఆమెను చూడని వారెవరూ ఆమె ఎంత మారిందో ఊహించలేరు. యెహోవా ఆమెను ఆశీర్వదించిన విధానాన్నిబట్టి నేను ఆయనకు ఎంతో కృతజ్ఞతలు చెబుతున్నాను” అని మారీ అంటోంది. మారీ నిశ్చయంగా స్వయం త్యాగ పూరిత ప్రేమకు చక్కని మాదిరియై ఉంది.
సుదూర ఉత్తరానికి
ఉత్తర కామెరూన్ అంతా వైవిధ్యమైన ఆశ్చర్యకరమైన విషయాలే. వర్షాకాలంలో అది పెద్ద, సారవంతమైన తోటగా మారుతుంది. కమిలేటట్లు చేసే ఎండ వచ్చినప్పుడు గడ్డి వాడిపోతుంది. మధ్యాహ్నం, సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉన్నప్పుడు నీడ కనిపించడం చాలా అరుదు, గొర్రెలు ఎర్ర మట్టి గోడలను ఆనుకుని నిలబడి నీడ కొరకు ప్రయత్నిస్తాయి. ఈ ప్రాంతంలో ఇసుక, ఎండి గడ్డి మాత్రమే ఉండగా, మిగిలివున్న కాస్త పచ్చదనం అనేది ఆఫ్రికా మొదలు చెట్ల కొన్ని ఆకులు మాత్రమే. అవి వాటి జాతిలోని మిగిలిన చెట్లంత పెద్దవి కాకపోయినప్పటికీ అవి కూడా బలమైనవే. కఠినమైన వాతావరణాన్ని తాళుకునే వాటి సామర్థ్యం సత్యపు వెలుతురును ప్రకాశింపజేసేందుకు ఈ ప్రాంతంలో నివసించడానికి వెళ్ళిన కొందరు సాక్షుల ఆసక్తిని ధైర్యాన్ని చిత్రీకరిస్తుంది.
ఈ ప్రాంతంలోని కొన్ని సంఘాలు 500 నుండి 800 కిలోమీటర్ల దూరాల్లో ఉన్నాయి, ఒంటరితనమనే భావన చాలా నిజం. కాని చాలా ఆసక్తి ఉంది. సహాయం చేసేందుకు ఇతర ప్రాంతాల్లోని సాక్షులు ఇక్కడికి వస్తారు. పరిచర్యలో ఫలవంతులుగా ఉండేందుకు, వారు స్థానిక భాషాప్రభేదమైన ఫూఫూల్‌డే నేర్చుకోవలసి ఉంది.
గరూవాలోని ఒక సాక్షి దాదాపు 160 కిలోమీటర్ల దూరాన ఉన్న, తాను జన్మించిన గ్రామంలో ప్రకటించేందుకు కొన్ని రోజులు అక్కడ ఉండాలని తీర్మానించుకున్నాడు. అక్కడ ఆయన కొంత ఆసక్తిని కనుగొన్నాడు. కాని హెచ్చైన ప్రయాణ ఖర్చు క్రమంగా తిరిగి వెళ్ళకుండా ఆయనను ఆటంకపర్చింది. కొన్ని వారాల తరువాత, తిరిగి వచ్చి తమను దర్శించమని అభ్యర్థిస్తూ ఆసక్తిగల ఒక వ్యక్తి వ్రాసిన ఒక ఉత్తరం ఆ సాక్షికి లభించింది. అయినప్పటికీ, ప్రయాణానికి డబ్బు లేనందువల్ల ఆయన వెళ్ళలేకపోయాడు. గ్రామంలోని పది మంది ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేందుకు గరూవాలోని తన ఇంటికి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ సాక్షికి ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుందో ఊహించుకోండి!
చాద్ సరిహద్దులకు సమీపాన, మరొక గ్రామంలో ఆసక్తిగల 50 మంది వ్యక్తుల ఒక గుంపు స్వంతంగా బైబిలు పఠనాన్ని సంస్థీకరించుకుంది. వారిలోని ముగ్గురు చాద్‌కు అతి సమీపంగా ఉన్న సంఘంలో కూటాలకు హాజరయ్యే ఏర్పాటు చేశారు. వారు తిరిగి వచ్చి, గుంపంతటితో బైబిలు పఠనాన్ని నిర్వహిస్తారు. నిజంగా, “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని” యేసు చెప్పిన మాటలు ఇక్కడ బాగా అన్వయించబడతాయి.—మత్తయి 9:37, 38.
నగరాల్లో సాక్ష్యమివ్వడం
అనేక సంవత్సరాల సాహిత్య కొరత తర్వాత, కామెరూన్‌లో కావలికోట, తేజరిల్లు! పత్రికలు యథేచ్ఛగా లభ్యమౌతున్నాయి. చాలా మంది ప్రజలు మొదటిసారిగా ఈ పత్రికలను చదువుతుండగా మరింత ఉత్సాహం, ఆసక్తి కనబరచబడింది. ఒక యౌవన ప్రత్యేక పయినీరు దంపతులు ఒక నగరానికి నియమించబడినప్పుడు, వారు తమ క్రొత్త ప్రదేశంలో మొదటి రోజు ఉదయాన ప్రకటన పనిలో 86 పత్రికలను అందించారు. కొందరు ప్రచారకులు ఒక్క నెలలోనే 250 పత్రికలను అందిస్తారు! వారి సఫలతకు గల రహస్యమేమిటి? ప్రతి ఒక్కరికి పత్రికలను ప్రతిపాదించడమే.
ఆఫీసులో పనిచేసే ఒక సాక్షి అందరికీ కనిపించేలా పత్రికలను ఎల్లప్పుడు బయట ఉంచుతాడు. ఒక స్త్రీ పత్రికలను చూసింది కాని, వేటినీ తీసుకోలేదు. సాక్షి ఆమె ఆసక్తిని గ్రహించి, ఆమెకు ఒక ప్రతిని ప్రతిపాదించగా, ఆమె దానిని స్వీకరించింది. మరుసటి రోజు ఆమె తిరిగి రావడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె తీసుకున్న పత్రికకు చందా ఇవ్వడమే కాక, మరిన్ని కావాలని కూడా కోరింది. ఎందుకని? తాను అత్యాచారానికి గురైన వ్యక్తి కనుక, ఆమె ఆ అంశంపైని పత్రికను ఎంచుకుంది. ఆమె రాత్రంతా ఇవ్వబడిన సలహాను చదివింది, మళ్ళీ మళ్ళీ చదివింది. మరింత ఊరట పొందినట్లు భావించిన ఆమె యెహోవాసాక్షులను గూర్చి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంది.
చిన్న పిల్లలు కూడా బైబిలు నిరీక్షణా వర్తమానాన్ని వ్యాపింపజేయడంలో పాల్గొనగలరు. ఆరేండ్ల సాక్షి పాపను కాథోలిక్ కీర్తన పాడమని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు, తాను ఒక యెహోవాసాక్షినని చెబుతూ నిరాకరించింది. అయితే తన స్వంత మత సంబంధమైన పాటలను పాడమని అలా దానిమీద తనకు గ్రేడిస్తానని ఆయన ఆమెతో చెప్పాడు. ఆమె “దేవుని పరదైసు వాగ్దానం” అనే శీర్షికగల పాటను ఎంచుకుని తనకు జ్ఞాపకమున్నంత వరకు పాడింది. “నీ పాటలో పరదైసును గూర్చి పేర్కొన్నావు. ఈ పరదైసు ఎక్కడ?” అని ఉపాధ్యాయుడు అడిగాడు. అతి త్వరలోనే పరదైసును స్థాపించాలన్న దేవుని సంకల్పాన్ని గూర్చి ఆ పాప వివరించింది. ఆ పాప జవాబుకు ఆశ్చర్యపడిన ఆయన ఆ పాప పఠిస్తున్న పుస్తకం కావాలని పాప తలిదండ్రులను అడిగాడు. మతాన్ని గూర్చిన పాఠాల్లో ఆమెకు నేర్పబడిన దాని ఆధారంగా కాక, ఆమె చదువుతున్న పుస్తకం ఆధారంగా ఆమెకు గ్రేడ్ ఇచ్చేందుకు ఆయన సిద్ధపడ్డాడు. ఆమెకు సరైనవిధంగా గ్రేడ్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నట్లయితే, ఆయన మొదట పఠించవలసి ఉందని ఆమె తలిదండ్రులు ఉపాధ్యాయునికి సూచించారు. ఆయనతో బైబిలు పఠనం ఆరంభించబడింది.
ఒక సందర్శనకు ప్రణాళీకరించడమా?
నేడు ప్రపంచంలోని అనేక భూభాగాల్లో ప్రజలు రాజ్యసువార్త ఎడల ఉదాసీనంగా ఉన్నారు. దేవుడన్నా బైబిలన్నా వారికి ఆసక్తి లేదు. భయం ఇతరులను నిస్త్రాణులుగా చేస్తుంది, అలా తలుపు దగ్గర కనిపించే ఏ అపరిచితులకైనా ప్రతిస్పందించేందుకు వారు నిరాకరిస్తారు. ఇవన్నీ కూడా పరిచర్యలో యెహోవాసాక్షులకు నిజమైన సవాళ్ళే. కాని కామెరూన్‌లో ఎంత వ్యత్యాసమో!
ఇంటింటా ప్రకటించడం ఇక్కడ చాలా సంతోషకరమైన విషయం. తలుపు తట్టే బదులు, “కాంగ్, కాంగ్, కాంగ్” అని పిలవడం ఇక్కడ అలవాటు. అప్పుడు లోపల నుండి, “ఎవరది?” అని ఒక గొంతు బదులిస్తుంది, దాని తర్వాత యెహోవాసాక్షులం అని మమ్మల్ని మేం పరిచయం చేసుకుంటాం. వెళ్ళి బెంచీలను తీసుకువచ్చి, చెట్టు నీడలో బహుశ మామిడి చెట్టు నీడలో వేయమని సాధారణంగా తలిదండ్రులు పిల్లలకు చెబుతారు. అప్పుడు, దేవుని రాజ్యం అంటే ఏమిటో మానవజాతిని విషాదకర పరిస్థితి నుండి విడుదల చేసేందుకు అది ఏమి చేస్తుందో వివరిస్తూ సమయాన్ని వెచ్చించడం ఆహ్లాదకరమైన అనుభవం.
అలాంటి చర్చ తర్వాత, ఒక మహిళ తన మనస్సు విప్పి మాట్లాడుతూ, “నేను వెదుకుతున్న సత్యం నేను పుట్టి పెరిగిన మతంలో కనబడడం లేదని గ్రహించి నేను కృంగిపోయాను. నాకు సత్యాన్ని చూపించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను మా చర్చిలో డీకన్‌ను. ప్రతి డీకన్ కన్య మరియకు తన అభ్యర్థనలను తెలుపగలిగేలా ప్రతి ఒక్కరి ఇంట్లో కన్య మరియ ప్రతిమ ఒక వారం ఉంచబడుతుంది. నావరకైతే, సత్యాన్ని తెలుసుకునేందుకు నాకు సహాయం చేయమని నేను ఎల్లప్పుడు మరియను అడిగేదాన్ని. సత్యం ఆమె దగ్గర లేదని దేవుడు నాకిప్పుడు చూపించాడు. నేను యెహోవాకు కృతజ్ఞతలు చెబుతున్నాను” అని అంటోంది.
కనుక, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో లభించగల అత్యంత ఆనందాన్ని అనుభవించవలసిన అవసరముందని ఏనాడైనా మీరు భావిస్తే, పశ్చిమ ఆఫ్రికాలోని ఈ ప్రాంతాన్ని మీరెందుకు సందర్శించకూడదు? తెడ్ల పడవల ద్వారా, మినివ్యాన్‌ల ద్వారా లేదా సైకిలు ద్వారా “ఆఫ్రికా యొక్క చిన్న ప్రతిరూపాన్ని” కనుగొనడమే కాక, “దేవపర్వత” దేశంలో నిర్మించబడుతున్న “సాక్షి కుప్ప”కు కూడా మీరు తోడ్పడగలరు.
[అధస్సూచీలు]
a “సాక్షి కుప్ప” అనేది “గిలియడ్” అని అనువదించబడిన హెబ్రీ పదం అర్థం అయ్యుండవచ్చు. కామెరూన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పనిని అంతటా విస్తరింపజేసేందుకు 1943 నుండి వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ మిషనరీలను పంపిస్తుంది.
[22వ పేజీలోని చిత్రసౌజన్యం]
Map: Mountain High Maps® Copyright © 1995 Digital Wisdom, Inc.