‘నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి’
“మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.”—లేవీయకాండము 19:2.
1. పరిశుద్ధమైనవారిగా లోకం పరిగణిస్తున్న కొంతమంది వ్యక్తులు ఎవరు?
లోకంలోని అనేక ప్రముఖ మతాల్లో, పరిశుద్ధులుగా పరిగణింపబడే వారున్నారు. భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన మదర్ థెరిస్సా పేదలకు చేసిన సేవనుబట్టి తరచూ ఆమె పరిశుద్ధురాలిగా దృష్టించబడుతోంది. పోపు “పరిశుద్ధ తండ్రి” అని పిలువబడుతున్నాడు. ఓపుస్ డేయీ అనే ఆధునిక కాథోలిక్ ఉద్యమాన్ని ఆరంభించిన హోసే మారీయా ఎస్క్రీబాను కొంతమంది కాథోలిక్‌లు “పరిశుద్ధతకు మాదిరి” అన్నట్లు దృష్టిస్తారు. హిందూ మతంలో స్వాములు, లేక పుణ్య పురుషులు ఉన్నారు. గాంధీ పవిత్రునిగా గౌరవింపబడ్డాడు. బౌద్ధ మతంలో పరిశుద్ధ సన్యాసులు, ఇస్లామ్ మతంలో పరిశుద్ధ ప్రవక్తలు ఉన్నారు. అయితే, పరిశుద్ధంగా ఉండడమంటే కచ్చితంగా ఏమిటి?
2, 3. (ఎ) “పరిశుద్ధం” మరియు “పరిశుద్ధత” అనే పదాల భావమేమిటి? (బి) సమాధానం అవసరమైన కొన్ని ప్రశ్నలు ఏవి?
2 “పరిశుద్ధం” అనే పదం ఇలా నిర్వచించబడింది, “1. . . . దైవిక శక్తికి సంబంధించినది; పవిత్రమైనది. 2. ఆరాధించదగినదిగా లేక పూజింపదగినదిగా పరిగణింపబడేది . . . 3. కచ్చితమైన లేక ఉన్నతమైన నైతిక, మతసంబంధ, లేక ఆత్మీయ విధానానికి అనుగుణంగా జీవించడం . . . 4. మతసంబంధమైన సంకల్పం కొరకు ప్రత్యేకింపబడినది లేక ప్రక్కన ఉంచబడినది.” బైబిలు సంబంధ సందర్భంలో, పరిశుద్ధత అంటే “మతపరమైన పరిశుభ్రత లేక స్వచ్ఛత; పవిత్రత.” బైబిలు సంప్రదింపు గ్రంథమైన లేఖనములపై అంతర్దృష్టి ప్రకారం “కోʹదేష్ అనే మూల హెబ్రీ [పదం] ప్రత్యేకంగా ఉండడం, విశిష్టత, లేక దేవుని కొరకు పరిశుద్ధపరచబడడం, . . . దేవుని సేవ కొరకు ప్రత్యేకింపబడిన స్థితి అనే తలంపును అందజేస్తుంది.”a
3 ఇశ్రాయేలు జనాంగానికి పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపించబడింది. దేవుని ధర్మశాస్త్రం ఇలా చెబుతుంది: “నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను.” పరిశుద్ధతకు మూలం ఎవరు? అపరిపూర్ణులైన ఇశ్రాయేలీయులు ఎలా పరిశుద్ధులు కాగలరు? పరిశుద్ధంగా ఉండమని యెహోవా ఇస్తున్న పిలుపు నుండి నేడు మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?—లేవీయకాండము 11:44.
పరిశుద్ధత యొక్క మూలంతో ఇశ్రాయేలీయులు సంబంధం కలిగివున్న విధం
4. ఇశ్రాయేలులో యెహోవా పరిశుద్ధత ఎలా ఉదాహరించబడింది?
4 ఇశ్రాయేలీయులు యెహోవా దేవున్ని ఆరాధించడంతో సంబంధం కలిగివున్న ప్రతిదీ పరిశుద్ధమైనదిగా పరిగణింపబడాలి, దానితో అలాగే వ్యవహరించాలి. ఎందుకలా? ఎందుకంటే యెహోవాయే పరిశుద్ధతకు మూలము, మూలాధారము. పరిశుద్ధ గుడారాన్ని, దుస్తులను, అలంకరణలను సిద్ధం చేయడాన్ని గూర్చిన మోషే వృత్తాంతం ఈ మాటలతో ముగుస్తుంది: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధకిరీట భూషణము చేసి చెక్కిన ముద్రవలె దానిమీద—యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి.” మేలిమి బంగారంతో చేయబడిన ఈ పరిశుద్ధకిరీట భూషణము ప్రధానయాజకుని పాగాపై ఉంచబడేది, ఆయన ప్రత్యేక పరిశుద్ధ సేవ కొరకు ప్రత్యేకింపబడ్డాడని అది సూచించేది. ఈ చెక్కబడిన ముద్ర సూర్యకాంతికి ప్రకాశించడాన్ని ఇశ్రాయేలీయులు చూసినప్పుడు, వారికి యెహోవా పరిశుద్ధత క్రమంగా గుర్తుచేయబడేది.—నిర్గమకాండము 28:36; 29:6; 39:30.
5. అపరిపూర్ణ ఇశ్రాయేలీయులు పరిశుద్ధమైనవారిగా ఎలా పరిగణింపబడగలరు?
5 కాని ఇశ్రాయేలీయులు ఎలా పరిశుద్ధులు కాగలరు? యెహోవాతో వారు కలిగివుండే సన్నిహిత సంబంధం ద్వారా, ఆయనకు వారు చేసే స్వచ్ఛమైన ఆరాధన ద్వారా మాత్రమే వారలా కాగలిగేవారు. “పరిశుద్ధ దేవుని” పరిశుద్ధతతోను, శారీరక మరియు ఆత్మీయ పరిశుభ్రతతోను ఆరాధించేందుకు వారికి ఆయనను గూర్చిన కచ్చితమైన జ్ఞానం అవసరమయ్యింది. (సామెతలు 2:1-6; 9:10) కాబట్టి ఇశ్రాయేలీయులు దేవున్ని స్వచ్ఛమైన దృక్పథంతోను, శుద్ధమైన హృదయంతోను ఆరాధించవలసి ఉండిరి. వేషధారణతో కూడిన ఏ విధమైన ఆరాధనైనా యెహోవాకు అసహ్యమైనది.—సామెతలు 21:27.
యెహోవా ఇశ్రాయేలీయులను నిందించడానికిగల కారణం
6. మలాకీ కాలం నాటి యూదులు యెహోవా భోజనపుబల్లతో ఎలా వ్యవహరించారు?
6 ఇశ్రాయేలీయులు అర్థహృదయంతో అల్పమైన, లోపంగల బలులను దేవాలయానికి తెస్తున్నప్పుడు ఇది స్పష్టంగా తెలియజేయబడింది. తన ప్రవక్తయైన మలాకీ ద్వారా యెహోవా వారి అల్పమైన అర్పణలను ఇలా నిందించాడు: “మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. . . . యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, యెంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడినదానిని కుంటిదానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు; మీచేత నేనిట్టిదానిని అంగీకరింతునా? అని యెహోవా అడుగుచున్నాడు.”—మలాకీ 1:10, 12, 13.
7. సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో యూదులు ఏ అపరిశుద్ధ చర్యలు గైకొన్నారు?
7 బహుశా సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో, యూదుల తప్పుడు ఆచారాలను నిందించడానికి దేవుడు మలాకీని ఉపయోగించుకున్నాడు. యాజకులు మంచి మాదిరినుంచలేదు, వారి ప్రవర్తన ఎంతమాత్రం పరిశుద్ధమైనదిగా లేకుండెను. ఆ నాయకత్వం క్రింద ప్రజలు సూత్రాలకు కట్టుబడి ఉండకుండా, బహుశా యౌవనులైన అన్య భార్యలను తీసుకోవచ్చునని కావచ్చు తమ భార్యలకు విడాకులిచ్చేవారు. మలాకీ ఇలా వ్రాశాడు: “యౌవన కాలమందు నీవు పెండ్లి చేసికొని అన్యాయముగా విసర్జించినb నీ భార్య పక్షమున యెహోవా సాక్షియాయెను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్యగదా; . . . కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసికొని, యౌవనమున పెండ్లిచేసికొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.”—మలాకీ 2:14-16.
8. విడాకులను గూర్చిన ఆధునిక దృక్కోణాన్నిబట్టి క్రైస్తవ సంఘంలోని కొందరు ఎలా ప్రభావితమయ్యారు?
8 ఆధునిక కాలాల్లో, విడాకులు సులభంగా తీసుకోగల అనేక దేశాల్లో, విడాకుల రేటు ఆకాశానికెగసింది. క్రైస్తవ సంఘం కూడా ప్రభావితమయ్యింది. అవరోధాలను అధిగమించడానికి పెద్దల సహాయం తీసుకుని, తమ వివాహాన్ని విజయవంతం చేసుకోవడానికి ప్రయత్నించే బదులు, కొందరు చాలా తొందరగా విడాకులిచ్చేశారు. తరచూ పిల్లలు భావోద్రేకపరంగా అత్యధిక మూల్యాన్ని చెల్లించవలసి వస్తోంది.—మత్తయి 19:8, 9.
9, 10. యెహోవాకు మనం చేసే ఆరాధనను మనమెలా దృష్టించాలి?
9 మనం పైన చూసినట్లుగా, మలాకీ కాలంలోని దుఃఖకరమైన ఆత్మీయ పరిస్థితి దృష్ట్యా, యెహోవా యూదా యొక్క నిస్సారమైన ఆరాధనను బహిరంగంగా నిందించి, తాను స్వచ్ఛారాధనను మాత్రమే అంగీకరిస్తానని చూపించాడు. విశ్వ సర్వోన్నతాధిపతి, నిజమైన పరిశుద్ధతకు మూలము అయిన యెహోవా దేవునికి మనం చేసే ఆరాధన యొక్క నాణ్యతను పరిశీలించుకోవడానికి ఇది మనల్ని పురికొల్పవద్దా? మనం దేవునికి నిజంగా పరిశుద్ధ సేవను అర్పిస్తున్నామా? మనల్ని మనం ఆత్మీయంగా పరిశుభ్రమైన స్థితిలో ఉంచుకుంటున్నామా?
10 అంటే దీని భావం మనం పరిపూర్ణులమై ఉండాలని కాదు, ఎందుకంటే అది అసాధ్యం, లేక మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవాలనీ కాదు. అయితే, ప్రతి క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు దేవునికి తాను చేసే ఆరాధన తన వ్యక్తిగత పరిస్థితుల పరిధిలో తాను చేయగల శ్రేష్ఠమైనదై ఉండాలన్నది దాని భావం. ఇది మన ఆరాధన యొక్క నాణ్యతను సూచిస్తుంది. మన పరిశుద్ధ సేవ అంటే పవిత్ర సేవ మనం చేయగల శ్రేష్ఠమైనదై ఉండాలి. దాన్నెలా సాధించవచ్చు?—లూకా 16:10; గలతీయులు 6:3, 4.
స్వచ్ఛమైన హృదయాలు స్వచ్ఛారాధనకు నడిపిస్తాయి
11, 12. అపరిశుద్ధ ప్రవర్తన ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది?
11 ఒక వ్యక్తి చెప్పేదాన్నిబట్టి, చేసేదాన్నిబట్టి ఆయన హృదయంలో ఏముందో తెలుస్తుందని యేసు స్పష్టంగా బోధించాడు. స్వనీతిపరులే అయినప్పటికీ అపరిశుద్ధులైన పరిసయ్యులతో యేసు ఇలా అన్నాడు: “సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.” ఆ తర్వాత, హృదయంలో లేక అంతరంగంలో ఉండే దుష్ట తలంపుల నుండి దుష్ట క్రియలు ఉత్పన్నమౌతాయని ఆయన చూపించాడు. ఆయనిలా చెప్పాడు: “నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును.”—మత్తయి 12:34; 15:18-20.
12 అపరిశుద్ధ క్రియలు కేవలం అప్పటికప్పుడు ఉద్భవించేవి లేక పూర్వాధారం లేనివి కావని గ్రహించడానికి ఇది మనకు సహాయం చేస్తుంది. అవి హృదయంలో మెదులుతుండిన కలుషితం చేసే తలంపుల—రహస్య కోరికల, బహుశా ఊహల ఫలితమై ఉండవచ్చు. అందుకే యేసు ఇలా చెప్పగలిగాడు: “వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా—ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.” వేరే మాటల్లో చెప్పాలంటే, ఏదైనా క్రియ జరుగకముందే జారత్వం మరియు వ్యభిచారం హృదయంలో నాటుకున్నాయన్నమాట. దానితో, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే, అపరిశుద్ధ తలంపులు అపరిశుద్ధ ప్రవర్తనగా మారతాయి. జారత్వం, వ్యభిచారం, సహజ విరుద్ధమైన మైథునం, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, మతభ్రష్టత్వం వంటివి కొన్ని స్పష్టమైన ఫలితాలవుతాయి.—మత్తయి 5:27, 28; గలతీయులు 5:19-21.
13. అపరిశుద్ధ తలంపులు అపరిశుద్ధ క్రియలకు ఎలా నడిపించగలవనే దానికి కొన్ని ఉదాహరణలు ఏవి?
13 పైన చెప్పిన పరిస్థితిని వివిధ రకాలుగా ఉదాహరించవచ్చు. కొన్ని దేశాల్లో, జూదమాడే అవకాశాన్ని అధికం చేస్తూ, జూదశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒకరు తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించడానికి, మిథ్యా పరిష్కారాన్ని ఆశ్రయించడానికి శోధింపబడవచ్చు. ఒక సహోదరుడు తన బైబిలు సూత్రాలను నిరాకరించడానికి లేక పలుచన చేయడానికి మోసకరమైన తర్కం ఆయనను పురికొల్పవచ్చు.c మరో సందర్భంలో, టీవీ, వీడియోలు, కంప్యూటర్ల ద్వారానైనా లేక పుస్తకాల ద్వారానైనా బూతు చిత్రాలు లేక అశ్లీల సాహిత్యం అందుబాటులో ఉండడం, ఒక క్రైస్తవున్ని అపరిశుద్ధమైన ప్రవర్తనకు నడిపించగలదు. ఆయన తన ఆత్మీయ కవచాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలు, తాను దాన్ని గ్రహించేలోగానే అవినీతిలో పడిపోతాడు. కాని అనేక సందర్భాలలో, పాపంలోకి దిగజారిపోవడం మనస్సులోనే ప్రారంభమౌతుంది. అవును, ఇలాంటి పరిస్థితుల్లో, యాకోబు యొక్క ఈ మాటలు నెరవేరుతాయి: ‘ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనును.’—యాకోబు 1:14, 15; ఎఫెసీయులు 6:11-18.
14. అనేకులు తమ అపరిశుద్ధ ప్రవర్తనను ఎలా మార్చుకున్నారు?
14 బలహీనతవల్ల పాపం చేసిన అనేకమంది క్రైస్తవులు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తారు, అలాంటి వారిని పెద్దలు ఆత్మీయంగా పునఃస్థాపించగలుగుతున్నారన్నది సంతోషకరమైన విషయం. పశ్చాత్తాపం చూపనందున బహిష్కరింపబడిన అనేకులు కూడా చివరికి మంచి బుద్ధి చూపించి, సంఘంలో తిరిగి చేర్చుకోబడుతున్నారు. అపరిశుద్ధమైన తలంపులు హృదయంలో నాటుకునేందుకు తాము అనుమతించినప్పుడు, సాతాను తమను ఎంత సులభంగా స్వాధీనం చేసుకున్నాడో వారు గ్రహిస్తారు.—గలతీయులు 6:1; 2 తిమోతి 2:24-26; 1 పేతురు 5:8, 9.
మన బలహీనతల నెదుర్కొనే సవాలు
15. (ఎ) మనం మన బలహీనతలను ఎందుకు గుర్తించాలి? (బి) మన బలహీనతలను అంగీకరించడానికి మనకు ఏది సహాయం చేయగలదు?
15 మన హృదయాన్ని మనం యథాతథంగా తెలుసుకోవడానికి మనం కృషి చేయాలి. మనం మన బలహీనతలను గుర్తించి, అంగీకరించి, వాటిపై విజయం సాధించడానికి కృషిచేసేందుకు సుముఖత కలిగివున్నామా? మనమెలా మెరుగుపరచుకోవచ్చుననే దాని గురించి నిర్మొహమాటస్థుడైన ఒక స్నేహితున్ని అడిగి, ఇవ్వబడే సలహాను వినడానికి సుముఖత కలిగివున్నామా? పరిశుద్ధంగా ఉండడానికి మనం మన బలహీనతల్ని అధిగమించాలి. ఎందుకు? ఎందుకంటే సాతానుకు మన బలహీనతలు తెలుసు. మనల్ని పాపంలోకి, అపరిశుద్ధ ప్రవర్తనలోకి నడిపించడానికి అతడు తన మోసకరమైన కుయుక్తులను ఉపయోగిస్తాడు. మనం ఇక పరిశుద్ధంగా, యెహోవా ఆరాధన కొరకు ఉపయోగకరంగా ఉండకుండేలా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయడానికి అతడు తన కపట క్రియల ద్వారా ప్రయత్నిస్తాడు.—యిర్మీయా 17:9; ఎఫెసీయులు 6:11; యాకోబు 1:19.
16. పౌలుకు ఏ సంఘర్షణ ఉండినది?
16 అపొస్తలుడైన పౌలుకు తన స్వంత శ్రమలు, పరీక్షలు ఉండినవి, ఆయన దాన్ని రోమీయులకు వ్రాసిన తన లేఖలో ఇలా ధృవీకరించాడు: “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. . . . అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది.”—రోమీయులు 7:18-23.
17. పౌలు తాను తన బలహీనతలతో చేసే పోరాటంలో ఎలా విజయం సాధించగలిగాడు?
17 ఇప్పుడు, పౌలు విషయంలో ముఖ్యమైన సంగతేమిటంటే, ఆయన తన బలహీనతలను అంగీకరించాడు. అవి ఉన్నప్పటికీ ఆయనిలా చెప్పగలిగాడు: “[ఆత్మీయ] అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను.” పౌలు మంచిని ప్రేమించి, చెడును ద్వేషించాడు. అయినప్పటికీ ఆయనకు పోరాడవలసిన పోరాటం ఉండింది, అదే పోరాటం మనకందరికి కూడా ఉంది, అది సాతానుకు, ప్రపంచానికి, శరీరానికి వ్యతిరేకంగా చేసే పోరాటం. కాబట్టి పరిశుద్ధంగా మిగిలి ఉండడానికి, ఈ లోకం నుండి, దాని ఆలోచనా విధానం నుండి వేరుగా ఉండడానికి ఆ పోరాటంలో మనమెలా విజయం సాధించవచ్చు?—2 కొరింథీయులు 4:4; ఎఫెసీయులు 6:12.
మనమెలా పరిశుద్ధంగా మిగిలి ఉండవచ్చు?
18. మనం పరిశుద్ధంగా ఎలా మిగిలి ఉండగలము?
18 సులభమైన మార్గాన్ని చేపట్టడం ద్వారా లేక స్వయం నిమగ్నత కలిగివుండడం ద్వారా పరిశుద్ధతను పొందలేము. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడూ తన ప్రవర్తనకు సాకులు చెబుతూ, నిందను నెట్టి వేయడానికి ప్రయత్నిస్తాడు. బహుశా మనం మన చర్యలకు మనమే బాధ్యత వహించడాన్ని, తమ కుటుంబ పూర్వరంగం లేక పారంపర్యం మూలంగా అలా జరిగిందని చెప్పేవారిలా ఉండకపోవడాన్ని నేర్చుకోవలసి ఉండవచ్చు. విషయం యొక్క మూలం వ్యక్తి హృదయంలో ఉంటుంది. అతడు లేక ఆమె నీతిని ప్రేమిస్తారా? పరిశుద్ధతను ఆకాంక్షిస్తారా? దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటారా? కీర్తనల గ్రంథకర్త ఇలా చెప్పినప్పుడు ఆయన పరిశుద్ధత యొక్క అవసరతను స్పష్టం చేశాడు: “కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దాని వెంటాడుము.” అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీ ప్రేమ నిష్కపటమైనదై యుండవలెను. చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి.”—కీర్తన 34:14; 97:10; రోమీయులు 12:9.
19, 20. (ఎ) మనం మన మనస్సును ఎలా పెంపొందించుకోగలము? (బి) ప్రభావవంతమైన వ్యక్తిగత పఠనం దేన్ని సాధ్యపరుస్తుంది?
19 మనం విషయాలను యెహోవా దృక్కోణం నుండి చూస్తే, మనకు క్రీస్తు వంటి మనస్సువుంటే, మనం “మంచిదానిని హత్తుకొని యుండ” వచ్చు. (1 కొరింథీయులు 2:16) దీన్నెలా సాధించవచ్చు? దేవుని వాక్యాన్ని క్రమంగా పఠించి, ధ్యానించడం ద్వారా. ఈ సలహా ఎంత తరచుగా ఇవ్వబడుతుందో కదా! కాని మనం దాన్ని తగినంత గంభీరంగా తీసుకుంటామా? ఉదాహరణకు, మీరు కూటానికి రాక ముందు బైబిలు లేఖనాలను పరిశీలిస్తూ ఈ పత్రికను నిజంగా పఠించారా? పఠించడం అంటే ప్రతి పేరాలో కొన్ని వాక్యాలకు కేవలం గీతలు గీయడమని భావం కాదు. ఒక పఠన శీర్షికను దాదాపు 15 నిముషాల్లో ఆదరాబాదరాగా చదివి, గీతలు గీయవచ్చు. మనం శీర్షికను పఠించామని దాని భావమా? వాస్తవానికి, ఒక్కో శీర్షిక అందజేసే ఆత్మీయ ప్రయోజనాన్ని పఠించి, గ్రహించడానికి ఒకటి లేక రెండు గంటలు పట్టవచ్చు.
20 బహుశా మనం ప్రతి వారం కొన్ని గంటలపాటు టీవీ చూడడాన్ని మానుకుని మన వ్యక్తిగత పరిశుద్ధతపై నిజంగా శ్రద్ధనుంచడానికి మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడం అవసరం కావచ్చు. మన క్రమ పఠనం, సరైన నిర్ణయాలు—“పరిశుద్ధమైన ప్రవర్తన” కలిగి ఉండడానికి నడిపించే నిర్ణయాలు తీసుకోవడానికి మన మనస్సులను ప్రేరేపిస్తూ, మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది.—2 పేతురు 3:11, 12; ఎఫెసీయులు 4:23; 5:15, 16.
21. ఏ ప్రశ్నకు సమాధానం అవసరం?
21 ఇప్పుడు ప్రశ్నేమిటంటే, యెహోవా పరిశుద్ధంగా ఉన్నట్లే, క్రైస్తవులముగా మనం మరే కార్యరంగాలలో, ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండవచ్చు? తరువాతి శీర్షిక జాగ్రత్తగా పరిశీలించవలసిన కొంత సమాచారాన్ని అందజేస్తుంది.
[అధస్సూచీలు]
a రెండు సంపుటుల ఈ సంప్రదింపు గ్రంథం వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
b ‘అన్యాయముగా విసర్జించడం’ అంటే ఏమిటనేదాన్ని గూర్చిన మరింత పూర్తి వివరణ కొరకు ఫిబ్రవరి 8, 1994 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 21వ పేజీలోగల “దేవుడు ఏ విధమైన విడాకులను ద్వేషిస్తాడు?” అనే శీర్షిక చూడండి.
c జూదం అపరిశుద్ధమైన ప్రవర్తన ఎందుకవుతుందనేదాని గురించి మరింత సమాచారం కొరకు, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన, ఆగస్టు 8, 1994 తేజరిల్లు! (ఆంగ్లం) నందలి 14-15 పేజీలను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ఇశ్రాయేలులో పరిశుద్ధత యొక్క మూలం ఎలా గుర్తించబడింది?
◻ మలాకీ దినాల్లో ఇశ్రాయేలీయుల ఆరాధన ఏ విధంగా అపరిశుద్ధమైనదిగా ఉండినది?
◻ అపరిశుద్ధ ప్రవర్తన ఎక్కడ ప్రారంభమౌతుంది?
◻ పరిశుద్ధంగా ఉండడానికి, మనం ఏమి గుర్తించాలి?
◻ మనం పరిశుద్ధంగా ఎలా మిగిలి ఉండగలము?