రోగుల హక్కులు గౌరవించబడ్డాయి
‘రక్తం లేకుండా నేను ఈ శస్త్రచికిత్సను చేసే మార్గమేమీ లేదు. మీకు శస్త్రచికిత్స కావాలంటే, మీరు నా చికిత్సా పద్ధతికి సమ్మతించాలి. లేకపోతే, మీరు ఇంకొక వైద్యున్ని వెదుక్కోవాలి.’
వైద్యుని మాటలు థాయ్‌లాండ్‌లో నివసించే యెహోవాసాక్షియైన జెంగ్ సే జూ విశ్వాసాన్ని కదిలించలేదు. మెనింజియోమా అనే ఒక రకమైన మెదడు కంతి ఉన్నట్లు వ్యాధి నిర్ధారణ చేయబడిన జెంగ్‌కు అత్యవసరంగా శస్త్రచికిత్స అవసరమైయుంది. కానీ ఆమె “రక్తమును . . . విసర్జింపవలెను” అనే బైబిలు ఆజ్ఞను పాటించాలన్న కృతనిశ్చయంతో ఉంది.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
జెంగ్, సాధ్యమైతే తన స్వదేశంలో చికిత్సపొందాలని ఇష్టపడుతూ మరితర రెండు ఆసుపత్రులను సందర్శించింది. అక్కడ కూడా నిరాశే ఎదురైంది, వైద్యులు రక్తం లేకుండా శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించారు. చివరికి జెంగ్ థాయ్‌లాండ్‌లోని ఆసుపత్రి సమాచార విభాగం (హెచ్.ఐ.ఎస్.) ద్వారా టోక్యో మహిళా కళాశాల వారి నాడీమండల సంబంధ సంస్థను సంప్రదించింది. ఆ ఆసుపత్రి రేడియేషన్ చికిత్సలో వినూత్న పద్ధతులలో ఒకటైన గామా నైఫ్‌ను ఉపయోగించి 200 కంటే ఎక్కువ మంది మెదడు-కంతి రోగులకు చికిత్స చేసింది.
జెంగ్ ఆ ఆసుపత్రి దగ్గరలో నివసిస్తున్న జపాను సాక్షులతో ఉండేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. థాయ్ మాట్లాడే ఇద్దరు సాక్షులు మరియు ఒక హెచ్.ఐ.ఎస్. ప్రతినిధి కూడా ఉన్న ఒక గుంపు విమానాశ్రయం వద్ద ఆమెను కలిసింది. ఒక వారం రోజుల పరీక్షల అనంతరం జెంగ్ ఆసుపత్రిలో చేర్చబడింది, అక్కడ ఆమె గామా నైఫ్‌తో చికిత్స పొందింది. ఆ ప్రక్రియ దాదాపు గంటసేపు మాత్రమే కొనసాగింది. జెంగ్, ఆ తరువాతి రోజు ఆసుపత్రి నుండి బయటికి వచ్చి, దాని తరువాతి రోజు థాయ్‌లాండ్‌కు తిరుగు ప్రయాణమయ్యింది.
“ఈ ఏర్పాటు ద్వారా ఇంత సహాయం లభిస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు” అని జెంగ్ అంటుంది. “సంబంధిత అనేక పక్షాల మధ్యనున్న సహకారాన్ని, చూపించబడిన ప్రేమనుబట్టి నేను నిజంగా ముగ్ధురాలినయ్యాను.”
ఈ వార్తాంశాన్ని నివేదిస్తూ, జపాన్ వార్తా పత్రిక మైనీచీ షీంబన్ ఇలా వ్యాఖ్యానించింది: “ఇప్పటివరకు రక్తమార్పిడులను వ్యతిరేకించడానికి మతసంబంధ కారణాలు ఉన్నతపరచబడ్డాయి. అయినా, రక్తమార్పిడులు ఎయిడ్స్, హెపటైటిస్ సి వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం, మరియు ఎలర్జీల వంటి సైడ్ ఎఫెక్టులు కలిగి ఉంటాయి. ఈ కారణం వల్ల తమ మత విశ్వాసాలు ఏమైనప్పటికి రక్తమార్పిడులు వద్దనుకునే రోగులున్నారు.”
ఆ వార్తాపత్రిక ఇంకా ఇలా తెలియజేసింది: “రక్తమార్పిడులు తిరస్కరించిన అనేకమంది రోగులు ఆసుపత్రులను మారేలా బలవంతపెట్టబడ్డారు, కానీ రోగి చిత్తాన్ని గౌరవించేలా వైద్య సంస్థలవైపునుండి కొంత మార్పు రావాల్సిన అవసరత ఉంది. సమ్మతి తెలియజేయడం (దానిలో ఏమి ఇమిడి ఉందన్న దాని పూర్తి వివరణ ఒక రోగి పొందడం అటుతరువాత చికిత్సకు ఒప్పుకోవడం) అవసరం, మరి రక్తమార్పిడులు దీనికి మినహాయింపు కాదు. ఇది కేవలం ఒక్క మతం ఇమిడివున్న వివాదాంశం కాదు అని గుర్తించబడాలి.”
జెంగ్ సే జూ వలెనే రక్తరహిత చికిత్సను ఇష్టపడే అనేకమంది ఇతర ఆసుపత్రులకు మారవలసి వస్తుంది. అయినాగాని, తమ రోగుల హక్కులను గౌరవించడానికి ఇష్టపడే వైద్యుల ప్రయత్నాలను వారు మెచ్చుకుంటారు.
వాచ్ టవర్ సొసైటీ బ్రాంచీలలో యెహోవాసాక్షులచే నెలకొల్పబడిన ఆసుపత్రి సమాచార విభాగం, తమ విశ్వాసాలను గౌరవించే వైద్యుల సహకారం కొరకు వెదుకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హెచ్.ఐ.ఎస్. ఆసుపత్రులు, వైద్యులు, ఆరోగ్య పరిరక్షణ కార్యకర్తలు, న్యాయవాదులు, మరియు న్యాయమూర్తులతో సహకార సంబంధాలను నెలకొల్పడానికి పనిచేస్తుంది.