కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 12/15 పేజీలు 4-7
  • ఇచ్చే స్వభావం మీకు ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇచ్చే స్వభావం మీకు ఉందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు అనుగ్రహం పొందాలనుకునే వారెవరైనా ఉన్నారా?
  • హృదయపూర్వకంగా ఇచ్చే కానుకనా?
  • మీ ముఖ్య ఉద్దేశం—సందర్భమా? లేక ప్రేమను వ్యక్తపర్చడమా?
  • సంవత్సరం పొడుగునా ఉండే ఉదారస్వభావం
  • బెస్ట్‌ గిఫ్ట్‌ ఇవ్వాలంటే
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • “నాకు ఇచ్చిన గిఫ్ట్స్‌లో ఇది బెస్ట్‌ గిఫ్ట్‌”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఎందుకు అంత అమూల్యమైంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • “అత్యున్నత బహుమతి”
    తేజరిల్లు!—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 12/15 పేజీలు 4-7

ఇచ్చే స్వభావం మీకు ఉందా?

ఇవ్వడానికి ప్రజలను పురికొల్పే కారకాలు ఒకటి కంటే ఎక్కువున్నాయని మీరు గమనించారా? కానుకన్నది ప్రేమ, ఉదారత, మెప్పుదలల వ్యక్తీకరణ అయివుండవచ్చు. అయితే, అభిమానాన్ని పొందాలని ఒక వ్యక్తికున్న కోరిక కూడా కానుక ఇవ్వడానికి కారణం కాగలదని మీరు గమనించారా? లేదా కేవలం బాధ్యతగా భావించి దాన్ని ఇవ్వవచ్చు లేదా ఇచ్చే వ్యక్తి తిరిగి ఏదైనా పొందాలని ఇవ్వవచ్చు.

కానుక చక్కని రిబ్బను కట్టివున్న ప్యాకెట్టులో ఉండవచ్చు. కాని ఒక మంచి కానుక ఒక పూల గుచ్ఛం, ఒక భోజన పదార్థం, లేక దయతో కూడిన చర్య కూడా అయివుండవచ్చన్నది నిజం కాదా? నిజానికి, ఎంతో ఎక్కువగా మెచ్చుకొనబడే కానుకల్లో తరచూ తమను తాము సమర్పించుకోవడం చేరివుంటుంది.

మీరు అనుగ్రహం పొందాలనుకునే వారెవరైనా ఉన్నారా?

ఒక వ్యక్తి ఎవరి అనుగ్రహాన్ని పొందాలనుకుంటాడో ఆ వ్యక్తికి కానుకివ్వడం అసాధారణమైనదేమీ కాదు. కొన్ని దేశాల్లో, తన కాబోయే పెండ్లికుమార్తె హృదయాన్ని గెలుచుకోవాలని ప్రయత్నించే యౌవనస్థుడు ఆమె కొరకు పువ్వులు తీసుకురావచ్చు. బుద్ధిగల స్త్రీ బహుమానాన్ని మించినది చూస్తుంది. ఆ యౌవనస్థుని కానుక వెనుకనున్న స్వభావాన్ని, అంటే అది అతన్ని మంచి భర్తను కూడా చేయగల ప్రేమపూర్వకమైనదేనా అని ఆమె పరిశీలిస్తుంది. అలాంటి కానుక, ఒకవేళ అది దైవిక స్వభావాన్ని కనబరుస్తే, ఇచ్చినవారికీ అలాగే దాన్ని పొందినవారికి అది ఎంతో సంతోషాన్ని కలిగించగలదు.

నాబాలు భార్యయైన అబీగయీలు, ఇశ్రాయేలుకు భవిష్యత్‌ రాజుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకొన్నాడని గుర్తించిందో ఆ దావీదు కొరకు ఉదారతతో కూడిన ఒక కానుకను త్వరగా సిద్ధంచేసిన సందర్భం గురించి బైబిలు తెలియజేస్తుంది. ఆమె కూడా అనుగ్రహం కొరకు ప్రయత్నించింది. ఆమె భర్త దావీదును తిరస్కరించి, దావీదు మనుష్యులతో కఠినంగా మాట్లాడాడు. నాబాలును అతని కుటుంబాన్ని నాశనం చేయాలని దాదాపు 400 మంది సాయుధ పురుషుల గుంపుకు నాయకత్వం వహిస్తూ దావీదు బయలుదేరాడు. అబీగయీలు జోక్యం చేసుకుని వెంటనే దావీదుకు అతని మనుష్యులకు ఆహార పదార్థాలను ఉదారతతో కూడిన కానుకలుగా పంపించింది. ఆమె తన కానుకతో పాటు బయలుదేరి వచ్చి, తన భర్త చేసిన దానికి వినయంగా క్షమాపణలు చెప్పిన తర్వాత, దావీదుతో తర్కించేటప్పుడు గొప్ప వివేచనను ప్రదర్శించింది.

ఆమె ఉద్దేశం గొప్పది, గనుక మంచి ఫలితం లభించింది. దావీదు ఆమె కానుకను అంగీకరించి, “నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని” ఆమెతో అన్నాడు. ఆ తర్వాత నాబాలు మరణించాక, అబీగయీలును వివాహం చేసుకోవడాన్ని దావీదు ప్రతిపాదించాడు, ఆమె సంతోషంగా అంగీకరించింది.—1 సమూయేలు 25:13-42.

అయితే కొన్ని సందర్భాల్లో, ఒక వ్యక్తి పొందడానికి ప్రయత్నించే అనుగ్రహంలో పక్షపాతం చూపించడం, చివరికి న్యాయాన్ని త్రిప్పివేయడం చేరివుండవచ్చు. అలాంటి సందర్భంలో, కానుక లంచమే. ఇచ్చే వ్యక్తి తాను ప్రయోజనం పొందుతానని అనుకుంటాడు, కాని అతడు తనకు తాను మనశ్శాంతి లేకుండా చేసుకుంటాడు. ఇతరులు దాన్ని తెలుసుకొంటే, అతడు లెక్క ఒప్పజెప్పవలసి వస్తుందన్న ప్రమాదం ఎల్లప్పుడూ ఉన్నదే. కోరుకున్న అనుగ్రహం లభించినప్పటికీ, అనుగ్రహం పొందిన వ్యక్తి ఇప్పుడు తనకు, అవిశ్వసనీయమైన వ్యక్తి అనే పేరు వచ్చిందని తెలుసుకోవచ్చు. దైవిక బుద్ధిని సూచిస్తూ, అలాంటి కానుకల గురించి బైబిలు హెచ్చరిస్తుంది.—ద్వితీయోపదేశకాండము 16:19; ప్రసంగి 7:7.

హృదయపూర్వకంగా ఇచ్చే కానుకనా?

ఇతరులు మీరు ఇవ్వాలని భావించేలా చేసినందుకు ఇచ్చేదాని కంటే, ఇవ్వాలని మీకు ఇష్టమున్నందువల్ల మీరు ప్రేమించేవారికి ఇవ్వడం ఎంతో ఎక్కువ సంతోషాన్ని తీసుకువస్తుందన్న విషయంలో సందేహంలేదు.

వస్తుదాయక అవసరతలోవున్న తోటి క్రైస్తవులకు సహాయక సరఫరాలను సమకూర్చడానికి సంబంధించి, దైవికంగా ఇచ్చే విషయాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు కొన్ని చక్కని సూత్రాలను అందించాడు. ఆయనిలా వ్రాశాడు: “మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.” ఆయన ఇంకా ఇలా జతచేశాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 8:12; 9:7) కాబట్టి, మీపైన ఎంతో ఆధారపడి ఉంటుంది. కానుకలివ్వడమనే సరదాలోపడి అప్పులపాలయ్యే బదులు, మీరు మీ తాహతుకు తగినంతే ఖర్చుచేస్తారా? ప్రాముఖ్యంగా సామాజిక లేక వాణిజ్య సంబంధమైన ఒత్తిడి మూలంగా ఇవ్వడానికి పురికొల్పబడే బదులు, మీరు మీ హృదయంలో నిశ్చయించుకున్నదే చేస్తారా? అలాంటి దైవిక సూత్రాలను అన్వయించుకున్న తొలి క్రైస్తవుల గురించి, “పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు . . . తమంతట తామే యిచ్చిరని” పౌలు వ్రాశాడు.—2 కొరింథీయులు 8:4.

దానికి భిన్నంగా, క్రిస్టమస్‌కు ముందు వచ్చే వారాల గురించి 1994 నవంబరు/డిశంబరు యొక్క రాయల్‌ బాంక్‌ లెటర్‌ ఇలా తెలియజేసింది: “ఆ సీజను (పండుగ కాలం), కొనుగోలుదారులు మరో విధంగా అయితే కొనని వాటిని కొనేలా పురికొల్పేందుకు వ్యాపారస్థులు రేకెత్తించే కృత్రిమ ఉత్సాహపు స్థితిలా కనిపిస్తుంది.” ఒకవేళ అరువుపై కొనుగోలు జరిగితే, కానుకలివ్వడం ద్వారా వచ్చే సంతృప్తి ఏదైనా ఉంటే అది బిల్లులు కట్టవలసి వచ్చినప్పుడు త్వరగా అంతర్ధానమౌతుంది.

మీ ముఖ్య ఉద్దేశం—సందర్భమా? లేక ప్రేమను వ్యక్తపర్చడమా?

మీరు ఇవ్వడమన్నది అలా ఇవ్వవలసిన అవసరతగల సందర్భాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లు మీకనిపిస్తుందా? అలాగైతే, అనుకోకుండా ఇవ్వడంవల్ల వచ్చే ఎంతో ఆనందాన్ని మీరు తప్పిపోతుండవచ్చు.

ప్రత్యేకమైన దినాల్లో కానుకలివ్వడం ద్వారా వచ్చే ఫలితాలనుబట్టి సంతోషించని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కానుకలిచ్చే దినం దగ్గరపడినప్పుడు తన పిల్లల్లో దురాశ తలెత్తేదని రచయిత కూడా అయిన ఒక తల్లి గుర్తించింది. తాను మరోదాని కొరకు నిరీక్షించేది గనుక చక్కని కానుకనుబట్టి కలిగే తన స్వంత ఆనందం కూడా పోయేదని ఆమె అంగీకరించింది. వేడుకలు మరియు కానుకలిచ్చి పుచ్చుకోవడం చేరివున్న పండుగ దినాలు ఎంతో మానసిక కృంగుదల కలిగే మరియు మద్యపాన దుర్వినియోగం జరిగే సమయాలుగా కూడా ఉన్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి.

పండుగ సమయాల్లో కానుకలివ్వడం యొక్క ప్రాధాన్యత పిల్లలపై కొన్నిసార్లు వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని గమనించిన, ద న్యూయార్క్‌ టైమ్స్‌లో చెప్పబడిన ఒక మనస్తత్వ పండితుడు ఇలా సిఫారసు చేస్తున్నాడు: “ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కొన్ని కానుకలను ఇతర దినాల్లో ఇవ్వడం గురించి తలంచండి.” అది మంచి ప్రభావాన్ని చూపుతుందని మీరనుకుంటున్నారా?

క్రిస్టమస్‌ను, జన్మదినాలను ఆచరించని కుటుంబంలోని 12 సంవత్సరాల బాలిక టామి ఇలా వ్రాసింది: “మీరు ఎంత మాత్రం ఎదురుచూడనప్పుడు ఒక కానుక లభించడం ఎంతో సంతోషాన్ని తెస్తుంది.” కేవలం సంవత్సరానికి ఒకసారి లేక రెండుసార్లు కానుకలిచ్చే బదులు, తన తలిదండ్రులు తనకు తన సహోదరునికి అలాంటివి సంవత్సరం పొడుగునా ఇస్తారని ఆమె చెప్పింది. కాని ఆ కానుకలకంటే మరింత ప్రాముఖ్యమైనది ఆమెకు మరొకటుంది. ఆమె దాన్నిలా చెబుతుంది: “నాకు ఎంతో సంతోషభరితమైన కుటుంబ జీవితం ఉంది.”

సీక్రెట్స్‌ ఆఫ్‌ స్ట్రాంగ్‌ ఫామిలీస్‌ అనే పుస్తకం సూటిగా ఇలా తెలియజేస్తుంది: “మనం ప్రేమించే ప్రజలకు జన్మదినాల్లో, వార్షికోత్సవాల్లో, లేక పండుగదినాల్లో ఇచ్చేందుకు, తగిన కానుకలను ఎంపిక చేయడానికి మనలో అనేకులము సంవత్సరంలో అనేకసార్లు సమయాన్ని, డబ్బును వెచ్చిస్తాము. అన్నిటికంటే శ్రేష్ఠమైన కానుకకు డబ్బు చెల్లించనవసరంలేదు. మీరు దానికి పై అలంకరణలు చేయనవసరం లేదు. జీవితం మీకున్న అత్యంత విలువైన సంపద అని అనేకమంది ప్రజల్లా మీరూ విశ్వసిస్తే, మీ జీవితంలోని కొంత సమయాన్ని ఇవ్వడమే మీరివ్వగలిగే అత్యంత అమూల్యమైన కానుక. మన ప్రియమైన వారి కొరకు సమయం వెచ్చించడం ద్వారా మనం ఆ అమూల్యమైన కానుకనిస్తాము.”

మీరు మీ స్వంత కుటుంబం వెలుపలివారి కొరకు కూడ అలా ఇవ్వవచ్చు. ఇతరులకు నిజంగావున్న అవసరాన్ని తీర్చడానికి ఇష్టపూర్వకంగా ఇవ్వడమన్నది ప్రత్యేకమైన సంతృప్తిని తేగలదు. బీద, కుంటి, గ్రుడ్డి వారి ఎడల అలాంటి ప్రేమపూర్వకమైన శ్రద్ధ చూపించమని మనల్ని కోరుతూ యేసు క్రీస్తు ఇంకా ఇలా జతచేశాడు: “నీకు ప్రత్యుపకారము చేయుటకు వారి కేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు.”—లూకా 14:12-14.

అలా ఇవ్వడాన్ని గూర్చిన ఒక ఉదాహరణ గురించి రాక్‌లాండ్‌ జర్నల్‌-న్యూస్‌ (అమెరికా) ఇటీవల నివేదించింది. ఒక వృద్ధ అంధ స్త్రీ ఇల్లు కూలిపోయినప్పుడు, స్నేహితులు ఆమె కొరకు క్రొత్త ఇల్లు నిర్మించారు. కొన్ని స్థానిక వ్యాపార సంస్థలు విరాళాలిచ్చాయి, ఒక స్థానిక ప్రభుత్వ సంస్థ ఆర్థిక సహాయాన్నిచ్చింది. “అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా, హావెర్‌స్ట్రా నందలి యెహోవాసాక్షుల సంఘానికి హాజరయ్యే వారిలో అనేకులు అంటే సుమారు 150 మంది ఇంటిని నిర్మించడానికి సమయాన్ని వెచ్చించారు” అని అదే వార్తాపత్రిక తెలియజేసింది.

ఆ శీర్షిక ఇలా కొనసాగింది: “నిర్మాణ స్థలంలో ఆహారంతో నిండివున్న బల్లల ప్రక్కన వస్తువుల కుప్పలున్నాయి. పనివాళ్లు రెండు రోజుల్లో రెండు అపార్ట్‌మెంట్లున్న మూడంతస్తుల ఎత్తు ఇంటిని నిర్మించారు. . . . యెహోవాసాక్షులు భవనాలను వేగంగా నిర్మించగల సమర్థులని పేరుపొందారు. . . . అయితే ప్రేమతో కూడిన క్రియలోని స్థిరత్వాన్ని అందించడమనే వారి శాశ్వత సేవా దృక్పథానికి ఈ వేగం భిన్నమైనది. మిస్‌. బ్లేక్లీ తన క్రొత్త ఇంటిని చూడలేకపోవచ్చు, కాని ఆమె చేతులు దాన్ని తడిమి చూడగలవు, ఈ నిస్వార్థ చర్యవల్ల ఆమె హృదయం ఎంతగా కదిలింపబడిందో ఆమె హృదయానికే తెలుసు.”

సంవత్సరం పొడుగునా ఉండే ఉదారస్వభావం

నిజంగా ఉదారస్వభావం గలవారు ప్రత్యేకమైన దినాల కొరకు వేచి ఉండరు. వారి జీవితాలు తమ చుట్టు మాత్రమే అల్లబడి ఉండవు. వాళ్లు ఏదైనా మంచిది పొందినప్పుడు, దాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఆనందిస్తారు. అంటే దీని భావం వారు తప్పనిసరిగా కానుకలిచ్చేవారని కాదు. తమ కుటుంబాలకు ఆర్థిక ఇబ్బంది కల్గేంతగా వారు ఇస్తారని దాని భావం కాదు. పుచ్చుకొనే వ్యక్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది తలంచకుండా ఇస్తారనీ దాని భావం కాదు. అయితే, చేయమని యేసు తన శిష్యులకు నేర్పించినట్లుగా, “ఇయ్యుడి” అన్నది చేస్తున్న ప్రజలు వారు.—లూకా 6:38.

వృద్ధులైన, అనారోగ్యంగావున్న లేక మరోవిధంగా ప్రోత్సాహం అవసరమున్న స్నేహితులు మరియు పొరుగువారి పరిస్థితుల గురించి వారికి తెలుసు. వారి “కానుక,” దుకాణానికి వెళ్లిరావడం లేక ఇంటిపనుల్లో సహాయం చేయడమే కావచ్చు. అది కట్టెలు కొట్టడం లేక గడ్డకట్టిన మంచును తీసివేయడమే కావచ్చు. అది, సిద్ధం చేసిన గిన్నెడు భోజనం కావచ్చు లేక సందర్శించి కలిసి చదవడానికి గడిపిన ఒక గంట సమయమూ కావచ్చు. వారి స్వంత జీవితాలు పనితొందర కలిగివుండవచ్చు కాని ఇతరులకు సహాయం చేయలేనంతగా మాత్రం కాదు. వారు నిజంగా “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అన్నది అనుభవం ద్వారా నేర్చుకున్నారు.—అపొస్తలుల కార్యములు 20:35.

అయితే, అందరి కంటె గొప్పగా ఇచ్చేవాడు మన సృష్టికర్తయైన యెహోవా దేవుడు. ఆయన “అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (అపొస్తలుల కార్యములు 17:25) దుష్టత్వాన్ని, అనారోగ్యాన్ని, మరణాన్ని తీసివేసి, ఈ భూమిని పరదైసుగా చేయడమనే తన సంకల్పాన్ని గూర్చిన అంతర్దృష్టిని కూడా ఆయన మనకు బైబిలులో అందజేశాడు. (కీర్తనలు 37:10, 11; ప్రకటన 21:4, 5) దీని గురించి తెలుసుకున్న తర్వాత ఉదారస్వభావం గలవారు ఈ సువార్తను తమవరకే ఉంచుకోరు. వారి అత్యంత గొప్ప ఆనందాల్లో ఒకటి, దాన్ని ఇతరులతో పంచుకోవడమే. నిజంగా వారిది దైవిక ఉదారస్వభావం. మీరు పెంపొందింపజేసుకుంటున్న స్వభావం అదేనా?

[7వ పేజీలోని చిత్రాలు]

కొన్ని అత్యంత అమూల్యమైన కానుకలకు డబ్బక్కర్లేదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి