కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 4/1 పేజీలు 10-15
  • మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మిమ్మల్ని విలువైనవారిగా యెంచుతాడు
  • యెహోవా మనలో దేన్ని చూస్తాడు?
  • తన ప్రేమను కనుపర్చడానికి యెహోవా ఏమిచేశాడు
  • ఏదీ ‘దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేదు’
    యెహోవాకు దగ్గరవ్వండి
  • “దేవుడు ప్రేమాస్వరూపి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవుని దృష్టిలో మీకు విలువ ఉంది!
    తేజరిల్లు!—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 4/1 పేజీలు 10-15

మీరు దేవుని దృష్టిలో అమూల్యమైనవారు!

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.”—యిర్మీయా 31:3.

1. తన కాలంనాటి సామాన్య ప్రజలను గూర్చిన యేసు దృక్పథం పరిసయ్యుల దృక్పథం నుండి ఎలా వేరుగా ఉంది?

వారు దాన్ని ఆయన కళ్లలో చూడగలిగారు. ఈ మనుష్యుడైన యేసు, ఎంత మాత్రం వారి మత నాయకుల వలె లేకుండెను; ఆయన శ్రద్ధ కలిగి ఉండేవాడు. వారు “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరి” ఉన్నందున ఆయన ఈ ప్రజల యెడల జాలిపడ్డాడు. (మత్తయి 9:36) వారి మతనాయకులు ప్రేమ, దయ గల దేవునికి ప్రాతినిధ్యం వహించే ప్రేమగల కాపరులై ఉండవలసి ఉండెను. బదులుగా, వారు సామాన్య ప్రజలను నీచమైనవారని, శాపగ్రస్తులని తృణీకరించారు!a (యోహాను 7:47-49; యెహెజ్కేలు 34:4 పోల్చండి.) స్పష్టంగా, అలాంటి కుటిలమైన, లేఖనరహిత దృక్పథం ప్రజలను గూర్చిన యెహోవా దృక్కోణం నుండి ఎంతో వేరుగావుండెను. ఆయన తన జనాంగమైన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను.”—యిర్మీయా 31:3.

2. తాను దేవుని దృష్టిలో విలువలేని వాడనని యోబు ఒప్పుకునేలా చేయడానికి అతని ముగ్గురు సహచరులు ఎలా ప్రయత్నించారు?

2 అయితే, యెహోవా ప్రియమైన గొర్రెలను వారు పనికిరాని వారని ఒప్పించడానికి ప్రయత్నించిన వారిలో పరిసయ్యులే మొదటివారేమీ కాదు. యోబు ఉదాహరణను పరిశీలించండి. యెహోవా దృష్టిలో ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, కాని ముగ్గురు “ఆదరణకర్తలు” మాత్రం యోబు తన తర్వాత కేవలం తన ఉనికి యొక్క సాక్ష్యాన్ని కూడా మిగల్చకుండా మరణించే అవినీతిపరుడని, దుష్ట మతభ్రష్టుడని సూచించారు. దేవుడు తన స్వంత దూతలను నమ్మడంలేదు, ఆకాశ వైశాల్యాన్ని కూడా పవిత్రమైనదిగా ఎంచడం లేదు గనుక యోబు కలిగివున్న నీతిని దేవుడు విలువైనదిగా భావించడని వారు ఆరోపించారు!—యోబు 1:8; 4:18; 15:15, 16; 18:17-19; 22:3.

3. తాము నిష్ప్రయోజకులమని, ప్రేమింపబడలేని వారమని ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నించడానికి సాతాను నేడు ఏ మూలాలను ఉపయోగిస్తాడు?

3 నేడు, తాము ప్రేమించబడడం లేదని, నిష్ప్రయోజకులమని ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నించే ఈ “తంత్రాన్ని” సాతాను ఇప్పటికీ ఉపయోగిస్తున్నాడు. (ఎఫెసీయులు 6:11) నిజమే, తమ నిష్ప్రయోజకత్వానికి, గర్వానికి లొంగిపోయేలా చేయడం ద్వారా అతడు తరచూ ప్రజలను మోసగిస్తాడు. (2 కొరింథీయులు 11:3) కాని గాయపడదగినవారి ఆత్మగౌరవాన్ని జయించడంలో కూడా అతడు ఆనందాన్ని పొందుతాడు. ప్రాముఖ్యంగా ఈ అపాయకరమైన “అంత్యదినములలో” ఇది వాస్తవం. అనేకులు నేడు “అనురాగం” లేని కుటుంబాల్లో పెరుగుతారు, అనేకులు ప్రతిరోజు క్రూరమైన, స్వార్థపూరితమైన, మూర్ఖమైన వారితో వ్యవహరించవలసి ఉంటుంది. (2 తిమోతి 3:1-5) సంవత్సరాలుగా సాగుతున్న దౌర్జన్యం, జాతీయత, విద్వేషం, లేక బలాత్కారం వంటివి తాము నిష్ప్రయోజకులని, ప్రేమింపబడలేని వారని అలాంటి వారిని ఒప్పించి ఉండవచ్చు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు: “ప్రేమించాలని, ప్రేమించబడాలనే భావనే నాలో లేదు. దేవుడు నా గురించి అసలు శ్రద్ధ కలిగి ఉన్నాడంటే నమ్మడం నాకు చాలా కష్టమనిపిస్తుంది.”

4, 5. (ఎ) నిష్ప్రయోజకులమనే వ్యక్తిగత భావన ఎందుకు లేఖన విరుద్ధమైనది? (బి) మన ప్రయత్నాలేవీ విలువైనవి కావనే నమ్మకం యొక్క ఒక భయంకరమైన పరిణామం ఏమిటి?

4 నిష్ప్రయోజకులమనే వ్యక్తిగత భావన దేవుని వాక్య సత్యమైన విమోచనను గూర్చిన బోధను వ్యర్థం చేస్తుంది. (యోహాను 3:16) నిరంతరం జీవించే అవకాశాన్ని మన కొరకు కొనడానికి దేవుడు అంత విలువైన మూల్యాన్ని—తన స్వంత కుమారుని అమూల్యమైన జీవితాన్ని—చెల్లించగలిగాడంటే, ఆయన తప్పకుండా మనల్ని ప్రేమించాలి; తప్పకుండా ఆయన దృష్టిలో మనం అమూల్యమైనవారమై ఉండాలి!

5 అంతేగాక, మనం దేవున్ని అప్రీతిపరుస్తున్నామని, మన ప్రయత్నాలు ఏ మాత్రం విలువైనవి కావని భావించడం ఎంత నిరుత్సాహకరంగా ఉంటుంది! (సామెతలు 24:10 పోల్చండి.) ఇలాంటి ప్రతికూల దృక్పథం కల్గివుంటే, దేవునికి మనం చేసే సేవను సాధ్యమైన చోట మరింత అధికం చేసేందుకు రూపించబడిన, సరైన ప్రోత్సాహం కూడా కొంతమందికి నిందించడంలా ధ్వనించవచ్చు. ఇది మనము ఏది చేసినప్పటికీ సరిపోదనే మన అంతర్గత ఒప్పుకోలు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించవచ్చు.

6. మనల్ని గూర్చిన విపరీతమైన ప్రతికూల తలంపులకు శ్రేష్ఠమైన విరుగుడు ఏది?

6 మీలో కూడా అలాంటి ప్రతికూల దృక్పథాలు ఉన్నట్లు మీరు భావిస్తే, నిరాశ చెందకండి. మనలో అనేకులం తరచూ నిర్హేతుకంగా మన యెడల మనం కఠినంగా ఉంటాము. దేవుని వాక్యం “తప్పుదిద్దుటకు” మరియు “దుర్గములను పడద్రోయడానికి” రూపొందించబడిందని గుర్తుంచుకోండి. (2 తిమోతి 3:16; 2 కొరింథీయులు 10:4) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.” (1 యోహాను 3:19, 20) గనుక, మనం యెహోవాకు అమూల్యమైనవారమని బైబిలు బోధించే మూడు విధానాలను పరిశీలిద్దాము.

యెహోవా మిమ్మల్ని విలువైనవారిగా యెంచుతాడు

7. దేవుని దృష్టిలో వారి విలువను గూర్చి యేసు క్రైస్తవులందరికీ ఎలా బోధించాడు?

7 మొదట, మనలో ప్రతి ఒక్కరికి దేవుని దృష్టిలో విలువ ఉందని బైబిలు సూటిగా బోధిస్తుంది. యేసు ఇలా చెప్పాడు: “అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?” (లూకా 12:6, 7) ఆ కాలంలో, ఆహారంగా అమ్మబడే పక్షులలో పిచ్చుక చాలా తక్కువ ఖరీదు గలది, అయినప్పటికీ వాటిలో ఒకటి కూడా తమ సృష్టికర్తచేత గుర్తింపబడకుండా ఉండలేదు. గనుక ఓ పెద్ద తేడాను చూపే పునాది వేయబడింది: ఏమంటే—అంతకంటే ఎంతో శ్రేష్ఠమైన మానవుల విషయానికొస్తే, దేవునికి ప్రతీ వివరణా తెలుసు. అది మనలో ప్రతి ఒక్కరి తల వెండ్రుకలు లెక్కింపబడ్డాయేమో అన్నట్లుంది!

8. మన తల వెండ్రుకలను యెహోవా లెక్కించగలడని తలంచడం ఎందుకు వాస్తవమైనది?

8 వెండ్రుకలు లెక్కింపబడ్డాయా? యేసు ఉపమానంలోని ఈ అంశాన్ని మీరు శంకిస్తున్నట్లయితే, దీన్ని పరిశీలించండి: దేవుడు తన విశ్వాసులైన సేవకులను ఎంత పూర్తిగా జ్ఞాపకం ఉంచుకుంటాడంటే, ఆయన వారిని—సంక్లిష్టమైన జన్యు సంబంధ సంకేతాలతో వారి సంవత్సరాలన్నిటి జ్ఞాపకాలతో, అనుభవాలతో వారిని ప్రతి విషయంలో పునఃసృష్టిచేయడం ద్వారా—పునరుత్థానం చేయగలడు. దానితో పోల్చి చూస్తే మన వెండ్రుకలను (సగటున ప్రతి తలపై దాదాపు 1,00,000 వెండ్రుకలు మొలుస్తాయి) లెక్కించడం చాలా చిన్న పనియై ఉండగలదు!—లూకా 20:37, 38.

యెహోవా మనలో దేన్ని చూస్తాడు?

9. (ఎ) యెహోవా విలువైనవిగా దృష్టించే కొన్ని గుణాలు ఏవి? (బి) అలాంటి గుణాలు ఆయనకు అమూల్యమైనవని మీరెందుకు భావిస్తారు?

9 రెండవది, యెహోవా మనలో దేన్ని అమూల్యమైనదిగా యెంచుతాడో బైబిలు మనకు బోధిస్తుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఆయన మన అనుకూలమైన గుణాలను బట్టి, మన ప్రయాసలను బట్టి ఆనందిస్తాడు. రాజైన దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇలా చెప్పాడు: “యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచన లన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు.” (1 దినవృత్తాంతములు 28:9) దౌర్జన్యపూరితమైన, ద్వేషంతో నిండిన ఈ లోకంలో దేవుడు వందల కోట్ల హృదయాలను పరిశోధిస్తుండగా, సమాధానాన్ని, సత్యాన్ని, నీతిని ప్రేమించే హృదయాన్ని ఆయన కనుగొన్నప్పుడు ఆయన ఎంతగా ఆనందిస్తుండవచ్చు! (యోహాను 1:47; 1 పేతురు 3:4) ఆయన యెడల ప్రేమతో ఉప్పొంగుతూ, ఆయన గురించి నేర్చుకొని, అలాంటి జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నించే హృదయాన్ని దేవుడు కనుగొన్నప్పుడు ఏం జరుగుతుంది? తన గురించి ఇతరులతో మాట్లాడేవారిని ఆయన వింటాడని, “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు” వారందరికి “జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము” కూడా ఉందని మలాకీ 3:16 నందు యెహోవా మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి గుణాలు ఆయనకు అమూల్యమైనవి!

10, 11. (ఎ) యెహోవా వారి మంచి గుణాలను విలువైనవిగా దృష్టిస్తాడనే సాక్ష్యాధారాన్ని తగ్గించడానికి కొందరు ఎలా ప్రయత్నిస్తారు? (బి) ఏ మోతాదులో ఉన్న మంచి గుణాలనైనా యెహోవా విలువైనవిగా దృష్టిస్తాడని అబీయా యొక్క ఉదాహరణ ఎలా చూపిస్తుంది?

10 అయితే స్వయంగా నిందించుకునే హృదయం, దేవుని దృష్టిలో మన విలువను గూర్చిన సాక్ష్యాధారాన్ని నిరాకరించవచ్చు. అది మొండిగా ఇలా గుసగుసలాడవచ్చు, ‘కాని నాకంటే మరింత మాదిరికరంగా ఉన్నవారు ఎంతోమంది ఇతరులున్నారు. యెహోవా వారితో నన్ను పోల్చినప్పుడు ఆయన ఎంతగా నిరుత్సాహపడవచ్చు!’ యెహోవా అలా పోల్చడు, ఆయన కఠినుడు కాదు, కఠినమైన కట్టడలు గలవాడూ కాదు. (గలతీయులు 6:4) ఆయన గొప్ప నేర్పుతో మన హృదయాలను చదివి, అన్ని మోతాదులలోనూ మంచి గుణాలను అమూల్యమైనవిగా దృష్టిస్తాడు.

11 ఉదాహరణకు, రాజైన యరొబాము యొక్క పూర్తి మతభ్రష్ట రాజ్యం శిక్షించబడి, “పెంట” వలె తీసివేయబడుతుందని ఆజ్ఞాపించినప్పుడు, రాజు కుమారులలో ఒకడైన అబీయాకు మాత్రమే మంచిగా సమాధి చేయబడాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఎందుకు? “దేవుడై యెహోవా . . . ఇతనియందు మాత్రమే అనుకూలమైన దాని కనుగొనెను.” (1 రాజులు 14:10, 13) అబీయా యెహోవా యొక్క నమ్మకమైన ఆరాధికుడని దీని భావమా? అలాగని కాదు, ఎందుకంటే అతని దుష్ట కుటుంబం వలెనే, అతడు మరణించాడు. (ద్వితీయోపదేశకాండము 24:16) అయినప్పటికీ, యెహోవా అబీయా హృదయంలో చూసిన “అనుకూలమైన దాని”ని అమూల్యమైనదిగా దృష్టించి, దానికి తగినట్లు చర్య తీసుకున్నాడు. మాథ్యూ హెన్రీస్‌ కామెన్‌టరీ ఆన్‌ ది హోల్‌ బైబిల్‌ ఇలా తెలియజేసింది: “ఎక్కడ ఏ మాత్రం మంచి ఉన్నప్పటికీ, అది కనుగొనబడుతుంది; అది ఎంత తక్కువ మోతాదులో ఉన్నా, దాని కొరకు వెతికే దేవుడు దాన్ని కనుగొంటాడు, దాన్ని బట్టి ఆనందిస్తాడు.” దేవుడు మీలో ఎంత తక్కువ మోతాదులో మంచి గుణాన్ని కనుగొన్నా, మీరు ఆయనను నమ్మకంగా సేవించడానికి ప్రయత్నిస్తున్నంత వరకు ఆయన దాన్ని అభివృద్ధి చెందేలా చేయగలడని మరచిపోకండి.

12, 13. (ఎ) యెహోవా మన ప్రయాసలను విలువైనవిగా దృష్టిస్తాడని కీర్తన 139:3 ఎలా చూపిస్తుంది? (బి) యెహోవా మన చర్యలను జల్లిస్తాడని ఏ భావంలో చెప్పవచ్చు?

12 అదే విధంగా యెహోవా మన ప్రయత్నాలను అమూల్యమైనవిగా దృష్టిస్తాడు. కీర్తన 139:1-3 నందు మనమిలా చదువుతాము: “యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొనియున్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.” గనుక యెహోవాకు మన చర్యలన్నీ తెలుసు. కాని ఆయనకు కేవలం తెలియడం మాత్రమే కాదు. హెబ్రీ భాషలో “నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసికొనియున్నావు” అనే దానికి “నీవు నా చర్యలన్నిటినీ విలువైనవిగా ఎంచుతావు” లేక “నా చర్యలన్నిటిని బట్టి నీవు ఆనందిస్తావు” అనే భావం కూడా ఉంది. (మత్తయి 6:19, 20 పోల్చండి.) అయితే, మనం ఎంతో అపరిపూర్ణులము, పాపభరితులము అయినప్పుడు యెహోవా ఎలా మన చర్యలను బట్టి ఆనందించగలడు?

13 ఆసక్తికరంగా, కొంతమంది పండితుల ప్రకారం యెహోవా తన నడకను, పడకను “పరిశీలన” చేశాడని దావీదు వ్రాశాడు, దానికి హెబ్రీ భాషలో అక్షరార్థకంగా, “జల్లించు” లేక “చెరుగు” అని భావం. ఒక పరిశోధనా గ్రంథం ఇలా తెలియజేసింది: “దాని భావం . . . చెత్త అంతా చెరిగి తీసివేసి ధాన్యాన్నంతటిని మిగల్చడం—విలువైనదాన్ని కాపాడడం. కాబట్టి సూచనార్థకంగా చెప్పాలంటే, ఇక్కడ దేవుడు ఆయనను జల్లించాడు . . . చెత్తలా ఉన్నదంతా లేక విలువలేనిదంతా చెదరగొట్టేసి, అక్కడ నిజమైనది, సారవంతమైనది ఏది ఉందో దాన్ని ఆయన కనుగొన్నాడు.” స్వయంగా నిందించుకునే హృదయం, గత తప్పుల గురించి మనల్ని నిర్దయగా తీవ్రంగా నిందిస్తూ, మనం చేసిన మంచి కార్యాలను లెక్కించకుండా మన చర్యలను వ్యతిరేకమైన విధంగా వేరుచేయవచ్చు. కాని మనం నిజంగా పశ్చాత్తాపపడి, మన పొరపాట్లను మళ్లీ చేయకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నిస్తే, యెహోవా మన పాపాలను క్షమిస్తాడు. (కీర్తన 103:10-14; అపొస్తలుల కార్యములు 3:19, 20) ఆయన మన మంచి పనులను వేరు చేసి వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. వాస్తవానికి, మనం ఆయన యెడల నమ్మకంగా ఉన్నంత కాలం ఆయన వాటిని నిత్యము జ్ఞాపకముంచుకుంటాడు. వీటిని మరచిపోవడాన్ని ఆయన అన్యాయమని పరిగణిస్తాడేగాని, ఆయన ఎన్నడూ అన్యాయస్థుడు కాడు!—హెబ్రీయులు 6:10.

14. క్రైస్తవ పరిచర్యలో మన పనిని యెహోవా విలువైనదిగా దృష్టిస్తాడని ఏది చూపిస్తుంది?

14 దేవుడు విలువైనవిగా దృష్టించే కొన్ని మంచి పనులు ఏవి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అనుకరిస్తూ మనం చేసేవి ఏవైనా సరే. (1 పేతురు 2:21) అయితే, కచ్చితంగా అత్యంత ప్రాముఖ్యమైన ఒక పని ఏమిటంటే, దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను వ్యాప్తిచేయడం. రోమీయులు 10:15 నందు మనమిలా చదువుతాము: “ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి.” మనం మన సామాన్యమైన పాదాల గురించి “సుందరమైనవి” అని సాధారణంగా తలంచకపోవచ్చు, గ్రీకు సెప్టాజెంట్‌ వర్షన్‌ నందు రిబ్కా, రాహేలు, యోసేపులను వర్ణించడానికి ఉపయోగించబడిన పదాన్నే పౌలు ఇక్కడ ఉపయోగించాడు—వీరు ముగ్గురు తమ సౌందర్యానికి పేరుపొందిన వారు. (ఆదికాండము 26:7; 29:17; 39:6) గనుక మన దేవుడైన యెహోవా సేవలో మనం నిమగ్నమై ఉండడం, ఆయన దృష్టికి ఎంతో సుందరమైనది, అమూల్యమైనది.—మత్తయి 24:14; 28:19, 20.

15, 16. యెహోవా మన సహనాన్ని విలువైనదిగా ఎందుకు ఎంచుతాడు, కీర్తన 56:8 నందలి రాజైన దావీదు మాటలు ఈ వాస్తవాన్ని ఎలా నొక్కిచెబుతున్నాయి?

15 దేవుడు విలువైనదిగా దృష్టించే మరో గుణం, మన సహనం. (మత్తయి 24:13) మీరు యెహోవాను విడిచిపెట్టాలని సాతాను కోరుకుంటున్నాడని గుర్తుంచుకోండి. యెహోవాకు మీరు యథార్థంగా ఉన్న ప్రతి దినం, సాతాను నిందలకు జవాబివ్వడానికి మీరు సహాయం చేసిన మరో దినమై ఉంటుంది. (సామెతలు 27:11) కొన్నిసార్లు సహనం కలిగి ఉండడం అంత సుళువేమి కాదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు, మానసిక వేదన, మరితర అవాంతరాలు గడుస్తున్న ప్రతి దినాన్ని ఒక పరీక్షగా చేయవచ్చు. అలాంటి పరీక్షల్లో సహనం కలిగి ఉండడం యెహోవా దృష్టిలో మరింత అమూల్యమైంది. అందుకే రాజైన దావీదు తన కన్నీళ్లను గూర్చి “అవి నీ కవిలె (పుస్తకము)లో కనబడును గదా” అని నమ్మకంగా అడుగుతూ, వాటిని సూచనార్థకమైన “బుడ్డి (తోలు సంచి NW)”లో భద్రపరచమని యెహోవాను కోరాడు. (కీర్తన 56:8) అవును, ఆయన యెడల యథార్థంగా ఉండేందుకు మనం సహించే కన్నీళ్లన్నింటినీ, శ్రమలన్నింటినీ యెహోవా విలువైనవిగా ఎంచి, జ్ఞాపకముంచుకుంటాడు. అవి కూడా ఆయన దృష్టిలో అమూల్యమైనవే.

16 మన మంచి గుణాలు, మన ప్రయత్నాల దృష్ట్యా మనలో ప్రతి ఒక్కరిలో అమూల్యమైనదిగా ఎంచడానికి యెహోవా ఎంతో కనుగొంటాడనడం ఎంత సుస్పష్టం! సాతాను ప్రపంచం మనతో ఎలా వ్యవహరించినప్పటికీ, యెహోవా మనల్ని అమూల్యమైనవారిగా, “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులలో” భాగంగా దృష్టిస్తాడు.—హగ్గయి 2:7.

తన ప్రేమను కనుపర్చడానికి యెహోవా ఏమిచేశాడు

17. యెహోవా మరియు యేసు మనల్ని వ్యక్తిగతంగా ప్రేమిస్తున్నారని క్రీస్తు యొక్క విమోచనా బలి మనల్ని ఎందుకు ఒప్పించాలి?

17 మూడవది, మన యెడల తనకుగల ప్రేమను నిరూపించుకోవడానికి యెహోవా ఎంతో చేశాడు. కచ్చితంగా, మనం విలువలేని వారము లేక ప్రేమింపబడలేని వారము అనే సాతాను యొక్క అబద్ధానికి క్రీస్తు విమోచనా బలి ఎంతో శక్తివంతమైన జవాబు. యేసు హింసాకొయ్యపై పొందిన వేదనకరమైన మరణం మరియు తన ప్రియ కుమారుని మరణాన్ని చూడడం ద్వారా యెహోవా అనుభవించిన మరింత గొప్ప వేదన, మన యెడల వారికి గల ప్రేమకు నిదర్శనాలని మనం ఎన్నడూ మరచిపోకూడదు. అంతేగాక, ఆ ప్రేమ మనకు వ్యక్తిగతంగా వర్తిస్తుంది. అపొస్తలుడైన పౌలు దాన్ని అలాగే దృష్టించాడు, అందుకే ఆయనిలా వ్రాశాడు: ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు.’—గలతీయులు 2:20.

18. ఏ భావంలో యెహోవా మనల్ని క్రీస్తు యొద్దకు ఆకర్షిస్తాడు?

18 క్రీస్తు బలి ప్రయోజనాల నుండి మేలు పొందడానికి మనకు వ్యక్తిగతంగా సహాయం చేయడం ద్వారా యెహోవా మన యెడల తనకు గల ప్రేమను నిరూపించుకున్నాడు. యోహాను 6:44 నందు యేసు ఇలా చెప్పాడు: “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” మన వరకు వ్యక్తిగతంగా చేరే ప్రకటన పని ద్వారా, మనకు పరిధులు, అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ, ఆత్మీయ సత్యాలను గ్రహించుకొని, అన్వర్తించుకోవడానికి సహాయం చేసేందుకు యెహోవా ఉపయోగించే తన పరిశుద్ధాత్మ ద్వారా, యెహోవా మనల్ని వ్యక్తిగతంగా తన కుమారుని యొద్దకు, నిత్యజీవ నిరీక్షణ యొద్దకు ఆకర్షిస్తాడు. గనుక యెహోవా ఇశ్రాయేలీయుల గురించి చెప్పినట్లే మన గురించి కూడా ఇలా చెప్పగలడు: “శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.”—యిర్మీయా 31:3.

19. యెహోవాకు మన యెడల గల వ్యక్తిగతమైన ప్రేమను గూర్చి ప్రార్థనాధిక్యత మనల్ని ఎందుకు ఒప్పించాలి?

19 అయితే, బహుశా ప్రార్థనాధిక్యత ద్వారా మనం యెహోవా ప్రేమను అత్యంత సన్నిహితమైన విధంగా పొందగలము. తనకు “యెడతెగక ప్రార్థనచేయ”మని ఆయన మనలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:17) ఆయన ఆలకిస్తాడు! ఆయన “ప్రార్థన ఆలకించువాడు” అని కూడా పిలువబడ్డాడు. (కీర్తన 65:2) ఆయన ఈ కార్యాన్ని ఏ ఇతర వ్యక్తికి, చివరికి తన స్వంత కుమారునికి కూడా అప్పగించలేదు. ఇది తలంచండి: మనం ప్రార్థన యందు స్వేచ్ఛగా తనను సమీపించాలని విశ్వ సృష్టికర్త మనల్ని కోరుతున్నాడు. మరో విధంగా అయితే తాను చేసివుండని పనులు చేయడానికి కూడా మన విజ్ఞాపనలు యెహోవాను పురికొల్పగలవు.—హెబ్రీయులు 4:16; యాకోబు 5:16; యెషయా 38:1-16 చూడండి.

20. మన యెడల దేవునికి గల ప్రేమ మనం స్వయం ప్రాముఖ్యత లేక అహంభావం కలిగివుండడానికి ఒక సాకు ఎందుకు కాదు?

20 దేవుని ప్రేమ మరియు గౌరవం యొక్క అలాంటి నిదర్శనాన్ని ఏ సమతూకంగల క్రైస్తవుడూ తాను నిజంగా ఉన్నదానికంటే తనను తాను ప్రాముఖ్యమైనవానిగా దృష్టించుకోవడానికి ఒక సాకుగా తీసుకోడు. పౌలు ఇలా వ్రాశాడు: “తన్ను తాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.” (రోమీయులు 12:3) కాబట్టి, మన పరలోక తండ్రి ప్రేమ యొక్క వెచ్చదనాన్ని మనం ఆనందిస్తుండగా, మనం స్వస్థబుద్ధి గలవారమై ఉండి, దేవుని కృపావాత్సల్యం మితిలేనిదని గుర్తుంచుకుందాము.—లూకా 17:10 పోల్చండి.

21. సాతాను యొక్క ఏ అబద్ధాన్ని మనం తదేకంగా నిరాకరించాలి, ఏ దైవిక సత్యాన్ని మనం ఎల్లప్పుడూ మననం చేసుకోవాలి?

21 గతిస్తున్న ఈ పాత లోకంలో సాతాను ఉన్నతపర్చే తలంపులన్నిటినీ నిరాకరించడానికి మనలో ప్రతి ఒక్కరం మనం చేయగలిగినదంతా చేద్దాము. మనం విలువలేనివారం లేక ప్రేమింపబడలేని వారం అనే తలంపును నిరాకరించడం కూడా దానిలో ఇమిడి ఉంది. మిమ్మల్ని గూర్చి మీరు, అధిగమించడానికి దేవుని అపారమైన ప్రేమను సహితం బెదిరించేలాంటి అవాంతరమని భావించడానికి, లేక మీ మంచి పనులు సమస్తాన్ని చూడగల ఆయన కన్నులు కూడా గమనించలేనంత అల్పమైనవని, లేక మీ పాపాలు ఆయన అమూల్యమైన కుమారుని మరణం కూడా కప్పలేనంత విస్తృతమైనవని ఈ విధానంలో జీవితం మీకు బోధించి ఉంటే, మీకు ఒక అబద్ధం బోధించబడింది. అలాంటి అబద్ధాలను, అవి పొందదగినంత అసహ్యతతో నిరాకరించండి! రోమీయులు 8:38, 39 నందలి అపొస్తలుడైన పౌలు యొక్క ప్రేరేపిత మాటలను మనం ఎల్లప్పుడూ మనస్సులో ఉంచుకుందాము: “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”

[అధస్సూచీలు]

a వాస్తవానికి వారు పేదవారిని “ʽఆమ్‌-హా·’రెట్స్‌” లేక “మట్టి మనుష్యులు” అనే నీచమైన పదాన్ని ఉపయోగించి తృణీకరించేవారు. వీరిని విలువైన వాటి విషయంలో నమ్మకూడదని, వారి సాక్ష్యాన్ని నమ్మకూడదని, వారిని అతిథులుగా సత్కరించకూడదని, వారికి అతిథులుగా వెళ్లకూడదని, చివరికి వారి నుండి కొనకూడదని పరిసయ్యులు భావించేవారని ఒక పండితుడు తెలియజేశాడు. ఈ ప్రజలలో ఒకరికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమంటే ఆమెను బంధించి, నిస్సహాయురాలిగా ఒక మృగానికి అప్పజెప్పినట్లేనని ఆ మతనాయకులు చెప్పేవారు.

మీరేం తలస్తారు?

◻ మనం నిష్ప్రయోజకులమని, ప్రేమింపబడలేని వారమని ఒప్పించడానికి సాతాను ఎందుకు ప్రయత్నిస్తాడు?

◻ యెహోవా మనలో ప్రతి ఒక్కరిని విలువైనవారిగా దృష్టిస్తాడని యేసు ఎలా బోధించాడు?

◻ యెహోవా మన మంచి గుణాలను విలువైనవిగా ఎంచుతాడని మనకెలా తెలుసు?

◻ యెహోవా మన ప్రయాసలను అమూల్యమైనవిగా దృష్టిస్తాడని మనమెలా కచ్చితంగా నమ్మగలము?

◻ ఆ యా వ్యక్తులుగా మన యెడల తన ప్రేమను యెహోవా ఎలా నిరూపించుకున్నాడు?

[13వ పేజీలోని చిత్రం]

తన నామాన్ని గూర్చి తలంచే వారందరిని యెహోవా గమనించి, జ్ఞాపకముంచుకుంటాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి