మా తలిదండ్రుల అడుగుజాడలను అనుసరించడం
హిల్డా పడ్గెట్ చెప్పిన ప్రకారం
“నా జీవితం సర్వోన్నతుని సేవకొరకు అర్పించబడింది, నేను ఇద్దరు యజమానులను సేవించలేను” అని ప్రెస్ నివేదికలో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆసుపత్రిలో పని చేయమన్న తమ ఆజ్ఞను తిరస్కరించేందుకు 1941 నందు బ్రిటీషు కార్మిక మంత్రి మరియు జాతీయ సేవా అధికారులనుద్దేశించిన వాజ్ఞ్మూలంలోని ఆ నా మాటలు నేను తిరస్కరించినందుకు గల కారణాలను అందించాయి. అది జరిగిన కొద్దికాలానికే, అలా నేను నిరాకరించినందుకు నా మీద దోషారోపణను వేసి మూడు నెలల జైలు శిక్షను విధించారు.
నన్ను ఈ ప్రమాదకరమైన పరిస్థితికి ఏది తీసుకువచ్చింది? అదేదో కుర్రతనపు మోజో లేక ఎదురుతిరిగే స్వభావమో కానేకాదు. బదులుగా, దాని కారణం నేను ఇంకా బాలికగా ఉన్న కాలం నాటిది.
రాజ్యం ఎడల నాన్నగారి ఆసక్తి
నేను జూన్ 5, 1914లో ఉత్తర ఇంగ్లాండ్ నందు లీడ్స్ సమీపంలోని హోర్స్‌ఫోర్త్‌లో జన్మించాను. మా తలిదండ్రులైన అట్కిన్సన్ మరియు పాట్టీ పడ్గెట్‌లిద్దరూ ప్రిమిటివ్ మెథోడిస్ట్ ఛాపల్ నందు సన్‌డే స్కూల్ టీచర్లుగానూ పనిచేశారు మరియు క్వయర్ సభ్యులుగానూ పనిచేశారు—అక్కడ మా నాన్నగారు ఆర్గన్‌ను వాయించేవారు. నేను పసిదానిగా ఉన్నప్పుడు, మా ఇల్లు ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాల్లోనూ ఎంతో ఆనందంగా ఉండేది. ప్రపంచ పరిస్థితులు నాన్నగారిని ఎంతో కలతపర్చేవి. ఆయన యుద్ధాన్ని దౌర్జన్యాన్ని అసహ్యించుకునేవాడు మరియు “నరహత్య చేయకూడదు” అనే బైబిలు ఆజ్ఞయందు నమ్మకముంచాడు.—నిర్గమకాండము 20:13.
ప్రభుత్వం 1915 నందు, యౌవనులు స్వచ్ఛందంగా సైన్యంలో చేరాలని తద్వారా దానికి సంబంధించిన పన్ను నుండి తప్పించుకోగలరని వారిని బలవంతపెట్టింది. ఏదో అకారణ భయంతో సైనికునిగా నమోదు చేయించుకునేందుకు దినమంతా నాన్నగారు వానలో నిలుచున్నారు. ఆ మరుసటి దినమే ఆయన జీవితమంతా మారిపోయింది!
ఓ పెద్ద ఇంట్లో ప్లంబింగ్ చేసే సమయంలో, లోక సంఘటనలనుగూర్చి అక్కడ పనిచేసే మరో వ్యక్తితో ఆయన మాట్లాడారు. అక్కడి తోటమాలి అతనికి, ప్రభువు రత్నాలను సమకూర్చడం (ఆంగ్లం) అనే ఓ చిన్న కరపత్రాన్ని అందించాడు. నాన్నగారు దాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఒకసారికాదు రెండుసార్లు చదివారు. “అదే సత్యమైతే, మిగిలినవన్నీ తప్పే” అని ఆయన అన్నారు. మరునాడు, తనకు ఇంకా అధిక సమాచారం కావాలని కోరారు, మరి మూడు వారాల వరకూ ఆయన బైబిలును తెల్లవారుజామువరకు పఠించారు. తాను సత్యాన్ని కనుగొన్నాడన్న విషయం ఆయనకు తెలిసింది! ఆదివారం జనవరి 2, 1916 నాటి తన డైరీలో ఆయన ఇలా వ్రాశారు: “ఉదయం చర్చిలో చాపల్‌కు వెళ్లాను, హెబ్రీ 6:9-20 లేఖనాలను పఠిస్తూ రాత్రి ఐ.బి.ఎస్.ఎకి [ఆ కాలంలో యెహోవాసాక్షులకు గల పేరైన అంతర్జాతీయ బైబిలు విద్యార్థుల సంఘం] వెళ్లాను, అక్కడ మొదటిసారిగా సహోదరులను సందర్శించాను.”
వెంటనే వ్యతిరేకత ప్రారంభమైంది. మా కుటుంబ సభ్యులూ చాపల్ నందలి స్నేహితులు నాన్నకు పిచ్చిపట్టిందనుకున్నారు. కానీ ఆయన నిశ్చయించుకున్నారు. ఆయన కూటాలూ పఠనం కొరకే జీవిస్తున్నాడన్నట్లుగా చూపించారు, మరి మార్చి నెలలో నీటి బాప్తిస్మం ద్వారా ఆయన తన సమర్పణను కనపర్చారు. కొన్ని వారాలు నాన్నగారు కూటాలకు ఒంటరిగా వెళ్లిన తర్వాత, అమ్మ కూటాలకు వెళ్లడాన్ని ఇక నివారించలేకపోయింది. నడిపించుకు తీసుకువెళ్లగల తొట్లో కూర్చోబెట్టి ఎనిమిది కిలోమీటర్ల దూరమున్న లీడ్స్‌కు నడిచింది, అదీ సరిగ్గా కూటం ముగుస్తుండగా చేరుకుంది. అప్పుడు నాన్నగారి సంతోషాన్ని మీరు ఊహించగలరు. అప్పటినుండీ, మా కుటుంబం యెహోవా సేవలో ఐక్యంగా ఉంది.
మొదట సైన్యంలో ఓ స్వచ్ఛంద సేవకునిగా మరి కొద్దివారాల్లోనే దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవానిగా నాన్నగారి పరిస్థితి చాలా కష్టతరంగా ఉండేది. పనికి హాజరవ్వమని పిలిచినప్పుడు తుపాకిని ఉపయోగించేందుకు ఆయన నిరాకరించారు అంతేకాకుండ 1916 జూలై కల్లా, అయిదు సైనిక న్యాయ తీర్పుల్లో మొట్టమొదటి దానిని ఆయన ఎదుర్కొన్నారు. తత్ఫలితంగా ఆయనకు 90 రోజుల కారాగార శిక్ష విధించబడింది. మొదటి శిక్షను అనుభవించిన తర్వాత, నాన్నకు ఓ పదిహేను రోజుల సెలవు ఇవ్వబడింది. దాని వెంటనే మరో సైనిక న్యాయస్థాన తీర్పు, మరి 90 రోజుల కారాగారం వచ్చాయి. తన రెండవ కారాగార శిక్ష తర్వాత, ఆయనను రాయల్ ఆర్మీ మెడికల్ కార్పొరేషన్‌కు మార్చి, ఫిబ్రవరి 12, 1917 నందు ఫ్రాన్స్ నందలి రొవున్‌కు వెళ్లే సైనిక ఓడలో ఎక్కించారు. తన పరిస్థితుల వల్ల, రోజులు గడుస్తున్న కొలది ఆయన ఎంతగానో విసిగిపోయారని ఆయన డైరీ చెబుతోంది. సైనికులు మరలా యుద్ధానికి వెళ్లేందుకుగాను తాను వారికి సహాయపడేందుకే వారికి చికిత్స చేస్తున్నానని ఆయన గ్రహించారు.
సహకరించేందుకు ఆయన మరలా నిరాకరించారు. ఈ సారి సైనిక న్యాయస్థానం, రొవున్‌లోని బ్రిటిష్ సైనిక కారాగారంలో ఆయనకు ఐదేండ్ల శిక్షను విధించింది. మనస్సాక్షినిబట్టి వ్యతిరేకించినవానిగా తనను సివిలు ఖైదుకు మార్చమని నాన్నగారు కోరుతూ ఉండగా, రొట్టె నీళ్లు మాత్రమే ఇస్తూ ఆయనను శిక్షించారు, ఆ తర్వాత ఆయన బరువు మరలా పెరిగేంతవరకూ క్రమమైన ఖైదీ భోజనమిచ్చి; ఆ తర్వాత మరలా మొదటిలాగే రొట్టె నీళ్లు మాత్రమే ఇచ్చేవారు. పగలు ఆయన చేతులను వెనక్కి కట్టేవారు మరి రాత్రుళ్లయందు భోజన సమయాల్లోనూ ముందుకు కట్టేవాళ్లు. చిన్నగావుండే సంకెళ్లు చేతులకు గట్టిగా బిగించినందున కలిగిన గాయాల మచ్చలు జీవితాంతం ఆయన మణికట్టుపై ఉండేవి. నడుము నుండి కాళ్లకు వేసే సంకెళ్లు కూడా ఆయనకు ఉండేవి.
సైనిక అధికారులు ఆయన నిశ్చయతను తుంచేందుకు తమ శాయశక్తులా విఫలంగా ప్రయత్నించారు. ఆయన బైబిలునూ పుస్తకాలనూ వారు తీసేసుకున్నారు. అటు ఆయనకు ఇంటినుండి ఏ ఉత్తరాలు వచ్చేవీ కావు ఇటు ఆయనను పంపించనూ లేదు. రెండు సంవత్సరాల తర్వాత నిరాహార దీక్ష చేయడం ద్వారా తన నిష్కాపట్యమును ప్రదర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. తినకుండ త్రాగకుండ ఏడు రోజులవరకు ఆయన తన తీర్మానానికి అంటిపెట్టుకుని ఉన్నారు, దానితో తీవ్రమైన అస్వస్థతకు గురై ఖైదీ ఆసుపత్రిలోకి బదిలీ అయ్యారు. ఆయన తన నిష్కాపట్యము నిరూపించుకున్నారు, కానీ దాని ఫలితంగా ఆయన తన జీవితాన్నే పోగొట్టుకోబోయారు. ఈ విధానంలో ఆయన తన జీవితాన్ని అపాయంలోపెట్టడం తప్పేనని తన జీవితంలో ఆ తర్వాత అంగీకరించారు మరియు ఆయన ఎన్నడూ అలాంటి పద్ధతిని అవలంబించనని ఒప్పుకున్నారు.
నవంబరు 1918 నందు నాన్నగారు ఇంకా రొవున్ కారాగారంలో ఉన్నప్పుడే యుద్ధం అంతమైంది, కానీ ఆ సంవత్సరం తొలిభాగంలో ఆయనను ఇంగ్లాండ్ నందలి పౌర ఖైదుకు మార్పించారు. ఆయన అమూల్యమైన బైబిలూ పుస్తకాలతో సహా పేరుకుపోయిన అమ్మ ఉత్తరాలనూ పార్శిళ్లనూ పొందడంలో ఆయన ఆనందాన్ని ఒక్కసారి ఊహించండి! విన్‌చెస్టర్ కారాగారానికి ఆయనను తీసుకువెళ్లడం జరిగింది అక్కడ, యుద్ధ సమయంలో తనవంటి అనుభవాలనే కలిగిన ఓ యౌవన సహోదరుని ఆయన కలిశాడు. ఆయన పేరు ఫ్రాంక్ ప్లాట్, ఆ తర్వాత ఆయన లండన్ బేతేలులో అనేక సంవత్సరాలు సేవచేశారు. ఆ తర్వాతి రోజు కలుసుకునేందుకు వారు ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ అప్పటికే ఫ్రాంక్ మరో ప్రాంతానికి బదిలీ చేయబడ్డారు.
ఏప్రిల్ 12, 1919 నందు అమ్మకు ఓ టెలిగ్రామ్ వచ్చింది: “హల్లెలూయా! ఇంటికి వస్తున్నాను—లండన్‌కు ఫోనుచేస్తున్నాను.” మూడు సంవత్సరాల పరీక్ష, శ్రమ మరియు వేర్పాటు తర్వాత అది ఎంత ఆనందమయమైన సమయమోకదా! లండన్ బేతేలు సహోదరులకు ఫోన్ చేసి వారిని కలవాలన్నది నాన్నగారి మొదటి ఆలోచన. టెరేస్ క్రావెన్ 34 నందు ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పొందారు. స్నానం చేసి గడ్డం గీసుకున్న తర్వాత అరువు తీసుకున్న సూటూ హాటు ధరించుకుని, నాన్నగారు ఇంటికి తిరిగి వచ్చారు. మా పునఃకలయికను మీరు ఊహించగలరా? అప్పుడు నాకు సుమారు అయిదేళ్లు, నాకు ఆయన జ్ఞాపకంలేరు.
స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆయన హాజరైన మొట్టమొదటి కూటం జ్ఞాపకార్థదినమే. హాలులోకి వెళ్ళేందుకు మెట్లెక్కిన తర్వాత ఎవరినో కాదు లీడ్స్‌లోని మిలటరీ ఆసుపత్రికి మార్చబడిన ఫ్రాంక్ ప్లాట్‌నే ఆయన కలిశారు. వాళ్లు తమ అనుభవాలను పంచుకోవడంలో ఎంతగానో ఆనందించారు! ఆ నాటినుండీ ఆయన విడుదలయ్యేంతవరకూ ఆయన మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవారు.
అమ్మ చేసిన నమ్మకమైన సేవ
నాన్నగారు బయట ఉన్నంతకాలం, ప్రభుత్వం నుండి లభించే చిన్న ఆదాయానికి తోడుగా అమ్మ ఇతరులకు బట్టలను ఉతికిపెట్టేది. సహోదరులు మాతో ఎంతో దయాపూర్వకంగా ఉండేవారు. ప్రతి కొన్ని వారాలకూ సంఘపెద్దల్లో ఒకరు ఆమెకు ఎవరో ఒకరిచ్చిన బహుమతున్న ఓ కవరునిచ్చేవాళ్లు. సహోదరుల ప్రేమే ఆమెను యెహోవాకు సన్నిహితురాలిని చేసిందని మరియు కష్టతరమైన కాలాల్లో సహించేందుకు ఆమెకు సహాయపడిందని అమ్మ ఎల్లప్పుడూ చెప్పేది. నాన్నగారు లేని కాలమంతా ఆమె నమ్మకంగా సంఘ కూటాలకు హాజరయ్యేది. ఓ సంవత్సరం పాటు నాన్నగారు బ్రతికి ఉన్నారో లేక చనిపోయారో తెలియని పరిస్థితిలోనే ఆమె అతి తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంది. ఆ భారానికి తోడు, అమ్మకీ నాకు 1918లో స్పానిష్ ఫ్లూ సోకింది. మా చుట్టూ ఉన్న ప్రజలు మరణిస్తూ ఉన్నారు. తమ పొరుగువారికి సహాయం చేసేందుకు వెళ్లిన వారికి ఈ రోగం సోకి మరణించారు. ఆ సమయంలోని ఆహార కొరతలు, ప్రజలు ఈ అంటువ్యాధిని తట్టుకునే వ్యాధినిరోధక శక్తిని తగ్గించేందుకు దోహదపడ్డాయి.
అపొస్తలుడైన పేతురు వ్రాసిన మాటలు మా కుటుంబం విషయంలో ఎంతో నిజమయ్యాయి: “దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును”! (1 పేతురు 5:10) మా తలిదండ్రుల బాధలు వారు యెహోవాయందు అచంచలమైన విశ్వాసాన్ని కల్గివుండేందుకు సహాయపడ్డాయి, అంటే ఆయన మన ఎడల నిజంగా శ్రద్ధకల్గివున్నాడని మరియు దేవుని ప్రేమనుండి మనలను ఏది వేరుపర్చదనే నిశ్చయమైన హామీని వారు కల్గివున్నారు. అలాంటి విశ్వాసంలో నేను పెరగడం ప్రత్యేకంగా ఆశీర్వాదకరమే.—రోమీయులు 8:38, 39; 1 పేతురు 5:7.
యౌవనకాల సేవ
నాన్న విడుదలైన తర్వాత, రాజ్య సేవ మా జీవితాల్లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించుకుంది. ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు తప్ప ఏ ఒక్క కూటానికైనా హాజరుకాకుండా ఉండడం నాకు జ్ఞాపకం లేదు. నాన్నగారు ఇంటికి వచ్చినవెంటనే, సమావేశానికి హాజరయ్యేందుకు డబ్బుకొరకు తన ప్లేట్ కెమెరానూ అమ్మ బంగారు గాజును అమ్మేశారు. సెలవు తీసుకుని విహారానికి వెళ్లే స్తోమత మాకు లేకపోయినప్పటికీ, లండన్ నందున్న వాటితో సహా మేము ఈ సమావేశాలన్నింటికీ హాజరయ్యాము.
యుద్ధం తర్వాతి మొదటి రెండు మూడు సంవత్సరాలు సేదదీర్పు కాలంగా ఉంది. నాన్నగారూ అమ్మా తమ సాంగత్యమూ మరియు సహవాసాలకు సంబంధించిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మేము ఇతర సహోదర సహోదరీలను ఎలా సందర్శించేవారిమో నాకు జ్ఞాపకముంది, మరి నేను ఓ చిన్నపాపగా కూర్చుని పెయింటు చేస్తూ బొమ్మలు గీస్తుండగా, నాకంటే పెద్దవారు సత్యాన్ని గూర్చిన నూతన అవగాహనపై అనేక గంటలు చర్చించుకోవడం నాకు జ్ఞాపకం ఉంది. కలిసి మాట్లాడుకోవడం, ఆర్గన్ వాయిద్యంతో పాటలు పాడుకోవడం ఆహ్లాదకరమైన సాంగత్యాన్ని అనుభవించడం, వారు ఎంతో ఆనందించేలా మరియు సేదదీర్పుపొందేలా చేసేది.
మా తలిదండ్రులు నా శిక్షణ విషయంలో ఎంతో కచ్చితంగా ఉండేవారు. స్కూల్లో నాకు అయిదేళ్లున్నప్పుడు సహితం, క్లాసు అంతా మత సిద్ధాంతాలకు సంబంధించినవాటిని నేర్చుకుంటుండగా నేను మాత్రం చదువుకునేందుకు “క్రొత్త నిబంధనను” తీసుకువెళ్లి అందరికీ భిన్నంగా కనిపించేదాన్ని. ఆ తర్వాత నేను స్మారకోత్సవ వేడుకలో భాగం వహించకుండా “మనస్సాక్షినిబట్టి వ్యతిరేకించిన” నందుకు పాఠశాలలోని అందరి ముందు నాచేత కవాతు చేయించారు.a నన్ను పెంచిన విధానానికి నేను బాధపడలేదు. వాస్తవానికి, అది నాకు ఒక రక్షణగా ఉండింది మరియు ‘ఇరుకు దారిలో’ కొనసాగడాన్ని అది మరింత సులభతరం చేసింది. కూటాలకైనా లేక సేవకైనా మా తలిదండ్రులు ఎక్కడికి వెళ్లినా నేను ఉండేదాన్ని.—మత్తయి 7:13, 14.
నేను నా స్వంతగా మొట్టమొదటిసారి ప్రకటించిన ఆదివారం ఉదయం నాకు బాగా జ్ఞాపకముంది. నాకు కేవలం 12 ఏళ్లు. నేను యౌవనురాలిగా ఉన్నప్పుడు ఓ ఆదివారం ఉదయం నేను ఇంట్లోనే ఉంటానని చెప్పడం నాకు జ్ఞాపకముంది. నన్ను ఎవ్వరూ విమర్శించలేదు లేక రమ్మమని బలవంతం చేయలేదు, కనుక నేను నా బైబిలును చదువుతూ ఎంతో అసంతోషంగానే భావిస్తూ తోటలో కూర్చున్నాను. ఇది జరిగిన ఒకటి లేక రెండువారాల తర్వాత నేను నాన్నగారితో ఇలా చెప్పాను: “ఈ రోజు ఉదయం నేను మీతో వస్తాను!” ఆ నాటినుండి నేను ఎన్నడూ వెనుదిరగలేదు.
1931 ఎంత మహాద్భుతమైన సంవత్సరం! యెహోవాసాక్షులు అనే క్రొత్త పేరును పొందడమే కాకుండ, లండన్ నందలి అలెక్షాండ్రియా పాలెస్ నందు జాతీయ సమావేశంలో నేను బాప్తిస్మంపొందాను. ఆ దినాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. మేము పొడువైన నల్లని దుస్తులను ధరించుకున్నాం మరి నాది తడిగా ఉంది ఎందుకంటే నాకు ముందు మరో అభ్యర్థి దాన్ని ఉపయోగించింది.
ఓ బాలికగా నేను కాల్పోర్టరును కావాలన్న తృష్ణ నాలో ఉండేది—ఆ నాడు పూర్తికాల సేవకులు అలా పిలువబడేవారు. నేను పెరిగే కొలది యెహోవా సేవలో ఇంకా ఎక్కువ చేయాలని భావించాను. కనుక 1933 మార్చిలో నాకు 18 ఏళ్లుండగా నేను పూర్తికాల సేవకుల శ్రేణిలో చేరాను.
కొన్ని పెద్ద పట్టణాల్లో మాకు ప్రత్యేకంగా ఆనందాన్ని తెచ్చిన విషయం “పయినీర్ల వారాలు,” ఆ సమయాల్లో ఒక డజన్ వరకు పూర్తికాల సేవకులు ఒకచోట చేరి స్థానిక సహోదరులతో ఉండి ఒక జట్టుగా పనిచేసేవారు. మతనాయకులకూ ఇతర ప్రముఖ వ్యక్తులకు మేము చిన్న పుస్తకాలను అందించాము. వారిని సమీపించేందుకు ధైర్యమవసరమైంది. ఎక్కువగా తిరస్కారం మమ్మల్ని ఆహ్వానిస్తుంది, మరి మాలో అనేకమంది ముఖం మీదే తలుపును దడేలుమనిపించడం జరిగింది. అంటే దీనివల్ల మేము బాధపడ్డామని కాదు, కారణం మాకు ఆ శక్తి ఎంతగా ఉండేదంటే క్రీస్తు నామంకొరకు దూషించబడడంలో మేము ఆనందించాము.—మత్తయి 5:11, 12.
లీడ్స్ నందు మేము పిల్లల బండిని మూడు చక్రాల సైకిలుకు మలచాము మరియు నాన్నగారి మోటారు సైకిలునూ సైడ్ కారునూ ఆ తర్వాత ఆయన కారునూ సైడ్ కారును లౌడ్‌స్పీకర్లున్న ఫోనోగ్రాఫ్‌లను తీసుకువెళ్లేందుకు ఉపయోగించాము. ఇద్దరు సహోదరులు ఆ పరికరాన్ని తీసుకుని ఓ వీధిలోకి వెళ్లి, ప్రజల అవధానాన్ని పొందేందుకు సంగీతాన్ని వినిపించి వారు తమ తలుపుల దగ్గిరకు వచ్చేట్లు చేస్తారు, ఆ తర్వాత సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ రికార్డు చేసిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని వినిపిస్తారు. వాళ్లు ఆ తర్వాత మరో వీధిలోకి వెళ్లేవారు మరి ప్రచారకులైన మేము వారిని అనుసరించి వెళ్లి బైబిలు ప్రచురణలను అందించేవాళ్లం.
సంవత్సరాలుగా ప్రతి రోజు ఆదివారం సాయంత్రం కూటాల తర్వాత మేము టౌన్ హాలు మైదానంలో కూడుకునేవాళ్లం. అక్కడ ప్రసంగించే స్థలం ఉండేది మరియు సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ అందించే ఒక గంట ప్రసంగాన్ని వినడం ద్వారా మద్దతునిచ్చి, కరపత్రాల్ని అందిస్తూ ఆసక్తి కనపర్చినవారిని మరలా కలుస్తూ ఉండేవాళ్లం. అక్కడ మేము ప్రసిద్ధిగాంచాము. పోలీసులు కూడా మాకు గౌరవమునిచ్చేవారు. ఒక రోజు సాయంత్రం మేము యథావిధిగా కూడుకున్నప్పుడు అక్కడ నుండి కొద్దిదూరంలో మేము మద్దెల చప్పుడునూ వాద్య మేళాన్ని విన్నాము. కొద్ది సేపటికి వంద మంది ఫాసిట్టులు కవాతు జరుపుతు అక్కడకు వచ్చారు. మా వెనుకగా వాళ్లు కవాతుచేసి తమ జెండాలను పైకి ఎత్తుగా పుచ్చుకుని ఆగారు. సహోదరుడైన రూథర్‌ఫోర్డ్ “కావాలంటే వాళ్లు తమ జెండాలకు వందనంచేసి మనుష్యులను స్తుతించనివ్వండి. మేము మా దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించి స్తుతిస్తాము!” అని గంభీరమైన స్వరంతో చెప్పినప్పుడు సంగీతమేళం ఆగి, అంతటా నిశ్శబ్దం వ్యాపించింది. ఇక తర్వాత ఏమి జరుగుతుందోనని మేము ఆలోచిస్తున్నాము! వాళ్లు ఓ మంచి సాక్ష్యాన్ని పొందారు, మరి మిగిలిన బహిరంగ ప్రసంగాన్ని మేము వినేందుకుగాను పోలీసులు, వారు గొడవ చేయకుండా చూడడానికి మించి వేరే ఏమీ జరగలేదు.
ఈ సమయానికల్లా, మేము అద్భుతమైన సాక్ష్యాన్నిచ్చేందుకుగాను ఫోనోగ్రాఫ్ బాగా ఉపయోగపడింది. ఇంటి ద్వారం వద్ద, రికార్డు చేయబడిన అయిదునిమిషాల బైబిలు ప్రసంగాన్ని ప్రజలు వినడానికి ప్రోత్సహించేందుకు ఆ రికార్డుపై జాగ్రత్తగా కళ్లను నిలిపేవాళ్లం. ఇంటివారు తరచూ మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించేవారు మరియు మేము మరలా వెళ్లి వారికి రికార్డులను వినిపించాలని వారు కోరారు.
వ్యతిరేకతలు మరియు దౌర్జన్యంతో 1939వ సంవత్సరం ఎంతో బిజీగానూ కష్టంగానూ సాగింది. మా సమావేశాల్లో ఒకటి జరగకముందు, అనేకమంది సహోదరులు వీధిలో అల్లరి మూకల దొమ్మిని, అరుపులను అనుభవించారు. కనుక సమావేశ సమయంలో, సమస్యలున్న ప్రాంతంలో ప్రకటించేందుకు ప్రత్యేకంగా కార్లలో సహోదరుల దళాన్ని పంపించేందుకు పథకం వేశారు, అయితే సహోదరీలు మరితర సహోదరులు మరింత సురక్షితమైన స్థలానికి వెళ్లేవారు. ఒక గుంపుతో పనిచేస్తూ ఓ రోడ్డుకు ఆవలివైపునున్న ఇళ్లను సందర్శించేందుకు ఓ సన్నని దారిగుండా నేను వెళ్లాను. ఒక ఇంటి వద్ద ఉన్నప్పుడు, అలజడి రేగడం నాకు వినిపించింది—వీధిలో అరుపులూ కేకలు వినిపించాయి. అంతా నెమ్మదైందని నాకు అనిపించేంతవరకు నేను నా సంభాషణను పొడిగిస్తూ ఆ ఇంటి వద్ద ఉన్న వ్యక్తితో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ తర్వాత నేను మరలా ఆ సన్నని దారిలో వెనక్కు వచ్చాను, నేను కనిపించకపోయేసరికి సహోదర సహోదరీలు భయపడ్డారన్న సంగతి వీధిలోకి ప్రవేశించిన తర్వాత తెలిసింది! అయితే, ఆ రోజు సాయంకాలం సమస్యలను సృష్టించేవారు మా కూటాలకు అంతరాయం కల్గించేందుకు ప్రయత్నించారు, అయితే సహోదరులు వారిని బైటికి పంపించేశారు.
రెండవ ప్రపంచయుద్ధం విరుచుకుపడింది
ఈ సమయానికల్లా నిర్బంధ సైనిక శిక్షణ పూర్తిగా పనిచేయడం ప్రారంభమైంది, మరి 3 నుండి 12 నెలల వరకు అనేకమంది సహోదరులు చెరసాలలో వేయబడ్డారు. అప్పుడు మా నాన్నగారు కారాగారాలను దర్శించే వ్యక్తిగా మరో ఆధిక్యతను పొందారు. ప్రతి ఆదివారమూ నాన్నగారు ఆ స్థానిక జైలులో కావలికోట పఠనాన్ని నిర్వహించేవారు. బుధవారం సాయంకాలాలు జైలుగదిలోనున్న సహోదరులను ఆయన సందర్శించేవారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తాను కూడా ఎంతో కాలం కఠినమైన ఖైదును అనుభవించారు కనుక, అలాంటి శ్రమలను అనుభవిస్తున్న వారికి సహాయం చేయడంలో ఆయన ఎంతో ఆనందించారు. దీన్ని ఆయన 20 సంవత్సరాలవరకు చేశారు, అంటే 1959 నందు ఆయన మరణించేంతవరకు చేశారు.
1941 కల్లా మా తటస్థతా స్థానం విషయంలో అనేకమంది ప్రజలు వ్యక్తపర్చిన కఠినత మరియు హేయ భావాలకు అలవాటుపడడం ప్రారంభించాము. వీధుల్లో పత్రికలు పుచ్చుకుని నిలుచుని దీన్ని ఎదుర్కోవడం సులభం కాదు. అదే సమయంలో మా ప్రాంతంలో ఉన్న శరణార్థులకు సహాయం చేయడంలో మేము ఆనందించాము. లాటీవియన్లు, పోలెండ్‌వారు, ఎస్టోనియన్లు, జర్మన్లు ఉండేవారు, కావలికోట లేక ఓదార్పు (నేడు తేజరిల్లు!) పత్రికలను తమ స్వంత భాషలో వారు చూసి ఆనందంతో వారి కళ్లు మెరుస్తుండగా చూడడం ఎంత ఆనందకరమో కదా!
ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన కాలంలో నేను తీసుకున్న తటస్థతా స్థానపు పరీక్ష వచ్చింది. ప్రతి 24 గంటలకూ 19 గంటలు నా ఖైదు గదిలో ఉండడం వల్ల ఆ ఖైదు జీవితం నాకు చాలా కఠినమనిపించింది. మొదటి మూడు రోజులు చాలా కఠినమనిపించాయి, ఎందుకంటే నేను ఒంటరిగా ఉండేదాన్ని. నాలుగవ రోజున, నన్ను గవర్నర్ ఆఫీసులోకి పిలిచారు, అక్కడ ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉండడం నేను చూశాను. అందులో ఒక అమ్మాయి నెమ్మదిగా, “నువ్వు ఇక్కడ ఎందుకున్నావు?” అని అడిగింది. అందుకు నేను, “ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు” అని అన్నాను. ఆమె మరింత నెమ్మదిగా, “నువ్వు యెహోవాసాక్షివా” అని అడిగింది. ఆ వేరే అమ్మాయి ఆమె చెప్పింది విని మమ్మల్నిద్దర్ని “మీరు యెహోవాసాక్షులా” అని అడిగింది. అంతే మేము ముగ్గురం ఒకరినొకరు కౌగలించుకున్నాము. మేమిక ఒంటరివాళ్లం కానేకాము!
ఆనందభరితమైన పూర్తికాల సేవ
చెరసాలనుండి విడుదల పొందిన తర్వాత, నేను నా పూర్తికాల సేవను కొనసాగించాను, మరి అప్పుడే పాఠశాల విద్యను ముగించిన 16 ఏళ్ల ఓ యౌవనస్థురాలు నాతో చేరింది. యోక్‌షైర్ డేల్స్ దరిదాపునేవున్న ఐల్కిలీ అనే అందమైన పట్టణానికి మేము వెళ్లాము. పూర్తిగా ఆరునెలలవరకూ మా కూటాలకు అనుగుణమైన స్థలాన్ని కనుగొనేందుకు మేము ఎంతో ప్రయత్నించాము. చివరికి మేము ఓ గారేజీని అద్దెకు తీసుకుని, దాన్ని రాజ్యమందిరం చేసుకున్నాము. నాన్నగారు విద్యుత్తును మరియు వేడిమిని అందించడం ద్వారా మాకు సహాయం చేశారు. ఆయన ఓ బిల్డింగును మా కొరకు అలంకరించి ఇచ్చారు. కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రక్కనున్న సంఘం, ప్రతివారం బహిరంగ ప్రసంగాలను అందించేందుకు సహోదరులను నియమిస్తూ మాకు సహాయపడింది. యెహోవా సహాయంతో మేము అభివృద్ధి చెందాము, మరి చివరికి అక్కడ ఓ సంఘం స్థాపించబడింది.
జనవరి 1959 నందు నాన్నగారు అకస్మాత్తుగా అస్వస్థులయ్యారు. నన్ను ఇంటికి పిలిపించారు మరి ఆయన ఏప్రిల్ నెలలో మరణించారు. దాని తర్వాత వచ్చిన సంవత్సరాలు చాలా కఠినమైనవి. అమ్మ ఆరోగ్యం పాడైంది మరియు దానితో ఆమె జ్ఞాపకశక్తి కూడా క్షీణించింది. అది నేను పోరాడడం కష్టతరం చేసింది. అయితే యెహోవా ఆత్మ నేను కొనసాగేలా నాకు సహాయపడింది మరియు 1963లో ఆమె మరణించేంతవరకూ నేను ఆమెను చూసుకోగలిగాను.
అనేక సంవత్సరాలుగా యెహోవానుండి నాకు అనేక ఆశీర్వాదాలు లభించాయి. అవి నేను ఎంచలేనన్ని ఉన్నాయి. నా మొదటి సంఘం పెరిగి నాలుగుసార్లు నాలుగు సంఘాలుగా అభివృద్ధి చెందడం, ప్రచారకులనూ పయినీర్లను పంపించడం, బొలివియా లొయో యుగాండ వంటి దూర దూర ప్రాంతాలకు మిషనరీలను పంపించడం నేను చూశాను. పెళ్లి చేసుకుని స్థిరపడడానికి నా పరిస్థితులు అనుమతించలేదు. అందుకు నేను బాధపడలేదు; నేను బొత్తిగా తీరికలేకుండా ఉన్నాను. నాకు నా స్వంత బంధువులెవరూ లేకపోయినప్పటికీ, ప్రభువునందు నాకు అనేకమంది పిల్లలూ మనవళ్లున్నారు, వందరెట్లుగా ఉన్నారు.—మార్కు 10:29, 30.
క్రైస్తవ సహవాసాన్ని అనుభవించేందుకు యౌవన పయినీర్లనూ ఇతర యౌవనులను నేను నా ఇంటికి ఆహ్వానిస్తాను. మేము కలిసి కావలికోట పఠనానికి సిద్ధపడతాము. మా అమ్మనాన్నలు చేసినట్లుగానే మేము అనుభవాలను చెప్పుకుని రాజ్య గీతాలను పాడుకుంటాము. ఆనందభరితమైన యౌవనుల మధ్య ఉండడంతో నేను ఉల్లాసభరితమైన శ్రేష్ఠమైన దృక్పథాన్ని కల్గివుండగల్గుతున్నాను. పయినీరు సేవకన్నా ఆనందమయమైన జీవితం నాకు మరొకటి లేదు. మా తలిదండ్రుల అడుగుజాడలను అనుసరించగల ఆధిక్యత నాకున్నందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. నేను నిరంతరం యెహోవాను సేవిస్తూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను.
[అధస్సూచీలు]
a మొదట 1918, ఆ తర్వాత 1945లోని ద్వేషభావాల అంతానికి సంబంధించిన స్మారకోత్సవం.
[23వ పేజీలోని చిత్రం]
తన తలిదండ్రులైన అట్కిన్సన్ మరియు పాట్టిలతో హిల్డా పడ్గెట్
[23వ పేజీలోని చిత్రం]
సత్యం ఎడల నాన్నగారి ఆసక్తిని రేకెత్తించిన కరపత్రం