“అట్టివారిని సన్మానించుడి”
కొరింథు సంఘంలోని పరిస్థితులన్నీ సవ్యంగా జరగడంలేదు. సహోదరుల మధ్య గగుర్పాటు కల్గించే లైంగిక అవినీతికి సంబంధించిన ఒక విషయం మరియు విభేదాలు ఉండేవి. కొందరు గంభీరమైన వ్యక్తిగత సమస్యలను ఎదుర్కున్నారు లేక జవాబు అవసరమైన ప్రశ్నలను కల్గివున్నారు. కొందరు సహోదరులు ఒకరినొకరు న్యాయస్థానాలకు తీసుకు వెళుతున్నారు; మరితరులు పునరుత్థానాన్ని సహితం కాదంటున్నారు.
తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవదీయబడ్డాయి. మతపరంగా విభాగించబడిన కుటుంబాల్లోని వారు అవిశ్వాసులైన తమ జీవిత భాగస్వాములతో ఉండాలా లేక విడిపోవాలా? సంఘంలోని సహోదరీల పాత్రేమిటి? విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని తీసుకోవడం సరైనదేనా? ప్రభువు రాత్రి భోజనంతో సహా కూటాలను ఎలా నిర్వహించాలి?—1 కొరింథీయులు 1:12; 5:1; 6:1; 7:1-3, 12, 13; 8:1; 11:18, 23-26; 14:26-35.
అలాంటి కష్టతరమైన ఆత్మీయ వాతావరణంలో ఉంటున్న తమ సహోదరుల క్షేమం కొరకు చింతించినవారై అకాయి, ఫొర్మూనాతు, స్తెఫను ఎఫెసులోని అపొస్తలుడైన పౌలును సందర్శించేందుకు ప్రయాణమయ్యారు. కలతపర్చే అలాంటి సమాచారానికి తోడు, సంఘంనుండి ఈ విషయాలపై ప్రశ్నలున్న ఓ ఉత్తరాన్ని పౌలుకు వారు తీసుకెళ్లివుంటారు. (1 కొరింథీయులు 7:1; 16:17) ఉన్న ఆధారాల ప్రకారంగా, ఈ పరిస్థితి విషయంలో శ్రద్ధకల్గివుంది ఈ ముగ్గురు సహోదరులకు మాత్రమేకాదు. నిజానికి, సంఘంలోని సహోదరుల మధ్య కలహాలున్నాయని “క్లోయె యింటివారివలన” పౌలు ముందుగానే తెలుసుకున్నాడు. (1 కొరింథీయులు 1:11) నిస్సందేహంగా, ఈ సందేశకులు తెచ్చిన నివేదిక ఈ విషయాన్ని గూర్చి స్పష్టమైన అవగాహనను పొందేందుకు, ఏ సలహాను ఇవ్వాలో, మరి లేవదీయబడిన ప్రశ్నలకు ఎలా జవాబు చెప్పాలో నిర్ణయించుకునేందుకు పౌలుకు సహాయపడివుంటుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికగా మనకు పరిచయమున్న ఈ పత్రిక, దేవుని పరిశుద్ధాత్మవల్ల నడిపించబడిన పౌలు జవాబన్నట్లుగా కనిపిస్తుంది. బహుశ ఆ ఉత్తరాన్ని వారికి అందించింది అకాయి, ఫొర్మూనాతు, స్తెఫను అయివుండవచ్చు.
అకాయి, ఫొర్మూనాతు, స్తెఫనులు ఎవరు? వారిని గూర్చి లేఖనాలు చెబుతున్నవాటినిబట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు?
స్తెఫను ఇంటివారు
సుమారు సా.శ. 50లో దక్షిణ గ్రీసులోని రోమా ప్రాంతమైన అకయనందు పౌలు చేసిన పరిచర్యకు స్తెఫను కుటుంబము “ప్రథమఫలము”గా లభించింది మరియు వారు స్వయంగా పౌలు వల్లనే బాప్తిస్మం పొందారు. కొరింథీయులకు ఓ పరిపక్వమైన నిశ్చల పురికొల్పుగా ఉన్నారని చెప్పుకోదగినవారిగా పౌలు వారిని పరిగణించాడు. “స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమైయున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను” అని సంఘం కొరకు వారు చేసే పనినిబట్టి ఆయన వారిని అప్యాయంగా మెచ్చుకున్నాడు. (1 కొరింథీయులు 1:16; 16:15, 16) స్తెఫను ‘ఇంటివారి’లో సరిగ్గా ఎవరున్నారన్న విషయం చెప్పబడలేదు. ఆ మాట భావం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే కావచ్చు, అయితే దానిలో దాసులూ లేక పనివారూ ఉండవచ్చు. అకాయి అన్నది లాటిన్ భాషలో దాసులకుపయోగించే సాధారణమైన పేరు మరియు ఫొర్మూనాతు అన్నది విడిపించబడినవారి సాధారణ పేరు గనుక ఆ ఇద్దరూ బహుశ అదే ఇంటిలోని సభ్యులని కొందరు వ్యాఖ్యాతలు ఊహిస్తున్నారు.
విషయమేదైనప్పటికీ, పౌలు స్తెఫను ఇంటివారిని మాదిరికరమైనవారిగా పరిగణించాడు. ఆ కుటుంబ సభ్యులు ‘పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారు.’ సంఘం క్షేమార్థమైన పని చేయాల్సిన అవసరముందని స్తెఫను కుటుంబంవారు గుర్తించివుంటారు మరి వారు ఈ సేవను వ్యక్తిగత బాధ్యతగా అంగీకరించారు. పరిశుద్ధులకు అలాంటి సేవనందించాలన్న వారి కోరిక నైతిక మద్దతు మరియు గుర్తింపు కచ్చితంగా అవసరమయ్యాయి.
“వీరు . . . నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి”
పౌలు కొరింథులోని పరిస్థితినిబట్టి కలతచెందినప్పటికీ, ముగ్గురు సందేశకుల రాక ఆయనను ఓదార్చేందుకు పనిచేసింది. “స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. . . . వీరు . . . నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి” అని పౌలు చెబుతున్నాడు. (1 కొరింథీయులు 16:17, 18) అక్కడి పరిస్థితులవల్ల శారీరకంగా కొరింథీయులనుండి వేరుగా ఉండడం పౌలు కలతకు కారణమైవుంటుంది, అయితే వారి ప్రతినిధులు అక్కడ ఉండడం సంఘమంతా లేని లోటును తీర్చింది. వారిచ్చిన నివేదిక, పరిస్థితులను గూర్చి పౌలుకు పూర్తి సమాచారాన్నిచ్చింది, మరి అది ఆయన భయాల్లో కొన్నింటినైనా తొలగించివుంటుంది. బహుశ అక్కడి పరిస్థితులు తానూహించినంత దారుణంగా లేవు.
పౌలు చెప్పిన ప్రకారంగా, ఆ ముగ్గురి పని ఆయన ఆత్మను సుఖపర్చడమేకాకుండా, కొరింథు సంఘంలోని ఆత్మను కూడా ఉత్తేజపర్చేందుకు సహాయపడింది. తమ ప్రతినిధులు తమ పరిస్థితిని గూర్చిన ప్రతి విషయాన్ని పౌలుకు స్పష్టంగా వివరిస్తారని మరియు ఆయన సలహాతో తిరిగివస్తారనీ తెలుసుకోవడం వారికి ఎంతో ఉపశమనంగా ఉండివుంటుంది.
కనుక స్తెఫను మరియు అతని ఇద్దరు సహచరులు, కొరింథీయుల తరపున వారు చేసిన కష్టానికి అనురాగంతో సిఫారసు చేయబడ్డారు. పౌలుకు వీరి ఎడల ఎంత మెప్పు ఉందంటే, వారు తిరిగి వెళ్లిన తర్వాత విడిపోయిన కొరింథు సంఘంలో వారు నాయకత్వాన్ని వహించాలి. అపొస్తలుడు సహోదరులకు ఇలా ఉద్బోధించాడు: ‘సహాయముచేయుచు, ప్రయాసపడుచు ఉండువారికందరికిని మీరు విధేయులై యుండవలెను . . . అట్టివారిని సన్మానించుడి.’ (1 కొరింథీయులు 16:16, 18) అలాంటి దృఢమైన సిఫారసు, సంఘంలో ఎన్ని ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ ఈ వ్యక్తులకు సంపూర్ణ యథార్థత ఉందని స్పష్టంగా సూచిస్తుంది. అలాంటి వ్యక్తులు ప్రియంగా ఎంచబడాలి.—ఫిలిప్పీయులు 2:29.
నమ్మకమైన సహకారం మంచి ఫలితాలను అందిస్తుంది
యెహోవా సంస్థకు మరియు దాని ప్రతినిధులకు అందించే సన్నిహిత సహకారం మంచి ఫలితాలను ఫలింపజేస్తుందనడంలో సందేహంలేదు. మొదటి లేఖ తర్వాత కొద్దికాలానికే, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రికను పౌలు వ్రాసినప్పటికే సంఘంలోని పరిస్థితులు మెరుగుపడడం కొనసాగాయి. అకాయి, ఫొర్మూనాతు, స్తెఫనుల వంటి సహోదరులు ఓరిమితో పనిలో కొనసాగడం, అలాగే తీతు సందర్శనం మంచి ఫలితాలను తెచ్చింది.—2 కొరింథీయులు 7:8-15; అపొస్తలుల కార్యములు 16:4, 5ను పోల్చండి.
యెహోవా ప్రజల ఆధునిక సంఘాల్లోని సభ్యులు, లేఖనాల్లో క్లుప్తంగా ప్రస్తావించబడిన విశ్వసనీయమైన ఈ వ్యక్తులను గూర్చి ధ్యానించడం నుండి ప్రయోజనం పొందగలరు. ఉదాహరణకు, స్థానిక సంఘంలో ఓ పరిస్థితి ఏదో కారణంగా పరిష్కరించబడకుండానే కొనసాగుతూ సహోదరులకు కలత కలుగజేస్తుందనుకుందాము. అప్పుడు ఏమి చేయాలి? పరిస్థితిని గూర్చి పౌలుకు చెప్పే తమ బాధ్యతనుండి విరమించుకోకుండా మరియు ఆ తర్వాత విషయాలను యెహోవా చేతుల్లోకి ధైర్యంగా విడిచి పెట్టిన అకాయి, ఫొర్మూనాతు, స్తెఫనులను అనుకరించాలి. నీతి ఎడల వారి ఆసక్తి వారు స్వతంత్రంగా చర్య తీసుకునేలా లేక “యెహోవా మీద కోపిం”చేలా చేయలేదు.—సామెతలు 19:3.
సంఘాలు యేసుక్రీస్తుకు చెందినవి, మరి కొరింథులో చేసినట్లుగా సరైన సమయంలో వారి ఆత్మీయ శాంతి క్షేమాలను ప్రమాదంలో పడేసే ఏ సమస్యలనైనా ఆయన పరిష్కరించేందుకు చర్యగైకొంటాడు. (ఎఫెసీయులు 1:22; ప్రకటన 1:12, 13, 20; 2:1-4) ఇంతలో అకాయి, ఫొర్మూనాతు, స్తెఫనుల మాదిరిని మనం అనుకరించి, మన సహోదరులను సేవించడంలో పాటుపడినట్లయితే, మనం కూడా సంఘ ఏర్పాట్లకు యథార్థంగా మద్దతునిచ్చి, సహోదరులను ప్రోత్సహించి, ‘ప్రేమచూపుటకు సత్కార్యములుచేయుటకు ఒకరినొకరు పురికొల్పిన’ వారమౌతాము.—హెబ్రీయులు 10:24, 25.