దుఃఖిస్తున్నప్పటికీ, మనం నిరీక్షణలేనివారం కాము
“నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు.”—1 థెస్సలొనీకయులు 4:13.
1. క్రమంగా మానవజాతి ఏమి అనుభవిస్తుంది?
మీ ప్రియమైనవారినెవరినైనా మరణమందు మీరు కోల్పోయారా? మన వయస్సేమైనప్పటికీ, మనలో అనేకమందిమి మన బంధువులు లేక ఓ స్నేహితుని కోల్పోవడం వల్ల ఎంతగానో బాధపడ్డాము. బహుశ అది మన తాతో అమ్మమ్మోకావచ్చు, తలిదండ్రుల్లో ఒకరు కావచ్చు, ఓ వివాహ జత కావచ్చు, లేక ఓ బిడ్డ కావచ్చు. వృద్ధాప్యం, అనారోగ్యం, ప్రమాదాలు క్రమంగా మృత్యువును తెస్తుంటాయి. నేరం, దౌర్జన్యం మరియు యుద్ధాలు మన దైన్య స్థితినీ, వ్యధలనూ మరింత అధికం చేస్తాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా, సుమారు అయిదు కోట్ల మంది ప్రజలు మరణిస్తున్నారు. పందొమ్మిదివందల తొంభ్బైమూడు నందు ప్రతిదినం సరాసరి 1,40,250 మంది చనిపోయారు. మరణించినవారి సంఖ్య, స్నేహితులూ కుటుంబంపై ప్రభావాన్ని చూపుతుంది మరియు వారిని కోల్పోయామన్న భావన తీవ్రంగా ఉంటుంది.
2. పిల్లలు మరణించడం ఎందుకు అసహజం అనిపిస్తుంది?
2 అమెరికానందలి కాలిఫోర్నియాలో, అదుపుతప్పిన కారు ప్రమాదంలో గర్భిణియైన తమ కుమార్తెను దారుణంగా కోల్పోయిన తల్లిదండ్రులపై మనకు సానుభూతి కలుగదా? అనుకోని దుర్ఘటనలో వారు తమకున్న ఒక్కగానొక్క కూతురునూ తమకు మొట్టమొదటి మనవడో మనవరాలో కావల్సిన బిడ్డనూ కోల్పోయారు. బాధితురాలి భర్త తన భార్యనూ తన మొదటి కొడుకునో కూతురునో కోల్పోయాడు. తమ పిల్లలు చిన్నవారైనా లేక పెద్దవారైనా వారిని తలిదండ్రులు కోల్పోవడం అసహజమే. తలిదండ్రులకు ముందుగా పిల్లలు మరణించడం సహజంకాదు. మనందరికీ జీవం ప్రీతిపాత్రమే. కనుక, మరణం నిజంగానే ఓ శత్రువు.—1 కొరింథీయులు 15:26.
మరణం మానవ కుటుంబంలోకి ప్రవేశించడం
3. ఆదాము హవ్వలపై హేబెలు మరణం ఏ ప్రభావాన్ని చూపివుండవచ్చు?
3 మన మొదటి మానవ తలిదండ్రులైన ఆదాము హవ్వల తిరుగుబాటు నుండి అంటే సుమారు ఆరు వేల సంవత్సరాలుగా మానవ చరిత్రను పాపమరణములు రాజులుగా ఏలుతున్నాయి. (రోమీయులు 5:14; 6:12, 23) తన సోదరుడైన కయీనువల్ల చంపబడ్డ తమ కుమారుడైన హేబెలు హత్య విషయంలో వారు ఎలా ప్రతిస్పందించారో బైబిలు చెప్పడంలేదు. అనేక కారణాలవల్ల, అది వారికి కృంగదీసే అనుభవం. మొట్టమొదటి సారిగా, ఇక్కడ, వారు తమ స్వంత కుమారుని ముఖంలో ప్రతిబింబించిన మృత్యుముఖాన్ని నేరుగా చూశారు. వారు తమ తిరుగుబాటు ఫలితాన్ని మరియు తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగించుకోవడం వల్ల వచ్చిన ఫలితాన్ని చూశారు. దేవుడు హెచ్చరించినప్పటికీ కయీను, మొట్టమొదటి బాతృ హత్య చేసేందుకే ఎన్నుకున్నాడు. హేబెలు మరణం వల్ల హవ్వ ఎంతో బాధపడిందని మనకు తెలుసు ఎందుకంటే షేతు జన్మించినప్పుడు ఆమె ఇలా చెప్పింది: “కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెను.”—ఆదికాండము 4:3-8, 25.
4. హేబెలు మరణించిన తర్వాత మానవ ఆత్మను గూర్చిన కట్టుకథ ఎందుకు ఏ ఓదార్పునూ ఇవ్వలేదు?
4 మన మొదటి తలిదండ్రులు ఎదురుతిరిగి, అవిధేయులైనట్లైతే, వారు “నిశ్చయముగా చచ్చెద”రనే దేవుని తీర్పు యొక్క నెరవేర్పును కూడా వారు చూశారు. సాతాను అబద్ధమాడినప్పటికీ, అమర్త్యమైన ఆత్మ అనే కట్టుకథ ఇంకా అభివృద్ధి చెందలేదు కనుక వారు దాన్నుండి ఏ అబద్ధ ఓదార్పును పొందలేకపోయారు. దేవుడు ఆదాముతో ఇలా అన్నాడు: “నేలనుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.” అమర్త్యమైన ఆత్మగా పరలోకంలో, నరకంలో, నరకంలోని సరిహద్దులో, శుద్ధీకరణ లోకంలో లేక మరోచోట ఎక్కడైనా జీవించివుంటాడన్న విషయాన్ని ఆయన ప్రస్తావించనే లేదు. (ఆదికాండము 2:17; 3:4, 5, 19) ఆదాము హవ్వలు పాపంచేసిన జీవాత్మలుగా చివరికి చనిపోయి ఇక ఉనికిలో ఉండరు. రాజైన సొలొమోను ఇలా రాసేందుకు ప్రేరేపించబడ్డాడు: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారి పేరు మరువబడియున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.”—ప్రసంగి 9:5, 6.
5. మరణించినవారికి గల నిజమైన నిరీక్షణ ఏమిటి?
5 ఆ మాటలు ఎంత సత్యం! రెండు వందల లేక మూడు వందల సంవత్సరాలకు పూర్వమున్న పితరులను ఎవరు నిజంగా జ్ఞాపకం చేసుకోగలరు? అసలు తరచూ వారి సమాధులు ఎక్కడున్నాయో కూడా తెలియదు లేక ఎప్పటినుండో అలక్ష్యం చేయబడతాయి. దాని భావం మరణించిన మన ప్రియమైనవారికి ఏ నిరీక్షణా లేదనా? కానే కాదు. మరణించిన తన సోదరుడైన లాజరును గూర్చి మార్త యేసుతో ఇలా చెప్పింది: “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును.” (యోహాను 11:24) దేవుడు ప్రజలను భవిష్యత్తులో పునరుత్థానం చేస్తాడని హెబ్రీ ప్రజలు నమ్మేవారు. అయితే, తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు వారు దుఃఖించడం మానలేదు.—యోబు 14:13.
దుఃఖించిన నమ్మకస్థులైనవారు
6, 7. అబ్రాహాము, యాకోబులు మరణానికి ఎలా ప్రతిస్పందించారు?
6 సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం, అబ్రాహాము భార్యయైన శారా మరణించినప్పుడు, “అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.” నమ్మకస్థుడైన ఆ దేవుని సేవకుడు తన ప్రియమైన, యథార్థపరురాలైన భార్యను కోల్పోయినందుకు తన అంతర్గత భావాలను వెలిబుచ్చాడు. ధైర్యశీలుడైనప్పటికీ, తన దుఃఖాన్ని కన్నీటి ద్వారా వ్యక్తపర్చేందుకు అతను సిగ్గుపడలేదు.—ఆదికాండము 14:11-16; 23:1, 2.
7 యాకోబు పరిస్థితి కూడా అలాగే ఉంది. తన కుమారుడైన యోసేపును ఓ క్రూర మృగం చంపిందని ఏమార్చి నమ్మించినప్పుడు ఆయన ఎలా ప్రతిస్పందించాడు? ఆదికాండము 37:34, 35 నందు మనం ఇలా చదువుతాము: “యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తనకుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక—నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను.” అవును, ప్రియమైన వారు మరణించినప్పుడు దుఃఖాన్ని వ్యక్తపర్చడం మానవ సహజం.
8. హెబ్రీయులు తరచూ తమ దుఃఖాన్ని ఎలా వ్యక్తపర్చారు?
8 ఆధునిక మరియు స్థానిక ఆచారాల ప్రకారం, యాకోబు ప్రతిస్పందన మరీ విపరీతంగానూ నాటకంగాను ఉందని కొందరు భావించగలరు. అయితే, ఆయన భిన్నమైన కాలంలోనూ భిన్నమైన సంస్కృతులోనూ పెరిగినవాడు. ఆయన తన దుఃఖాన్ని వ్యక్తపర్చడం, అంటే గోనెపట్టను కట్టుకోవడం వంటి ఆచారాన్ని బైబిలునందు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. అయితే, హెబ్రీ లేఖనాలందు వర్ణించినట్లుగా, ఏడ్వడం ద్వారా, విలాపగీతాలను వ్రాయడం ద్వారా, బూడిదలో కూర్చోవడం ద్వారా దుఃఖం వ్యక్తపర్చబడేది. కనుక తన దుఃఖాన్ని యథార్థంగా కనుపర్చడంలో హెబ్రీయులు వెనుదీయలేదని రుజువౌతోంది.a—యెహెజ్కేలు 27:30-32; ఆమోసు 8:10.
యేసు కాలంలో దుఃఖం
9, 10. (ఎ) లాజరు మరణానికి యేసు ఎలా ప్రతిస్పందించాడు? (బి) యేసు ప్రతిస్పందన ఆయనను గూర్చి మనకు ఏమి చెబుతుంది?
9 యేసు తొలి శిష్యులను గూర్చి మనం ఏమి చెప్పగలము? ఉదాహరణకు, లాజరు చనిపోయినప్పుడు, అతని సహోదరీలైన మార్తా మరియలు అతను చనిపోయినందుకు కన్నీటితో ప్రలాపించారు. ఆ పరిస్థితిలో అక్కడికి వచ్చిన పరిపూర్ణ మానవుడైన యేసు ఎలా ప్రతిస్పందించాడు? యోహాను వృత్తాంతం ఇలా చెబుతోంది: “మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి—ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు—అతనినెక్కడ నుంచితిరని అడుగగా, వారు—ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను.”—యోహాను 11:32-35.
10 “యేసు కన్నీళ్లు విడిచెను.” ఈ కొన్ని మాటలే యేసు మానవత్వం, ఆయన కనికరం, ఆయన భావాలను గూర్చి ఎంతో చెబుతాయి. పునరుత్థాన నిరీక్షణను గూర్చి పూర్తిగా తెలిసినప్పటికీ “యేసు ఏడ్చాడు.” (యోహాను 11:35, కింగ్ జేమ్స్ వర్షన్) చూసేవారు ఇలా వ్యాఖ్యానించారని ఆ దృష్టాంతం కొనసాగింది: “అతనిని [లాజరు] ఏలాగు ప్రేమించెనో చూడుడి.” తప్పకుండా, ఓ స్నేహితుని కోల్పోయినందుకు ఓ పరిపూర్ణ మానవుడే ఏడ్చినట్లైతే, నేడు ఓ స్త్రీగానీ, పురుషుడుగానీ విచారపడడం అవమానకరంకాదు.—యోహాను 11:36.
మరణించినవారికి ఏ నిరీక్షణవుంది?
11. (ఎ) ప్రలాపించే విషయాన్ని గూర్చి బైబిలు ఉదాహరణలనుండి మనం ఏమి నేర్చుకోగలము? (బి) నిరీక్షణ లేని వారిలా మనం ఎందుకు దుఃఖించము?
11 ఈ బైబిలు ఉదాహరణలనుండి మనం ఏమి నేర్చుకోగలము? దుఃఖించడం మానవ సహజమనీ, ఆ దుఃఖాన్ని వ్యక్తపర్చేందుకు మనం సిగ్గుపడకూడదని నేర్చుకోగలము. పునరుత్థాన నిరీక్షణనుబట్టి మనం ఉపశమనాన్ని పొందినప్పటికీ, ప్రియమైనవారి మరణం ఇప్పటికీ కూడా ఎంతో తీవ్రంగా అనుభవించబడే గాయపర్చే నష్టము. సంవత్సరాలు, బహుశ దశాబ్దాల సన్నిహిత సహచర్యం మరియు సుఖదుఃఖాలను పంచుకోవడం అకస్మాత్తుగా, విషాదకరంగా అంతమైపోతాయి. నిజమే, నిరీక్షణలేని వారిలా లేక తప్పుడు నిరీక్షణగలవారిలా మనం దుఃఖించము. (1 థెస్సలొనీకయులు 4:13) అంతేకాకుండ, మనం మానవునికి అమర్త్యమైన ఆత్మ ఉందని లేక పునర్జన్మ ద్వారా అతను ఇంకా జీవిస్తూనే ఉంటాడనే కల్పనలవల్ల తప్పు దోవ పట్టించబడము. ‘నీతి నివసించు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని’ గూర్చి యెహోవా వాగ్దానం చేశాడని మనకు తెలుసు. (2 పేతురు 3:13) దేవుడు “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.
12. పునరుత్థానమందు పౌలు తన విశ్వాసాన్ని ఎలా వ్యక్తపర్చాడు?
12 మరణించినవారికి ఏ నిరీక్షణ ఉంది?b క్రైస్తవ రచయితయైన పౌలు ఇలా వ్రాసినప్పుడు మనకు ఓదార్పును, నిరీక్షణను అందించేందుకు ప్రేరేపించబడ్డాడు: “కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరింథీయులు 15:26) ద న్యూ ఇంగ్లీష్ బైబిల్ ఇలా పేర్కొంటోంది: “చివరిగా నిర్మూలింపజేయవల్సిన శత్రువు మరణమే.” దీని విషయంలో పౌలు ఎందుకు అంత నిశ్చయతను కల్గివున్నాడు? ఎందుకంటే, మరణం నుండి లేపబడిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మార్పునొందాడు మరియు బోధించబడ్డాడు. (అపొస్తలుల కార్యములు 9:3-19) అందుకనే పౌలు ఇలా కూడా చెప్పగలిగాడు: “మనుష్యుని [ఆదాము] ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని [యేసు] ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.”—1 కొరింథీయులు 15:21, 22.
13. లాజరు పునరుత్థానానికి ప్రత్యక్షసాక్షులు ఎలా ప్రతిస్పందించారు?
13 యేసు బోధలు మనకు గొప్ప ఓదార్పును, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణను ఇస్తాయి. ఉదాహరణకు, లాజరు విషయంలో ఆయన ఏమి చేశాడు? లాజరు భౌతికకాయం నాలుగు రోజులుగా ఉన్న సమాధి వద్దకు ఆయన వెళ్లాడు. ఆయన ఓ ప్రార్థన చేసి, “ఆయన ఆలాగు చెప్పి—లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు: ‘మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.’ మార్తా మరియల ఆశ్చర్యానందాల చూపులను మీరు ఊహించుకోగలరా? ఈ అద్భుతాన్ని చూసినప్పుడు పొరుగువారు ఎంతగా ఆశ్చర్యపోయివుంటారో కదా! చూసేవారనేకులు యేసును విశ్వసిస్తారనడంలో ఏ ఆశ్చర్యమూలేదు. అయితే, ఆయన మతపర శత్రువులు, “ఆయనను చంప నాలోచించుచుండిరి.”—యోహాను 11:41-53.
14. లాజరు పునరుత్థానం దేని విషయంలో ఓ ముంగుర్తుగా ఉంది?
14 యేసు, అనేకమంది సాక్షుల ఎదుట సుస్మరణీయమైన ఆ పునరుత్థానాన్ని చేశాడు. “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు” అని ఆయన అన్నప్పుడు అంతకుముందు ఓ సందర్భంలో ఆయన ప్రవచించిన భవిష్యత్ పునరుత్థానానికి ఇది ఓ ముంగుర్తు.—యోహాను 5:28, 29.
15. పౌలు అననీయలకు యేసు పునరుత్థానం గూర్చి ఏ రుజువు లభించింది?
15 మునుపు ప్రస్తావించినట్లుగా, అపొస్తలుడైన పౌలు పునరుత్థానమందు విశ్వసించాడు. దేని ఆధారంగా? దానికి ముందు అతను క్రైస్తవులను హింసించిన సౌలుగా పేరుపొందాడు. అతని పేరు ప్రఖ్యాతలు విశ్వాసుల్లో భయాన్ని వ్యాపింపజేశాయి. అంతెందుకు, క్రైస్తవ హతసాక్షియైన స్తెఫనును రాళ్లతోకొట్టి చంపడాన్ని ఆమోదించింది ఈయనే కాదా? (అపొస్తలుల కార్యములు 8:1; 9:1, 2, 26) అయినా, దమస్కుకు వెళ్లే దారిలో, యేసు అతనిని తాత్కాలిక అంధత్వంతో మొత్తుతూ అతనేమి చేస్తున్నాడో గ్రహించేలా చేశాడు. “సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావన్న” ఒక స్వరాన్ని సౌలు విన్నాడు. “ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన—నేను నీవు హింసించుచున్న యేసును” అని చెప్పాడు. పునరుత్థానం పొందిన ఆ యేసే, దమస్కులో జీవిస్తున్న అననీయ, సౌలు ఇంటికి వెళ్లి, అక్కడ ప్రార్థిస్తున్న సౌలుకు మరలా చూపునిమ్మని ఆదేశించాడు. ఆ విధంగా వ్యక్తిగత అనుభవం నుండి, సౌలు మరియు అననీయలిరువురూ పునరుత్థానమందు విశ్వసించేందుకు ఎన్నో కారణాలున్నాయి.—అపొస్తలుల కార్యములు 9:4, 5, 10-12.
16, 17. (ఎ) అంతర్గత అమర్త్యమైన ఆత్మ విషయంలోని గ్రీకు సిద్ధాంతాన్ని పౌలు విశ్వసించలేదని మనకు ఎలా తెలుసు? (బి) బైబిలు ఏ గట్టి నిరీక్షణను ఇస్తోంది? (హెబ్రీయులు 6:17-20)
16 ఓ హింసించబడిన క్రైస్తవునిగా అధికారియైన ఫేలిక్సు ముందుకు వచ్చినప్పుడు అపొస్తలుడైన పౌలైన సౌలు ఏమని జవాబు చెప్పాడో గమనించండి. అపొస్తలుల కార్యములు 24:15 నందు ఇలా ఉంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని . . . నేను . . . దేవునియందు నిరీక్షణ”యుంచుచున్నాను. స్పష్టంగా, మరణానంతర కాల్పనిక జీవితంలోకి లేక క్రింది ప్రపంచంలోకి మానవుని అంతరంగ అమర్త్యమైన ఆత్మ వెళుతుందని అనుకునే అన్యమత గ్రీకు సిద్ధాంతాన్ని పౌలు విశ్వసించలేదు. ఆయన పునరుత్థానాన్ని నమ్మాడు మరియు దాని యందు విశ్వాసాన్ని కల్గివుండాలని నేర్పాడు. దాని భావం, కొందరికి పరలోకంలో క్రీస్తుతో ఆత్మీయ ప్రాణులుగా అమర్త్యమైన జీవం మరియు అనేకులకు పరిపూర్ణ భూమిపై పునర్జీవనం.—లూకా 23:43; 1 కొరింథీయులు 15:20-22; 53, 54; ప్రకటన 7:4, 9, 17; 14:1, 3.
17 ఆ విధంగా పూర్తిగా వేరే పరిస్థితుల్లో తమ ప్రియమైనవారిని మరలా పునరుత్థానం ద్వారా చూడగలరన్న ఓ స్పష్టమైన వాగ్దానాన్ని మరియు నిరీక్షణను బైబిలు మనకు అందిస్తుంది.—2 పేతురు 3:13; ప్రకటన 21:1-4.
దుఃఖిస్తున్నవారికి ఆచరణాత్మక సహాయం
18. (ఎ) “దైవిక భయం” సమావేశాల్లో ఏ సహాయకరమైన ఉపకరణం వెలువడింది? (బాక్స్ చూడండి.) (బి) ఏ ప్రశ్నలకు నేడు జవాబు అవసరం?
18 ఇప్పుడు మనకు మన స్మృతులు, మన దుఃఖం ఉన్నాయి. మన ప్రియులైనవారిని కోల్పోయిన ఈ కష్టతరమైన కాలాన్ని తాళుకునేందుకు మనం ఏమి చేయగలము? దుఃఖిస్తున్నవారికి సహాయపడేందుకు ఇతరులు ఏమి చేయగలరు? అంతేకాకుండ, ప్రాంతీయ సేవలోకలిసే యథార్థమైన ప్రజలకు మరియు నిజమైన నిరీక్షణ లేనివారికి మరియు దుఃఖిస్తున్న వారికి సహాయపడేందుకు మనం ఏమి చేయగలము? మరియు మరణంలో నిద్రిస్తున్న మన ప్రియమైన వారిని గూర్చి మనం ఇంకా ఏ ఓదార్పును పొందగలం? తదుపరి శీర్షిక కొన్ని సలహాలను అందిస్తుంది.
[అధస్సూచీలు]
a బైబిలు కాలంలో విలపించడంపై అధిక సమాచారం కొరకు, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ఇంకార్పొరేటెడ్ వారు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకపు సంపుటి 2, 446-7 పేజీలు చూడండి.
b బైబిలునందు కనిపించే పునరుత్థాన నిరీక్షణపై అధిక సమాచారం కొరకు, లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) అనే పుస్తకంలోని సంపుటి 2, 783-93 పేజీలు చూడండి.
మీరు జవాబు చెప్పగలరా?
◻ మరణం ఓ శత్రువని ఎందుకు చెప్పవచ్చు?
◻ బైబిలు కాలాల్లోని దేవుని సేవకులు తమ దుఃఖాన్ని ఎలా కనుపర్చారు?
◻ మరణించిన ప్రియమైనవారికి ఏ నిరీక్షణ ఉంది?
◻ పునరుత్థానమందు పౌలు విశ్వసించేందుకు ఏ ఆధారముంది?
[8, 9వ పేజీలోని బాక్సు]
దుఃఖిస్తున్నవారికి ఆచరణాత్మక సహాయం
“దైవిక భయం” 1994-95 సమావేశాల్లో, “మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే” అనే క్రొత్త బ్రోషూరు విడుదలను వాచ్‌టవర్ సొసైటీ ప్రకటించింది. ఈ ప్రోత్సాహకరమైన ప్రచురణ, అన్ని దేశాలవారికి అన్ని భాషలవారికీ ఓదార్పును అందించేందుకు రూపొందించబడింది. బహుశ మీరు ముందు చూసినట్లుగా, అది మరణం మరియు మృతుల స్థితిని గూర్చి బైబిలు యొక్క సరళమైన వివరణను అందిస్తుంది. అంతకంటే ప్రాముఖ్యంగా అది క్రీస్తుయేసు ద్వారా, పరిశుద్ధపర్చబడిన పరదైసు భూమిపై పునరుత్థానం విషయంలో దేవుని వాగ్దానాన్ని నొక్కితెలిపింది. విచారంలోనున్న వారికి అది నిజంగా ఓదార్పునిస్తుంది. కనుక, క్రైస్తవ పరిచర్యలో అది సహాయకరంగా ఉండాలి మరియు అది అనేక బైబిలు పఠనాలను ఫలింపజేస్తూ ఆసక్తిని రేపేదై ఉండాలి. యథార్థమైన మరియు విచారంగానున్న ఏ వ్యక్తితోనైనా సులభంగా పునఃసమీక్షించేలా సహాయపడేందుకు ప్రతి భాగం చివరిలో పఠించవల్సిన ప్రశ్నలను జ్ఞానయుక్తంగా ఉంచడం జరిగింది.
[8వ పేజీలోని చిత్రం]
లాజరు మరణించినప్పుడు, యేసు ఏడ్చాడు
[0వ పేజీలోని చిత్రం]
యేసు లాజరును మృతులలోనుండి లేపాడు
[7వ పేజీలోని చిత్రసౌజన్యం]
First Mourning, by W. Bouguereau, from original glass plate in Photo-Drama of Creation, 1914