సర్ప సంతానం—ఎలా బయల్పరచబడింది?
“నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.”—ఆదికాండము 3:15.
1. (ఎ) యెహోవా ఎందుకు సంతోషించే దేవుడు? (బి) ఆయన ఆనందాన్ని మనం పంచుకొనగల్గేందుకు ఆయనేం చేశాడు?
యెహోవా సకారణంగానే సంతోషించు దేవుడు. ఆయన శ్రేష్ఠమైన వాటిని అనుగ్రహించడంలో గొప్పవాడు, ప్రథముడు మరియు ఆయన సంకల్పాన్ని నెరవేర్చకుండా ఆటంకపర్చగలిగేదేదీ లేదు. (యెషయా 55:10, 11; 1 తిమోతి 1:11; యాకోబు 1:17) తన ఆనందంలో తన సేవకులు భాగం వహించాలని ఆయన కోరుకుంటున్నాడు, అలా ఉండడానికి వారికి మంచి కారణాలను ఆయన దయచేస్తున్నాడు. ఆవిధంగా, మానవ చరిత్రలోని అత్యంత విచారకరమైన సంఘటనలలో ఒకటైన—ఏదెనులోని తిరుగుబాటు సమయంలో—ఆయన మనకు, నిరీక్షణతో భవిష్యత్తులోనికి తొంగి చూడడానికి ఆధారాన్ని ఇచ్చాడు.—రోమీయులు 8:19-21.
2. ఏదెనులోని తిరుగుబాటుదారులపై తీర్పును ప్రకటించినప్పుడు ఆదాము హవ్వల సంతానానికి యెహోవా నిరీక్షణాధారాన్ని ఎలా దయచేశాడు?
2 ఆత్మసంబంధమైన యెహోవా కుమారులలో ఒకడు దేవునిపై కొండెములు చెప్పడం, ఎదిరించడం ద్వారా తనకు తాను అపవాదియగు సాతానుగా చేసుకున్నాడు. మొదటి మానవులైన హవ్వ అటుతర్వాత ఆదాము అతని ప్రభావానికి గురై స్పష్టంగా చెప్పబడిన యెహోవా నియమాన్ని ఉల్లంఘించారు. వారికి తగినరీతిగానే మరణ శిక్ష విధించబడింది. (ఆదికాండము 3:1-24) అయినా, ఈ తిరుగుబాటుదారులపై తీర్పును ప్రకటించినప్పుడు, యెహోవా ఆదాము హవ్వల సంతానానికి నిరీక్షణాధారాన్ని ఇచ్చాడు. ఏ విధంగా? ఆదికాండము 3:15లో వ్రాయబడినట్లుగా యెహోవా ఇలా తెలియజేశాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” ఆ ప్రవచనం, యావత్తు బైబిలును అలాగే ఈ లోకం, యెహోవా సేవకులు ఇమిడివున్న గత సంఘటనలను ప్రస్తుత సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఒక కీలకం.
ప్రవచనం అర్థం ఏమిటి?
3. ఆదికాండము 3:15లో తెలియజేసినట్లుగా (ఎ) సర్పాన్ని (బి) స్త్రీని (సి) సర్ప ‘సంతానాన్ని’ (డి) స్త్రీ ‘సంతానాన్ని’ గుర్తించండి.
3 ఆ ప్రవచన ప్రాముఖ్యతను గుణగ్రహించడానికి దానిలోని వివిధ భాగాలను పరిశీలించండి. ఆదికాండము 3:15లో సంభోదింపబడినవాడు సాతాను—అల్పమైన పాము కాదుగాని దానిని ఉపయోగించుకున్న వాడే. (ప్రకటన 12:9) ఈ “స్త్రీ” హవ్వ కాదుగాని, భూమిపైనున్న యెహోవా ఆత్మాభిషిక్త క్రైస్తవుల తల్లియైన ఆయన పరలోక సంస్థ. (గలతీయులు 4:26) సాతాను సంతానమే సర్ప ‘సంతానం,’ అంటే సాతాను లక్షణాలను వ్యక్తపరుస్తున్న మరియు స్త్రీ ‘సంతానం’ ఎడల శత్రుత్వాన్ని చూపిస్తున్న దయ్యాలు, మానవులు అలాగే మానవ సంస్థలే అతని సంతానమని భావం. (యోహాను 15:19; 17:15) స్త్రీ “సంతానము” ప్రధానంగా యేసు క్రీస్తు. ఆయన సా.శ. 29లో పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ‘నీటిమూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించిన,’ క్రీస్తుతోపాటు పరలోక రాజ్య వారసులైన 1,44,000 మంది, ఆ వాగ్దాన సంతానపు ద్వితీయ భాగమైయున్నారు. వీరు సా.శ. 33 పెంతెకొస్తు నుండి స్త్రీ సంతానంలో చేరనారంభించారు.—యోహాను 3:3, 5; గలతీయులు 3:16, 29.
4. పాప మరణాల నుండి విడుదల పొందిన ప్రజలతో నింపబడిన పరదైసుగా భూమి మారడానికి ఆదికాండము 3:15 ఎలా సంబంధం కల్గివుంది?
4 ఏదెను వనంలోని అక్షరార్థమైన సర్పం, మానవజాతి పరదైసును కోల్పోయేలా మోసపూరితంగా నడిపించినవాని ప్రతినిధిగా ఉపయోగింపబడింది. సర్పాన్ని యుక్తిగా నడిపించినవాడు చితుకకొట్టబడే సమయాన్ని ఆదికాండము 3:15 సూచిస్తుంది. అప్పుడు పాప మరణాల్లేని పరదైసులో నివసించడానికి మరలా దేవుని సేవకులైన మానవులకు మార్గం తెరవబడుతుంది. అది ఎంతటి ఆనందభరితమైన సమయమో కదా!—ప్రకటన 20:1-3; 21:1-5
5. అపవాది ఆత్మీయ సంతానపు లక్షణాలేవి?
5 ఏదెనులోని తిరుగుబాటు తరువాత, అపవాదియైన సాతాను వ్యక్తపర్చిన లక్షణాలు అంటే యెహోవా చిత్తం ఎడల, యెహోవాను ఆరాధించే వారి ఎడల వ్యతిరేకతతో కూడిన తిరుగుబాటు, అబద్ధం, కొండెములు, నరహత్య వంటి లక్షణాలను వ్యక్తపరుస్తున్న వ్యక్తులు సంస్థలు కన్పించనారంభించాయి. ఆ లక్షణాలు అపవాది ఆత్మీయ పిల్లలను అంటే అతని సంతానాన్ని గుర్తించాయి. వీరిలో, కయీను ఆరాధనకు బదులు హేబెలు ఆరాధనపై యెహోవా అనుగ్రహాన్ని చూపినప్పుడు హేబెలును హత్య చేసిన కయీను ఉన్నాడు. (1 యోహాను 3:10-12) యెహోవా ఎదుట పరాక్రమంగల వేటగాడు మరియు పరిపాలకుడైన నిమ్రోదు ఉన్నాడు, అతని పేరుకు తిరుగుబాటుదారుడని అర్థం. (ఆదికాండము 10:9) అంతేగాకుండా, అబద్ధంమీద నిర్మింపబడిన ప్రభుత్వ ప్రాయోజిత మతాలతో, బబులోనుతోసహా ప్రాచీన రాజ్యాలు వరుసగా వచ్చాయి, ఇవి క్రూరంగా యెహోవా ఆరాధికులను హింసించాయి.—యిర్మీయా 50:29.
‘నీకును స్త్రీకిని మధ్య వైరము’
6. యెహోవా స్త్రీ ఎడల ఏయే రీతుల్లో సాతాను శత్రుత్వాన్ని చూపించాడు?
6 ఈ కాలాలన్నింటిలో, సర్పానికి, యెహోవా స్త్రీకి మధ్య అంటే అపవాదియైన సాతానుకు, నమ్మకమైన ఆత్మసంబంధ ప్రాణులుగల యెహోవా పరలోక సంస్థకు మధ్య శత్రుత్వం ఉంది. యెహోవాను నిందించడం ద్వారా, దేవదూతలు తమ స్థానాలను విడనాడడానికి పురికొల్పి యెహోవా పరలోక సంస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం ద్వారా సాతాను తన శతృత్వాన్ని చూపించాడు. (సామెతలు 27:11; యూదా 6) యెహోవా పంపించిన వార్తాహరులైన దేవదూతల విషయంలో జోక్యం చేసుకొన ప్రయత్నించడానికి సాతాను అతని దయ్యాలను ఉపయోగించినప్పుడు అది వ్యక్తపర్చబడింది. (దానియేలు 10:13, 14, 20, 21) మెస్సీయ రాజ్యం ఉద్భవించిన సమయంలోనే దానిని నాశనం చేయడానికి సాతాను ప్రయత్నం చేసిన ఈ 20వ శతాబ్దంలో అది స్పష్టంగా రుజువైంది.—ప్రకటన 12:1-4.
7. సూచనార్థక సర్పం ఎడల యెహోవా నమ్మకమైన దేవదూతలు ఎందుకు శత్రు భావాన్ని కల్గివున్నారు, అయినా వారు దానినెలా అణుచుకుంటున్నారు?
7 యెహోవా స్త్రీ అంటే నమ్మకమైన దేవదూతల సమూహం, సూచనార్థక సర్పం ఎడల కూడా శత్రుత్వాన్ని కల్గివుంది. దేవుని శ్రేష్ఠమైన నామంపై సాతాను కొండెములు చెప్పాడు; దేవదూతలతోపాటు దేవుని తెలివైన ప్రాణులలో ప్రతి ఒక్కరి యథార్థత విషయంలో అతడు సందేహాన్ని రేకెత్తించాడు, అతడు దేవుని ఎడల వారి యథార్థతను పాడుచేయడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నాడు. (ప్రకటన 12:4ఎ) నమ్మకమైన దేవదూతలు, కెరూబులు, సెరాపులు అపవాదియైన సాతానుగా తనను తాను చేసికొనినవాని ఎడల ఏహ్యభావాన్ని పెంచుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. అయినా, యెహోవా తాను నిర్ణయించిన కాలంలో, పంథాలో విషయాలను చేపట్టడానికి వారు ఆయనపై ఆనుకొన్నారు.—యూదా 9 పోల్చండి.
దేవుని స్త్రీ సంతానం ఎడల శతృత్వం
8. ఎవరి కోసం సాతాను వెదకజూస్తున్నాడు?
8 ఈ మధ్యకాలంలో, సర్పం తలను చితుకకొడతాడని యెహోవా ప్రవచించిన స్త్రీ సంతానం కోసం సాతాను జాగ్రత్తగా కనిపెట్టుకొనియున్నాడు. పరలోకం నుండి దేవదూతలు ఈయనే “రక్షకుడు . . . ప్రభువైన క్రీస్తు” అని బేత్లెహేములో జన్మించిన యేసును గురించి ప్రకటించినప్పుడు, ప్రవచింపబడిన స్త్రీ సంతానంగా కాబోయేవాడు ఈయనేనని బలంగా స్థిరపర్చబడింది.—లూకా 2:10, 11.
9. యేసు జన్మించిన తరువాత, సాతాను క్రూరమైన శత్రుత్వాన్ని ఎలా వ్యక్తపర్చాడు?
9 సాతాను అన్యులైన జ్యోతిశ్శాస్త్రజ్ఞులను ప్రయాణానికి పురికొల్పి వారిని మొదట యెరూషలేములోని రాజైన హేరోదు దగ్గరకు అటుతరువాత, బాలుడైన యేసు మరియు ఆయన తల్లియైన మరియ ఉన్న బేత్లెహేములోని ఇంటికి కొనిపోయినప్పుడే అతగాడి క్రూరమైన శత్రుత్వం వ్యక్తపర్చబడింది. అటుతరువాత త్వరలోనే రాజైన హేరోదు బేత్లెహేములోను దాని చుట్టుప్రక్కలనున్న రెండు సంవత్సరాలు మరియు అంతకన్నా తక్కువ వయస్సుగల పసి బాలురందరిని చంపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఈ విషయంలో, హేరోదు ఆ సంతానం ఎడల సాతాను చూపిన ద్వేషాన్నే చూపించాడు. మెస్సీయ కాబోయేవానిని చంపడానికి తాను ప్రయత్నిస్తున్నానని హేరోదుకు పూర్తిగా తెలుసు. (మత్తయి 2:1-6, 16) రాజైన హేరోదు నీతినియమాలులేనివాడని, కుటిలవర్తనుడని, హంతకుడని చరిత్ర నిర్దారిస్తోంది. అతడు నిజంగా సర్పసంతానంలోని వాడే.
10. (ఎ) యేసు బాప్తిస్మం తరువాత, వాగ్దాన సంతానం విషయంలో యెహోవా సంకల్పాన్ని ఆటంకపర్చడానికి సాతాను వ్యక్తిగతంగా ఎలా ప్రయత్నించాడు? (బి) తన గమ్యాలను నెరవేర్చుకోవడానికి సాతాను యూదా మతనాయకులను ఎలా ఉపయోగించాడు?
10 సా.శ. 29లో యేసు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన తరువాత, యెహోవా తన కుమారునిగా యేసుని గుర్తిస్తూ పరలోకం నుండి మాట్లాడిన తరువాత సాతాను స్వయంగా యేసును శోధించాలని పదేపదే ప్రయత్నించాడు, ఆవిధంగా తన కుమారుని విషయంలో యెహోవా సంకల్పాన్ని ఆటంకపర్చడానికి ప్రయత్నించాడు. (మత్తయి 4:1-10) ఆ విషయంలో విఫలుడైనందున, తన లక్ష్యాన్ని సాధించడానికి మానవ ప్రతినిధులను మరలా ఉపయోగించుకోవడానికి సాతాను పూనుకున్నాడు. యేసును అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నంగా అతడు ఉపయోగించిన వారిలో వేషధారులైన మత నాయకులు ఉన్నారు. సాతాను ఉపయోగించిన యుక్తుల్ని, అబద్ధాల్ని, కొండెములను వారు ఉపయోగించారు. పక్షవాతంగల ఒక వ్యక్తితో యేసు “ధైర్యముగా ఉండుము నీపాపములు క్షమింపబడియున్నవి” అని చెప్పినప్పుడు శాస్త్రులు ఆ మనుష్యుడు నిశ్చయంగా స్వస్థపర్చబడతాడో లేదో వేచి చూడకుండానే యేసును దేవ దూషకుడని ప్రకటించారు. (మత్తయి 9:2-7) యేసు విశ్రాంతి దినమున ప్రజలను స్వస్థపర్చినప్పుడు పరిసయ్యులు విశ్రాంతి నియమాన్ని ఉల్లంఘించినవానిగా ఆయనను తిరస్కరించి, ఆయనను చంపడానికి ఆలోచన చేశారు. (మత్తయి 12:9-14; యోహాను 5:1-18) యేసు దయ్యాలను వెళ్లగొట్టినప్పుడు పరిసయ్యులు “దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు”తో ఆయనకు సంబంధం ఉందని నిందించారు. (మత్తయి 12:22-24) మృతులలో నుండి లాజరు లేచిన తరువాత యేసునందు అనేకమంది ప్రజలు విశ్వాసం ఉంచినా, ప్రధాన యాజకులు పరిసయ్యులు మరలా ఆయనను చంపడానికి ఆలోచించారు.—యోహాను 11:47-53.
11. యేసు మరణానికి మూడు రోజులు ముందు ఆయన సర్పసంతానంలోని భాగంగా ఎవరిని గుర్తించాడు, ఎందుకు?
11 వారి పన్నుగడలన్నింటిని పూర్తిగా ఎరిగినప్పటికి, సా.శ. 33, నీసాను 11న, యేసు నిర్భయంగా యెరూషలేములోని ఆలయ ఆవరణలోనికి తిన్నగా వెళ్లాడు, అక్కడాయన వారిపై బహిరంగంగా తీర్పు ప్రకటించాడు. ఓ గుంపుగా శాస్త్రులు పరిసయ్యులు తామెలాంటి ప్రజలో పదేపదే చూపించుకున్నారు; అందుకే యేసు ఇలా చెప్పాడు: “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోక రాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించువారిని ప్రవేశింపనియ్యరు.” యేసు వారు సర్పసంతానంలోని భాగస్తులని సూటిగా ప్రకటిస్తూ ఇలా చెప్పాడు: “సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను (“గెహెన్నా తీర్పును,” NW) మీరెలాగు తప్పించుకొందురు?” (మత్తయి 23:13, 33) ఆయన పదజాలం ఆదికాండము 3:15లోని ప్రవచనాన్ని ప్రతిబింబిస్తుంది.
12, 13. (ఎ) తమ ఆత్మీయ తండ్రి ఎవరు అనే విషయానికి ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎలా సాక్ష్యమిచ్చారు? (బి) వారితో ఎవరు చేరారు? (సి) ఆదికాండము 3:15 నెరవేర్పులో స్త్రీ సంతానపు మడిమె ఎలా గాయపర్చబడింది?
12 యేసు మాటలను వినిన తర్వాత దయ చూపించమని దేవునిని వేడుకొనేందుకు వారు తమ హృదయాలను నలుగగొట్టుకున్నారా? తమ దుష్టత్వాన్నిబట్టి వారు పశ్చాత్తాపపడ్డారా? లేదు! ఆ మరుసటిరోజునే, ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో సమకూడి “ప్రధానయాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయననేలాగు [యేసును] పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొనుచుండిరి” అని మార్కు 14:1 తెలియజేస్తుంది. నరహంతకుడని యేసు మునుపు వర్ణించిన సాతాను యొక్క హత్యా ప్రవృత్తినే వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. (యోహాను 8:44) త్వరలోనే భ్రష్టుడయ్యేందుకు సాతాను పురికొల్పిన యూదా ఇస్కరియోతు వారితో చేరాడు. యూదా నిష్కళంకమైన దేవుని స్త్రీ సంతానాన్ని విడనాడి, సర్ప సంతానంలో చేరాడు.
13 నీసాను 14 వేకువజామున యూదా మతన్యాయస్థాన సభ్యులు, యేసును రోమా గవర్నరు ఎదుటకు ఒక ఖైదీగా తీసుకువచ్చారు. ఈసారి యేసును కొరతవేయాలని కేకలు వేయడంలో నాయకత్వాన్ని ప్రధాన యాజకులు తీసుకున్నారు. పిలాతు “మీ రాజును సిలువ వేయుదునా?” అని అడిగినప్పుడు “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని” జవాబిచ్చింది ప్రధాన యాజకులే. (యోహాను 19:6, 15) నిశ్చయంగా తాము సర్పసంతానంలోని భాగస్తులని అన్ని విషయాలలో వారు రుజువు చేసుకున్నారు. అయితే వారు మాత్రమే కాదు. మత్తయి 27:24, 25లోని ప్రేరేపిత వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “పిలాతు . . . నీళ్లు తీసికొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొనెను.” తరువాత “ప్రజలందరు—వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి.” ఆవిధంగా ఆ తరంలోని అనేకమంది యూదులు సర్పసంతానంలోని భాగస్తులుగా తమను తాము గుర్తింపజేసుకున్నారు. ఆ దినము ముగియక మునుపే యేసు మరణించాడు. తన దృశ్యమగు సంతానాన్ని ఉపయోగించడం ద్వారా సాతాను దేవుని స్త్రీ సంతానపు మడిమెపై కొట్టాడు.
14. స్త్రీ సంతాన మడిమెను గాయపర్చడం ఎందుకు సాతానుకు విజయమని భావం కాదు?
14 సాతాను విజయం సాధించాడా? ఎంతమాత్రం సాధించలేదు! యేసుక్రీస్తు లోకాన్ని దాని పాలకుడిని జయించాడు. (యోహాను 14:30, 31; 16:33) ఆయన మరణపర్యంతం యెహోవా ఎడల తన యథార్థతను కాపాడుకున్నాడు. ఒక పరిపూర్ణ మానవునిగా ఆయన మరణం, ఆదాము ద్వారా పోగొట్టుకొన్న జీవపు హక్కులను తిరిగి కొనడానికి కావాల్సిన విమోచన క్రయధనాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ ఏర్పాటు ఎడల విశ్వాసాన్ని చూపించి, దేవుని ఆజ్ఞలకు విధేయులయ్యేవారి కొరకు ఆయన నిరంతర జీవితానికి మార్గాన్ని తెరిచాడు. (మత్తయి 20:28; యోహాను 3:16) యెహోవా యేసుని పరలోకంలో అమర్త్యమైన జీవం పొందేలా మృతులలో నుండి లేపాడు. యెహోవా నిర్ణీత కాలంలో, యేసు సాతానుని ఉనికిలో లేకుండా చితకకొడతాడు. ఆదికాండము 22:16-18లో ఆ నమ్మకమైన సంతానం ద్వారా భూమిపైనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదింపజేసుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకొనే వారిపై యెహోవా తన కృపను చూపిస్తాడని ప్రవచించబడింది.
15. (ఎ) యేసు మరణం తర్వాత సర్పసంతానాన్ని బయల్పర్చడంలో ఆయన అపొస్తలులు ఎలా కొనసాగారు? (బి) మరే శత్రుత్వాన్ని సర్పసంతానం మన కాలం వరకు వ్యక్తపర్చింది?
15 యేసు మరణించిన తరువాత, ఆత్మాభిషిక్త క్రైస్తవులు తమ ప్రభువు బయల్పర్చినట్లుగానే సర్ప సంతానాన్ని వారూ బయల్పరుస్తూనే వచ్చారు. పరిశుద్ధాత్మచే ప్రేరేపింపబడినవాడై అపొస్తలుడైన పౌలు “సాతాను కనుపరచు బలమును అనుకరించి” ప్రత్యక్షమయ్యే ‘ధర్మవిరుద్ధ పురుషుని’ గురించి హెచ్చరించాడు. (2 థెస్సలొనీకయులు 2:3-10) ఈ సంయుక్త ‘పురుషుడు’ క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులని రుజువయ్యింది. సర్పసంతానం యేసు అనుచరులను కోపోద్రేకంతో హింసించింది. ప్రకటన 12:17లో వ్రాయబడిన ప్రవచనంలో దేవుని స్త్రీ సంతానంలో శేషింపబడినవారికి వ్యతిరేకంగా సాతాను మనకాలం వరకు యుద్ధాన్ని కొనసాగిస్తాడని అపొస్తలుడైన యోహాను ప్రవచించాడు. కచ్చితంగా జరిగిందదే. అనేక దేశాలలో యెహోవాసాక్షులు నిషేధింపబడుతున్నారు, దొమ్మికి గురౌతున్నారు, ఖైదు చేయబడుతున్నారు లేక దేవుని రాజ్యం ఎడల, ఆయన నీతియుక్తమైన మార్గాల ఎడల కల్గివున్న వారి స్థిరమైన స్థానాన్నిబట్టి నిర్బంధ శిబిరాల్లో వేయబడుతున్నారు.
ఆధునికకాలంలో సర్పసంతానం వెల్లడిచేయబడుట
16. ఆధునిక కాలాల్లో సర్పసంతానంలోని భాగంగా ఎవరు బయల్పర్చబడ్డారు, ఎలా?
16 యేసుక్రీస్తును అనుకరించుటలో, సర్పాన్ని, దాని సంతానాన్ని నిర్భయంగా బయల్పర్చడంలో నిజ క్రైస్తవులు వెనుదీయలేదు. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షులు మర్మము సమాప్తమాయెను (ఆంగ్లం) అనే పుస్తకాన్ని 1917లో ప్రచురించారు, అందులో వారు క్రైస్తవమత సామ్రాజ్య మతగురువుల వేషధారణను నిర్మొహమాటంగా బయల్పర్చారు. దీని తర్వాత 1924లో మత సంప్రదాయవాదుల నేరారోపణ (ఆంగ్లం) అనే పేరుగల తీర్మానం ముద్రించబడింది. అంతర్జాతీయంగా ఐదు కోట్ల ప్రతులు పంచిపెట్టబడ్డాయి. వాచ్‌టవర్ సొసైటీ అప్పటి అధ్యక్షుడు జె. ఎఫ్. రూథర్‌ఫర్డ్ 1937లో “బయల్పర్చబడుట,” “మతం, క్రైస్తవత్వం” అనే ప్రసంగాల్లో సాతాను సంతానాన్ని శక్తివంతంగా బయల్పర్చాడు. ఆ తరువాతి సంవత్సరం, ఇంగ్లాండులోని లండన్‌నుండి రేడియోటెలిఫోను ద్వారా “వాస్తవాల్ని ఎదుర్కోండి” అనే ప్రసంగాన్ని వివిధ దేశాల్లో జరిగిన 50 సమావేశాల్లోని శ్రోతలు వింటుండగా ఆయన ప్రసంగించాడు. ఒక నెల గడిచిన తరువాత, అమెరికాలోని విస్తృతమైన రేడియో నెట్‌వర్క్ “ఫాసిజమ్ లేదా స్వేచ్ఛ” అనే ప్రసంగాన్ని ప్రసారం చేసింది. శత్రువులు, మతం (ఆంగ్లం) వంటి పుస్తకాల్లో, వెల్లడిచేయబడుట (ఆంగ్లం) అనే చిన్న పుస్తకంలోనూ అదనంగా ఇవి శక్తివంతంగా బయల్పర్చబడ్డాయి. 1920 నుండి ప్రచురింపబడుతున్న వాటికి అనుగుణ్యంగా ఇప్పటికి 65 భాషల్లో ముద్రింపబడిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది!a అనే పుస్తకం, అవినీతిపరులైన రాజకీయ పరిపాలకులను అత్యాశపరులైన మరియు నీతినియమాలులేని వ్యాపారవేత్తలను సర్పసంతాన ప్రధాన దృశ్య సభ్యులుగా గుర్తించింది. తమ పౌరులను తప్పుద్రోవ పట్టించడానికి రాజకీయనాయకులు పదే పదే అబద్ధాలు ఆడడాన్ని అలవాటుగా చేసుకోవడాన్నిబట్టి, రక్తం యొక్క పవిత్రత ఎడల ఏవిధమైన గౌరవాన్ని చూపించకపోవడాన్నిబట్టి, యెహోవా సేవకులను బాధించడాన్నిబట్టి (అలా దేవుని స్త్రీ సంతానం ఎడల ద్వేషాన్ని చూపించడాన్నిబట్టి), వారు కచ్చితంగా సర్పసంతానంలోని భాగస్తులుగా తమ్మును తాము గుర్తింపజేసుకున్నారు. వాతవేయబడిన మనస్సాక్షి కలిగి ఆర్థికసంబంధమైన రాబడుల కొరకు అబద్ధాలాడే, రోగాలకు కారణమయ్యేవని తెలిసిన ఉత్పత్తులను తయారుచేసే లేక విక్రయించే వ్యాపారవేత్తల విషయంలోనూ ఇది నిజమే.
17. లోక విధానం నుండి బయటకు రాగల్గే ప్రముఖులైన వ్యక్తులకు ఇప్పటికీ ఏ అవకాశం తెరవబడివుంది?
17 ప్రపంచ మత రాజకీయాలు లేక వాణిజ్యంచే కళంకపర్చబడిన ప్రతి ఒక్కరూ సర్పసంతానంలోని భాగస్తులుగా పరిగణింపబడరు. సకాలంలో ఈ స్త్రీ పురుషులలో కొందరు యెహోవాసాక్షులను కొనియాడారు. వారికి సహాయపడడానికి వీరు తమ పలుకుబడిని ఉపయోగించారు, కొందరు సత్యారాధనను హత్తుకున్నారు. (అపొస్తలుల కార్యములు 13:7, 12; 17:32-34 పోల్చండి.) అటువంటి వారందరికీ ఈ ఆహ్వానం విస్తృతపర్చబడింది: “కాబట్టి రాజులారా, వివేకులై యుండుడి భూపతులారా, బోధనొందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును కుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.” (కీర్తన 2:10-12) నిశ్చయంగా, అవకాశమనే తలుపును యెహోవా ఆకస్మికంగా మూసివేయక మునుపే, ఆ పరలోక న్యాయాధిపతి అనుగ్రహాన్ని పొందాలని కోరుకొనే వారందరూ ఇప్పుడే ప్రతిస్పందించడం ప్రాముఖ్యం!
18. స్త్రీసంతానంలోని భాగంకాకపోయినప్పటికీ యెహోవా ఆరాధికులు ఎవరు?
18 పరలోక రాజ్యంగా సమకూర్చబడు వారు మాత్రమే స్త్రీ సంతానంలోని భాగస్తులౌతారు. వీరు సంఖ్యలో కొద్దిమందే. (ప్రకటన 7:4, 9) అయినా, గొప్ప సమూహములోని ఇతరులు ఉన్నారు, అవును, భూ పరదైసుపై నిత్యజీవం కొరకు ఎదురు చూస్తున్న యెహోవా ఆరాధికులైన వారు లక్షలాదిమందిగా ఉన్నారు. వారు మాటచేతను క్రియచేతను యెహోవా అభిషిక్తులతో, “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని చెప్పుదురు.”—జెకర్యా 8:23.
19. (ఎ) ప్రజలందరూ ఎలాంటి ఎంపిక చేసుకోవాలి? (బి) అవకాశం ఇంకనూ ఉన్నప్పుడే జ్ఞానయుక్తంగా ప్రవర్తించమనే ప్రాముఖ్యమైన ఆహ్వానం విశేషంగా ఎవరికి ఇవ్వబడింది?
19 యావత్ మానవజాతి నిర్ణయించుకోవాల్సిన సమయమిదే. యెహోవాను ఆరాధించాలని, ఆయన సర్వాధిపత్యాన్ని అంటిపెట్టుకోవాలని కోరుకుంటారా లేక సాతాను ప్రీతిపర్చే పనులను చేయడం ద్వారా అతడిని తమ పరిపాలకునిగా వారు అంగీకరిస్తారా? అన్ని జనాంగాల నుండి వచ్చిన దాదాపు 50 లక్షల మంది వ్యక్తులు రాజ్య వారసులైన స్త్రీ సంతానంలో శేషించినవారితో సహవసించడంలో యెహోవా పక్షంగా వారు స్థానాన్ని తీసుకున్నారు. ఎనభై లక్షల మందికి పైగా ఇతరులు వారితో బైబిలు పఠించడంలో లేక వారి కూటాలకు హజరౌతుండడంలో ఆసక్తిని చూపిస్తున్నారు. వీరందరికీ యెహోవాసాక్షులు ఇలా చెబుతున్నారు: అవకాశమనే ద్వారం ఇంకా తెరిచేవుంది. యెహోవా పక్షంగా మీ స్థానాన్ని సుస్పష్టంగా తీసుకోండి. వాగ్దాన సంతానంగా క్రీస్తుయేసుని గుర్తించండి. యెహోవా సంస్థతో ఆనందంగా సహవసించండి. రాజైన క్రీస్తు యేసు పరిపాలనద్వారా ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాలన్నింటిలో మీరు ఆనందాన్ని పంచుకొందురు గాక.
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించింది.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ ఆదికాండము 3:15లో తెలియజేసినట్లుగా సర్పం ఎవరు? స్త్రీ ఎవరు?
◻ సర్ప సంతాన లక్షణాలేమిటి?
◻ యేసు సర్పసంతానాన్ని ఎలా బయల్పర్చాడు?
◻ ఆధునిక కాలాల్లో సర్ప సంతానంలోని భాగంగా ఎవరు బయల్పర్చబడ్డారు?
◻ సర్పసంతానంతోపాటు గుర్తింపబడకుండేందుకు ఏ అత్యవసర చర్య అవసరం?
[10వ పేజీలోని చిత్రం]
వేషధారులైన మతనాయకులు సర్పసంతానంలోని భాగమని యేసు బయల్పర్చాడు