రాజ్య ప్రచారకుల నివేదిక
కష్టాలతో కూడిన సమయంలో ప్రకటించుట
“అంత్యదినములలో అపాయకరమైన కాలములు [వచ్చునని]” అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు. (2 తిమోతి 3:1) ఆ మాటలు ఎంత కచ్చితమైనవిగా నిరూపించబడ్డాయి! మధ్య అమెరికానందలి ఎల్ సాల్వడార్ ప్రజలు ఈ చేదు నిజాన్ని దీర్ఘకాలంగా అనుభవిస్తున్నారు. దాదాపు ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలంగా ఆ దేశం అనేక వేలాదిమందికి దుఃఖాన్ని, మరణాన్ని తీసుకువచ్చిన అంతర్యుద్ధంలో మునిగివుంది. ఇప్పుడు యుద్ధం ముగిసింది, కాని దుఃఖం ఇంకా మిగిలివుంది. యుద్ధం తర్వాత నేరం విపరీతంగా పెరిగిపోయింది. ఒక స్థానిక దూరదర్శని వ్యాఖ్యాత ఇటీవల ఇలా తెలియజేశాడు: “దౌర్జన్యం, దోపిడీ ఇప్పుడు మన అనుదిన సంఘటనలై పోయాయి.”
ఈ నేర తరంగ తాకిడి యెహోవాసాక్షులపై కూడా ప్రభావం చూపకపోలేదు. దొంగలు ఎన్నో రాజ్యమందిరాల్లోకి చొరబడి శబ్దయంత్ర పరికరాలను దొంగిలించారు. క్రైస్తవ కూటాలు జరుగుతుండగా అనేక సందర్భాల్లో సాయుధ యౌవనుల ముఠాలు రాజ్యమందిరాల్లోకి ప్రవేశించి, హాజరైన వారి దగ్గర నుండి డబ్బు, గడియారాలు, ఇతర విలువైన వస్తువులు దోచుకున్నారు. తమ అనుదిన కార్యకలాపాల్లో నిమగ్నమైవుండగా, అనేకమంది సాక్షులు దొంగలచే చంపబడ్డారు కూడా.
ఈ అవాంతరాలు ఉన్నప్పటికీ, ఎల్ సాల్వడార్లో యెహోవాసాక్షులు సువార్త ప్రకటించడంలో ప్రయాసపడడం కొనసాగించారు. వారు “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను” అనే లేఖనాధార ఆజ్ఞకు లోబడుతూ దీన్ని చేస్తున్నారు. (మార్కు 13:10) బైబిలు అందజేసే రాజ్య నిరీక్షణ కొరకు పరితపించే ఇంకా అనేకులు ఈ దేశంలో ఉన్నారు, వారిలో ప్రతి ఒక్కరిని చేరడానికి సాక్షులు కృషి చేస్తున్నారు. ప్రకటించడంలో అనియత సాక్ష్యం ప్రభావవంతమైన ప్రచార పద్ధతిగా నిరూపించబడుతుంది.
ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, బైబిలునందు కనుగొనబడే భవిష్యత్తు కొరకైన దేవుని వాగ్దానాలను గూర్చి ఇతర రోగులతో మాట్లాడడానికి ఒక సాక్షి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొనేవాడు. తీవ్ర అస్వస్థత గల ఒక రోగి ఇలా విలపించాడు: “నేను త్వరలోనే మరణించబోతున్నాను!” కాని రోగి యొక్క నిరాశతో కూడిన రూపం దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను పంచుకోకుండా సాక్షిని నిరుత్సాహపరచలేదు. బదులుగా, యెహోవాసాక్షులచే ప్రచురించబడిన మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం నుండి బిగ్గరగా చదివి ఆ వ్యక్తికి వినిపించాడు. కొన్ని దినాల తర్వాత, ఆ వ్యక్తి మరణశయ్యపై ఉన్నాడని బాధగా తలస్తూ, ఆ సాక్షి ఆ ఆసుపత్రిని విడిచివెళ్లాడు.
నాలుగు సంవత్సరాల తర్వాత సాక్షి మరో ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. అతడు అక్కడ ఉండగా, ఒక రోగి అతని వద్దకు వచ్చి: “నేను గుర్తున్నానా?” అనడిగాడు. అతడు, తాను నాలుగు సంవత్సరాల క్రితం కలిసిన ఆ మరణించబోతున్న వ్యక్తే! ఆ వ్యక్తి అతన్ని కౌగలించుకొని “నేను కూడా ఇప్పుడు యెహోవాసాక్షుల్లో ఒకరిని” అని చెప్పినప్పుడు ఎంత ఆనందకరమైన ఆశ్చర్యం కలిగిందో! ఆ వ్యక్తి భవిష్యత్తు కొరకైన బైబిలు నిరీక్షణను హత్తుకొని, యెహోవాసాక్షులతో బైబిలును పఠించి, యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అతడు సాక్షి మాత్రమే కాదు, దాదాపు రెండు సంవత్సరాల నుండి క్రమ పయినీరుగా పూర్తికాల పరిచర్యలో భాగం వహిస్తున్నాడు కూడా.
ఈ సంఘటనలో, అనియత సాక్ష్యం సందర్భంగా విత్తబడిన సత్య విత్తనాలు ఒక ప్రతిస్పందించే హృదయాన్ని చేరాయి. ప్రజలు సత్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందడానికి సహాయం చేసే ఈ ఆధిక్యత, “అపాయకరమైన కాలములలో” సహితం ప్రకటించే పనిలో కొనసాగడానికి నిజ క్రైస్తవులను పురికొల్పుతుంది.