భూమి మీది సుదూర ప్రాంతం వరకు సాక్షులు
ఇతాప్
టూలీ
గోధావ్న్
గాట్‌హాబ్
జూలియానెహాబ్
అన్‌గ్మాస్సాలిక్
పురాతన కాలం నుండి భౌగోళికంగానైనా, మరోవిధంగానైనా అంతిమ లక్ష్యాన్ని వర్ణించేందుకు ఉపయోగించబడిన పేరులోని ఒక భాగం టూలీ. నేడు టూలీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద దీవియైన గ్రీన్‌లాండ్‌లో పూర్తిగా ఉత్తర దిశలోవున్న చిన్న గ్రామం పేరు. 1910లో డెన్మార్క్ దేశస్థుడైన నూట్ రాస్మసీన్ అనే అన్వేషకుడు దానిని ధ్రువప్రాంత సాహస యాత్రికుల బృందాలు కలుసుకునే స్థలంగా ఆ గ్రామాన్ని ఉపయోగించినప్పుడు అలా పిలువబడింది. ఇప్పుడు కూడా, టూలీకి వెళ్ళడం అంటే ఆహ్లాదకరమైన యాత్ర అనే దానికన్నా సాహస యాత్ర అనడమే సరైనది.
ఇప్పటికీ, టూలీకి సాహసయాత్ర చేయవలసిన అత్యవసరముంది. “భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని” అన్న యేసు ఆజ్ఞకు యెహోవాసాక్షులు ప్రతిస్పందిస్తూ, సుదూర ఉత్తరార్థగోళంలో ఎంతోకాలంగా మానవులుంటున్న గ్రామాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో దేవుని రాజ్య సువార్తను తెలియజేయాలనే కుతూహలంతో ఉన్నారు.—అపొస్తలుల కార్యములు 1:8; మత్తయి 24:14.
‘టూలీకి మేమెప్పుడు వెళ్ళగలం?’
“భూదిగంతముల వరకు” ప్రకటించడంలో భాగం వహించాలని కోరుకున్న ఇద్దరు డెన్మార్క్ దేశస్థులైన సాక్షులు 1955లో గ్రీన్‌లాండ్‌కు చేరుకున్నారు. ఇతరులు తరువాత వచ్చారు, మెల్‌విల్ బే యొక్క దక్షిణ మరియు పశ్చిమ తీరాల్లోను మరియు తూర్పు తీరాన కొంత భాగంలోను వారి ప్రకటన పని క్రమేణా పూర్తిచేయబడింది. కానీ, టూలీ వంటి సుదూర ప్రాంతాలకు ఉత్తరాలు లేదా టెలిఫోను ద్వారా మాత్రమే సువార్త చేరుకుంది.
1991లో ఒకరోజు, పూర్తికాల సేవకులైన బో, ఆయన భార్య హెలెన్ ఒక రాతిబండ మీద నిలబడి మెల్‌విల్ బేను చూస్తున్నారు. ఉత్తరం వైపుకు చూస్తూ, ‘టూలీలోని ప్రజలకు రాజ్యసువార్తను అందించేందుకు మనమక్కడికి ఎప్పుడు వెళ్ళగలం?’ అని అనుకున్నారు.
1993లో వెర్నర్ అనే మరో పూర్తికాల పరిచారకుడు తన 5.5 మీటర్ల స్పీడ్‌బోట్ అయిన కామానెక్ (తేలికైనది)లో మెల్‌విల్ బేను దాటే సాహసం చేశాడు. ఆయన అప్పటికే గాట్‌హాబ్ నుండి అపర్నవిక్ ప్రాంతం వరకు 1,200 కిలోమీటర్ల పడవ ప్రయాణం చేశాడు. అయితే, మెల్‌విల్ బేని అంటే విస్తారంగా ఉన్న 400 కిలోమీటర్ల ఆర్కిటిక్ జలాన్ని దాటడం అనేది పూర్తిగా వేరే విషయం. సంవత్సరంలో చాలావరకు ఈ అఖాతం మంచుచేత ఆటంకపర్చబడి ఉంటుంది. మంచు మూలంగా ఒక ఇంజిన్ పనిచేయనప్పటికీ, వెర్నర్ ఆ అఖాతాన్ని దాటగలిగాడు. ఆయన అక్కడ నుండి తిరిగి రాక ముందు ప్రకటన పనిని కొంత చేయగలిగాడు.
టూలీకి వెళ్ళడం
ఆ ప్రయాణం తరువాత, వెర్నర్ క్రొత్త పథకాలను వేయనారంభించాడు. ఏడు మీటర్లుండి, నాలుగు బెర్త్‌లున్న, మరిముఖ్యంగా ఆధునిక సముద్రయాన పరికరాలు గల ఒక పడవ స్వంతంగా ఉన్న ఆర్న కారీన్లతో టూలీకి కలిసి ప్రయాణం చేయడాన్ని గూర్చి ఆయన మాట్లాడాడు. ఆ పడవలు అన్ని వసతులను కల్పిస్తాయి, ఆ రెండు పడవలు కలిసి ప్రయాణిస్తే, మెల్‌విల్ బేను దాటడం ఎక్కువ ప్రమాదకరంగా ఉండదు. 600 మంది నివాసులున్న రెండు ముఖ్య నగరాలలోను, ఆ ప్రాంతంలోని ఆరు గ్రామాలలోను సాక్ష్యమిచ్చేందుకు వారికి మరింత సహాయమవసరమైంది. కనుక ఆ దేశంలో ప్రయాణం చేసిన అనుభవం ఉన్న పరిచారకులందరినీ అంటే, బో హెలెన్‌లను మరియు యూర్న్ ఇన్జ్‌లను తమతో రమ్మని వారు ఆహ్వానించారు. ఈ గుంపులోని ఐదుగురు గ్రీన్‌లాండ్ భాషను కూడా మాట్లాడుతారు.
వారు బైబిలు సాహిత్యాలను ముందే పంపారు. సాహిత్యము అలాగే, అవసరమైన ఆహారం, నీళ్ళు, ఇంధనం, అదనంగా మరో ఇంజిన్, ఒక రబ్బరు పడవ మొదలగువానితో ఆ పడవలు నిండిపోయాయి. తర్వాత, ఆగస్టు 5, 1994న అనేక నెలల సిద్ధపాటు తర్వాత, ఆ జట్టు కలుసుకుంది, రెండు పడవలు సిద్ధమై, లులిసాట్ హార్బర్కు తీసుకు వెళ్ళడం జరిగింది. ఉత్తరానికి ప్రయాణం మొదలైంది. వెర్నర్, బో మరియు హెలెన్ ఆ రెండు పడవల్లో చిన్నదానిలో ఎక్కారు. “బెర్త్ మీద కూర్చోవడం లేదా పడుకోవడం, దేనినైనా పట్టుకోవడం మాత్రమే చేయగలిగింది” అని బో వ్రాస్తున్నాడు. ఆ పడవ ప్రయాణం ఎలా జరిగిందో చూద్దాం.
“ప్రశాంతంగా ఉన్న సముద్రం చాలా పొడవుగా ఉంది. మా కళ్ళ ముందు అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి—మెరుస్తున్న సముద్రం, అక్కడక్కడ దట్టంగా వ్యాపించివున్న పొగమంచు, ప్రకాశమానమైన సూర్యుడు, నీలాకాశం, ఎంతో ఆసక్తిని కలిగించే రూపాల్లోను వర్ణ ఛాయల్లోను ఉన్న మంచు పర్వతాలు, తేలుతున్న మంచుపై ఎండ కాచుకుంటున్న గోధుమ వర్ణంలోవున్న వాల్రస్ ముదురు వర్ణంలోని పర్వత ఏటవాలు ప్రాంతాలతోను చిన్న సమతల ప్రాంతాలతోను ఉన్న సముద్ర తీరం—మారుతున్న దృశ్యాలకు అంతమే లేదు.
“అయితే, మార్గమధ్యంలో ఉన్న గ్రామాల వెంబడి దర్శించడం మరింత ఆసక్తికరమైన విషయం. సందర్శకులెవరో చూసి, వారికి స్వాగతం పలికేందుకు ప్రజలు, సాధారణంగా పిల్లలు ఓడరేవు దగ్గర ఎప్పుడూ ఉండేవారు. మేము బైబిలు సాహిత్యాలను అందించి, మన సంస్థను గూర్చిన వీడియోను ఆ ప్రజలకు చూపించాము. మేము అక్కడ నుండి బయలుదేరక ముందు చాలామంది దానిని చూడగలిగారు. దక్షిణ అపర్నవిక్ దగ్గర, మేము మా పడవలను దరిచేర్చక ముందే చాలా మంది ప్రజలు పడవ ప్రయాణం చేసి అక్కడికి వచ్చారు. ఆ సాయంకాలమంతా, మా పడవ దగ్గరకు అతిథులు రాగా, అనేక బైబిలు ప్రశ్నలకు మేము జవాబులనిచ్చాము.”
ఇప్పుడు, 700 కిలోమీటర్ల మొదటి ప్రయాణం తరువాత, రెండు పడవలు మెల్‌విల్ బేను దాటడానికి సిద్ధమయ్యాయి.
అనిశ్చిత సవాలు
“ప్రయాణంలో ఇది క్లిష్టమైన ప్రాంతమని అందరికీ తెలుసు. మేము ఆగకుండా దాటవలసి ఉంది, ఎందుకంటే, సావిస్సివిక్ గ్రామం (ఆ ప్రాంతం మొదలయ్యే చోట లేదా మరి మేము ఆశ్రయాన్ని పొందగల స్థలం) ఇప్పటికీ మంచుతో కప్పబడి ఉంది.
“మేమలా దాటనారంభించాం. అక్కడ చాలా మంచు ఉంది కనుక, మేము ఆటంకాల్లేని సముద్రం గుండా ఇంకా దూరం ప్రయాణం చేశాము. ఆ సమయంలో, నీళ్ళు నిమ్మళంగా ఉన్నాయి. మొదటి అనేక గంటల్లో చెప్పుకోదగ్గవి ఏమీ జరుగలేదు—సముద్రం గుండా ఒక మైలు తరువాత మరో మైలు నెట్టుకుపోవడం జరిగింది. సాయంకాలమయ్యేసరికి, మేము కేప్ యోర్క్‌ను చూశాము, నెమ్మదిగా ఒడ్డుకు సమీపంగా ఉత్తరానికి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ మంచే, అంటే, ఇప్పుడు కనుచూపు మేరలో ఉన్నది, విచ్ఛిన్నమౌతూ తేలియాడుతున్న ఆ మంచే. మేము చాలా దూరం మంచు అంచు వెంబడి వెళ్ళాం. మంచు మధ్యగల చిన్నదారుల గుండా కొన్నిసార్లు వెళ్ళాం. చిక్కని బూడిద రంగు సూప్‌లా కనిపించే పొగమంచు సూర్యాస్తమయ వెలుతురులో మరింత అందంగా కనిపించింది. ఆ పిమ్మట, ఇక తరంగాల సంగతి చెప్పనక్కరలేదు! పొగమంచు, తరంగాలు, మంచు, ఇవన్నీ ఒకేసారి—సాధారణంగా వీటిలో ఏదో ఒక్కటి చాలు సవాలయ్యేందుకు.”
మాకు స్వాగతం
“మేము పిటుఫిక్ సమీపించి, నిమ్మళంగా ఉన్న నీటిలోకి ప్రవేశించాము. సృష్టి మాకు గొప్ప ఆహ్వానాన్నిచ్చింది: నీలాకాశంలో ఎత్తున ఉన్న సూర్యుడు; మా ముందు మెరుస్తున్న సముద్ర ద్వారం, అక్కడక్కడ చుక్కల్లా కనిపిస్తున్న తేలుతున్న మంచు పర్వతాలు; డన్‌డాస్ వద్ద స్థూలంగా దూరం నుండే కనిపిస్తున్న పాత టూలీ!” ఉత్తరాన దాదాపు 100 కిలోమీటర్ల దూరాన ఉన్న తమ గమ్యస్థానానికి ప్రయాణికులు చేరుకున్నారు.
ఆ తర్వాత, ఇంటింట ప్రకటించాలనే ఉత్సుకతతో వారున్నారు. వారిలో ఇద్దరు వెళ్ళిన మొదటి ఇంట్లో కఠువైన ప్రతిస్పందన కలిగింది. “డెన్మార్క్‌లోలాగే మేము నిరాకరించబడ్డాము. కాని అధిక సంఖ్యాకులు మాకు హార్దికంగా స్వాగతమిచ్చారు. ప్రజలు సాలోచనగలవారు, మంచి జ్ఞానము గలవారు. వారు మమ్మల్ని గూర్చి విన్నారని, చివరికి మేము వెళ్ళినందుకు చాలా సంతోషిస్తున్నారని కొందరు పేర్కొన్నారు. ఉన్నదానితో తృప్తి పొందే, మితవ్యయం చేసేవారునై, ఆధునిక నాగరికతను అనుమానంతో వీక్షించే, ఉత్తర ధ్రువానికి సాహస యాత్రలు చేసి సీల్‌లను పట్టేవారును, ఆ దేశస్థులునైనటు వంటి కొందరు మంచి మనుష్యులను మేము కలిశాము” అని వారు చెబుతున్నారు.
ఆ తరువాతి కొన్ని రోజులు మాకందరికీ చక్కని అనుభవం కలిగింది. ప్రతిచోట బైబిలు సాహిత్యం ప్రశంసతో అంగీకరించబడింది. అనేక ఇండ్లలో సాక్షులు అప్పటికప్పుడే బైబిలు పఠనాలను ఆరంభించారు. తాను ఆసక్తిని కనుగొనిన ఇంటిని గూర్చి ఇన్జ్ ఈ విధంగా చెబుతుంది: “ఒకే గది ఉన్న శుభ్రమైన, సుఖప్రదమైన ఇల్లది. అక్కడ నివసిస్తున్న సాత్వికుడైన ఆ మనిషిని మేము మూడురోజులు వరుసగా సందర్శించి, ఆయనకు ప్రియమైనవారమయ్యాము. ఆయన తన ఇంటికి వెలుపల సీలు తోలుతో తయారు చేసిన దోనెలో నిజంగా సీలును పట్టేవాడే. ఆయన అనేక ధ్రువ ఎలుగుబంటులను, వాల్రస్‌ను కాల్చి చంపాడు, నిజమే సీలులను కూడా చంపాడు. మా చివరి సందర్శనంలో మేము ఆయనతో ప్రార్థన చేశాము, ఆయన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. మేము ఇప్పుడు అంతా యెహోవా చేతిలో వదిలిపెట్టి, మళ్ళీ వెళ్ళే సమయం కోసం, అవకాశం కోసం నిరీక్షిస్తున్నాం.”
కెనడా ఎస్కిమోలు తరచూ టూలీ సందర్శిస్తారు. ఇన్జ్ ఇలా నివేదిస్తుంది: “నేను, హెలెన్ కెనడా నుండి వచ్చిన చాలా మంది ఎస్కిమోలను కలిశాం. వారు గ్రీన్‌లాండ్ దేశస్థులతో సంభాషించగలరన్నది ఆసక్తికరమైన విషయం; ఆర్కిటిక్ ప్రాంతంలోని ప్రజలు గ్రీన్‌లాండ్ భాషతో సంబంధంగల భాషలను మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. కెనడా ఎస్కిమోలకు వాళ్ళదైన వ్రాత భాష ఉన్నప్పటికీ, వారు గ్రీన్‌లాండ్ భాషలోని మన సాహిత్యాన్ని చదవగలరు. ఇది వారికి సంతోషకరమైన అవకాశాలను తెరవవచ్చు.”
పడవద్వారా 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా సందర్శించడం జరిగింది. “కకర్టాట్ అనే గ్రామానికి వెళ్ళేటప్పుడు నార్వాల్‌లను వేటాడే ప్రజలను కనుగొనవచ్చు అనే ఆశతో మేము సముద్ర తీరాన్ని దగ్గరగా వెంబడించాము. మేమాశించినట్లే ఒక రాతి గుహలో గుడారాలు, సీలు చర్మంతో చేసిన దోనెలుగల జంతుచర్మముతో చేసిన వస్త్రాలను ధరించినవారి మూడు నాలుగు కుటుంబాలుగల ఒక క్యాంపును మేము కనుగొన్నాం. ఎక్కువగా కోరబడే నార్వాల్‌లను చూసేందుకు మనుష్యులు పంట్రకోలను చేతిలో పెట్టుకుని, ఒకరి తర్వాత ఒకరు వంతులవారీగా ఒక బండమీద కూర్చున్నారు. అనేక రోజులు నిరర్థకంగా వేచి ఉన్న సమయాన మేము కనిపించడం వారికంత సంతోషం కలిగించలేదు, ఎందుకంటే మా రాక వేల్‌లను భయపెట్టి ఉంటుంది! వాళ్ళు పూర్తిగా వాళ్ళ స్వంత లోకంలో మునిగి ఉన్నట్లు కనిపించింది. ఆ స్త్రీలు కొన్ని సాహిత్యాలను తీసుకున్నారు, కాని ఎక్కువగా మాట్లాడడానికి అది సరైన సమయం కాదు. మేము చివరికి రాత్రి 11 గంటలకు కకర్టాట్‌కు చేరుకుని, ఉదయం 2 గంటలకు ఆ గ్రామంలో చివరి సందర్శనం చేశాము!”
“మేము గ్రీన్‌లాండ్‌లో ఉత్తరాన సుదూరంగావున్న సియారాబాలుక్ గ్రామాన్ని చేరుకున్నాము, అది పచ్చని గడ్డితో కప్పబడి ఉన్న రాళ్ళ దగ్గర మరో రకమైన బంజరు పరిసరం అంచున ఇసుకతోనున్న సముద్ర తీరంలో ఉంది.” సాక్షులు తమ ప్రకటన పనిలో కనీసం ఉత్తర దిశలో అక్షరార్థంగా సుదూర ప్రాంతాల వరకు వెళ్ళారు.
ప్రయాణం పూర్తయిపోయింది
సాక్షులు తమ పనిని పూర్తి చేశారు. వారు ఇంటింట, గుడిసె, గుడిసెకు వెళ్ళి, మన సాహిత్యాన్ని అందించి, చందాలను సేకరించి, వీడియోలను చూపించి, గ్రీన్‌లాండ్‌లోని చాలా మందితో మాట్లాడి, బైబిలు పఠనాలను నిర్వహించారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం. “పడవను మోరీయూసాక్ గ్రామం నుండి తీసుకు వెళ్ళేందుకు మేము ఎక్కినప్పుడు, చాలా కొద్ది మంది మమ్మల్ని సాగనంపడానికి సముద్ర తీరానికి వచ్చి, వారికి అందిన పుస్తకాలను లేక బ్రోషుర్‌లను ఊపి వీడ్కోలు చెప్పారు.”
తరువాత, నిర్మానుష్యంగావున్న తీరప్రదేశంలో, సుదూర ప్రాంతంలో ఒక రాతిబండ మీద నుండి ఒక వ్యక్తి చేతులు ఊపడం చూసి సాక్షులు చాలా ఆశ్చర్యపోయారు! “అవును, మేమాయనను కలుసుకోవడానికి ఆ తీరానికి వెళ్ళాం. అతడు జర్మనీలోని బెర్లిన్ నుండి వచ్చిన యువకుడు, అతడు సీల్ తోలుతో చేసిన తన దోనెలో ఆ తీరంలో ప్రయాణం చేస్తున్నాడు, అతడు ఒక నెల నుండి ప్రయాణంలో ఉన్నాడు. జర్మనీలో యెహోవాసాక్షులు అతడ్ని క్రమంగా సందర్శించేవారు, అతనికి వాళ్ళు అనేక పుస్తకాలను కూడా ఇచ్చారు. మేము అతనితో రెండు గంటలు గడిపాము, అలాంటి స్థలంలో సాక్షులను కలిసినందుకు అతడు చాలా ముగ్ధుడయ్యాడు.”
మునుపు ప్రయాణంలో దాటివేయబడిన సావిస్సివిక్ గ్రామంలో ప్రయాణ పరిచారకులకు ఎంతో చక్కని స్వాగతం లభించింది. గత సంవత్సరం, కొందరు సాహిత్యాన్ని తీసుకుని చదువుకున్నారు, వారు మరింత ఆత్మీయ ఆహారం కోసం ఆకలిగొన్నారు.
మెల్‌విల్‌ను తిరిగి దాటడానికి 14 గంటలు పట్టింది. “మేము ఒక సూర్యాస్తమయాన్ని చూశాం, ఇక్కడ అది ఎడతెగక ఆకర్షణీయమైన వర్ణాలలో మారుతూ అనేక గంటలు ఉంటుంది. వెంటనే కలిగే సూర్యోదయం కూడా చాలా గంటలు ఉంటుంది. ఈశాన్య ఆకాశంలో సూర్యుడు ఎరుపు, ముదురు ఎరుపు వర్ణములు గల తిరుగుతున్న ఫ్యాన్‌లా అస్తమిస్తూ ఉండగానే, దక్షిణంలో ఉదయించనారంభిస్తాడు. ఆ దృశ్యం వర్ణించలేనిది, లేదా కనీసం ఫోటోగ్రాఫ్‌లలో పట్టలేనిది.” నౌకాసిబ్బంది రాత్రంతా ఉండిపోయింది.
“మేము కుల్లార్‌స్వాక్‌ను చేరుకున్నప్పుడు చాలా అలిసిపోయాము. మేము ఆనందించి, సంతృప్తి పొందాము. మేము ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాము! మిగిలిన ప్రయాణంలో, సముద్ర తీరంలోని పట్టణాల్లోను, గ్రామాల్లోను మేము ఎంతో ఆసక్తిని కనుగొన్నాం. ‘మీరు ఇంత త్వరగా వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది! మీలో కొందరు మాతో ఎందుకు నివసించకూడదు?’ అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీవేయబడింది.”
సందర్శించినవారిలో ఐదుగురిని కార్‌సుట్‌లో స్నేహపూర్వకమైన ఒక కుటుంబం ఆహ్వానించింది. “మేము ఆ రాత్రంతా అక్కడే గడపాలని ఆ కుటుంబం కోరింది. అక్కడ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఇంకాస్త మంచి లంగరు స్థలాలు ఉన్నాయి కనుక, మేము అక్కడ ఉండడానికి నిరాకరించి, అక్కడ నుండి పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాము. మరుసటి రోజు ఉదయాన్నె మంచు పర్వతం పగిలి మేము ఉండిన చోట ఒక కెరటం 14 చిన్న పడవలను తలక్రిందులు చేసిందని మేము తర్వాత విన్నాము!”
చివరికి, ఆ గుంపు టూలీ యాత్రను ముగించి లులిసాట్‌కు తిరిగి వచ్చింది. దాదాపు అదే సమయంలో, మరో ఇద్దరు ప్రచారకులు గ్రీన్‌లాండ్‌లోని తూర్పు తీరంలో విడిగానున్న ప్రాంతాలకు ప్రయాణం చేశారు. ఆ రెండు ప్రయాణాల్లోను, ప్రచారకులు 1,200 పుస్తకాలను, 2,199 బ్రోషుర్‌లను, 4,224 పత్రికలను ఇచ్చారు, 152 పత్రికచందాలను సేకరించారు. ఇప్పుడు టెలిఫోను ద్వారా లేదా ఉత్తరాల ద్వారా ఆసక్తిగల చాలామంది క్రొత్తవాళ్ళతోగల సంబంధం నిలుపుకోబడుతుంది.
సమయం, శక్తి, డబ్బు ఇమిడి ఉన్నప్పటికీ, ‘భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుండుడి’ అన్న తమ యజమాని ఆజ్ఞను నెరవేర్చడంలో యెహోవాసాక్షులు సంతోషాన్ని కనుగొంటారు.—అపొస్తలుల కార్యములు 1:8.
[28వ పేజీలోని బాక్సు]
గ్రీన్‌లాండ్ తూర్పు తీరం
ఆ ప్రచారకుల గుంపు టూలీకి చేరుకున్న దాదాపు అదే సమయంలో వెగో, సోన్యా అనే దంపతులు పరిచర్య చేయని ప్రాంతమైన గ్రీన్‌లాండ్‌లోని తూర్పు తీరంలోని ఇట్టోకోర్టూర్మిట్‌కు (స్కోర్స్‌బిసన్డ్‌కు) ప్రయాణం చేశారు. అక్కడికి చేరుకునేందుకు వారు ఐస్‌లాండ్‌కు ప్రయాణం చేసి, గ్రీన్‌లాండ్ తీరాన ఉన్న కాన్‌స్టబుల్ పాయింట్‌కు తిరిగి విమానం ఎక్కి, ఆ తర్వాత హెలికాప్టర్‌లో వెళ్ళవలసి వచ్చింది.
“యెహోవాసాక్షులు అక్కడికి వెళ్ళడం ఇదే మొదటిసారి, అక్కడివారు మిగిలిన ప్రాంతాల నుండి వేరుగా ఉన్నప్పటికి, వారికి చాలా సమాచారం తెలుసన్నది ఆశ్చర్యకరం. అయినప్పటికీ వారు క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా సంతోషించారు. కథలను చెప్పే మంచి నైపుణ్యంగల వీరు తాము సీలులను ఎలా వేటాడుతారనేదానిని గూర్చి, ప్రకృతిలోని ఇతర విషయాలను గూర్చి ఉత్సుకతతో మాకు చెప్పారు” అని గ్రీన్‌లాండ్ భాష మాతృభాషయైన ఈ ఇద్దరు పయినీర్లు చెబుతున్నారు. ప్రకటన పనికి వారెలా ప్రతిస్పందించారు?
“ఇంటింటా ప్రకటిస్తుండగా, మేము మౌఖిక మతబోధకుడైన జె——ను కలిశాము. ‘మీరు సందర్శించిన వారిలో నన్ను కూడ కలుపుకున్నందుకు కృతజ్ఞతలు’ అని ఆయన అన్నాడు. మన సాహిత్యాన్ని, వాటినెలా ఉపయోగించాలనే దానిని చూపించాము. ఆయన తరువాతి రోజు మా దగ్గరికి వచ్చి, యెహోవా పేరును గూర్చి మరెక్కువగా తెలుసుకోవాలని కోరాడు. గ్రీన్‌లాండ్ భాషలోవున్న ఆయన స్వంత బైబిలులోని అథఃసూచిలో నుండి ఆయనకు వివరాన్ని చూపించాము. మేము వెళ్ళిపోయినప్పుడు, మేము సందర్శించినందుకు మాకు తన కృతజ్ఞతలను తెలిపేందుకు ఆయన నుక్‌లోని మా స్నేహితులకు ఫోన్ చేశాడు. ఈ మనిషికి సహాయం చేయడంలో కొనసాగేందుకు మేము తప్పక ప్రయత్నించాలి.
“యెహోవాసాక్షులను గూర్చి తెలిసిన ఓ—— అనే ఒక ఉపాధ్యాయున్ని కూడా మేము కలిశాము. 14-16 ఏండ్లవారున్న తన క్లాసులో మాట్లాడేందుకు ఆయన మాకు రెండు గంటల సమయమిచ్చాడు. కనుక మేము వారికి వీడియోను చూపించి, వారి ప్రశ్నలకు జవాబులిచ్చాము. యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానములుa అనే పుస్తకం మరియు ఇతర పుస్తకాలు వేడి వేడి పకోడీల్లా తీసుకోబడ్డాయి. తరువాత ఆ తరగతిలోని ముగ్గురు అమ్మాయిలు మళ్ళీ కలిశారు. వారికి ఎన్నో సందేహాలున్నాయి, వారిలో ఒకరికి ప్రత్యేక ఆసక్తి ఉంది. ‘ఒకరు ఎలా సాక్షి అవుతారు?’ అని అడిగి, ‘మీలా ఉంటే నిజంగా బాగుంటుంది. మా నాన్న కూడా మీ పక్షమే’ అని ఆమె అనింది. మేము ఉత్తరం వ్రాస్తామని ఆమెకు మాటిచ్చాము.
“ఈ గ్రామాల్లో ఒకదానిలో మేము ఎమ్—— అనే మరో మౌఖిక మతబోధకున్ని కలిశాము, మేము ఆసక్తికరమైన చర్చను జరిపాము. వేటకు వెళ్ళినవారు తిరిగి వచ్చిన వెంటనే మన సాహిత్యాన్ని అందుకునేలా చేస్తానని ఆయన మాటిచ్చాడు. అలా ఆయన ఆ సుదూర ఎడారి ప్రాంతంలో మన ‘ప్రచారకుడు.’”
చుట్టు తిరిగే శ్రమకరమైన ప్రయాణమైనప్పటికీ, తమ ప్రయత్నాలకు మంచి ఫలితం లభించిందని ఆ ఇద్దరు పయినీర్లు భావించారు.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీవారు ప్రచురించినది.