ఈరీనాకు ఇష్టమైన పాటలపుస్తకం
బల్గేరియా నందలి సోఫియాకు చెందిన ఈరీనా అనే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి కొంతకాలం క్రితమే యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకుంది. ఆమెకు పాడడమంటే చాలా ఇష్టం, ప్రాముఖ్యంగా యెహోవాకు స్తుతిగీతాలు పాడండి అనే పుస్తకంలోని పాటలను ఆమె ఇష్టపడుతుంది. కాబట్టి, ప్రతి నెల కొన్ని పాటలు కంఠస్థం చేయడాన్ని ఆమె తన లక్ష్యంగా పెట్టుకుంది.
పాఠశాలలో ఈరీనాకు ఇష్టమైన అంశాల్లో సంగీతం ఒకటి. కాబట్టి, పాఠశాల గాన సమూహంతోపాటు పాడడానికి ఈరీనా నిరాకరించినప్పుడు ఆమెకు సంగీతం నేర్పించే ఉపాధ్యాయురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. ఈరీనా ఎందుకు నిరాకరించింది? తాను పాడవలసి వచ్చే సంగీతంలోని ఎక్కువ భాగం జాతీయ నాయకులను, అన్య మూలంగల పండుగ దినాలను కొనియాడుతుందని ఆమె గుర్తించింది. జాతీయ దృక్పథాలను ఉన్నతపర్చడానికి కొన్ని పాటలు తిరుగుబాటును, దౌర్జన్యాన్ని కూడా సమర్థిస్తాయి. ఈ విషయంలో ఈరీనా దృక్కోణాన్ని ఉపాధ్యాయురాలు అర్థం చేసుకోలేకపోయింది. తన మత సంబంధమైన అభిప్రాయాలను తెలియజేస్తూ తన ఉపాధ్యాయురాలికి ఒక ఉత్తరం వ్రాయాలని ఈరీనా అనుకుంది, కాని ప్రయోజనం లేకపోయింది.
ఈరీనా తండ్రికి ఒక తలంపు వచ్చింది. ఈరీనా పాడడానికి ఇష్టపడే పాటలుగల యెహోవాకు స్తుతిగీతాలు పాడండి అనే పుస్తక ప్రతిని ఆయన ఉపాధ్యాయురాలికి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత, ఉపాధ్యాయురాలు ఈరీనాను సంగీతం గదికి పిలిచింది. తన తోటి విద్యార్థుల సమక్షంలో, ఉపాధ్యాయురాలు పియానో వాయిస్తుండగా, ఆ పుస్తకంలో నుండి తనకు ఇష్టమైన కొన్ని పాటలు పాడమని ఆమె ఈరీనాను కోరింది. ఆ ప్రదర్శన దాదాపు గంటపైగా కొనసాగింది! ఈరీనాకు ఇష్టమైన పాటల పుస్తకంలో కొన్ని చక్కని గీతాలు ఉన్నాయని ఉపాధ్యాయురాలు అంగీకరించవలసి వచ్చింది.