మన పితరులకు ఓ నూతన జీవితం
మరణించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆత్మ సామ్రాజ్యంలోకి సహజంగానే ప్రవేశించి జీవితాన్ని కొనసాగిస్తారని దేవుని వాక్యం బోధిస్తోందా? లేదు, అది అలా బోధించడంలేదు. మరణం తర్వాత జీవించగల అద్భుతమైన నిరీక్షణను బైబిలు అందిస్తోంది, అయితే అది అనేకులు భావించే విధంగా మాత్రం కాదు.
మన మొదటి పితరుడైన ఆదామును గూర్చి బైబిలు ఏమని చెబుతోందో పరిశీలించండి. యెహోవా అతనిని “నేలమంటితో” చేశాడు. (ఆదికాండము 2:7) భూమిపై సంతోషంగా నిత్యం జీవించే అవకాశం ఆదాముకు ఉండేది. (ఆదికాండము 2:16, 17) అయితే, తన ప్రేమపూర్వక సృష్టికర్తకు అతను ఎదురు తిరిగాడు, దాని ఫలితార్థమే మరణం.
మరణించినప్పుడు ఆదాము ఎక్కడికి వెళ్లాడు? దేవుడు ఆయనకు ఇలా చెప్పాడు: “ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు.”—ఆదికాండము 3:19.
మట్టి నుండి ఆదామును యెహోవా సృజించకముందు అతను ఎక్కడ ఉండేవాడు? ఎక్కడా లేడు. అతను ఉనికిలోనే లేడు. “మన్నైపోదువు” అని ఆదాముతో యెహోవా అన్నప్పుడు, ఆదాము మరలా మట్టిలా జీవం లేనివాడౌతాడని మాత్రమే ఆయన భావమైయుండవచ్చును. పితరుల ఆత్మల లోకానికి తాను స్థాపకుడయ్యేందుకు ఆదాము ‘తరలి వెళ్లలేదు.’ అటు పరలోకానందంలోని జీవానికి కానీ లేక ఇటు హింసా స్థలంలో పూర్తి బాధననుభవించేందుకుగానీ ఆయన వెళ్లలేదు. ఒకే ఒక మార్పు ఏమిటంటే, ఆయన జీవం నుండి నిర్జీవ స్థితికి అంటే ఉనికి గల పరిస్థితినుండి ఉనికి లేని స్థితికి మారాడు.
మిగిలిన మానవజాతి విషయమేమిటి? మరణించినప్పుడు ఆదాము సంతతివారుకూడా ఇక జీవించకుండాపోతారా? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “సమస్తము [మానవులు, జంతువులు] ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.”—ప్రసంగి 3:19, 20.
మృతుల పరిస్థితి
అవును, మృతులు వినలేని, చూడలేని, మాట్లాడలేని, ఆలోచించలేని నిర్జీవులు. ఉదాహరణకు, బైబిలు ఇలా చెబుతోంది: “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; . . . వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు.” బైబిలు ఇంకా ఇలా కూడా చెబుతుంది: “నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”—ప్రసంగి 9:5, 6, 10.
కనుక దేవుని వాక్యం ప్రకారం, ప్రజలు జీవించి ఉన్నప్పుడు తాము మరణిస్తామని వారికి తెలుసు. అయితే మరణించినప్పుడు, వారికి ఏమీ తెలియదు. వారు తమ శవం ప్రక్కనే నిలుచుని, దాన్ని ఏమి చేస్తున్నారా అని గమనిస్తూ ఉండరు. నిర్జీవస్థితిలో అటు ఆనందంగానీ ఇటు బాధగానీ, అటు సంతోషంగానీ ఇటు విషాదంగానీ ఉండవు. మరణించినవారికి సమయమెలా గడుస్తుందో తెలియదు. ఎంతో గాఢ నిద్రకంటే కూడా గాఢమైన అపస్మారక స్థితిలో వారుంటారు.
మరణించిన తర్వాత కూడా ప్రజలు జీవిస్తూనే ఉండరని ప్రాచీన కాలపు దేవుని సేవకుడైన యోబుకు తెలుసు. దేవుని జోక్యం లేకుండ మరలా జీవానికి వచ్చే నిరీక్షణ లేదని ఆయన అర్థంచేసుకున్నాడు. యోబు ఇలా అన్నాడు: “అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచినతరువాత వారేమైపోవుదురు? అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు.” (యోబు 14:10, 12) తాను మరణించినప్పుడు, ఆత్మల లోకంలోని పితరులతో తాను చేరుతానని యోబు నిరీక్షించలేదు.
పునరుత్థాన నిరీక్షణ
మరణించినప్పుడు జీవించివున్నవారు ఉనికిలో లేకుండా పోతారు కనుక, “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా,” అని యోబు అడిగిన ప్రశ్న ప్రాముఖ్యమైంది. యోబు తానే ఈ జవాబును చెప్పాడు: “ఆలాగుండిన యెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు [సమాధిలోనున్న సమయంలో] నేను కనిపెట్టియుందును అలాగుండినయెడల నీవు [యెహోవా] పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.”—యోబు 14:14, 15.
మరో మాటలో చెప్పాలంటే, యోబు ఉనికిలేకుండా పోయినప్పటికీ, దేవుడు అతన్ని మర్చిపోడు. సరైన సమయం వచ్చినప్పుడు యెహోవా దేవుడు పునరుత్థానం ద్వారా అతన్ని తిరిగి జీవానికి ‘పిలుస్తాడు’ అనే నమ్మకాన్ని యోబు కల్గివున్నాడు.
పునరుత్థానమందు యోబు కల్గివున్న నిరీక్షణ వాస్తవమని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చూపించాడు. మరణించినవారు లేపబడగలరని యేసు నిరూపించాడు. ఎలా? దాన్ని చేయడం ద్వారానే! యోబును పునరుత్థానం చేసేందుకు ఆయన అప్పుడు లేడు, అయితే భూమిమీద ఉన్నప్పుడు నాయీను పట్టణంనుండి వచ్చిన ఓ విధవరాలి కుమారుని పునరుత్థానం చేశాడు. యాయీరు అనే వ్యక్తి యొక్క 12 సంవత్సరాల కుమార్తె కూడా యేసు పునరుత్థానం చేశాడు. అంతేకాకుండ నాలుగు రోజుల క్రితం చనిపోయిన తన స్నేహితుడైన లాజరును ఆయన పునరుత్థానం చేశాడు.—లూకా 7:11-15; 8:41, 42, 49-56; యోహాను 11:38-44.
ఈ అద్భుతాలను చేయడమే కాకుండ, యేసు గొప్ప భవిష్యత్ పునరుత్థానాన్ని గూర్చి చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) తర్వాత, ఒక యౌవనుని పునరుత్థానం చేసేందుకు యెహోవా ఉపయోగించుకున్న అపొస్తలుడైన పౌలు కూడా భవిష్యత్ పునరుత్థానమునందు విశ్వాసాన్ని వ్యక్తపర్చాడు. ఆయన ఇలా అన్నాడు: ‘నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని . . . నేను . . . దేవునియందు నిరీక్షణయుంచాను.’—అపొస్తలుల కార్యములు 20:7-12; 24:15.
భవిష్యత్ పునరుత్థానాన్ని గూర్చిన ఈ లేఖన సూచనలు ఆత్మీయ లోకంలోని జీవితాన్ని కొనసాగించడానికి సంబంధించినవి కావు. సరిగ్గా ఈ భూమి మీదే వేలకొలది మృతులు తమ భౌతిక శరీరాలతో జీవానికి వచ్చే విషయాన్ని అవి సూచిస్తున్నాయి. ఇలా పునరుత్థానం పొందినవారు, తమ గత జీవితాన్ని గూర్చి ఏమీ జ్ఞాపకం లేని ప్రజలైవుండరు. వారు చంటిపిల్లలుగా తిరిగి జన్మించరు. బదులుగా, తాము చనిపోయినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, అవే జ్ఞాపకాలు మరియు అదే వ్యక్తిత్వాన్ని కల్గివుంటారు. వారు తమను తాము గుర్తుంచుకోగలవారిగానూ మరితరులు కూడా గుర్తింపగల్గేవారిగాను ఉంటారు. ఈ ప్రజలు తమ స్నేహితులనూ కుటుంబాలను తిరిగి చేరినప్పుడు ఎంత ఆనందకరంగా ఉంటుందో కదా! మరియు మన పితరులను కలవడం ఎంత ఉప్పొంగింపజేసేదిగా ఉంటుందో కదా!
పరలోకంలోని జీవితానికి పునరుత్థానమవ్వడం
కొందరు పరలోకానికి వెళతారని యేసు చెప్పలేదా? అవును చెప్పాడు. తాను చంపబడకముందు, ఆ సాయంత్రం, ఆయన ఇలా చెప్పాడు: “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, . . . నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” (యోహాను 14:2, 3) యేసు తన నమ్మకమైన అపొస్తలులతో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాటల భావం మంచి ప్రజలందరూ పరలోకానికి వెళతారని కాదు.
పరలోకానికి పునరుత్థానం చేయబడినవారు కేవలం మంచి జీవనాన్ని జీవించడంకంటే ఎక్కువ అర్హతలను సంపాదించవల్సి ఉంటుందని యేసు చూపించాడు. ఒక అర్హతేమిటంటే యెహోవా మరియు ఆయన ఉద్దేశాలను గూర్చిన సరైన జ్ఞానం. (యోహాను 17:3) ఇతర అర్హతలేమిటంటే, యేసుక్రీస్తు విమోచన క్రయధనమందు విశ్వాసముంచి, దేవునికి విధేయులవ్వడం. (యోహాను 3:16; 1 యోహాను 5:3) మరొక అర్హతేమిటంటే, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినవారై బాప్తిస్మం పొందిన క్రైస్తవులుగా ‘తిరిగి జన్మించాలి.’ (యోహాను 1:12, 13; 3:3-6) పరలోక జీవితానికి మరొక అర్హతేమిటంటే, మరణము వరకూ దేవుని ఎడల నమ్మకంగా ఉన్నామని నిరూపించుకుంటూ యేసు సహించినట్లుగా సహించాలి.—లూకా 22:29; ప్రకటన 2:10.
అలాంటి ఉన్నత అర్హతలకు ఓ కారణం ఉంది. పరలోకంలోనికి పునరుత్థానం చేయబడినవారు ఓ ప్రాముఖ్యమైన పని చేయవల్సివుంది. భూమి మీది వ్యవహారాలను మానవ ప్రభుత్వాలు ఎన్నడూ సమర్థవంతంగా నడిపించుకోలేవని యెహోవాకు తెలుసు. కనుక మానవజాతిపై పరిపాలించే ఓ పరలోక ప్రభుత్వాన్ని లేక రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. (మత్తయి 6:9, 10) యేసు ఆ రాజ్యానికి రాజుగా ఉంటాడు. (దానియేలు 7:13, 14) భూమిమీదినుండి ఎన్నుకొనబడి, పరలోకానికి పునరుత్థానం గావించబడినవారు ఆయనతో పరిపాలిస్తారు. పునరుత్థానమైన వీరు ‘ఒక రాజ్యముగాను యాజకులుగాను అయ్యి, భూలోకమందు ఏలుదురు’ అని బైబిలు ముందే చెప్పింది.—ప్రకటన 5:10.
పరలోక పునరుత్థానం పొందే అర్హతలను అనేకమంది ప్రజలు కల్గివున్నారా? లేదు. తమ తప్పేమీ లేకపోయినప్పటికీ మరణంలో నిద్రించే అనేకులకు ఆ అర్హత లేదు. అనేకులకు యెహోవాను గూర్చి ఆయన సంకల్పాలను గూర్చి తెలుసుకునే అవకాశం పెద్దగా దొరకలేదు, లేక అది కూడా లేకుండా పోయింది. వారు యేసుక్రీస్తును గూర్చి లేక దేవుని రాజ్యాన్ని గూర్చి ఏమీ తెలుసుకోకుండానే జీవించి, మరణించారు.
పరలోకానికి వెళ్లే వారిని యేసు “చిన్నమంద” అన్నాడు. (లూకా 12:32) పరలోకంలో క్రీస్తుతో పరిపాలించే “భూలోకములోనుండి కొనబడిన” వారి సంఖ్య 1,44,000 అని బయల్పర్చబడింది. (ప్రకటన 14:1-3; 20:6) యేసు సూచించిన “అనేక నివాసము”లలో చేరేందుకు 1,44,000 మంది సరిపోతున్నప్పటికీ, ఆదామునుండి వచ్చిన లక్షలాదిమంది ప్రజలతో పోలిస్తే అది చాలా చిన్న సంఖ్యే.—యోహాను 14:2.
భూమిమీద పునరుత్థానానికి ముందున్న సంఘటనలు
ఇంతవరకు మనం చర్చించిన వాటిని పునఃవిమర్శచేసుకుందాము. బైబిలు ప్రకారం, యెహోవా దేవుడు చనిపోయినవారిని పునరుత్థానం చేసేంత వరకు వారు మరణించి నిర్జీవంగా ఉంటారు. కొందరు పరలోకంలోని జీవితానికి పునరుత్థానం చేయబడ్డారు అక్కడ రాజ్య ప్రభుత్వంలో వారు యేసుక్రీస్తుతో పరిపాలిస్తారు. అనేకమంది ప్రజలు ఆ రాజ్యంలో ప్రజలయ్యేందుకు భూమిమీద పునరుత్థానమౌతారు.
భూమిమీద పునరుత్థానం ద్వారా యెహోవా భూమి కొరకైన తన సంకల్పాన్ని కొంత వరకు నెరవేరుస్తాడు. “నివాసస్థలముగానుండునట్లు” యెహోవా దాన్ని సృజించాడు. (యెషయా 45:18) అది మానవజాతికి శాశ్వత గృహంగా ఉండాల్సింది. అందుచేతనే కీర్తనల గ్రంథకర్త ఇలా పాడాడు: “ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.”—కీర్తన 115:16.
భూమిమీద జీవ పునరుత్థానం ప్రారంభం కాకముందు గొప్ప మార్పులు సంభవించాలి. యుద్ధాలు, కాలుష్యం, నేరం మరియు దౌర్జన్యాలతో భూమి నిండి ఉండాలన్నది దేవుని సంకల్పంకాదని మీరు బహుశ అంగీకరిస్తారు. దేవుని ఎడల ఆయన నీతియుక్త కట్టడల ఎడల గౌరవం లేని ప్రజల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. కనుక, భూమి మీద దేవుని చిత్తాన్ని అమలుపర్చడంలో ప్రాముఖ్యమైన మెట్టుగా, ఆయన ఆ రాజ్యం “భూమిని నశింపజేయువారిని నశింపజేయును.” (ప్రకటన 11:18) భూమి మీద నిరంతరం జీవించేందుకు నీతిమంతులనుంచి, దుష్ట ప్రజలనందరినీ రాజ్యం నాశనం చేస్తుంది.—కీర్తన 37:9, 29.
భూమిమీద పరదైసు
శుభ్రపర్చిన భూమిమీద పునరుత్థానమైనవారు సరైన దానిని చేసే సాత్వికులు, శ్రద్ధగల ప్రజలు. (మత్తయి 5:5 పోల్చండి.) దేవుని రాజ్యపు ప్రేమపూర్వక పర్యవేక్షణ క్రింద, వారు భద్రతలో సంతోషవంతమైన జీవితాన్ని గడుపుతారు. అప్పుడు ఉండే పరిస్థితులను గూర్చి బైబిలు అద్భుతమైన మనోదృశ్యాన్ని అందిస్తోంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:4.
అవును, భూమి పరదైసుగా మారుతుంది. (లూకా 23:43) అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచించండి! ఆసుపత్రులూ నర్సింగ్‌హోమ్‌లతో పనే ఉండదు. పరదైసులో, ప్రస్తుతం వృద్ధాప్యంవల్ల బాధపడుతున్నవారు మరలా బలంగానూ ఆరోగ్యంగానూ అవుతారు. (యోబు 33:25; యెషయా 35:5, 6) అంత్యక్రియల స్థలాలు, శ్మశానవాటికలు మరియు సమాధిరాళ్లు ఉండనే ఉండవు. తన రాజ్యం ద్వారా, యెహోవా “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును.” (యెషయా 25:8) అలాంటి ఆశీర్వాదాలంటే మనకు మన పితరులకు నిజంగా ఓ నూతన జీవితమే.
[7వ పేజీలోని చిత్రం]
భూమిమీద పునరుత్థానమైనవారు ఆ రాజ్యంలో ప్రజలుగా ఉంటారు