గుర్తింపు ద్వారా ఒక ప్రాథమిక మానవ అవసరతను తీర్చుట
“బాగా చేశావు!” “నీవు చేసిన దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను!” లేక “నీవు శ్రేష్టమైనది చేశావు; నీ గురించి మేము గర్విస్తున్నాము!” వంటి యథార్థమైన మెప్పు, ప్రాముఖ్యంగా మనం గౌరవించే వారి నుండి వచ్చినప్పుడు మన ఆత్మగౌరవాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గుర్తింపబడాలని మానవులు ఎంతగానో కోరుకుంటారు, దానివల్ల వారు యింకా బాగా చేయగలుగుతారు, ఎంతో ఆనందిస్తారు. వాస్తవానికి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మనస్సుకు హృదయానికి తగిన గుర్తింపు అంత ప్రాముఖ్యం.
గుర్తింపును ఒక నిఘంటువు “ఒక వ్యక్తి ఆలోచన లేక శ్రద్ధ మరియు ప్రత్యేకమైన గమనింపు లేక శ్రద్ధ పొందుటకు అర్హుడని అంగీకరించుట” అని నిర్వచించింది. అది ఒక వ్యక్తి యొక్క సహేతుకమైన గౌరవాన్ని లేక విలువను, ఆయన పొందవలసిన గుర్తింపును సూచించే మర్యాద మరియు గౌరవ భావాలతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంది.
గుర్తింపు—ఒక ప్రాథమిక అవసరత
గౌరవం యివ్వవలసిన చోట గౌరవమివ్వడం కారణసహితమైనది, తగినది. తమ యజమాని తన ఆస్తినంతటిని అప్పగించి వెళ్లిన దాసులను గూర్చిన ఉపమానములో యేసు ఈ మాదిరిని చూపించాడు. తను యిచ్చి వెళ్లినవాటిని సరైన విధంగా నిర్వహించిన వాన్ని గుర్తిస్తూ, ఆయనిలా అన్నాడు: “భళా, నమ్మకమైన మంచి దాసుడా!” (మత్తయి 25:19-23) అయితే తరచుగా, ఈ తగిన మర్యాద నిర్లక్ష్యం చేయబడుతుంది. గుర్తింపును యివ్వలేకపోవడం ఉత్సాహాన్ని, చొరవను తగ్గిస్తుంది. దాన్ని లోనా యిలా చెబుతుంది: “గుర్తింపు మీరు అవసరమైన వారని, కావలసిన వారని, మెచ్చుకొనబడుతున్నట్లు భావించేలా చేస్తుంది . . . అది మీకు చొరవను కలుగజేస్తుంది. మీరు అలక్ష్యం చేయబడినట్లయితే, మీరు నిరుత్సాహంగా, ఆశాభంగం చెందినట్లు భావిస్తారు.” పాట్రిక్ యింకా యిలా చెబుతున్నాడు: “అప్పుడు శ్రేష్ఠమైన నాణ్యతను కలిగివుండడం, శ్రేష్ఠమైన పనిని చేయడం కష్టమౌతుంది.” గనుక, ఎలా, ఎప్పుడు గుర్తింపు నివ్వాలనేది మనం తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. మనం యితరులచేత అంగీకరింపబడ్డామని తెలుసుకోవడం వల్ల కలిగే భద్రత కావాలని మనమందరం కోరుకుంటాము. అది ఒక ప్రాథమిక మానవ అవసరత.
మెప్పుతో కూడిన ఒకమాట, అధికం చేయబడిన బాధ్యత, లేక ఒక వస్తు సంబంధ బహుమానం వంటివి, మీరు మీకు చేతనైన శ్రేష్ఠమైనది చేయడంలో కొనసాగేలా మిమ్మల్ని పురికొల్పుతాయి. మీరు తల్లి లేక తండ్రి, భర్త, భార్య, పిల్లలు, సంఘ సభ్యులు, లేక అధ్యక్షులు, ఎవరైనప్పటికీ యిది నిజం. మార్గరేట్ యిలా చెబుతుంది: “గుర్తింపు పొందినప్పుడు, నేను సంతోషంగా, అవసరమైనదాన్నన్నట్లు భావిస్తాను, నాకు యింకా మంచిగా చేయాలనే కోరిక వుంటుంది.” యిలా చెబుతూ, ఆండ్రూ దాన్ని ధృవీకరిస్తున్నాడు: “నేను యింకా ఎక్కువ కష్టపడి పనిచేయడానికి ప్రేరణనిస్తూ, నా ఆత్మ ఉప్పొంగిపోతుంది.” అయితే, ఎవరినైనా గుర్తించడానికి, గౌరవించడానికి జాగ్రత్తతో కూడిన తలంపు, మంచి వివేచన అవసరం.
గుర్తింపునివ్వడంలో యెహోవా మాదిరిని అనుకరించండి
ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడంలో ప్రప్రథమమైన ఉదాహరణ యెహోవా దేవుడు. గుర్తింపు పొందదగిన వారిని ఆయన అంగీకరించాడు. హేబెలు, హనోకు, నోవహు వంటి వారిని ఆయన గుర్తించాడు. (ఆదికాండము 4:4; 6:8; యూదా 14) యెహోవా దావీదును అతని విశేషమైన నమ్మకత్వాన్నిబట్టి అంగీకరించాడు. (2 సమూయేలు 7:16) ప్రవక్తగా ఎన్నో సంవత్సరాలు యెహోవాను గౌరవించిన సమూయేలు, బదులుగా, ఫిలిష్తీయులను ఓడించడానికి సహాయం చేయమని సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే సమాధానమివ్వడం ద్వారా ఆయన దేవునిచే గౌరవించబడ్డాడు. (1 సమూయేలు 7:7-13) అలాంటి దైవిక గుర్తింపును పొందడం వల్ల గౌరవించబడినట్లు మీరు భావించరా?
కృతజ్ఞత మరియు మెప్పు గుర్తింపుతో దగ్గరి సంబంధాన్ని కలిగివున్నాయి. ‘కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని,’ మన కొరకు చేయబడినదాన్ని బట్టి కృతజ్ఞత కలిగివుండమని బైబిలు మనల్ని కోరుతుంది. (కొలొస్సయులు 3:15; 1 థెస్సలొనీకయులు 5:18) ఇది ప్రాముఖ్యంగా యెహోవా యెడల కృతజ్ఞత కలిగివుండడానికి అన్వయించినప్పటికీ, అనుదిన జీవిత విషయాల్లో కూడా యిది నిజమే. అపొస్తలుడైన పౌలు దీన్ని మెచ్చుకున్నాడు. ఆయన ఫీబే “అనేకులకు . . . సహాయకురాలై” వుండెనని ఆమెను, తనకొరకు యితరుల కొరకు తమ ‘ప్రాణములను యిచ్చుటకు తెగించి’ నందుకు ప్రిస్కిల్లను, అకులను గుర్తించాడు. (రోమీయులు 16:1-4) అలా బాహాటంగా వ్యక్తపర్చబడిన కృతజ్ఞతను పొందినప్పుడు వారు ఎలా భావించి వుంటారో ఊహించండి. గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం యివ్వడంలోని ఆనందాన్ని పొందడం పౌలుకు కూడా మంచిదే. ఇవ్వవలసిన వారికి తగిన గుర్తింపు యివ్వడం ద్వారా మనం కూడా యెహోవాను మరియు మెచ్చుకొనదగిన ఆయన ఆరాధికులను అనుసరించవచ్చు.—అపొస్తలుల కార్యములు 20:35.
కుటుంబ పరిధిలో గుర్తింపు
భర్త మరియు క్రైస్తవ పెద్ద అయిన మిట్చెల్ యిలా చెబుతున్నాడు: “జీవితాన్ని ఆనందభరితం చేసుకోడానికి కొంచెం గుర్తింపు ఎంతో చేయగలదు. అది, మిమ్మల్ని గుర్తించే వారిని బహుశా ఎప్పటికీ మీకు ప్రియమైనవారినిగా చేస్తుంది.” ఉదాహరణకు, ఒక క్రైస్తవ భర్త బాధ్యతతోకూడిన భారమైన బరువును మోస్తూ, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన ప్రాముఖ్యమైన నిర్ణయాలను చేస్తాడు. ఆయన కుటుంబ ఆత్మీయ, వస్తుదాయక, మానసిక అవసరతల గురించి శ్రద్ధ వహించాలి. (1 తిమోతి 5:8) కుటుంబ శిరస్సుగా ఆయనకు దేవుడిచ్చిన పనిని బట్టి సరైన గుర్తింపు చూపబడినప్పుడు, ఆయన భార్య ‘అపార గౌరవం’ చూపినప్పుడు ఆయన ఎంత కృతజ్ఞత కలిగివుంటాడు!—ఎఫెసీయులు 5:33.
ప్రజలనేకుల దృష్టికి కనబడకుండా జరిగే గృహిణి పనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆధునిక భావాలు అలాంటి పనిని హీనంగా భావించి దాని గౌరవాన్ని, ఔన్నత్యాన్ని తక్కువ చేయవచ్చు. కాని, అది దేవునికి ప్రీతికరమైనది. (తీతు 2:3-5) వివేకంగల భర్త తన భార్యను, ప్రాముఖ్యంగా జీవితంలోని ఏ విషయాలన్నింటిలో ఆమె శ్రేష్ఠంగా వుంటుందో వాటిలో, ఆమెకు తన శిరసత్వం క్రింద అలాంటి గుర్తింపు నివ్వడం ఎంత ఉల్లాసకరంగా వుంటుందో కదా! (సామెతలు 31:28) రొవేనా తన భర్త గురించి యిలా చెబుతుంది: “నేను చేసిన దాన్ని ఆయన గుర్తించినప్పుడు, ఆయనకు లోబడడం, మర్యాదివ్వడం, ఆయనను గౌరవించడం నాకు సులభమౌతుంది.”
అమెరికా విద్యావేత్తయైన క్రిచ్చెన్ బోవ్ ఒకసారిలా చెప్పాడు: “పువ్వులకు సూర్యుడెలాగో, పిల్లలకు న్యాయమైన మెప్పు అటువంటిది.” అవును, చాలా చిన్న బాలునికి కూడా తాను కుటుంబంలోని ఒక విలువైన వ్యక్తినేనని అనిపించేలా ఎడతెగక మెచ్చుకొనబడడం అవసరమౌతుంది. నూతన మానసిక, శారీరక మార్పులతో నిండివున్న రూపాన్ని ఏర్పరచే తొలి యౌవన సంవత్సరాల్లో, స్వేచ్ఛ మరియు గుర్తింపు పొందాలనే కోరికతో పాటు తన స్వంత రూపాన్ని గూర్చి అత్యధిక స్వయం శ్రద్ధ వుంటుంది. ప్రాముఖ్యంగా యీ సమయంలో, ఒక యౌవనుడు తన తల్లిదండ్రులచే ప్రేమించబడాలని, అర్థంచేసుకోబడాలని, మానవ దయతో వ్యవహరించబడాలని కోరుకుంటాడు. వృద్ధులైన తల్లిదండ్రులకు, తాతయ్య అమ్మమ్మలకు కూడా, వారు యింకా అవసరమైన వారని, ప్రేమింపబడుతున్నారని, వారు ‘వృద్ధాప్యమందు విడనాడ’ బడినవారు కాదనే అభయం అవసరమౌతుంది. (కీర్తన 71:9; లేవీయకాండము 19:32; సామెతలు 23:22) గుర్తింపు కావాలనే అవసరతను సరిగా తీర్చినట్లయితే, అది కుటుంబ పరిధిలో అధిక సంతోషాన్ని, సాఫల్యాన్ని కలుగజేస్తుంది.
క్రైస్తవ సంఘములో గుర్తింపు
క్రైస్తవ సంఘంలో యితరుల యెడల యథార్థమైన ఆసక్తి కలిగివుండడాన్ని, వారి పనులు, ప్రయత్నాల గురించి స్వేచ్ఛగా మెప్పును వ్యక్తం చేయడాన్ని పెంపొందించు కోవడంలో ఎంతో విలువుంది. సంఘంలోని యితరుల పనులను, ప్రయత్నాలను బట్టి వారిని గుర్తించడం ద్వారా క్రైస్తవ పెద్దలు నాయకత్వం వహించాలి. మార్గరెట్ యిలా చెబుతుంది: “కాపరి సందర్శనాల సమయంలో నన్ను అనేకసార్లు దర్శించేంత వరకు, ప్రోత్సాహం, సంతృప్తి, సంతోషం వంటివి ఎంత అవసరమో నేను గుర్తించలేకపోయాను. సాధారణ గుర్తింపు యివ్వబడనప్పుడు ఏది పోగొట్టుకొనబడుతుందో నేను గుర్తించాను.” సంఘంలోని అందరి యెడల నిజమైన, ప్రేమపూర్వకమైన వ్యక్తిగత శ్రద్ధను చూపించడానికి అదెంతటి మంచి కారణం! వారి మంచి పనిని గుర్తించండి. ఉదారంగా మెచ్చుకొని, ప్రోత్సహించండి. తమ పిల్లల్లో ఆత్మీయ విలువలను పెంపొందింప చేయడానికి కష్టపడే తల్లులు లేదా తండ్రులు అనేక సంఘాల్లో వున్నారు. అలాంటి వారు ప్రత్యేకమైన మెప్పు పొందదగిన వారు. కోరదగని వాటి కంటే మంచి విషయాలను ఎత్తి చూపించండి. వారి యెడల మీకున్న సహోదరానురాగాన్ని యితరులు చూడనివ్వండి. మీకు శ్రద్ధ వుందని వారు తెలుసుకొనేలా చేయండి. ఈ విధంగా, ప్రేమగల అధ్యక్షులు సంఘాన్ని నిర్మిస్తారు. (2 కొరింథీయులు 10:8) తమకొరకు కష్టపడి పనిచేసే విశ్వాసంగల వారికి తగిన గుర్తింపును, గౌరవాన్ని యివ్వడం ద్వారా సభ్యులు ఒకరికొకరు యిచ్చిపుచ్చుకుంటారు.—1 తిమోతి 5:17; హెబ్రీయులు 13:17.
కాని ఈ విషయానికి మరో వైపు లేక మరో కోణం కూడా వుంది. గుర్తింపు కొరకైన కోరిక ఎంతో బలమైనదన్నది అంగీకరించవలసినదే. యేసు దినాల్లో అది మత నాయకుల్లో మరీ ఎక్కువైంది. ఈ విషయంలో యేసు తన శిష్యుల తప్పుడు దృష్టిని సరిచేయవలసి వచ్చింది. (మార్కు 9:33-37; లూకా 20:46) క్రైస్తవులకు సహేతుకత మరియు సమతుల్యత అవసరం. గుర్తింపు కొరకైన కోరిక అధిగమించ బడకుండా వుంటే అది ఆత్మీయ నాశనాన్ని తీసుకురాగలదు. (యాకోబు 3:14-16) ఉదాహరణకు, ఒక పెద్ద అహంకారంగా తయారై, తన ఉన్నతత్వాన్ని యితరులు అంగీకరించాలని కోరినట్లయితే అది ఎంత దుఃఖకరం కాగలదు!—రోమీయులు 12:3.
రోమ్‌లోని తోటి క్రైస్తవులను అపొస్తలుడైన పౌలు వివేకవంతంగా యిలా హెచ్చరించాడు: “సహోదరప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగలవారై, ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10) ఈ మాటలు ముందుగా, ఎల్లప్పుడు క్రీస్తును సంఘ శిరస్సుగా గుర్తించవలసిన క్రైస్తవ పెద్దలకు వర్తిస్తాయి. పరిశుద్ధాత్మ ద్వారా, బైబిలు సూత్రాల ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” పరిపాలక సభ నాయకత్వం ద్వారా వచ్చే క్రీస్తు నడిపింపును తీసుకోవడం ద్వారా ఆయన నాయకత్వం క్రిందవుండడాన్ని చూపిస్తుంది.—మత్తయి 24:45-47; ప్రకటన 1:16, 20; 2:1 చూడండి.
అలా, పెద్దలు సమావేశమైనప్పుడు, దేవుని మందను కాయడానికి కావలసిన యెహోవా నడిపింపు కొరకు వారు ప్రార్థిస్తారు, లేఖనాధారంగా సరైన నిర్ణయాలు చేయడానికి వారు ప్రయత్నిస్తారు. క్రైస్తవ మర్యాద, దీనత్వం, సాత్వికం వంటివి ఏ పెద్ద అయినా తనను తాను ఉన్నత పర్చుకోకుండా, యితర సహోదరులపై అధికారం చలాయించకుండా, ఈ సమావేశాల్లో తన అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నించకుండా నివారిస్తాయి. (మత్తయి 20:25-27; కొలొస్సయులు 3:12) సాధ్యమైనప్పుడల్లా పెద్దల సభాధ్యక్షుడు తోటి పెద్దలను తమ భావాలు వ్యక్తం చేయమని ముందుగానే కోరుతాడు, కేటాయించబడిన ప్రతి అంశానికి తగిన శ్రద్ధతో కూడిన, ప్రార్థనాపూర్వకమైన తలంపు నివ్వడానికి అనుకూలంగా తగిన సమయం దొరికేలా ముందుగా కార్యక్రమ పట్టికను అందజేస్తాడు. ఆయన పెద్దల సమావేశంలో, పెద్దల అభిప్రాయాన్ని రూపొందించడానికి ప్రయత్నించడు కాని, బదులుగా చర్చించవలసిన అంశాలపై ‘నిస్సంకోచంగా మాట్లాడడానికి’ వారిని ప్రోత్సహిస్తాడు. (1 తిమోతి 3:13) తోటి పెద్దలు ఒకరు వ్యక్తపర్చేదాన్ని మరొకరు జాగ్రత్తగా వినాలి, ఎన్నో సంవత్సరాల క్రైస్తవ అనుభవం గల పెద్దల జ్ఞానం నుండి వారు సంతోషంగా ప్రయోజనం పొందాలి.—నిర్గమకాండము 18:21, 22.
అయితే, ఒక పరిస్థితిని ఎదుర్కోడానికి లేక ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని చేయడానికి అవసరమైన బైబిలు సూత్రాలను అందజేయడానికి పెద్దల సభలోని ఏ పెద్దనైనా క్రీస్తు ఉపయోగించుకోగలడని అధ్యక్షులు అర్థం చేసుకుంటారు. ప్రతి పెద్ద సంఘ ఆత్మీయాసక్తులను గూర్చి శ్రద్ధ వహించడానికి తాను చేసిన దాన్నిబట్టి ఆయనకు తగిన గుర్తింపు నిచ్చినట్లయితే, పెద్దల సభలో మంచి స్ఫూర్తి వుంటుంది.—అపొస్తలుల కార్యములు 15:6-15; ఫిలిప్పీయులు 2:19, 20.
తగిన గుర్తింపును యివ్వడానికి, పొందడానికి ప్రయత్నించండి
గుర్తింపు నిర్మాణాత్మకమైనది. అది ప్రోత్సహిస్తుంది, యిష్టమయ్యేలా చేస్తుంది. మేరి యిలా చెబుతుంది: “మనం కేవలం సామాన్యమైన వారమని మనం భావించినప్పటికీ, మన స్వంత సామర్థ్యం కొరకు మనకు ప్రోత్సాహం అవసరం.” ఇతరుల అనుదిన ప్రయాసలను యథార్థంగా గుర్తించండి. అలా చేయడం వారికి జీవితాన్ని మరింత విలువైనదిగా, ఆనందదాయకమైనదిగా చేస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు, అధ్యక్షులు, క్రైస్తవ సంఘ సభ్యులు, మీరందరూ, మీరెలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్నిబట్టి మీరు గుర్తింపును పొందగలరు. కష్టపడి పనిచేసే, దీనమైన, సాత్వికమైన వ్యక్తుల గురించి బైబిలు యిష్టపూర్వకంగా మాట్లాడుతుంది. (సామెతలు 11:2; 29:23; హెబ్రీయులు 6:1-12) యితరుల విలువను సాదరంగా గుర్తించడం నేర్చుకోండి. మీరు యితరులతో పనిచేస్తున్నప్పుడు వారి భావాలను పరిగణలోకి తీసుకోండి. అపొస్తలుడైన పేతురు యిలా సలహా యిచ్చాడు: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గల వారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” (1 పేతురు 3:8) ఒక ప్రాథమిక మానవ అవసరతను తీర్చడం ద్వారా యితరులకు గుర్తింపు నివ్వవలసిన అవసరతను యిది తెలియజేస్తుంది.