పాఠకులనుండి ప్రశ్నలు
మొదటి యోహాను 4:18 మనకు ఇలా చెబుతోంది: “ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును.” అయితే పేతురు ఇలా వ్రాశాడు: “సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి.” (1 పేతురు 2:17) మనం ఈ రెండు వచనాలను ఎలా సమన్వయపర్చగలం?
పేతురూ యోహానులిద్దరూ, నేరుగా యేసుక్రీస్తునుండి నేర్చుకున్న అపొస్తలులే. కనుక వారు వ్రాసినది తప్పకుండా సమన్వయపర్చబడగలదనే నమ్మకాన్ని మనం కల్గివుండగలం. పైన సూచించిన వచనాల విషయానికి వస్తే, ఆ అపొస్తలులిద్దరూ వేరు వేరు భయాలను గూర్చి మాట్లాడుతున్నారు.
మొదట మనం పేతురు సలహాను పరిగణలోకి తీసుకుందాము. సందర్భం చూపుతున్నట్లుగా, అధికారంలో ఉన్న వారి ఎడల తన తోటి క్రైస్తవులు ఎలాంటి వైఖరిని కల్గివుండాలనే విషయంపై పేతురు ప్రేరేపిత సలహాను అందించాడు. మరో విధంగా చెప్పాలంటే, కొన్ని రంగాల్లో విధేయతను సరైన విధంగా దృష్టించడంపై ఆయన వ్యాఖ్యానించాడు. కనుక, మానవ ప్రభుత్వాల్లో అధికారిక స్థానాలను కల్గివున్న మనుష్యులకు, అంటే రాజులు లేక ప్రభువులకు విధేయులుగా ఉండమని ఆయన క్రైస్తవులకు ఉపదేశించాడు. (1 పేతురు 2:13, 14) దాన్ని కొనసాగిస్తూ పేతురు ఇలా వ్రాశాడు: “అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.”—1 పేతురు 2:17.
సందర్భానుసారంగా చూస్తే, క్రైస్తవులు “దేవునికి భయపడాలి” అని పేతురు క్రైస్తవులతో చెప్పినప్పుడు, మనకు దేవుని ఎడల ప్రగాఢమైన, భయభక్తులతో కూడిన గౌరవం ఉండాలి అంటే, అత్యున్నత అధికారిని అప్రీతిపర్చే భయం ఉండాలని ఆయన ఉద్దేశం.—హెబ్రీయులు 11:7 పోల్చండి.
అపొస్తలుడైన యోహాను వ్యాఖ్యానం విషయమేమిటి? తొలుత 1 యోహాను 4వ అధ్యాయంలో, అబద్ధ ప్రవక్తలనుండి వచ్చినటువంటి “ప్రేరేపించిన మాటలను” పరీక్షించాలనే విషయంతో అపొస్తలుడు వ్యవహరించాడు. అలాంటి మాటలు నిజంగానే ఎన్నటికీ యెహోవా సంబంధమైనవి కావు; అవి దుష్ట లోక సంబంధమైనవే లేక దాన్ని ప్రతిబింబించేవే.
దానికి విరుద్ధంగా, అభిషక్త క్రైస్తవులు ‘దేవుని సంబంధమైనవారు.’ (1 యోహాను 4:1-6) ఆ కారణం చేత, యోహాను ఇలా ఉద్బోధించాడు: “ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది.” ప్రేమను కనపర్చడంలో దేవుడే చొరవ తీసుకున్నాడు—ఆయన “మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను.” (1 యోహాను 4:7-10) మనం దానికి ఎలా ప్రతిస్పందించాలి?
మనం మన ప్రేమ పూర్వక దేవునితో ఐక్యంగా ఉండాలన్నది స్పష్టం. మనం ఆయనంటే భయకంపితులము కాకూడదు, లేక ప్రార్థన ద్వారా ఆయనను సమీపించేందుకు మనం భయపడకూడదు. దీనికి ముందు యోహాను ఇలా సలహానిచ్చాడు: “మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.” (1 యోహాను 3:21, 22) అవును, మంచి మనస్సాక్షి దేవున్ని మనం సమీపించేందుకు అప్రభావితంగానూ లేక భయం లేకుండా ఉండేందుకుగాను మనకు స్వేచ్ఛనిస్తుంది. ప్రేమనుబట్టి, మాట్లాడేందుకు మనం జంకము, లేక ప్రార్థన ద్వారా యెహోవాను సమీపించేందుకు మనం జంకము. ఈ విషయంనందు “ప్రేమలో భయముండదు.”
ఇప్పుడు ఈ రెండు ఆలోచనలనూ మనం కలుపుదాం. ఆయన స్థానం, శక్తి, న్యాయాల ఎడల నిండైన గౌరవంనుండి ఉత్పన్నమైన భక్తితోకూడిన భయాన్ని ఒక క్రైస్తవుడు యెహోవా ఎడల ఎల్లప్పుడూ కల్గివుండాలి. అయితే మనం మన దేవున్ని ఒక తండ్రిగా కూడా ప్రేమిస్తాము అంతేకాకుండ ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు భావిస్తాము మరియు ఆయనను సమీపించేందుకు వెనుకాడము. ఆయనను గూర్చి ఏ భయాన్ని కల్గివుండకుండా, ఒక ప్రేమగల తండ్రివద్ద ఒక పిల్లవాడు ఎలాగైతే స్వేచ్ఛ కల్గివుంటాడో అలాగే మనం ఆయనను సమీపించగలమని మనం విశ్వసిస్తాము.—యాకోబు 4:8.