ఎంతో అమూల్యమైన ఒక ముత్యము మాకు ఇవ్వబడింది
రిచర్డ్ గుంతర్ చెప్పినది
అది సెప్టెంబరు 1959. న్యూయార్క్‌నుండి స్పెయిన్‌నందలి కాడిజ్‌కు అట్లాంటిక్ మహాసముద్రం గుండా మేము ఇటాలియన్ ఓడైన జూలియో సీజర్‌పై ప్రయాణించాము. నన్ను నా భార్యైన రీటాను మరియు మరో మిషనరీ దంపతులైన పాల్ మరియు ఎవిలిన్ హన్‌డర్ట్‌మార్క్‌లను ఆ ఐబీరియా దేశానికి వాచ్‌టవర్ సొసైటీ నియమించింది. మేము అనేక సవాళ్లను ఎదుర్కొనబోతున్నాము. అయితే ఇంతకీ మేము మిషనరీ పనిలో ఎలా చేరాము?
రీటా మరియు నేను 1950లో న్యూ జర్సీ, అమెరికానందు యెహోవాసాక్షులుగా బాప్తిస్మం పొందాము. ఆ తర్వాత వెంటనే, కొంతకాలానికి మా సంపదలో అమూల్యమైన ఒక ముత్యాన్ని ఉంచే ఒక నిర్ణయాన్ని మేము తీసుకున్నాము. ఆ ప్రాంతంలో సేవ చేసేందుకు సరిపడా సహోదర సహోదరీలు ఉన్న సంఘంలో మేముండే వాళ్లం. కనుక ఎక్కువ మంది ప్రచారకులు అవసరమైన ప్రాంతంలోకి మేము వెళ్లేందుకు మమ్మల్ని మేము అర్పించుకోవడం మా విధియని మేము భావించాము. న్యూయార్కు పట్టణంలో 1958 నందు యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో మేము మిషనరీ సేవను చేసేందుకు దరఖాస్తు పెట్టాము.
దాని తర్వాత కొద్ది కాలానికి, వాచ్‌టవర్ గిలియడ్ బైబిలు పాఠశాలకు మేము ఆహ్వానించబడ్డాము, మరి ఒక్క సంవత్సరంలోనే మేము స్పెయిన్‌కు మిషనరీలుగా వెళ్లాము. అనేక ఏర్పాట్లలో నిమగ్నమైపోయి మరియు ఉత్తేజంలో మునిగిపోవడంవల్ల ఆ సమయంలో మాకు ఏమి ఇవ్వబడిందన్న విషయాన్ని మేము గ్రహించలేదు. అమూల్యమైన ముత్యాన్ని గూర్చి యేసు మాట్లాడాడు. (మత్తయి 13:45, 46) అది ఆయన ఉపమానంలోని అసలు విషయం కాకపోయినప్పటికీ, మిషనరీలుగా పనిచేసే మా ఆధిక్యత మాకుమట్టుకు అలాంటి ఓ ముత్యంతో పోల్చదగినదే. గతంలోకి చూసినట్లైతే, యెహోవా సంస్థలోని ఈ అమూల్యమైన సేవాధిక్యతను మేము మరింత అధికంగా గుణగ్రహిస్తున్నాము.
ఓ మరపురాని అనుభవం
ఆ సమయంలో, గిలియడ్ మిషనరీ కోర్సు, న్యూయార్క్ రాష్ట్రంలోని ఫింగర్ లేక్‌నందలి అందమైన పల్లె ప్రాంతంలో నిర్వహించబడింది. అక్కడ, ఈ లోక వ్యవహారాలకు మరియు కష్టాలకూ దూరంగా, బైబిలు పఠనంలోను మరియు నిజమైన క్రైస్తవ సహవాసంలోనూ మేము పూర్తిగా నిమగ్నమై ఆరునెలలు అద్భుతంగా గడిపాము. మా తోటి విద్యార్థులు, ఆస్ట్రేలియా, బొలివియా, బ్రిటన్, గ్రీస్ మరియు న్యూజిలాండ్‌తో సహా ప్రపంచంలో అనేక ప్రాంతాలనుండి వచ్చారు. అయితే త్వరలోనే పట్టభద్రులయ్యే దినం రానే వచ్చింది. ఆగస్టు 1959 నందు, మామా మిషనరీ నియామకాలకు మేము పడవ ప్రయాణం సాగిస్తుండగా కన్నీటితో మేము వీడ్కోలు పలికాము. ఒక నెల తర్వాత మేము స్పెయిన్ భూమిపై అడుగుపెట్టాము.
ఓ క్రొత్త సంస్కృతి
అల్గిసిరాస్ దక్షిణ ఓడరేవునందు, గిబ్రాల్టర్ పెద్ద రాతి వద్ద మేము దిగాము. ఆ రోజు రాత్రి మేము నలుగురమూ అంటే రీటా, నేను హన్‌డర్ట్‌మార్క్ దంపతులతో మాడ్రిడ్ వెళ్ళేందుకు రైలునెక్కాము. మేము హోటెల్ మెర్కడోర్‌కు వెళ్లి, సొసైటీ యొక్క రహస్య బ్రాంచి కార్యాలయపు సభ్యులను కలిసేంతవరకు అక్కడ వేచివున్నాము. స్పెయిన్, జనరలిస్సిమో ఫ్రాన్సిక్కో ఫ్రాంకో నిరంకుశ పాలకుని క్రింద ఉండేది అంటే ఆ దేశంలో చట్టబద్ధంగా గుర్తింపును పొందినది రోమన్ కాథోలిక్కు చర్చి మాత్రమేనని దాని భావం. ఏ ఇతర మతాన్నైనా బహిరంగంగా ఆచరించడం చట్ట విరుద్ధంగా ఉండేది మరియు యెహోవాసాక్షుల ఇంటింటి పరిచర్య పని నిషేధించబడింది. చివరికి మతపర కూటాలు కూడా నిషేధించబడ్డాయి, కనుక ఆ సమయంలో స్పెయిన్‌నందు 30 సంఘాల్లో ఉన్న 1,200 మంది యెహోవాసాక్షులు, ఇతర దేశాల్లోలా రాజ్యమందిరాల్లో కూడుకోలేకపోయారు. మేము ఎవరి ఇంట్లోనైనా రహస్యంగా కలుసుకోవల్సివచ్చేది.
స్పానిష్ భాషను నేర్చుకోవడం మరియు పని ప్రారంభించడం
మాకెదురైన మొదటి సవాలు భాష నేర్చుకోవడం. మొదటి నెల స్పానిష్ భాషను నేర్చుకోవడంలో మేము 11 గంటలను గడిపాము, అంటే 4 గంటలు తరగతిలో, తర్వాత 7 గంటలు మా అంతట మేమే పఠించడంలో గడిపాము. రెండవ నెల ఉదయాలు అలాగే ఉండేవి, అయితే మధ్యాహ్నాలను ఇంటింటి పరిచర్యకు కేటాయించడం జరిగింది. దాన్ని ఊహించుకోగలరా! ఇంకా భాష రాకపోయినా, కంఠస్థం చేసిన ఉపోద్ఘాతాన్ని కార్డుపై వ్రాసుకుని నేనూ రీటా, మా అంతట మేమే ఇంటింటి పరిచర్యకు వెళ్లాము.
మాడ్రిడ్‌నందు కాయకష్టం చేసే ప్రజలు నివసించే వలికాస్‌నందు తలుపు తట్టడం నాకు జ్ఞాపకమొస్తోంది. పొరపాటున నేను మర్చిపోతానేమోనని నా చేతిలో కార్డు పుచ్చుకుని స్పెయిన్ భాషలో ఇలా చెప్పాను: “నమస్కారమండీ. మేము ఓ క్రైస్తవ పని చేస్తున్నాం. బైబిలు ఇలా చెబుతోంది (ఓ లేఖనాన్ని మేము చదివేవాళ్లం). మీరు ఈ చిన్నపుస్తకాన్ని చదవాలని మేము కోరుతున్నామండీ.” ఆవిడ ఊరికే అలా చూసి, తర్వాత చిన్నపుస్తకాన్ని తీసుకుంది. మేము పునర్దర్శనం చేసినప్పుడు, ఆమె మమ్మల్ని లోనికి ఆహ్వానించింది మరి మేము మాట్లాడుతుంటే ఊరికే అలా చూస్తూ ఉంది. వచ్చీరాని స్పానిష్ భాషతోనే మేము బైబిలు పఠనాన్ని ప్రారంభించాము, మరి పఠించేటప్పుడు ఆమె కేవలం వింటూ చూస్తూ ఉండేది. చివరికి కొంతకాలం తర్వాత, మొదట మేము ఆమెను సందర్శించినప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాలేదని, కానీ డియాస్ (దేవుడు) అని మాత్రం వినిపించిందని, అప్పుడిక మంచి విషయమే అని అనేందుకు అది చాలునని ఆమె తెలుసుకుందని మాతో చెప్పింది. ఈ మధ్య కాలంలో ఆమె అవసరమైన బైబిలు జ్ఞానాన్ని పొందింది మరి యెహోవాసాక్షి అవుతూ బాప్తిస్మము తీసుకుంది.
స్పానిష్ భాషను నేర్చుకోవడం నాకు చాలా కష్టమైంది. నగరంలో ప్రయాణించేటప్పుడు, క్రియా రూప నిష్పత్తులను నేను కంఠస్థం చేసే వాణ్ణి. ఒక వారం కంఠస్థం చేసినవాటిని మరో వారానికల్లా మర్చిపోయేవాణ్ణి! అది చాలా నిరుత్సాహకరంగా ఉండేది. ఎన్నో సార్లు మానుకున్నంత పని చేశాను. నా స్పానిష్ అతి ఘోరంగా ఉండేది కనుక, స్పానిష్ సహోదరుల మధ్య నేను నాయకత్వం వహించేటప్పుడు వారు చాలా ఓర్పును కనపర్చాల్సి వచ్చింది. ఒక జిల్లా సమావేశంలో, ఓ సహోదరుడు వేదికనుండి చదివేందుకు చేతితో వ్రాసిన ఒక ప్రకటనను నాకు ఇచ్చాడు. ఆయన వ్రాత అర్థంకాక నేను ఇలా ప్రకటించాను: “మీరు మీ మ్యులెటాస్‌లను (ఊతకోలను) రేపు స్టేడియమ్‌కు తీసుకురండి.” అసలు అది ఇలా ఉండాలి, “మీ మలెటాస్‌ను (ప్రయాణ సామాగ్రిని) రేపు స్టేడియమ్‌కు తీసుకురండి.” ప్రజలు నవ్వారనుకోండి, మరి నేను మామూలుగానే అవమానకరంగా భావించాను.
మాడ్రిడ్‌నందు తొలి పరీక్షలు
మాడ్రిడ్‌నందలి ఆ మొదటి కొన్ని సంవత్సరాలు, నాకూ రీటాకు భావోద్రేకంగా చాలా కష్టంగా ఉండేవి. మా ఇల్లు, మా స్నేహితులు మాకెంతో గుర్తొచ్చేవారు. అమెరికా నుండి మాకు ఉత్తరం వచ్చిన ప్రతిసారీ, ఇంటిమీది బెంగ మమ్మల్ని ముంచెత్తేది. ఇంటిమీది బెంగ కలిగే ఆ సమయాలు ఎంతో కలతపర్చేవిగా ఉండేవి, కానీ కొంతకాలానికి అవి పోయాయి. ఎంత కాదన్నా, మేము మా ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితులను విడిచి అమూల్యమైన ఈ ముత్యాన్ని పొందేందుకు వచ్చాము కదా. మేము పొందుపర్చుకోవల్సిన అవసరముంది.
మాడ్రిడ్‌నందు మేము మా జీవనం ప్రారంభించినప్పుడు మేము దుర్గతిలోనున్న వసతి గృహంలో లేక పూటకూళ్ల ఇంట్లో జీవించాము. మాకు ఓ గది మరియు ఒక రోజు మూడు పూటలు భోజనం ఉండేది. ఆ గది చీకటిగానూ చిన్నగానూ ఉండేది మరి పరుపులు గడ్డితో చేయబడినవి. ఒక నెల అద్దె మాకు అందే కొంచెం భత్యాన్నంతా కాజేసేది. సహజంగా మిట్టమధ్యాహ్నం మేము భోజనం చేసేవాళ్లం, మరి బాగా పొద్దుగూకిన తర్వాత వేడివేడిగా తినేందుకు ఆ ఇంటావిడ అవెన్‌లోనే భోజనాన్ని పెట్టి ఉంచేది. అయితే, ఉదయం సాయంకాలం ప్రకటించడంతో మాకు చాలా ఆకలివేసేది. మా భత్యమంతా అయిపోతే, మాకున్న కాస్త వ్యక్తిగత మొత్తంలోని డబ్బుతో ఎక్కడ అతి చవకైన చాకెట్లు దొరుకుతాయో చూసి వాటిని కొనుక్కునేవాళ్లం. అయితే, సొసైటీ జోన్ ఓవర్‌సీర్ సందర్శనంతో ఈ పరిస్థితి వెంటనే మారింది. ఆయన మా కష్టాలు చూసి, మిషనరీ హోమ్‌గా ఉపయోగించుకునేందుకు ఒక చిన్న ఇంటిని చూసుకోమని చెప్పాడు. వంటగదిలో ఒక గుండ్రని టబ్‌లో నిలుచుని స్నానం చేసే కంటే ఇది ఎంతో మేలు. ఇప్పుడు మాకు ఓ షవర్ ఉంది, ఆహారం పెట్టుకునేందుకు ఓ ఫ్రిడ్జ్ మరియు వంట వండుకునేందుకు ఓ ఎలక్ట్రిక్ స్టవ్ ఉన్నాయి. మాపై చూపిన ఈ శ్రద్ధకు మేము ఎంతో కృతజ్ఞులము.
మాడ్రిడ్‌నందు అద్భుతమైన అనుభవాలు
ఇంటింటి పరిచర్యను ఎంతో జాగ్రత్తగా చేసేవాళ్లం. మాడ్రిడ్‌నందలి అనుదిన గడబిడ ప్రయోజనకరంగా ఉండేది, మేము ఎక్కువగా గుర్తించబడకుండా మాకు అది ఓ తెరగా పనిచేసేది. మేము విదేశీయులమని వేరుగా కనిపించకుండా ఉండేందుకు మేము వారిలాగే దుస్తులను ధరించి వారిలాగే ప్రవర్తించేందుకు ప్రయత్నించాము. మా పరిచర్య విధానం ఇలా ఉండేది: ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి, ఓ తలుపుతట్టి ఆ వ్యక్తితో మాట్లాడి, తర్వాత ఆ బిల్డింగ్‌ను ఆ వీధినీ చివరికి ఆ ప్రాంతాన్నే విడిచి వెళ్లిపోయేవాళ్లం. ఆ ఇంటివారు పోలీసులను పిలిచే అవకాశం ఎల్లప్పుడూ ఉండేది, కనుక ఆ చుట్టుప్రక్కల ఉండడం వివేకయుక్తం కాదు. ఈ పద్ధతిని ఉపయోగించడంలో పాల్ ఎవిలిన్ హాన్‌డర్ట్‌మార్క్ జాగ్రత్తగా ఉన్నప్పటికీ వారు పట్టుబడి ఆ దేశం నుండి 1960లో బహిష్కరించబడ్డారు. ప్రక్క దేశమైన పోర్చుగల్‌కు వారు వెళ్లి, పాల్ అక్కడి రహస్య బ్రాంచి కార్యాలయాన్ని చూసుకుంటూ అనేక సంవత్సరాలు సేవ చేశాడు. ఈ రోజు అతను కాలిఫోర్నియాలోని సాన్ డెయిగోనందు పట్టణాధ్యక్షునిగా ఉన్నాడు.
అయితే, మాకు మట్టుకు వాళ్లకు బదులుగా ఇంకొకరు వచ్చారు. కేవలం కొన్ని నెలల తర్వాత, పోర్చుగల్‌కు నియమించబడిన ఆరుగురు మిషనరీలు ఆ దేశం విడిచిపెట్టాలని ఆజ్ఞ జారీ చేయబడింది! ఇది ఆనందమయ మార్పును తెచ్చింది ఎందుకంటే గిలియడ్ తరగతిలో మాతో ఉన్న ఎర్రిక్ మరియు హేజల్ బెవ్‌రిజ్‌లను పోర్చుగల్ విడిచి స్పెయిన్‌కు రమ్మన్నారు. కనుక, ఈసారి ఎర్రిక్‌ను హేజల్‌ను ఆహ్వానించేందుకు 1962 ఫిబ్రవరి నందు, హోటల్ మెర్కడోర్ వద్ద మరోసారి వేచివున్నాము.
మాడ్రిడ్‌నందలి ఈ తొలి రోజుల్లోనే నేనూ రీటా మత వేషధారణను గూర్చి వ్యక్తిగత అనుభవాన్ని పొందాము. భార్యాభర్తలైన బెర్నార్డో మరియు మరియతో మేము బైబిలును పఠించేవాళ్లం. బెర్నార్డోకు కనిపించిన పారేసిన నిర్మాణ వస్తువులతో నిర్మించిన ఓ పూరిగుడిసెలో వారు ఉండేవారు. మేము వారితో చాలా పొద్దుపోయిన తర్వాత పఠించేవాళ్లం, ఆ పఠనం తర్వాత వారు బ్రెడ్, ద్రాక్షారసం మరియు కొంత చీజ్‌నో లేక వాళ్లవద్ద ఉన్న దేన్నైనా మాకు పెట్టేవాళ్లు. ఆ చీజ్ సరిగ్గా అమెరికా చీజ్‌లాగే ఉన్నట్లు నేను గమనించాను. ఒక రోజు పఠనం తర్వాత, చీజ్ ఉన్న డబ్బాను వాళ్లు తీసుకొచ్చారు. దాని మీద పెద్ద అక్షరాలతో ఆంగ్లంలో ఇలా వ్రాసివుంది, “అమెరికా ప్రజలనుండి స్పెయిన్ ప్రజలకు—దీనిని అమ్మరాదు.” ఈ పేద కుటుంబానికి ఈ చీజ్ ఎలా వచ్చింది? పేదలకు దీన్ని పంచిపెట్టేందుకు ప్రభుత్వం కాథోలిక్ చర్చిని ఉపయోగించుకుంది. అయితే ప్రీస్టు దాన్ని అమ్ముకుంటున్నాడు!
సైన్యంతో ఫలవంతమైన పరిచర్య
త్వరలోనే, మాకూ మరియు ఇతరులనేకులకూ ఓ గొప్ప ఆశీర్వాదంగా మారే అద్భుతమైన ఒక సంఘటన జరిగింది. మాడ్రిడ్ నుండి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న టారెకాన్‌నందున్న అమెరికా వైమానిక దళ స్థావరంలో ఉండే వాల్టర్ కీడాష్ అనే యువకున్ని సందర్శించమని కోరుతూ బ్రాంచి కార్యాలయం నుండి ఒక నోటీసు మాకు అందింది. మేము అతన్ని, అతని భార్యను సందర్శించి, వారితోనూ వైమానిక దళంలో పనిచేసే మరొక దంపతులతోనూ బైబిలు పఠనాన్ని ప్రారంభించాము.
ఆ సమయంలో, అమెరికా వైమానిక సిబ్బందిలో నేను సుమారు అయిదు బైబిలు పఠనాలను నిర్వహిస్తుండేవాణ్ణి, అయితే అన్ని ఆంగ్లంలోనే అనుకోండి. వారిలో ఏడుగురు తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు, మరి అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత వారిలో నలుగురు సంఘపెద్దలయ్యారు.
మా పనిపైన నిషేధం ఉండడం వల్ల పుస్తకాలనూ పత్రికలనూ మరియు బైబిళ్లనూ ఆ దేశంలోకి తీసుకువచ్చే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. అయితే, కొన్ని సాహిత్యాలను సందర్శకులు తెచ్చేవారు మరియు మా అమెరికా వార్తాహరులు తీసుకుని వచ్చేవారు. నేను రహస్య ప్రచురణ డిపోను చూసుకోవల్సిందిగా బ్రాంచి నన్ను నియమించింది. వలికాస్‌నందు ఓ స్టేషనరీ దుకాణం వెనకనున్న సరుకులు నిలువచేసే ఓ గదిలో అది ఉండేది. దాని యజమాని భార్య ఓ యెహోవాసాక్షి. ఆ యజమాని సాక్షి కాకపోయినప్పటికీ, మా పనిని ఆయన గౌరవించేవాడు, ఆయనకూ ఆయన వ్యాపారానికి కూడా అపాయకరమైనప్పటికీ వెనకనున్న ఈ స్థలాన్ని, దేశమంతటికీ ప్రచురణలను పంపేలా ప్యాకేజీలను నేను సిద్ధపర్చేందుకు దాన్ని ఉపయోగించుకునేందుకు ఆయన అనుమతించాడు. ఈ గది దుమ్ముతో నిండి, డబ్బాలు పేరుకుపోయి ఎల్లప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కనిపించేందుకుగాను, పనికొరకు త్వరగా అవసరమైన వాటిని సిద్ధంచేసి అది అయిపోయిన వెంటనే మరి క్షణాల్లో దాచేటటువంటి ఓ బెంచినీ, పుస్తకాల అల్మారాను నేను తయారు చేయవల్సివచ్చింది. ఆ దినం ముగిసేటప్పటికీ, నా ప్యాకేజీలతో నేను త్వరగా బైటికి వెళ్ళడానికి దుకాణంలో ఎవరూ లేకుండా ఉండేంతవరకు నేను వేచివుండేవాణి.
కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలనూ మరితర ప్రచురణల వంటి ఆత్మీయ ఆహారాన్ని దేశమంతటిలోని సంఘాలకు పంచే పనిలో భాగం వహించడం నిజంగా ఓ ఆధిక్యతే. అవెంతో ఉప్పొంగింపజేసే సమయాలు.
రీటా 16 బైబిలు పఠనాలు నిర్వహించే ఆనందాన్ని పొందింది, వారిలో సుమారు సగం మంది యెహోవాసాక్షులుగా బాప్తిస్మం పొందారు. తన గుండె సమస్యతో చలికాలాలను మంచం మీదే గడిపిన ఓ యౌవన వివాహిత స్త్రీయే డోలోరెస్. వసంత కాలంలో ఆమె లేచి కాస్త చురుకుగా ఉండగల్గింది. డోలోరెస్ విశ్వాసం చాలా గట్టిది, ఫ్రాన్స్‌నందలి టౌలౌస్‌నందు మా జిల్లా సమావేశం సమీపించినప్పుడు, ఆమె కూడా వెళ్ళాలని ఎంతగానో ఇష్టపడింది. ఆమె గుండె పరిస్థితివల్ల అలా వెళ్లడం అవివేకమని ఆమె వైద్యుడు ఆమెను హెచ్చరించాడు. ఇంట్లో వేసుకునే దుస్తులుతోనూ చెప్పులతోనూ, ఏ సామానూ లేకుండా, ఆమె భర్త, అమ్మ మరితరులను సాగనంపేందుకు ఆమె రైలు వరకు వెళ్లింది. ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి, ఆమె లేకుండా వాళ్లు వెళ్లడం ఆమె చూడలేకపోయింది, కనుక రైలెక్కి ఫ్రాన్స్‌కు వెళ్లిపోయింది! ఇలా జరిగిన విషయం రీటాకు తెలియదు. అయితే, సమావేశంలో, డోలోరెస్‌ను నిండు చిరునవ్వుతో చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోయిందో!
ఓ అసహజమైన బైబిలు పఠనం
మా మాడ్రిడ్ నియామకాన్ని, డాన్ బినీగ్‌నో ఫ్రాంకో, “ఎల్ ప్రొఫెస్సర్”ను చేర్చకుండా ముగించలేము. ఒక పూరింట్లో జీవించే ఒక పెద్ద మనిషి ఆయన భార్యను సందర్శించేందుకు ఓ స్థానిక సాక్షి నన్ను తీసుకెళ్లాడు. నేను ఆయనతో ఓ బైబిలు పఠనాన్ని ప్రారంభించాను. సుమారు ఒకటిన్నర సంవత్సరం పఠించిన తర్వాత, ఆయన బాప్తిస్మం తీసుకుంటానని కోరి, ఒక యెహోవాసాక్షి అయ్యాడు.
ఈ పెద్ద మనిషి, డాన్ బినీగ్‌నో ఫ్రాంకో, ఆ సమయంలోని స్పెయిన్ నిరంకుశపాలకుడైన ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సోదరుడు. డాన్ బినీగ్‌నో ఎల్లప్పుడు స్వేచ్ఛను ఇష్టపడే వ్యక్తిలా కనిపించేవాడు. స్పెయిన్ అంతర్గత యుద్ధం సమయంలో, అతను రిపబ్లిక్‌తో చేతులు కలిపి తన సోదరునికి వ్యతిరేకి అయ్యాడు. యుద్ధాన్ని జయించి కాథోలిక్ నిరంకుశ పాలనను స్థాపించిన సైన్యాధికారే ఆయన సోదరుడు. డాన్ బినీగ్‌నోకు, 1939 నాటినుండి కూడా, పనిచేసే హక్కులేకుండా చేశారు, నిరుపేద జీవితాన్ని జీవిస్తున్నాడు. కనుక, స్పెయిన్ నిరంకుశ పాలకుడైన ఆ జనరలిస్సిమో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో సోదరుడే ఓ యెహోవాసాక్షి అయ్యాడు.
అనుకోని ఆహ్వానం
పందొమ్మిది వందల అరవై ఐదునందు, బార్సిలోనానందు ప్రయాణ పనిని చేసేందుకు స్పెయిన్ బ్రాంచి కార్యాలయం మమ్మల్ని ఆహ్వానించింది. అంటే, మాడ్రిడ్‌నందు ఎంతో సన్నిహితమైన సహోదరులందరినీ విడిచి వెళ్లాలి. ఇప్పుడు నాకు ఒక కొత్త అనుభవమే కాకుండా నాకు పరీక్ష కూడా ప్రారంభం కాబోతోంది. నా సామర్థ్యంపై నాకే నమ్మకం లేదు కనుక ఆ అనుభవమే నన్ను భయపెట్టింది. ఈ సేవా ప్రాంగణంలో ప్రయోజనకరంగా ఉండేందుకు నాకు సహాయం చేసేది యెహోవానేనని నాకు బాగా తెలుసు.
ప్రతి వారం సంఘాలను దర్శించడం అంటే సహోదరుల ఇళ్లలో జీవించాల్సి ఉంటుంది. మా సామానంతా పెట్టెలలోనే ఉండేది, మరి ప్రతి రెండువారాలకూ మేము మా ఇంటిని మార్చేవాళ్లం. ప్రత్యేకంగా ఒక స్త్రీకి ఇది మరీ కష్టం. బార్సిలోనానందు నివసించిన హోసా మరియు రోసిర్ ఎస్క్యుడే ఎంతో కాలంవరకూ తమతో నివసించేందుకు ఆహ్వానించారు. ఈ విషయంలో వాళ్లు ఎంతో ప్రేమగలవారు, ఎందుకంటే మా సామాన్లు పెట్టుకునేందుకు మాకో స్థిరమైన స్థానం ఉంటుంది మరియు ఆదివారం సాయంకాలాలు ఇంటికి తిరిగి వచ్చేందుకు ఎప్పుడూ ఒక స్థలం ఉంటుంది.
నేనూ, రీటా మెడిటరేనియన్ తీరానున్న కాటలోనియ ప్రాంతంలో మా తర్వాతి నాలుగు సంవత్సరాల ప్రాంతీయ సేవను చేశాము. మా బైబిలు కూటాలన్నీ రహస్యంగా విడి ఇళ్లలో జరుపుకునే వాళ్లం మరియు అనవసరంగా అవధానాన్ని ఆకర్షించకుండా ఉండేందుకుగాను, ఇంటింటి పరిచర్య తెలివిగా జరిగించబడేది. ప్రత్యేకంగా ప్రాంతీయ సమావేశాన్ని జరుపుకునేటప్పుడు, కొన్నిసార్లు మా సంఘమంతా ఆదివారాలు అడవిలో “పిక్‌నిక్” కొరకు కలుసుకుంటారు.
తమ ఉద్యోగాలనూ మరియు స్వేచ్ఛను సహితం పణంగా పెట్టి, సంఘాన్ని ఐక్యంగానూ మరియు చురుకుగానూ ఉంచేందుకు ఎంతో కృషి చేసిన అనేకమంది ఆత్మీయ సహోదరులను మేము ఎల్లప్పుడు మెచ్చుకుంటాము. పట్టణం వారిలో అనేకులు బయట ఉన్న టౌన్లలో సహితం పనిని విస్తరింపజేసేందుకు వారిలో అనేకులు నాయకత్వాన్ని వహించారు. పందొమ్మిది వందల డెబ్బైనందు నిషేధాన్ని ఎత్తివేయడానికి తర్వాత మతపర స్వేచ్ఛను అనుగ్రహించిన తర్వాత ఇది స్పెయిన్‌లోని గొప్ప విస్తరణకు ఆధారమైంది.
మా విదేశీ నియామకాన్ని విడవల్సిన పరిస్థితి ఏర్పడడం
స్పెయిన్‌నందలి పది సంవత్సరాల్లో, యెహోవాను సేవించే ఈ ప్రత్యేకమైన సేవను మేము అనుభవించడం మా తలిదండ్రుల పరిస్థితివల్ల ఆటంకపర్చబడింది. అనేక సందర్భాల్లో, మేము మా పనిని మానేసి మా అమ్మానాన్నలను చూసుకునేందుకు వెళ్లిపోవల్సినంత పని అయ్యింది. అయితే, మా తలిదండ్రులకు సమీపంలో ఉన్న సంఘాల్లోని సహోదర సహోదరీల మంచితనంవల్ల మేము స్పెయిన్‌నందు కొనసాగగల్గాము. అవును, మిషనరీ పనిలో మేము సేవచేసే ఆ ఆధిక్యతను, దేవుని రాజ్యాన్ని ముందుంచడంలో మాతో పాల్గొన్న ఇతరుల సహకారానికి కూడా ఆపాదించవచ్చు.
చివరికి, 1968 డిశంబరులో, మా అమ్మను చూసుకునేందుకు మేము ఇంటికి తిరిగి వెళ్లాము. ఆ నెలే మా నాన్నగారు మరణించారు మరియు మా అమ్మగారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు. ఇప్పటికీ పూర్తికాల సేవను చేయగల్గినప్పటికీ, ప్రాంతీయ సేవలో పనిచేసేందుకు మాకు నియామకం దొరికింది, అయితే అది ఈ సారి అమెరికాలో. తర్వాతి 20 సంవత్సరాలు మేము స్పెయిన్‌నందలి ప్రాంతాల్లో సేవను చేశాము. అమూల్యమైన ముత్యమగు మా మిషనరీ పనిని మేము పోగొట్టుకున్నప్పటికీ, మా చేతిలో మరొకటి పెట్టడం జరిగింది.
మాదకద్రవ్యాలు మరియు దౌర్జన్యం మధ్య ప్రకటించడం
నేరం అధికంగా ఉన్న పట్టణాల్లో జీవిస్తున్న అనేకమంది సహోదర సహోదరులను మేము ఇప్పుడు సేవిస్తున్నాము. అంతెందుకు, న్యూయార్క్ బ్రూక్లిన్‌నందు ప్రాంతీయ సేవ ప్రారంభించిన మొదటి వారంలోనే, రీటా హ్యాండ్ బాగ్‌ను ఎవరో దొంగిలించారు.
నేనూ రీటా, న్యూయార్క్ నగరంలో మరో వైపున ఇంటింటి పరిచర్య చేస్తున్న ఒక గుంపుతో కలిసి పనిచేస్తున్నాము. ఒక వీధి వద్ద మలుపు తిరుగుతుండగా, నిర్మానుషమైన ఒక కట్టడపు గోడవద్దనున్న రంధ్రం ముందు కొందరు ప్రజలు వరుసకట్టినట్లుగా మేము గమనించాము. ఆ వీధిలోకి మేము కాస్త నడిచినప్పటికీ, ఒక యౌవనుడు మా వైపు చూస్తూ నిలుచోవడం మేము గమనించాము. పోలీసు కార్లను గమనిస్తూ మరో ప్రక్క మరొకరు నిలుచున్నారు. మాదక ద్రవ్య విక్రయదార్ల మధ్యకు మేము వెళ్లామన్నమాట! మొదట చూసినప్పుడు బెదిరిపోయాడు, కాని తర్వాత నా చేతిలో కావలికోట పత్రికను అతను చూశాడు, అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. నేను ఓ పోలీసు అధికారినైవుండేవాణ్ణి సుమా! తర్వాత అతను స్పెయిన్ భాషలో “¡ఆటాలాయాస్! ¡ఆటాలాయాస్!” (వాచ్‌టవర్‌వాళ్లు! వాచ్‌టవర్‌వాళ్లు!) అని అరిచాడు. మేమెవరిమో వారు మా పత్రికలవల్ల మమ్మల్ని గుర్తిస్తూ అప్పుడు అంతా చక్కబడింది. నేను అతని దగ్గరికి వచ్చినప్పుడు “¿బ్వినోస్ డియాస్ కొమో ఎస్టా?” (నమస్కారం, ఎలావున్నారు?) అని అన్నాను. తన కొరకు ప్రార్థించమని కోరుతూ అతను నాకు జవాబిచ్చాడు!
కఠినమైన నిర్ణయం
పందొమ్మిది వందల తొంభైనందు నేను ఇక మా అమ్మతో ప్రతిరోజూ ఉండాలన్నది స్పష్టమైంది. ప్రాంతీయ పనిలో కొనసాగేందుకు మేము ఎంతగానో ప్రయత్నించాము, కానీ రెండు బాధ్యతలనూ మేము నిర్వర్తించడం అసాధ్యమని వివేకముపదేశించింది. అమ్మను ప్రేమతో చూసుకోవాలని మేము యథార్థంగా కోరుకున్నాము. అయితే మరలా మరోసారి మాకు ఎంతో విలువగల అమూల్యమైన ముత్యాన్ని విడవవల్సి వచ్చింది. ప్రపంచంలోని రత్నాలన్ని మరియు అవి ఒక వ్యక్తి చేయగల్గినవన్నీ, యెహోవా సంస్థలో మిషనరీలుగా లేక ప్రాంతీయ సేవకులుగా పనిచేయడంతో సరిసమానం కావు.
నేను రీటా ఇప్పుడు మా 60వ పడిలో ఉన్నాము. స్పెయిన్ భాష మాట్లాడే ప్రాంతీయ సంఘంతో సేవచేయడంలో మేము సంతృప్తిని కల్గివున్నాము. యెహోవాసేవలో మేము గడిపిన సంవత్సరాలను ఒకసారి చూస్తే, కొన్ని అమూల్యమైన ముత్యాలను మాకు ఇచ్చినందుకు మేము ఎంతో కృతజ్ఞులము.
[23వ పేజీలోని చిత్రం]
మాడ్రిడ్ కట్టడం వెలుపల రీటా పాల్ మరియు ఎవిలిన్ (కుడి) హన్‌డర్ట్‌మార్క్
[24వ పేజీలోని చిత్రం]
అడవిలోని “పిక్‌నిక్” నందు ఓ సంఘంతో సేవించడం