కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 2/1 పేజీలు 27-31
  • ఎన్నడూ మరణించకపోవడం—నా జీవితాంత కోరిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎన్నడూ మరణించకపోవడం—నా జీవితాంత కోరిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రెజ్‌ ఎందుకు మరణించాడు?
  • బైబిలు సత్యాన్ని హత్తుకోవడం
  • ప్రకటనా పనిని సంస్థీకరించడం
  • యుద్ధ సమయంలోని అనుభవాలు
  • విశ్వాస పరీక్షలను తాళుకొనడం
  • భవిష్యత్తును నమ్మకంతో ఎదుర్కోవడం
  • దీనులను యెహోవా సత్యంవైపు ఆకర్షిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • సరైన ఎంపికలు చిరకాల ఆశీర్వాదాలను తెచ్చాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఎనిమిదిమంది పిల్లలను యెహోవా మార్గాల్లో పెంచడం కష్టమైనా ఆనందదాయకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 2/1 పేజీలు 27-31

ఎన్నడూ మరణించకపోవడం—నా జీవితాంత కోరిక

హెక్టర్‌ ఆర్‌. ప్రీస్ట్‌ ద్వారా

“క్యాన్సర్‌కు చికిత్సలేదు, మీ కొరకు మేము చేయగలిగినదేమీ లేదు” అని వైద్యుడు చెప్పాడు. దాదాపు పది సంవత్సరాల క్రితం ఆ రోగ నిర్ధారణ జరిగింది. అయినప్పటికీ ఎన్నడూ మరణించకుండా భూమిపై నిరంతరం జీవించడాన్ని గూర్చిన బైబిలు ఆధారిత నిరీక్షణను నేను ఇప్పటికీ కలిగివున్నాను.—యోహాను 11:26.

మా తలిదండ్రులు, మా కుటుంబ పొలానికి దగ్గరలోవున్న, ఒక చిన్న పట్టణంలోని చర్చికి క్రమంగా వెళ్లే యథార్థపరులైన మెథడిస్టువారు. న్యూజీలాండులోని వెల్లింగ్టన్‌కు 130 కిలోమీటర్లు ఈశాన్యంగా ఉన్న అందమైన పొలాలుగల వైరారాప లోయలో నేను జన్మించాను. అక్కడ, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్వచ్ఛమైన పర్వత నదులు, కదిలే అలలవంటి ఆకృతిగల కొండలు, సారవంతమైన మైదానాలు వంటివాటితో కూడిన దృశ్యాలను చూసి మేము ఆనందించేవాళ్లం.

మెథడిస్టు చర్చిలో, మంచి వాళ్లందరూ పరలోకానికి వెళతారని చెడ్డవాళ్లు నరకానికి అంటే అగ్నితో హింసింపబడే స్థలానికి వెళతారని మాకు బోధింపబడింది. మానవులు పరలోకంలో జీవించాలన్నది దేవుని చిత్తమైతే, మరి ఆయన వారిని మొదట్లోనే అక్కడ ఎందుకు ఉంచలేదన్నది నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఎప్పుడూ మరణమంటే భయముండేది, మనమెందుకు మరణించాలి అని నేను తరచూ ఆలోచించేవాన్ని. 1927లో, నాకు 16 సంవత్సరాలున్నప్పుడు, మా కుటుంబం ఒక దుఃఖకరమైన సంఘటనను ఎదుర్కొంది. అదే, నేను నా ప్రశ్నలకు సమాధానాల కొరకు అన్వేషించడానికి కారణమయ్యింది.

రెజ్‌ ఎందుకు మరణించాడు?

నా తమ్ముడు 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతడు తీవ్రంగా అస్వస్థుడయ్యాడు. అతడికి ఏమైందో వైద్యుడు నిర్ధారించలేకపోయాడు కాబట్టి అతనికి ఏ సహాయం చేయలేకపోయాడు. అమ్మ మెథడిస్టు పరిచారకున్ని పిలిపించింది. అతడు రెజ్‌ కొరకు ప్రార్థించాడు, కాని ఇది అమ్మను ఓదార్చలేకపోయింది. వాస్తవానికి, ఆ పరిచారకుని ప్రార్థనలు ప్రభావహీనంగా ఉన్నాయని ఆమె ఆ పరిచారకునికి చెప్పింది.

రెజ్‌ మరణించినప్పుడు, తన చిన్న కుమారుడు ఎందుకు మరణించవలసి వచ్చిందనే దానికి సంబంధించిన నిజమైన సమాధానాల కొరకైన తన తృష్ణను తీర్చుకోవడానికి అమ్మ ఎవరితోనైనా మరియు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడేది. పట్టణంలోవున్న ఒక వ్యాపారితో మాట్లాడేటప్పుడు, మృతుల పరిస్థితి గురించి అతనికేమైనా తెలుసా అని ఆమె అతన్ని అడిగింది. అతనికేమీ తెలియదు, కాని అతనిలా చెప్పాడు: “ఎవరో ఒక పుస్తకం ఇచ్చారు, అది మీరు తీసుకోవచ్చు.”

అమ్మ ఆ పుస్తకాన్ని ఇంటికి తెచ్చి, దాన్ని చదవడం మొదలుపెట్టింది. ఆమె దాన్ని మధ్యలో ఆపలేకపోయింది. మెల్లిగా ఆమె పూర్తి ప్రవృత్తి మారిపోయింది. ఆమె కుటుంబంతో ఇలా చెప్పింది, “ఇదే, ఇదే సత్యం.” ఆ పుస్తకం లేఖనాల్లో అధ్యయనాలు (ఆంగ్లం) యొక్క మొదటి సంపుటియైన యుగాల కొరకైన దైవిక పథకం. మొదట్లో నేను సంశయాస్పదంగా ఉండి, సృష్టికర్త యొక్క సంకల్పం గురించి ఆ పుస్తకం అందజేస్తున్న దానికి వ్యతిరేకంగా వాదించడానికి ప్రయత్నించాను. చివరికి నా వాదనలు ఆగిపోయాయి.

బైబిలు సత్యాన్ని హత్తుకోవడం

నేనిలా అనుకున్నాను, ‘ఎన్నడూ మరణించనవసరం లేకుండా, నిరంతరం జీవించడం గురించి ఊహించండి!’ ప్రేమగల దేవుని నుండి ఎవరైనా ఎదురు చూసేది అలాంటి నిరీక్షణనే. పరదైసు భూమి! అవును, ఇది నా కొరకే.

ఈ అద్భుతమైన సత్యాలను నేర్చుకున్న తర్వాత, అమ్మ మరియు వెల్లింగ్టన్‌ నుండి వచ్చిన—సహోదరీలు థాంప్సన్‌, బార్టన్‌, జోన్స్‌—అనే ముగ్గురు క్రైస్తవ సహోదరీలు గ్రామీణ ప్రాంతాల్లో రాజ్య విత్తనాలను అన్ని వైపులా వెదజల్లడానికి ఒక్కోసారి కొన్ని రోజులపాటు వెళ్లేవారు. నాన్నకు అమ్మకున్నలాంటి మిషనరీ స్ఫూర్తి లేకపోయినప్పటికీ, ఆయన ఆమె పనిలో ఆమెను సమర్థించేవాడు.

ఇదే సత్యమని నాకు రూఢీ అయ్యింది, కాని కొంత కాలం వరకు నేను నా నమ్మకాలకు అనుగుణ్యంగా జీవించలేదు. 1935లో నేను రోయీన కార్‌లెట్‌ను వివాహం చేసుకున్నాను, కొంతకాలానికి మాకు ఈనెడ్‌ మరియు బారీ అంటే ఒక పాప ఒక బాబు కలిగారు. నేను చుట్టుప్రక్కలనున్న రైతుల నుండి వేలాది పశువులను కొంటూ, పశువుల వ్యాపారిగా పనిచేసేవాన్ని. ఈ రైతులు రాజకీయాల గురించి చర్చించేటప్పుడు, నేను వారికిలా చెప్పినప్పుడు నాకెంతో ఆనందంగా ఉండేది: “మనుష్యులు చేస్తున్న ఈ ప్రయత్నాలేవి విజయవంతం కావు. దేవుని రాజ్యం ఒక్కటే పనిచేయగల ప్రభుత్వం.”

దుఃఖకరంగా, నేను పొగాకుకు అలవాటు పడ్డాను; నేను ఎల్లప్పుడూ నోట్లో చుట్ట పెట్టుకొనేవాన్ని. కొంతకాలానికి నా ఆరోగ్యం క్షీణించిపోయింది, బాధాకరమైన కడుపు నొప్పులతో నేను ఆసుపత్రి పాలయ్యాను. నేను పొగ త్రాగడం మూలంగా ఏర్పడిన తీవ్రమైన గాస్ట్రోఎంట్రైటిస్‌ నాకు ఉందని చెప్పారు. నేను ఆ అలవాటును మానుకున్నప్పటికీ, నేను నిరంతరం ఉండే చుట్ట లేక సిగరెట్‌ త్రాగుతున్నట్లు కలగనడం నాకు అసాధారణమేమీ కాదు. పొగాకు ఎంతటి ఘోరమైన వ్యసనం కాగలదోకదా!

పొగాకును విడిచిపెట్టిన తర్వాత, నేను ఇతర ప్రాముఖ్యమైన మార్పులు చేసుకున్నాను. 1939లో, నాకు 28 సంవత్సరాలున్నప్పుడు, ఆ దేశంలో మా ఇంటి దగ్గరున్న మాంగటాయ్‌ నదిలో నేను బాప్తిస్మం పొందాను. న్యూజీలాండ్‌లో ఆ తర్వాత ప్రకటనా పనిని పర్యవేక్షిస్తుండిన రాబర్ట్‌ లేజెన్‌బీ, మా ఇంట్లో ప్రసంగం ఇచ్చి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి వెల్లింగ్టన్‌ అంత దూరం నుండి ప్రయాణించి వచ్చాడు. అప్పటి నుండి, నేను యెహోవా యొక్క ధైర్యవంతమైన సాక్షినయ్యాను.

ప్రకటనా పనిని సంస్థీకరించడం

నేను బాప్తిస్మం పొందిన తర్వాత, ఎకటాహూన సంఘంలో అధ్యక్షునిగా నియమించబడ్డాను. నా భార్య రోయీన, అప్పటికింకా బైబిలు సత్యాన్ని హత్తుకోలేదు. అయితే, ఇంటింటి సేవలో సరైన విధంగా ఎలా సాక్ష్యమివ్వాలో నాకు చూపించడానికి పాహియాట్యు నుండి ఇక్కడికి రమ్మని ఆల్ఫ్‌ బ్యాంట్‌ను నేను ఆహ్వానించబోతున్నానని ఆమెకు చెప్పాను. ప్రకటనా పనిని సంస్థీకరించి, మా ప్రాంతాన్ని క్రమబద్ధంగా పూర్తి చేయాలని నేను కోరుకున్నాను.

రోయీన ఇలా చెప్పింది: “హెక్టర్‌, నీవు ఇంటింట సాక్ష్యమివ్వడానికి వెళ్లితే, నీవు తిరిగి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఇక్కడ ఇంటి వద్ద నీ కుటుంబాన్ని చూసుకోవలసిన బాధ్యత నీకుంది.”

ఏమి చేయాలో నాకర్థం కాలేదు. నేను సంకోచంగానే, బట్టలు వేసుకుని తయారయ్యాను. ‘నేను అది చేయవలసిందే’ అని నేను నాలోనేనే ఆలోచించుకున్నాను. ‘నా జీవితం, నా కుటుంబం యొక్క జీవితాలు దానిపై ఆధారపడి ఉంటాయి.’ కాబట్టి ఆమెను ఏ విధంగాను బాధపెట్టడం నా ఉద్దేశం కాదని నేను రోయీనకు అభయమిచ్చాను. నేను ఆమెను ఎంతో ప్రేమిస్తున్నానని, కాని యెహోవా నామం మరియు సర్వోన్నతాధిపత్యం, అలాగే మన స్వంత జీవితాలు దానిలో ఇమిడి ఉన్నాయి గనుక నేను మాత్రం ఇలా ప్రకటించవలసిందేనని ఆమెకు చెప్పాను.

నేను ఆల్ఫ్‌ మొదటి ఇంటి వద్దకు వెళ్లాము, ఆయన మొదట మాట్లాడాడు. కాని తర్వాత నేను సంభాషణలో జోక్యం చేసుకుంటూ, నోవహు దినాల్లో జరిగిన దానికి మన దినాల్లో జరుగుతున్నది సారూప్యంగా ఉందని, మన రక్షణను నిశ్చయపర్చుకోవడానికి మనం కొంత చేయవలసి ఉంటుందని నేను గృహస్థునికి చెప్పాను. (మత్తయి 24:37-39) అక్కడ నేను కొన్ని చిన్న పుస్తకాలు ఇచ్చాను.

మేము అక్కడనుండి వచ్చాక, ఆల్ఫ్‌ ఇలా చెప్పాడు: “నీకు ఆ జ్ఞానమంతా ఎక్కడి నుండి వచ్చింది? నేను నీకు అవసరం లేదు. నీవు నీ స్వంతగా చెయ్యి, మనం రెండింతలు ప్రాంతాన్ని ముగించగలుగుతాము.” కాబట్టి మేమలాగే చేశాము.

మేము ఇంటికి తిరిగి వస్తుండగా, మా కొరకు ఏమి వేచి ఉందో నాకు తెలియదు. నాకు ఆశ్చర్యానందాలు కలిగేలా, రోయీన మా కొరకు టీ సిద్ధంగా ఉంచింది. ఒక పదిహేను రోజుల తర్వాత నా భార్య నాతోపాటు బహిరంగ పరిచర్యలో భాగం వహించింది, అలా క్రైస్తవ ఆసక్తి విషయంలో మంచి మాదిరి అయ్యింది.

పొలాలు గల మా లోయలో యెహోవాసాక్షులైన మొదటి వారిలో మాడ్‌ మాన్‌సర్‌, ఆమె కుమారుడు విలియమ్‌, కుమార్తె రూబి ఉన్నారు. మాడ్‌ భర్త పైకి కనిపించేలా దురుసు ప్రవర్తన గల మనిషి. మాడ్‌ను పరిచర్య కొరకు తీసుకువెళ్లాలని ఒక రోజు నేనూ రోయీన వాళ్ల పొలానికి వెళ్లాము. యౌవనుడైన విలియమ్‌ మేము తన కారును ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేశాడు, కాని ఆయన తండ్రికి వేరే ఉద్దేశాలు ఉండినవి.

పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మా చిన్న కుమార్తె ఇనెడ్‌ను ఎత్తుకోమని నేను రోయీనకు చెప్పాను. నేను విలియమ్‌ కారులోకి ఎక్కి, మేము బయటికి వచ్చే లోపలే గరాజ్‌ తలుపు మూయడానికి మిస్టర్‌ మాన్‌సర్‌ ప్రయత్నించేలోగా నేను కారును వేగంగా గరాజ్‌లో నుండి బయటికి తీసుకురావడంతో ఆయన విఫలమయ్యాడు. కొంత దూరం వెళ్లాక మేము ఆగాము, ఆగ్రహంతో మండిపడుతున్న మిస్టర్‌ మాన్‌సర్‌ను కలవడానికి నేను కారు దిగాను. ఆయనతో నేనిలా చెప్పాను: “మేము ప్రాంతీయ పరిచర్యకు వెళ్లుతున్నాము, మిసెస్‌ మాన్‌సర్‌ మాతో వస్తుంది.” నేను అతనిని వేడుకున్నాను దానితో అతని కోపం కొంతమేరకు తగ్గింది. నేను గతం గురించి తలంచినప్పుడు, నేను ఆ పరిస్థితితో మరో విధంగా వ్యవహరించి ఉంటే బాగుండునని అనుకుంటాను, అతడు ఎన్నడూ సాక్షికాకపోయినప్పటికీ, ఆ తర్వాత అతడు యెహోవాసాక్షుల ఎడల మరింత అనుకూలంగా తయారయ్యాడు.

ఆ సంవత్సరాల్లో యెహోవా ప్రజలు కొద్దిమంది మాత్రమే ఉండేవారు, మా పొలంలో మాతోపాటు కలిసివుండిన పూర్తికాల పరిచారకుల దర్శనాల మూలంగా మేము నిజంగా ఎంతో ఆనందించాము మరియు ప్రయోజనం పొందాము. ఈ సందర్శకుల్లో ఆడ్రియన్‌ థాంప్సన్‌ మరియు ఆయన సహోదరి మోలీ ఉన్నారు, వీళ్లిద్దరూ కూడా మిషనరీల కొరకైన వాచ్‌టవర్‌ బైబిల్‌ గిలియడ్‌ పాఠశాల యొక్క తొలి తరగతులకు హాజరై, జపాన్‌ మరియు పాకిస్థాన్‌లలో విదేశీ నియామకాల్లో సేవచేశారు.

యుద్ధ సమయంలోని అనుభవాలు

1939 సెప్టెంబరులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యింది, 1940 అక్టోబరులో న్యూజీలాండ్‌ ప్రభుత్వం యెహోవాసాక్షుల పనిని నిషేధించింది. అనేకమంది మన క్రైస్తవ సహోదరులు ఆ దేశంలోని కోర్టుల ముందు బలవంతంగా హాజరుపర్చబడ్డారు. కొంతమంది వర్క్‌కాంపుల్లో వేయబడి, తమ భార్యా పిల్లల నుండి దూరం చేయబడ్డారు. యుద్ధం తీవ్రతరమౌతుండగా, మాకు పాడికేంద్రం ఉన్నప్పటికీ నన్ను సైనిక సేవ కొరకు పిలుస్తారేమో అనుకున్నాను. ఆ తర్వాత, సైనిక సేవ కొరకు ఇక రైతులు తమ పొలాల నుండి తీసుకొనబడరనే ప్రకటన వెలువడింది.

రోయీన నేను మా క్రైస్తవ పరిచర్యలో కొనసాగాము, ఒక్కొక్కరం నెలకు 60 గంటల చొప్పున ప్రకటనాపనిలో గడిపేవాళ్లం. ఈ సమయంలో, తమ క్రైస్తవ తటస్థతను కాపాడుకుంటున్న యౌవనస్థులైన సాక్షులకు సహాయం చేసే ఆధిక్యత నాకు లభించింది. వారి తరపున నేను వెల్లింగ్టన్‌, పాల్‌మర్‌స్టన్‌ నార్త్‌, పాహియాట్యు, మాస్టర్‌టన్‌ కోర్టుల ముందు హాజరయ్యాను. పరిశీలనా బృందంలో సాధారణంగా ఒక మత నాయకుడు ఉండేవాడు, యుద్ధ కార్యకలాపాలకు వారు ఇస్తున్న క్రైస్తవ వ్యతిరేక మద్దతును బయల్పర్చడం ఒక ఆనందంగా ఉండేది.—1 యోహాను 3:10-12.

ఒక రాత్రి నేనూ రోయీన కావలికోట పఠనం చేసుకుంటుండగా నేరపరిశోధకులు మా ఇంటిపై దాడి చేశారు. వాళ్లు వెదకడం మూలంగా మా ఇంట్లోవున్న బైబిలు సాహిత్యం బయటపడింది. “దీని గురించి మీరు జైలుకు పంపబడతారు” అని మాకు చెప్పబడింది. వెళ్లిపోవడానికి నేరపరిశోధకులు కారు ఎక్కిన వెంటనే, బ్రేకులు బిగుసుకుపోయినట్లు కారు కదల్లేకుండా ఉన్నట్లు వారు కనుగొన్నారు. కారును బాగు చేయడానికి విలియమ్‌ మాన్‌సర్‌ సహాయం చేశాడు, ఆ నేరపరిశోధకులు మళ్లీ ఎన్నడూ తిరిగి రాలేదు.

నిషేధం ఉన్న కాలంలో, మేము బైబిలు సాహిత్యాన్ని మా పొలంలో దూరంగావున్న ఒక భవనంలో ఉంచేవాళ్లం. మధ్యరాత్రిలో నేను న్యూజీలాండ్‌ బ్రాంచీకి వెళ్లి, నా కారును సాహిత్యంతో నింపుకునేవాన్ని. ఆ తర్వాత, దాన్ని ఇంటికి తెచ్చి మా పొలంలో దూరంగావున్న భవనంలో భద్రపర్చేవాన్ని. ఒక రాత్రి నేను రహస్య రవాణాసరుకును తీసుకురావడానికి బ్రాంచీకి వెళ్లేసరికి, ఆ స్థలమంతా హఠాత్తుగా దీపాలు వెలిగాయి! పోలీసులు ఇలా అరిచారు: “మేము మిమ్మల్ని పట్టుకున్నాము!” అయితే ఆశ్చర్యకరంగా, ఎక్కువ గొడవ చేయకుండా వాళ్లు నన్ను వెళ్లనిచ్చారు.

1949లో, నేను రోయీన పొలం అమ్మేసి, మా డబ్బు ఉన్నంత వరకు పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నాము. మేము మాస్టర్‌టన్‌లోని ఇంటిలోకి మారి, మాస్టర్‌టన్‌ సంఘంతో కలిసి పయినీరు సేవ చేశాము. రెండు సంవత్సరాల్లో, 24 మంది చురుకైన ప్రచారకులతో ఫెదర్‌స్టన్‌ సంఘం స్థాపించబడింది, నేను సంఘాధ్యక్షునిగా సేవ చేశాను. 1953లో, న్యూయార్క్‌ నగరంలోని యాంకీ స్టేడియంలో జరుగుతున్న యెహోవాసాక్షుల ఎనిమిది రోజుల అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికాకు ప్రయాణించే ఆధిక్యతనుబట్టి నేను ఆనందించాను. సెరబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న మా కుమార్తె ఇనెడ్‌ గురించి శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది గనుక రోయీన నాతో పాటు రాలేకపోయింది.

నేను న్యూజీలాండ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, నేను ఉద్యోగం చూసుకోవలసి వచ్చింది. మేము మాస్టర్‌టన్‌ సంఘానికి తిరిగి వచ్చాము, అక్కడే నేను సంఘాధ్యక్షునిగా నియమింపబడ్డాను. ఈ సమయానికల్లా, విలియమ్‌ మాన్‌సర్‌ మాస్టర్‌టన్‌లోని చిన్న థియేటర్‌ను కొన్నాడు, వైరారాపలో ఇదే మొదటి రాజ్యమందిరం అయ్యింది. 1950లలో మా సంఘం మంచి ఆత్మీయ సంబంధమైన మరియు సంఖ్యాపరమైన అభివృద్ధిని సాధించింది. కాబట్టి, ప్రాంతీయ కాపరి దర్శించినప్పుడు, దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లి అక్కడ ప్రకటనా పనిలో సహాయం చేయమని ఆయన పరిపక్వత చెందిన వారిని ప్రోత్సహించేవాడు, అనేకమంది అలాగే చేశారు.

మా కుటుంబం మాస్టర్‌టన్‌లోనే ఉండిపోయింది, తర్వాతి దశాబ్దాల్లో, నాకు సంఘంలో అనేక ఆధిక్యతలే కాదు జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాల్లో నియామకాలు కూడా లభించాయి. రోయీన ప్రాంతీయ సేవలో పాల్గొనేందుకు ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ, తాను కూడా ఆసక్తితో పాల్గొనేది.

విశ్వాస పరీక్షలను తాళుకొనడం

శీర్షికారంభంలో చెప్పినట్లుగా, 1985లో నాకు బాగు చేయలేని క్యాన్సర్‌ ఉన్నట్లు రోగ నిర్థారణ చేయబడింది. ఇప్పుడు జీవిస్తున్న, మరెన్నడూ మరణించని లక్షలాదిమందిలో మేమూ ఒకరమై ఉండాలని నేను, నమ్మకస్థురాలైన నా భార్య రోయీన, మాతోపాటు మా పిల్లలు ఎంతగా కోరుకున్నామో! కానీ నేను మరణించడానికి వైద్యులు నన్ను ఇంటికి పంపించేశారు. అయితే మొదట, నేను రోగనిర్థారణ గురించి ఎలా భావిస్తున్నానని వారు నన్ను అడిగారు.

“నేను నా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని, ఆశాభావం కలిగి ఉంటాను” అని సమాధానమిచ్చాను. వాస్తవానికి ఈ బైబిలు సామెత నన్ను బలపర్చేదయ్యింది: “ప్రశాంతమైన మనస్సు శరీరమునకు జీవము.”—సామెతలు 14:30, NW.

క్యాన్సర్‌ నిపుణులు ఆ బైబిలు ఉపదేశాన్ని ప్రశంసించారు. “క్యాన్సర్‌ రోగుల్లో 90 శాతం నివారణ ఈ మానసిక దృక్పథం వల్లనే వస్తుంది” అని వారు చెప్పారు. ఆరు వారాల రేడియేషన్‌ చికిత్సను కూడా వాళ్లు సిఫారసు చేశారు. సంతోషకరంగా, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో నేను చివరికి విజయం సాధించాను.

అత్యంత కష్టతరమైన ఈ కాలంలో, నాకు ఒక బలమైన దెబ్బ తగిలింది. నా అందమైన, యథార్థమైన భార్య మెదడు రక్త స్ఫోటకం (బ్రెయిన్‌ హేమరేజ్‌) మూలంగా మరణించింది. లేఖనాల్లో వ్రాయబడివున్న నమ్మకమైన వారి ఉదాహరణల నుండి, వారు తమ యథార్థతను కాపాడుకుంటుండగా వారి సమస్యలను పరిష్కరించడానికి యెహోవా ఎలా సహాయం చేశాడనే దాని నుండి నేను ఓదార్పును పొందుతాను. అలా, నూతన లోకమందలి నా నిరీక్షణ ప్రకాశవంతంగా ఉండిపోయింది.—రోమీయులు 15:4.

అయినప్పటికీ, నేను కృంగిపోయి, సంఘపెద్దగా సేవ చేయడం మానుకోవాలని అనుకున్నాను. నేను మళ్లీ కొనసాగించడానికి శక్తిని పొందేంత వరకు స్థానిక సహోదరులు నన్ను ప్రోత్సహించారు. ఫలితంగా, గత 57 సంవత్సరాలుగా నేను క్రైస్తవ పెద్దగా సంఘాధ్యక్షునిగా సేవచేయడంలో కొనసాగగలిగాను.

భవిష్యత్తును నమ్మకంతో ఎదుర్కోవడం

ఈ సంవత్సరాలన్నింటిలోను యెహోవాను సేవించడం ఎనలేని ఆధిక్యత. నేను ఎన్ని ఆశీర్వాదాలను పొందానో! “ఇదే, ఇదే సత్యం!” అని మా అమ్మ చెప్పడాన్ని 16 సంవత్సరాల అబ్బాయిగా నేను విన్నది ఇటీవలనే అన్నట్లుగా ఉంది. మా అమ్మ 1979లో మరణించేంత వరకు అంటే ఆమెకు దాదాపు 100 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు నమ్మకమైన, ఆసక్తి గల సాక్షిగా కొనసాగింది. ఆమె కుమార్తె మరియు ఆరుగురు కుమారులు కూడా యథార్థవంతులైన సాక్షులయ్యారు.

యెహోవా నామంపై నుండి అన్ని నిందలు తీసివేయబడడాన్ని చూసేందుకు జీవించి ఉండడమే నా ప్రగాఢ కోరిక. ఎన్నడూ మరణించకూడదన్న నా జీవితాంత నిరీక్షణ నిజమౌతుందా? దాని కొరకు వేచి చూడవలసిందే. అయితే, అనేకులు అవును కోట్లాదిమంది, చివరికి ఆ ఆశీర్వాదాన్ని పొందుతారన్న దృఢ నమ్మకం నాకుంది. కాబట్టి నేను జీవించి ఉన్నంత వరకు, ఎన్నడూ మరణించని వారిలో లెక్కించబడగల ఉత్తరాపేక్షను విలువైనదిగా ఎంచుతాను.—యోహాను 11:26.

[28వ పేజీలోని చిత్రం]

మా అమ్మ

[28వ పేజీలోని చిత్రం]

నా భార్యా పిల్లలతో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి