యేసు చేసిన అద్భుతాలు—చారిత్రాత్మకమైనవా లేక కట్టుకథలా?
“రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను.”—మత్తయి 14:25.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందికి యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడనే నమ్మకం దాదాపు దేవుని యందు విశ్వాసముంచడమంత ప్రాముఖ్యమైనదే. మత్తయి, మార్కు, లూకా, యోహాను వంటి సువార్తికులు యేసు చేసిన దాదాపు 35 అద్భుతాల గురించి వివరిస్తున్నారు. అయితే, ఆయన ఇంకా అనేక మానవాతీత కార్యాలు చేశాడని వారి వృత్తాంతాలు సూచిస్తున్నాయి.—మత్తయి 9:35; లూకా 9:11.
ఈ అద్భుతాలు వినోదం కొరకు చేసినవి కావు. అవి, తాను దేవుని కుమారుడనని, ఎంతోకాలంగా ఎదురుచూసిన మెస్సీయానని యేసు చెప్పుకున్నదానికి సాక్ష్యాధారాలు. (యోహాను 14:11) బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగానికి తనను తాను వ్యక్తపర్చుకున్నప్పుడు మోషే అద్భుతమైన సూచనలు చేశాడు. (నిర్గమకాండము 4:1-9) కారణసహితంగా, మోషే కంటే గొప్పవాడౌతాడని ప్రవచింపబడినవాడైన మెస్సీయా కూడా దైవిక మద్దతు ఉందని చూపించే సూచన ఏదైనా చేయాలని ఎదురుచూడడం జరిగింది. (ద్వితీయోపదేశకాండము 18:16) అందుకే బైబిలు యేసు గురించి, “మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు [యూదులకు] కనబరచెను” అని చెబుతుంది.—అపొస్తలుల కార్యములు 2:22.
గడిచిన కాలంలో, యేసు అద్భుతాలు చేసేవాడని బైబిలు చిత్రీకరించడాన్ని ప్రజలు సాధారణంగా నిస్సందేహంగా అంగీకరించారు. కాని ఇటీవల దశాబ్దాలలో, సువార్తికుల వృత్తాంతాలు విమర్శకుల విమర్శను ఎదుర్కొన్నాయి. డిసెప్షన్స్ అండ్ మిత్స్ ఆఫ్ ది బైబిల్ అనే తన పుస్తకంలో లాయిడ్ గ్రాహమ్, యేసు నీటిపై నడిచిన బైబిలు వృత్తాంతాన్ని సూచిస్తూ, ఇలా చెప్పేవరకు వెళ్లాడు: “అక్షరార్థంగా దీన్ని విశ్వసించడం అజ్ఞానమే, అయినా అక్షరార్థంగా, లక్షలాదిమంది విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ లోకానికి ఏమైందాయని మనం ఆశ్చర్యపోతాము. అలాంటి అజ్ఞానం నుండి ఏ మంచి లోకాన్ని నీవు నిరీక్షించగలవు?”
అసాధ్యమా?
అయితే, అలాంటి విమర్శలు కారణసహితమైనవి కావు. “తెలిసిన ప్రకృతి నియమాల ద్వారా వివరించబడలేని ఒక సంఘటనగా” ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా అద్భుతాన్ని నిర్వచిస్తుంది. ఆ నిర్వచనం ప్రకారం, కలర్ టి.వి. సెల్లులార్ ఫోన్, లేక ఒక లాప్టాప్ కంప్యూటర్ వంటివి కేవలం ఒక శతాబ్దం క్రితం అద్భుతాలుగానే పరిగణించబడి ఉండేవి! ఏదైనా ఒక దానిని ప్రస్తుతమున్న శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకారంగా వివరించలేక పోవడంవల్ల మాత్రమే దాన్ని అసాధ్యమని పిలుస్తూ, మూర్ఖంగా ఉండడం కారణసహితమేనా?
పరిశీలించవలసిన మరో విషయం ఇలా ఉంది: “క్రొత్త నిబంధన” వ్రాయబడిన మూల గ్రీకు భాషలో, “అద్భుతం” కొరకు ఉపయోగించబడిన పదం డైనామిస్, ఆ పదానికి “శక్తి” అన్నది మూల భావం. అది “శక్తివంతమైన పనులు” లేక “సామర్థ్యం” అని కూడా అనువదించబడింది. (లూకా 6:19; 1 కొరింథీయులు 12:10; మత్తయి 25:15) యేసు చేసిన అద్భుతాలు “దేవుని మహాత్మ్యము” యొక్క వ్యక్తీకరణలని బైబిలు చెబుతుంది. (లూకా 9:43) ‘అధికశక్తి మరియు బలాతిశయము’గల సర్వశక్తిమంతుడైన దేవునికి అలాంటి పనులు అసాధ్యమా?—యెషయా 40:26.
ప్రామాణికత్వానికి రుజువు
నాలుగు సువార్తలను క్షుణ్ణంగా పరీక్షించడం వాటి నమ్మకత్వాన్ని గూర్చిన మరింత రుజువునిస్తుంది. గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈ వృత్తాంతాలు పిట్టకథలు లేక పురాణాలు వంటివాటి నుండి పూర్తిగా వేరు. ఉదాహరణకు, యేసు మరణించిన తర్వాతి శతాబ్దాలలో ఆయన గురించి వ్యాప్తి చెందిన అబద్ధ కథలను పరిశీలించండి. అప్రమాణికమైన “గాస్పల్ ఆఫ్ థామస్” ఇలా తెలియజేస్తుంది: “బాలుడైన యేసు ఐదు సంవత్సరాల వాడైవున్నప్పుడు . . . ఆయన ఒక గ్రామం గుండా వెళ్తుండగా, ఒక పిల్లవాడు పరుగెత్తుతూవచ్చి ఆయన భుజానికి గుద్దుకున్నాడు. యేసు ఆగ్రహం తెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు: ‘నీవు నీ మార్గాన ముందుకు వెళ్లలేవు,’ వెంటనే ఆ పిల్లవాడు క్రింద పడిపోయి, మరణించాడు.” ఈ కథ ఎలాంటిదో—ఎంత ఊహా కల్పితమైనదో గమనించడం కష్టమేమికాదు. అంతేగాక, ఇక్కడ వర్ణించబడిన చపలచిత్తమైన, నీచస్వభావంగల బాలుడు, బైబిలునందలి యేసుతో ఏ విధమైన సారూప్యం కలిగిలేడు.—లూకా 2:51, 52 వ్యత్యాసం చూడండి.
ఇప్పుడు ప్రామాణిక సువార్త వృత్తాంతాలను గమనించండి. వాటిలో అతిశయోక్తి, ఊహాకల్పనలు ఎంతమాత్రం లేవు. యేసు కేవలం చాపల్యాన్ని తృప్తిపర్చడానికి కాదుగాని, నిజంగా అవసరాన్ని తీర్చడానికి అద్భుతాలు చేశాడు. (మార్కు 10:46-52) తన స్వప్రయోజనార్థమై యేసు ఎన్నడూ తన శక్తులను ఉపయోగించుకోలేదు. (మత్తయి 4:2-4) గొప్పలు చూపించుకోడానికి ఆయన వాటిని ఎన్నడూ ఉపయోగించుకోలేదు. వాస్తవానికి, ఉత్సుకతగల హేరోదు రాజు తన కొరకు అద్భుతమైన “సూచన” చేయమని యేసును కోరినప్పుడు, యేసు అతనికి “ఉత్తరమేమియు ఇయ్యలేదు.”—లూకా 23:8, 9.
వృత్తిరీత్యా మోసగాళ్లు, మంత్రగాళ్లు మరియు విశ్వాస స్వస్థతలు చేసేవారి (ఫెయిత్ హీలర్స్) పనులకు, యేసు చేసిన అద్భుతాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయన శక్తివంతమైన పనులు ఎల్లప్పుడూ దేవున్ని మహిమపర్చాయి. (యోహాను 9:3; 11:1-4) ఆయన చేసిన అద్భుతాల్లో భావోద్రేకాచారాలు, మంత్రోచ్ఛారణలు, గొప్ప కొరకు చేసే క్రియలు, మోసం, లేక హిప్నాటిజం వంటివి లేవు. ‘బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుమని’ కేకలు వేసిన బర్తిమయి అనే ఒక గ్రుడ్డి భిక్షగాడు యేసుకు తారసిల్లినప్పుడు యేసు అతనితో కేవలం ఇలా చెప్పాడు: “నీవు వెళ్లుము; నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. వెంటనే వాడు . . . చూపుపొంది వెళ్లెను.”—మార్కు 10:46-52.
యేసు తాను చేసిన శక్తివంతమైన పనులను ఏ పరికరాలు లేకుండా చేశాడని, ప్రాముఖ్యంగా అవి ముందే పథకం వేసుకుని ప్రదర్శించినవి లేక కుయుక్తితో చేసినవి కావని సువార్త వృత్తాంతాలు చూపిస్తున్నాయి. అవి బహిరంగంగా, తరచూ అనేకమంది ప్రత్యక్షసాక్షుల యెదుట చేయబడ్డాయి. (మార్కు 5:24-29; లూకా 7:11-15) ఆధునిక విశ్వాస స్వస్థపర్చేవారి (ఫెయిత్ హీలర్స్) ప్రయత్నాల వలె, బహుశా రోగగ్రస్థమైన వ్యక్తిలో విశ్వాసం లోపించడం వల్ల, స్వస్థపర్చాలన్న ఆయన ప్రయత్నాలు ఎన్నడూ విఫలం కాలేదు. మత్తయి 8:17 ఇలా చెబుతుంది: “ఆయన . . . రోగులనెల్లను స్వస్థపరచెను.”
క్రీస్తు చేసిన అద్భుతాల గురించి, “మెనీ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్:” ది ఎవిడెన్సస్ ఆఫ్ క్రిస్టియానిటి అనే తన పుస్తకంలో పండితుడైన ఆర్తర్ పీయర్సన్ ఇలా చెబుతున్నాడు: “వాటి సంఖ్య, ఆయన చేసిన స్వస్థతల యొక్క తక్షణ మరియు పూర్ణ గుణం, చనిపోయినవారిని లేపే ప్రయత్నంలో కూడా ఒక్కసారి కూడా అపజయం కలుగకపోవడం వంటివాటిని బట్టి ఈ కాలంలో మరియు ఏ కాలాల్లోనైనా అద్భుతాలని పరిగణింపబడుతున్న వాటికి ఈ అద్భుతాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.”
లౌకిక రుజువు
పీయర్సన్ ఇలా చెప్పడం ద్వారా సువార్త వృత్తాంతాలను సమర్థించే మరో వాదనను అందజేస్తున్నాడు: “లేఖనాలలోని అద్భుతాలను ధృవీకరించే విషయంలో శత్రువుల నిశ్శబ్దం కంటే చెప్పుకోదగినది మరొకటి లేదు.” యేసును అపఖ్యాతిపాలు చెయ్యాలని యూదా మతనాయకులు ఎంతగానో కోరుకున్నారు, కాని వ్యతిరేకులు వాటిని నిరాకరించలేనంతగా ఆయన చేసిన అద్భుతాలు ప్రఖ్యాతి గాంచాయి. వాళ్లు చేయగలిగినదేమిటంటే, ఆయన చేసిన వాటిని దయ్యాల శక్తితో చేసినవని మాత్రం ఆరోపించగల్గారు. (మత్తయి 12:22-24) యేసు మరణించిన శతాబ్దాల తర్వాత, యేసుకు అద్భుతమైన శక్తులున్నాయని యూదా టాల్ముడ్ రచయితలు అంగీకరించారు. జూవీష్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ జీసస్ అనే పుస్తకం ప్రకారం, వారు ఆయనను “మాంత్రిక ఆచారాలను పాటించినవాడని” నిరాకరించారు. యేసు చేసిన అద్భుతాలను కేవలం కట్టుకథలని తీసివేయగల స్వల్పమైన అవకాశం ఉన్నా అలాంటి వ్యాఖ్యానం చేయబడి ఉండేదా?
తర్వాతి సాక్ష్యం నాలుగవ శతాబ్దపు చర్చి చరిత్రకారుడైన యూసిబ్యస్ నుండి వస్తుంది. ది హిస్టరీ ఆఫ్ ది చర్చ్ ఫ్రమ్ క్రైస్ట్ టు కాన్స్టాన్టైన్ అనే తన పుస్తకంలో, క్రైస్తవత్వాన్ని సమర్థిస్తూ చక్రవర్తికి ఒక లేఖ పంపిన క్వాడ్రాటస్ గురించి ఆయన చెబుతున్నాడు. క్వాడ్రాటస్ ఇలా వ్రాశాడు: “మన రక్షకుని చర్యలు ఎల్లప్పుడూ గమనించదగినవి, ఎందుకంటే అవి నిజమైనవి—స్వస్థత నొందినవారు మరియు మృతులలో నుండి లేపబడినవారు కేవలం స్వస్థత పొందినప్పుడు లేక లేపబడినప్పుడు మాత్రమే కాదుగాని, వారు ఎల్లప్పుడూ అంటే, రక్షకుడు మా మధ్య ఉన్నప్పుడే కాదుగాని, ఆయన వెళ్లిపోయిన చాలాకాలం తర్వాత కూడా కనిపించేవారు; వాస్తవానికి కొంతమంది నా స్వంత జీవితకాలం వరకు కూడా జీవించివున్నారు.” పండితుడైన విలియమ్ బార్క్లే ఇలా చెప్పాడు: “ఎవరిపైన అద్భుతాలు చేయబడ్డాయో వారు తన స్వంత జీవిత కాలం వరకు కూడా రుజువునివ్వగలిగేలా నిజంగా జీవించివున్నారని క్వాడ్రాటస్ చెబుతున్నాడు. అది నిజం కాకపోయినట్లయితే, దానికి అబద్ధమని ముద్ర వేయడం రోమా ప్రభుత్వానికి ఏ మాత్రం కష్టమైవుండేది కాదు.”
యేసు చేసిన అద్భుతాలందు విశ్వాసముంచడం కారణసహితమైనది, న్యాయమైనది, సాక్ష్యాధారానికి పూర్తిగా అనుగుణ్యమైనది. అయినప్పటికీ, యేసు చేసిన అద్భుతాలు కేవలం మృతమైన చరిత్రకాదు. హెబ్రీయులు 13:8 మనకిలా గుర్తుచేస్తుంది: “యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.” అవును, ఆయన మానవునిగా భూమి మీద ఉన్నప్పటికంటే మరింత ఎక్కువగా అద్భుతమైన శక్తులను ఉపయోగించ గలిగేలా ఆయన నేడు పరలోకంలో సజీవంగా ఉన్నాడు. అంతేగాక, ఆయన చేసిన అద్భుతాలను గూర్చిన సువార్త వృత్తాంతాలు (1) నేడు క్రైస్తవులకు ఆచరణయోగ్యమైన పాఠాలను నేర్పుతాయి, (2) యేసు వ్యక్తిత్వాన్ని గూర్చి ఆశ్చర్యకరమైన అంశాలను తెలియజేస్తాయి, మరియు (3) మరింత విశేషమైన సంఘటనలు జరుగబోయే సమీప భవిష్యత్తులోని ఒక సమయానికి శ్రద్ధను మళ్లిస్తాయి!
ఈ విషయాలను వివరించడానికి తరువాతి శీర్షిక మూడు పేరుగాంచిన బైబిలు వృత్తాంతాలపై శ్రద్ధ నిలుపుతుంది.