కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 6/1 పేజీలు 20-24
  • నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నెదర్లాండులో పయినీర్‌ సేవ
  • మరిన్ని ఆధిక్యతలు
  • నాజీ అధికారము క్రింద
  • చెరసాలలు, నిర్బంధ శిబిరాలు
  • యుద్ధానంతర సేవా కార్యక్రమం
  • సత్యానికన్నా మిన్నయైనదేదీ లేదు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • నా బాల్యంనుండి యెహోవా కొరకు ఓర్పుతో కనిపెట్టుకుని ఉన్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ఓహ్‌, ఏమి తరగని విశ్వాసం!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “నాజీలు మమ్మల్ని ఆపలేకపోయారు!”
    తేజరిల్లు!—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 6/1 పేజీలు 20-24

నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను

మాక్స్‌ హెనిన్‌ చెప్పినది

అది 1993, అడాల్ఫ్‌ హిట్లర్‌ జర్మనీలో అప్పుడే అధికారానికి వచ్చాడు. అయినా బెర్లిన్‌లోని దాదాపు 500 మంది యెహోవాసాక్షులు ఏ మాత్రం భయపడలేదు. అనేకమంది యౌవనులు పయినీర్లు లేక పూర్తికాల పరిచారకులయ్యారు, మరి కొందరు ఇతర ఐరోపా దేశాల్లో సేవచేయడానికి కూడా అంగీకరించారు. నేను నా స్నేహితుడు వార్నర్‌ ఫ్లాటెన్‌ ఒకరితో ఒకరం, “సమయం వృథా చేస్తూ మనమెందుకుండాలి? మనం కూడా పయినీర్‌ సేవ ఎందుకు చేయకూడదు?” అని గట్టిగా అనుకునేవాళ్లము.

పందొమ్మిది వందల తొమ్మిదిలో నేను జన్మించిన ఎనిమిది రోజుల తర్వాత, ప్రేమగల నా పెంపుడు తలిదండ్రుల సంరక్షణలోనికి వచ్చాను. 1918లో మా మారుటి చిన్ని చెల్లి అకస్మాత్తుగా చనిపోయినప్పుడు మా కుటుంబమంతా దుఃఖంలో మునిగిపోయింది. ఆ తర్వాత కొద్ది కాలానికే, అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడే యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు మరియు మా పెంపుడు తలిదండ్రులు హృదయపూర్వకంగా బైబిలు సత్యాన్ని అంగీకరించారు. ఆత్మీయ సంగతులను ప్రశంసించడం వారు నాకు కూడా నేర్పారు.

నేను పాఠశాల విద్య ముగించి, ప్లంబర్‌ అయ్యాను. అయితే, మరి ముఖ్యంగా నేను ఆత్మీయంగా ఓ స్థానం తీసుకున్నాను. వార్నర్‌ నేను, 1933 మే 5న పయినీర్‌ సేవ ప్రారంభించాము. మేము బెర్లిన్‌కు 100 కిలోమీటర్ల దూరంలోగల ఓ పట్టణానికి సైకిలు మీద వెళ్లి అక్కడే రెండు వారాలపాటు ఉండి ప్రకటించేవాళ్లము. ఆ పిదప అవసరమైన పనులకొరకు బెర్లిన్‌ తిరిగి వచ్చేవాళ్లము. ఆ తర్వాత మరలా మరో రెండు వారముల కొరకు మా ప్రకటన ప్రాంతానికి తిరిగి వెళ్లేవాళ్లము.

వేరొక దేశంలో సేవ చేయడానికి మేము అడుగగా, మాకు అప్పటి యుగోస్లావియాలో సేవచేయడానికి 1933 డిశంబరులో మాకు నియామకం దొరికింది. అయితే, మేము అక్కడకు వెళ్లకముందే నెదర్లాండులోని ఉట్రెచ్‌కు మా నియామకం మార్చబడింది. ఆ తర్వాత కొద్దికాలానికే నేను బాప్తిస్మం పొందాను. ఆ రోజుల్లో బాప్తిస్మం అంతగా నొక్కిచెప్పబడేది కాదు, పరిచర్యే ప్రాముఖ్యమైనదిగా ఉండేది. యెహోవామీద ఆధారపడటం ఇప్పుడు నా జీవితంలో నిత్యకృత్యమైంది. బైబిలు కీర్తనల రచయిత యొక్క ఈ మాటలందు నాకెంతో ఓదార్పు లభించింది: “ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు.”—కీర్తన 54:4.

నెదర్లాండులో పయినీర్‌ సేవ

నెదర్లాండుకు వచ్చిన కొద్దికాలానికే, మేము రోటర్‌డామ్‌ నగరానికి తిరిగి నియమించబడ్డాము. మేము ఉన్న ఇల్లుగల వారి కుటుంబంలోని తండ్రి, కుమారుడు కూడా పయినీర్లే. ఆ తర్వాత కొద్ది నెలలకు, ఉట్రెచ్‌కు సమీపంలోని లీర్‌సమ్‌ పట్టణంలో పయినీర్ల కొరకు ఒక ఇల్లు కొనడం జరిగింది, వార్నర్‌ నేను అక్కడకు వెళ్లాము.

ఆ పయినీర్‌ గృహమందు నివసిస్తూనే మేము సైకిలుమీద దగ్గర్లోని ప్రాంతాలకు, ఏడుగురు కూర్చోగల కారును ఉపయోగించి దూరంగావున్న ప్రాంతాలకు వెళ్లేవాళ్లము. అప్పట్లో నెదర్లాండు మొత్తంలో వందమంది సాక్షులు మాత్రమే ఉండేవారు. మేము ఆ పయినీర్‌ గృహంనుండి సేవచేసిన ఆ ప్రాంతమందు నేడు, అంటే 60 సంవత్సరాల తర్వాత దాదాపు 50 సంఘాల్లో 4,000 కంటే ఎక్కువమంది ప్రచారకులున్నారు!

మేము ప్రతిరోజు పరిచర్యలో 14 గంటలపాటు కష్టపడి పనిచేసేవాళ్లం, అది మమ్మల్ని సంతోషంగా ఉంచింది. సాధ్యమైనంతమేరకు ఎక్కువగా సాహిత్యాలనందించడమే ముఖ్యగురిగా ఉండేది. మామూలుగా మేము రోజుకు 100 కంటే ఎక్కువే చిన్న పుస్తకాలను ఆసక్తిగలవారికి అందించేవాళ్లము. మేము క్రమంగా చేసే సేవలో పునర్దర్శనములు చేయడం, బైబిలు పఠనములు నిర్వహించడం అప్పట్లో లేదు.

ఒకరోజు నాతోటి భాగస్వామి నేను, ఫ్రాస్‌ వార్‌ అనే పట్టణంలో పనిచేస్తున్నాము. ఒక మిలటరీ కోట గుమ్మము వద్ద ఒక వ్యక్తికి అతడు సాక్ష్యమిస్తుండగా, నేను ఆ సమయంలో నా బైబిలు చదవడానికి ఉపయోగించాను. నేను ఆగకుండా వచనాల క్రింద ఎరుపు, నీలం రంగుల్లో గీతగీస్తూ పోయాను. ఆ ప్రక్కనే ఇంటికప్పు మీద పని చేస్తున్న వడ్రంగి ఆ తర్వాత, బహుశ మేము గూఢాచారులమేమోనని ఆ గుమ్మము దగ్గరి వ్యక్తిని హెచ్చరించాడు. దాని ఫలితంగా, నేను ఒక దుకాణదారునికి సాక్ష్యమిస్తుండగా ఆ రోజే అరెస్టు చేయబడ్డాను, నా బైబిలు జప్తు చేయబడింది.

నన్ను కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ నేను బైబిల్లో గుర్తుపెట్టిన గీతలు ఆ కోట బొమ్మ గీయడానికి చేసిన ప్రయత్నంగా ఆరోపణ చేశారు. నన్ను దోషిగా తీర్మానించి జడ్జి నాకు రెండు సంవత్సరాల జైలు శిక్ష వేశాడు. అయితే, ఆ కేసుకొరకు మరలా అప్పీలు చేసుకొనగా, నన్ను నిర్దోషిగా విడుదల చేశారు. విడుదల కావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది, గానీ నేను పెట్టిన గుర్తులుగల నా బైబిలు కూడా తిరిగి నాకివ్వడం నన్ను మరింత సంతోషపర్చింది!

1936 వేసవిలో పయినీర్‌ గృహంలోని మరో పయినీర్‌ అయిన రిచర్డ్‌ బ్రానిన్‌, నేను కలసి నెదర్లాండు ఉత్తర ప్రాంతంలో ప్రకటించాము. మొదటి నెలలో మేము పరిచర్యలో 240 గంటలు గడిపి, ఎన్నెన్నో సాహిత్యాలు అందించాము. మేము ఒక గుడారంలో ఉంటూ, బట్టలు ఉతుక్కోవడం, ఇస్త్రీ చేసుకోవడం, వంట చేసుకోవడం వంటి మాక్కావలసిన పనులన్నీ స్వయంగా చేసుకునేవాళ్లము.

ఆ తర్వాత నేను ఉత్తర నెదర్లాండులో అందరికి బాగా తెలిసిన, లైట్‌ బేరర్‌ అనే పేరుగల నావకు బదిలీ చేయబడ్డాను. ఆ నావలో ఐదుగురం పయినీర్లము ఉండేవాళ్లము, దానిద్వారా మేము దూరంగావున్న చిన్నచిన్న ప్రాంతాలను చేరుకోగల్గాము.

మరిన్ని ఆధిక్యతలు

అప్పట్లో జోన్‌ సేవకుడని పిలువబడే యెహోవాసాక్షుల ప్రాంతీయకాపరిగా 1938లో నేను నియమించబడ్డాను. కాబట్టి నేను లైట్‌ బేరర్‌ను విడిచిపెట్టి దక్షిణాది రాష్ట్రాల్లోని సంఘాల్ని, అక్కడక్కడ ఒంటరిగావున్న సాక్షులను సందర్శించడం మొదలుపెట్టాను.

ప్రయాణానికి మాకు సైకిలు మాత్రమే ఉండేది. ఆసక్తిగలవారి గుంపునుండి లేదా ఒక సంఘంనుండి మరొక దానికి ప్రయాణించడానికి తరచూ ఓ రోజంతా పట్టేది. నేను సందర్శించిన నగరాల్లో నేనిప్పుడు నివసించే బ్రెడా కూడా ఒకటి. ఆ కాలంలో, బ్రెడాలో సంఘమే లేదు, అక్కడ కేవలం ఇద్దరు వృద్ధ సాక్షులు ఉండేవారు.

లింబర్గ్‌లో సహోదరులకు సేవచేస్తుండగా, యోహాన్‌ పెపర్‌ అనే గని కార్మికుడు అడిగిన అనేక ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను ఆహ్వానింపబడ్డాను. ఆయన బైబిలు సత్యం కొరకు స్థిరమైన స్థానాన్ని తీసుకొని, ధైర్యంగల ప్రచారకుడయ్యాడు. నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన నిర్బంధ శిబిరంలో వేయబడగా, అక్కడాయన మూడున్నర సంవత్సరాలు గడిపాడు. విడుదలైన తర్వాత ఆయన ఆసక్తిగా ప్రకటించే పనిని మరలా చేపట్టాడు, నేడాయన ఇంకనూ ఒక నమ్మకమైన పెద్దగా ఉన్నాడు. లింబర్గ్‌లో 12 మంది ప్రచారకులుగల ఆ చిన్న సంఘం ఇప్పుడు, దాదాపు 1,550 మంది ప్రచారకులతో 17 సంఘాలుగా అభివృద్ధిచెందింది!

నాజీ అధికారము క్రింద

1940 మే నెలలో నాజీలు నెదర్లాండును ఆక్రమించారు. ఆమ్‌స్టెర్‌డమ్‌లోని వాచ్‌ టవర్‌ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి నన్ను నియమించారు. మేము మా పని అత్యంత జాగ్రత్తగా చేయాలి, అది మేము “నిజమైన స్నేహితుడు . . . దుర్దశలో . . . సహోదరుడుగా నుండును” అనే బైబిలు సామెతను ప్రశంసించేలా చేసింది. (సామెతలు 17:17) ఒత్తిడిగల ఈ కాలంలో వర్ధిల్లే మధురమైన సహజ బంధం నా ఆత్మీయ పురోభివృద్ధిపై బలమైన ముద్ర వేసింది, ఇంకనూ రానైయున్న కష్టకాలం కొరకు నన్ను సంసిద్ధుణ్ణి చేసింది.

సర్వసాధారణంగా కొరియర్స్‌ ద్వారా సంఘాలకు పంపే సాహిత్యాల బట్వాడాను పర్యవేక్షించే పని నాకు అప్పగింపబడింది. జర్మనీలో నిర్బంధ శ్రామికులుగా పనిచేసేందుకు గెస్టపో యువకులకొరకు తదేకంగా వెదకుతున్నందున కొరియర్లుగా మేము సహోదరీలనే ఉపయోగించేవాళ్లము. ఎప్పుడూ నొని అనే పేరుతో పిలువబడే విల్‌హెల్‌మినా హాగ్‌నుండి మా దగ్గరకు సకాలంలో పంపబడగా, నేనామెను అజ్ఞాతమందున్న మా బ్రాంచి అధ్యక్షుడైన ఆర్థర్‌వింక్లర్‌ దగ్గరకు తీసుకెళ్లాను. సాధ్యమైనంత గుప్తంగా ఉండేందుకు నేను డచ్‌ వ్యవసాయదారుని దుస్తులు, కర్ర బూట్లు అలా మిగతావన్నీ ధరించుకుని నొని నా వెంటరాగా స్ట్రీట్‌కారులో వెళ్లాను. అందరి కళ్లు నా మీదే ఉండేలా ఉన్న నా ఆకారం చూసి నవ్వాపుకోవడానికి ఆమెంత కష్టపడిందో ఆ తర్వాత నాకు తెల్సింది.

1941 అక్టోబరు 21న ఆమ్‌స్టెర్‌డమ్‌లో సాహిత్యాలు, పేపరు దాచివుంచిన స్థలం శత్రువులకు దొరికిపోయింది. గెస్టపో చేసిన ఆకస్మిక తనిఖీలో వింక్లర్‌, నొని అరెస్టయ్యారు. వారు చెరసాలకు పంపబడినప్పుడు, ఇద్దరు గెస్టపో ఏజంట్లు “నల్లని వెండ్రుకలుగల ఓ పొట్టి వ్యక్తిని” తాము వెంటాడినా వీధి జనంలో దొరక్కుండా పోయాడని వారు మాట్లాడుకోవడం విన్నారు. వారు మాట్లాడుకుంటున్నది నా గురించే, అందువల్ల వింక్లర్‌ ఈ సమాచారాన్ని సహోదరులకు ఎలాగో అందేలా చేశాడు. ఆ వెంటనే, నేను హాగ్‌కు వెళ్లిపోయాను.

ఈలోగా నొని చెరసాలనుండి విడుదలై పయినీర్‌ సేవకొరకు హాగ్‌కు తిరిగివచ్చింది. అక్కడ నేను ఆమెను తిరిగి కలుసుకున్నాను. అయితే రోటర్‌డామ్‌ సంఘసేవకుడు అరెస్టయినప్పుడు, ఆయన స్థానంలోకి నేను వెళ్లాను. ఆ తర్వాత, గోయడ సంఘసేవకుడు అరెస్టయ్యాడు, మరలా ఆయన స్థానానికి నేను వెళ్లాను. చివరకు, 1943న మార్చి 29, నేను పట్టుబడ్డాను. నేను మన బైబిలు సాహిత్యముల లెక్కచూస్తుండగా, గెస్టపో అక్కడికి ఆకస్మిక తనిఖికి వచ్చారు.

బల్లపై బైబిలు సాహిత్యాలు పరచియుండడమే కాకుండా, అక్కడే క్రైస్తవ సహోదర, సహోదరీల సంకేతభాషలోవున్న పేర్ల లిస్టుకూడా ఉంది. ప్రకటించడానికి ఇంకనూ స్వేచ్ఛ కలిగియున్న వారిని నేను కాపాడేందుకు నాకు ఒక మార్గం చూపమని వేదనతో యెహోవాకు ప్రార్థించాను. వారు కనిపెట్టేలోపే ఆ పేర్ల లిస్టుమీద నా అరచేతినుంచి దానిని అలాగే చేతిలోకి చుట్టేసాను. ఆ పిమ్మట టాయిలెట్‌కు వెళ్లడానికి అనుమతి తీసుకొని, అక్కడికెళ్లి టాయిలెట్‌లో దానిని పడవేసి నీళ్లు వదిలి అది కొట్టుకొని పోయేలా చేశాను.

అట్టి అతిక్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, గతమందు యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన విధానం మరియు విడుదల కొరకైన ఆయన వాగ్దానాల నుండి బలం పొందడాన్ని నేర్చుకున్నాను. నేను ఈ ప్రేరేపిత అభయాన్ని అన్ని సమయాల్లో గుర్తుంచుకున్నాను: “వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు.”—కీర్తన 124:2, 3.

చెరసాలలు, నిర్బంధ శిబిరాలు

నన్ను రోటర్‌డామ్‌ చెరసాలకు పంపారు, నా బైబిలు నాతో ఉన్నందుకు నేనెంతో కృతజ్ఞత కలిగియున్నాను. ఆలాగే నా దగ్గర సాల్వేషన్‌ పుస్తకం, చిల్డ్రన్‌ పుస్తకంలోని భాగాలు, ఈ సాహిత్యాలన్నింటిని చదివే బోల్డంత సమయం నాకుండింది. ఆరు నెలల తర్వాత నాకు తీవ్ర అస్వస్థత కలుగగా, నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. నేను చెరసాల విడిచివెళ్లక ముందు నేను నా పరుపు క్రింద సాహిత్యాలను దాచాను. నా సెల్‌కు మరోసాక్షిని, పియట్‌బ్రూట్జెస్‌ను మార్చగా, ఆయన ఆ సాహిత్యాలను కనుగొన్నాడని ఆ తర్వాత నాకు తెలిసింది. ఆ విధంగా విశ్వాసమందు ఇతరులు ఇంకను బలపడడానికి సాహిత్యాలు ఉపయోగపడ్డాయి.

కోలుకున్న తర్వాత నేను హాగ్‌లోని చెరసాలకు మార్చబడ్డాను. నేనక్కడ ఉండగా, నాజీ ఆక్రమణను వ్యతిరేకించినందున చెరసాలలో వేయబడిన న్యాయశాస్త్ర విద్యార్ధి లావో సి. వాండెర్‌టాస్‌ను కలుసుకున్నాను. ఆయన యెహోవాసాక్షులను గూర్చి ఎన్నడూ వినలేదు, గనుక ఆయనకు సాక్ష్యమిచ్చే అవకాశం నాకు కల్గింది. కొన్నిసార్లు ఆయన అర్ధరాత్రి నన్ను లేపి ప్రశ్నలు అడిగేవాడు. మా విశ్వాసాన్ని త్యజిస్తున్నామనే దస్తావేజు మీద సంతకం చేస్తే చాలు విడుదల కావచ్చునని తెలుసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఆయన సాక్షులను గూర్చిన తన మెప్పును దాచుకోలేకపోయాడు. యుద్ధం ముగిసిన తర్వాత, లావో న్యాయవాదియై ఆరాధనా స్వేచ్ఛ విషయమై వాచ్‌ టవర్‌ సొసైటీకి సంబంధించి అనేక న్యాయపరమైన కేసులకొరకు పోరాడాడు.

1944 ఏప్రిల్‌ 29న జర్మనీకి వెళ్లే రైలులో నన్ను ఎక్కించారు, అది మిక్కిలి బాధాకరంగా 18 రోజులు సాగిన ప్రయాణం. మే 18న నన్ను బుచెన్‌వాల్డ్‌ నిర్బంధ శిబిరంలో వేశారు. ఒక సంవత్సరం తర్వాత మిత్రపక్ష సైన్యాలు మమ్మల్ని విడుదల చేసేవరకు, జీవితం చెప్పనలవికానంత భయంకరంగా గడిచింది. వేలాదిమంది నా కళ్లముందే చంపబడ్డారు. దగ్గరలోనే యుద్ధసామాగ్రిని ఉత్పత్తి చేసే కర్మాగారంలో పనిచేయడానికి నేను నిరాకరించినందున, మురుగు కాల్వల్లోని పనికి నియమించబడ్డాను.

ఒకరోజు ఆ కర్మగారంమీద బాంబులదాడి జరిగింది. అనేకమంది రక్షణకొరకు బార్కాసుల్లోకి పరుగెత్తగా, మరితరులు అడవుల్లోకి పారిపోయారు. కొన్ని బాంబులు అడపాదడపా బార్కాసులమీద పడ్డాయి, అగ్ని బాంబులు అడవిని తగులబెట్టాయి. అది ఎంత భయంకరమైన దృశ్యమో! అనేకమంది సజీవ దహనమయ్యారు! నేను ఓ సురక్షిత స్థలంలో దాక్కుని, అగ్ని ఆరిపోయిన తర్వాత అసంఖ్యాకంగా పడివున్న శవాలన్ని దాటుతూ శిబిరానికి చేరుకున్నాను.

నాజీ విపత్కర భీకరకృత్యాలు ఈనాడు అనేకమందికి తెలుసు. గడచిన సంవత్సరాలన్నింటిలో ఆ భయంకర అనుభవాలు నా తలంపులను అణచివేయకుండా, నా ఆలోచనా సామర్థ్యమును బలపర్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞుడను. నా చెరసాల కాలాన్ని గూర్చి నేను ఆలోచించినప్పుడు, యెహోవా మహిమార్థమై ఆయనయెడల యథార్థత కాపాడుకొనిన ఆనందమే అత్యంత ఉన్నత భావంగా ఉంటుంది.—కీర్తన 124:6-8.

యుద్ధానంతర సేవా కార్యక్రమం

నేను విడుదలై ఆమ్‌స్టెర్‌డమ్‌కు తిరిగివచ్చిన తర్వాత, పని నియామకం కొరకు నేరుగా బ్రాంచి కార్యాలయమునకు రిపోర్టు చేశాను. నేను లేనికాలంలో ఏమి జరిగిందో వివరంగా తెలుసుకోవాలని ఉబలాటపడ్డాను. నొని అప్పటికే అక్కడ పని చేస్తోంది. యుద్ధకాలపు చివరి సంవత్సరంలో, సంఘాలకు బైబిలు సాహిత్యాలు బట్వాడా చేస్తూ ఆమె కొరియర్‌గా పనిచేసింది. అనేకమార్లు వెండ్రుకవాసిలో తప్పించుకున్నా ఆమె మరలా అరెస్టు చేయబడలేదు.

నేను హర్‌లెమ్‌లో కొద్దికాలం పయినీర్‌ సేవ చేశాను, అయితే సాహిత్య రవాణా విభాగంలో పనిచేసేందుకు ఆమ్‌స్టెర్‌డమ్‌ బ్రాంచికి వెళ్లవలసిందిగా 1946లో నన్ను అడిగారు. 1948 చివరిభాగంలో నేను, నొని వివాహం చేసుకుని కలిసి పయినీర్‌ సేవ చేయడానికి బ్రాంచి కార్యాలయం విడిచివెళ్లాము. అస్సెన్‌లో మేము పయినీర్లుగా నియామకం పొందాము. పన్నెండు సంవత్సరాల క్రితం రిచర్డ్‌ బ్రానింగ్‌ నేను గుడారంలో ఉంటూ వేసవిలో ప్రకటించాము. నిర్బంధ శిబిరానికి తీసుకువెళ్తూ మార్గమధ్యంలో రిచర్డ్‌ను కాల్చి చంపారని నాకు తెలిసింది.

నేను చెరసాలలో ఉన్న కాలంలో నా ఆరోగ్యం బాగాపాడైంది. బుచెన్‌వాల్డ్‌నుండి విడుదలైన ఆరు నెలల తర్వాత, నేను నాలుగు నెలలపాటు మంచం పట్టాను. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు, అంటే 1957లో నాకు క్షయ వచ్చి ఓ సంవత్సరం బాధపడ్డాను. నా శరీరం బలం కోల్పోయి నీరస పడింది, అయితే నా పయినీర్‌ స్ఫూర్తి ఇంకనూ బలంగా ఉంది. అస్వస్థతగా ఉన్నప్పుడు సాక్ష్యమిచ్చేందుకు నేను ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నా అస్వస్థతలు నేను పనిలేని ఒక రోగిగా ఊరకనే కూర్చోకుండా ఉండుటకు ఈ పయినీర్‌ స్ఫూర్తి ఓ ప్రాముఖ్యమైన కారకంగా నేను భావిస్తున్నాను. మా ఆరోగ్యం అనుమతించినంతవరకు నేను, నొని పూర్తికాల సేవకు హత్తుకొని ఉండాలని తీర్మానించుకున్నాము.

నాకు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, మేము బ్రెడా నగరానికి నియమించబడ్డాము. జోన్‌ సేవకునిగా నేను ఆ నగరాన్ని సందర్శంచి అప్పటికి 21 సంవత్సరాలయ్యింది. మేము 1959లో అక్కడికి వచ్చినప్పుడు, అక్కడ 34 మంది సాక్షులుగల ఒక చిన్న సంఘం ఉండేది. నేడు, 37 సంవత్సరాల తర్వాత, 500 మంది సాక్షులకు పైగాగల ఆరు సంఘాలుగా అది వృద్ధిచెందింది, వీరందరు మూడు రాజ్యమందిరాల్లో కూడుకుంటున్నారు! మా స్థానిక కూటాల్లో, సమావేశాల్లో మా కొద్ది ప్రయత్నాల ఫలితంగా బైబిలు సత్య జ్ఞానము పొందిన అనేకులను చూస్తున్నాము. “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు” అని వ్రాసిన అపొస్తలుడైన యోహానువలెనే మేము తరచు భావిస్తున్నాము.—3 యోహాను 4.

మేమిప్పుడు వృద్ధులమయ్యాము. నాకిప్పుడు 86, నొనికి 78, అయితే పయినీర్‌ సేవ ఆరోగ్యదాయకమైన వృత్తియనే నేను చెప్పాలి. నేను బ్రెడాలో ఉన్నదగ్గరనుండి, నేను చెరసాలలోవుండగా సోకిన అస్వస్థతలన్నింటిని నేను అధికమించాను. యెహోవా సేవలో నేనెన్నో ఫలవంతమైన సంవత్సరాలను కూడ ఆనందించాను.

అనేక సంవత్సరాల నమ్మకమైన సేవను ఒకసారి వెనుదిరిగి చూసుకోవడం మా ఇద్దరికి ఆనందపు ఊటగావుంది. మేము బ్రతికి ఉన్నంతకాలం యెహోవా సేవలో కొనసాగడానికి కావల్సిన స్ఫూర్తిని, బలాన్ని అనుగ్రహించాలని మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ‘ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, యెహోవాయే నా ప్రాణమును ఆదరించువాడు’ అని పలికిన కీర్తనల రచయిత మాటల్ని మేము మనసారా నమ్ముచున్నాము.—కీర్తన 54:4.

[23వ పేజీలోని చిత్రం]

1930వ దశకంలో పయినీర్‌ సేవ చేస్తుండగా ఉపయోగించిన గుడారం ప్రక్కనే మేము నిలబడ్డాము

[23వ పేజీలోని చిత్రం]

చెదిరియున్న ప్రాంతాల్ని చేరుకోవడానికి మేము ఉపయోగించిన నావ

[23వ పేజీలోని చిత్రం]

1957లో సమావేశ కార్యక్రమందు ఇంటర్వ్యూ చేయబడుట

[24వ పేజీలోని చిత్రం]

నేడు నా భార్యతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి