రాజ్య ప్రచారకుల నివేదిక
క్యూబాలో ‘కార్యకలాపానికి నడిపిస్తున్న పెద్ద ద్వారము తెరువబడింది’
దేవుని రాజ్య సువార్తను ప్రకటించే వారిలో అపొస్తలుడైన పౌలు ఉత్కృష్టమైన వాడు. విధేయత చూపే మానవజాతి కోసం నిత్యజీవం కొరకైన సృష్టికర్త వాగ్దానాలను పంచుకోవడానికి ఆయన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రాచీన ఎఫెసును సందర్శిస్తుండగా, పౌలు ఇంకా ఎక్కువమంది ప్రజలకు సహాయం చేయడానికి ఆయనను అనుమతించే క్రొత్త పరిస్థితులను గుర్తించాడు. “నేను . . . ఎఫెసులోనే ఉండిపోతున్నాను; ఎందుకంటే కార్యకలాపానికి నడిపించే పెద్ద ద్వారము నాకోసం తెరువబడింది” అని ఆయన అన్నాడు.—1 కొరింథీయులు 16:9, NW.
క్యూబాలోని యెహోవాసాక్షులు కూడా తమను తాము క్రొత్త పరిస్థితులలో కనుగొంటున్నారు. అధికారికంగా ఇంకా రిజిస్టరు చేయబడకపోయినప్పటికీ, సాక్షులు ఇప్పుడు తోటి దేశస్థులతో వారి బైబిలు నిరీక్షణను బాహాటంగా పంచుకోగలుగుతున్నారు. ఇటీవల క్యూబా ప్రభుత్వం వివిధ మత గుంపులు స్వేచ్ఛగా పని చేసేందుకు అనుమతించడం విషయమై అత్యంతాసక్తిని వ్యక్తం చేసింది. దేశాధ్యక్షుడు కాస్ట్రో, క్యూబా ప్రభుత్వంతో ఇప్పుడొక మెరుగైన సంబంధాన్ని అనుభవిస్తున్న ఒక మత గుంపుగా యెహోవాసాక్షులను బహిరంగంగా పేర్కొన్నాడు.
ఈ క్రొత్త పరిస్థితి యెహోవాసాక్షుల కొరకు “కార్యకలాపానికి నడిపించే పెద్ద ద్వారము”ను తెరిచింది. ఉదాహరణకు, యెహోవాసాక్షులు ఇటీవల క్యూబాలో ఒక కార్యాలయాన్ని తెరిచారు. ఆ దేశంలో వారి ప్రకటనా పనిని సమన్వయం చేయడానికి అది సహాయం చేస్తుంది. 65,000 కంటే ఎక్కువమంది సాక్షులు బైబిలును పఠించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయం చేస్తున్నారు. వారు కావలికోట, తేజరిల్లు! పత్రికల వంటి బైబిలు సాహిత్యాన్ని ఉపయోగిస్తున్నారు. యథార్థమైన మనస్సుగల అనేకమంది క్యూబా దేశస్థులు యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం నుండి ప్రయోజనం పొందుతున్నారు.
సాక్షులు ద్వీపమంతటా చిన్న చిన్న గుంపుల్లో క్రమంగా కూటాలను కూడా జరుపుతున్నారు. వారు కొన్నిసార్లు దాదాపు 150 మందితో కూడిన గుంపుల్లో మరింత పెద్ద సమావేశాలు జరిపే ఆధిక్యతలను కూడా అనుభవిస్తున్నారు. క్యూబా అధికారుల నుండి వారు పొందిన అనుమతి కొరకు వారు నిజంగా మెప్పుదలను కనపరుస్తున్నారు. ఆత్మీయ సహోదర సహోదరీలతో కలిసి కూడుకునేందుకు, దేవునికి స్తుతిగానాలు పాడుకునేందుకు, కలిసి ప్రార్థించుకునేందుకు అది వారికి అవకాశాన్ని ఇస్తుంది.
ఇటీవల “దైవ భయము” జిల్లా సమావేశము కేవలం మూడు వారాంతాల సమయంలోనే 1,000 సార్ల కంటే ఎక్కువగా జరుపబడింది. “క్రమము, క్రమశిక్షణ, శాంతి” ప్రతి సమావేశంలో స్పష్టంగా కనిపించాయని ఒక నివేదిక తెలుపుతుంది. ఈ విషయంపై అధికారులు సాక్షులకు అభినందనలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా, యథార్థ క్రైస్తవులు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలనే దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి కృషిచేస్తారు. అదే సమయంలో, వారు ప్రభుత్వ అధికారులతో శాంతియుత సంబంధాన్ని కొనసాగించడానికి కృషి చేస్తారు. (తీతు 3:1) యెహోవాసాక్షులు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహాను అనుసరిస్తారు. ఆయనిలా అన్నాడు: “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.”—1 తిమోతి 2:1, 2.