సత్యారాధన విజయం సమీపిస్తుంది
“యెహోవా సర్వలోకమునకు రాజైయుండును.”—జెకర్యా 14:9.
1. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అభిషిక్త క్రైస్తవుల అనుభవం ఏమైవుండెను, అదెలా ప్రవచింపబడింది?
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, యుద్ధం చేస్తున్న దేశాల చేతుల్లో అభిషిక్త క్రైస్తవులు అనేక శ్రమలను నిర్బంధాలను అనుభవించారు. యెహోవాకు వారు అర్పించే స్తుతి యాగాలు తీవ్రంగా నిర్బంధింపబడ్డాయి, వారు ఆత్మీయంగా చెరపట్టబడిన స్థితిలో పడిపోయారు. జెకర్యా 14:2 నందు ఇదంతా ప్రవచింపబడింది, అది యెరూషలేముపై జరిగే అంతర్జాతీయ దాడిని వివరిస్తుంది. ఈ ప్రవచనంలోని నగరం “పరలోక యెరూషలేము,” దేవుని పరలోక రాజ్యం మరియు “దేవునియొక్కయు గొర్రెపిల్లయొక్కయు సింహాసనము” ఉండే స్థలం. (హెబ్రీయులు 12:22, 28; 13:14; ప్రకటన 22:3) ఆ పట్టణం భూమిపైనున్న దేవుని అభిషిక్తులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. వారిలో నమ్మకమైనవారు “పట్టణములో” నుండి తాము వెళ్లగొట్టబడడానికి నిరాకరించడం ద్వారా దాడిని ఎదుర్కొన్నారు.a
2, 3. (ఎ) యెహోవా ఆరాధన 1919 నాటి నుండి ఎలా విజయం సాధించింది? (బి) పందొమ్మిదివందల ముప్పై ఐదు నుండి ఏ అభివృద్ధి జరుగుతోంది?
2 నమ్మకమైన అభిషిక్తులు 1919లో తమ చెరవంటి స్థితినుండి విడుదల చేయబడ్డారు, యుద్ధం తర్వాత వచ్చిన శాంతి సమయం నుండి వారు వెంటనే ప్రయోజనం పొందారు. పరలోక యెరూషలేము ప్రతినిధులుగా వారు దేవుని రాజ్యసువార్తను ప్రకటించి, 1,44,000 మందిలోని చివరి సభ్యుల సమకూర్పు పనిలో సహాయపడడమనే గొప్ప అవకాశాన్ని పొందారు. (మత్తయి 24:14; 2 కొరింథీయులు 5:20) వారు 1931లో యెహోవాసాక్షులు అనే యుక్తమైన లేఖనాధార నామాన్ని తీసుకున్నారు.—యెషయా 43:10, 12.
3 అప్పటి నుండి, దేవుని అభిషిక్త సాక్షులు మరెన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు. చివరికి హిట్లరు తన నాజీ రాజకీయ మరియు సైనిక సంస్థీకరణతో సహా వారిని నిమ్మళింపజేయలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా హింసను ఎదుర్కొన్నప్పటికీ, వారి పని భూమియందంతటా ఫలాలను ఫలించింది. ప్రాముఖ్యంగా 1935వ సంవత్సరం నుండి, ప్రకటన గ్రంథంలో ప్రవచింపబడిన అంతర్జాతీయ “గొప్ప సమూహము” వారితో కలిసింది. వారు కూడా సమర్పించుకొని బాప్తిస్మం పొంది, “గొఱ్ఱెపిల్ల” అంటే యేసుక్రీస్తు “రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.” (ప్రకటన 7:9, 14) అయితే వారు పరలోక జీవిత నిరీక్షణగల అభిషిక్తులు కారు. ఆదాముహవ్వలు కోల్పోయినదాన్ని అంటే పరదైసు భూమిపై పరిపూర్ణ మానవజీవితాన్ని పొందాలన్నది వారి నిరీక్షణ. (కీర్తన 37:29; మత్తయి 25:34) నేడు, గొప్ప సమూహానికి చెందినవారు 50 లక్షలమంది ఉన్నారు. యెహోవా సత్యారాధన విజయం సాధిస్తోంది, కాని దాని అంతిమ విజయం ఇంకా రానైయుంది.
దేవుని ఆత్మీయ ఆలయంలో పరదేశులు
4, 5. (ఎ) గొప్ప సమూహానికి చెందినవారు యెహోవాను ఎక్కడ ఆరాధిస్తారు? (బి) వారు ఏ ఆధిక్యతలను అనుభవిస్తారు, ఏ ప్రవచన నెరవేర్పుగా?
4 ప్రవచింపబడినట్లుగా, గొప్ప సమూహంవారు “రాత్రింబగళ్లు [దేవుని] ఆలయంలో ఆయనను సేవించుచున్నారు.” (ప్రకటన 7:15) వారు ఆత్మీయ, యాజక వర్గానికి చెందిన ఇశ్రాయేలీయులు కారు గనుక, బహుశా వారు ఆలయంలోని అన్యుల ఆవరణలో నిలబడివున్నట్లు యోహాను చూసివుండవచ్చు. (1 పేతురు 2:5) ఆత్మీయ ఇశ్రాయేలీయుల శేషముతోపాటు యెహోవాను స్తుతిస్తున్న ఈ గొప్ప సమూహాలతో ఆలయ ప్రాంగణాలు నిండిపోవడంవల్ల ఆయన ఆత్మీయ ఆలయం ఎంత మహిమాన్వితంగా మారుతుందో కదా!
5 గొప్ప సమూహానికి చెందినవారు లోపలి యాజకవర్గం యొక్క ఆవరణలలోని స్థితివంటి స్థితిలో దేవున్ని సేవించరు. వారు దేవుని దత్తతపొందిన ఆత్మీయ కుమారులుగా ఉండేందుకు నీతిమంతులుగా తీర్చబడరు. (రోమీయులు 8:1, 15) అయినప్పటికీ, యేసు విమోచన క్రయధన బలియందు విశ్వాసముంచడం ద్వారా, వారికి యెహోవా ఎదుట పవిత్రమైన స్థానం ఉంటుంది. ఆయన స్నేహితులయ్యేందుకు వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. (యాకోబు 2:21, 23 పోల్చండి.) దేవుని ఆత్మీయ బలిపీఠంపై అంగీకారయోగ్యమైన బలులను అర్పించే ఆధిక్యత కూడా వారికి ఉంది. అలా, ఈ పెద్ద సమూహానికి సంబంధించి, యెషయా 56:6, 7 నందలి ఈ ప్రవచనం మహిమాన్వితంగా నెరవేరుతోంది: “యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.”
6. (ఎ) పరదేశులు ఏ విధమైన బలులను అర్పిస్తారు? (బి) యాజక ఆవరణలోని నీటి పాత్ర వారికి ఏమి జ్ఞాపకం చేస్తుంది?
6 ఈ పరదేశులు అర్పించే బలులలో ‘స్తుతియాగము, అంటే [దేవుని] నామమును ఒప్పుకొని [చక్కగా సిద్ధం చేయబడిన నైవేద్యమువంటి] జిహ్వాఫలము అర్పించడం,’ అలాగే ‘ఉపకారము, ధర్మము’ చేరివున్నాయి. (హెబ్రీయులు 13:15, 16) యాజకులు తమనుతాము శుభ్రపరచుకోవడానికి ఉపయోగించుకొనే నీళ్లుగల పెద్ద పాత్ర కూడా ఈ పరదేశులకు ప్రాముఖ్యమైన జ్ఞాపికయే. దేవుని వాక్యం వారికి క్రమేణ స్పష్టం చేయబడుతుండగా, వారు కూడా ఆత్మీయ, నైతిక పరిశుభ్రతకు లోబడాలి.
పరిశుద్ధ స్థలం మరియు దాని ఉపకరణాలు
7. (ఎ) పరిశుద్ధ యాజకత్వం యొక్క ఆధిక్యతలను గొప్ప సమూహం వారు ఎలా దృష్టిస్తారు? (బి) కొంతమంది పరదేశులు ఏ అదనపు ఆధిక్యతలను పొందారు?
7 పరదేశులతో కూడిన ఈ గొప్ప సమూహానికి పరిశుద్ధ స్థలం మరియు దాని ఉపకరణాలు ఏమైనా భావాన్ని కలిగివున్నాయా? నిజమే, వారు పరిశుద్ధ స్థలమును సూచించే స్థితిలోకి ఎన్నడూ రారు. వారు పరలోక పౌరత్వంతో దేవుని ఆత్మీయ కుమారులుగా ఎన్నడూ తిరిగి జన్మించరు. ఇది వారు ఈర్ష్యపడేలా లేక అసూయచెందేలా చేస్తుందా? లేదు. బదులుగా, 1,44,000 మందిలోని శేషానికి మద్దతునివ్వడమనే తమ ఆధిక్యతనుబట్టి వారు ఆనందిస్తారు, అలాగే వారు మానవజాతిని పరిపూర్ణతకు తీసుకురావడంలో క్రీస్తుతోపాటు భాగం వహించే ఈ ఆత్మీయ కుమారులను దత్తత తీసుకోవడంలోని దేవుని సంకల్పం ఎడల లోతైన మెప్పును చూపిస్తారు. అంతేగాక, పరదైసులో నిత్యజీవం పొందే భూ నిరీక్షణను తమకు అనుగ్రహించడంలో దేవుడు చూపిన గొప్ప కృపా బాహుళ్యాన్నిబట్టి పరదేశుల గొప్ప సమూహం ఆనందిస్తుంది. ప్రాచీన కాలంనాటి నెతీనీయులవలె ఈ పరదేశులలో కొందరికి పరిశుద్ధ యాజకత్వానికి సహాయపడడంలో పర్యవేక్షించే ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి.b (యెషయా 61:5) యేసు వారిలో నుండి ‘భూమియందంతట అధికారులనుగా నియమిస్తాడు.’—కీర్తన 45:16.
8, 9. పరిశుద్ధ స్థలంలోని ఉపకరణాలను పరిశీలించడం ద్వారా గొప్ప సమూహానికి చెందిన వారు ఏ ప్రయోజనాలను పొందుతారు?
8 పరదేశుల గొప్ప సమూహం ఎన్నడూ సాదృశ్యమైన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ, దాని ఉపకరణాల నుండి వారు విలువైన పాఠాలు నేర్చుకుంటారు. దీపస్తంభానికి ఎల్లప్పుడూ నూనె అవసరమైనట్లే, ‘నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునగు దాసుని’ ద్వారా అందజేయబడుతున్న దేవుని వాక్య సత్యాలను క్రమేణ గ్రహించడానికి పరదేశులకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. (మత్తయి 24:45-47) అంతేగాక, వారీ ఆహ్వానానికి ప్రతిస్పందించేందుకు దేవుని ఆత్మ వారికి సహాయం చేస్తుంది: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు [అభిషిక్త శేషము] రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) అలా, క్రైస్తవులుగా ప్రకాశించాలనే తమ బాధ్యతల విషయంలోను దృక్పథంలోను తలంపులోను మాటలోను లేక క్రియలోను దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపర్చే దేనినైనా విసర్జించాలనే తమ బాధ్యతల విషయంలోను ఈ దీప స్తంభం గొప్ప సమూహానికి ఒక జ్ఞాపికగా ఉంటుంది.—ఎఫెసీయులు 4:30.
9 గొప్ప సమూహం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే బైబిలు నుండి, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే ప్రచురణల నుండి క్రమంగా ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలనే విషయాన్ని సన్నిధి భక్ష్యముల బల్ల జ్ఞాపకం చేస్తుంది. (మత్తయి 4:4) తమ యథార్థతను కాపాడుకోవడానికి సహాయం కొరకు యెహోవాకు ఎడతెగక ప్రార్థించడంలోని ప్రాముఖ్యతను ధూప వేదిక వారికి గుర్తుచేస్తుంది. (లూకా 21:36) వారి ప్రార్థనల్లో హృదయపూర్వక స్తుతులు, కృతజ్ఞతలు కూడా ఉంటాయి. (కీర్తన 106:1) దేవున్ని వేర్వేరు విధాలుగా స్తుతించే అవసరతను అంటే క్రైస్తవ కూటాలలో రాజ్య గీతాలను హృదయపూర్వకంగా పాడడం, ‘రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవడాన్ని’ ప్రభావవంతంగా చేయడానికి తాము చక్కగా సిద్ధపడడం వంటివి చేసేందుకు కూడా ధూప వేదిక వారికి జ్ఞాపకం చేస్తుంది.—రోమీయులు 10:10.
సత్యారాధన యొక్క సంపూర్ణ విజయం
10. (ఎ) మనం ఏ గొప్ప ఉత్తరాపేక్ష కొరకు ఎదురు చూడవచ్చు? (బి) మొదట ఏ అభివృద్ధి జరగాలి?
10 నేడు అన్ని దేశాలకు చెందిన “జనములు గుంపులు గుంపులుగా” యెహోవా ఆరాధనా మందిరానికి తరలి వస్తున్నారు. (యెషయా 2:2, 3) దీన్ని ధృవపరుస్తూ, “ప్రభువా [“యెహోవా,” NW] నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని” ప్రకటన 15:4 తెలియజేస్తుంది. ఆ తర్వాత ఏమి జరుగుతుందో జెకర్యా 14వ అధ్యాయం వివరిస్తుంది. సమీప భవిష్యత్తులో, భూమిపైనున్న అనేకమంది ప్రజలు యెరూషలేముకు అంటే పరలోక యెరూషలేము యొక్క భూమిపైనున్న ప్రతినిధులకు వ్యతిరేకంగా చివరిసారి యుద్ధం చేయడానికి సమకూడినప్పుడు వారి చెడు దృక్పథం తారస్థాయికి చేరుతుంది. అప్పుడు యెహోవా చర్య తీసుకుంటాడు. యుద్ధ దేవునిగా ఆయన, ఈ దాడి చేయాలని ప్రయత్నించే “ఆ అన్యజనులతో యుద్ధము చేయును.”—జెకర్యా 14:2, 3.
11, 12. (ఎ) తన ఆలయంలోని ఆరాధికుల మీదికి వచ్చే ప్రపంచవ్యాప్త దాడికి యెహోవా ఎలా ప్రతిస్పందిస్తాడు? (బి) దేవుని యుద్ధ ఫలితమేమై ఉంటుంది?
11 “యెహోవా తెగుళ్లుపుట్టించి యెరూషలేముమీద యుద్ధము చేసిన జనములనందరిని ఈలాగున మొత్తును; వారు నిలిచియున్నపాటుననే వారి దేహములు కుళ్లిపోవును, వారి కన్నులు కనుతొఱ్ఱలలో ఉండియే కుళ్లిపోవును, వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్లిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరు ఒకరి కొకరు విరోధులై ఒకరిమీదనొకరు పడుదురు.”—జెకర్యా 14:12, 13.
12 ఈ తెగులు అక్షరార్థమైనదై ఉంటుందో లేక సూచనార్థకమైనదై ఉంటుందో మనం వేచి చూడవలసిందే. అయితే, ఒక విషయం మాత్రం కచ్చితం. దేవుని శత్రువులు యెహోవా సేవకులపై ప్రపంచవ్యాప్త దాడి చేయబోతుండగా, దేవుని అమోఘమైన సర్వోన్నత శక్తి దాన్ని ఆపుతుంది. వారి నోళ్లు మూయబడుతాయి. అది, తిరస్కరించినవారి నాలుకలు కుళ్లిపోయినట్లే ఉంటుంది. వారి కళ్లు కుళ్లిపోయాయేమో అన్నట్లు, వారి ఐక్య లక్ష్యం వారి దృష్టికి మసకబారుతుంది. దాడి చేయడానికి వారిని ధైర్యపరచిన వారి శారీరక శక్తులు వ్యర్థమైపోతాయి. అయోమయంలో, వారు ఒకరిపై ఒకరు పడి వధించుకుంటారు. అలా దేవుని ఆరాధన యొక్క భూ శత్రువులందరూ నిర్మూలింపబడతారు. చివరికి, జనాంగాలన్ని యెహోవా విశ్వ సర్వాధిపత్యాన్ని గుర్తించడం అనివార్యమౌతుంది. “యెహోవా సర్వలోకమునకు రాజైయుండును” అనే ప్రవచనం నెరవేరుతుంది. (జెకర్యా 14:9) ఆ తర్వాత, మానవజాతికి గొప్ప దీవెనలను తెస్తూ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కావడంతో సాతాను అతని దయ్యాలు బంధించబడతారు.—ప్రకటన 20:1, 2; 21:3, 4.
భూ సంబంధమైన పునరుత్థానం
13. ‘అన్యజనులలో శేషించినవారు’ ఎవరు?
13 జెకర్యా ప్రవచనం జెకర్యా 14వ అధ్యాయం, 16వ వచనం వద్ద ఇలా కొనసాగుతుంది: “యెరూషలేముమీదికి వచ్చిన అన్యజనులలో శేషించినవారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలపండుగ ఆచరించుటకును ఏటేట వత్తురు.” బైబిలు ప్రకారం, నేడు సజీవంగా ఉండి, ఈ దుష్టవిధానం యొక్క ముగింపు వరకు జీవించి ఉండే ప్రజలందరూ మరియు సత్యారాధనా శత్రువులుగా తీర్పుతీర్చబడిన వారు “నిత్యనాశనమను దండన” అనుభవిస్తారు. (2 థెస్సలొనీకయులు 1:7-9; మత్తయి 25:31-33, 46 కూడా చూడండి.) వారికి పునరుత్థానం ఉండదు. అయితే బహుశ ‘శేషించినవారిలో’ దేవుని అంతిమ యుద్ధానికి ముందు మరణించిన జనాంగాలకు చెందిన సభ్యులు మరియు బైబిలు ఆధారిత పునరుత్థాన నిరీక్షణగల వారు ఉంటారు. యేసు ఇలా వాగ్దానం చేశాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలుచేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.
14. (ఎ) పునరుత్థానం చేయబడిన వారు నిత్యజీవాన్ని పొందడానికి ఏమి చేయాలి? (బి) యెహోవాకు తమనుతాము సమర్పించుకొని సత్యారాధనను అవలంబించడానికి నిరాకరించేవారికి ఏమి జరుగుతుంది?
14 పునరుత్థనమయ్యే వీరందరూ తమ పునరుత్థానం వ్యతిరేక తీర్పు పునరుత్థానం కాకుండా జీవ పునరుత్థానం అయ్యేందుకు కొంత చేయవలసి ఉంటుంది. వారు యెహోవా ఆలయం యొక్క భూ సంబంధ ఆవరణల్లోకి వచ్చి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమర్పించుకొంటూ మ్రొక్కాలి. పునరుత్థానమైన వారిలో, ఇలా చేయడానికి నిరాకరించే వారెవరైనా ప్రస్తుతదిన జనాంగములపైకి వచ్చే తెగుళ్లనే అనుభవిస్తారు. (జెకర్యా 14:18) సాదృశ్యమైన పర్ణశాలల పండుగను ఆచరించడంలో గొప్ప సమూహంతో ఎంతమంది కలుస్తారో ఎవరికి తెలుసు? నిస్సందేహంగా అనేకమంది ఉంటారు, ఫలితంగా యెహోవా యొక్క గొప్ప ఆత్మీయ ఆలయం మరింత మహిమాన్వితమౌతుంది!
సాదృశ్యమైన పర్ణశాలల పండుగ
15. (ఎ) ప్రాచీన ఇశ్రాయేలీయుల పర్ణశాలల పండుగలోని కొన్ని విశేషమైన అంశాలు ఏవి? (బి) పండుగ సమయంలో 70 కోడెదూడలు ఎందుకు అర్పించబడేవి?
15 ప్రాచీన ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరం పర్ణశాలల పండుగను ఆచరించవలసి ఉండేది. అది ఒక వారం పాటు జరిగేది, వారి కోతకాలం ముగింపులో అది వచ్చేది. అది కృతజ్ఞతలు చెల్లించే ఆనందభరితమైన సమయం. వారమంతటిలో, వారు చెట్ల ఆకులతో ప్రాముఖ్యంగా ఖర్జూరపు మట్టలతో కప్పబడిన తాత్కాలిక గుడారాలలో నివసించాలి. దేవుడు తమ పితరులను ఐగుప్తులో నుండి బయటికి ఎలా రప్పించాడో, వాగ్దాన దేశాన్ని చేరే వరకు అరణ్యంలో 40 సంవత్సరాలు సంచరిస్తున్నప్పుడు వారు పర్ణశాలల్లో ఎలా నివసించారో ఈ పండుగ ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేసేది. (లేవీయకాండము 23:39-43) పండుగ సమయంలో, ఆలయ బలిపీఠం మీద 70 కోడెదూడలు బలి ఇవ్వబడేవి. స్పష్టంగా, పండుగలోని ఈ అంశం యేసుక్రీస్తు చేసిన పరిపూర్ణ, సంపూర్ణ జీవరక్షణ పనికి ప్రవచనార్థకంగా ఉంది. ఆయన విమోచన బలి ప్రయోజనాలు చివరికి, నోవహు నుండి 70 మానవ కుటుంబాల మూలంగా వచ్చిన అసంఖ్యాక వారసులకు విస్తరిస్తాయి.—ఆదికాండము 10:1-29; సంఖ్యాకాండము 29:12-34; మత్తయి 20:28.
16, 17. (ఎ) సాదృశ్యమైన పర్ణశాలల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, అది ఎలా కొనసాగింది? (బి) ఆ ఆచరణలో గొప్ప సమూహానికి చెందినవారు ఎలా భాగం వహిస్తారు?
16 అలా, విమోచించబడిన పాపులు యెహోవా గొప్ప ఆత్మీయ ఆలయంలోకి ఆనందభరితంగా సమకూడడాన్ని ప్రాచీన పర్ణశాలల పండుగ సూచించింది. ఈ ఆలయం యొక్క సాదృశ్యమైన నెరవేర్పు సా.శ. 33 పెంతెకొస్తు నాడు అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులు క్రైస్తవ సంఘంలోకి ఆనందంగా సమకూర్చబడడం ప్రారంభం కావడంతో మొదలయ్యింది. (అపొస్తలుల కార్యములు 2:41, 46, 47) ఈ అభిషిక్తులు తమ నిజమైన “పౌరస్థితి పరలోకమునందున్నది” గనుక సాతాను ప్రపంచంలో తాము ‘యాత్రికులమని’ గుణగ్రహించారు. (1 పేతురు 2:11; ఫిలిప్పీయులు 3:20) క్రైస్తవ మత సామ్రాజ్యం ఏర్పడడానికి కారణమైన మతభ్రష్టత్వం ఆనందభరితమైన ఈ పండుగను తాత్కాలికంగా మరుగుపర్చింది. (2 థెస్సలొనీకయులు 2:1-3) అయితే ఆ పండుగ 1919లో, ఆత్మీయ ఇశ్రాయేలీయులైన 1,44,000 మందికి చెందిన మిగిలిన సభ్యుల ఆనందభరిత సమకూర్పుతోను దాని తర్వాత, ప్రకటన 7:9 నందలి అంతర్జాతీయ గొప్ప సమూహము యొక్క సమకూర్పుతోను తిరిగి ప్రారంభమయ్యింది.
17 గొప్ప సమూహానికి చెందిన వారి చేతిలో ఖర్జూరపు మట్టలు ఉన్నట్లు చెప్పబడింది అది, వారు కూడా సాదృశ్యమైన పర్ణశాలల పండుగను ఆనందంగా జరుపుకుంటారని చూపిస్తుంది. సమర్పిత క్రైస్తవులుగా వారు, యెహోవా ఆలయంలోకి ఎక్కువమంది ఆరాధికులను సమకూర్చే పనిలో వారు ఆనందంగా భాగం వహిస్తారు. అంతేగాక, పాపులుగా తమకు ఈ భూమిపై నిరంతరం నివసించే హక్కు లేదని వారు గుణగ్రహిస్తారు. భవిష్యత్తులో పునరుత్థానులయ్యే వారితోపాటు వీరు, క్రీస్తు యొక్క వెయ్యేండ్ల పరిపాలనాంతానికి మానవ పరిపూర్ణతకు చేరేంతవరకు క్రీస్తు విమోచన బలియందు విశ్వాసముంచాలి.—ప్రకటన 20:5.
18. (ఎ) యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనాంతంలో ఏమి జరుగుతుంది? (బి) యెహోవా సత్యారాధన చివరికి ఎలా విజయం సాధిస్తుంది?
18 ఆ తర్వాత, భూమిపైనున్న దేవుని ఆరాధికులు మానవ పరిపూర్ణత కెదిగి, పరలోక యాజకత్వ అవసరం లేని విధంగా ఆయన ఎదుట నిలబడతారు. యేసుక్రీస్తు “తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించ” వలసిన సమయం వస్తుంది. (1 కొరింథీయులు 15:24) పరిపూర్ణులై మానవజాతిని పరీక్షించేందుకు సాతాను “కొంచెము కాలము” విడిచిపెట్టబడతాడు. అవిశ్వాసులైన ఎవరైనా, సాతాను అతని దయ్యాలతో పాటు మరెన్నడూ ఉండకుండా నాశనం చేయబడతారు. విశ్వాసంగా నిలిచివుండేవారికి నిత్యజీవం ఇవ్వబడుతుంది. వారు భూ పరదైసులో నిత్య నివాసులౌతురు. అలా, సాదృశ్య పర్ణశాలల పండుగ మహిమాన్వితమైన, విజయవంతమగు ముగింపుకు వస్తుంది. సత్యారాధన యెహోవాకు నిత్య మహిమను, మానవజాతికి నిత్య ఆనందాన్ని తెస్తూ విజయం సాధిస్తుంది.—ప్రకటన 20:3, 7-10, 14, 15.
[అధస్సూచీలు]
a జెకర్యా 14వ అధ్యాయంపై ప్రతివచన వ్యాఖ్యానం కొరకు 1972లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన మానవజాతి కొరకు పరదైసు పునఃస్థాపించబడడం—దైవపరిపాలన ద్వారా! (ఆంగ్లం) అనే పుస్తకంలోని 21, 22 అధ్యాయాలను చూడండి.
b ఆధునిక దిన నెతీనీయుల గురించిన అధిక సమాచారం కొరకు ఏప్రిల్ 15, 1992 కావలికోట (ఆంగ్లం) నందలి 16వ పేజీ చూడండి.
పునఃపరిశీలన ప్రశ్నలు
◻ మొదటి ప్రపంచయుద్ధ కాలంలో “యెరూషలేము” ఎలా దాడిని ఎదుర్కొన్నది?—జెకర్యా 14:2.
◻ దేవుని ప్రజలకు 1919 నుండి ఏమి జరిగింది?
◻ నేడు సాదృశ్యమైన పర్ణశాలల పండుగను ఆచరించడంలో ఎవరు భాగం వహిస్తున్నారు?
◻ సత్యారాధన ఎలా సంపూర్ణ విజయాన్ని సాధిస్తుంది?
[23వ పేజీలోని చిత్రం]
పర్ణశాలల పండుగను ఆచరించడంలో ఖర్జూరపు మట్టలు ఉపయోగించబడేవి