అపొస్తలుల కాలంలోని మెరుపులు
‘నీతిమంతులకొరకు వెలుగును [మెరిసింది] [NW] యథార్థహృదయులకొరకు ఆనందము విత్తబడియున్నది.’—కీర్తన 97:11.
1. నేడు యెహోవాసాక్షులు, తొలి క్రైస్తవులను ఎలా పోలివున్నారు?
నిజ క్రైస్తవులుగా కీర్తన 97:11 నందలి మాటలను మనం ఎంతగా మెచ్చుకుంటామో కదా! మనకొరకు పదేపదే ‘వెలుగు ప్రకాశించింది.’ వాస్తవానికి, మనలోని కొందరం, యెహోవా యొక్క ప్రకాశమానమైన వెలుగును దశాబ్దాలుగా చూశాము. ఇదంతా సామెతలు 4:18ని మనకు జ్ఞాపకం చేస్తుంది అక్కడ ఇలా ఉంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” పారంపర్యానికి బదులుగా లేఖనాల విషయంలో మనం మెప్పుదలను కల్గివున్నాము కనుక యెహోవాసాక్షులమైన మనం తొలి క్రైస్తవులను పోలినవారం. వారి వైఖరిని, దైవిక ప్రేరణ వల్ల వ్రాయబడిన క్రైస్తవ గ్రీకు లేఖనాల చారిత్రాత్మక పుస్తకాలు మరియు దాని పత్రికల్లో చూడవచ్చు.
2. యేసు అనుచరులు పొందిన మొదటి మెరుపుల్లో కొన్ని ఏమిటి?
2 యేసుక్రీస్తు తొలి అనుచరులు పొందిన మొదటి మెరుపులలో కొన్ని మెస్సీయాను గూర్చినవి. అంద్రెయ తన సహోదరుడైన సీమోను పేతురుతో ఇలా చెప్పాడు: “మేము మెస్సీయను కనుగొంటిమి.” (యోహాను 1:41) కొంత కాలం తర్వాత, యేసుక్రీస్తుతో “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” అని చెప్పినప్పుడు ఆ దృక్పథం సరేనని సాక్ష్యమిచ్చేందుకు పరలోకంలోని తండ్రి అపొస్తలుడైన పేతురుకు సహాయం చేశాడు.—మత్తయి 16:16, 17; యోహాను 6:68, 69.
తమ ప్రకటన పనిపైన వెలుగు
3, 4. తన పునరుత్థానం తర్వాత, తమ భవిష్యత్ కార్యకలాపాలను గూర్చి యేసు తన అనుచరులకు ఏ జ్ఞానాన్ని అందించాడు?
3 తన పునరుత్థానం తర్వాత, తన అనుచరులందరిపైన ఉన్న విధిని గూర్చి యేసు మెరుపులను మెరిపింపజేశాడు. గలలియనందు సమకూడే 500 మంది శిష్యులతోనే ఆయన ఇలా చెప్పివుంటాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి 28:19, 20; 1 కొరింథీయులు 15:6) ఆ తర్వాత, క్రీస్తు అనుచరులందరూ ప్రచారకులవ్వవల్సివుంది మరియు వారి ప్రకటనా పని “ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱెలకు” మాత్రమే పరిమితం కాదు. (మత్తయి 10:6) లేక వారు పాపక్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తాన్ని సూచించేందుకు యోహాను బాప్తిస్మాన్ని ఇవ్వవలసిన అవసరమూ లేదు, బదులుగా వారు “తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామమున” ప్రజలకు బాప్తిస్మమివ్వాలి.
4 యేసు పరలోకానికి వెళ్లే ముందుగా, తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులు ఇలా అడిగారు: “ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండ, వారి ప్రకటన పనిని గూర్చి యేసు ఇంకా ఉపదేశాలను ఇస్తూ ఇలా అన్నాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” అప్పటి వరకు, వారు యెహోవాకు సాక్షులుగా ఉండేవారు, అయితే ఇప్పుడు క్రీస్తుకు కూడా సాక్షులుగా ఉంటారు.—అపొస్తలుల కార్యములు 1:6-8.
5, 6. పెంతెకొస్తునాడు యేసు శిష్యులు ఏ మెరుపులను పొందారు?
5 కేవలం పది రోజుల తర్వాత, యేసు అనుచరులు ఎంత ప్రకాశవంతమైన మెరుపును పొందారో కదా! సా.శ. 33 పెంతెకొస్తునాడు మొట్టమొదటిసారిగా వారు యోవేలు 2:28, 29 నందలి ప్రాముఖ్యతను పూర్తిగా అర్థంచేసుకున్నారు: “నేను [యెహోవా] సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.” యేసు శిష్యులు అంటే, యెరూషలేములో కూడిన సుమారు 120 మంది స్త్రీపురుషులు, తమ తలల మీద అగ్నిజ్వాలలవంటి నాలుకల రూపంలోని పరిశుద్ధాత్మను చూశారు.—అపొస్తలుల కార్యములు 1:12-15; 2:1-4.
6 పెంతెకొస్తు దినం నాడు కీర్తన 16:10 నందలి మాటలు పునరుత్థానం గావించబడిన యేసుక్రీస్తుకు అన్వయించబడతాయని కూడా వారు మొదట అర్థంచేసుకున్నారు. కీర్తనల గ్రంథకర్త ఇలా అన్నాడు: “ఎందుకనగా నీవు [యెహోవా దేవుడు] నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.” ఆ మాటలు రాజైన దావీదుకు అన్వయించబడవని అనుచరులు గ్రహించారు ఎందుకంటే ఆ దినంవరకూ కూడా ఆయన సమాధి వారి మధ్యనే ఉండేది. ఈ క్రొత్త వెలుగు వివరించబడడం విన్నవారు ఎంతగా ఒప్పించబడ్డారంటే, 3,000 మంది ఆ రోజే బాప్తిస్మం పొందడంలో ఏ ఆశ్చర్యం లేదు!—అపొస్తలుల కార్యములు 2:14-41.
7. రోమా సైన్యాధికారియైన కొర్నేలిని సందర్శించినప్పుడు అపొస్తలుడైన పేతురు ఏ దివ్యమైన వెలుగును పొందాడు?
7 అనేక శతాబ్దాలవరకు, దేవుడు తమను గూర్చి చెప్పిన విషయాలను ఇశ్రాయేలీయులు మెచ్చుకున్నారు, ఆయన ఇలా అన్నాడు: “భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను.” (ఆమోసు 3:2) కనుక, సున్నతి పొందని అన్యులైన విశ్వాసులపై మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, రోమా సైన్యాధికారియైన కొర్నేలి గృహానికి వెళ్లినప్పుడు అపొస్తలుడైన పేతురు మరియు ఆయనతో వెళ్లినవారికి అది నిజంగానే ఎంతో ప్రకాశవంతమైన మెరుపు. బాప్తిస్మానికి ముందు పరిశుద్ధాత్మ ఇవ్వబడడం ఇది ఒక్కసారి మాత్రమేనన్నది గమనార్హమైన విషయం. అయితే అది అలా జరగాల్సిందే. లేకపోతే సున్నతిపొందని అన్యులు బాప్తిస్మమునకు అర్హులని పేతురుకు తెలిసివుండకపోయేది. ఈ విషయపు ప్రాముఖ్యతను పూర్తిగా గుణగ్రహిస్తూ పేతురు ఇలా ప్రశ్నించాడు: “మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు [అన్యులు] బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా?” నిస్సందేహంగా, అక్కడ హాజరైనవారెవరూ నిరాకరించలేరు, కనుక ఈ అన్యుల బాప్తిస్మము అలా జరిగింది.—అపొస్తలుల కార్యములు 10:44-48; అపొస్తలుల కార్యములు 8:14-17 పోల్చండి.
ఇంక ఏ సున్నతీ లేదు
8. కొందరు తొలి క్రైస్తవులు, సున్నతిని మానుకోవడం కష్టతరమని ఎందుకు భావించారు?
8 సున్నతిని గూర్చిన ప్రశ్న సంబంధంగా, సత్యాన్ని గూర్చిన మరో ప్రకాశవంతమైన మెరుపు కనిపించింది. సున్నతి సా.శ.పూ. 1919 నందు యెహోవా అబ్రాహాముతో ఒప్పందం చేసినప్పుడు ప్రారంభమైంది. ఆ తర్వాత, అతనూ అతని ఇంట్లోని ఇతర పురుషులు సున్నతినొందాలనే ఆజ్ఞను అబ్రాహాముకిచ్చాడు. (ఆదికాండము 17:9-14, 23-27) కనుక అబ్రాహాము సంతతికి, సున్నతి ఓ గుర్తింపు చిహ్నంగా మారింది. ఆ ఆచారం వారు ఎంత గర్వంగా భావించారో కదా! తత్ఫలితంగా, “సున్నతిపొందనివారు” అనే పదం తృణీకారంగా ఉపయోగించబడేది. (యెషయా 52:1; 1 సమూయేలు 17:26, 27) కొందరు తొలి యూదా క్రైస్తవులు దీన్ని గుర్తుగా ఎందుకు కల్గివుండాలని అనుకున్నారో చూడడాన్ని ఇది సులభతరం చేస్తుంది. ఈ విషయాన్ని గూర్చి కొందరు పౌలు, బర్నబాలతో ఎంతగానో చర్చించారు. దాన్ని తీర్చడానికి, పౌలు మరియు ఇతరులు క్రైస్తవ పరిపాలక సభను సంప్రదించేందుకు యెరూషలేముకు వెళ్లారు.—అపొస్తలుల కార్యములు 15:1, 2.
9. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా తొలి పరిపాలక సభకు ఏ మెరుపులు బయల్పర్చబడ్డాయి?
9 ఈసారి, సున్నతి అన్నది ఇక మీద యెహోవా సేవకుల అవసరత కాదనే వెలుగును వారు స్పష్టమైన అద్భుతంవల్ల పొందలేదు. బదులుగా, లేఖనాలను పరిశీలించడం ద్వారా, నడిపింపుకొరకు పరిశుద్ధాత్మపై ఆధారపడడం ద్వారా మరియు సున్నతిపొందని అన్యుల మార్పిడి విషయంలో పేతురు పౌలుల అనుభవాలను వినడం ద్వారా దేదీప్యమానమవుతున్న ఆ వెలుగును వారు పొందారు. (అపొస్తలుల కార్యములు 15:6-21) తీర్మానం ఓ ఉత్తరం ద్వారా వెలువడింది, దానిలోని కొంత భాగంలో ఇలా ఉంది: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను.” (అపొస్తలుల కార్యములు 15:28, 29) ఆ విధంగా తొలి క్రైస్తవులు సున్నతిని పొందాలనే ఆజ్ఞనుండి మరియు మోషే ధర్మశాస్త్రంలోని ఇతర అర్హతలనుండి విముక్తులయ్యారు. కనుక, పౌలు గలతీయ క్రైస్తవులకు ఇలా చెప్పగల్గాడు: “ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు.”—గలతీయులు 5:1.
సువార్తల్లో వెలుగు
10. మత్తయి సువార్తనందు బయల్పడిన కొన్ని మెరుపులు?
10 సుమారు సా.శ.41 లో వ్రాయబడిన మత్తయి సువార్తనందు, దాని చదువురులకు ప్రయోజనకరమైన మెరుపులు అనేకం ఉన్నాయనడంలో సందేహమే లేదు. యేసు ఉపదేశాలను వివరించడాన్ని, మొదటి శతాబ్ద క్రైస్తవులు కొద్ది మంది మాత్రమే స్వయంగా విన్నారు. ప్రత్యేకంగా, యేసు ప్రకటన పని ముఖ్యాంశం రాజ్యమేనని మత్తయి సువార్త నొక్కిచెప్పింది. మరి సరైన దృక్పథాన్ని కల్గివుండాలనే ప్రాముఖ్యతను ఆయన ఎంత చక్కగా వివరించాడోకదా! యేసు కొండమీది ప్రసంగంలోని (13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి), తన ఉపమానాలు మరియు 24, 25 అధ్యాయాల్లోని తన గొప్ప ప్రవచనాలందు ఎలాంటి మెరుపులున్నాయోగదా! సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత వ్రాయబడిన ఎనిమిది సంవత్సరాలకు ఇవన్నీ తొలిక్రైస్తవుల అవధానానికి తీసుకురాబడ్డాయి.
11. లూకా మరియు మార్కు సువార్తల్లోని విషయాలను గూర్చి ఏమని చెప్పవచ్చు?
11 సుమారు 15 సంవత్సరాల తర్వాత, లూకా తన సువార్తను వ్రాశాడు. దానిలో చాలావంతు మత్తయి దృష్టాంతానికి పోలినదైనప్పటికీ, దానిలో 59 శాతం అదనపు సమాచారమే. యేసు చేసిన అద్భుతాల్లోని ఆరింటిని లూకా వ్రాశాడు మరియు ఇతర సువార్తల రచయితలు వ్రాయని యేసు అనేక ఉపమానాలకు రెండింతల సమాచారాన్ని ఆయన వ్రాశాడు. కేవలం కొన్ని సంవత్సరాల తర్వాత, యేసు కార్యశీలుడని, అద్భుతాలు చేయగలవాడనే విషయాలను నొక్కి చెబుతూ మార్కు తన సువార్తను వ్రాశాడు. మత్తయి మరియు లూకా మునుపు వ్రాసిన సంఘటనలలో అనేకమైనవాటిని మార్కు వ్రాసినప్పటికీ, వారు వ్రాయని ఒక ఉపమానాన్ని ఆయన వ్రాశాడు. ఆ ఉపమానంలో, చిగురించి ఏపుగా పెరిగి క్రమంగా పండ్లను ఇచ్చే విత్తనంతో యేసు దేవుని రాజ్యాన్ని పోల్చాడు.a—మార్కు 4:26-29.
12. యోహాను సువార్త ఎంతమట్టుకు మరింత జ్ఞానాన్ని అందించింది?
12 తర్వాత యోహాను సువార్త, మార్కు వృత్తాంతాన్ని వ్రాసిన 30 సంవత్సరాల తర్వాత వ్రాయబడింది. ప్రత్యేకంగా ఆయన మానవపూర్వపు ఉనికిని గూర్చి ప్రస్తావిస్తూ యేసు పరిచర్య విషయంలో, యోహాను ఎంతటి వెలుగు ప్రకాశింపజేశాడో కదా! లాజరు పునరుత్థాన వృత్తాంతాన్ని యోహాను మాత్రమే అందించాడు, మరియు 13 నుండి 17 అధ్యాయాల్లో ఉన్నట్లుగా తన నమ్మకమైన అపొస్తలులను యేసు మెచ్చుకోవడం అలాగే తనను అప్పగించే రాత్రి ఆయన చేసిన హృదయపూర్వక ప్రార్థనను గురించి కేవలం ఆయన మాత్రమే అందిస్తున్నాడు. వాస్తవానికి, యోహాను సువార్తలో 92 శాతం విశేషమైందని చెప్పబడుతోంది.
పౌలు పత్రికలోని మెరుపులు
13. పౌలు, రోమీయులకు వ్రాసిన పత్రికను కొందరు సువార్తగా ఎందుకు పరిగణిస్తున్నారు?
13 అపొస్తలుల సమయంలో క్రైస్తవులకు సత్యాన్ని గూర్చిన మెరుపులను తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలు ఉపయోగించబడ్డాడు. ఉదాహరణకు సా.శ. 56 నందు సుమారు లూకా తన సువార్తను వ్రాసిన అదే సమయంలో అంటే, రోమీయులకు వ్రాసిన పౌలు పత్రికను తీసుకుందాము. నీతి, దేవుని అపారమైన కనికర ఫలితమని మరియు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా అది ఆరోపించబడుతుందన్న వాస్తవాన్ని పౌలు ఈ పత్రికలో ఎత్తి చూపుతున్నాడు. సువార్తలోని ఈ విషయాన్ని పౌలు నొక్కి తెలుపుతూ, రోమీయులకు వ్రాసిన తన పత్రికను కొందరు అయిదవ సువార్తగా పరిగణించేందుకు కారణమైంది.
14-16. (ఎ) కొరింథీలోని క్రైస్తవులకు వ్రాసిన తన మొదటి పత్రికలో, ఐక్యత అవసరమున్న విషయంలో పౌలు ఏ వెలుగును ప్రకాశింపజేశాడు? (బి) మొదటి కొరింథీయుల్లో ప్రవర్తనను గూర్చి ఇంకా ఏ వెలుగు ఉంది?
14 కొరింథీలోని క్రైస్తవులకు ఇబ్బంది కలిగించే కొన్ని విషయాలను పౌలు వ్రాశాడు. మన దినంలోని క్రైస్తవులకు సహితం ప్రయోజనకరమైన ప్రేరేపిత సలహాలు ఆయన కొరింథీయులకు వ్రాసిన పత్రికలో ఉన్నాయి. మొదటిగా, కొందరు వ్యక్తుల చుట్టూ నిర్మితమైన వ్యక్తిత్వ శాఖలను తయారు చేయడం ద్వారా వారు చేసే తప్పుల విషయంలో వారికి జ్ఞానోదయాన్నివాల్సివుంది. అపొస్తలుడు ధైర్యంగా వారితో ఇలా చెబుతూ వాటిని సరిచేశాడు: “సహోదరులారా, మీరందరు ఏకభావముతో మాటలాడవలెననియు, మీలో కక్షలు లేక, యేక మనస్సుతోను ఏకతాత్పర్యముతోను, మీరు సన్నద్ధులై యుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 1:10-15.
15 కొరింథీలోని క్రైస్తవ సంఘంలో తీవ్రమైన అనైతికతను సహించడం జరిగింది. అక్కడి ఓ వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, తద్వారా ‘అన్యజనులలోనైనను జరగని’ వాటిని జరిగించారు. పౌలు ఇలా స్పష్టంగా వ్రాశాడు: “దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.” (1 కొరింథీయులు 5:1, 11-13) వెలివేయడం లేక బహిష్కరించడం—క్రైస్తవ సంఘానికి ఓ క్రొత్త విషయం. కొరింథీ సంఘానికి వెలుగు అవసరమైన మరో వాస్తవ విషయమేమిటంటే, దానిలోని కొందరు సభ్యులు తమ మధ్యనున్న గొడవలను తీర్చుకునేందుకు తమ ఆత్మీయ సహోదరులను లౌకిక న్యాయసభలకు తీసుకువెళ్లారు. అలా చేసినందుకు పౌలు వారిని గట్టిగా గద్దించాడు.—1 కొరింథీయులు 6:5-8.
16 కొరింథీలోని సంఘాన్ని పట్టిపీడించే మరొక విషయం లైంగిక సంబంధాలు. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో లైంగిక అనైతికత ప్రబలంగా ఉండడం వల్ల, ప్రతి వ్యక్తి తన స్వంత భార్యను కల్గివుండడం మరియు ప్రతి స్త్రీ తన స్వంత భర్తను కల్గివుండడం మంచిదని చూపాడు. అవివాహితులు యెహోవాను తక్కువ పరధ్యానంతో సేవించగల్గినప్పటికీ, అందరికీ ఒంటరితనపు బహుమానం లేదు. మరి ఓ స్త్రీ భర్త చనిపోయినట్లైతే, ఆమె మరలా వివాహం చేసుకోవచ్చు కానీ “ప్రభువునందు మాత్రమే.”—1 కొరింథీయులు 7:39.
17. పునరుత్థాన బోధపై పౌలు ఏ వెలుగును ప్రకాశింపజేశాడు?
17 పునరుత్థానం విషయంలో ఏ మెరుపులను అందించేందుకు ప్రభువు పౌలును ఉపయోగించుకున్నాడు! అభిషక్త క్రైస్తవులు ఎలాంటి శరీరంతో పునరుత్థానమౌతారు? “ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధమైన శరీరముగా లేపబడుదురు” అని పౌలు వ్రాశాడు. భౌతిక శరీరాలేవీ పరలోకానికి తీసుకొనిపోబడవు, ఎందుకంటే “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు.” అభిషక్తులందరూ మరణంలో నిద్రించరని అయితే ఆయన ప్రత్యక్షత సమయంలో కొందరు మరణం నుండి వెంటనే లేపబడతారని కూడా పౌలు చెప్పాడు.—1 కొరింథీయులు 15:43-53.
18. భవిష్యత్తును గూర్చిన ఏ వెలుగు థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రికలో ఉంది?
18 థెస్సలొనీకలోని క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో, భవిష్యత్తుపై వెలుగు ప్రకాశింపజేసేందుకు పౌలు ఉపయోగించబడ్డాడు. యెహోవా దినం రాత్రివేళ దొంగవచ్చినట్లు వచ్చును. పౌలు ఇలా కూడా వివరించాడు: “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు.”—1 థెస్సలొనీకయులు 5:2, 3.
19, 20. యెరూషలేము మరియు యూదయలోని క్రైస్తవులు హెబ్రీయులకు వ్రాసిన పౌలు పత్రికలో ఏ మెరుపులను పొందారు?
19 హెబ్రీయులకు వ్రాసిన తన పత్రికలో, యెరూషలేములోని మరియు యూదయలోని తొలి క్రైస్తవులకు మెరుపులను వ్యాపింపజేశాడు. క్రైస్తవ ఆరాధనా విధానం మోషే ఆరాధనా విధానానికి ఉన్నతంగా ఉందని ఆయన ఎంత శక్తివంతంగా కనపర్చాడో! దేవదూతలు తెచ్చిన నియమాన్ని అనుసరించే బదులు, క్రైస్తవులు, అలాంటి దేవదూత వార్తాహరులకంటే ఎంతో ఉన్నతుడైన దేవుని కుమారుడు మొదట చెప్పిన రక్షణయందు విశ్వాసం కల్గివుంటారు. (హెబ్రీయులు 2:2-4) మోషే, దేవుని గృహానికి కేవలం ఒక పరిచారకుడు మాత్రమే. అయినప్పటికీ యేసుక్రీస్తు గృహాన్నంతటినీ పర్యవేక్షిస్తాడు. మెల్కీసెదెకు క్రమం తర్వాత, క్రీస్తే ప్రధాన యాజకుడు అంటే అహరోను యాజకత్వం కన్నా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్గివున్నాడు. విశ్వాసం మరియు విధేయత లోపించడంవల్ల ఇశ్రాయేలీయులు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేరని అయితే యథార్థత మరియు విధేయతవల్ల క్రైస్తవులు ప్రవేశించగలరని పౌలు వారికి చూపించాడు.—హెబ్రీయులు 3:1–4:11.
20 ఆ తర్వాత కూడా నూతన నిబంధన ధర్మశాస్త్ర నిబంధన కంటే ఎంతో ఉన్నతమైంది. ప్రవచించబడినట్లుగా 600 సంవత్సరాలకు పూర్వం యిర్మీయా 31:31-34 నందు నూతన నిబంధనలో ఉన్నవారు తమ హృదయాలపై దేవుని న్యాయాన్ని వ్రాసుకుని, పాపాల విషయంలో నిజమైన క్షమాపణను పొందుతారు. తన పాపాలకొరకు మరియు ప్రజల పాపాల కొరకు బలులను అర్పించవల్సిన ఓ ప్రధాన యాజకుణ్ణి కల్గివుండే బదులు, పాపరహితమైన మరియు ఒకేసారి అందరి పాపాలకు బలి అర్పించిన యేసుక్రీస్తును క్రైస్తవులు తమ ప్రధాన యాజకునిగా కల్గివున్నారు. తన అర్పణను అర్పించేందుకు చేతితో నిర్మించిన పరిశుద్ధస్థలంలో ప్రవేశించే బదులుగా, ఆయన యెహోవా ఎదుట నిలిచేందుకు పరలోకానికే ప్రవేశించాడు. అంతేకాకుండ, మోషే ధర్మశాస్త్ర నిబంధన క్రింద జంతుబలులు పాపాలను పూర్తిగా తీసివేయలేవు లేక వాటిని ప్రతి సంవత్సరం అర్పించబడనవసరం లేదు. అయితే ఒక్కసారిగా అర్పించబడిన క్రీస్తు బలి అన్ని పాపాలనూ తీసివేస్తుంది. ఇదంతా కూడా, ఆత్మీయ మహా ఆలయంపై, అభిషక్త శేషము మరియు “వేరే గొఱ్ఱెలు” ప్రస్తుతం సేవచేస్తున్న ప్రాంగణంపై వెలుగును ప్రసరింపజేస్తోంది.—యోహాను 10:16; హెబ్రీయులు 9:24-28.
21. అపొస్తలుల కాలంలో కీర్తన 97:11 మరియు సామెతలు 4:18 నెరవేర్పును గూర్చి ఈ చర్చ ఏమి చూపించింది?
21 అపొస్తలుడైన పేతురు పత్రికల్లోను అంతేకాకుండ శిష్యులైన యాకోబు మరియు యూదా వ్రాసిన పత్రికల్లోను ఉన్నటువంటి మెరుపులను గూర్చిన అధిక ఉదాహరణలనిచ్చేందుకు స్థలం సరిపోదు. అయితే కీర్తన 97:11 మరియు సామెతలు 4:18లు అపొస్తలుల కాలంలో అద్భుతమైన నెరవేర్పులను కల్గివున్నాయని చూపించేందుకు జరగబోయే విషయం సరిపోవాలి. సత్యం, ఛాయ మరియు సూచనలనుండి నెరవేర్పులు వాస్తవాలకు అభివృద్ధి చెందింది—గలతీయులు 3:23-25; 4:21-26.
22. అపొస్తలుల మరణం తర్వాత ఏమి జరిగింది మరియు తదుపరి శీర్షిక ఏమి చూపుతోంది?
22 యేసు అపొస్తలుల మరణం తర్వాత మరియు ముందు చెప్పిన మత భ్రష్టత్వం ప్రారంభ సమయంలో, సత్యపు వెలుగు అస్పష్టంగా ఉంది. (2 థెస్సలొనీకయులు 2:1-11) అయితే యేసు వాగ్దానం ప్రకారం, అనేక శతాబ్దాల తర్వాత యజమానుడు తిరిగి వచ్చి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” తన “యింటివారికి” తగినవేళ ఆహారం పెడుతున్నట్లు కనుగొన్నాడు. తత్ఫలితంగా, యేసుక్రీస్తు “యావదాస్తిమీద” ఆ దాసుని నియమించాడు. (మత్తయి 24:45-47) దాని తర్వాత ఏ మెరుపు మెరిసింది? తదుపరి శీర్షికలో ఇది చర్చించబడుతుంది.
[అధస్సూచీలు]
a ఇక్కడ చెప్పబడిన భూమి, ఏ వ్యక్తిత్వపు లక్షణాలను క్రైస్తవులు అలవచ్చుకోవాలనుకుంటున్నారన్న వాటిని అది సూచిస్తుంది.—జూన్ 15, 1980 కావలికోట, (ఆంగ్లం) 18-19 పేజీలను చూడండి.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ ఆ సత్యపు అవగాహన వికసిస్తోందని ఏ బైబిలు పాఠ్యభాగం చూపుతోంది?
◻ అపొస్తలుల కార్యముల గ్రంథంలోనున్న మెరుపులు కొన్ని ఏవి?
◻ సువార్తల్లో ఏ మెరుపులు కనుగొనవచ్చు?
◻ పౌలు పత్రికల్లో ఏ మెరుపులున్నాయి?