తలిదండ్రులారా, పిల్లలారా: దేవునికి మొదటి స్థానం ఇవ్వండి!
‘సత్యదేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను.’—ప్రసంగి 12:13.
1. తలిదండ్రులు, పిల్లలు ఎలాంటి భయాన్ని అలవర్చుకోవాలి, అది వారికి ఏమి తెస్తుంది?
“యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును” అని యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక ప్రవచనం చెబుతుంది. (యెషయా 11:3) ఆయన భయం ప్రాముఖ్యంగా దేవుని ఎడల ప్రగాఢమైన గౌరవం, భక్తిపూర్వకమైన భయం కలిగి, దేవున్ని ప్రేమించాడు గనుక ఆయనను అప్రీతిపర్చకూడదనే భయమైయుండెను. తలిదండ్రులు పిల్లలు క్రీస్తువంటి దైవ భయాన్ని అలవర్చుకోవలసిన అవసరత ఉంది, అది యేసుకు కలిగించినట్లుగానే వారికి కూడా ఆనందం కలిగిస్తుంది. దేవుని ఆజ్ఞలకు విధేయులు కావడం ద్వారా వారు తమ జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసి ఉంటుంది. ఒక బైబిలు రచయిత ప్రకారం “మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.
2. ధర్మశాస్త్రం యొక్క అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి, అది ప్రాథమికంగా ఎవరికి ఇవ్వబడింది?
2 ‘యెహోవాను పూర్ణ హృదయంతోను, ప్రాణితోను, జీవశక్తితోను ప్రేమించమనే’ ధర్మశాస్త్రంలోని అత్యంత ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ ప్రాథమికంగా తలిదండ్రులకు ఇవ్వబడింది. ధర్మశాస్త్రం యొక్క ఈ తరువాతి మాటల్లో అది చూపించబడింది: “నీవు నీ కుమారులకు [యెహోవాను ప్రేమించాలనేదాన్ని గూర్చిన ఈ మాటలను] అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండనప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను” అని చెప్పబడే ధర్మశాస్త్రంలోని తరువాతి మాటల ద్వారా చూపించబడింది. (ద్వితీయోపదేశకాండము 6:4-7; మార్కు 12:28-30) అలా దేవున్ని తాము ప్రేమించడం ద్వారా ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలని, అలాగే చేయమని తమ పిల్లలకు బోధించాలని తలిదండ్రులకు ఆజ్ఞాపించబడింది.
ఒక క్రైస్తవ బాధ్యత
3. పిల్లలకు శ్రద్ధనివ్వడం యొక్క ప్రాముఖ్యతను యేసు ఎలా ప్రదర్శించాడు?
3 చిన్న పిల్లలకు కూడా శ్రద్ధనివ్వడం యొక్క ప్రాముఖ్యతను యేసు చూపించాడు. యేసు భూ పరిచర్య ముగింపు సమయంలో ఒక సందర్భాన, ప్రజలు తమ శిశువులను ఆయన యొద్దకు తీసుకురావడం మొదలు పెట్టారు. యేసు ఎక్కువ పని కలిగివున్నందున ఆయనను ఇబ్బంది పెట్టడం బాగుండదని భావించి కావచ్చు, శిష్యులు ప్రజలను ఆపాలని ప్రయత్నించారు. కాని, “చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు” అని యేసు తన శిష్యులను గద్దించాడు. చిన్నపిల్లలకు శ్రద్ధనివ్వడం యొక్క ప్రాముఖ్యతను స్పర్శించే రీతిలో చూపిస్తూ, యేసు “బిడ్డలను ఎత్తి కౌగిలించు”కొన్నాడు కూడా.—మార్కు 10:13-16; లూకా 18:15-17.
4. “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అనే ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడింది, దాని కొరకు వారు ఏమి చేయవలసి ఉంటుంది?
4 ఇతరులకే కాకుండా తమ స్వంత పిల్లలకు కూడా బోధించే బాధ్యత తన అనుచరులకు ఉందని కూడా యేసు స్పష్టం చేశాడు. తన మరణ పునరుత్థానాల తర్వాత, కొంతమంది తలిదండ్రులతో సహా “ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు” యేసు “ఒక్క సమయమందే కనబడెను.” (1 కొరింథీయులు 15:6) స్పష్టంగా, ఆయన తన అపొస్తలులు 11 మంది కూడా సమావేశమైన స్థలంలో, గలిలయ పర్వతంపై ఇది జరిగింది. అక్కడ యేసు వారినందరినీ ఇలా కోరాడు: ‘కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.’ (మత్తయి 28:16-20) ఏ క్రైస్తవుడూ ఈ ఆజ్ఞను న్యాయంగా నిర్లక్ష్యం చేయలేడు! తండ్రులు, తల్లులు దాన్ని అనుసరించాలంటే, వారు తమ పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటూ, అలాగే బహిరంగ పరిచర్యలో, బోధనాపనిలో భాగం వహించాలి.
5. (ఎ) అందరూ కాకపోయినా అపొస్తలుల్లో అనేకమంది వివాహితులే గనుక వారికి పిల్లలు ఉండి ఉండవచ్చునని ఏది చూపిస్తుంది? (బి) కుటుంబ పెద్దలు ఏ ఉపదేశాన్ని గంభీరంగా తీసుకోవలసిన అవసరం ఉంది?
5 విశేషంగా, అపొస్తలులు కూడా తమ కుటుంబ బాధ్యతలను ప్రకటనపని మరియు దేవుని మందను కాయడమనే పనులతో సమతూకం చేయవలసి ఉండెను. (యోహాను 21:1-3, 15-17; అపొస్తలుల కార్యములు 1:8) ఇలా ఎందుకంటే అందరూ కాకపోయినా, వారిలో అనేకులు వివాహితులే. అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “తక్కిన అపొస్తలులవలెను, ప్రభువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారములేదా?” (ఐటాలిక్కులు మావి.) (1 కొరింథీయులు 9:5; మత్తయి 8:14) కొంతమంది అపొస్తలులకు పిల్లలు కూడా ఉండవచ్చు. యూసిబీస్ వంటి తొలి చరిత్రకారులు పేతురుకు పిల్లలున్నారని చెబుతారు. తొలి క్రైస్తవ తలిదండ్రులందరూ ఈ లేఖనాధార ఉపదేశాన్ని గైకొనవలసిన అవసరత ఉంది: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.”—1 తిమోతి 5:8.
ప్రాథమిక బాధ్యత
6. (ఎ) కుటుంబాలుగల క్రైస్తవ పెద్దలకు ఏ సవాలును ఎదుర్కోవలసి ఉంది? (బి) పెద్ద యొక్క ప్రాథమిక బాధ్యత ఏమిటి?
6 నేడు కుటుంబాలు గల క్రైస్తవ పెద్దలు ఆ అపొస్తలుల వంటి పరిస్థితిలోనే ఉన్నారు. వారు తమ కుటుంబాల ఆత్మీయ మరియు శారీరక అవసరతల గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యతను బహిరంగ ప్రకటన పని మరియు దేవుని మందను కాయడమనే తమ బాధ్యతతో సమతూకం చేయవలసి ఉంటుంది. ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వబడాలి? మార్చి 15, 1964 కావలికోట (ఆంగ్లం) ఇలా తెలియజేసింది: “[తండ్రి యొక్క] మొదటి బాధ్యత ఆయన కుటుంబం ఎడలనే ఉంటుంది, వాస్తవానికి ఆయన ఈ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేకపోతే, ఆయన పెద్దగా సరిగ్గా పనిచేయలేడు.”
7. క్రైస్తవ తండ్రులు దేవునికి మొదటి స్థానం ఎలా ఇస్తారు?
7 ‘వారి పిల్లలకు కోపము రేపక యెహోవా యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి’ అనే ఆజ్ఞను అనుసరించడం ద్వారా తండ్రులు దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. (ఎఫెసీయులు 6:4) క్రైస్తవ సంఘంలోని పనులను పర్యవేక్షించవలసిన పని కూడా ఒక తండ్రికి ఉన్నప్పటికీ, పిల్లలను గూర్చిన ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించకూడదు. కుటుంబ సభ్యులకు శారీరకంగా, ఆత్మీయంగా, భావోద్రేకపరంగా అన్నీ సమకూరుస్తూ, అదే సమయంలో సంఘంలో అధ్యక్షత వహించి పర్యవేక్షించడం వంటి తమ బాధ్యతలను అలాంటి తండ్రులు ఎలా నిర్వర్తించగలరు?
అవసరమైన మద్దతునివ్వడం
8. పెద్దకు అతనికి భార్య ఎలా మద్దతునివ్వగలదు?
8 స్పష్టంగా, కుటుంబ బాధ్యతలు గల పెద్దలు మద్దతు ద్వారా ప్రయోజనం పొందగలరు. క్రైస్తవ భార్య తన భర్తకు మద్దతునివ్వగలదని పైన చెప్పబడిన కావలికోట (ఆంగ్లం) తెలియజేసింది. అదిలా చెప్పింది: “ఆమె ఇంట్లో మంచి పట్టికను కలిగివుండడం ద్వారా, సమయానికి భోజనాలు సిద్ధం చేయడం ద్వారా, సంఘ కూటాలకు వేళకు వెళ్లడానికి సిద్ధంగా ఉండడం ద్వారా, అతడు తన అనేక బాధ్యతల గురించి సిద్ధమవ్వడానికి వీలైనంత అనుకూలతను కలుగజేయగలదు, అలాగే ఇద్దరి అమూల్యమైన సమయం వ్యర్థం కాకుండా కాపాడడానికి సహాయం చేయగలదు. . . . తన భర్త పర్యవేక్షణ క్రింద, యెహోవాను ప్రీతిపర్చేవారిగా తయారయ్యేందుకు పిల్లలకు శిక్షణనివ్వడానికి ఒక క్రైస్తవ భార్య ఎంతో చేయగలదు.” (సామెతలు 22:6) అవును, భార్య “సహాయకారి”గా ఉండడానికి సృష్టించబడింది, భర్త ఆమె సహాయాన్ని జ్ఞానయుక్తంగా ఆహ్వానిస్తాడు. (ఆదికాండము 2:18) ఆమె మద్దతు అతడు తన కుటుంబ మరియు సంఘ సంబంధమైన బాధ్యతలను మరింత ప్రభావవంతంగా నిర్వర్తించడానికి సహాయపడుతుంది.
9. సంఘంలోని ఇతర సభ్యులకు సహాయం చేయమని థెస్సలొనీక సంఘంలోని ఎవరు ప్రోత్సహించబడ్డారు?
9 అయితే, “దేవుని మందను పైవిచారణ” చేస్తూ, తమ స్వంత గృహాన్ని గూర్చి శ్రద్ధ తీసుకోవలసిన అధ్యక్షునికి మద్దతునిచ్చే పనిలో భాగం వహించగలవాళ్లు కేవలం క్రైస్తవ పెద్దల భార్యలు మాత్రమే కాదు. (1 పేతురు 5:2) మరింకెవరు కూడా? తమ “పైవిచారణ” చేస్తున్న వారి ఎడల గౌరవం కలిగివుండాలని అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని సహోదరులను కోరాడు. అయితే, ఈ సహోదరులకే అంటే ప్రాముఖ్యంగా అధ్యక్షులు కాని వారిని ఉద్దేశించి పౌలు ఇలా వ్రాశాడు: “అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధిచెప్పుడి, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతముగలవారై యుండుడి.”—1 థెస్సలొనీకయులు 5:12-14.
10. సహోదరులందరి ప్రేమపూర్వకమైన సహాయం సంఘంపై ఏ చక్కని ప్రభావాన్ని చూపిస్తుంది?
10 సంఘంలోని సహోదరులు ధైర్యము చెడినవారిని ధైర్యపరచడానికి, బలహీనులకు ఊతనివ్వడానికి, అందరియెడల దీర్ఘశాంతము కలిగివుండడానికి వారిని కదిలించేలాంటి ప్రేమ కలిగివుంటే ఎంత బాగుంటుందో కదా! ఎంతో శ్రమను సహించి బైబిలు సత్యాన్ని ఇటీవలనే హత్తుకున్న థెస్సలొనీకలోని సహోదరులు, అలా చేయమని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వర్తించుకున్నారు. (అపొస్తలుల కార్యములు 17:1-9; 1 థెస్సలొనీకయులు 1:6; 2:14; 5:11) సంఘాన్నంతటినీ బలపర్చడంలోను ఐక్యపర్చడంలోను వారి ప్రేమపూర్వకమైన సహకారం చూపించిన చక్కని ప్రభావం గురించి ఆలోచించండి! అలాగే, నేడు సహోదరులు ఒకరినొకరు ధైర్యపరచుకొని, ఊతనిచ్చుకొని, దీర్ఘశాంతము కలిగివుంటే, తరచూ శ్రద్ధ తీసుకోవలసిన కుటుంబాలను కలిగివున్న పెద్దలకు పర్యవేక్షించవలసిన తమ బాధ్యతలను చేపట్టడం ఎంతో సులభమౌతుంది.
11. (ఎ) “సహోదరు”లనే పదంలో స్త్రీలు కూడా చేరివున్నారని మనం ముగించడం ఎందుకు సహేతుకమైనది? (బి) నేడు యౌవన స్త్రీలకు పరిపక్వత చెందిన క్రైస్తవ స్త్రీలు ఏ సహాయాన్నివ్వగలరు?
11 అపొస్తలుడైన పౌలు ఎవరికి ఉపదేశిస్తున్నాడో ఆ “సహోదరుల”లో స్త్రీలు కూడా చేరివున్నారా? అవును, వారు కూడా ఉండిరి, ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు విశ్వాసులయ్యారు. (అపొస్తలుల కార్యములు 17:1, 4; 1 పేతురు 2:17; 5:9) అలాంటి స్త్రీలు ఎలాంటి సహాయాన్ని అందివ్వగలరు? తమ ‘లైంగిక కోరికలను’ అదుపు చేసుకోవడంలో సమస్యగల, లేక ‘కృంగిన ప్రాణం’ గల యౌవనస్థులైన స్త్రీలు సంఘాల్లో ఉండేవారు. (1 తిమోతి 5:11-13) నేడు కొంతమంది స్త్రీలకు అలాంటి సమస్యలే ఉన్నాయి. వారికి కావలసినదల్లా తమ సమస్యలను విని, సానుభూతి చూపించేవారు మాత్రమే కావచ్చు. అలాంటి సహాయాన్ని తరచూ ఒక పరిపక్వత చెందిన క్రైస్తవ స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. ఉదాహరణకు, ఒక క్రైస్తవ పురుషుడు సరైన విధంగా చేపట్టలేని వ్యక్తిగతమైన సమస్యలను ఆమె మరో స్త్రీతో చర్చించగలదు. అలాంటి సహాయాన్ని అందజేయడం యొక్క ప్రాముఖ్యతను ఉన్నతపరుస్తూ, పౌలు ఇలా వ్రాశాడు: “ఆలాగుననే వృద్ధ స్త్రీలు . . . దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధిచెప్పుచు, మంచి ఉపదేశముచేయువారునై యుండ”వలెను.—తీతు 2:3-5.
12. సంఘంలోని వారందరూ ఎవరి నడిపింపును అనుసరించడం అవశ్యము?
12 తమ భర్తలకు, పెద్దలకు సహకారపూర్వకంగా మద్దతునిచ్చే దీనులైన సహోదరీలు ఉండటం సంఘానికి ఎంత దీవెనకరం! (1 తిమోతి 2:11, 12; హెబ్రీయులు 13:17) అందరూ ఒకరికొకరు ప్రేమపూర్వకంగా సహకరించుకొంటూ, అందరూ నియమిత కాపరుల నడిపింపు క్రింద విధేయత కలిగివున్నప్పుడు ప్రాముఖ్యంగా కుటుంబ బాధ్యతలు గల పెద్దలు ప్రయోజనం పొందుతారు.—1 పేతురు 5:1, 2.
తలిదండ్రులారా, మీరు దేనికి మొదటి స్థానం ఇస్తారా?
13. అనేకమంది తండ్రులు తమ కుటుంబాలను ఎలా విఫలం చేస్తారు?
13 చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ వినోదకుడు ఇలా అన్నాడు: “వందలకొలది మనుష్యులు పనిచేస్తున్న కంపెనీలను సఫలులైన పురుషులు నడిపించడం నేను చూస్తాను; ప్రతి పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో, వ్యాపార ప్రపంచంలో ఎలా క్రమశిక్షణనిచ్చి, ప్రతిఫలం ఇవ్వాలో వారికి తెలుసు. కాని వారు నడుపుతున్న అత్యంత పెద్ద వ్యాపారం వారి కుటుంబమే, కాని అక్కడ మాత్రం వారు విఫలమౌతారు.” ఎందుకు? వ్యాపారానికి ఇతర ఆసక్తులకు మొదటి స్థానం ఇచ్చి దేవుని ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే కాదా? ఆయన వాక్యం ఇలా చెబుతుంది: ‘నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు . . . నీవు నీ కుమారునికి అభ్యసింప చేయవలెను.’ దీన్ని ప్రతిరోజు చేయాలి. తలిదండ్రులు తమ సమయాన్ని, ప్రాముఖ్యంగా తమ ప్రేమను, లోతైన శ్రద్ధను ధారాళంగా ఇవ్వవలసిన అవసరం ఉంది.—ద్వితీయోపదేశకాండము 6:6-9.
14. (ఎ) తలిదండ్రులు తమ పిల్లల ఎడల ఎలా శ్రద్ధ వహించవచ్చు? (బి) పిల్లలకు సరైన క్రమశిక్షణనివ్వడంలో ఏమి ఇమిడివుంది?
14 పిల్లలు యెహోవానుండి వచ్చిన స్వాస్థ్యమని బైబిలు మనకు గుర్తు చేస్తుంది. (కీర్తన 127:3) మీరు మీ పిల్లలను దేవుని సొత్తువలె, ఆయన మీకు అప్పగించిన బహుమానం వలె వారి ఎడల శ్రద్ధ తీసుకుంటున్నారా? మీ ప్రేమపూర్వకమైన శ్రద్ధను, ఆసక్తిని చూపిస్తూ మీరు మీ బిడ్డను మీ చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతడు లేక ఆమె తప్పకుండా ప్రతిస్పందిస్తారు. (మార్కు 10:16) కాని ‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పాలంటే,’ వాన్ని హత్తుకోవడం, ముద్దులు పెట్టడం కంటే ఎక్కువే చేయడం అవసరం. జీవిత ఒడిదుడుకులను తట్టుకోవడానికి బిడ్డకు తగిన జ్ఞానాన్ని అందజేయాలంటే, బిడ్డకు ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ కూడా అవసరం. ‘శిక్షించడం’ ద్వారా ఒక తల్లి లేక తండ్రి నిజమైన ప్రేమను చూపించవచ్చు.—సామెతలు 13:1, 24; 22:6.
15. తలిదండ్రులిచ్చే క్రమశిక్షణ యొక్క అవసరతను ఏది చూపిస్తుంది?
15 తన కార్యాలయానికి వచ్చే పిల్లల గురించి ఒక పాఠశాల ఉపదేశకురాలు ఇలా వివరించిన దానిలో తలిదండ్రులిచ్చే క్రమశిక్షణ యొక్క అవసరతను చూడవచ్చు: “వారు జాలిపొందదగినవారు, కృంగిపోయినవారు, ఆత్మస్థయిర్యం లేనివారు. నిజంగా సంగతులు ఎలా జరుగుతున్నాయో వివరించేటప్పుడు వారు ఏడుస్తున్నారు. ఒకరు ఊహించగలిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువమంది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారు, అలా చేసింది వాళ్లు సంతోషం పట్టలేక కాదు; వాళ్లు ఎంతో అసంతోషంగా, శ్రద్ధతీసుకోబడనట్లు, ఒత్తిడికి గురౌతున్నట్లు భావిస్తున్నారు గనుకనే వారలా చేస్తున్నారు. ఎందుకంటే ఆ చిరు ప్రాయంలో వారికి ‘బాధ్యత అప్పగించబడింది’ అది కేవలం వారు చేపట్టలేనిది.” ఆమె ఇంకా ఇలా చెప్పింది: “తాను విషయాలను నడిపిస్తున్నానని భావించడం ఆ పసివానికి భయం గొల్పే విషయంగా ఉంటుంది.” నిజమే, పిల్లలు క్రమశిక్షణను తప్పించుకోవాలని ప్రయత్నించవచ్చు, కాని వాస్తవానికి వారు తలిదండ్రుల నడిపింపును, కట్టుదిట్టాలను గుణగ్రహిస్తారు. తమకు పరిధులు విధించడానికి తమ తలిదండ్రులు తగినంత శ్రద్ధ తీసుకుంటున్నారని వారు సంతోషిస్తారు. “అలా చేయడం నాపై నుండి పెద్ద భారం తీసివేసినట్లు ఉందని” అలా పరిధులు విధించిన తలిదండ్రులు గల యౌవనస్థుడు చెబుతున్నాడు.
16. (ఎ) క్రైస్తవ గృహాల్లో పెంచబడిన కొంతమంది పిల్లలకు ఏమి జరుగుతుంది? (బి) పిల్లవాడు చెడిపోవడానికి కారణం తలిదండ్రులు ఇచ్చిన తర్ఫీదే ఎందుకు కానవసరం లేదు?
16 అయితే, తమను ప్రేమించి, చక్కని తర్ఫీదునిచ్చే తలిదండ్రులు ఉన్నప్పటికీ, యేసు ఉపమానంలోని తప్పిపోయిన కుమారుని వంటి కొంతమంది యౌవనస్థులు తలిదండ్రుల నడిపింపును నిరాకరించి, త్రోవతప్పిపోతారు. (లూకా 15:11-16) అయితే, సామెతలు 22:6 నందు చెప్పబడినట్లుగా తమ పిల్లవానిని సరైన విధంగా శిక్షించడమనే తమ బాధ్యతను తలిదండ్రులు నెరవేర్చలేదని దాని భావం కాకపోవచ్చు. ‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడన్న’ వ్యాఖ్యానం ఒక సాధారణ సూత్రంగా ఇవ్వబడింది. దుఃఖకరంగా, తప్పిపోయిన కుమారునివలె, కొంతమంది పిల్లలు ‘తలిదండ్రుల మాట వినరు.’—సామెతలు 30:17.
17. అవిధేయులైన పిల్లల తలిదండ్రులు దేనినుండి ఓదార్పు పొందవచ్చు?
17 ఒక అవిధేయుడైన కుమారుని తండ్రి ఇలా విలపించాడు: “అతని హృదయాన్ని చేరడానికి నేను ఎంతో ప్రయత్నించాను. ఏమి చేయాలో నాకు తోచలేదు, ఎందుకంటే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. ఏదీ పనిచేయలేదు.” అలాంటి అవిధేయులైన పిల్లలు తప్పిపోయిన కుమారుడు చేసినట్లుగానే, తాము పొందిన ప్రేమపూర్వకమైన శిక్షణను కొంతకాలానికి గుర్తుతెచ్చుకొని తిరిగివస్తారని నిరీక్షిద్దాము. అయితే వాస్తవమేమిటంటే, కొంతమంది పిల్లలు ఎదురు తిరిగి, తమ తలిదండ్రులకు ఎంతో వేదనను కలిగించే అవినీతికరమైన పనులు చేస్తారు. భూమిపై జీవించినవారిలోకెల్లా అత్యంత గొప్ప బోధకుడు కూడా ఎంతోకాలంగా తన విద్యార్థిగావున్న ఇస్కరియోతు యూదా తనను మోసగించడాన్ని చూశాడని తెలుసుకోవడం నుండి తలిదండ్రులు ఓదార్పు పొందవచ్చు. ఆత్మలుగానున్న తన కుమారులు అనేకమంది తన ఉపదేశాన్ని నిరాకరించి, తన తప్పు ఏమి లేకపోయినప్పటికీ తనకు ఎదురు తిరగడం వల్ల యెహోవా నిస్సందేహంగా దుఃఖపడి ఉంటాడు.—లూకా 22:47, 48; ప్రకటన 12:9.
పిల్లలారా—మీరు ఎవరిని ప్రీతిపరుస్తారు?
18. దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామని పిల్లలు ఎలా చూపించగలరు?
18 యౌవనులైన మిమ్మల్ని యెహోవా ఇలా కోరుతున్నాడు: “ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.” (ఎఫెసీయులు 6:1) ఇది చేయడం ద్వారా యౌవనస్థులు దేవునికి మొదటిస్థానం ఇస్తారు. మూర్ఖంగా ఉండకండి! “మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును” అని దేవుని వాక్యం చెబుతుంది. ఏ విధమైన క్రమశిక్షణ లేకుండానే మంచిగా ఉండగలమని మీరు గర్వంగా తలంచకూడదు. వాస్తవమేమిటంటే, “తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.” (సామెతలు 15:5; 30:12) కాబట్టి, తలిదండ్రుల ఆజ్ఞలను, శిక్షణను “ఆలకింపుమ”ని, “దాచుకొ”నుమని, “మరువకుమ”ని, “వినుడి” అని, “గైకొనుమ”ని, “త్రోసివేయకుమ”ని చెప్పే దైవిక నడిపింపును లక్ష్యపెట్టండి.—సామెతలు 1:8; 2:1; 3:1; 4:1; 6:20.
19. (ఎ) యెహోవాకు విధేయత చూపించేందుకు పిల్లలకు ఏ శక్తివంతమైన కారణాలున్నాయి? (బి) దేవుని ఎడల కృతజ్ఞత కలిగివున్నామని యౌవనస్థులు ఎలా చూపించగలరు?
19 యెహోవాకు విధేయత చూపించడానికి మీకు శక్తివంతమైన కారణాలు ఉన్నాయి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కాపాడే, మీరు ఆనందకరమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడే మరియు తమ తలిదండ్రులకు లోబడమని పిల్లలకు ఇవ్వబడిన ఆజ్ఞతో సహా ఆయన తన నియమాలను ఇచ్చాడు. (యెషయా 48:17) మీరు పాపమరణాల నుండి కాపాడబడి నిత్య జీవాన్ని పొందగలిగేలా ఆయన తన కుమారుడు మీ కొరకు మరణించేలా కూడా అనుగ్రహించాడు. (యోహాను 3:16) మీరు కృతజ్ఞత కలిగివున్నారా? మీరు నిజంగా దేవున్ని ప్రేమిస్తున్నారోలేదో, ఆయన ఏర్పాట్లను మెచ్చుకుంటున్నారోలేదో చూడడానికి మీ హృదయాన్ని పరిశీలిస్తూ ఆయన పరలోకం నుండి గమనిస్తున్నాడు. (కీర్తన 14:2) సాతాను కూడా గమనిస్తూ, మీరు దేవునికి విధేయత చూపించరని ఆరోపిస్తూ ఆయనను నిందిస్తున్నాడు. మీరు దేవునికి అవిధేయత చూపిస్తే, సాతానును సంతోషపర్చి, యెహోవాను ‘దుఃఖపెడతారు.’ (కీర్తన 78:40, 41) యెహోవా మిమ్మల్నిలా కోరుతున్నాడు: “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి [నాకు విధేయునిగా ఉండడం ద్వారా] నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును.” (సామెతలు 27:11) అవును, ప్రశ్నేమిటంటే, మీరు ఎవరిని ప్రీతిపరుస్తారు, సాతానునా లేక యెహోవానా?
20. తనకు భయం కలిగే సమయాల్లో కూడా యెహోవాను సేవించేందుకు ఒక యౌవనస్థురాలు ఎలా ధైర్యాన్ని కాపాడుకుంది?
20 సాతాను అతని ప్రపంచం మీపైకి తెచ్చే ఒత్తిళ్ల మధ్యన దేవుని చిత్తాన్ని చేయడం సులభమేమీ కాదు. అది భయం గొల్పేదిగా ఉండవచ్చు. ఒక యౌవనస్థురాలు ఇలా చెప్పింది: “భయపడడం అంటే చలిగా ఉండడం వంటిదే. మీరు దాని గురించి ఏదైనా చేయవచ్చు.” ఆమె ఇలా వివరించింది: “మీకు చలిగా ఉంటే మీరు స్వెట్టరు వేసుకుంటారు. మీకు ఇంకా చలిగా ఉంటే, మీరు మరొకటి వేసుకుంటారు. ఇక మీకు చలిపెట్టకుండా ఉండేంత వరకు మీరు ఒకదానిపై ఒకటి వేసుకుంటూనే ఉంటారు. కాబట్టి మీరు భయపడినప్పుడు యెహోవాకు ప్రార్థన చేయడమన్నది చలిగా ఉన్నప్పుడు స్వెట్టరు వేసుకోవడం వంటిదే. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇంకా భయంగా ఉంటే, నేను మళ్లీ, మళ్లీ, మళ్లీ, నేను ఇక ఎంత మాత్రం భయపడకుండా ఉండేంత వరకు ప్రార్థన చేస్తాను. అది పనిచేస్తుంది. అది నా సమస్య పరిష్కారమయ్యేలా చేసింది!”
21. మనం యెహోవాకు మన జీవితాల్లో మొదటి స్థానాన్ని ఇవ్వడానికి నిజంగా ప్రయత్నించినట్లయితే, ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడు?
21 మనం మన జీవితాల్లో దేవునికి నిజంగా మొదటి స్థానం ఇవ్వడానికి ప్రయత్నిస్తే, యెహోవా మనకు సహాయం చేస్తాడు. తన కుమారునికి అందజేసినట్లుగానే మనకు అవసరమైనప్పుడు దేవదూతల సహాయాన్ని అందజేయడం ద్వారా ఆయన మనల్ని బలపరుస్తాడు. (మత్తయి 18:10; లూకా 22:43) తలిదండ్రులారా, పిల్లలారా మీరందరూ ధైర్యంగా ఉండండి. క్రీస్తువంటి భయం కలిగి ఉండండి, అది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. (యెషయా 11:3) అవును, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”—ప్రసంగి 12:13.
మీరు సమాధానమివ్వగలరా?
◻ యేసు తొలి అనుచరులు ఏ బాధ్యతలను సమతూకం చేయవలసిన అవసరం ఉండినది?
◻ క్రైస్తవ తలిదండ్రులు ఏ బాధ్యతను నెరవేర్చాలి?
◻ కుటుంబాలు గల క్రైస్తవ పెద్దలకు ఏ సహాయం అందుబాటులో ఉంది?
◻ సంఘంలో సహోదరీలు ఏ విలువైన సేవను అందజేయగలరు?
◻ పిల్లలు ఏ ఉపదేశాన్ని, నడిపింపును అనుసరించడం అవశ్యం?
[15వ పేజీలోని చిత్రం]
తరచూ పరిపక్వత గల క్రైస్తవ స్త్రీ ఒక యువతికి అవసరమైన సహాయాన్ని అందివ్వగలదు
[17వ పేజీలోని చిత్రం]
అవిధేయులైన పిల్లలు గల తలిదండ్రులు లేఖనాల నుండి ఏ ఓదార్పును పొందగలరు?