పాఠకుల నుండి ప్రశ్నలు
“మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని” యేసు చెప్పాడు. క్రైస్తవులు పాపములను క్షమించగలరని ఈ మాటల భావమా?
క్రైస్తవులందరూ, లేదా సంఘాల్లోని నియమిత పెద్దలు పాపాలను క్షమించే దైవిక అధికారాన్ని కలిగివున్నారనే నిర్ణయానికి రావడానికి లేఖనాధారమేమీ లేదు. అయినప్పటికి, పైన ఎత్తివ్రాయబడిన యోహాను 20:23 నందు యేసు తన శిష్యులకు చెప్పిన మాటలు ఈ విషయానికి సంబంధించి ప్రత్యేక అధికారాలను దేవుడు అపొస్తలులకు ఇచ్చాడని సూచిస్తున్నాయి. పరలోక తీర్మానాలను గూర్చి మత్తయి 18:18 నందు యేసు చెప్పినది ఆయనే చెప్పిన పై మాటలతో సంబంధం కలిగివుండవచ్చు.
ఎఫెసీయులు 4:32నందు “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి” అని వ్రాయబడిన అపొస్తలుడైన పౌలు ఉపదేశానికి అనుగుణ్యంగా క్రైస్తవులు కొన్ని తప్పిదాలను క్షమించగలరు. ఇక్కడ పౌలు తొందరపాటుతో మాట్లాడడం వంటి క్రైస్తవుల మధ్య కలిగే వ్యక్తిగత సమస్యలను గూర్చి మాట్లాడుతున్నాడు. వారు ఒకరినొకరు క్షమించుకుంటూ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. “నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము; అటుతరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము” అన్న యేసు మాటలను జ్ఞాపకం చేసుకోండి.—మత్తయి 5:23, 24; 1 పేతురు 4:8.
అయితే, యోహాను 20:23లోని సందర్భం సూచించేదేమంటే, ఈ ప్రత్యేకమైన శ్రోతలతో ఆయన చెప్పిన ఇతర విషయాల ద్వారా సూచించబడినట్లు, యేసు మరింత గంభీరమైన పాపాలను గూర్చి మాట్లాడుతున్నాడు. ఎందుకో చూద్దాం.
యేసు తాను పునరుత్థానం చేయబడిన రోజు యెరూషలేములో గడియవేసిన గదిలోవున్న శిష్యులకు కనిపించాడు. ఆ వృత్తాంతం ఈ విధంగా చెబుతుంది: “అప్పుడు యేసు—మరల మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది—పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.”—యోహాను 20:21-23.
బహుశ, పేర్కొనబడిన శిష్యులు ముఖ్యంగా నమ్మకస్థులైన అపొస్తలులై ఉంటారు. (24వ వచనం పోల్చండి.) యేసు వారిపై ఊది, “పరిశుద్ధాత్మను పొందుడి” అని చెప్పడం ద్వారా త్వరలోనే పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడుతుందని ప్రతీకాత్మక సూచనను యేసు వారికిచ్చాడు. పాపాలను క్షమించే విషయమై వారికి అధికారం ఉంటుందని యేసు చెప్పనారంభించాడు. సహేతుకంగా, ఆయన చెప్పిన రెండు విషయాలు, ఒకటి మరో దానికి నడుపుతూ ఒకదానికొకటి సంబంధం కలిగివున్నాయి.
తన పునరుత్థానం తరువాత యాభైరోజులకు, పెంతెకొస్తు దినాన, యేసు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. అది ఏమి సాధించింది? ఒకటేంటంటే, పరిశుద్ధాత్మను పొందినవారు పరలోకంలో క్రీస్తుతో సహపాలకులయ్యే నిరీక్షణతో దేవుని కుమారులుగా తిరిగి జన్మించారు. (యోహాను 3:3-5; రోమీయులు 8:15-17; 2 కొరింథీయులు 1:22) అయితే ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు మరి ఎక్కువే చేసింది. దానిని పొందిన కొందరు అద్భుతమైన శక్తులను పొందారు. దానిద్వారా కొందరు తమకు తెలియని అన్యభాషల్లో మాట్లాడగలిగారు. ఇతరులు ప్రవచించగలిగారు. అయితే మరితరులు రోగులను స్వస్థపరచగలిగారు, లేదా చనిపోయినవారిని లేపారు.—1 కొరింథీయులు 12:4-11.
యోహాను 20:22 నందలి యేసు మాటలు శిష్యులపై పరిశుద్ధాత్మ కుమ్మరించడాన్ని సూచించాయి కనుక, పరిశుద్ధాత్మ ప్రక్రియ ద్వారా పాపాలను క్షమించే లేదా నిలిచియుండనిచ్చే అసమానమైన అధికారం అపొస్తలులకు దైవికంగా ఇవ్వబడింది అన్నదే పాపాలను క్షమించడాన్ని గూర్చి ఆయన ముడిపెట్టిన మాటల భావమన్నట్లు అనిపిస్తుంది.—కావలికోట (ఆంగ్లం) మార్చి 1, 1949, పేజీ 78 చూడండి.
అపొస్తలులు అలాంటి అధికారాన్ని ఉపయోగించిన ప్రతి సందర్భం యొక్క పూర్ణ వృత్తాంతాన్ని బైబిలు ఇవ్వడం లేదు, లేదా అన్యభాషల్లో మాట్లాడేందుకు, ప్రవచించేందుకు, స్వస్థపరచేందుకు అద్భుత వరాన్ని ఉపయోగించిన ప్రతి సందర్భం అందులో వ్రాయబడలేదు.—2 కొరింథీయులు 12:12; గలతీయులు 3:5; హెబ్రీయులు 2:4.
పాపాలను క్షమించే లేదా నిలిపివుంచే అపొస్తలుల అధికారం ఇమిడివున్న ఒక వ్యవహారంలో ఆత్మతో అబద్ధమాడిన అననీయ, సప్పీరాలున్నారు. యోహాను 20:22, 23 నందు మనం చదివే యేసు మాటలను విన్న పేతురు అననీయ, సప్పీరాల తప్పిదాన్ని బయలుపరచాడు. పేతురు మొదట మాట్లాడిన అననీయ ఆ క్షణంలోనే చనిపోయాడు. తరువాత సప్పీరా లోపలికి వచ్చి, అబద్ధాన్ని దాచి ఉంచినప్పుడు, పేతురు ఆమెకు న్యాయవిధిని ప్రకటించాడు. పేతురు ఆమె పాపాన్ని క్షమించలేదు, కాని ఆమెతో ఈ విధంగా చెప్పాడు: ‘ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనేయున్నవి, వారు నిన్నును మోసికొనిపోవుదురు.’ ఆమె కూడా ఆ క్షణంలోనే చనిపోయింది.—అపొస్తలుల కార్యములు 5:1-11.
ఈ సందర్భంలో అపొస్తలుడైన పేతురు పాపం కచ్చితంగా నిలిచిపోతుందని, అననీయ సప్పీరాల పాపాన్ని దేవుడు క్షమించడనే అద్భుతమైన జ్ఞానాన్ని తెలియజేసేందుకు ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించాడు. క్రీస్తు బలి ఆధారంగా పాపాలు క్షమించబడ్డాయని తమకు రూఢివున్న వ్యవహారాల్లో కూడా అపొస్తలులు మానవాతీత అంతర్దృష్టిని కలిగివున్నట్లు కనబడ్డారు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందిన ఈ అపొస్తలులు పాపాల క్షమాపణను లేదా పాపాలు నిలిపివుంచబడడాన్ని ప్రకటించగలిగారు.a
ముందటి ఆత్మాభిషిక్త పెద్దలందరికీ అలాంటి అద్భుతమైన అధికారముండేదని చెప్పడం కాదిది. కొరింథీ సంఘంలో బహిష్కరించబడిన మనిషిని గురించి అపొస్తలుడైన పౌలు చెప్పినదాని నుండి మనం దానిని గ్రహించగలం. ‘నేనా వ్యక్తి పాపాలను క్షమించాను’ అని పౌలు అనలేదు, లేదా ‘ఆ మనిషి పరలోకంలో క్షమించబడ్డాడని నాకు తెలుసు, కనుక అతనిని తిరిగి స్వీకరించండి’ అని కూడా అనలేదు. అలా కాకుండా తిరిగి చేర్చుకోబడిన క్రైస్తవున్ని క్షమించి, అతని ఎడల ప్రేమను కనబరచాలని సంఘమంతటినీ పౌలు పురికొల్పాడు. “మీరు దేనిగూర్చియైనను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను” అని కూడా పౌలు చెప్పాడు.—2 కొరింథీయులు 2:5-11.
ఒకసారి ఆ వ్యక్తి సంఘంలోనికి తిరిగి చేర్చుకొనబడిన తరువాత, క్రైస్తవ సహోదర సహోదరీలందరూ ఆయన చేసినదానినిబట్టి కోపాన్నుంచుకోలేదనే భావంలో ఆయనను క్షమించగలరు. అయితే, మొదట ఆయన పశ్చాత్తాపపడి తిరిగి చేర్చుకోబడాలి. అదెలా జరుగుతుంది?
దొంగతనం, అబద్ధం, ఘోరమైన లైంగిక దుర్నీతి వంటి గంభీరమైన పాపాల విషయమై సంఘపెద్దలు వ్యవహరించవలసి ఉంటుంది. వారు అలాంటి తప్పిదస్థులను సరిదిద్ది, గద్దించి, పశ్చాత్తాపపడేందుకు వారిని పురికొల్పేందుకు ప్రయత్నించాలి. అయితే ఎవరైనా పశ్చాత్తాపం లేకుండా గంభీరమైన పాపాన్ని చేస్తూనే ఉన్నట్లయితే, ఈ పెద్దలు తప్పిదస్థున్ని బహిష్కరించేందుకు దైవిక నడిపింపును అన్వయించాలి. (1 కొరింథీయులు 5:1-5, 11-13) యోహాను 20:23 నందు యేసు చెప్పిన మాటలు ఇలాంటి వ్యవహారాలకు వర్తించవు. శారీరక రోగాన్ని స్వస్థపరచే లేదా చనిపోయినవారిని బ్రతికించే శక్తి వంటి అద్భుతమైన ఆత్మ వరాలు ఈ పెద్దలకు లేవు; ఆ వరాలు వాటి సంకల్పాలను మొదటి శతాబ్దంలో నెరవేర్చి ముగిశాయి. (1 కొరింథీయులు 13:8-10) అంతేకాక, ఒక గంభీర పాపి యెహోవా దృష్టిలో పరిశుద్ధుడు అని ప్రకటించే అర్థంలో గంభీరమైన తప్పిదాలను క్షమించే దైవిక అధికారం నేటి పెద్దలకు లేదు. ఈ రకం క్షమాపణ అనేది విమోచన క్రయధనంపై ఆధారపడి ఉండాలి, యెహోవా మాత్రమే ఆ ఆధారంపై క్షమించగలడు.—కీర్తన 32:5; మత్తయి 6:9, 12; 1 యోహాను 1:9.
ప్రాచీన కొరింథీలోని మనిషి వ్యవహారంలోలా, ఒక గంభీర పాపి పశ్చాత్తాపపడడానికి నిరాకరిస్తున్నప్పుడు, అతడిని బహిష్కరించాలి. అతడు తరువాత పశ్చాత్తాపపడినట్లయితే, పశ్చాత్తాపానికి తగ్గ ప్రవర్తన ఉన్నట్లయితే దైవిక క్షమాపణ అనేది సాధ్యమే. (అపొస్తలుల కార్యములు 26:20) అలాంటి పరిస్థితిలో, యెహోవా నిజంగా ఆ తప్పిదస్థున్ని క్షమించాడని నమ్మడానికి లేఖనాలు పెద్దలకు కారణాన్నిస్తాయి. అలాంటప్పుడు, ఒకసారి ఆ వ్యక్తి తిరిగి చేర్చుకోబడ్డాక, విశ్వాసంలో దృఢంగా అయ్యేందుకు పెద్దలు ఆత్మీయంగా అతనికి సహాయం చేయగలరు. బహిష్కరించబడిన వ్యక్తి తిరిగి చేర్చుకొనబడినప్పుడు కొరింథీ క్రైస్తవులు క్షమించినట్లే, సంఘంలో మిగిలినవారు కూడా క్షమించగలరు.
విషయాలతో ఈ విధంగా వ్యవహరించడంలో పెద్దలు తమ స్వంత తీర్పు ప్రమాణాలను తయారు చేసుకోకూడదు. వారు బైబిలు సూత్రాలను అన్వయించుకుని, యెహోవా తయారు చేసిన లేఖనాధార పద్ధతులను దగ్గరగా అనుసరించాలి. అలా, దేనినైనా క్షమించడం లేదా క్షమించకపోవడం అనేది మత్తయి 18:18 నందలి “భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని” యేసు చెప్పిన మాటల భావంలో అయి ఉంటుంది. బైబిలులో ఇవ్వబడిన ప్రకారం, వారు తీసుకునే చర్యలు విషయాలను గూర్చిన యెహోవా దృష్టిని ప్రతిఫలిస్తాయి.
ఫలితంగా, యోహాను 20:23 నందు వ్రాయబడిన యేసు చెప్పిన మాటలు మిగిలిన లేఖనాలకు విరుద్ధంగా లేవు, కాని శైశవ దశలోనున్న క్రైస్తవ సంఘంలో అపొస్తలుల ప్రత్యేక పాత్రకు అనుగుణంగా క్షమాపణకు సంబంధించి వారికి ప్రత్యేక అధికారముండినదని అది సూచిస్తుంది.
[అధస్సూచీలు]
a యేసు చనిపోయి, విమోచన క్రయధనాన్ని ఇవ్వకముందు కూడా ఒకరి పాపాలు క్షమించబడ్డాయని చెప్పే అధికారం ఆయనకుండింది.—మత్తయి 9:2-6; కావలికోట జూన్ 1, 1995లోని “పాఠకుల నుండి ప్రశ్నలు” పోల్చండి.