స్పానిష్ బైబిలు కోసం కాస్యోడోరో డి రేనా పోరాటం
పదహారవ శతాబ్దపు స్పెయిన్ బైబిలు చదివేందుకు అపాయకరమైన స్థలంగా ఉండేది. పారంపర్య విరుద్ధమైనది ఏ మాత్రం కనిపించినా దానిని రూపుమాపాలని కాథోలిక్ చర్చి అన్వేషణ సంఘాన్ని పురమాయించింది. లేఖనాలను చదవడమే కాక, స్పెయిన్లోని ప్రతి ఒక్కరూ వాటిని చదవగలిగేందుకు వాటిని ప్రాంతీయ భాషలోకి అనువదించాలని కూడా ప్రతిజ్ఞ చేసిన ఒక యువకుడు దక్షిణ స్పెయిన్లో ఉండేవాడు. ఆయన పేరు కాస్యోడోరో డి రేనా.
తాను స్పెయిన్లో సెవిల్లె పొలిమేరలోని సాన్ ఈసీడ్రో డెల్ కాంపో అనే సన్యాసి మఠంలో గడిపిన సంవత్సరాల్లో రేనాకు బైబిలులో ఆసక్తి కలిగింది. 1550లలో, ఈ అసాధారణమైన సన్యాసి మఠంలోవున్న సన్యాసుల్లోని అధిక సంఖ్యాకులు చర్చి సంబంధమైన విధులకన్నా లేఖనాలను చదవడంలోనే ఎక్కువ గంటలు గడిపారు. బైబిలు సందేశం వారి ఆలోచనా విధానాన్ని మార్చివేసింది. విగ్రహాల ఉపయోగాన్ని మరియు పాపవిమోచన లోకముందనే నమ్మకాన్ని గూర్చిన కాథోలిక్ సిద్ధాంతాన్ని వారు నిరాకరించారు. వారి అభిప్రాయాలు ఆ ప్రాంతంలో తెలిసిపోవడం అనివార్యమైంది, స్పెయిన్ అన్వేషణ సంఘం తమను అరెస్టు చేస్తుందని భయపడి, వారు విదేశానికి వెళ్ళిపోవాలని తీర్మానించుకున్నారు. స్విట్జర్లాండ్లోని జెనీవాకు పారిపోవడంలో సఫలులైన 12 మందిలో రేనా ఒకడు.
వెండ్రుక వాసిలో తప్పించుకున్న తరువాత, ఆయన ఐరోపాలోని నగరాల్లో ఒకదాని తరువాత మరొకదానికి ప్రయాణం చేస్తూ, ఏదోవిధంగా తనను హింసించేవారి నుండి తప్పించుకోగలిగాడు. నిరాశచెందిన అన్వేషకులు 1562లో సెవిలెలో అతని దిష్టిబొమ్మను దహనం చేశారు, కానీ ఆ క్రూరమైన బెదిరింపుకు భయపడి, లేఖనాలను అనువదించే పని నుండి రేనా వెనుదీయలేదు. తనను పట్టించిన వారికి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించినప్పటికీ, అరెస్టు చేయబడతాననే భయం నిరంతరమున్నప్పటికీ, స్పానిష్ భాషలోకి అనువదించే తన పనిలో ఆయన ఎడతెగక కృషి చేశాడు. “నాకు ఆరోగ్యం బాగో లేనప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు తప్ప, . . . నేనెప్పుడూ కలాన్ని క్రింద పెట్టలేదు” అని ఆయన వివరించాడు.
రేనా ఆ పనిని పది సంవత్సరాల్లో ముగించాడు. ఆయన అనువదించిన మొత్తం బైబిలు స్విట్జర్లాండ్లోని బేసెల్లో 1569లో ప్రచురించబడింది. ఈ విశేషమైన అనువాదం మూల భాషల నుండి అనువదించబడిన మొదటి సంపూర్ణ స్పానిష్ అనువాదం. శతాబ్దాలుగా లాటిన్ బైబిళ్ళు లభ్యమయ్యేవి, కాని లాటిన్ అనేది విద్యావంతుల భాష. బైబిలును అందరూ అర్థం చేసుకోవాలని రేనా నమ్మాడు, ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి పూనుకుని ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు.
తన అనువాదం యొక్క ఉపోద్ఘాతంలో ఆయన తన కారణాలను వివరించాడు. “సామాన్య భాషలో పరిశుద్ధ లేఖనాలను నిషేధించడం తప్పకుండా దేవునికి తీవ్రమైన అవమానాన్ని తెస్తుంది, మానవుల క్షేమానికి హాని కలిగిస్తుంది. ఇది సాతాను మరియు అతని ఆధీనంలో ఉన్నవారి పని అన్నది స్పష్టం. . . . దేవుడు మానవులకు తన వాక్యాన్నిచ్చి, అందరూ దానిని అర్థం చేసుకుని, దానిని ఆచరణలో పెట్టాలని ఆశిస్తున్నాడన్న వాస్తవం దృష్ట్యా, ఏ భాషలో అయినా దానిని నిషేధించేవాడు ఏ రకంగాను మంచి ఉద్దేశం కలిగివుండడు.”
స్పానిష్, అన్వేషక సంఘం నిషేధించిన పుస్తకాల జాబితాలో “కాస్టైల్ [స్పానిష్] రచనల్లోను లేదా మరే పామరుల భాషలోను” ముఖ్యంగా బైబిలు నిషేధించబడిన 18 సంవత్సరాల తరువాతే అది ప్రచురించబడింది కనుక వ్రాయబడిన ఈ మాటలు ధైర్యంతో కూడినవి. సత్యం ఎడల తనకు గల ప్రేమను అణచడానికి మానవ భయాన్ని రేనా అనుమతించలేదన్నది స్పష్టం.
స్పానిష్ భాషను మాట్లాడే ప్రజలందరికీ బైబిలును అందుబాటులో ఉంచాలనే కోరిక కలిగి ఉండడమే కాక, సాధ్యమైనంత మేరకు చాలా కచ్చితమైన అనువాదాన్ని చేయాలని కూడా రేనా అనుకున్నాడు. మూల భాషల నుండి నేరుగా అనువదించడం వలన కలిగే లాభాలను గూర్చి ఆయన తన ఉపోద్ఘాతంలో వివరించాడు. రోమన్ కాథోలిక్ల లాటిన్ బైబిలు అనువాదంలో కొన్ని తప్పులు ఎక్కాయని రేనా వివరించాడు. దైవిక నామాన్ని తొలగించడమే ఈ తప్పుల్లో బాగా స్పష్టంగా కనిపిస్తున్నది.
స్పానిష్ అనువాదాల్లో దైవ నామం
మూల పాఠ్యాంశంలో ఉన్నట్లుగానే, మనస్సాక్షి పూర్వకంగా చేసిన ఏ అనువాదంలోనైనా దేవుని పేరైన యెహోవా కనిపించాలని రేనా గుర్తించాడు. దైవ నామానికి బదులుగా “దేవుడు” లేక “ప్రభువు” వంటి బిరుదులను ఉపయోగించే వాడుకను ఆయన నిరాకరించాడు. తన అనువాదానికి వ్రాసిన ముందుమాటలో ఆయన తన కారణాలను ఇలా సూటిగా వివరించాడు.
“మేము గట్టి కారణాలు లేకుండా (యెహోవా) అనే పేరును ఉపయోగించడం లేదు. మొదటిగా, ఆ పేరు ఎక్కడెక్కడైతే మా అనువాదంలో కనిపిస్తుందో, అది హెబ్రీ పాఠ్యాంశంలోనూ కనిపిస్తుంది, పాఠ్యాంశంలోని దేనినీ తీసివేయడమూ, మార్చడమూ కూడదని చెప్పే దేవుని నియమాన్ని ఉల్లంఘించడమో లేక నమ్మకద్రోహమో చేయకుండా మేము దానిని వదిలిపెట్టడమో లేక మార్చడమో చేయలేమని మాకు అనిపించింది. . . . దేవుని పవిత్ర నామాన్ని గౌరవిస్తున్నామని చెబుతున్నా, దానిని మరుగు చేసి, దేని ద్వారా తాను మిగిలిన . . . దేవుళ్ళ నుండి వేరుగా గుర్తించబడాలని దేవుడు అనుకున్నాడో దానిని దేవుని ప్రజలు మరిచేలా చేసిన సాతాను తీసుకువచ్చిన ఆ [ఆ పేరును విడిచిపెట్టే] వాడుక ఆధునిక రబ్బీల మూఢ విశ్వాసంనుండి వచ్చింది.”
దేవుని నామాన్ని మహిమపరచాలన్న రేనా యొక్క ప్రశంసనీయమైన కోరికవల్ల విస్తృతమైన పరిణామాలకు కారణమయ్యింది. మన కాలం వరకు స్పానిష్ అనువాదకుల్లోని అధిక సంఖ్యాకులు అంటే, కాథోలిక్లు మరియు ప్రొటెస్టెంట్లు అన్నిచోట్ల దైవనామాన్ని ఉపయోగిస్తూ ఈ మాదిరిని అనుసరించారు. ముఖ్యంగా రేనా వల్లే, స్పానిష్ బైబిలు అనువాద పాఠకుల్లో దాదాపు అందరూ దేవునికి వ్యక్తిగత నామముందని, అది ఇతర దేవుళ్ళందరి నుండి ఆయనను వేరుగా చూపిస్తుందని వెంటనే గ్రహించగలుగుతున్నారు.
రేనా బైబిలు ముఖపత్రంపై హెబ్రీ భాషలో యెహోవా నామం స్పష్టంగా కనిపిస్తుందన్నది గమనార్హమైన వాస్తవం. కోట్లాదిమంది చదవగలిగే భాషలో దేవుని వాక్యాన్ని లభ్యం చేసి, దానిని కాపాడాలనే ఉన్నత లక్ష్యానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు.