పునఃస్థాపించబడిన “దేశము”లో కలిసి జీవించేవారు
“మీరు యెహోవాకు యాజకులనబడుదురు—వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు.”—యెషయా 61:6.
1, 2. (ఎ) ఇశ్రాయేలులో యూదామత ప్రవిష్టుల పరిస్థితి ఎలా ఉంది? (బి) “గొప్పసమూహము” యొక్క సభ్యులు ఆధునిక కాలాల్లో ఏ స్ఫూర్తిని కనపర్చారు?
ప్రాచీన కాలాల్లో, ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నప్పుడు ప్రపంచ తెరపై యెహోవా మహిమకు సాక్షులుగా నిలిచారు. (యెషయా 41:8, 9; 43:10) అనేకమంది పరదేశులు ప్రతిస్పందించి, ఆయన ఎన్నుకున్న ప్రజల సహవాసంలో యెహోవాను ఆరాధించడానికి వచ్చారు. వాస్తవానికి, రూతు నయోమితో “నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని చెప్పినట్లే వారు ఇశ్రాయేలీయులతో చెప్పారు. (రూతు 1:16) పురుషులు సున్నతి పొందుతూ, వారు ధర్మశాస్త్ర నిబంధనానియమాలకు లోబడ్డారు. (నిర్గమకాండము 12:43-48) స్త్రీలలో కొందరు ఇశ్రాయేలీయులను వివాహం చేసుకున్నారు. యెరికో పట్టణస్థురాలైన రాహాబు మరియు మోయాబీయురాలైన రూతు యేసు యొక్క పూర్వీకురాండ్లయ్యారు. (మత్తయి 1:5) అలాంటి యూదామత ప్రవిష్టులు ఇశ్రాయేలు సంఘంలో భాగమయ్యారు.—ద్వితీయోపదేశకాండము 23:7, 8.
2 ఇశ్రాయేలులోని యూదామత ప్రవిష్టులవలెనే, “గొప్పసమూహము” ఈనాడు అభిషక్త శేషంతో, “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని” చెప్పారు. (ప్రకటన 7:9; జెకర్యా 8:23) ఈ అభిషక్త క్రైస్తవులే యెహోవా యొక్క “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడని” వారు గుర్తించారు, మరి వారు వీరితో ఎంత సన్నిహితంగా పని చేస్తున్నారంటే అభిషక్తులు మరియు “వేరే గొఱ్ఱెలు” “మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును” అన్నట్లు ఉన్నారు. (మత్తయి 24:45-47; యోహాను 10:16) తమ అభిషక్త సహోదరులందరు వారి పరలోక బహుమానాన్ని అందుకున్న తర్వాత ఈ గొప్పసమూహానికి ఏమి సంభవిస్తుంది? వారు భయపడవలసిన అవసరం లేదు. ఈ “అంత్య దినములు” అన్నింటిలో, ఆ సమయం కొరకు యెహోవా సిద్ధపాటు చేశాడు.—2 తిమోతి 3:1.
ఒక ఆత్మీయ “దేశము”
3. పేతురు ప్రవచించిన “క్రొత్త ఆకాశములు” ఏమిటి, మరి అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి?
3 మరి 1,44,000 మంది అభిషక్త క్రైస్తవులు భాగమై ఉండే పరలోక పరిపాలక ఏర్పాటును గురించి అపొస్తలుడైన పేతురు ప్రవచించాడు. ఆయనిలా చెప్పాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) క్రీస్తు పరలోక రాజ్యంలో రాజుగా సింహాసనాసీనుడైనప్పుడు అంటే 1914లో ఈ “క్రొత్త ఆకాశములు” స్థాపించబడ్డాయి. అయితే “క్రొత్త భూమి” విషయమేమిటి?
4. (ఎ) మరి 1919లో ఏ అపేక్షించని సంఘటన జరిగింది? (బి) ‘ఒక్క నిమిషంలో జన్మించిన జనాంగము’ ఏది, మరి ‘ప్రసవవేదన వలన జన్మించిన దేశము’ ఏది?
4 యెహోవా 1919లో అభిషక్త శేషాన్ని మహాబబులోను చెరలోనుండి బయటకు తెచ్చాడు. (ప్రకటన 18:4) ఈ నాటకీయ సంఘటనను క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు ఎంతమాత్రం ఊహించలేదు. దీనిని గురించి బైబిలిలా చెబుతుంది: “అట్టివార్త యెవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక దేశమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనాంగము జన్మించునా?” (యెషయా 66:8 [NW]) అభిషక్త సంఘం స్వతంత్రులైన ప్రజలుగా అన్యజనుల ఎదుట అకస్మాత్తుగా కనిపించినప్పుడు, అది వాస్తవంగా ‘ఒక్క నిమిషంలో ఒక జనాంగము జన్మించినట్లే’ ఉంది. అయితే ఆ “దేశము” ఏది? ఒక భావంలో, అది ప్రాచీన ఇశ్రాయేలు దేశము యొక్క ఆత్మీయ సామ్యమై ఉంది. ఈ నవజాత “జనాంగము”నకు ఇవ్వబడిన కార్యకలాపాల సామ్రాజ్యమే, యెషయా గ్రంథంలోని పరదైసును గూర్చిన ప్రవచనాల ఆధునిక, ఆత్మీయ నెరవేర్పు. (యెషయా 32:16-20; 35:1-7; హెబ్రీయులు 12:12-14 పోల్చండి.) ఒక క్రైస్తవుడు భౌతికంగా ఎక్కడ ఉన్నా, అతను ఆ “దేశము”లో ఉన్నట్లే.
5. మరి 1919లో ఏ కేంద్రబిందువు ఉనికిలోకి వచ్చింది? వివరించండి.
5 పేతురు ప్రవచించిన “క్రొత్త భూమి”తో దీనికి ఏమి సంబంధం ఉంది? అయితే, ఒక పునఃస్థాపించబడిన “దేశములో” 1919లో జన్మించిన నూతన “జనాంగము,” అభిషేకింపబడిన మరియు అభిషేకింపబడని యెహోవా స్తుతికర్తల ప్రపంచవ్యాప్త సంస్థగా అభివృద్ధి చెందవలసి ఉంది. ఈ సంస్థ అర్మగిద్దోనును తప్పించుకుని దేవుని నూతన లోకంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఆ జనాంగం, సాతాను ప్రపంచం నాశనమైన తర్వాత నిలిచి ఉండే క్రొత్త భూమి, లేక యథార్థ మానవ సమాజం యొక్క కేంద్రబిందువుగా ఉంటుంది.a మరి 1930వ పడి మధ్య భాగంకల్లా, అభిషక్తులు ఒక గుంపుగా పునఃస్థాపిత దేశంలోకి ప్రోగు చేయబడ్డారు. అప్పటినుండి, నేడు దాదాపు 50 లక్షలుగా ఉన్న వేరే గొర్రెల గొప్ప సమూహాన్ని సమకూర్చడంపై ఎక్కువ అవధానం నిలపడం జరుగుతుంది. (ప్రకటన 14:15, 16) ఆ “దేశము” అధిక జనాబాతో నిండిపోయిందా? లేదు, దాని పొలిమేరలను అవసరమున్నంత వెడల్పుగా విస్తరించవచ్చు. (యెషయా 26:15) వాస్తవానికి, ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే ఆత్మీయ ఆహారంతో “దేశమును” అభిషక్త శేషం “ఫలభరితంగా” నింపుతుండగా దాని జనాబా పెరగడాన్ని చూడటం ఉత్తేజకరంగా ఉంటుంది. (యెషయా 27:6) అయితే, దేవుని ప్రజల పునఃస్థాపిత “దేశము”లో వేరే గొర్రెల స్థానం ఏమిటి?
“దేశములో” పరదేశులు క్రియాశీలులైయున్నారు
6. దేవుని ప్రజల “దేశములో” పరదేశులు ఎలా క్రియాశీలులయ్యారు?
6 ఇశ్రాయేలు దేశంలో యూదామత ప్రవిష్టులు మోషే ధర్మశాస్త్రానికి లోబడినట్లు, నేడు పునఃస్థాపించబడిన “దేశంలో” గొప్ప సమూహం యెహోవా ఆజ్ఞలకు లోబడతారు. తమ అభిషక్త సహోదరులచేత ఉపదేశించబడిన వారై, వారు అబద్ధ ఆరాధనను పూర్తిగా విడనాడి రక్తం యొక్క పవిత్రతను పాటిస్తారు. (అపొస్తలుల కార్యములు 15:19, 20; గలతీయులు 5:19, 20; కొలొస్సయులు 3:5) వారు యెహోవాను తమ పూర్ణహృదయంతో, మనస్సుతో, ఆత్మతో, శక్తితో ప్రేమిస్తారు, మరి తమ పొరుగువారిని తమవలె ప్రేమిస్తారు. (మత్తయి 22:37; యాకోబు 2:8) ప్రాచీన ఇశ్రాయేలులో యూదామత ప్రవిష్టులు సొలొమోను ఆలయ నిర్మాణపనిలో సహాయం చేశారు, మరి సత్యారాధనను పునఃస్థాపించడంలో మద్దతునిచ్చారు. (1 దినవృత్తాంతములు 22:2; 2 దినవృత్తాంతములు 15:8-14; 30:25) నేడు, నిర్మాణ పథకాల్లో గొప్ప సమూహం కూడా పాల్పంచుకుంటుంది. ఉదాహరణకు, సంఘాలను మరియు సర్క్యూట్లను నెలకొల్పడంలో వారు సహాయం చేస్తున్నారు, మరి రాజ్య మందిరాలు, సమావేశ మందిరాలు మరియు బ్రాంచి సౌకర్యాల వస్తుసంబంధ నిర్మాణ పథకాలను వారు చేపట్టడాన్ని గురించి ఇక చెప్పనక్కర్లేదు.
7. చెరలోనుండి యెరూషలేముకు వచ్చిన తర్వాత ఆలయ సేవలను అందించడానికి తగినంత మంది లేవీయులు లేనప్పుడు ఏమి జరిగింది?
7 ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 537లో బబులోను చెరనుండి తిరిగి వచ్చినప్పుడు, వారు ఆలయం వద్ద సేవను నియంత్రించడానికి పూనుకున్నారు. అయితే, తిరిగి వచ్చిన వారిలో లేవీయులు ఎక్కువమంది లేరు. అందునుబట్టి, పూర్వం లేవీయులకు సహాయకులైన, సున్నతి పొందిన పరవాసులైన నెతీనీయులకు ఆలయ సేవలో అధిక ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. అయితే, అభిషక్త అహరోను సంబంధ యాజకులతో వారు సమానులు కాదు.b—ఎజ్రా 7:24; 8:15-20; నెహెమ్యా 3:22-26.
8, 9. అంత్య దినాల్లో పరిశుద్ధ సేవను అందించే పనిలో వేరే గొర్రెలు ఎలా ఎక్కువ భాగం వహిస్తున్నారు?
8 నేడు అభిషక్త క్రైస్తవులు ఈ మాదిరిని అనుకరించారు. “అంత్యకాలము” గడిచే కొలది, దేవుని ప్రజల “దేశములో” ఈ అభిషక్తుల శేషం అంతకంతకూ తక్కువవుతున్నారు. (దానియేలు 12:9; ప్రకటన 12:17) దీని దృష్ట్యా, ‘పవిత్ర సేవను’ అందించడంలో ఎక్కువ పనిని ఇప్పుడు గొప్ప సమూహంలో వారు సాధిస్తున్నారు. (ప్రకటన 7:15) తమ అభిషక్త సహోదరుల నడిపింపును అనుసరిస్తూ, వారు ‘దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేస్తున్నారు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వఫలము అర్పిస్తున్నారు.’ మరి వారు ‘ఉపకారమును ధర్మమును చేయ మరువరు, అట్టి యాగములు దేవునికిష్టమైనవని’ వారికి తెలుసు.—హెబ్రీయులు 13:15, 16.
9 అంతేకాకుండా, ప్రతి సంవత్సరం గొప్పసమూహం లక్షలకు పెరుగుతుండగా, పర్యవేక్షణావసరత మునుపటికంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు దీన్ని పూర్తిగా అభిషక్త క్రైస్తవులు మాత్రమే చేసేవారు. ఇప్పుడు, సంఘాలు, అలాగే సర్క్యుట్లు, జిల్లాలు మరియు బ్రాంచి పర్యవేక్షణ సహితం అవసరం కొద్దీ వేరే గొర్రెలకు ఇవ్వబడింది. తుది నిర్ణయాల్లో భాగంలేని సహాయకులుగా ఉంటూ, పరిపాలక సభ కమిటీల కూటాలకు హాజరయ్యే ఆధిక్యత వీరిలో కొందరికి 1992లో ఇవ్వబడింది. అయినప్పటికీ, వేరే గొర్రెలు తమ అభిషక్త తోటి క్రైస్తవులకు యథార్థంగా ఉంటూ, యెహోవా యొక్క నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడైన వీరికి మద్దతు ఇవ్వగల్గడం తమ ఆధిక్యత అని భావిస్తారు.—మత్తయి 25:34-40.
‘ఒక షేక్వలె’
10, 11. కొంతమంది ఫిలిష్తీయుల మాదిరిని అనుసరిస్తూ, దేవుని ప్రజల మునుపటి శత్రువులు కొందరు ఎలా మనస్సు మార్చుకున్నారు? దాని ఫలితమేమిటి?
10 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు వేరే గొర్రెలను బాధ్యతగల స్థానాల్లో ఉపయోగించడం జెకర్యా 9:6, 7 [NW] నందు ప్రవచించబడింది. అక్కడ మనమిలా చదువుతాము: “ఫిలిష్తీయుని అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను. వాని నోటనుండి రక్తమంటిన వస్తువును వాని పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వాడును శేషముగా నుండును, మన దేవునికి వాడు యూదాలో ఒక షేక్వలె నుండును, ఎక్రోను యెబూసీయునివలె నుండును.”c నేడు సాతాను లోకం ఉన్నట్లు, ఆనాడు ఫిలిష్తీయులు యెహోవా ప్రజల బద్ధశత్రువులు. (1 యోహాను 5:19) ఫిలిష్తీయులు ఒక ప్రజగా తుదకు ఎలా మట్టుపెట్టబడ్డారో, అలాగే ఈ లోకం దాని మతపర, రాజకీయ మరియు వాణిజ్య భాగాలతోపాటు యెహోవా యొక్క వినాశకర ఆగ్రహాన్ని చవిచూస్తుంది.—ప్రకటన 18:21; 19:19-21.
11 అయితే, జెకర్యా మాటల ప్రకారం, కొంతమంది ఫిలిష్తీయులు తమ మనస్సు మార్చుకున్నారు, కొంతమంది లోకస్థులు నేడు యెహోవాతో శత్రుత్వాన్ని కలిగి ఉండరని ఇది సూచించింది. వారు మత సంబంధమైన విగ్రహారాధనను దానితోపాటు దాని హేయమైన ఆచారాలను మరియు నీచమైన బలులను మానుకొని యెహోవా దృష్టిలో శుభ్రపర్చబడిన వారౌతారు. మన కాలంలో అలాంటి మారిన ‘ఫిలిష్తీయులు’ గొప్పసమూహంలో కనుగొనబడుతున్నారు.
12. ఆధునిక కాలాల్లో, “ఎక్రోను” ఎలా “యోబూసీయునివలె” అయ్యింది?
12 ప్రవచనం ప్రకారం, ఫిలిష్తీయుల ప్రధాన పట్టణమైన ఎక్రోను “యెబూసీయునివలె నుండును.” యెబూసీయులు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దావీదు దాన్ని జయించేవరకు యెరూషలేము వారి చేతుల్లో ఉంది. అయినప్పటికీ, ఇశ్రాయేలుతో జరిగిన యుద్ధాలలో సజీవంగా నిలిచిన వారిలో కొందరు యూదామత ప్రవిష్టులయ్యారని సాక్ష్యాలు చూపుతున్నాయి. వారు ఇశ్రాయేలు దేశంలో బానిసలుగా సేవ చేశారు, మరి ఆలయ నిర్మాణంలో పని చేయగల ఆధిక్యత కూడా వారికి లభించింది. (2 సమూయేలు 5:4-9; 2 దినవృత్తాంతములు 8:1-18) నేడు, యెహోవాను సేవించడానికి మరలిన “ఎక్రోనీయులకు” కూడా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని పర్యవేక్షణ క్రింద ఉన్న “దేశములో” సేవించగల ఆధిక్యత ఉంది.
13. ప్రాచీన కాలంలో షేక్‌లు ఎవరు?
13 ఫిలిష్తీయుడు యూదాలో షేక్వలె ఉంటాడని జెకర్యా చెబుతున్నాడు. ’అల్·లూఫ్ʹ అనే హెబ్రీ పదం “షేక్” అని అనువదించబడినప్పుడు “సహస్రాధిపతి” (లేక, “ఛిలియార్క్”) అనే అర్థాన్నిస్తుంది. అది ఎంతో ఉన్నత స్థానం. తొలి ఎదోము జనాంగంలో కేవలం 13 మంది షేక్‌లు మాత్రమే ఉండేవారు. (ఆదికాండము 36:15-19) ఇశ్రాయేలును గురించి మాట్లాడేటప్పుడు ఈ “షేక్” అనే పదం తరచుగా ఉపయోగించబడదు, కానీ “వెయ్యి మందికి పెద్ద (లేక శతాధిపతి)” అనే పదబంధమే ఎక్కువగా వాడబడుతుంది. మోషే ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రతినిధులను సమావేశపర్చినప్పుడు “ఇశ్రాయేలులో వెయ్యి మందికి పెద్దలను” ఆయన పిలిపించాడు.d వారిలో 12 మంది ఉన్నారు, మరివారు కేవలం మోషేకు మాత్రమే లోబడతారని సాక్ష్యాలున్నాయి. (సంఖ్యాకాండము 1:4-16) అదే విధంగా, సైన్యాన్ని సంస్థీకరించడంలో, శతాధిపతులు కేవలం సైన్యాధిపతికి లేక రాజుకు మాత్రమే క్రింది వారు.—2 సమూయేలు 18:1, 2; 2 దినవృత్తాంతములు 25:5.
14. నేడు “ఫిలిష్తీయుడు” ఎలా షేక్ వలె అయ్యాడు?
14 పశ్చాత్తాపం చెందిన ఫిలిష్తీయుడు ఇశ్రాయేలులో వాస్తవంగా షేక్‌గా ఉంటాడని జెకర్యా ప్రవచింపలేదు. అతను ఇశ్రాయేలీయునిగా సహజంగా జన్మించలేదు గనుక అది సరిగా ఉండదు. అయితే అతను షేక్‌కు పోల్చదగిన అధికారిక స్థానాన్ని వహించి షేక్ వంటి వానిగా ఉంటాడు. అది అలాగే నిరూపించబడింది. శేషింపబడిన అభిషక్త క్రైస్తవులు సంఖ్యలో తగ్గుతూ, మిగిలిన వారు తమ వయస్సును బట్టి పూర్తిగా పనిచేయలేక పోతుండగా, ఒక విధంగా చెప్పాలంటే వేరే గొర్రెలలోని మంచి శిక్షణగల వారు పని భారాన్ని తమపై వేసుకుంటున్నారు. వారు తమ అభిషక్త సహోదరులకు ప్రతిగా ఉండాలని ఇష్టపడరు. కానీ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు దేవుని సంస్థ క్రమమైన పద్ధతిలో ముందుకు కొనసాగుతూనే ఉండేందుకు “దేశములో” వారికి అవసరమైన అధికారాన్ని వారికి ఇస్తాడు. అలాంటి పురోగమనమైన పద్ధతి మరొక ప్రవచనంలో కూడా కనుగొనబడుతుంది.
యాజకులు మరియు వ్యవసాయకులు
15. (ఎ) యెషయా 61:5, 6 యొక్క నెరవేర్పులో, “యెహోవా యాజకులు” ఎవరు, మరి ఈ స్థానంలో వారు ఎప్పుడు సంపూర్ణ భావంలో సేవ చేస్తారు? (బి) ఇశ్రాయేలు యొక్క వ్యవసాయ పనిని చేసే “పరదేశులు” ఎవరు, మరి—ఆత్మీయ భావంలో—ఈ పనిలో ఏమి ఇమిడి ఉంటుంది?
15 యెషయా 61:5, 6 ఇలా చదువబడుతుంది: “అన్యులు [విదేశీయులు NW] నిలువబడి మీ మందలను మేపెదరు పరదేశులు మీకు వ్యవసాయకులును మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు మీరు యెహోవాకు యాజకులనబడుదురు—వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల [జనాంగముల NW] ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు.” నేడు, అభిషక్త క్రైస్తవులు “యెహోవాకు యాజకులు.” తుది సంపూర్ణ భావంలో, పరలోక రాజ్యంలో వారు ‘యెహోవా యాజకులు . . . , మన దేవుని పరిచారకులుగా’ సేవ చేస్తారు. (ప్రకటన 4:9-11) వ్యవసాయ పనికి బాధ్యత వహించే “పరదేశులు” ఎవరు? దేవుని ఇశ్రాయేలు “దేశములో” నివసించే వారే ఈ వేరే గొర్రెలు. వారికి అప్పగించబడిన మందను మేపడం, వ్యవసాయం చేయడం, మరియు ద్రాక్షతోటల కాపుదల పని చేయడం అంటే ఏమిటి? ప్రాముఖ్యమైన ఆత్మీయ భావంలో, ప్రజలకు సహాయం చేసి వారిని పోషించి, సమకూర్చడమని అర్థము.—యెషయా 5:7; మత్తయి 9:37, 38; 1 కొరింథీయులు 3:9; 1 పేతురు 5:2.
16. దేవుని ప్రజల “దేశములో” పనంతటినీ తుదకు ఎవరు చేస్తారు?
16 ప్రస్తుతం, ఆత్మీయమందలు మేపడం, వ్యవసాయం చేయడం మరియు ద్రాక్షతోటల కాపుదల పనిలో భాగం వహిస్తూ కేవలం ఒక చిన్న సంఖ్యలోనున్న ఆత్మీయ ఇశ్రాయేలీయులు మాత్రమే భూమిపై ఉన్నారు. అభిషక్త సంఘం మొత్తం క్రీస్తుతో ఐక్యపర్చబడినప్పుడు, ఈ పనంతా వేరే గొర్రెలకు మాత్రమే విడిచిపెట్టబడుతుంది. “దేశమును” చూచుకోవాల్సిన మానవ పర్యవేక్షణాపని కూడా వేరే గొర్రెల చేతుల్లో ఉంటుంది, వారు యెహెజ్కేలు గ్రంథంలో అధిపతుల తరగతి అని చూపించబడ్డారు.—యెహెజ్కేలు 45, 46 అధ్యాయాలు.e
“దేశము” నిలిచి ఉంటుంది
17. ఈ అంత్య దినాలన్నిటిలో యెహోవా ఏ సిద్ధపాట్లను చేస్తూ ఉన్నాడు?
17 అవును, గొప్పసమూహం భయపడవలసిన అవసరం లేదు! యెహోవా వారి కొరకు ఎన్నో ఏర్పాట్లు సిద్ధంచేశాడు. ఈ అంత్య దినాల్లో భూమిపైని అత్యంత ప్రాముఖ్యమైన అభివృద్ధి ఏమంటే అభిషక్తులను సమకూర్చి వారికి ముద్రవేయడమే. (ప్రకటన 7:3) అయితే, ఇది జరిగేలా చూస్తూ, యెహోవా వేరే గొర్రెలను వారి సహవాసంలో పునఃస్థాపించబడిన ఆత్మీయ దేశంలోకి తెచ్చాడు. అక్కడ వారు ఆత్మీయంగా పోషించబడి క్రైస్తవ జీవనం విషయంలో తర్ఫీదు పొందియున్నారు. అంతేకాక, వారు పర్యవేక్షణతో సహా పరిశుద్ధ సేవలో పూర్తి శిక్షణ పొంది ఉన్నారు. అందునిమిత్తం వారు యెహోవాకు, తమ ఆత్మీయ సహోదరులకు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు.
18. ఆత్మీయ ఇశ్రాయేలు యొక్క “దేశములో” వేరే గొర్రెలు ఏ సంఘటనలకు తట్టుకుని యథార్థంగా నిలబడతారు?
18 దేవుని ప్రజలపై మాగోగు వాడైన గోగు చివరి దాడి చేసినప్పుడు, “ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి” వచ్చినప్పుడు వేరే గొర్రెలు అభిషక్త శేషంతో యథార్థంగా నిలబడతారు. అక్కడ వారు అన్యజనుల నాశనాన్ని తప్పించుకుని దేవుని నూతన లోకంలోకి ప్రవేశించినప్పుడు వేరే గొర్రెలు ఇంకా ఆ “దేశములో” ఉంటారు. (యెహెజ్కేలు 38:11; 39:12, 13; దానియేలు 12:1; ప్రకటన 7:9, 14) నమ్మకంగా కొనసాగుతూ, వారు ఆ ఆనందకరమైన ప్రాంతాన్ని ఎన్నటికీ విడిచిపెట్టనవసరంలేదు.—యెషయా 11:9.
19, 20. (ఎ) నూతన లోకంలో, “దేశము” యొక్క వాస్తవ్యులు ఏ గొప్ప పర్యవేక్షణను ఆనందిస్తారు? (బి) మనం దేని కొరకు గొప్ప ఆశతో ఎదురు చూస్తాము?
19 ప్రాచీన ఇశ్రాయేలు మానవ రాజులచేత పరిపాలింపబడింది మరి వారికి లేవీయులైన యాజకులు ఉండేవారు. నూతన లోకంలో, క్రైస్తవులకు అంతకంటే ఎక్కువ పరిధిలో పర్యవేక్షణ ఉంటుంది. యెహోవా దేవుని క్రింద, గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకు మరియు 1,44,000 వేలమంది సహ యాజకులు మరియు రాజులకు వారు లోబడతారు—వారిలో చాలా మంది పూర్వం భూమిపై తమ క్రైస్తవ సహోదరసహోదరీలుగా వారికి తెలుసు. (ప్రకటన 21:1) ఆత్మీయ దేశం యొక్క నమ్మకమైన నివాసులు నూతన యెరూషలేము ద్వారా తీసుకురాబడిన స్వస్థత ఆశీర్వాదాలను ఆనందిస్తూ, అక్షరార్థ పరదైసుగా పునఃస్థాపించబడిన భూమిపై జీవిస్తారు.—యెషయా 32:1; ప్రకటన 21:2; 22:1, 2.
20 యెహోవా యొక్క సంకల్పాలను నెరవేర్చడానికి ఆయన గొప్ప ప్రకాశమానమైన రథం ఆగకుండా ముందుకు వెళ్తుండగా, మనందరం మనకు నియమించబడిన పనిని నెరవేర్చడంలో ఆసక్తితో నిరీక్షిద్దాము. (యెహెజ్కేలు 1:1-28) ఆ సంకల్పాలు తుదకు నెరవేర్చబడినప్పుడు, యెహోవా యొక్క విజయోత్సాహపు పవిత్రపరచడం ఎంత ఆనందంతో జరుపుకొనబడుతుందో ఆలోచించండి! అప్పుడు ప్రకటన 5:13నందు వ్రాయబడిన శక్తివంతమైన గీతాన్ని యావత్తు సృష్టి పాడుతుంది: “సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక”! మన స్థానం పరలోకంలో ఉన్నా లేక భూమిపై ఉన్నా, ఆ మహిమాయుక్తమైన గీతం పాడే బృందంతోపాటు మన స్వరాలను కలిపేందుకు అక్కడ ఉండడానికి మనందరం ఇష్టపడమా?
[అధస్సూచీలు]
a ద వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇంకార్పొరేటెడ్ వారు 1953లో ప్రచురించిన “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి” (ఆంగ్లం) 322-3 పేజీలు చూడండి.
b పూర్తి వివరణ కొరకు, 1992 జూలై 1 కావలికోట “‘వశము చేయబడిన వారు,’ యెహోవా ఏర్పాటు” అనే శీర్షికను చూడండి.
c ద వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇంకార్పొరేటెడ్ వారు 1972లో ప్రచురించిన పరదైసు మానవజాతి కొరకు పునఃస్థాపించబడింది—దైవపరిపాలన ద్వారా! (ఆంగ్లం) అనే పుస్తకంలోని 264-9 పేజీలను చూడండి.
d హెబ్రీ: రా·శేహ్ ఆల్·ఫేహ్ యిస్స్·రా·ఎల్ల్ʹ, సెప్టాజింట్‌లో కి·లి·ఆర్·కౌయి ఇస్·రా·ఎల్ʹ “ఇశ్రాయేలు యొక్క ఛిలియార్క్లు (శతాధిపతులు)” అని అనువదించబడింది.
e ద వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్, ఇంకార్పొరేటెడ్ వారు 1971లో ప్రచురించిన “నేను యెహోవానై ఉన్నానని జనాంగములు తెలుసుకుంటాయి”—ఎలా? (ఆంగ్లం) అనే పుస్తకంలో 401-7 పేజీలను చూడండి.
మీరు ఎలా జవాబు ఇస్తారు?
◻ మరి 1919లో ఏ “దేశము” పునఃస్థాపించబడింది, అది నివాసులతో ఎలా నింపబడింది?
◻ దేవుని పునఃస్థాపించబడిన ప్రజల “దేశములో” వేరే గొర్రెలకు అధిక బాధ్యతలు ఎలా ఇవ్వబడ్డాయి?
◻ గొప్ప సమూహం యొక్క సభ్యులు ఏ విధంగా “యోబూసీయునివలె” మరియు “యూదా యందలి షేక్ వలె” ఉన్నారు?
◻ నమ్మకమైన వేరే గొర్రెలు “దేశములో” ఎంత కాలం వరకు ఉంటారు?
[23వ పేజీలోని చిత్రం]
ఆధునిక ఫిలిష్తీయుడు “యూదాలో ఒక షేక్వలె” ఉంటాడు
[24వ పేజీలోని చిత్రాలు]
అభిషక్తులు మరియు వేరె గొర్రెలు ఆత్మీయ దేశములో కలిసి సేవచేస్తారు