క్రిస్టమస్—నిజంగా క్రైస్తవత్వానికి సంబంధించినదేనా?
ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా ప్రకారం, “యేసుక్రీస్తు జన్మదిన ఆచరణగా క్రైస్తవులు జరుపుకునే రోజే క్రిస్టమస్.” అయినప్పటికీ, ఆ ఎన్సైక్లోపీడియా యింకా యిలా కూడా చెబుతోంది: “తొలి క్రైస్తవులు [యేసు] జన్మదిన ఆచరణను ఆచరించలేదు ఎందుకంటే ఎవరి జన్మదినాన్నైనా ఆచరించడాన్ని అన్యమత ఆచారంగానే వారు పరిగణించేవారు.”
గాల్బే మరియు పర్డ్యూ రచించిన ది మేకింగ్ ఆఫ్ ది మోడ్రన్ క్రిస్టమస్ యిలా అంగీకరిస్తుంది: “తొలి క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని ఆచరించలేదు. జన్మదినాలు అన్యమత ఆచారాలతో సంబంధాన్ని కల్గివున్నాయి; క్రీస్తు జననాన్ని గూర్చిన అసలు తేదీ విషయంలో సువార్తలు ఏమీ చెప్పడం లేదు.”
జన్మదిన వేడుకలకు క్రైస్తవ ఆధారం లేకపోతే, క్రీస్తు జన్మదినం అతి ప్రాముఖ్యమైన ఒక “క్రైస్తవ” పండుగగా ఎలా తయారైంది?
“క్రిస్టమస్” అన్యమతారంభము
“ప్రతి ఒక్కరూ వేడుక జరుపుకుంటు ఆనందించారు, పని, వ్యాపారం కొంత కాలం కొరకు పూర్తిగా ఆపివేశారు, యిళ్లను పచ్చ తోరణాలతోనూ ఎవర్గ్రీన్ మొక్కతోనూ అలంకరించి, స్నేహితుల నడుమ బహుమానాలను పంచుకుంటూ ఒకరినొకరు సందర్శించుకుంటున్నారు, అంతేకాకుండ ఖాతాదార్లు తమ యజమానులకు బహుమతులను అందించారు. ఆ రోజులన్ని ఆనందం, సద్భావనలతో కూడినవై ప్రజలు అన్ని విధాలైన వినోదాల్లో పాల్గొన్నారు.”—జె. ఎమ్. వీలర్ రాసిన పేగనిజమ్ యిన్ క్రిస్టియన్ ఫెస్టివల్స్.
ఈ వర్ణన మీకు తెలిసిన క్రిస్టమస్ ఉత్సవ పద్ధతులకు సరిపోయిందా? ఆశ్చర్యకరంగా అది క్రిస్టమస్ కాదు! బదులుగా, అది సాటర్నాలియా వర్ణనయే—దక్షిణాయనానికి (ఎదుటి పేజీలో చూపించినట్లుగా) సంబంధించిన ఒక వారం పొడుగునా జరిగే ఒక రోమా అన్యమత ఉత్సవం. అజేయుడైన సూర్యుని జన్మదినాన్ని, రోమా మిత్రైక్ మతానికి ప్రాముఖ్య ఉత్సవ దినమైన డిశంబరు 25 నాడు జరుపుకునేవారు.
ది న్యూ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం, “వెలుగు దేవుడైన మిత్రా జన్మదినమైన డిశంబరు 25, . . . అజేయుడైన సూర్యునికి అంకితం చేయబడింది అలాగే సాటర్నాలియా తర్వాతి రోజునూ, ఈ వేడుకల ప్రభావాన్ని త్రిప్పికొట్టేందుకు, చర్చి వాటిని క్రీస్తు జననముతో సంబంధించివున్న క్రిస్టమస్గా గైకొన్నది.” కనుక కేవలం పేర్లు, మిత్రా నుంచి క్రీస్తుకు మారడంతో అన్యమతపు జన్మదిన వేడుక కొనసాగింది.
అయితే, దేవుని కుమారుడైన యేసు జన్మదినానికి మాత్రం ఏదో విశేషమైన ప్రత్యేకత ఉంది, అది గుర్తుంచుకోదగినది అని మీరు భావించవచ్చు. దీన్ని గూర్చి బైబిలు ఏమి చెబుతుందో గమనించడం జ్ఞానోదయం కల్గించేదిగా నిరూపించబడగలదు.
ఆనందమయ సంఘటన
లూకా సువార్త రెండవ అధ్యాయం దానికవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. పరలోక దూతలు, వినయులైన కాపరులు, దేవుని భక్తిపరులైన సేవకులూ మరియు మరియ సహితం ఈ ప్రాముఖ్యమైన సంఘటనకు ఎలా ప్రతిస్పందించారో లూకా మనకు చెబుతున్నాడు.
“గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొను”చున్నారు, అదే శీతాకాలం నడిమిలోనైతే వారు దాన్ని చేయరని మొదట గమనించండి. “ప్రభువు [యెహోవా] దూత” కనిపించి, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు, మొదట వారు భయపడ్డారు. దూత యిలా వివరించినప్పుడు వారు అభయాన్ని పొందారు: “భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు.” దేవదూతల “పరలోక సైన్య సమూహము” అకస్మాత్తుగా కనిపించినప్పుడు, ఈ జననము యితర వాటన్నిటికంటే ఎంతో భిన్నమైనదనే విషయాన్ని కాపరులు తెలుసుకున్నారు. ఆసక్తికరంగా, నవజాత శిశువుకు దూతలు ఏ బహుమతులనూ తీసుకురాలేదు. బదులుగా, యిలా అంటూ దూతలు యెహోవాను స్తుతించారు: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.”—లూకా 2:8-14.
సహజంగా, కాపరులు ఆ బిడ్డను స్వయంగా చూడాలనుకున్నారు, ఎందుకంటే ఆ ఆనందమయ సంఘటనను ప్రకటించింది యెహోవాయే. తొట్టిలో పడుకుని ఉన్న వానిని చూసినప్పుడు, దూతలు చెప్పినవాటిని ఆయన తలిదండ్రులకు చెప్పారు. ఆ తర్వాత పిల్లవాన్ని కాకుండ, “దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు” కాపరులు వెళ్లిపోయారు.—లూకా 2:15-18, 20.
యేసు తల్లియైన మరియ, తన తొలి సంతానాన్ని క్షేమంగా కనినందుకు ఎంతో ఆనందించి ఉంటుందనడంలో సందేహం లేదు. కానీ ఆమె “తన హృదయములో భద్రముచేసుకొనెను.” అప్పుడు, మోషే ధర్మశాస్త్రానికి లోబడి తన భర్తైన యోసేపుతో యెరూషలేముకు వెళ్లింది. అది జన్మదిన వేడుక కాదు. బదులుగా, “ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమున వ్రాయబడినట్టు,” అది ఆ శిశువును దేవునికి ప్రతిష్ఠ చేసే సమయము.—లూకా 2:19, 22-24.
యెరూషలేము ఆలయం వద్ద, మరియ యోసేపులు సుమెయోనును కలుసుకుంటారు, ఆయన “నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు” అని ఆయన్ను లూకా వర్ణిస్తున్నాడు. దైవావేశంవల్ల, “ప్రభువు యొక్క క్రీస్తును” చూడకుండా ఆయన మరణించడని ఆయనతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగింది కూడా ‘[దేవుని] ఆత్మవశమున’ జరిగింది. సుమెయోను ఆ బాలుని తన చేతిలోకి తీసుకున్నాడు, అతనికి బహుమతినిచ్చేందుకు కాదు, దేవుని స్తుతించేందుకే తీసుకున్నాడు, ఆయన యిలా అన్నాడు: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.”—లూకా 2:25-32.
తర్వాత, వృద్ధ ప్రవక్త్రినియైన అన్న సమీపించింది. ఆమె కూడా, “దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.”—లూకా 2:36-38.
మరియ, సుమెయోను, అన్న, కాపరులు అలాగే పరలోక దూతలు యేసు జన్మించిన సందర్భంగా అందరూ ఆనందించారు. అయితే, వారు ఏ జన్మదిన వేడుకలోను పాల్గొనలేదని, లేక బహుమతులివ్వడంలోనూ పాల్గొనలేదని దయచేసి గమనించండి. బదులుగా, వారు తమకు రక్షణననుగ్రహించే పరలోక మందలి యెహోవాను ఘనపర్చారు.
అయినా, ‘క్రిస్టమస్ నాడు బహుమతులివ్వడం కచ్చితంగా తప్పుకాదు, ఎందుకంటే “ముగ్గురు జ్ఞానులు” యేసును బహుమతులతో గౌరవించారు కదా? అని కొందరు తర్కించవచ్చు.
క్రిస్టమస్ బహుమతులు
మరలా బైబిలు వృత్తాంతాన్ని మనం పరిశీలిద్దాం. అది మత్తయి 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లు మీరు చూస్తారు. ఏ జన్మదిన వేడుకను గూర్చి ఏమీ ప్రస్తావించబడలేదు, లేక అది యేసు పుట్టిన కొంత కాలానికి జరిగినప్పటికీ నిర్దిష్టమైన సమయం యివ్వబడలేదు. మత్తయి, మొదటి వచనంలో ఆ సందర్శకులను “తూర్పు దేశపు జ్యోతిష్కులు [గ్రీకులో, మాగోయి]” [NW] అని పిలిచాడు, అంటే యెహోవా దేవున్ని గూర్చి అసలు ఏమీ తెలియనివారు. ఈ వ్యక్తులు అనుసరించిన నక్షత్రం వారిని నేరుగా యేసు జన్మస్థలానికి తీసుకెళ్లలేదుగానీ రాజైన హేరోదు పరిపాలిస్తున్న యెరూషలేముకు తీసుకెళ్లింది.
వారు “యూదుల రాజుగా పుట్టిన” వానిని గూర్చి ప్రశ్నించడం విని ఈ దుష్ట పాలకుడు ఆ పిల్లవాన్ని చంపించేందుకుగాను, “క్రీస్తు ఎక్కడ పుట్టు”ననే నిర్దిష్టమైన స్థలాన్ని తెలుసుకునేందుకు యాజకులను సంప్రదించాడు. ఆ యాజకులు మీకా ప్రవచనాన్ని ఎత్తి చూపుతూ మెస్సీయా జన్మించినస్థలం బేత్లెహేమని జవాబు చెప్పారు. (మీకా 5:2) హేరోదు వేషధారణతో తన సందర్శకులకు యిలా ఆదేశించాడు: ‘మీరు వెళ్లి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసికొనగానే, నేనును వచ్చి, ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండు.’ ఆ జ్యోతిష్కులు తమ దారిన వెళ్లారు, మరి ఆ నక్షత్రం “ఆ బాలుడు (NW) ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను.” ఆయనను “బాలుడు” అనే గానీ నవజాత శిశువుగా వర్ణించబడలేదని గమనించండి.—మత్తయి 2:1-10.
ఒక పాలకుని సందర్శించేటప్పుడు, తూర్పు దేశపు ప్రముఖులు చేసేటట్లుగానే అన్యమత జ్యోతిష్కులు సాగిలపడి, “బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు [ఆ బాలునికి] సమర్పించిరి.” మత్తయి యింకా యిలా చెప్పాడు: “తరువాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లిరి.”—మత్తయి 2:11, 12.
ఈ క్లుప్తమైన లేఖన వృత్తాంతం నుండి, తాము క్రిస్టమస్ బహుమానాలను యివ్వడానికి కొందరు మద్దతును వెదికేందుకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ, యిప్పుడు ప్రచారంలోవున్న బహుమతులిచ్చుకోవడం, పేదవారైన తమ పొరుగువారికి సాటర్నాలియా బహుమతులను అందించడంపై ఆధారపడివుందని డిస్కవరింగ్ క్రిస్టమస్ కస్టమ్స్ అండ్ ఫోక్లోర్ వివరించింది. “తొలి చర్చి . . . తెలివిగా దీని భావాన్ని జ్ఞానులందించిన బహుమతుల ఆచార అలవాటుకు మార్చేసింది.” యేసు జన్మించినప్పుడు కేవలం దేవున్ని స్తుతించిన దీనులైన కాపరుల వంటి నిజమైన ఆరాధికులకు యిది ఎంత భిన్నంగా ఉంది!
క్రీస్తును రాజుగా గౌరవించండి!
నేడు యేసు యింకా శిశువుగా లేడు. ఆయన శక్తిమంతుడైన సర్వాధిపతి, దేవుని పరలోక రాజ్యమునకు రాజు, మరి ఆయనను అలాగే గౌరవించాలి.—1 తిమోతి 6:15, 16.
ఇప్పుడు మీరు పెద్దవాళ్లైతే, మీ సమక్షంలో మీ పసితనంలోని ఫోటోలను ప్రజలు చూపించినప్పుడు మీకు యిబ్బందిగా అనిపించిందా? నిజమే, అలాంటి ఫోటోలు మీరు జన్మించినప్పుడు మీ తలిదండ్రులు పొందిన ఆనందాన్ని అది వారికి గుర్తుచేస్తుంది. అయితే యిప్పుడు, మీకు మీ స్వంత గుర్తింపు ఉంది కనుక మీరెలా ఉన్నారో ఆ విధంగా యితరులు మిమ్మల్ని దృష్టించాలని మీరు సామాన్యంగా కోరుకోరా? అదే విధంగా, క్రీస్తు యేసు అనుచరులని చెప్పుకుంటున్నవారు, క్రిస్టమస్‌కు సంబంధించిన అన్యమత ఆచారాల్లోనూ, శిశువుగా ఆయన్ను గౌరవించడంలోను ప్రతి సంవత్సరం నిమగ్నమైపోయినప్పుడు, వారు రాజుగా ఆయనను గౌరవించడంలో విఫలులవ్వడం ఎంత అగౌరవంగా ఉంటుంది. అంతెందుకు, యిప్పుడు క్రీస్తు ఉన్న విధంగా—పరలోకమందు రాజుగా ఉన్నట్లే తలంచడం విషయంలోని ఔచిత్యంపై మొదటి శతాబ్దంలోనూ క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తర్కించాడు. పౌలు యిలా రాశాడు: “మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు ఎరుగము!”—2 కొరింథీయులు 5:16.
దేవుని రాజ్యపు రాజుగా క్రీస్తు, వేదన, బాధలు, రోగం, మరణాలను తీసివేస్తానన్న ప్రవచనార్థకమైన వాగ్దానాన్ని త్వరలోనే నెరవేరుస్తాడు. భూమిపై పరదైసు పరిస్థితుల్లో అందరికీ సరైన యిళ్లనూ ప్రతిఫలదాయకమైన పనిని తప్పక యిచ్చేది ఆయనే. (యెషయా 65:21-23; లూకా 23:43; 2 కొరింథీయులు 1:20; ప్రకటన 21:3, 4) తప్పకుండా, యేసును అగౌరవపర్చకుండా ఉండేందుకు ఈ కారణాలు సరిపోతాయి!
క్రీస్తు స్వంత మాదిరిని అనుసరించడం ద్వారా నిజమైన క్రైస్తవులు తమ పొరుగువారికి ఎవ్వరూ యివ్వలేని గొప్ప బహుమతుల్లో ఒకదాన్ని యివ్వగలరు—అదే నిత్యజీవానికి నడిపించగల దేవుని సంకల్పాలను గూర్చిన గ్రహింపు. (యోహాను 17:3) యేసు చెప్పినట్లుగా ఈ విధంగా బహుమతులను యివ్వడం ఎంతో ఆనందాన్ని తెస్తుంది. ఆయన యిలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటే ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35; లూకా 11:27, 28.
ఒకరి యెడల ఒకరికి యథార్థమైన ఆసక్తి గల క్రైస్తవులకు సంవత్సరంలో ఏ సమయంలోనైనా ప్రేమను వ్యక్తపర్చడం ఎంతమాత్రం కష్టం అనిపించదు. (ఫిలిప్పీయులు 2:3, 4) ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, బైబిలు ప్రసంగాన్ని విన్న తర్వాత కృతజ్ఞతా భావంతో వేసిన బొమ్మను ఒక యౌవనుని నుండి పొందడం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది! తన ప్రేమకు చిహ్నమైన బహుమతిని ఒక బంధువు నుండి అనుకోకుండా అందుకోవడం కూడా అంతే ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదే విధంగా, తమ పిల్లలకు సంవత్సరమంతటిలో సముచిత సందర్భాలనెన్నుకుని బహుమతులను యివ్వడం ద్వారా క్రైస్తవ తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని పొందగలరు. ఈ విధమైన క్రైస్తవ ఉదారత, ఏ ఉత్సవ దినాలు లేక అన్యమత ఆచారాల వల్ల వస్తుందనిపించే బాధ్యత ద్వారా చెక్కుచెదరదు.
తత్ఫలితంగా, నేడు అన్ని దేశాల్లోని 45 లక్షల కంటే ఎక్కువమంది క్రైస్తవులు క్రిస్టమస్‌ను జరుపుకోరు. వారు, దేవుని రాజ్య సువార్తను తమ పొరుగువారికి అందించడంలో తరచూ తీరికలేకుండా ఉండే యెహోవాసాక్షులు. (మత్తయి 24:14) బహుశ త్వరలోనే వారు మీ యింటిని సందర్శించినప్పుడు మీరు వారిని కలవగలరు. వారు తెచ్చే వాటి విషయంలో కుతూహలంతో కూడిన మీ ప్రతిస్పందన, సంవత్సరంలోని ప్రతి రోజూ దేవున్ని స్తుతించడం ఎలాగో మీరు నేర్చుకుంటుండగా, మీ కుటుంబాన్ని గొప్ప ఆనందానికి నడిపిస్తుందని మేము అపేక్షిస్తున్నాము.—కీర్తన 145:1, 2.
[7వ పేజీలోని చిత్రం]
ఇవ్వగల్గినవాటిలో అతి గొప్ప బహుమతిని క్రైస్తవులు తమ పొరుగువారికి అందించగలరు—అదే నిత్యజీవానికి నడిపించే దేవుని సంకల్పాలను గూర్చిన గ్రహింపు
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
Culver Pictures