అంతియొకయలోని థీయోఫలస్ ఎవరు?
“క్రైస్తవుడనే పేరును ధరించడం ఎంతో హీనమైనదన్నట్లుగా మీరు నన్ను ఆ పేరుపెట్టి పిలుస్తున్నారు, నేనైతే నేను క్రైస్తవుడిననే ప్రకటించుకుంటున్నాను, దేవున్ని సేవించదగినవాడనని ఆశిస్తూ దేవునికిష్టమైన వాడినయ్యేందుకు ఈ నామాన్ని ధరిస్తున్నాను.”
థీయోఫలస్ టు ఆటోలకస్ అనే పేరుగల మూడు భాగాలు గల తన రచనను థీయోఫలస్ పైవిధంగా ఆరంభించాడు. రెండవ శతాబ్దంలోని మతభ్రష్టత్వానికి వ్యతిరేకమైన ఆయన ప్రతివాదనకు అది నాంది. థీయోఫలస్ తనను తాను క్రీస్తు అనుచరుడని ధైర్యంగా తెలుపుతున్నాడు. గ్రీకుభాషలో తన పేరుకు గల అర్థానికి అనుగుణ్యంగా “దేవునికి ప్రియమైన”వానిగా అయ్యేందుకు తన కార్యాలను నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తుంది. థీయోఫలస్ ఎవరు? ఆయన ఎప్పుడు జీవించాడు? ఆయన దేనిని సాధించాడు?
వ్యక్తిగత చరిత్ర
థీయోఫలస్ వ్యక్తిగత చరిత్ర గురించి కొంతే తెలుసు. ఆయనను క్రైస్తవేతర తలిదండ్రులు పెంచారు. తరువాత థీయోఫలస్ క్రైస్తవత్వంలోనికి మారాడు, అదైనా లేఖనాలను జాగ్రత్తగా పఠించిన తరువాతే. నేడు టర్కీలోని అంటాక్యా అని పిలువబడే సిరియన్ అంతియొకయ సంఘంలో ఆయన బిషప్ అయ్యాడు.
యేసు ఆజ్ఞకు అనుగుణ్యంగా, మొదటి శతాబ్దపు క్రైస్తవులు అంతియొకయలోని ప్రజల మధ్య ప్రకటించారు. లూకా వారి సఫలతను గూర్చి ఈ విధంగా చెబుతూ వ్రాశాడు: “ప్రభువు [“యెహోవా,” NW] హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి.” (అపొస్తలుల కార్యములు 11:20, 21) దైవిక నడిపింపు ప్రకారం, యేసుక్రీస్తు అనుచరులు క్రైస్తవులని పిలువబడ్డారు. ఈ పదం మొదట సిరియా అంతియొకయలో అన్వయించబడింది. (అపొస్తలుల కార్యములు 11:26) సా.శ. మొదటి శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు సిరియన్ అంతియొకయకు ప్రయాణం చేశాడు, అది ఆయన పరిచర్యకు నాంది అయ్యింది. యోహాను మార్కుతో కలిసి బర్నబా మరియు పౌలు మొదటి మిషనరీ యాత్రను అంతియొకయ నుండి ప్రారంభించారు.
అంతియొకయలోని తొలి క్రైస్తవులు తమ నగరాన్ని అపొస్తలులు సందర్శించడంతో ఎంతో ప్రోత్సహించబడి ఉంటారు. దేవుని వాక్య సత్యంవైపుకు వారు ఉత్సాహంగా ప్రతిస్పందించడం నిస్సందేహంగా విశ్వాసాన్ని బలపరచే పరిపాలకసభ యొక్క మొదటి శతాబ్దపు ప్రతినిధుల సందర్శన ఫలితమే. (అపొస్తలుల కార్యములు 11:22, 23) అంతియొకయలోని చాలామంది నివాసులు యెహోవా దేవునికి తమ జీవితాలను సమర్పించుకోవడాన్ని చూడడం వారికెంత ప్రోత్సహకరంగా ఉండివుండవచ్చు! అయితే, ఇది జరిగిన 100 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత థీయోఫలస్ అంతియొకయలో జీవించాడు.
క్రీస్తు అపొస్తలుల కాలం నుండి లెక్కబెడితే థీయోఫలస్ అంతియొకయలోని ఆరవ బిషప్పు అని చరిత్రకారుడైన యూసీబియస్ చెప్పాడు. భిన్నమతావలంబనకు వ్యతిరేకంగా చెప్పుకోదగినన్ని మౌఖిక చర్చలను ప్రతివాదనలను థీయోఫలస్ తన రచనల్లో చేర్చాడు. తన కాలంలో క్రైస్తవత్వాన్ని సమర్థించిన 12 మందిలో లేదా అంతకన్నా ఎక్కువ మందిలో ఆయన చేర్చబడ్డాడు.
ఆయన రచనలను ఒకసారి పరికించడం
థీయోఫలస్ క్రితం జరిగిన సంభాషణకు ప్రతిస్పందిస్తూ, “మనస్సు చెడిన నీచులకు అనర్గళంగా మాట్లాడే నాలుక, ఇంపైన మాటలు ఆహ్లాదాన్నిస్తాయి, ప్రశంసనిస్తాయి” అనే ప్రారంభ మాటలతో అన్యమతస్థుడైన ఆటోలకస్కు వ్రాస్తున్నాడు. “సత్య ప్రేమికుడు సొగసైన మాటలకు శ్రద్ధనివ్వడు, కాని మాటల్లోని అసలు విషయాన్ని పరిశీలిస్తాడు . . . సుత్తితో కొట్టబడి పోతపోయబడి చెక్కబడి నిలబెట్టబడిన చూడలేని, వినలేని కొయ్య, రాతి విగ్రహాలైన మానవ హస్తకృత్యములైన దేవుళ్ళను గూర్చి గొప్పలు చెబుతూ పనికిరాని మాటలతో మీరు నాపై దాడి చేశారు” అని థీయోఫలస్ వివరించాడు.—కీర్తన 115:4-8 పోల్చండి.
విగ్రహారాధనయనే మిథ్యను థీయోఫలస్ బట్టబయలు చేశాడు. ఆయన తన సహజమైన రచనాశైలిలో, తన వాక్పటిమను అమితంగా ప్రయోగించినప్పటికీ సత్య దేవుని నిజమైన స్వభావాన్ని గూర్చి చెప్పేందుకు ప్రయత్నించాడు. ఆయన ఈ విధంగా ప్రకటించాడు: “దేవుని రూపం మాటల్లో చెప్పలేనిది, వర్ణనాతీతమైనది, మానవ నేత్రములతో చూడలేనిది. ఆయన మహిమ గ్రహించలేనిది, గొప్పతనం లెక్కించశక్యం కానిది, ఔన్నత్యం అనూహ్యమైనది, శక్తి పోల్చలేనిది, జ్ఞానం చేరుకోలేనిది, మంచితనం సాటిలేనిది, దయాళుత్వం వర్ణించలేనిది.”
దేవుని గూర్చిన ఈ వివరణకు ఇంకాస్త జతచేస్తూ థీయోఫలస్ ఇలా చెబుతున్నాడు: “అయితే ఆయన ప్రభువు, ఎలాగంటే, ఆయన విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు; తండ్రి, ఎలాగంటే, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు; నిర్మాణకుడు, రూపకర్త, ఎలాగంటే, ఆయన విశ్వసృష్టికర్త, అన్నింటినీ చేసినవాడు; అత్యున్నతుడు, ఎలాగంటే, ఆయన అందరికంటే ఉన్నతుడు; సర్వశక్తిమంతుడు, ఎలాగంటే, ఆయనే అందరినీ పరిపాలించి, చేరదీసుకునేవాడు.”
తర్వాత, దేవుడు సాధించిన ప్రత్యేకమైన కొన్నింటిపై శ్రద్ధ కేంద్రీకరిస్తూ, థీయోఫలస్ తన సహజమైన, సంపూర్ణమైన పునరుక్తం చేసే శైలిలో ఇలా చెబుతున్నాడు: “ఆకాశములు ఆయన పని, భూమి ఆయన సృష్టి, సముద్రం ఆయన హస్తకృత్యం; మానవుడు ఆయన నిర్మాణం, ఆయన ప్రతిరూపం; మానవున్ని సేవించి, అతనికి సేవకులుగా ఉండేందుకు, సూచనలు, రుతువులు, రోజులు, సంవత్సరాల కొరకు నిర్మించబడిన సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన సృష్టి; దేవుడు తన పనుల ద్వారా తన గొప్పతనాన్ని తెలియజేసేందుకు, అర్థమయ్యేలా చేసేందుకు అన్నింటినీ, అవి ఉనికిలోనే లేకుండగానే ఉనికిలోకి వచ్చేలా సృష్టించాడు.”
తన కాలం నాటి అబద్ధ దేవుళ్ళపై థీయోఫలస్ చేసిన దాడికి మరో ఉదాహరణను ఆటోలకస్కు ఆయన వ్రాసిన ఈ మాటల్లో గమనించవచ్చు: “మీరు ఆరాధిస్తున్నారని మీరు చెబుతున్నవాటి పేర్లు మృతుల పేర్లు. . . . వాళ్ళు ఎలాంటి మనుష్యులు? సాటర్న్ తన స్వంత పిల్లలను చంపి మ్రింగిన నరమాంసభక్షి కాడా? ఆయన కుమారుడైన జూపిటర్ విషయం చెబితే, . . . అతడు మేక చనుపాలను త్రాగిన విధానం . . . రక్త సంబంధంగలవారితో లైంగిక సంబంధం, వ్యభిచారం, కామం వంటి అతని ఇతర చర్యలు . . .”
తన వాదనను పొడిగిస్తూ థీయోఫలస్ అన్యమతస్థుల విగ్రహారాధనను గూర్చిన తన దృక్పథాన్ని నొక్కిచెప్పాడు. “ఐగుప్తీయులు ఆరాధించిన అనేక జంతువులను గూర్చి, అంటే సరీసృపాలను గూర్చి, పశువులను గూర్చి, క్రూర మృగాలను గూర్చి, పక్షులను గూర్చి, నది చేపలను గూర్చి నేనింకా ఎక్కువగా చెప్పాలా . . . గ్రీకులు మరితర దేశస్థులు రాళ్ళను, కొయ్యను, వేరే రకాల భౌతిక వస్తువులను ఆరాధిస్తారు” అని ఆయన వ్రాస్తున్నాడు. “కాని దేవున్ని, సజీవుడును సత్యవంతుడునైన దేవున్ని నేను ఆరాధిస్తాను” అని థీయోఫలస్ ప్రకటిస్తున్నాడు.—2 సమూయేలు 22:47; అపొస్తలుల కార్యములు 14:15; రోమీయులు 1:22, 23.
విలువైన సాక్ష్యం
ఆటోలకస్ది తప్పని వాదించే థీయోఫలస్ వ్రాసిన మూడు భాగాల రచనలోని ఉపదేశాలు, ఉద్బోధలు బహుముఖమైనవి, వివరణాత్మకమైనవి. థీయోఫలస్ యొక్క ఇతర రచనలు హర్మజనస్ మరియు మార్సియోన్లకు వ్యతిరేకంగా వ్రాయబడ్డాయి. సువార్తలపై వ్యాఖ్యానాలను చేర్చుతూ ఉపదేశ పుస్తకాలను మరియు జ్ఞానాభివృద్ధిని కలిగించే పుస్తకాలను కూడా ఆయన వ్రాశాడు. అయితే, ఆటోలకస్కు వ్రాసిన మూడు పుస్తకాల ఒక వ్రాతప్రతి మాత్రమే భద్రం చేయబడింది.
మొదటి పుస్తకం క్రైస్తవ మతాన్ని సమర్థిస్తూ ఆటోలకస్కు వ్రాసిన ప్రతివాదన. ఆటోలకస్కు వ్రాసిన రెండవ పుస్తకం ప్రఖ్యాతిగాంచిన అన్య మతాలకు, కల్పితాలకు, తత్వశాస్త్రజ్ఞులకు మరియు కవులకు వ్యతిరేకంగా వాదిస్తుంది. థీయోఫలస్ యొక్క మూడవ పుస్తకంలో అన్యమతాల సాహిత్యం లేఖనాలతో పోల్చిచూడబడింది.
థీయోఫలస్ యొక్క మూడవ పుస్తకారంభంలో ఆటోలకస్ ఇప్పటికీ సత్యవాక్యాన్ని గూర్చి కల్పిత కథయనే దృక్పథంతోనే ఉన్నట్లు స్పష్టమవుతుంది. “మీరు మూఢులను సంతోషంగా భరిస్తారు. లేకపోతే మీరు అర్థశూన్యమైన మాటలకు ప్రభావితులయ్యేలా, ప్రబలివున్న వదంతిని నమ్మేలా తెలివిలేని మనుష్యులచేత పురికొల్పబడేవారు కాదు” అని చెబుతూ థీయోఫలస్ ఆటోలకస్ను విమర్శించాడు.
“ప్రబలివున్న వదంతి” ఏమిటి? థీయోఫలస్ దాని మూలాన్ని బట్టబయలు చేశాడు. అపవాదకులు “దైవ భక్తి లేని పెదవులతో మాపై అబద్ధారోపణ చేస్తారు, మా భార్యలు అందరి సొత్తయి ఉన్నారని, లైంగిక సంబంధం కోసం పంచుకుంటున్నామని దేవుని ఆరాధికులైన, క్రైస్తవులమని పిలువబడేవారునైన [మాపై] రుజువు లేకుండానే నేరారోపణ చేస్తున్నారు; మేము మా స్వంత సహోదరీలతో జారత్వం చేస్తున్నామని, అందరికీ ఎంతో అసహ్యమును, అనాగరికమునైన పనిని చేస్తున్నామని అంటే నర మాంసాన్ని మేము భక్షిస్తున్నామని ఆరోపిస్తున్నారు.” రెండవ శతాబ్దంలో క్రైస్తవులని చెప్పుకుంటున్నవారిని గూర్చిన అన్యమతస్థుల ఏ మాత్రం వాస్తవం కాని దృక్పథానికి వ్యతిరేకంగా పోరాడేందుకు థీయోఫలస్ కృషి సల్పాడు. దైవ ప్రేరేపిత వాక్యంలో ఉన్న సత్యపు వెలుగును ఆయన ఉపయోగించాడు.—మత్తయి 5:11, 12.
హెబ్రీ మరియు గ్రీకు బైబిలు పాఠ్య భాగాలను థీయోఫలస్ తరచూ ఉపయోగించడం, వాటిని సూచించడం ఆయనకున్న దేవుని వాక్య పరిచయానికి నిదర్శనాన్నిస్తున్నాయి. సువార్తల తొలి వ్యాఖ్యాతల్లో ఆయన ఒకడు. లేఖనాలకు థీయోఫలస్ చెప్పిన ఉల్లేఖనాలు ఆయన కాలంలోని ప్రబలివున్న ఆలోచనా విధానంలోనికి కావలసినంత అంతర్దృష్టినిస్తాయి. ప్రేరేపిత వ్రాతల్లో తనకున్న పరిచయాన్ని అవి అన్యమత తత్వశాస్త్రంకన్నా ఎంత ఉన్నతమైనవో చూపించడానికి ఆయన ఉపయోగించాడు.
థీయోఫలస్ రచనా కూర్పు, అయన బోధించే శైలి, పునరుద్ఘాటనా శైలి కొందరికే ఆకర్షణీయంగా ఉండవచ్చు. ప్రవచించబడిన మతభ్రష్టత్వం ఆయన అభిప్రాయాల కచ్చితత్వాన్ని ఎంతమేరకు ప్రభావితం చేసి ఉంటాయో మనమిప్పుడు చెప్పలేం. (2 థెస్సలొనీకయులు 2:3-12) అయినప్పటికి, థీయోఫలస్ తాను చనిపోయేనాటికి, అంటే దాదాపు సా.శ. 182 నాటికి నిర్విరామంగా క్రైస్తవత్వాన్ని సమర్థించేవ్యక్తి అయ్యాడు, ఆయన రచనలు మన ఆధునిక యుగంలోని యథార్థ క్రైస్తవులకు ఆసక్తికరమైనవి.
[30వ పేజీలోని చిత్రం]
ఆటోలకస్ వాదనలు తప్పని థీయోఫలస్ ధైర్యంగా నిరూపించాడు
[28వ పేజీలోని చిత్రసౌజన్యం]
Illustrations on pages 28 and 30 reproduced from Illustrirte Pracht - Bibel/Heilige Schrift des Alten und Neuen Testaments, nach der deutschen Uebersetzung D. Martin Luther’s