‘అన్యాయపు సిరివలన స్నేహితులను సంపాదించుకోండి’
“అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; . . . మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును.”—లూకా 16:9, 10.
1. మోషే మరియు ఇశ్రాయేలీయుల కుమారులు, తాము ఐగుప్తునుండి తప్పించుకున్న తర్వాత యెహోవాను ఎలా స్తుతించారు?
ఒక అద్భుతం ద్వారా రక్షించబడడం—విశ్వాసాన్ని బలపర్చే ఎంత చక్కటి అనుభవం! ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి నిర్గమించినందుకు సర్వాధికారియైన యెహోవాకు తప్ప మరెవరికీ ఆపాదించలేము. మోషే మరియు ఇశ్రాయేలీయులు యిలా పాడడంలో ఆశ్చర్యం లేదు: “యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను.”—నిర్గమకాండము 15:1, 2; ద్వితీయోపదేశకాండము 29:2.
2. వారు ఐగుప్తును విడిచిపెట్టినప్పుడు యెహోవా ప్రజలు తమ వెంట ఏమి తెచ్చుకున్నారు?
2 ఇశ్రాయేలీయులు యిప్పుడే పొందిన స్వాతంత్ర్యం ఐగుప్తులో వారి పరిస్థితికి ఎంత భిన్నంగా ఉంది! వారిప్పుడు యెహోవాను ఏ అవాంతరాలూ లేకుండా ఆరాధించగలరు. మరి వారు ఐగుప్తును విడిచి వచ్చేటప్పుడు రిక్తహస్తాలతో రాలేదు. మోషే యిలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులు . . . వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.” (నిర్గమకాండము 12:35, 36) అయితే ఐగుప్తుకు చెందిన ఈ ధనాన్ని వారు ఎలా ఉపయోగించారు? ఆ ఉపయోగం ‘యెహోవా మహిమను స్తుతించడంలో’ ఫలించిందా? వారి మాదిరి నుండి మనం ఏమి నేర్చుకుంటాము?—1 కొరింథీయులు 10:11 పోల్చండి.
“యెహోవాకు అర్పణము”
3. ఇశ్రాయేలీయులు అబద్ధ ఆరాధనలో బంగారాన్ని ఉపయోగించడం యెహోవా ఎలా ప్రతిస్పందించేలా చేసింది?
3 దేవుని బోధలను స్వీకరించేందుకుగాను సీనాయి పర్వతంపై మోషే నలభై రోజులున్న సమయంలో, కింద వేచివున్న ప్రజల అసహనం పెరిగిపోయింది. తమ బంగారు పోగులను తీసివేసి, తాము ఆరాధించుకునేందుకుగాను ఒక విగ్రహాన్ని తయారు చేసేలా వారు అహరోనును నడిపించారు. అహరోను వారికో బలిపీఠాన్ని కూడా కట్టించి యిచ్చాడు, మరుసటి రోజు తెల్లవారుజామునే, వారు తమ అర్పణలను అక్కడ అర్పించారు. తమ బంగారాన్ని ఈ విధంగా ఉపయోగించడం వలన వారు తమను విడిపించిన వ్యక్తికి ప్రీతిపాత్రులయ్యారా? ఎన్నటికీ కాలేదు! ‘నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసెదను’ అని యెహోవా మోషేకు ప్రకటించాడు. ఎదురుతిరిగిన నాయకులు దేవుని నుండి వచ్చిన తెగులుకు గురైనప్పటికీ, కేవలం మోషే వేడుకోవడం వల్లనే యెహోవా ఆ జనాంగాన్ని విడిచిపెట్టాడు.—నిర్గమకాండము 32:1-6, 10-14, 30-35.
4. “యెహోవాకు అర్పణము” అంటే ఏమిటి, దాన్ని ఎవరు అర్పించారు?
4 తర్వాత, యెహోవాను ప్రీతి పర్చిన విధానంలో తమ వద్ద ఉన్న ధనాన్ని ఉపయోగించే అవకాశాన్ని వారు పొందారు. వారు ‘యెహోవాకు అర్పణమును’ పోగుచేశారు.a బంగారము, వెండి, ఇత్తడి, నీలి సన్ననార, వివిధ రంగుల వస్తువులు, పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ వంటివి, గుడారాన్ని నిర్మించేందుకు, గుడారాన్ని సిద్ధపర్చేందుకు యిచ్చిన విరాళాలలో ఉన్నాయి. ఈ వృత్తాంతము విరాళాలిచ్చిన వ్యక్తి వైపుకు మన అవధానాన్ని మరలుస్తుంది. “బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము . . . తీసుకుని రావలెను.” (నిర్గమకాండము 35:5-9) ఇశ్రాయేలు కలకలంతో ప్రతిస్పందించింది. ఆ విధంగా, ఒక వేదాంతి మాటల్లో సూచించాలంటే ఆ గుడారం “అందమైన మరియు మహనీయమైన వైభవోపేత” నిర్మాణము.
ఆలయం కొరకు చందా
5, 6. ఆలయానికి సంబంధించి, తన ధనాన్ని దావీదు ఎలా ఉపయోగించాడు, మరి యితరులు దానికి ఎలా ప్రతిస్పందించారు?
5 యెహోవా ఆరాధనకొరకు ఒక శాశ్వత కట్టడాన్ని నిర్మించేందుకు ఇశ్రాయేలు రాజైన సొలొమోను నాయకత్వం వహించినప్పటికీ ఆయన తండ్రియైన దావీదు దాని కొరకు అవసరమైన విస్తృతమైన ఏర్పాట్లు చేసి ఉంచాడు. దావీదు పెద్ద మొత్తంలో బంగారం, వెండి, ఇత్తడి, యినుము, పలక, మరియు అమూల్యమైన రాళ్లను సేకరించాడు. “నా దేవుని మందిరముమీద నాకు కలిగియున్న మక్కువచేత . . . నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుమూతకు . . . ఆరువేల మణుగుల బంగారమును పదునాలుగు వేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను” అని దావీదు తన ప్రజలతో చెప్పాడు. ఇతరులు కూడా దాతృత్వంగా ఉండాలని దావీదు ప్రోత్సహించాడు. వారి ప్రతిస్పందన అపరిమితంగా ఉంది: అధిక బంగారము, వెండి, యిత్తడి, ఇనుము, అమూల్యమైన రాళ్లనూ తెచ్చారు. ప్రజలు “మనఃపూర్వకముగా,” “పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి.”—1 దినవృత్తాంతములు 22:5; 29:1-9.
6 పూర్ణమనస్సుతో యిచ్చిన ఈ చందాల ద్వారా, ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధనకు లోతైన మెప్పుదలను కనపర్చారు. దావీదు వినయంగా యిలా ప్రార్థించాడు: “ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడను? నా జనులెంత మాత్రపువారు?” ఎందుకు? “సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. . . . నేనైతే యథార్థహృదయము గలవాడనై యివి యన్నియు మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను.”—1 దినవృత్తాంతములు 29:14, 17.
7. ఆమోసు దినమునుండి ఏ హెచ్చరికా పాఠాన్ని మనం నేర్చుకుంటాము?
7 అయితే, ఇశ్రాయేలు గోత్రీకులు యెహోవా ఆరాధనకు తమ మనస్సు, హృదయాల్లో ఉన్నత స్థానమివ్వడంలో విఫలులయ్యారు. సా.శ.పూ సుమారు తొమ్మిదవ శతాబ్దంలో విభాగించబడిన ఇశ్రాయేలు ఆత్మీయతను ఉపేక్షించినందుకు అపరాధి అయ్యింది. ఉత్తర దిక్కునున్న పది తెగల ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి, ఆమోసు ద్వారా యెహోవా యిలా ప్రకటించాడు: “సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ” వారు ‘దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయు[చు] . . . పాత్రలలో ద్రాక్షారసముపోసి పానము చేయుచున్న’ వ్యక్తులని ఆయన వర్ణించాడు. అయితే వారి ఐశ్వర్యం వారికి ఎలాంటి భద్రతనూ యివ్వలేదు. దేవుడు యిలా హెచ్చరించాడు: “చెరలోనికి ముందుగా పోవు వారితో కూడ వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును.” సా.శ.పూ. 740లో అస్సిరియా చేతుల్లో ఇశ్రాయేలు బాధను అనుభవించింది. (ఆమోసు 6:1, 4, 6, 7) కొంతకాలానికి దక్షిణ యూదా రాజ్యం కూడా వస్తుదాయకమైన ఆసక్తికి గురైంది.—యిర్మీయా 5:26-29.
క్రైస్తవుల కాలాల్లో వనరులను సక్రమంగా ఉపయోగించడం
8. వనరులను ఉపయోగించే విధంలో యోసేపు మరియలు ఏ మంచి మాదిరిని కనపర్చారు?
8 దానికి భిన్నంగా, తర్వాతి కాలాల్లో సాపేక్షంగా బీదరికంలో ఉన్న దేవుని సేవకుల పేద స్థితి, వారు నిజమైన ఆరాధనకు ఆసక్తి కనపర్చకుండా వారిని నివారించలేదు. మరియ యోసేపులను పరిశీలించండి. కైసరు ఔగుస్తు ఉత్తరవును పాటిస్తున్నవారై వారు తమ కుటుంబ స్వగ్రామమైన బేత్లెహేముకు ప్రయాణించారు. (లూకా 2:4, 5) అక్కడ యేసు జన్మించాడు. నలభైరోజుల తర్వాత, రక్తశుద్ధి కొరకు అర్పించాల్సిన అర్పణను అర్పించేందుకు యెరూషలేము సమీపంలో ఉన్న ఆలయానికి యోసేపు మరియలు వెళ్లారు. తమ పేద స్థితిని సూచిస్తూ మరియ రెండు చిన్న పక్షులను అర్పించింది. ఆమె గానీ యోసేపు గానీ తమ పేదరికాన్ని ఒక సాకుగా తీసుకోలేదు. బదులుగా, వారు వినయంతో తమకున్న కొద్దిపాటి వనరులను ఉపయోగించారు.—లేవీయకాండము 12:8; లూకా 2:22-24.
9-11. (ఎ) మత్తయి 22:21 నందున్న యేసు మాటలు, మనం మన డబ్బును ఉపయోగించే విషయంలో మనకు ఎలాంటి నడిపింపును యిస్తాయి? (బి) విధవరాలు యిచ్చిన స్పల్ప చందా ఎందుకు వ్యర్థంగా అర్పించబడలేదు?
9 తర్వాత, పరిసయ్యులూ హేరోదు అనుచరులూ యిలా అంటూ యేసును మోసం చేసేందుకు ప్రయత్నించారు: “నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? కాదా?” యేసు జవాబు ఆయన వివేకాన్ని బయల్పర్చింది. వారు ఆయనకిచ్చిన రూకను సూచిస్తూ యేసు యిలా ప్రశ్నించాడు: ‘ఈ రూపమును పైవ్రాతయు ఎవరివి.’ వారిలా జవాబిచ్చారు: ‘కైసరువి.’ అప్పుడు ఆయన వివేకయుక్తంగా యిలా చెబుతూ ముగించాడు: “కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.” (మత్తయి 22:17-21) రూకలను యిచ్చే అధికారం పన్నులను చెల్లించాలని అపేక్షిస్తుందని యేసుకు తెలుసు. అయితే, అక్కడ తన శిష్యులూ అలాగే తన శత్రువులూ, నిజమైన క్రైస్తవత్వం “దేవునివి దేవునికి చెల్లి”చేందుకు ప్రయత్నిస్తుందని గ్రహించేందుకు ఆయన సహాయపడ్డాడు. దీనిలో ఒకరి వస్తుదాయకమైన వాటిని సరైన విధంగా ఉపయోగించడం కూడా యిమిడివుంది.
10 యేసు ఆలయంలో వీక్షించిన ఓ సంఘటన దీన్ని దృష్టాంతపరుస్తుంది. ‘విధవరాండ్ర ఇళ్లను దిగమ్రింగుతారని’ పేరాశాపరులైన శాస్త్రులను అప్పుడే నిందించాడు. లూకా యిలా నివేదించాడు: “కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన [యేసు] పారజూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి—ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను.” (లూకా 20:46, 47; 21:1-4) ఆలయం విలువగల రాళ్లతో అలంకరింపబడి ఉందని కొందరు ప్రజలు చెప్పారు. యేసు దానికి యిలా జవాబిచ్చాడు: ‘ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతిమీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి.’ (లూకా 21:5, 6) ఆ విధవరాలి స్వల్ప విరాళము వ్యర్థమైపోయిందా? నిస్సదేహంగా కాదు. ఆ సమయంలో యెహోవా కల్గివున్న ఏర్పాటుకు ఆమె తన మద్దతునిచ్చింది.
11 యేసు తన నిజమైన అనుచరులతో యిలా చెప్పాడు: “ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పెను.” (లూకా 16:13) ఆ విధంగా, మన ఆర్థిక వనరులను ఉపయోగించడంలో మనం సరైన సమతుల్యాన్ని ఎలా చూపించగలము?
నమ్మకమైన గృహనిర్వాహకులు
12-14. (ఎ) క్రైస్తవులు ఏ వనరుల విషయంలో గృహనిర్వాహకులుగా ఉన్నారు? (బి) ఏ విశిష్ఠమైన విధానంలో యెహోవా ప్రజలు నేడు నమ్మకంగా తమ గృహనిర్వాహకత్వాన్ని చేస్తున్నారు? (సి) దేవుని పనికైన సహాయం నేడు ఎక్కడ నుండి వస్తుంది?
12 మనం మన జీవితాన్ని యెహోవాకు అర్పించినప్పుడు, తద్వారా మన దగ్గరున్నవన్నీ, మన వనరులన్నీ ఆయనకే చెందుతాయని మనం చెబుతాము. మరి మన వద్ద ఉన్నవాటిని మనం ఎలా ఉపయోగించాలి? సంఘంలో క్రైస్తవ సేవను చర్చించేటప్పుడు, వాచ్‌టవర్ సొసైటి మొదటి అధ్యక్షుడైన సహోదరుడైన సి. టి. రస్సల్ యిలా రాశారు: “ప్రతి ఒక్కరూ తనను ప్రభువు నియమించాడనీ, అతను తన స్వంత సమయం, ప్రభావం, డబ్బు వగైరాల గృహనిర్వాహకుడని తనను తాను ఎంచుకుని, అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ యజమాని మహిమ కొరకు ఈ నైపుణ్యాలను తన సామర్థ్యానికి తగినట్లు ఉపయోగించాలి.”—ది న్యూ క్రియేషన్ అనే పుస్తకంలో 345వ పేజీ.
13 “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట ఆవశ్యము,” అని 1 కొరింథీయులు 4:2 పేర్కొంటోంది. అంతర్జాతీయ సంస్థగా యెహోవాసాక్షులు, తమ బోధనా సామర్థ్యాలను పెంపొందించుకుంటూ క్రైస్తవ పరిచర్యలో తమ సమయాన్ని వీలున్నంతమట్టుకు ఉపయోగిస్తూ ఆ వర్ణనకు తగినట్లుగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా, ప్రాంతీయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యం క్రింద ఉన్న స్వచ్ఛంద సేవకుల జట్లు తమ సమయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఆరాధన కొరకు కూడుకునే చక్కని మందిరాలను నిర్మించేందుకు యిష్టపూర్వకంగా యిస్తున్నాయి. వీటన్నింటిని బట్టి యెహోవా ఎంతో ఆనందిస్తున్నాడు.
14 ఈ విస్తృతమైన బోధనా పనికి, అలాగే నిర్మాణ పనికి తోడ్పడేందుకు డబ్బు ఎక్కడనుండి వస్తుంది? గుడార నిర్మాణ దినాలలో జరిగినట్లుగా, మనఃపూర్వకంగా యిచ్చే వారినుండి వస్తుంది. వ్యక్తిగతంగా, మనం అందులో భాగం వహిస్తున్నామా? మన ఆర్థిక వనరులను ఉపయోగించే విధానం మనం యెహోవా సేవకు అతి ప్రాముఖ్యమైన స్థానాన్నిస్తున్నామని ప్రదర్శిస్తుందా? డబ్బు విషయాల్లో, మనం నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఉందాము.
ఉదారంగా ఉండే విషయంలో ఒక మాదిరి
15, 16. (ఎ) పౌలు దినాల్లోని క్రైస్తవులు ఉదార స్వభావాన్ని ఎలా కనపర్చారు? (బి) మన ప్రస్తుత చర్చను మనం ఎలా దృష్టించాలి?
15 మాసిదోనియ, అక్కయలోనున్న క్రైస్తవుల ఉదార స్వభావాన్ని గూర్చి అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమీయులు 15:26) వారు శ్రమలలో ఉన్నప్పటికీ, వారు తమ సహోదరులకు సహాయపడేందుకు వెంటనే విరాళాలను యిచ్చారు. అలాగే యితరుల లేమిని భర్తీ చేసేందుకు తమకున్న అధిక మొత్తం నుండి ఉదారంగా విరాళమివ్వమని కొరింథు క్రైస్తవులను పౌలు ప్రోత్సహించాడు. ఈ ఉద్బోధ విషయంలో పౌలును ఎవ్వరూ నిందించలేరు. ఆయన యిలా రాశాడు: “కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును . . . సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”—2 కొరింథీయులు 8:1-3, 14, 15; 9:5-7, 13.
16 నేడు మన సహోదరులు మరియు ఆసక్తి గలవారు ప్రపంచవ్యాప్తమైన రాజ్య ప్రచార పని కొరకు అందించే ధారాళమైన చందాలు, వారు ఈ ఆధిక్యతను ఎంత గొప్పగా ఎంచుతున్నారు అనేందుకు రుజువునిస్తున్నాయి. అయితే, పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేసినట్లుగా, ఈ చర్చను ఒక జ్ఞాపికగా పరిశీలించేందుకు మనం కృషి చేయడం మంచిది.
17. ఏ విధమైన విరాళాన్నివ్వడాన్ని పౌలు ప్రోత్సహించాడు, మరి దాన్ని నేడు అన్వయించగలమా?
17 చందాలను యిచ్చే విషయంలో ఒక పద్ధతిని అవలంబించమని పౌలు సహోదరులకు ఉద్బోధించాడు. “ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్థిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను” అని ఆయన చెప్పాడు. (1 కొరింథీయులు 16:1, 2) సంఘం ద్వారా, గానీ లేక సమీపంలో ఉన్న వాచ్‌టవర్ సొసైటీ బ్రాంచి కార్యాలయానికి గానీ మనం నేరుగా పంపుతున్నప్పటికీ, అలా విరాళాలివ్వడంలో అది మనకూ మన పిల్లలకూ ఒక మాదిరిగా ఉండగలదు. తూర్పు ఆఫ్రికా పట్టణంలో నియమితులైన ఒక మిషనరీ దంపతులు ఆసక్తి గలవారిని తమతో బైబిలు పఠనంలో పాల్గొనేందుకు ఆహ్వానించారు. ఈ మొదటి కూటం చివరిలో ఆ మిషనరీలు వివేకయుక్తంగా కొన్ని నాణాలను “రాజ్య పనికొరకైన విరాళాలు” అని రాసివున్న పెట్టెలో వేశారు. హాజరైన యితరులు కూడా అదే చేశారు. తర్వాత, అంటే ఈ కొత్తవారు క్రైస్తవ సంఘంలోకి సంఘటితమైన తర్వాత ప్రాంతీయకాపరి సందర్శించి, తమ విరాళాల క్రమబద్ధత విషయంలో వారిని మెచ్చుకున్నారు.—కీర్తన 50:10, 14, 23.
18. బాధలో ఉన్న మన సహోదరులకు మనం ఎలా సహాయపడగలము?
18 ప్రకృతి వైపరీత్యాలు యుద్ధ ప్రాంతాల్లో జీవిస్తున్న బాధితులకు సహాయపడేందుకు మనం మన వనరులను ఉపయోగించే ఆధిక్యత కూడా మనకు ఉంది. తూర్పు ఐరోపాను రాజకీయ అస్థిరత ముంచెత్తినప్పుడు, ప్రపంచంలోని ఆ భాగానికి సహాయక సామాగ్రిని పంపించారని మనం చదివినప్పుడు మనమెంతగా పులకించామో! విరాళాలుగా యిచ్చిన సరుకులూ అలాగే డబ్బు, బాధలోనున్న క్రైస్తవుల యెడల మన సహోదరుల ఉదార స్వభావాన్ని, సంఘీభావాన్ని ప్రదర్శించాయి.b—2 కొరింథీయులు 8:13, 14, 15.
19. పూర్తికాల సేవలో ఉన్న వారికి సహాయార్థమై మనం ఏ ఆచరణాత్మకమైన పనులను చేయగలము?
19 పూర్తికాల సేవలో పనిచేస్తున్న పయినీరు కాపరులనూ, ప్రాంతీయ కాపరులనూ, మిషనరీలనూ, బేతేలు స్వచ్ఛంద సేవకులనూ మనం ఎంతో ఉన్నతంగా పరిగణిస్తాము, పరిగణించమా? మన పరిస్థితులు అనుమతించినంతమేరకు, కొంత వస్తుదాయకమైన సహాయాన్ని మనం నేరుగా అందించగలము. ఉదాహరణకు, ప్రాంతీయ కాపరులు మీ సంఘాన్ని సందర్శించినప్పుడు, వారికి ఆతిథ్యాలనూ భోజనాన్ని, లేక వారి ప్రయాణ ఖర్చుల విషయంలో బహుశ మీరు కొంత సహాయపడగలరు. అలా మనం కనపర్చిన ఉదారతను, తన సేవకుల యెడల శ్రద్ధ వహించాలని కోరుకుంటున్న మన పరలోక తండ్రి తప్పక గమనిస్తాడు. (కీర్తన 37:25) కొన్ని సంవత్సరాల క్రితం, కేవలం స్వల్ప అల్పాహారాన్ని మాత్రమే అందించగల ఒక సహోదరుడు, ప్రాంతీయ కాపరిని ఆయన భార్యనూ తన యింటికి ఆహ్వానించాడు. ఆ దంపతులు సాయంకాలం ప్రాంతీయసేవకు వెళ్లినప్పుడు, ఆ సహోదరుడు తన అతిథులకు ఒక కవరును యిచ్చాడు. అందులో ఓ నోటు ఉంది (ఒక అమెరికా డాలరుకు సమానమైనది), దానితో పాటు చేతితో రాసిన ఒక చీటీ కూడా ఉంది: “ఒక కప్పు టీ కొరకు లేక నాలుగున్నర లీటర్ల పెట్రోలు కొరకు.” ఈ అణుకువతో కూడిన సంస్కారమందు ఎంతటి మెప్పుదల వ్యక్తమవుతుందో!
20. ఏ ఆధిక్యతనూ బాధ్యతనూ మనం అలక్ష్యం చేయాలని కోరుకోము?
20 ఆత్మీయంగా, యెహోవా ప్రజలు ఆశీర్వదించబడ్డారు! మన కొత్త ప్రచురణలూ, చక్కని బోధ, ఆచరణాత్మకమైన సలహాలు లభించే సభలూ, సమావేశాల్లో ఆత్మీయ విందును మనం భుజిస్తాం. మన ఆత్మీయ ఆశీర్వాదానికై మన హృదయాలు మెప్పుదలతో నిండినవై మనం ప్రపంచ వ్యాప్తంగా దేవుని రాజ్యాసక్తులను విస్తృతపర్చేలా ఉపయోగించేందుకుగాను విరాళాలిచ్చే మన ఆధిక్యతలనూ మన బాధ్యతలనూ మనం మర్చిపోము.
‘అన్యాయపు సిరివలన స్నేహితులను సంపాదించుకోండి’
21, 22. “అన్యాయపు సిరి”కి త్వరలోనే సంభవించబోయే దాన్ని బట్టి, ప్రస్తుతం మనం ఏమి చేయాలని కోరుతుంది?
21 నిజమే, మన జీవితాల్లో యెహోవా ఆరాధన మొదట వస్తుందన్న విషయాన్ని మనం అనేక మార్గాల్లో కనపర్చగలము, అన్నింటికంటే ప్రాముఖ్యంగా యేసు యిచ్చిన సలహాను గైకొనడం ద్వారా మనం దాన్ని కనపర్చగలము: ‘అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురు.’—లూకా 16:9.
22 అన్యాయపు సిరి వైఫల్యాన్ని గూర్చి యేసు మాట్లాడాడని గమనించండి. అవును, ఈ విధానపు డబ్బు విలువలేనిదయ్యే ఒక కాలం వస్తుంది. “తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించ జాలదు” అని యెహెజ్కేలు ప్రవచించాడు. (యెహెజ్కేలు 7:19) ఇది జరిగేంతవరకూ మనం మన వస్తుదాయకమైన సంపాద్యాన్ని జ్ఞానంతోనూ వివేకంతోనూ ఉపయోగించాలి. ఆ విధంగా యేసు యిచ్చిన హెచ్చరికను లక్ష్యపెట్టడంలో విఫలులైనందుకు మనం అనుతాపం చెందము: ‘మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? . . . మీరు దేవునిని సిరిని సేవింపలేరు.’—లూకా 16:11-13.
23. మనం దేన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించాలి, మరి మనకు లభించే ఫలమేమిటి?
23 కనుక, మనమందరమూ యెహోవా ఆరాధనను మన జీవితాల్లో మొదట ఉంచేందుకు అలాగే మన వనరులన్నింటినీ చక్కగా ఉపయోగించుకునేందుకు ఈ జ్ఞాపికలను మనం నమ్మకంగా గైకొందాము. ఆ విధంగా, డబ్బు విఫలమైనప్పుడు, అటు పరలోక రాజ్యములోగానీ లేక పరదైసు భూమిపైగానీ నిత్య జీవిత ఉత్తరాపేక్షను యిస్తామని వాగ్దానం చేసిన ‘నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొనే’ యెహోవాతో యేసుతో మనం మన స్నేహబంధాన్ని నిలుపుకుందాము.
[అధస్సూచీలు]
a “చందా” అనే హెబ్రీపదానికి ఉపయోగించిన పదం, “ఉన్నతమైనది; ఘనమైనది; పైకెత్తబడినది” అనే అక్షరార్థ భావాన్ని ఆ క్రియాపదం కల్గివుంది.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటి అఫ్ న్యూయార్క్ ఇన్కార్పరేటెడ్ వారు ప్రచురించిన యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలో 307-15 పేజీలను చూడండి.
మీకు జ్ఞాపకమున్నాయా?
◻ గుడార నిర్మాణానికి తోడ్పడేందుకు యెహోవా యిచ్చిన ఆహ్వానానికి ఇశ్రాయేలు ఎలా ప్రతిస్పందించింది?
◻ విధవరాలి విరాళము ఎందుకు వ్యర్థము కాదు?
◻ తమ వనరులను ఉపయోగించే బాధ్యతలో క్రైస్తవులు ఏ మాదిరిని కనపరుస్తారు?
◻ డబ్బును మనం ఉపయోగించే విషయాన్ని గూర్చిన అనుతాపాన్ని ఎలా నివారించగలము?
[15వ పేజీలోని చిత్రం]
విధవరాలి చందా స్వల్పమైనప్పటికీ వ్యర్థంకాలేదు
[16, 17వ పేజీలోని చిత్రాలు]
మన చందాలు ప్రపంచవ్యాప్త రాజ్య పనికి తోడ్పడతాయి