‘ఆయన క్రియలు ఆయన్ను వెంబడిస్తాయి’
జూలై 28, 1994 గురువారం ఉదయం 8:50 నిమిషాలకు జార్జి డి. గాంగస్ తన భూజీవితాన్ని చాలించారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. అభిషక్తుల్లో ఒకరైన జార్జి గాంగస్, అక్టోబరు 15, 1971 నుండి యెహోవాసాక్షుల పరిపాలక సభలో సభ్యునిగా పనిచేశారు.
సహోదరుడైన గాంగస్ వ్యక్తిగతంగా పరిచయమున్న వారికి, నీతి యెడల ఆయనకు గల ప్రేమను గూర్చి, దుష్టత యెడల ఆయన ద్వేషాన్ని గూర్చి తెలుసు. సాతానును నీచమైన, వికృతమైన, దుష్టమైన, తుచ్ఛమైన మరియు హేయమైన అబద్ధికుడని ఆయన అనేక సార్లు వర్ణించినట్లు వారికి బాగా జ్ఞాపకముంది. దానికి భిన్నంగా, యెహోవా ప్రేమ, దయ, కనికరం, వాత్సల్యం, మరియు శ్రద్ధగల తండ్రి అని ఆయన్ను గూర్చి మాట్లాడారు. బైబిలు ప్రశ్నలను అడిగే ఆయన మక్కువను గూర్చి కూడా అనేకులకు జ్ఞాపకముంది. ఏ సంభాషణలోనైనా, ఆయన తప్పకుండా ప్రశ్నలు వేస్తారు—కొన్ని సులభమైనవైతే, కొన్ని మెదడుకు పనిపెట్టవల్సినవి. ఆయన నిజంగా బైబిలు సత్యాలను ప్రేమించేవారు.
సహోదరుడైన గాంగస్ జూలై 15, 1921లో బాప్తిస్మం పొందారు. ఆయన తన పూర్తికాల పరిచర్యను (పూర్తికాలసేవను) 1928 మార్చిలో ప్రారంభించాడు. ఆ విధంగా ఆయన పూర్తికాల సేవలో 66 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆయన అక్టోబరు 31, 1928 నందు వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి వారి బ్రూక్లిన్ ముఖ్యకార్యాలయ సిబ్బందిలో సభ్యుడయ్యాడు.
ఆయన జీవిత చరిత్ర 1966 అక్టోబరు 15 కావలికోటలో (ఆంగ్లం) వెలువడింది. అది దేవుని ఆత్మీయ వ్యక్తిని నిజంగా వర్ణిస్తుంది. ఆ శీర్షికలో, ఆయన ఈ హృదయానందకరమైన మాటలను చెప్పాడు: “నేను జీవాన్ని ప్రేమిస్తున్నాను, మరి నా సహోదరులు జీవాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అపొస్తలుడైన పౌలుతో ఏకీభవిస్తూ ‘క్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై’ యితర సమస్త విషయములన్ని నష్టముగా ఎంచుచున్నాను.”—ఫిలిప్పీయులు 3:8.
సహోదరుడైన గాంగస్ తన క్రియల ద్వారా జీవితాన్ని నిజంగా ప్రేమించాడని కనపర్చారు, అంతేకాకుండా ఆయన ఆసక్తితో తనకు గల “క్రీస్తునుగూర్చిన జ్ఞానాన్ని” యితరులతో పంచుకున్నారు. ఆయన లేని లోటు తీరదు, అయితే ఆయన తన పరలోక బహుమానాన్ని పొందినందుకు మనం ఆనందిస్తున్నాము! ఇప్పుడు, ‘ఆయన తన ప్రయాసములు మాని విశ్రాంతి పొందెను; ఆయన క్రియలు ఆయన వెంట పోవును.’—ప్రకటన 14:13, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్.