మన మధ్యన దేవదూతలు ఉన్నారా?
అది చాలా త్వరగా జరిగింది. మెర్లిన్ తన ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయి, తన పరిసరాలను మరిచిపోయి, రైలు పట్టాల మీద మెల్లిగా నడుస్తోంది. హఠాత్తుగా, ఆమెకు పెద్ద శబ్దం వినిపించింది. ఆమె తలెత్తి చూసి, ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డంగా తాను నిలబడివున్నట్లు తెలుసుకుంది! మెర్లిన్ భయంతో అలాగే బిగుసుకుపోయింది. రైలు ఎంత దగ్గరగా ఉందంటే, ఆమె రైలు నడిపే వ్యక్తి నీలి కళ్లను, భీతి చెందిన ముఖాన్ని చూడగలిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మెర్లిన్ ఎప్పుడూ మరచిపోలేదు. “వెనుక నుండి ఒక ఆజానుబాహువు నన్ను తోసినట్లే ఉండింది. నేను ఎగిరి వెళ్లి రైలు పట్టాలకు అవతలున్న బొగ్గుల కుప్ప మీద పడ్డాను” అని ఆమె చెబుతుంది. కొద్దిగా దెబ్బలు తగిలిన మెర్లిన్, తనను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపాలని లేచింది, కాని ఎవరూ కనిపించలేదు! ఆమె అభిప్రాయమేమిటి? “నా సంరక్షక దేవదూత నా జీవితాన్ని కాపాడాడని” మెర్లిన్ చెబుతుంది. “అతడు కాక మరింకెవరై ఉండగలరు?”
సంశయాత్మకమైన ప్రపంచం హఠాత్తుగా దేవదూతలచేత ముట్టడి వేయబడినట్లు అనిపిస్తుంది. ఇటీవలి సంవత్సరాల్లో, పరలోక వాసులు దూరదర్శని ప్రదర్శనల్లో, సినిమాల్లో, బ్రాడ్‌వే ప్రదర్శనల్లో సహితం ఒక అంశమయ్యారు. బాగా అమ్ముడుపోయే మతసంబంధమైన పుస్తకాల పట్టికలో దేవదూతలను గూర్చిన పుస్తకాలు మొదట ఉన్నాయి. దేవదూతలకు సంబంధించిన క్లబ్బులు, పాఠశాలలు, వార్తాలేఖలు ఉన్నాయి. ఒక శీర్షిక చెబుతున్నట్లుగా, “మీ అంతర్గత దేవదూతను” విడుదల చేసేందుకు సహాయం చేయడానికి పట్టడలు (వర్క్‌షాప్‌లు) ఏర్పాటు చేయబడ్డాయి.
దేవదూత ఉద్యమాన్ని ఒక అవకాశంగా తీసుకొన్న అవకాశవాదులైన వ్యాపారవేత్తలు మితిలేనన్ని వినిమయ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. “దేనిపైనైనా సరే దేవదూతలు ఉంటే అది బాగా అమ్ముడుపోతుంది” అని అమెరికాలోని ఒక దుకాణం సహ యజమానురాలు చెబుతోంది. ఒక విలేఖరి “పరలోక లాభాలు” అని పిలుస్తున్న వాటిని కూడబెడుతున్న దేవదూతలను గురించిన పుస్తకాల ఉప్పెనతోపాటు “దేవదూతల విగ్రహాలు, పిన్నులు, బొమ్మలు, టీ షర్టులు, పోస్టర్లు, గ్రీటింగ్ కార్డులు” మొదలైనవాటి పట్టికను ఆమె తెలియజేస్తుంది.
కాని ఇది వేలంవెర్రి మాత్రమే కాదని దేవదూతల పక్షాన వాదించేవారు నొక్కి చెబుతున్నారు. తమ ఆరోపణను సమర్ధించుకోవడానికి, వారు ఒకదాని తర్వాత మరొక సాక్ష్యాధారాన్ని అంటే దేవదూతలను కలిసిన “నిజజీవిత” ఘట్టాలను తెలియజేస్తున్నారు. తాము మానవ రూపంలోవున్న దేవదూతను చూశామని కొందరు చెబుతారు. ఇతరులు ఒక వెలుగు చూశారు, స్వరం విన్నారు, ఏదో ఆత్మ ఉన్నట్లుగా భావించారు, లేదా దేవదూతల సంబంధమైనదని వారు నమ్మే ఏదో కోరిక ఉన్నట్లుగా భావించారు. మెర్లిన్ వలె అనేకులు, ఒక దేవదూత తమ జీవితాన్ని కాపాడాడని చెబుతారు.
ఏం జరుగుతోంది? “సహజాతీత” సంఘటనలపై రెండు పుస్తకాలు వ్రాసిన జోన్ వెస్టర్ ఆండర్‌సన్ ఇలా చెబుతున్నాడు: “ఆత్మీయత యొక్క పునరుద్భావన జరుగుతుందని నేననుకుంటున్నాను.” మరో పుస్తకం వ్రాయడానికి సహాయం చేసిన అల్మా డాన్యల్ మరో అడుగు ముందుకు వేస్తుంది. దేవదూతలు “ఇప్పుడు మరింత ఎక్కువమంది ప్రజలను చేరగలిగేలా ఉపదేశం పొందుతున్నారు. మనం వారి గురించి ఎక్కువ చూడడానికి కారణం అలా జరగాలని వాళ్లు కోరుకోవడమే. వాళ్లే అలా చేస్తున్నారు” అని ఆమె చెబుతుంది.
అది నిజమేనా? లేక దేవదూతల ఎడల ప్రస్తుతమున్న వ్యామోహం వెనుక ఏదైనా ఉందా? అది తెలుసుకోవడానికి మనం దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. మనం చూడబోతున్నట్లుగా, బైబిలులో దేవదూతలను గూర్చిన సత్యం ఉంది.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pages 3 and 4: The New Testament: A Pictorial Archive from Nineteenth-Century Sources, by Don Rice/Dover Publications, Inc.