ప్రాచీనకాలంనాటి దైవభక్తిగల కుటుంబాలు—మన కాలానికి ఒక మాదిరి
కుటుంబం—ప్రపంచ దృష్టిని దాని వైపు మళ్లించాలని ఐక్యరాజ్యసమితి ప్రయత్నించింది. ఎలా? పందొమ్మిది వందల తొంభై నాలుగును “అంతర్జాతీయ కుటుంబ సంవత్సరంగా” ప్రకటించడం ద్వారా అలా చేసింది. చట్టవ్యతిరేకమైన జననాలు, నింగినంటుతున్న విడాకుల రేట్ల వంటివాటిని బట్టి బాధపడడంలో ప్రపంచ నాయకులు, సంఘసంస్కర్తలు, కుటుంబ ఉపదేశకులు ముందున్నప్పటికీ అలాంటి సమస్యలకు పనిచేసే, వాస్తవమైన పరిష్కారాలను కనుగొనడంలో వారు వెనుకబడి ఉన్నారు.
మరి కుటుంబ సమస్యలకు బైబిలులో పరిష్కారాలున్నాయా? నేటి కుటుంబాలలో బైబిలు సహాయకరంగా ఉండగలదని సూచించడం కొందరికి సహజంగానే అనిపించవచ్చు. అది శతాబ్దాల పూర్వం మధ్య ప్రాచ్య సమాజపు వాతావరణంలో, సంస్కృతిలో వ్రాయబడింది. ప్రపంచంలోని అనేక భాగాలలో, బైబిలు కాలాల నాటి నుండి జీవితం ఎంతో మార్పు చెందింది. అయితే, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో ఆ యెహోవా దేవునిచేత బైబిలు ప్రేరేపించబడింది. (ఎఫెసీయులు 3:14, 15; 2 తిమోతి 3:16) కుటుంబ సమస్యల గురించి బైబిలు ఏమి చెబుతుంది?
కుటుంబ జీవితం ఆనందించదగినదిగా, తృప్తినిచ్చేదిగా ఉండాలంటే ఏమి అవసరమో యెహోవాకు కచ్చితంగా తెలుసు. కాబట్టి ఆయన వాక్యమైన బైబిలు, కుటుంబ జీవితం గురించి ఎంతో చెబుతుంది, కొంత సమాచారం ఉపదేశం రూపంలో ఇవ్వబడింది. దైవిక సూత్రాలను అన్వయించుకున్న కుటుంబాల మాదిరులు కూడా బైబిలునందున్నాయి. తత్ఫలితంగా, వారు నిజమైన సన్నిహితత్వాన్ని, సంతృప్తిని అనుభవించారు. బైబిలు కాలాల్లోని కుటుంబ జీవితాన్ని మనమొకసారి పరిశీలించి, ఏ పాఠాలు నేర్చుకోవచ్చో చూద్దాము.
శిరస్సత్వం—అంత కష్టమైనదా?
ఉదాహరణకు, కుటుంబ శిరస్సత్వాన్ని గూర్చిన విషయాన్ని పరిశీలించండి. పితరులకాలాల్లో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వంటి పురుషులు నిర్వివాదమైన “కుటుంబ శిరస్సులుగా” ఉండిరి. (అపొస్తలుల కార్యములు 7:8, 9; హెబ్రీయులు 7:4, NW) రాల్ఫ్ గోవర్ వ్రాసిన ది న్యూ మానర్స్ అండ్ కస్టమ్స్ ఆఫ్ బైబిల్ టైమ్స్ ఇలా చెబుతుంది: “కుటుంబం . . . తండ్రిచే పరిపాలింపబడే ‘చిన్న రాజ్యంగా’ ఉండేది. ఆయన భార్య, పిల్లలు, మనమలు, పనివారిపై—ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిపై ఆధిపత్యం చేసేవాడు.” వాస్తవానికి, పితరులకు తరచూ తమ కుమారుల కుటుంబాలపై కూడా అధికారం ఉండేది.—ఆదికాండము 42:37 పోల్చండి.
ఇది తమ భార్యలను, పిల్లలను అణిచివేసేందుకు పురుషులకు అనుమతివ్వడం లేదా? ఎంతమాత్రం ఇవ్వడం లేదు. నిజమే, “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని” మొదటి స్త్రీయైన హవ్వతో దేవుడు చెప్పాడు. (ఆదికాండము 3:16) వివాహిత స్త్రీలు సాధారణంగా ఎలా భావిస్తారనేదాన్ని ఆ మాటలు సూచించాయి కాని, దేవుని సత్యారాధికుల మధ్య పరిస్థితులు ఎలా ఉండాలనేది అవి వివరించడం లేదు. దైవభయం గల భర్తలు యెహోవా యొక్క ఆది సంకల్పాన్ని మనస్సులో ఉంచుకోవలసి ఉండిరి. యెహోవా స్త్రీని పురుషునికి “సాటియైన సహాయము”గా ఉండాలనే చేశాడు కాని అతనికి బానిసగా ఉండాలని కాదు. (ఆదికాండము 2:20) తొలికాలాల నాటి దైవభక్తిగల పురుషులు తాము దేవునికి విధేయులు కావాలని, తాము లెక్క ఒప్పజెప్పవలసి ఉందని గుర్తించారు, వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. తమ భార్యలను పిల్లలను బానిసల వలే చూసే బదులు, దైవభయంగల పితరులు వారి ఎడల నిజమైన ప్రేమానురాగాలు చూపించారు.
సాధారణంగా పిల్లలు పొందే ఆప్యాయత యొక్క క్షణదర్శనం ఆదికాండము 50:23 నందివ్వబడింది. అక్కడ యోసేపు ముని మనుమల గురించి అదిలా చెబుతుంది: “యోసేపు ఒడిలో ఉంచబడిరి.” ఆ పిల్లలను యోసేపు తన వంశీకులుగా గుర్తిస్తున్నాడని ఇది సూచించవచ్చు, అలాగే ఆయన పిల్లలతో ఆడుకున్నాడని, వారిని తన ఒడిలో ఆడించేవాడని కూడా ఇది సూచించవచ్చు. నేడు తండ్రులు తమ పిల్లల ఎడల అలాంటి ఆప్యాయతను చూపించడం మంచిది.
కుటుంబ శిరస్సులుగా, దైవభయంగల పితరులు తమ కుటుంబాల ఆత్మీయ అవసరతల గురించి కూడా శ్రద్ధ తీసుకొనేవారు. భూవ్యాప్త జలప్రళయం తర్వాత ఓడలో నుండి బయటికి వచ్చాక, “నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, . . . ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.” (ఆదికాండము 8:20; యోబు 1:5 పోల్చండి.) కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ఉపదేశాన్నివ్వడం ద్వారా నమ్మకస్థుడైన పితరుడగు అబ్రాహాము మంచి మాదిరినుంచాడు. ఆయన ‘తన తరువాత తన పిల్లలు, తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనాలని వారి కాజ్ఞాపించాడు.’ (ఆదికాండము 18:19) ప్రేమపూర్వక శిరస్సత్వం అలా కుటుంబాల భావోద్రేక మరియు ఆత్మీయ క్షేమానికి దోహదపడింది.
క్రైస్తవ పురుషులు నేడు ఈ మాదిరిని అనుసరిస్తారు. దేవుడు కోరే వాటికి తగినట్లుగా ఉండడానికి తమ కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా మరియు తాము మంచి మాదిరిని ఉంచడం ద్వారా ఆరాధనా విషయాల్లో వారు శిరస్సత్వాన్ని నిర్వహిస్తారు. (మత్తయి 28:19, 20; హెబ్రీయులు 10:24, 25) పితరుల వలె, క్రైస్తవ భర్తలు మరియు తండ్రులు తమ కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా ఉపదేశం ఇవ్వడానికి కూడా సమయం తీసుకుంటారు.
నిర్ణయాత్మక చర్య గైకొనడం
తన మామకు పెద్ద మొత్తం అప్పు తీర్చిన తర్వాత, పితరుడైన యాకోబు ఇలా అడిగాడు: ‘నేను నా ఇంటివారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసికొందును?’ (ఆదికాండము 30:30) తండ్రులందరి వలెనే యాకోబు తన కుటుంబ వస్తుదాయక అవసరతలను తీర్చడం గురించి ఒత్తిడి అనుభవించాడు, దాని కొరకు ఆయన కష్టపడి పనిచేశాడు. ఆదికాండము 30:43 ఇలా చెబుతుంది: “ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధిపొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయెను.”
అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు కనాను దేశానికి వెళ్లాక, తన కుమార్తెయైన దీనా అన్యులైన కనానీయులతో సహవసించే ప్రమాదకరమైన అలవాటును ఏర్పరచుకుందని ఆయనకు తెలియదన్నది స్పష్టం.a (ఆదికాండము 34:1) తన గృహంలో మతసంబంధ వస్తువులు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు కూడా ఆయన చర్య గైకొనడంలో విఫలమయ్యాడు. అయితే దుఃఖకరంగా, దీనాను ఒక కనానీయుడు బలవంతం చేసిన తర్వాత, యాకోబు నిర్ణయాత్మక చర్య గైకొన్నాడు. ఆయనిలా ఆజ్ఞాపించాడు: ‘మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొనుడి.’—ఆదికాండము 35:2-4.
తమ కుటుంబాల ఆత్మీయత గురించి క్రైస్తవ తండ్రులు జాగరూకత కలిగివుండాలి. లైంగిక దుర్నీతికి సంబంధించిన సాహిత్యం లేక అయోగ్యమైన సంగీతం ఇంట్లో ఉండడం వంటి తీవ్రమైన ప్రమాదాలు కుటుంబ ఆత్మీయ క్షేమానికి వాటిల్లనైయుంటే వారు నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి.
ఆసక్తికరంగా, విశ్వాసంగల స్త్రీలైన శారా, రిబ్కా, రాహేలు వంటివారు కూడా కుటుంబాలలో చెప్పుకోదగినంత ప్రభావాన్ని చూపించారు. వారు తమ భర్తలకు విధేయులై ఉన్నప్పటికీ, అది తగినదైనప్పుడు మరియు అవసరమైనప్పుడు చొరవ తీసుకోవడం నుండి వారు నిర్బంధింపబడలేదు. ఉదాహరణకు, మోషే మరియు ఆయన కుటుంబం ఐగుప్తుకు వెళ్తున్నప్పుడు, “యెహోవా [“యెహోవా దేవదూత,” సెప్టాజింట్] అతనిని ఎదుర్కొని అతని [మోషే కుమారున్ని] చంప” చూశాడని నిర్గమకాండము 4:24-26 మనకు తెలియజేస్తుంది. స్పష్టంగా, మోషే తన కుమారునికి సున్నతి చేయలేదు గనుక ఆయన కుమారుడు చంపబడే ప్రమాదంలో ఉన్నాడు. సిప్పోరా వెంటనే చర్య గైకొని తన కుమారునికి సున్నతి చేసింది. తత్ఫలితంగా, దేవదూత అతన్ని పోనిచ్చాడు. నేడు క్రైస్తవ భార్యలు కూడా పరిస్థితి ప్రకారం అది తగినదైనప్పుడు చొరవ తీసుకోవచ్చు.
మోషే ధర్మశాస్త్రం క్రింద పితృత్వపు ఉపదేశం
సా.శ.పూ 1513లో ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా ఏర్పడినప్పుడు, పితరుల కాలం ముగిసింది. (నిర్గమకాండము 24:3-8) తండ్రులు కుటుంబ శిరస్సులుగా సేవచేయడం కొనసాగించారు. అయితే, కుటుంబ నియమమన్నది దేవుని ద్వారా మోషేకివ్వబడిన, నియమిత న్యాయాధిపతులచే నిర్వహించబడిన జాతీయ ధర్మశాస్త్రానికి రెండవదయ్యింది. (నిర్గమకాండము 18:13-26) లేవీయుల యాజకత్వం ఆరాధన యొక్క బలి అంశాలను చేపట్టింది. అయినప్పటికీ, తండ్రి ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించడం కొనసాగింది. “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను” అని మోషే ఉద్బోధించాడు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.
ఉపదేశం నియతంగా, అనియతంగా ఇవ్వబడగలిగేలా పస్కా వంటి సందర్భాలను ధర్మశాస్త్రం ఏర్పాటు చేసింది. పస్కా దినమైన నీసాను 14 సమీపించినప్పుడు, యూదా కుటుంబాలు తాము ఆచారంగా యెరూషలేముకు వెళ్లే ప్రయాణం కొరకు సిద్ధం చేసుకోవడం ప్రారంభిస్తారు. (ద్వితీయోపదేశకాండము 16:16; లూకా 2:41 పోల్చండి.) అలాంటి సిద్ధపాట్లనుబట్టి ఉత్తేజం పొందని పిల్లలెవరు? ఆ ప్రయాణమే ఆనందకరంగా ఉంటుంది. అప్పటికల్లా వర్షాకాలం ముగిసి, వసంతకాలపు ఎండ గాలిలోవున్న శీతాకాల చల్లదనాన్ని పారద్రోలడం ప్రారంభిస్తుంది. హెర్మోను పర్వతం మీది మంచు కరగడంతో, యొర్దాను నది దాని కట్టలుదాటి ప్రవహిస్తుంది.
దారిలో, తండ్రులు తమ పిల్లలకు తమ దేశపు భూగోళశాస్త్ర వివరాలనే గాక తాము దాటి వెళ్తున్న స్థలాలకు సంబంధించిన విస్తారమైన చరిత్రను కూడా బోధించేవారు. ఎక్కడైతే ధర్మశాస్త్రంలోని శాపాలు ఆశీర్వాదాలు చదవబడేవో ఆ ఈబాలు, గెరీజీము పర్వతాలు అలాగే ఎక్కడైతే యాకోబు మహిమాన్విత నిచ్చెనను గూర్చిన దర్శనం చూశాడో ఆ బేతేలు వంటి వాటిని కూడా వారు దాటివెళ్తుండవచ్చు. ఎంత ఉత్తేజవంతమైన చర్చలు జరిగివుండవచ్చు! ప్రయాణం కొనసాగుతుండగా, దేశపు వేరే భాగాల నుండి ప్రయాణికులు వచ్చి కుటుంబాలతో కలిసేవారు, అలా అందరూ ప్రోత్సాహకరమైన సహవాసాన్ని ఆనందిస్తారు.
చివరికి కుటుంబం “పరిపూర్ణ సౌందర్యముగల” యెరూషలేములోకి ప్రవేశిస్తుంది. (కీర్తన 50:2) విద్వాంసుడైన ఆల్ఫ్రెడ్ ఎడర్శిమ్ ఇలా చెబుతున్నాడు: “ఈ యాత్రికులలో అనేకులు నగర గోడల వెలుపల బస చేసి ఉంటారు. నగరం లోపల బస చేసినవారు ఉచిత వసతి పొందుతారు.” అవును, హెబ్రీ యౌవనులు సహోదర ప్రేమ మరియు ఆతిథ్యం విషయాల్లో తొలి పాఠాలు పొందేవారు. నేడు యెహోవాసాక్షుల వార్షిక సమావేశాలు అదే సంకల్పాన్ని నెరవేరుస్తాయి.
చివరికి నీసాను 14 వస్తుంది. పస్కా పశువు వధింపబడి కొన్ని గంటల వరకు వేయించబడుతుంది. దాదాపు మధ్యరాత్రి సమయానికి కుటుంబం ఆ గొర్రెపిల్లను, పొంగని రొట్టెను, చేదు కూరలను తింటుంది. ఆచారం ప్రకారం, “మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని” ఒక కుమారుడు అడుగుతాడు. అప్పుడు తండ్రి “ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నున్న ఇశ్రాయేలీయుల యిండ్లను విడిచి పెట్టెను” అని చెబుతూ, పద్ధతి ప్రకారం ఉపదేశం చేస్తాడు.—నిర్గమకాండము 12:26, 27; 13:8.
ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను ఇలా చెప్పాడు: ‘ఏడ్చుటకును నవ్వుటకును సమయము కలదు.’ (ప్రసంగి 3:4) ఇశ్రాయేలు పిల్లలకు వినోదం కొరకు సమయం ఇవ్వబడేది. పిల్లలు సంతవీధులలో ఆడుకోవడాన్ని యేసుక్రీస్తు స్పష్టంగా గమనించాడు. (జెకర్యా 8:5; మత్తయి 11:16) పాడడం, నాట్యమాడడం, పండుగ చేసుకోవడం వంటివి చేరి ఉండే ఆనందదాయకమైన కుటుంబ సమావేశాలను సంపన్నులైన తల్లిదండ్రులు ఏర్పాటు చేయడం అసాధారణమేమికాదు. (లూకా 15:25) అలాగే నేడు క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి వినోదాన్ని సహవాసాన్ని అందజేయడంలో చొరవ తీసుకుంటారు.
యూదా సమాజంలో తల్లులు మరియు పిల్లలు
మోషే ధర్మశాస్త్రం క్రింద తల్లులు ఏ పాత్ర నిర్వహించేవారు? సామెతలు 1:8 ఇలా ఆజ్ఞాపించింది: “నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.” తన భర్త యొక్క అధికార పరిధిలోనే యూదా భార్య కుటుంబ జీవితంలో దైవానుగ్రహ అవసరతలను అన్వయించేది. ఆమె తన ముదిమి వయస్సులో కూడా తన పిల్లల చేత గౌరవించబడాలి.—సామెతలు 23:22.
తన పిల్లలకు తర్ఫీదివ్వడంలో తల్లి కూడ ఎక్కువగా భాగం వహించేది. పాలు విడిచేంత పెద్దదయ్యేవరకు ఆమె శిశువు గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేది, అందువల్ల తల్లి బిడ్డల మధ్య నిస్సందేహంగా సన్నిహిత బంధం ఏర్పడేది. (యెషయా 49:15) తండ్రులు తమ కుమారులకు తమ వృత్తిని నేర్పుతుండగా, తల్లులు తమ కుమార్తెలకు ఇంటి పనులు నేర్పేవారు. తల్లులు తమ కుమారులపై కూడా మంచి ప్రభావాన్ని చూపేవారు. ఉదాహరణకు, రాజైన లెమూయేలు “అతని తల్లి అతని కుపదేశించిన దేవోక్తి” నుండి ప్రయోజనం పొందాడు.—సామెతలు 31:1.
సమర్థవంతురాలైన యూదా భార్య “తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్ట”డంలో కూడా చెప్పుకోదగినంత స్వేచ్ఛను కలిగివుండేది. సామెతలు 31:10-31 ప్రకారం, ఆమె గృహావసర వస్తువులు కొంటుంది, స్థిరాస్థి పెట్టుబడులు పెడుతుంది, స్వల్ప వ్యాపారాన్ని కూడా చూసుకుంటుంది. మెప్పుగల భర్తకు, ఆమె విలువ “ముత్యముకంటె అమూల్యమైనది”!
నేటి కొరకు ఒక మాదిరి
బైబిలు కాలాల్లో కుటుంబ ఏర్పాటు దాని సభ్యులందరి భావోద్రేక మరియు ఆత్మీయ ఎదుగుదల కొరకు పనిచేసేది. తమ కుటుంబాలు ప్రయోజనం పొందేలా తండ్రులు ప్రేమపూర్వకంగా తమ అధికారాన్ని ప్రదర్శించాలి. ఆరాధన విషయంలో వారు నాయకత్వం వహించాలి. తమ పిల్లలకు బోధించడం, తర్ఫీదివ్వడం, వారితోపాటు ఆరాధించడం, వారికి వినోదాన్ని ఏర్పాటు చేయడం వంటివాటిలో తండ్రులు, తల్లులు ఇద్దరూ ఆసక్తి చూపించేవారు. తమ కుటుంబాల తరఫున చొరవ తీసుకుంటూ, తమ భర్తల శిరస్సత్వాన్ని గౌరవిస్తూ, దైవభక్తిగల తల్లులు విలువైన సహాయకారులుగా నిరూపించబడ్డారు. విధేయులైన పిల్లలు తమ తల్లిదండ్రులకు, యెహోవా దేవునికి ఆనందం తెచ్చేవారు. వాస్తవానికి, బైబిలు కాలాల్లోని దైవ భయంగల కుటుంబం మన కాలం కొరకు అద్భుతమైన మాదిరిగా ఉంది.
[అధస్సూచీలు]
a దీనికి ముందు, తన కుటుంబాన్ని కనానీయుల ప్రభావం నుండి కాపాడడానికి యాకోబు గట్టి చర్యలు గైకొన్నాడన్నదాన్ని గమనించాలి. కనానీయులైన తన పొరుగువారి నుండి తనను నిస్సందేహంగా ఎంతో భిన్నంగా ఉంచినటువంటి బలిపీఠాన్ని ఆయన నిర్మించాడు. (ఆదికాండము 33:20; నిర్గమకాండము 20:24, 25) అంతేగాక, ఆయన తన గుడారాన్ని షెకెము వెలుపల వేసుకొని, తన స్వంత నీటి సరఫరాను ఏర్పరచుకున్నాడు. (ఆదికాండము 33:18; యోహాను 4:6, 12) కాబట్టి తాను కనానీయులతో సహవసించకూడదన్నది యాకోబు కోరిక అని దీనాకు బాగానే తెలిసి ఉంటుంది.
[23వ పేజీలోని చిత్రం]
మీ కుటుంబం, బైబిలు కాలాల్లో యెహోవాను ఆరాధించిన కుటుంబాలంత సంతోషంగా ఉండగలదు