వారు యెహోవా చిత్తాన్ని చేశారు
స్వచ్ఛారాధనను పెంపొందింపజేయడానికి స్వచ్ఛంద విరాళం
యెహోవా రక్షణ శక్తికి ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష సాక్షులు. తాము ఐగుప్తు సైన్యం నుండి తప్పించుకునేందుకు ఆరిన నేల మీద నడిచిపోగలిగేలా ఎఱ్ఱసముద్రం నీళ్లు అద్భుతరీతిగా విడిపోవటాన్ని వాళ్లు చూశారు. మరో వైపున, అవే నీళ్లు తమను వెంటాడుతున్న వారిని ముంచేస్తూ తిరిగి ప్రవహించడాన్ని వాళ్లు సురక్షితమైనంత దూరం నుండి గమనించారు. యెహోవా వాళ్ల ప్రాణాలను రక్షించాడు!—నిర్గమకాండము 14:21-31.
అయితే, విచారకరంగా, కొంతమంది ఇశ్రాయేలీయులు తమ దేవుడు తమ కోసం చేసిన దాన్ని స్వల్పవిషయంగా పరిగణించారు. మోషే సీనాయి పర్వతం పైనున్నప్పుడు, వాళ్లు తమ బంగారు నగలను అహరోనుకు ఇచ్చి, తాము ఆరాధించడానికి ఒక విగ్రహాన్ని చేయమని కోరారు. మోషే తిరిగి వచ్చేసరికి, ఈ తిరుగుబాటుదారులు తింటూ, త్రాగుతూ, ఆటలాడుతూ, బంగారు దూడకు మోకరిల్లుతూ కనిపించారు! యెహోవా నడిపింపుతో, దాదాపు 3,000 మంది అంటే బహుశా తిరుగుబాటు రేకెత్తించిన ప్రముఖులు చంపివేయబడ్డారు. ఆ రోజు, యెహోవాకు అనితర భక్తిని చెల్లించవలసిన ఆవశ్యకతను గురించి దేవుని ప్రజలు ఒక ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు.—నిర్గమకాండము 32:1-6, 19-29.
ఈ సంఘటన జరిగిన వెంటనే, గుడారమును అంటే ఆరాధన కోసమై, ఎక్కడికైనా తీసుకువెళ్లగల ఒక గుడారాన్ని కట్టమని దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి మోషే సిద్ధమయ్యాడు. ఈ నిర్మాణ కార్యక్రమానికి మిక్కిలి విలువైన వస్తుసామాగ్రి, నిపుణులైన పనివారు అవసరం. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఈ బైబిలు వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
వస్తు సంపదలూ, నైపుణ్యాల తోడ్పాటు
మోషే ద్వారా, యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము . . . తీసికొని రావలెను.” ఏ విధమైన విరాళం? మోషే పట్టిక వేసినవాటిలో బంగారం, వెండి, రాగి, సన్ననార, నూలు, చర్మం, కర్ర, విలువైన రాళ్లు ఉన్నాయి.—నిర్గమకాండము 35:5-9.
అలా ఉదారంగా విరాళం ఇవ్వడానికి ఇశ్రాయేలీయుల వద్ద అవసరమైనదాని కన్నా ఎక్కువే ఉంది. వాళ్లు ఐగుప్తును విడిచి వస్తున్నప్పుడు, వాళ్లు ఎన్నో వస్త్రాలతోపాటు వెండి బంగారు వస్తువులను తెచ్చుకున్నారన్న విషయం గుర్తు తెచ్చుకోండి. నిజానికి, “వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.”a (నిర్గమకాండము 12:35, 36) మునుపు, ఇశ్రాయేలీయులు అబద్ధ ఆరాధన కోసం విగ్రహాన్ని చేసుకునేందుకు తమ ఆభరణాలను ఇష్టపూర్వకంగా ఒలిచి ఇచ్చారు. మరిప్పుడు సత్యారాధనను పెంపొందింపజేయడానికి వాళ్లు అదే ఉత్సుకతను చూపిస్తారా?
అయితే, ఒక్కొక్కరు ఇంత ఇవ్వాలని మోషే షరతు పెట్టలేదనీ, లేక వాళ్లు ఇచ్చేందుకుగానూ అతడు వారికి అపరాధ భావం కలిగించలేదనీ లేక సిగ్గు కలిగేలా చేయలేదనీ గమనించండి. బదులుగా ఆయన కేవలం “బుద్ధిపుట్టిన ప్రతివాడు” ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. దేవుని ప్రజలను బలవంతం చేయవలసిన అవసరం లేదని మోషే భావించాడని స్పష్టమౌతుంది. ప్రతి ఒక్కరూ తాము ఇవ్వగలిగినది ఇస్తారన్న నమ్మకం ఆయనకుంది.—పోల్చండి 2 కొరింథీయులు 8:10-12.
అయితే, నిర్మాణపనికి వస్తువులను విరాళంగా ఇవ్వడం మాత్రమే సరిపోదు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా కూడా చెప్పాడు: “వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.” అవును, ఈ నిర్మాణపనికి నిపుణులైన పనివారు అవసరం. నిజానికి, ఈ నిర్మాణపనిని ముగించడానికి చెక్కపని, లోహపు పని, కంసాలిపనితో సహా “విచిత్రమైన పనులన్నిటిని” చేయవలసి ఉంటుంది. పనివారి నైపుణ్యాలకు యెహోవా నడిపింపునిస్తాడు గనుక, ఆ నిర్మాణ కార్యక్రమ విజయానికి ఘనత ఆయనకు చెందవలసినదే.—నిర్గమకాండము 35:10, 30-35; 36:1, 2.
తమ వస్తు సంపదలనూ, తమ నైపుణ్యాలనూ ఇవ్వమని వచ్చిన ఆహ్వానానికి ఇశ్రాయేలీయులు ఉత్సాహంగా ప్రతిస్పందించారు. బైబిలు వృత్తాంతం ఇలా తెలియజేస్తుంది: “ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు . . . సమస్తవిధమైన బంగారు వస్తువులను తెచ్చిరి.”—నిర్గమకాండము 35:21, 22.
మనకోసం పాఠం
నేడు దేవుని రాజ్య సువార్త ప్రకటించడమనే బృహత్ కార్యం స్వచ్ఛంద విరాళాల సహాయంతోనే నెరవేర్చబడుతోంది. ఇలాంటి విరాళాలు తరచూ ధనరూపేణా ఇవ్వబడతాయి. ఇతర సందర్భాల్లో, క్రైస్తవ సహోదర సహోదరీలు రాజ్యమందిరాలను, సమావేశ స్థలాలను, బ్రాంచి సౌకర్యాలను నిర్మించడంలో తమకున్న అనుభవ సంపత్తిని ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగావున్న వందకన్నా ఎక్కువ బేతేలు గృహాల్లో జరిగే పనికి కూడా వివిధ రకాలైన నైపుణ్యాలు అవసరమౌతాయి. అలాంటి అర్పణలు అర్పించిన ఇష్టహృదయులందరూ, యెహోవా తమ శ్రమను మరిచిపోడని నిశ్చయత కల్గివుండవచ్చు!—హెబ్రీయులు 6:10.
క్రైస్తవ పరిచర్యలో మనం ఒకొక్కరం వహించే భాగానికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రకటించడంలో అందరూ ఆసక్తితో భాగం వహించడానికి సమయాన్ని సంపాదించుకోవాలని ఉద్బోధించబడుతున్నారు. (మత్తయి 24:14; ఎఫెసీయులు 5:15-17) కొంతమంది పూర్తికాల సువార్తికులుగా అంటే పయినీర్లుగా ఈ పనిని చేస్తున్నారు. పరిస్థితులను బట్టి ఇతరులు, పయినీర్లు పరిచర్యలో గడిపినంత సమయాన్ని గడపలేకపోతున్నారు. అయినప్పటికీ, వాళ్లు కూడా యెహోవాకు ప్రీతిపాత్రమైనవారే. గుడారానికి ఇవ్వబడిన విరాళాల విషయంలోలాగే, యెహోవా ప్రతి వ్యక్తి ఇంత ఇవ్వాలని నిర్దేశించడు. అయితే ఆయన కోరేది, ప్రతి ఒక్కరూ తమ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో, పూర్ణ శక్తితో తనను సేవించాలన్నదే. (మార్కు 12:30) మనమలా చేస్తున్నట్లయితే, స్వచ్ఛారాధనను పెంపొందింపజేయడానికి మనమిచ్చే స్వచ్ఛంద విరాళాలకు తగిన ప్రతిఫలాన్ని ఆయన తప్పక ఇస్తాడని మనం నిశ్చయత కలిగివుండవచ్చు.—హెబ్రీయులు 11:6.
[అధస్సూచీలు]
a ఇదేమీ దొంగతనం కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను విరాళాల కోసం అడిగారు, వాళ్లు స్వేచ్ఛగా ఇచ్చారు. అసలు ఇశ్రాయేలీయులను బానిసలుగా ఉంచుకునే హక్కే ఐగుప్తీయులకు లేదు గనుక, దేవుని ప్రజలు సంవత్సరాల తరబడి చేసిన కష్టానికి వాళ్లే వీళ్లకు ఋణపడి ఉన్నారు.